కవి,ప్రేమికుడు..

రాసిన వారు: తమ్మినేని యదుకులభూషణ్
*******************************
అనుకోకుండా ఒక రోజు ఈ కవితను ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో చదివాను. వింత ఆకర్షణ కలిగింది చదువుతుంటే ,అప్పుడు నేను ఆంగ్లమూలం కూడా చూడలేదు. ఒకటిరెండు సార్లు చదివే సరికి మనసులో నిలిచిపోయింది.ఏకాంతంలో అనేక పర్యాయాలు మననం చేసుకొని ఉంటాను.ఎన్నో సార్లు ఎంతో మందికివినిపించి ఉంటాను.ఈ కవితలోని గొప్పదనము కవి,ప్రేమికుడు,పక్షి పరిశీలకుని మధ్య అభేదాన్ని దర్శించి మనతో దర్శింపజేయడం.ఈ కవిత అరసికులకు అర్థం కాదు.కొంత ఊహాశక్తి అవసరం.ఈ ఒక్క కవితతో కవివరేణ్యుడు నిస్సిం ఎజెకిల్ కీర్తి దిగంతాలను తాకింది.ఎన్నో సంకలనాల్లో ఈ కవిత చోటు చేసుకొంది.కవి పేరు చెప్పగానే అనేకులకు స్ఫురించేది ఈ కవితేనంటే ఈ కవితలోని ప్రత్యేకతను అర్థం చేసుకోవచ్చు.

ఈ కవితలోని ప్రతి వాక్యము అర్థవంతమే;కవిత రాయడం ప్రేమలో పడటంలాంటిదే.పక్షులను పరిశీలించడం లాంటిదే.ఎంతో ఓపిక కావాలి.నిశ్శబ్దం సరేసరి.ఒక్క శబ్దం చాలు అంతా సర్వనాశనం కావడానికి.అటువంటి ఎదురుచూపుల తర్వాతే జీవితాన్ని మెరుగు పెట్టే అర్థం స్ఫురించేది.అది ఇంద్రియాలకు అతీతమైనది. చదవగానే అర్థంకావాలి అనుకొనేవారు కవిత్వం జోలికి పోకూడదు.దినపత్రికలు చదువుకుంటే చాలు.లోతులేని వ్యక్తిని అర్థంచేసుకోవడానికి పెద్దగా శ్రమించనక్కర లేదు.కానీ,అటువంటి వ్యక్తి జీవితకాలస్నేహానికి అనర్హుడు.కవిత్వం చివరిదాకా మనతో ఉండే వస్తువు.కాబట్టే,కేవలం శబ్దచాతుర్యం ప్రదర్శించే వాడు కవికాదు.గడెక్కి సాముచేసే దొమ్మరి.వినోదం కలిగిస్తాడు. కానీ,ఆత్మను తాకే శక్తి వాడికి లేదు.ఒక మహార్థాన్ని నిక్షేపించనిది కవి కాలేడు. ఒక మంచి కవిత చదివాక కవైనా ,పాఠకుడైనా ఎంతోకొంత మారతారు.ఆ మార్పు అంత తేలికగా ఎఱుకలోకి రాకపోవచ్చు. మీలో సున్నితత్వం ఉంటే ఈ కవిత ఆహ్లాదకరమైన మార్పును తీసుకురాగలదు ( కవిత్వం చేసే పనే అది).

కవి,ప్రేమికుడు..
పక్షులనైనా,పడతులనైనా పరిశీలించేవాడు
వడివడిగా సాగిపోరాదు,నిశ్చలంగా
ఒక్కచోటే నిలిచిపోరాదు.
సత్కవులు సరైన పదం కోసం పడిగాపులు పడతారు
పసందైన పక్షివెంట పడిపోవడం కాదు వేట..
ఒక పిరికి పిట్ట రెక్క కదలిక కనిపెట్ట
ఓపికతో,ఓరిమితో వేచి చూసే
ప్రేమే,వేట..వెదుకులాట..
తాను ప్రేమించబడుతున్నానని తెలుసుకున్న తరుణి
ఏమాత్రమిక ఎదురుచూడక-
తెగించి లొంగిపోయేదాకా..
తన కల నిజమవడం కనుగొంటాడు కవి ఇందులో
తన తలపులు కదిలిపోక ముందెపుడూ
పెదవులు కదపని వాడు
ఏదో విధంగా-
మంద గమనం మరింత మేలు చేస్తుందనిపిస్తుంది
అరుదుగా అగుపించే పక్షులను పరిశీలించడానికి
నిర్మానుష్యపు దారుల వెంట
నిశ్శబ్దంగా పారుతున్న నదుల వెంటా
హృదయపు చీకటినేల వంటి కంటకమయమైన
సుదూర తీరాల వెంట…
నీవు సాగిపోవలసి ఉంటుంది
నెరజాణలో నెమ్మదిగా మార్పు గుర్తిస్తావక్కడ
ఎటో తెలియని ఎడ తెగని
ప్రయాణంలో,కనుమరుగైన కవులకు
మాంసమూ,ఎముకలే కాదు
కాంతి వలయము కనిపిస్తుంది
అర్థము అగుపిస్తుంది
అక్కడ బధిరుడు వినగలడు
అంధుడు కనగలడు.

ఆంగ్లమూలం:నిస్సిం ఎజెకిల్
అనువాదం:ఇ.రేణుకా దేవి.

కవిత ఆంగ్ల మూలాన్ని ఇక్కడ వినవచ్చు.

You Might Also Like

8 Comments

  1. ramanarsimha

    Sir,

    I cld nt understand anyth..

    sorry..

  2. తమ్మినేని యదుకుల భూషణ్

    ఒక గొప్పకవిత నిస్సందేహంగా కొంత ఎత్తులో ఉంటుంది. అందని ద్రాక్ష పులుపు అనేవారే ఎక్కువ.నిస్సిం ఎజెకిల్ కవిత్వ పఠనానుభవంలో భాగస్వాములైన అందరికీ అభినందనలు. సౌమ్యా,పసందైన పక్షివెంట పడిపోవడం కాదు వేట చాలా లోతైన వాక్యం.

    ఆరిగారు, మీ ఉత్తరం చదివాక ఇంకా కొన్ని మంచి కవితలను పరిచయం చేయవచ్చు ననిపించింది.ఉదాహరణకు walter de la mare రాసిన , The Listeners కవిత.

    కొందరు కవులు కేవలం ఒక్క కవితతో తాము ఏపాటి కవులమో ప్రపంచానికి చెప్పకనే చెబుతారు.అటువంటి కవితలంటే నాకు చాలా ఆసక్తి.కవులందరూ తాము చనిపోయేలోగా కనీసం ఒక్క కవితను నిర్దుష్టంగా రాయాలని ప్రతిజ్ఞ చేసుకోవాలి.అప్పుడు వీటితో సరితూగగల కవితలు మనభాషలో కూడా వస్తాయి. గతంలో రాలేదు అనికాదు;వార్తలకు కవితలకు మధ్య సరిహద్దురేఖ రోజురోజుకు చెరిగిపోవడం మన తెలుగులోనే సాధ్యం.ఈ పరిస్థితినుండి బయటపడే మార్గం అందరూ ఆలోచించాలి.

    రావుగారు,మీరు ఉదహరించిన కవిత చాలా బలమైనది.

    “We are not made for love alone, my love”

    మొదటి వాక్యంతోనే పాఠకులను నిరాయుధులుగావించడం నిస్సిం ఎజెకిల్ కే చెల్లింది.కవిత మనలో తాత్విక కాంక్షను రగిలించాలంటాడు కవిత్వ దేశికుడు, రష్యన్ మహాకవి బ్రాడ్‌స్కీ. (ఆ గుణమే వచనంనుండి కవిత్వాన్ని వేరుచేసేది)నిస్సిం ఎజెకిల్ ఈ విద్యలో నిష్ణాతులని ఆయన కవితలనేకం నిరూపిస్తాయి.

    తమ్మినేని యదుకులభూషణ్.

  3. C.S.Rao

    A great poem doesn’t spring from a feeting emotion. Sri Yadukula Bhushan has rightly emphasized the importance of explorative patience in a sort of meditative silence from which emerges slowly a great poem. Then it lends a new dimension to our understanding of life hitherto unrealized.’Poet, Lover, Birdwatcher’ is such a great poem.

    Of the Indo-anglian poets of the seventies surely does Ezekiel impress us as having a patriarchal image more than anybody else.There is an another beautiful poem by him ‘And God Revealed.’ The final stanza there very well expresses the enormity of human predicament, the multitudinous complexity of human predilictions and obligations.

    The stanza referred to is this:
    ‘We are not made for love alone, my love,
    Although our flesh and bones would have it so.
    A thousand small intricacies of brain
    Hold my blood streams captive which will not flow
    Freely to serve the ends of love, untill
    They know the various ways of men
    The soul in solitude, and God revealed.’

    Please note the profound tenderness mingled with a certain anguish in the words of the first line!

    Congratulations to Sri Yadukula Bhushan on his thoughtful interpretation of the poem “Poet,Lover,Birdwatcher”.

    C.S.Rao

  4. kcubev

    కవిత్వం పరమార్థం అలౌకికాన౦దమైతే ఈ కవిత బాగుంది.

  5. ari sitaramayya

    భూషణ్ గారూ, ఈ కవిత బాగుంది. మీ పరిచయం ఇంకా బాగుంది. కవిత్వం గురించి అంతగా తెలియని నాకైతే మూలం కంటే అనువాదమే అందంగా ఉందనిపించింది. ముఖ్యంగా మొదటి భాగంలో. మీరు ఇలాంటి మంచి కవితలను పరిచయం చేస్తూ ఉంటారని ఆశిస్తూ…

  6. సౌమ్య

    “పసందైన పక్షివెంట పడిపోవడం కాదు వేట..
    ఒక పిరికి పిట్ట రెక్క కదలిక కనిపెట్ట
    ఓపికతో,ఓరిమితో వేచి చూసే
    ప్రేమే,వేట..వెదుకులాట..”
    -Wow!

Leave a Reply