జ్ఞాపకాన్ని కవిత్వంగా మార్చే రసవిద్య

రాసిన వారు: నెల్లుట్ల వేణుగోపాల్
(ఈ నెలలో అఫ్సర్ గారి నాలుగో కవితా సంకలనం ‘ఊరిచివర’ వెలువడబోతోంది. ఈ పుస్తకానికి ముందుమాటగా వేణుగోపాల్ గారు రాసిన వ్యాసం ఇది. ఈ వ్యాసాన్ని పుస్తకం.నెట్ లో ప్రచురించేందుకు అనుమతించిన అఫ్సర్ గారికి, వేణుగోపాల్ గారికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్)
***************************************************************************
రెండున్నర దశాబ్దాల మిత్రుడు, ఆత్మీయుడు అఫ్సర్ తన కొత్త కవితా సంపుటానికి నాలుగు మాటలు రాయమని అడగడం నాకు అరుదయిన గౌరవమే. అలా అడిగి కొన్ని వారాలు గడిచాయి. నాకు పుస్తకం అందిన నాటినుంచీ చదువుతూ నెమరు వేసుకుంటూ చదువుతూ పొరలుపొరలుగా విచ్చుకుంటున్న అర్థాలను మననం చేసుకుంటూ ఆ అద్భుతానికి ఆశ్చర్యపోతూ ఉన్నాను. ఒక సందర్భంలో ఇంత సంకీర్ణమయిన కవిత్వానికి నేనేమయినా న్యాయం చేయగలనా అని కూడ అనుకున్నాను. ఈలోగా వంతెనలకింద చాల ప్రకృతి కన్నీరు మాత్రమే కాదు, మనుషుల కన్నీరూ నెత్తురూ కూడ ప్రవహించింది. ఈ ‘గడచిన దినాల తలపోత బరువు’ ఎంత విషాద బీభత్సమైనదంటే ఇక నేనీ మాటలు రాయలేనేమో అనీ అనుకున్నాను. అఫ్సర్ పట్టుబట్టాడు. జ్ఞాపకమూ కవిత్వమూ, కన్నీరూ ఉత్సవమూ, అభిమానమూ ద్వేషమూ, గతమూ వర్తమానమూ కలగలసిన ఈ జీవన రసాయనిక ప్రక్రియను అర్థం చేసుకోవడానికి ఇదీ తగిన సందర్భమే అనిపించింది.

ఆంధ్రజ్యోతి సాహిత్యవేదికలో 1983లో అచ్చయిన కవిత ఒకటి చదివి లోలోపలి నుంచి కదిలిపోయి, ఆ తర్వాత బెజవాడ వెళ్లినప్పుడు ఆంధ్రజ్యోతి ఆఫీసుకు వెతుక్కుంటూ వెళ్లి కవి అఫ్సర్ ను కలుసుకున్నాను. ‘అంతిమస్పర్శ’ అనే ఆ కవిత ప్రతిభావంతుడైన హిందీకవి సర్వేశ్వర్ దయాళ్ సక్సేనా మరణవార్త విని, ఆయన చనిపోయేటప్పటికి గుండెలమీద తెరిచిన పుస్తకం ఉన్నదని విని రాసినది.

ఆ నాటినుంచీ అఫ్సర్ నూ, అఫ్సర్ కవిత్వాన్నీ చాల సన్నిహితంగానూ, ప్రేమతోనూ, ఒక్కోసారి నిర్మమకారమైన దూరం నుంచీ చూస్తూ వస్తున్నాను. ఆనాడు బందరు రోడ్డు మీద మూడేళ్లు (మూడేళ్ల ఇరవైఒకటి కాదు, నిజంగా పసితనపు మూడేళ్లే) నిండని కవికుమారుడు అఫ్సర్ ఎలా ఉన్నాడో, ఎలా మాట్లాడాడో, ఎలా కవిత్వం రాశాడో ఇరవై ఆరేళ్ళ తర్వాత ఇవాళ కూడ అలాగే ఉన్నాడు. ఆ పసితనంలోనే, పసితనంతోనే ఉన్నాడు. అభివ్యక్తిలో అసాధారణమైన ప్రజ్ఞనూ పరిణతినీ కనబరుస్తూనే వ్యక్తిత్వంలో అమాయకత్వాన్నీ పసితనాన్నీ కాపాడుకుంటున్నాడు. ఈ ఇరవైఆరేళ్లలో నేను తనతో తీవ్రంగా విభేదించిన సందర్భాలూ ఉన్నాయి గాని చెక్కుచెదరని స్నేహబంధం గత జ్ఞాపకంగా మారిపోలేదు. ఎప్పటికీ వెలిసిపోని పాత వర్ణచిత్రంలా తాజాగానే ఉంది.

తెలుగు కవిత్వంలోకి 1980లలో దూసుకొచ్చిన కొత్తతరం కవులలో భాగమైన అఫ్సర్ కు ఆ తరంతో పోలికా ఉంది, కొన్ని అదనపు లక్షణాలూ ఉన్నాయి. చాలమంది 1980ల కవుల్లో ఉన్న నిర్దిష్టత, కొత్త కవితావస్తువుల కోసం నిరంతర అన్వేషణ, పదచిత్రాల అల్లిక మీద, కొత్త అభివ్యక్తి మీద శ్రద్ధ వంటి లక్షణాలతోపాటు అఫ్సర్ సాధించిన మరొక లక్షణం ఉంది. అది కవిత్వానికి తప్పకుండా ఉండవలసిన పొరలు పొరలుగా విచ్చుకునే లక్షణం. అది ఒనగూరాలంటే కవి బహుముఖ, బహుళార్థ బోధక, సంకీర్ణ ప్రతీకలను ఉపయోగించాలి, దృశ్యాలను రూపొందించాలి. పదచిత్రాలను చిత్రిక పట్టాలి. ఒక కవితను చదివిన ప్రతిసారీ పాఠకులకు కొత్తలోతులు స్ఫురణకు వచ్చేలా చెక్కుతూ ఉండాలి. బహుశా ‘శక్తిమంతమయిన ఉద్వేగాల తక్షణ విస్ఫోటనం’లో అది సాధ్యం కాకపోవచ్చు. ‘ప్రశాంతంగా గుర్తుతెచ్చుకున్న ఉద్వేగం’ అన్నప్పుడే అది సాధ్యం కావచ్చు.

ఆ ఇంగ్లీషు సాహిత్యవిమర్శ ఇచ్చిన కవిత్వ నిర్వచనం మాత్రమే కాదు, మన సమాజపు శ్రమజీవుల వేలసంవత్సరాల ఆచరణ కూడ ఆ చిత్రికను నేర్పుతున్నది. ‘చిత్రిక పట్టని/ ఒకే వొక్క గరుకు పదం కోసం చూస్తున్నా’ అనీ ‘అలంకారాలన్నీ వొలుచుకున్న మాటకోసం చూస్తున్నాను’ అనీ అఫ్సర్ అన్నప్పటికీ చిత్రిక మీద, అలంకారం మీద అఫ్సర్ శ్రద్ధ అపారమైనది. ఒకరకంగా చిత్రిక గురించీ, అలంకారం గురించీ తెలియకుండానే, మాటలు చెప్పకుండానే అద్భుతమైన చిత్రికనూ అలంకారాన్నీ సాధించిన ఈ దేశంలోని సహస్రవృత్తుల శ్రమజీవుల ఆచరణ లాంటిదిది. ఈ చిత్రిక పట్టడంలో వచ్చే కొత్త అర్థాలు బైటి ప్రపంచంలోని మార్పులవల్ల కూడ స్ఫురించవచ్చు గాని వస్తువులోనే, కవితానిర్మాణంలోనే అందుకు అవకాశాలు కల్పించడం అసాధారణమైన నేర్పు. సాధన మీద, శిల్ప నిర్మాణం మీద శ్రద్ధ పెట్టడం వల్ల మాత్రమే సాధ్యమయ్యే ప్రక్రియ అది.

ఏ లోహాన్నయినా బంగారంగా మార్చే రసవిద్య ఉన్నదో లేదో, అసలు బంగారానికి అంత విలువ ఇవ్వడం అవసరమో లేదో అనుమానించవచ్చుగాని, ఏ వస్తువునయినా కవిత్వంగా మార్చగలగడం మాత్రం రసవిద్యే. అందులోనూ జ్ఞాపకాన్ని కవిత్వంగా మార్చడం తప్పనిసరిగా రసవిద్యే. ఆ విద్యలో నిష్ణాతుడినయ్యానని అఫ్సర్ ఈ సంపుటంలో నిరూపించుకుంటున్నాడు.

కవిత్వానికి ఎన్నెన్ని నిర్వచనాలున్నాయో, అవన్నీ ఏదో ఒక సందర్భంలో ఎంత నిజమనిపిస్తాయో, ఎంత నిజం కాదనిపిస్తాయో తెలియదుగాని, ఇక్కడ అఫ్సర్ సంకలించిన మూడుపదుల కవితలను మళ్లీ మళ్లీ చదివినకొద్దీ ఇక్కడ జ్ఞాపకమే కవిత్వమయినట్టు కనబడుతోంది. ప్రతి కవితలోనూ, ప్రతి పదచిత్రంలోనూ, ప్రతి అక్షరంలోనూ అఫ్సర్ ఒక జ్ఞాపకాన్ని, తలపోతను ప్రకటిస్తున్నాడు. అది తన వ్యక్తిగత అనుభవపు జ్ఞాపకమే కానక్కరలేదు. తరతరాల సామూహిక జ్ఞాపకం ఐన పురాస్మృతీ కావచ్చు. తక్షణ జ్ఞాపకమూ సుదూర జ్ఞాపకమూ కలగలిసి చేతనలోనో, అంతశ్చేతనలోనో భాగమై కవిత్వంగా పెల్లుబుకుతున్న జ్ఞాపకం కావచ్చు. ఒక్కక్షణం కింద అనుభవంలోకి వచ్చి మెదడు అట్టడుగుపొరల్లోకి జారిపోతున్న ఇంకా తడి ఆరని, ఇంకా పొగలు చల్లారని జ్ఞాపకం కావచ్చు. వేల ఏళ్లకింద తన పూర్వీకులెవరో అనుభవించి, రక్తంలోకీ, ఆలోచనలలోకీ ఇంకి ఇంకా అక్కడ మిగిలిపోయి ప్రవహిస్తూ వస్తున్న ఆత్మవిశ్వాసమో, అవమానభారమో కావచ్చు. ‘వందేళ్లక్రితం కన్నుమూసీ ఆ రాళ్లలోంచి మళ్లీ కళ్లు తెరుచుకుంటున్న’ సూఫీ ముని పాతకాలపు అరబ్బీ పుస్తకం జ్ఞాపకం కావచ్చు. ‘నా చరిత్ర అంతా వొకానొక కలత కల’ అనిపించే విషాద జ్ఞాపకమూ కావచ్చు. ఎప్పుడో చిన్నప్పుడు ‘ఆ కుండమీద కూర్చోబెట్టి కోసిన’ ఆ తెగిన ముక్క రాల్చిన నెత్తుటి జ్ఞాపకం కావచ్చు. లేదా నిన్నటికి నిన్న తన కాళ్లకింద కదిలిపోయిన కొలరాడో నది మిగిల్చిన తడీ కావచ్చు. ఆ తడి జ్ఞాపకం శరీరానికంటినదీ కావచ్చు, మనసుకంటినదీ కావచ్చు. అది ప్రకృతిదీ కావచ్చు, సమాజానిదీ కావచ్చు. జ్ఞాపకమంటే గతమే కానక్కరలేదు, గతం వర్తమానంలోకీ, వర్తమానం గతంలోకీ అటూ ఇటూ నిరంతరం ప్రవహిస్తున్న చోట, పరిభ్రమిస్తున్న వేళ జ్ఞాపకమే జీవితం. జ్ఞాపకమే కవిత్వం.

You Might Also Like

64 Comments

  1. Malakpet Rowdy

    ఇదంతా చూస్తుంటే నాకు కూడా కాస్తంత కటువుగా కామెంటాలని ఉంది – పాలు పితకడం చేతకాని వెంగళాయికి కామధేనువు కూడా వట్టి ఆవులానే కనిపిస్తుందేమో? అసలు నేను కూడా నా కెలుకుడు శైలిలో ఒక “ఒంగోలు గిత్త” లాంటి రివ్యూ రాస్తే? తిక్క తిక్క కామెంట్లు పోస్టే వాళ్ళని అదే కుమ్ముతుంది. కటువుగా చెప్పాను – అర్ధమవ్వాల్సిన శాల్తీలకి అర్ధమయ్యే ఉంటుందనుకుంటున్నా. అర్ధం కాకపోతే చెప్పండి, విడమరచి మళ్ళీ కామెంటుతా.

  2. గరికపాటి పవన్ కుమార్

    అవతలి వారిని నొప్పించే పరుష వాక్కు వల్ల విమర్శ లోని అసలు విషయం వ్యర్థమవుతుందని ఇప్పటికీ గ్రహించకపోవడం విచిత్రమే.

    – హెచ్చార్కే

    ఏది విచిత్రమనేది ప్రశ్న? మాటలో కటువు లేకుండా చెపితే ఎవ్వరికైనా ఏదైనా అర్ధమవుతుందని నేననుకోను. కుండ బద్దలు కొట్టినట్టు, కొరడా ఝలిపించినట్టు విమర్శ రాక చాలా కాలం గతించింది కనుకనే మనకీ దుర్దశ.భూషణ్ “నేటి కాలపు కవిత్వం తీరు తెన్నులు” వచ్చాక కనీసం ఆ వెలితి కొంత వరకైనా తీరింది. అయినా భూషణ్ చెప్పే విషయాన్ని ఒప్పుకుంటున్నప్పుడు చెప్పే విధానం ఏమైతే ఏమిటి? బుద్ది చెప్పువాడు గుద్దితే నేమయా?

    గరికపాటి పవన్ కుమార్

  3. హెచ్చార్కె

    ఆభ్యంతరం చెప్పింది విమర్శకు కాదు. అసహనానికి, పారుష్యానికి. ‘ఎలా రాయకూడదో దానికి చక్కని నమూనా’, ‘వట్టిపోయిన ఆవు’, ‘పారిపొండి’ వంటి ‘అతిశయో’క్తులకు. భూషణ్ శాన్నాళ్లుగా ఇదే పని ఇలాగే చేస్తున్నామంటున్నారు. అవతలి వారిని నొప్పించే పరుష వాక్కు వల్ల విమర్శ లోని అసలు విషయం వ్యర్థమవుతుందని ఇప్పటికీ గ్రహించకపోవడం విచిత్రమే.
    ఇక, నేను కవిత్వాన్ని కార్టూన్ స్థాయికి దిగజార్చడం, ఎగదీయడం రెండూ చేయలేదు. అసలు నేను మాట్లాడింది కవిత్వం గురించి కాదు. విమర్శ గురించి. కార్టూనింగ్ కు పనికొచ్చే ఒక మాట సాహిత్య విమర్శకూ పనికొస్తుందని వుపయోగించాను. కార్టూనింగ్, విమర్శ… రెండింటిలోనూ ‘విమర్శ’ అనే సామ్య విషయం వుంది.
    కవిత్వం, విమర్శ, రాజకీయార్థిక వ్యాసం, కార్టూన్, నాటకం, సినిమా… ఇలా దేనికి దానిలో గొప్పవి తక్కువవి (ఉదా: గొప్ప కవిత్వం తక్కువ కవిత్వం, గొప్ప కార్టూన్ తక్కువ కార్టూన్) ఉంటాయి గాని, ఇందులో ఏ ప్రక్రియా మరొక ప్రక్రియ కన్న ఎక్కువ గాని తక్కువ గాని కాదు. ఒక రంగంలోని మంచి మాటను మరొక రంగం విషయంలో వాడడం, విషయ వివరణకు వుపయోగించడం తప్పు అని అనుకోడం లేదు.
    విమర్శకు గురైన వారు (కూడా) సర్దుకుని కాస్త నవ్వేలా వుండడం కార్టూనిస్టుకు మంచిదే, విమర్శకు గురైన వారు (కూడా)కాస్త ఆగి ‘ఔన్నిజమే కదా’ అనుకునేలా వుండడం సాహిత్యవిమర్శలో మంచిది కాదు… అని అనదల్చుకుంటే, ఆ మాట ఇక్కడ వాడినందుకు నన్ను కోప్పడవలసిందే.

  4. vamsykrishna

    Afsar kottakavitwa pustkaniki N.Venu Gopal raasina Preface, daani adharamga jarugutunna kavitwa charcha chuustunte Andhara Desa Assembly samavesalu gurtuku vastunnai. Asalu vishayaanni vidichi charcha vere daari pattadam deniki sanketam.Pustakm.net vaaru preface ani prchrinchaka kooda idi kodariki vyasam laga kondariki sameeksha laaga marikodariki anuvadam laaga avagahana kavadam vichitrame.

    Srujana kaarudu evarina matrubhashalo alochinci matubhashalo matrame rastadu. Vere bhasha lo rasinappatiki atani alochna madhanam anta matrubhashalone jarugutundi. Afsar English lo alochnichi Telugu lo kavitvam raasadu andam anyam. Afsar Kavitwa saili gurinchi ippudu kotha gaa cheppalsindi em vundi? Rendunnara Dasabdalu ga Afsar Poetry rastunnadu.Prasen,Sitharam la to kalisi Raktha Sparsa, tharuvatha Ivvala,Valsa, Madhyalo Adhunikatha-Atyadhunikatha ane vimarsa, Katha-Sthanikata pera Katha vyasalu Afsar Sahitya Srujana lo ippatike cherina pustakalu. Andhara Bhoomi lo Aksharala dadapu rendellu nadichina Sahitya coloumn. Cherathala tharuvatha ekkuva kaalam nadichina coloumn kooda ide. Adhunikatha-Atyadhunikatha meeda Prabha lo Chala Kaalam Charcha,Afsar Kavitvam meed Vujwala Bulletin lo jarigina Charcha, chala mandiki gurtu vunde vuntundi.
    Ippudi idantha enduku cheppalsi vachhindi ante Afsar Kavitwaniki Yadukula Bhushan, Kumara Narasimha Anukunnantha Kotha kaadu ani cheppadanike. Voka pustakaniki raasina mundu maata chadivi oka kavitwam meeda poorthi sthayi lo teerpulu cheppadamu, Avulinta antu vyakhayaninchadamu anta maryada kaademo.Oka kavitha lo prathi padamu daani ki ade ardahni ivvadani oka Vaakyam lo odigi tharuvatha kavitha antha nindi poyaka padalu vakyalu anthardanami kevalam Bhavam matrame migulutundani kavitwa pathakulaku evaru cheppalsina pani ledu. Ee vishayam
    teleste Yadukula Bhushan Preface lo vudharinchina Rendu Vakyalnau Teesukuni
    Comment chesevadu kaademo. Avulinta lanti sweeping comments charcha lo vodagavu.

    Vamsy krishna

  5. తమ్మినేని యదుకుల భూషణ్

    విమర్శించే హక్కు ,విభేదించే హక్కు లేకపోతే మనకు కమ్యూనిస్టు, తాలిబాన్
    పాలనలో మగ్గిపోయిన సమాజాలకు తేడాలేదు.కవిత్వం కార్టూన్ కాదు,ఆ స్థాయికి
    దించివేసే ఆలోచన కూడా చేయను.మధ్యతరగతి మొహమాటాలకు బలయిపోయిన
    సాహిత్యాల్లో తెలుగుది అగ్రస్థానం.విమర్శకులకు బాధ్యతలేకపోవడం వల్ల ఇక్కడిదాకా
    వచ్చింది వ్యవహారం.కవులు ఏమి రాసినా కవిత్వమే.కవిత్వమ్మీద ఎవరేమి రాసినా
    కండగల వచనమే.దానిగూర్చి విమర్శిస్తే అందరికీ కోపాలు తాపాలు.గత పదేళ్ళుగా
    ఇటువంటి వాటిని ఎదిరిస్తూ నిలిచిన నాకిది కొత్త కాదు.

    నేను విమర్శించింది వేణుగోపాల్ గారి శైలిని;ఆయన ప్రస్తావించిన విషయాన్ని విమర్శిస్తే
    పెద్ద గ్రంథమవుతుంది.జ్ఞాపకాలను ఆధారంగా చేసుకునే కవిత్వాన్ని గొప్ప కవిత్వంగా
    భావించలేదు విమర్శకులు.దానికున్న పరిమితులు దానికున్నాయి.

    వీటి గూర్చి నేను ఏడేళ్ళ క్రిందట చర్చించి వున్నాను.ఆసక్తి ఉన్నవారు చదువుకోవచ్చు.
    http://www.eemaata.com/em/issues/200201/509.html

    “పోతే ఎన్నో రకాల కవిత్వాలు. స్మృతి కవిత్వాలు, అంటే గతాన్ని పునాదిగా చేసుకొని బయల్దేరేవి. ప్రసిద్ధ అమెరికన్‌ కవి Billy Collins , స్మృతి కవిత్వం మీద పెద్ద గ్రంథమే రాశాడు. మా తాత గారి భోషాణం పెట్టె : స్మృతి కవిత్వం పరిమితులు, అన్న వ్యాసంలో “కవిత్వ చోదకశక్తి కల్పన; అది కరవైతే గతాన్ని అంటి పెట్టుకొని ఊహాకాశాల్లో రెక్కలు విప్పలేదు కవితావిహంగం! అంటాడు. చరిత్రకారుడికి, జర్నలిస్ట్‌ కు, కవికి తేడా వుంది. కల్పన లేనిదే కవిత్వం లేదు. ఉన్నది ఉన్నట్లు చూపేది చరిత్ర. జరిగినది జరిగినట్టు రాసేది జర్నలిజం. కవిత్వాన్ని గతం చుట్టూ తిప్పే గానుగెద్దులా మార్చరాదు. ‘ నేటి ‘ తో ప్రమేయం లేని కవిత్వానికి ఊపిరాడదు! గింజుకుంటుంది. గతం కారాగారం. చెర కవిత్వానికి హాని చేస్తుంది, బొత్తిగా పనికి రాదు. స్మృతి కవిత్వం పేరిట గతమనే ద్వీపాంతరవాసం లో నెట్టివేయరాదు. వర్తమానం మీద దృష్టి పోగొట్టుకోరాదు.కాబట్టి స్మృతి కవిత్వం రాయడం కన్నా, చక్కని వచనంలో స్మృతులు నెమరువేసుకోవడం చాలా సులువు.”

    ఆ రోజుల్లో నేను అఫ్సర్ కవిత్వమ్మీద రాసిన సమీక్ష:
    http://www.eemaata.com/em/issues/200205/552.html

    అఫ్సర్ కవిత్వం ,వేణుగోపాల్ వచనం నాకు కొత్తగాదు.(కాబట్టే ఏళ్ళతరబడి రాస్తున్నా కొంత పరిణతి
    కనిపించకపోతే అసహనం)వారిద్దరూ కూడా వ్యక్తిగతంగా నాకు తెలుసు.వ్యక్తిగత పరిచయాలు వేరు ;
    సాహిత్యవిమర్శ వేరు.ఆ దూరం పాటిస్తానెప్పుడూ.వ్యక్తిగతపరిచయాల కోసం సాహిత్యవిమర్శని
    బలిచేసే బలహీనత నాకు లేదు.విమర్శను ఒక బాధ్యతగా తలకెత్తుకున్నాక అబద్ధాలు చెప్పడం
    హీనమైన పాపం,ఆత్మలోకంలోదివాలాగా పరిగణిస్తాను.కార్యకర్తలు కవులు కావడం,జర్నలిస్టులు
    విమర్శకులు కావడం ,సినిమాపాటలు రాసేవారికి జ్ఞానఫీఠాలు రావడం ఒక్క తెలుగులోనే సాధ్యం.
    దానికి పర్యవసానంగా సాహిత్యంలో దిగజారుడు తనానికి ఎవరు బాధ్యత వహిస్తారు ??
    ఇది అందరూ వేసుకొనితీరవలసిన ప్రశ్న.స్వస్తి.

    తమ్మినేని యదుకుల భూషణ్.

  6. Kumar Narasimha

    ముందుగా మాధవరావు గారికి,

    నేను ఇస్మాయిల్ అనబోయి స్మైల్ అన్నా, కరెక్టు గా అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు.
    __________________________________

    నేను అఫ్సర్ కవిత్వాన్ని చదివాను.నా కంతగా నచ్చలేదు.ఇది 90స్ మాట.ఇస్మాయిల్ ని ఒక కొలమానంగా తీసుకొని మాట్లాడాను.ఇస్మాయిల్ ముసల్మాను అయినందుకు కాదు.నా అభిమాన కవుల్లో ఒకరు అయినందుకు.ఒకరి కవిత్వాన్ని మరొకరి కవిత్వంతో పోల్చగూడదు అని మీరు అంటే, ఒక పాఠకుడి గా నాకు సంకెళ్ళు వేసినట్టు భావిస్తాను.

    బాబా గారి కామెంటు నాకు చాలా నచ్చింది.కాని వేణు గారి శైలి నచ్చలేదు.ఏదొ కవిత్వ చర్చ జరుగుతుంది అనుకున్నాను గాని, కొంతమంది పెద్దవాళ్ళు తమకు నచ్చినదే గొప్ప కవిత్వమూ, కవిని మెచ్చుకోవడమే విమర్శా అనే టైపులో, ఇంకా ‘సంస్కారవంతులు కానక్కరలేదూ అంటూ పెద్దరికం ఆసరాతో భావ దౌర్జన్యం వైపు పయనించడం ఎంత వరకు సబబో వాళ్ళ ఆలోచనలకే వదిలేస్తున్నాను.

    ఇకపోతే ఎటువంటి పదజాలం వాడాలో, ఏది మ్రుదువైన మాటో, ఏది కఠినమైనదో – ఇలాంటివన్నీ వ్యక్తిగతమైన అభిప్రాయాలే గానీ, వ్యక్తులకు సంబంధించినవి కావు.నేను గాని, మరొకరు గాని, ముందు మాటనో, కవితలనో తప్పు బట్టాము గానీ, వేణుగోపాల్ నీ, అఫ్సర్నీ కాదు.నా కవితని మెచ్చని వాడు నన్ను తిట్టినట్టే అని ఎవరూ అనరు కదా.

    చివరిగా, భూషన్ గారితో ఏకీభవిస్తూ నేనొక విషయం మనవి చేస్తాను.ఈ ముందు మాట గురించి ఇంత చర్చ చెయాల్సినంత సీను లేదు.చర్చ వ్యక్తుల సంస్కారం దాకా వచ్చింది కాబట్టి ఈ కామెంటు చేస్తున్నాను.ఇహ మీరూ మీరూ ఒహళ్ళనొహరు ఏం పొగుడుకుంటారో మీ ఇష్తం.

    మీ క్షమని కోరుతూ,

  7. బండ్ల మాధవరావు

    అఫ్సర్ కవితా సంపుటి ఊరిచివర కు వేణు గారు రాసిన ముందుమాట, దాని మీద సాగుతున్న చర్చ చూస్తున్నాను. ముందుగా కుమార నరసింహ గారి మాటలకు – అఫ్సర్ ను 90 ల నుంచి చదువుతున్నాను. సీతారాం , యాకూబ్ లతో కలిసి వేసిన రక్తస్పర్శ నుండి ఇటీవల వచ్చిన వలస తో పాటుగా ఇప్పుడు రాబోతున్న ఊరిచివర లోని చాలా వరకు కవితలు చదివినవే.ఇక్కడ అఫ్సర్ కి ఇస్మాయిల్ సంబంధమేమిటొ నాకు అర్ధం కాలేదు.అఫ్సర్ ఇస్మాయిల్ దరిదాపుల్లో లేడనా లేక 90 ల దరిదపుల్లో లేడనా అనేది నాకు అర్ధం కలేదు. అఫ్సర్ ను ఇస్మాయిల్ తో పోల్చాల్సిన అవసరం ఏమిటి? ఇద్దరు ముస్లిం లు కాబట్టి పోలికా? అవసరం లేదే. ఏవరి కవిత్వం వారిదే. పైగా ఇస్మాయిల్ 90ల నాటికి రాయడం దాదాపు గా తగ్గించేశాడు.నిజానికి 90లలో అఫ్సర్ బాగా విస్తృతం గా రాస్తున్నాడు. అతను పి హెచ్ డి చేస్తున్న సమయం కూడా అదే . విజయవాడలో ఆంధ్ర భూమి ఆఫీసులో కలిసినా ఇంటికి వెళ్లినా, రాస్తున్న , అప్పుడు వస్తున్న కవిత్వ చర్చలు మామధ్య ఎక్కువగా ఉండేవి. ఎక్కడైనా సభలో పాల్గొంటున్నాడంటే ఏ విషయాన్ని చర్చకు తీసుకు వస్తాడో అని మేము ఎదురు చూసేవాళ్లం. అటువంటిది అతను ఆ దరిదాపుల్లో లేనడం ఎంతవరకు సబబు?
    ఇక తమ్మినేని యదుకుల భూషణ్ గారికి – నేను విజయవాడ కె.సి.పి సిదార్థ లో పని చేస్తున్నప్పుడు అతను అక్కడ ఇంజనీరింగ్ కాలేజి లో చదువుతున్నట్లు గుర్తు.వ్యాసాన్ని నిర్వహించేటప్పుడు అదీ ముందు మాట గా రాస్తున్నప్పుడు వ్యాసకర్త ఎటువంటి విషయాలను ప్రస్తావిస్తారనే విషయం తమ్మినేని కి తెలియనిది కాదు. విమర్శలో సున్నితత్వాన్ని పాటించకపోతే ఎలా? మనకు నచ్చనంత మాత్రాన మాటల్ని పొదుపుగా వాడుకోక పోతే ఎలా?

  8. ప్రవాసి

    జ్ఞాపకాలు, రసం గురించిన చర్చ చదువుతూ ఉంటే నిరుడు (నవంబర్ 2008)ఈమాట వెబ్ పత్రికలో వేలూరి వెంకటేశ్వర రావు వ్రాసిన వ్యాసం గుర్తుకొస్తున్నది.

    “కవిత్వాస్వాదనకు ఉపయోగపడే పరికరాలు తిరిగి గుర్తొచ్చే వెనకటి జ్ఞాపకాలు – recovered memories. ఒక కవిత చదవగానే పాఠకుడుకి వెలికి వచ్చిన జ్ఞాపకాలు, ఆ కవితను అనుభవించడానికి ఆనందించడానికీ ఉపయోగపడే సాధనాలు,” అని ఆయన వ్రాసాడు.

    Recovered memories పై వెంకటేశ్వర రావు రాసిన వ్యాసం చదివితే, ఏ రకమైన జ్ఞాపకాలు లేకండా ఏ కవికైనా కవిత్వం అల్లడం సాధ్యమా అని అనుమానం వస్తుంది. ఇక రసమూ, ఆస్వాదనా వగైరా అన్నీ తరువాతే!

    వాల్‌టర్‌ బెంజమిన్‌ (మార్కిస్ట్ సిద్ధాంతి )అన్న మాటలతో వెంకటేశ్వర రావు గారి వ్యాసం మొదలవుతుంది.

    ” Every feeling is attached to an apriori object, and the presentation of the latter, is the phenomenology of the former.” — Walter Benjamin in The Origin of German Tragic Drama.

    విధేయుడు
    ప్రవాసి

  9. దుప్పల రవికుమార్

    బుధవారం కేవలం మొదటి పేజీ మాత్రమే చదివి, కింద కామెంట్లు చదివి నివ్వెరపోయా. గురువారం పనిమీద శ్రీకాకుళం వెళ్లడం వల్ల నెట్ కు దూరమయ్యాను. శుక్రవారం అంటే ఈ రోజు వచ్చి మళ్లీ వ్యాసం చూద్దును కదా, అది మూడు పేజీల ఆత్మీయ పరిచయం. (కొత్తగా బొల్లోజు బాబా, హెచ్చార్కె ఈ పరిచయ వ్యాసానికి మరింత విశ్లేషణ చేర్చారు.) ఒక గొప్ప పాఠకుడు తన సహచరుడిని జ్ఞాపకం చేసుకుంటూ మనముందు కూర్చుని అప్పుడప్పుడూ కళ్లు మూసుకుంటూ, ఆలోచిస్తూ, మధ్యమధ్యలో ఆగుతూ ఓపిగ్గా మనకు పరిచయం చేసిన ప్రసంగమిది. పైగా ఆ మాటల ప్రవాహం కొనసాగుతున్నప్పుడు వక్త, శ్రోత తప్ప మరెవరూ లేకుండా, వక్త కళ్లు తెరిచి చూసినప్పుడల్లా మన కళ్లలోకి సూటిగా చూస్తూ మాట్లాడుతున్నట్టు అనిపించింది. ఇక ఆ వాక్యాల గురించి, వక్త ఎంచుకున్న పదాల గురించి కొందరికి అభ్యంతరం ఉండొచ్చు. కానీ, మన తెలుగు సృజన కళాకారుల్లో కొందరి స్టైలే అంత. చినవీరభద్రుడు, ఎన్. వేణుగోపాల్ ల పరిచిత శైలి అది. అఫ్సర్ కవిత్వాన్ని తొలినుంచీ తన మనసు పొరల్లో ఇంకించుకున్న కవి విమర్శకుడు ఇప్పుడు వాటిలో మంచిచెడులను మననం చేసుకుంటున్నారు. ఆ ఇంకించుకున్న వైనం పొరపొరలుగా తెరలుతెరలుగా ఆయన మనసుకు హత్తుకున్నది. అదలానే మనముందు పెట్టారు. ముందుమాటలంటే మనకుండే సహజమైన ప్రిజుడీస్, ప్రీకన్సీవ్డ్ నోషన్స్ వల్ల ఈ పరిచయాన్ని కొందరు తిరస్కరిస్తే, వారికి నచ్చలేద(నుకుం)టే అది వారి తప్పో, విమర్శకుడి తప్పో కానే కాదు. నిజానికి కవిత్వం గురించి ఎన్నో విలువైన విషయాలను, అఫ్సర్ కవిత్వాన్ని మనమూ చదవాల్సిన విధానాన్ని, అర్థం చేసుకోవలసిన వైనాన్ని, అఫ్సర్ తో సహానుభూతి చెందడానికి ఈ వ్యాసం ఎంతో తోడ్పడుతుంది. నిజానికి ఈ పరిచయ వ్యాసం “పుస్తకం” సైటులో కంటే, పుస్తకంలోనే ఏకాంతంగా – కవి కవిత్వాన్ని ఆస్వాదించే ముందు – పాఠకుడు చదువుకునివుంటే బాగుండేది.

  10. Malakpet Rowdy

    To me, this looks like an unnecessary fight. Tch Tch.. Afsar garu, is it a conspiracy to give good publicity to your book? .. jus kiddin :))
    I dont think most of us have read the book yet. Why cant we reserve our comments until after we read it?

    As far as I am concerned, I read his “Valasa” and liked it very much. I am looking forward to read his new book and I do have high expectations.

  11. హెచ్చార్కె

    నిజమే,
    చెప్పదలుచుకున్న విషయం కాస్త మృదువుగా చెప్పలేమా?! విమర్శించడం ఇంకొకరిని ఒప్పించడానికే గాని, నొప్పించడానికి కాదు కదా?!
    ఒకసారి కబుర్ల మధ్య, మితృడు, కార్టూనిస్టు శ్రీధర్ కార్టూన్ల గురించి చెప్పిన ఒక మాటను ఇక్కడ పంచుకోవాలని వుంది. ‘ఒక కార్టూన్ లో ఎవరిని విమర్శిస్తామో వారికి చురుకు తగిలినా, దాన్ని సర్దుకుంటూ, తాను కూడా కాస్త నవ్వుకోగలిగితే అది మంచి కార్టూన్’. ఈ మాట సాహిత్య విమర్శకూ వర్తిస్తుందనుకుంటా. విమర్శించబడిన రచయిత తక్షణం ఇబ్బంది పడినా, కాసేపాగి తనకు తాను ‘ఔన్నిజమే కదా’ అనుకోగలిగితే బాగుంటుంది. కరుకు మాటలు… ‘వట్టిపోయిన ఆవుల’తో పోలికలు, మీకు బాగోక పోతే, ఛెళ్ ‘పారిపొండి’ అంటూ అదిలింపులు అలాంటి అవకాశమిస్తాయా? అలాంటి అవకాశం అక్కర్లేని ‘శతృ-వైరుధ్య’మేదీ ఇక్కడ లేదని అందరికీ తెలుసు.
    ఇక్కడి చర్చను మొదట చూసినప్పటి నుంచీ ఈ మాట చెప్పాలనిపిస్తున్నా, ఆరి సీతారామయ్య గారి కామెంటు చదివాక, ఈమాత్రం రాయడానికి ధైర్యం చాలింది.

  12. ఆరి సీతారామయ్య

    మా అమ్మాయి ఒక ఎలిమెంటరీ స్కూల్లో పంతులమ్మ. నిన్న ఫోన్ చేసింది. తన క్లాసులో పిల్లల్ని ‘పెద్దయింతర్వాత ఏం చెయ్యాలనుంది’ అని అడిగిందట. అందరూ తలావొక సమాధానం ఇచ్చారట. ఒక్క అబ్బాయి మాత్రం ‘నాకు పెద్దవాలని లేదు, ఇలాగే ఉండిపోతే బాగుంటుంది’ అన్నాడట. ‘నా క్లాసులో ఒక్క తెలివైన కుర్రాడున్నాడు’ అంది మా అమ్మాయి.

    పసితనం ఇష్టం కావటానికి కారణం అమాయకత్వం కావచ్చు. లేక చిన్నతనంలోనే పెద్దవారి జీవితాల్లో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం లేకపోవటం గమనించటం వల్ల కావచ్చు.

    అసమానత్వాన్ని సంవత్సరాల తరబడి గమనించి నిస్పృహ చెందవచ్చు. బావోద్రేకంతో కవిత్వం రాయొచ్చు. కాని ‘ఉద్వేగాల తక్షణ విస్ఫోటన’ లో మంచి కవిత రాయటం సాధ్యం కాకపోవచ్చు, ‘ప్రశాంతంగా గుర్తుతెచ్చుకున్న ఉద్వేగ’ మే మంచి కవితగా మల్చటానికి వీలవుతుందేమో నంటున్నాడు వేణు. ఆలోచించదగ్గ విషయం.

    ఈ ముందుమాట చదివింతర్వాత అఫ్సరే కాదు, వేణూ కూడా జ్ఞాపకాలపొరల్లో చాలాసమయం గడుపుతున్నాడనిపించింది. ‘జ్ఞాపకమంటే గతమే కానక్కరలేదు, గతం వర్తమానంలోకీ, వర్తమానం గతంలోకీ అటూ ఇటూ నిరంతరం ప్రవహిస్తున్న చోట, పరిభ్రమిస్తున్న వేళ జ్ఞాపకమే జీవితం.’ జ్ఞాపకాలను కవిత్వంగా మార్చిన రసవిద్య ఒకరిదీ, ఆ రసవిద్యను గుర్తించి, ఆస్వాదించి, గౌరవించిన సంస్కారం మరొకరిది. ఇద్దరికీ ధన్యవాదాలు.

    కవి అనుభవాలూ, అనుభూతులూ, జ్ఞాపకాలూ నావికూడా అయినప్పుడు, అతని అస్తిత్వంలో అతని జ్ఞాపకాల్లో నేను మమేకం కాగలిగినప్పుడు కవిత్వం సఫలం అవుతుంది అంటున్నాడు వేణు. ఒక కవిత నచ్చటానికీ, మరొకటి నచ్చకపోవటానికీ కారణం ఇందులోనే ఉందేమోననిపిస్తుంది నాకు.

    వేణు రాసిన ముందుమాట నాకు బాగా నచ్చిందని వేరే చెప్పనవసరంలేదు. కాని, భూషణ్ చేసిన రెండు విమర్శలతో నేను ఏకీభవిస్తున్నాను. మన భాష మీదా, మనం ఆలోచించే విధంలో ఇంగ్లీషు ప్రభావం విపరీతంగా పెరుగుతుంది. అది నిస్సందేహం. ఒకటి రెండు వాక్యాల్లో ఈ ప్రభావం వేణు మీద కూడా కనిపిస్తుంది. విశేషణాల వాడుక ఎక్కువగా ఉందని రెండవ ఆరోపణ. ‘నిస్సహాయ నిర్దిష్ట రాజకీయార్థిక స్థితి తాత్విక స్థాయిలో’ చదివినప్పుడు నాకూ అలాగే అనిపించింది. కాని వేణు వ్యాసంలో భూషణ్ అన్నంతగా ఇంగ్లీషు ప్రభావంగానీ, విషేషణాల మాలికలుగానీ నాకు కనబడలేదు. ‘ఎలా రాయకూడదు అన్నదానికి చక్కని నమూనాగా పనికివస్తుంది ఈ వ్యాసం’ అన్న అభిప్రాయంతో నేను విభేదిస్తున్నాను.

    సాహిత్య పత్రిక చదివేవాళ్ళంతా సంస్కారవంతులు కానక్కరలేదని ఇక్కడి వ్యాఖ్యానాలు చదువుతుంటే తెలుస్తుంది.

  13. బొల్లోజు బాబా

    ఈ ముందు మాటలో నాకు అర్ధమైన విషయాలివి

    ౧. వ్యాసకర్తకు కవితో ఉన్న అనుభవం.

    వ్యాసంలోని మొదటి పారాగ్రాఫు ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. వ్యాసకర్త తన ప్రతిభకంటే మీరు చదవబోతున్న కవిత్వమే గొప్ప సుమా అని ముందే ప్రకటించుకోవటం పాఠకునిలో ఈ కవిత్వంపై ఒకరకమైన ఆశక్తిరేపే ప్రయత్నమే.

    సాధారణంగా ఏ కవైనా తనకు బాగా పరిచయమున్న, లేదా తన కవిత్వాన్ని నిశితంగా పరిశీలిస్తూ, ప్రోత్సహిస్తూ ఉండేవారితో ముందు మాటలు రాయించుకోవటం సాంప్రదాయం. ఇక్కడ వారిరువురికీ మధ్య సాధారణంగా అత్యంత స్నేహపూరిత లేదా గౌరవం నిండిన వాతావరణం ఉంటుంది ఈ విషయాన్ని సహృదయతతో అర్ధం చేసుకోకుండా వారిరువురిమధ్యా విషపుచుక్కలు చల్లుతున్నట్లుగా ఉన్నాయి ఇక్కడ కొన్ని కామెంట్లు. ఇది దారుణం.

    ౨.కవి లక్షణాలు
    వ్యాసకర్త తనకు ఈ కవి 1983 నుంచీ తనకు తెలుసనీ, అప్పుడు ఎలా ఉన్నాడో ఈనాడు అలానే ఉన్నారనీ, అదే పసితనాన్ని కాపాడుకొన్నాడనీ చెపుతున్నారు. ఇక్కడ పసితనాన్ని కాపాడుకోవటం అనేది కవియొక్క ఒక గొప్పలక్షణం. ఇస్మాయిల్, టాగోర్ ను సదాబాలకుడని వర్ణించాడు. ఇస్మాయిల్ కూడా సదాబాలకుడని పిలువబడ్దాడు. పై వాక్యం ద్వారా కవి యొక్క స్వభావాన్ని, స్వచ్చతని పరిచయకర్త మనకు తెలియచేస్తున్నాడు.

    కవి తండ్రిగారి గురించి, తాత గారి గురించి పరిచయ కర్త మనకు తెలియని కొత్త విషయాలను చెప్పారు. కవిని ప్రభావితం చేసిన సర్వేశ్వర్ దయాళ్ , అవాతార్ సింగ్ ల గురించి ఉటంకించారు. కవి విద్యార్ధి దశలో చేసిన ఉద్యమాలలో పాల్గొన్నారన్న విషయాన్ని తెలిపారు. ఈ అదనపు సమాచారం కవి పట్ల మనకు గౌరవం కలిగించి, ఆతని కవితా వాక్యాలలోని సాధికారికతకు సమాధాన్నిస్తాయి. ఆ కోణంలో పరిచయ కర్త పాత్ర సముచితంగానే ఉంది.

    ౩కవిత్వ లక్షణం
    ౧.భిన్నపొరలుగా కనిపించేదే ఉత్తమమైన కవిత్వం అని వెల్చేరు వారి నిర్వచనం. ఆ నిర్వచనానికి సరితూగేట్టుగా ఈ కవి యొక్క కవిత్వం ఉందని ఈ పరిచయ కర్త సూత్రీకరిస్తున్నాడు ఉదాహరణలతో.

    కవి తన కవిత్వాన్ని చిత్రిక లేకుండా అలంకారం లేకుండా ఉండొచ్చు కూడా అని వ్రాసిన వాక్యాలను తీసుకొని, “అలా అనుకోవటానికి వీల్లేదు, అది కవి వినయం, కవికి చిత్రికపైనా అలంకారం పైనా గొప్ప శ్రద్ద అని ఒక విమర్శకుని పాత్ర వహించి కవిత్వపు మంచి చెడ్డలు పరామర్శించారు.

    ౨.ఒక కవికి తనకవిత్వంలోతనకు తెలియని కోణాలెన్నో ఉండవచ్చు. దానిని బయటకు తీయాల్సింది, విమర్శకులో, లేక ఇలా పరిచయవాక్యాలు వ్రాసేటివారో. అలాంటి ఒకకోణాన్ని ఈ పరిచయకర్త వెలికి తీసి, ఇదిగో ఇక్కడ నీ కవిత్వపు శక్తి దాక్కొని ఉంది. అని చెపుతున్నారు. అదే “జ్ఞాపకాన్ని కవిత్వంగా మార్చే రసవిద్య అని” ఈ వాఖ్యను సమర్ధించుకోవటానికి కవివ్రాసిన అనేక కవితలలో తనకు కనపడినట్లు చెపుతున్నారు. (ఇక్కడ కామెంటిన వారు ఆయా కవితలను చదివి ఇది నీరస కవిత్వమో లేక పసలేని వాఖ్యో అని చెప్పాలి లేదా అవునా అలాగా అని అనుకొని ఊరుకోవాలి- అది సహృదయుల లక్షణం).

    ఈతని కవిత్వం ఎందుకు జ్ఞాపకం నుంచి జనించింది అనటానికి అనేక కవిత్వ పాదాలఉటంకింపు ఇచ్చారు. ఆయావాక్యాల లోతు, చేసిన సాధారణీకరన యొక్క సమంజసత, చర్చించాలి తప్ప మొత్తం వ్యాసమో కవిత్వమో నీరసమనేయటం కుసంస్కారం అనిపించుకొంటుంది.

    జ్ఞాపకమనగానే అదేదో గతము తలచీ వగచే వ్యాపారం అని పాఠకుడెక్కడ అనుకొంటాడో అని
    “జ్ఞాపకమంటే గతమే కానక్కరలేదు, గతం వర్తమానంలోకీ, వర్తమానం గతంలోకీ అటూ ఇటూ నిరంతరం ప్రవహిస్తున్న చోట, పరిభ్రమిస్తున్న వేళ జ్ఞాపకమే జీవితం. జ్ఞాపకమే కవిత్వం.”
    అంటూ వ్యాసకర్త తెలివిగా సమర్ధించుకోవటాన్నీ గుర్తించాలి. ఈ వ్యాస హెడ్డింగే అది కనుక వ్యాసకర్త ఈ అంశాన్ని వివరించటానికి చేసిన ప్రయత్నాన్ని గమనించాలి. ఈ ప్రయత్నంలో కొన్ని చోట్ల గందరగోళంగా ఉందన్న విమర్శలో కొంత నిజం లేకపోలేదు. దీనికి కారణం నేననుకోవటం కంపోజింగు సమస్య. బహుసా ముద్రణలో కవితా పాదాలను వేరే పారాగ్రాఫుగా, లేదా ఇటాలిక్స్/బోల్డ్ గా ముద్రించినట్లయితే వాక్యం వెంబడి వెళ్లటానికి చదువరికి కొంత సౌలభ్యం ఉంటుంది.

    ఒక ముస్లింగా కవి రాసిన కవిత్వంలో ముస్లిం అస్థిత్వచాయలు కనిపించటం సహజం. నేటి సాహిత్య తీరుతెన్నులను బట్టి కనిపించాలి కూడా. ఆ విషయాన్ని పరిచయకర్త గుర్తించాడు. కనీసం పద్నాలుగు కవితల్లో ముస్లిం భావఛాయలున్నట్లు ప్రకటిస్తున్నాడు. వాటి ధిక్కారాన్నీ గుర్తించాడు. ఈ పరిశీలన కూడా కవిత్వ స్వరూపం పట్ల మనకు ఒక అంచనా కలిగించని చెప్పవచ్చు.

    ఒక ప్రవాసిగా కవి అభివ్యక్తి ఎలాఉంది ఎన్ని కవితలలో ప్రతిబింబించిందీ అనేది కూడా ఒక సూక్ష్మ పరిశీలనే. (పూర్వకాలంలో పరిచయకర్తలపై ఒక జోక్ ఉండేది “నా ఆరోగ్యం సహకరించటం లేదు, స్థాలీ పులాకన్యాయంగా చూసాను బాగానే ఉన్నాయ్” అంటూ వ్రాసే వారని. మరి ఈ పరిచయకారుడు ఇంతలోతుగా సూక్ష్మంగా చేసిన పరిశీలనలను ఆవులిస్తూనో గేదెలిస్తూనో స్థాలీపులాకన్యాయంగా చదివి అమూల్యాభిప్రాయాలను వెలిబుచ్చటం బాధ్యతా రాహిత్యం.)

    వ్యాసం చివరలో కవి శిల్పాన్ని మనకు కొద్దిగా రుచిచూపి, మిగిలింది కవితల్లో చూసుకోండని ఊరిస్తుంది. ఆ విశ్లేషణ అత్యద్బుతంగా ఉండి, నాకైతే ఒళ్లు జలదరించిందంటే మీరు నమ్మరేమో.

    కొద్ది రోజుల క్రితం hrk గారన్న ఈ మాటలెందుకో గుర్తొస్తున్నాయి

    “ఆఫ్టరాల్ ఎందరం వుంటాం మనం, ఇలా జనం గురించి, కథలూ కవిత్వం గురించి ఆలోచించే వాళ్లం? నా మట్టుకు నేను ఇది (మనం) ఒక ‘కమ్యూనిటీ’ అనుకుంటాను. ఇందులో ఒకరంటే ఒకరం అభిమానం కలిగివుండడం సహజం. మనం మాట్లాడుకోడం మనల్ని మనం సరిదిద్దుకోడానికీ, మరింత బాగా రాయడానికీ, మన మధ్య ‘కమ్యూనిటీ ఫీలింగ్’ని మరింత పెంచుకోడానికి కూడా……..” —hrk

    పైన జరిగిన చర్చలో భూషణ్ గారి మొదటి వాఖ్య లో మనల్ని మనం సరిదిద్దుకోవటం అన్నది వర్తిస్తుంది. నరసింహగారి చివరి వాక్యాలు కూడా. కొన్ని ఇతర కామెంటులు మాత్రం, కవికీ పరిచయకారునికీ మధ్య విషవాయువుల్ని ఊదుతున్నామన్న స్పృహైనా లేకుండా సాగటం బాధకలిగించే, ఈ వాఖ్య వ్రాయవలసివచ్చింది. అంతే కాక అసలీ వ్యాసంలో ఎం మంచి ఉంది అని అడిగారు. నాకు కనిపించిన/అనిపించిన మంచిని చెప్పాలని ఈ ప్రయత్నం.

    ఒక వాక్యాన్ని అర్ధం చేసుకోవటం వైయుక్తికమే. కాదనను, కానీ దానిపై తన స్పందనని వ్యక్తీకరించే విధానంలో కాస్త సంయమనం, సంస్కారం ఉండాలని నమ్మే వారిలో నేనొకడిని.

    భవదీయుడు
    బొల్లోజు బాబా

  14. Malakpet Rowdy

    టీ కప్పులో తుఫానంటే ఈ గొడవేనేమో! (మళ్ళీ ఆంగ్ల సామెతని వాడినందుకు నన్ను తిట్టుకోరుకదా?)

  15. సర్పవరపు రమణి

    ముందుమాట అంటే కవిగురించి ఆతని కవిత్వం గురించి తెలియని వారికి నాలుగు విషయాలు తెలిపే ప్రయత్నం.
    కాబట్టి ” అఫ్సర్ గారి కవిత్వంతో పరిచయం ఉన్నవారికి ఈ వ్యాసం అద్బుతంగానే అనిపిస్తుంది.” అన్న బాబా
    గారి మాటల్లో ఏమాత్రం పసలేదు.బాబా గారయినా ఇంకొకరయినా ముందుమాట ఎందుకు అద్భుతంగా వుందో
    “సంసారపక్షంగా” చెబితేనే కదా మాబోటివారికి అసహనం కలగకుండా ఉండేది.లేదంటే ముందుమాట
    బావోలేదని పరోక్షంగా ఒప్పుకున్నట్లే సుమా.పరమచెత్తగా ఉంది/పరమాద్భుతంగా ఉంది.ఇటు వంటి
    అభిప్రాయ ప్రకటనతో ఒరిగేదేమీ లేదు.

    “ఈ ముందు మాట చాల బాగుంది. అఫ్సర్ గొప్ప కవిత్వం రాసేడు.”
    మళ్ళీ అదే వరుస.బాగో బండిచెక్కో కూరిమితో చెప్పుమా కూర్మనాథా??

    సర్పవరపు రమణి

  16. kurmanath

    ఈ ముందు మాట చాల బాగుంది. అఫ్సర్ గొప్ప కవిత్వం రాసేడు. This is an apt tribute.
    భూషణ్ ఇంకా యెవరికైనా
    ‘ఇదేదో గందరగోళంలావుంది’ అని మీరు అనుకుంటే
    నిరభ్యంతరంగా ‘పారిపొండి.’
    … ఇంతకీ ‘సదరు ‘ `స్ఖాలిత్యము ‘ అనేవి యే భాషలో అలోచించి రాసేరో?

  17. బొల్లోజు బాబా

    వెంకట ఆర్ గారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను.

    బాగా చదువుకొనీ, రాయగలిగి వుండీ, ఇంత సంకీర్ణ కవిత్వానికి న్యాయం చెయ్యగలనా అని వినయంతో వేణు ఈ నాలుగు ముక్కలూ రాస్తే, అసలు అఫ్సర్ కవిత్వం కూడా చదవకుండా కామెంట్లు కొట్టడం ఏం న్యాయం?

    చాలా కరక్టుగా చెప్పారు.

    అఫ్సర్ గారి కవిత్వంతో పరిచయం ఉన్నవారికి ఈ వ్యాసం అద్బుతంగానే అనిపిస్తుంది. మిగిలిన వారికి కొంచెం కొత్తగా అనిపించవచ్చు. అంతే కాక ఈ పరిచయవ్యాసం చదివి నేరుగా కవితలలోకి వెళ్లే అవకాశం ఉన్నట్లయితే, ఇంత గందరగోళం ఉండకపోవును. (నిజానికి ఈ వ్యాస ముఖ్యోద్దేశం అదే).

    సాహిత్య విమర్శనం పై పుస్తకమే వ్రాసిన భూషణ్ గారి తక్కెడ బహు సున్నితం. మా బోటి వారికి ఓ ఎడ్యుకేషనే అనుకొంటూంటాం.

    రమణి గారికి అంత అసహనం అవసరమా అనిపించింది. అభిప్రాయాల్ని నరసింహగారు వెలిబుచ్చినట్లు సంసారపక్షంగానూ చెప్పవచ్చు.

    బొల్లోజు బాబా

  18. సర్పవరపు.రమణి

    కవిత్వ చర్చలో వినయం ఎందుకు వస్తుందో నాకు అర్ధం కాదు ;వాక్యాల్లో వినయం చూపిస్తూ ఆలోచనల్లో అహంకారం చూపడం ఎంత మాత్రం సభ్యత.ఇతరులు అఫ్సర్ కవిత్వాలు చదవలేదని వెంకట గారు ఏ దివ్యదృష్టితో కనుగొన్నారు ??బ్లాగులమీద ఇటువంటి అభిప్రాయం ఉన్నప్పుడు ,అడుసు తొక్కనేల కాలు కడగనేల??
    చర్చలో పాలు పంచుకోకుండా అది ఉరుముని పిడుగని ఎన్నిరాసినా ఒనగూరే ప్రయోజనం లేదు కదా.. శ్రీశ్రీ వేణుగోపాల్ గారికి వేంకట గారి యోగ్యాతాపత్రం అవసరమా?

  19. venkata r

    కవిత్వ చర్చలో ఆరాధన ఎందుకు వస్తుందో నాకు అర్ధం కాదు. అఫ్సర్ మాత్రమే కాదు, చాలా మంది కొత్త తరం కవులు సరయిన విమర్శ లేక, వాళ్ళు చెబుతున్న విషయాలు మరుగున పడుతున్నాయి. ఆ లోటుని కొంత వరకి వేణు ముందు మాట పూరిస్తుంది. కొత్త తరం కవులు అనుభూతి దగ్గిరే ఎందుకు ఆగిపోడం లేదో, సమాజంలోని అడుగు, బడుగు సమూహాల గురించి మాట్లాడక తప్పని స్థితి ఎందుకు వుందో చర్చించడానికి అఫ్సర్ కవిత్వం ఒక బలమయిన ఉదాహరణ. ఆ ఆలోచన పాదులు ఈ ముందు మాటలో వున్నవి. అందుకు వేణు గోపాల్ గారికి ధన్యవాదాలు. తెలుగులో మంచి వచనం రాసే అతి కొద్ది మందిలో ఆయన ఒకరు. అఫ్సర్ గురించి రాసిన మాటల్లో కూడా ఆయన వచన శైలి అదే. కారుకూతలకీ, వెకిలి రాతలకీ పుట్టినిండ్లయిన బ్లాగుల్లో, అఫ్సర్ లూ, వేణూలూ అంట రాని వాళ్ళు.

    బాగా చదువుకొనీ, రాయగలిగి వుండీ, ఇంత సంకీర్ణ కవిత్వానికి న్యాయం చెయ్యగలనా అని వినయంతో వేణు ఈ నాలుగు ముక్కలూ రాస్తే, అసలు అఫ్సర్ కవిత్వం కూడా చదవకుండా కామెంట్లు కొట్టడం ఏం న్యాయం?

  20. Ramani

    “జ్ఞాపకాని కవిత్వం గా మార్చే (నీ)రసవిద్య” అని మారిస్తే ఈ “హెడ్డంగు” (అంటే గిడ్డంగి అనా?) పరమాద్భుతమౌతుంది.

  21. wahed

    మహాశయా, కొత్తపాళీ గారు తెలుగులో రాయడానికి మరో సాధనం ఇది కూడా వుంది .. http://www.google.com/transliterate/indic/TELUGU కాకపోతే మనకు కట్ అండ్ పేస్ట్ చేసుకునే ఓపిక వుండాలి

  22. kvrn

    జ్ఞాపకాని కవిత్వం గా మార్చే రసవిద్య — అద్బుథమైన హెడ్డంగు

  23. Kumar Narasimha

    (ఆవులింత)

    వేణు గారి ముందుమాట చదివాను.మొదటి పేజీ ఫరవాలేదనిపించింది.రెండవ పేజీ బోరు కొట్టించింది.మూడో పేజీ కష్టమనిపించినా అలాగే ముందుకెళ్ళాను.మొత్తానికి ఈయన ఎం చెప్పాలనుకున్నారో అది చెప్పినట్లే వుంది కాని, కవి గురించి ఎటువంటి అభిప్రాయమూ కలుగలేదు.ఈ సంకలనం ఎందుకు చదవాలో, ఇంకా తెలీడం లేదు.

    కొంచెం నిడివి తగ్గించి, మరింత ఫోకస్ తో వ్రాసి వుంటే బహుశా అఫ్సర్ కవిత్వాన్ని చదివే ధైర్యం చేసివుండేవాణ్ణేమో.మధ్య మధ్య లో అనువదించబడిన ఆంగ్ల ఇడియంసు సరిగ్గా కాలని వడియాల్లా కొంచెం కరుగ్గానూ తగిలాయి.

    నేను ఎప్పుడో సెంట్రల్ యూనివర్సిటీ రోజుల్లో (1993-95) అఫ్సర్ కవితల్ని చదివినట్లు గుర్తు.నేను స్మైల్ని ఆరాధిస్తాను.అఫ్సర్ ఆ దరిదాపుల్లొకి ఆ రోజుల్లొ లేడు.బహుశా అమెరికా కెళ్ళాక, భావ స్ఫూర్తీ, ఎక్ష్పోజరూ పెరిగి, మరింత యూనివర్సల్ భావాల్ని అతని కలం పలికిస్తోందేమో తెలీదు.కాని ఈ ముందు మాటలో చెప్పిన విషయాల కంటే, చెప్పాలా వద్దా అనుకొని ఆపేసిన విషయాలే ముఖ్యమైనవేమో ఒకసారి ఆలొచించుకోమని వ్యాసకర్తకు రిక్వెస్టు.

    అఫ్సర్ సిద్ధాంతాలేమిటో, అవి ఎలా మారాయో, ఒక కమ్యునిస్టు కవి అమెరికా జీవితాన్ని ఎలా ‘అనుభవిస్తున్నారో’..అసలు వ్యాస కర్తకు అఫ్సర్ తో ఎలాంటి విషయాల్లో విభేదం కలిగిందో, అఫ్సర్ కవిత్వంలో ఏవైన ‘ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్’ ఉన్నాయో..ఇవన్నీ ఇంక మిగిలిన ప్రశ్నలే.

    కాని ఈయన కనీసం ఈ ప్రయత్నమైనా చెశారు.అది చదివి మనం ఏవో పేలగలుగుతున్నాము.ఆ అవకాశం కల్పించినందుకు వేణు గారికి ధన్యవాదాలు.

  24. తమ్మినేని యదుకుల భూషణ్

    మంచి వ్యాసం అనేస్తే కుదరదు.ఎందుకది మంచి వ్యాసమో చెప్పగలగాలి.మంచి వ్యాసాన్ని
    చదవడానికి శ్రమించడంలో అర్థం ఉంది.ఒక వ్యాసం బాగోగులు చర్చిస్తున్నామంటే దాన్ని ఒకటికి పది సార్లు చదివామనే అర్థం.ఈ వ్యాసం గూర్చి ఇంతకన్నా చర్చ అనవసరం.వట్టిపోయిన ఆవును ఎన్ని సార్లు పాలు పితికినా అట్టే లాభం లేదు.దాని మానాన దాన్ని వదిలేయడం అందరికీ మంచిది.

    .

  25. కొత్తపాళీ

    మహాశాయౌలారా, తెలుగు సాహిత్య దిశా నిర్ణేతలారా .. మీ ఆక్రోశాలని, ఆవేశాలని తెలుగులోనే రాయొచ్చు, ఆంగ్ల లిపి ఆసరా అవసరం లేదు. దయచేసి, ఒక్కింత ఓపిక జేసుకుని http://lekhini.org ఉపయోగించండి, హాయిగా తెలుగులో రాయండి. మీ అమూల్యాభిప్రాయాలు తెలుగులోనే చదువుకునే అదృష్టం మాకు కల్పించండి. ఈ తెంగ్లీషులో మమ్మల్నీ మా భాషనీ హింసించకండి, మీకు పుణ్యముంటుంది!!!

  26. GURRAMSEETARAMULU

    Chaala manchi vyaasamu..

    స్పష్టంగా ఆలోచించడం ఒక ఎత్తు.సదరు ఆలోచనలకు అక్షరరూపం ఇవ్వడం మరొక ఎత్తు.
    ఈ రెండు చేయలేనివారు ఇటువంటి మింగుడుపడని వచనం రాయడంలో నేర్పరులవుతారు.
    Bhushan gaaru Malli oka saari chadfavandi….artham avutundi….

  27. తమ్మినేని యదుకుల భూషణ్.

    ఇతరభాషలనుండి పదాలను స్వీకరించడం తప్పనడంలేదు.
    ఏ భాషకైనా (అందునా ఆంధ్రానికి) అది సహజమూ అనివార్యమైన ప్రక్రియ.
    అది సమర్థవంతంగా చేయడంలేదని నా ఫిర్యాదు.ఇతరభాషలలోని పదాలూ
    ప్రయోగాలు మనభాషను పరిపుష్టం చేయాలే గానీ బలహీనపరచరాదు.
    ఈ వ్యాసరచయిత తెలుగు నుడికారానికి తిలోదకాలు ఇవ్వడంలోనే ఉంది
    అసలు చిక్కు.నేను పాఠకులకోసం ఒక్క ఉదాహరణ ఇచ్చానంతే.మీరు
    మరింత పరిశీలనతో చదివితే అటువంటి స్ఖాలిత్యాలు వ్యాసం నిండా
    కనిపిస్తాయి ఉదా:( విశ్వసనీయమైన ,సాధికారికమైన ) ప్రతీకలు,
    (reliable,authoritative symbols);నిర్మమకారమైన దూరం-(dispaasionate distance/observation)బహుముఖ,బహుళార్థబోధక,సంకీర్ణ ప్రతీకలు (multi-faceted,multi-meaning,complex symbols)

    స్పష్టంగా ఆలోచించేవారు ఇన్ని తప్పులు చేయరు.ముందుమాట చదివాక కవిత్వాన్ని చదవడానికి
    ఉద్యుక్తుడు కావాలి పాఠకుడు.ఇదేదో గందరగోళంలావుంది ,మనకెందుకులే అని పారిపోరాదు.
    వ్యాస రచయిత భాషపట్ల మరింత సంయమంతో ,మెలకువతో వ్యవహరించి ఉంటే బావుండేదని
    నా అభిప్రాయం.కవిత్వంలో విశేషణాల వాడకం గూర్చి నేను చర్చించలేదు.బహుళవిశేషణాల
    వాడకం ఆంగ్లభాష నుడికారంలో భాగం ;తెలుగులో అది అందగించదు.ఆంగ్లంలో ఆలోచించి
    తెలుగులో రాసేవారు, అనువాదాలు చేసేవారు తెలుసుకోవలవలసిన ప్రాథమిక విషయం ఇది.

  28. kvrn

    Sri Venugopal, Thank u for the reply.

    Even in Prefaces, certain lines of the poem which are liked will be generally quoted.
    For a new reader who does not know the poet/author, it will be helpful to form preliminary impressions about the author/poet reviewed or introduced.

  29. nanduri raj gopal

    venu gopal garu,

    afsar pusthakaniki mee mundumata chadivanu.eenati telugu sahityamlo mundumataki-revieuki-critical analysiski madhya vunna teda sarigga gurtincha leka pottunnaru.bahusa mee mundumata vishayamlo vachinna confusionki karanamadee.mundumata kanna meeru oka criticismlaa deenini malachi vunte bagundedi.asalu mundumatante writerni prize cheyyadame oka sampradayam iyipoyina rojulalo mee vyasam sariga patakudiki reach avvaledu.afsar pustakam release ayyaka mee vyasam daanipii oka critical viewla vachi vunte bagundedhani naa abhiprayam

  30. wahed

    Bhushan gari vimarsa chadivaanu. much water has passed under the bridge anna angla jateeyaniki daggaraga :”ఈలోగా వంతెనలకింద చాల ప్రకృతి కన్నీరు మాత్రమే కాదు, మనుషుల కన్నీరూ నెత్తురూ కూడ ప్రవహించింది ” anna vakyam undani rasaaru. ala vundatamlo naaku tappu kanapadatam ledu. itara bhashala loni vyaktheekaranalanu telugu loki techchukovadamlo tappu emundi. Itara bhashala nunchi padaalu, jateeyalu telugeekarinchi sweekarinchadam tappuga bhaviste telugu bhasha ekkadidakkade undipotundi. kavitvamlo visehanala vadakam annadi kavi bhavavesala meeda adharapadi vuntundi. kavitvam avesam, avedana pradhanamainadani grahiste bahusa, dassipoyinattu kanipinchina vyakyalu jeevita satyalanu aavishkarinche bodhi vrukshalla kanipistaayi.

  31. తమ్మినేని యదుకుల భూషణ్

    స్పష్టంగా ఆలోచించడం ఒక ఎత్తు.సదరు ఆలోచనలకు అక్షరరూపం ఇవ్వడం మరొక ఎత్తు.
    ఈ రెండు చేయలేనివారు ఇటువంటి మింగుడుపడని వచనం రాయడంలో నేర్పరులవుతారు.
    మరొక్క విషయం రచయితలో తెలుగు నుడికారం పూర్ణానుస్వారం.ఇంగ్లీషులో ఆలోచించి
    తెలుగులో రాస్తే ఇటువంటి వచనం పుట్టుకొస్తుందేమోనని నా అనుమానం.

    ఉదా:”ఈలోగా వంతెనలకింద చాల ప్రకృతి కన్నీరు మాత్రమే కాదు, మనుషుల కన్నీరూ
    నెత్తురూ కూడ ప్రవహించింది ” అన్న వాక్యం ” much water has passed under
    the bridges ” అన్న ఆంగ్ల జాతీయానికి దగ్గరగా లేదూ?? అంతేగాక ,ఎక్కువ విశేషణాలు
    వాడటం మూలాన వాక్యాలు డస్సిపోయి పాఠకుణ్ణి అయోమయానికి గురిచేస్తున్నాయి.రచయిత
    వాక్యనిర్మాణంలో కనీస శ్రద్ధ చూపలేదని తెలుస్తూనే ఉంది.పుస్తకంలో వస్తున్న అనేక వ్యాసాలు
    ఇలా ఉండకపోవడం గొప్ప ఉపశమనం.ఎలా రాయకూడదు అన్నదానికి చక్కని నమూనాగా
    పనికివస్తుంది ఈ వ్యాసం.

  32. KN Mohan

    Dear Venu

    Link pampinanduku dhanyavadalu. Naaku kavitavam antaga ontabattadhu – dantlo kooda theoritical vishayala medika dhrusthi pothundhi. Telugu lo vastuuna vachana kavivam meda naaku okkintha cynicism undhi.

    Mee mudhumaata choosthe Afsar andhuku minahayimpu kavochhani anipishtundhi. Ayana kavitvam nenu chadavaledu. Yeemaina manava moolyam chelichakunda ye goppa vijayanini sadhincha lemu. Mana kavulu mari mukyamga vimarsakulu denini gurthisthe manchidi.

  33. ఎన్ వేణుగోపాల్

    మిత్రులు కె వి ఆర్ ఎన్ గారు నా ముందుమాటను సమీక్షగా భావించినట్టున్నారు. ముందుమాటలో కూడ పుస్తకాన్ని సమీక్షించవచ్చుగాని, ఇప్పటివరకు ముందుమాటల విషయంలో ఏర్పడి ఉన్న సంప్రదాయం రచయితనూ, పుస్తకంలోని విషయాన్నీ పరిచయం చేయడం మాత్రమే. విమర్శలు ఉన్నా ఒకటిరెండు ప్రస్తావనలలో ముగించడం ఆనవాయితీ. గమనించగలరు.

    ఎన్ వేణుగోపాల్

  34. kvrn

    Sri venugopal’s review is not clear. it is more about the poet, “Afsar’ than about his new book of poems. Venugopal attempted to insert lot of poetic imagery in his review-essay. He could have inserted one or two new poems of Sri Afsar in his review.

  35. బొల్లోజు బాబా

    అద్బుతమైన వ్యాసం

Leave a Reply