రెండు పుస్తకాలు

పైకి చూస్తే ఈ రెండు పుస్తకాల మధ్య పెద్ద తేడా కనబడకపోవచ్చు. కానీ, నా మటుకు నాకైతే, రెండింటినీ కలిపే దారం ఒకటుంది. అదే – మనిషి లో ఉన్న పోరాట పటిమ. ఒక పుస్తకంలోని కథల్లో ఇది విజయాల రూపంలో పైకి కనిపించే పటిమ. మరొకదానిలో ఇది నిస్సహాయ పరిస్థితుల్లో కూడా పరిస్థితులకి ఎదురొడ్డి నిలుస్తున్న మనుషుల పోరాట పటిమ. ఈ రెండో పుస్తకం లోని హీరోలకి జనమంతా జయహోలు కొట్టేంత పెద్ద పెద్ద విజయాలు ఉండకపోవచ్చేమో. కానీ, నిజానికవి వారి పరిధుల్లో పెద్ద విజయాలే. మనక్కనబడవు – హర్ష్ మండర్ లాంటి వాళ్ళు వచ్చి చెప్పేవరకు.

నేను మాట్లాడుతున్న రెండు పుస్తకాలు : stay hungry, stay foolish మరియు “unheard voices”. మొదటి పుస్తకం రచయిత – జామ్ మేగజీన్ సంపాదకురాలు రష్మి బన్సల్. రెండో పుస్తకం రచయిత ఒకప్పటి ఐఏఎస్ అధికారి హర్ష్ మండర్. ఈ రెండు పుస్తకాల మధ్య ఇలా సంబంధం ఎందుకు తోచింది నాకు? అంటే నేను చెప్పగలిగే కారణం ఒకటే. బహుశా నేను ఈ రెండు ఒక దాని తరువాత ఒకటి చదవడం వల్ల నాకలా అనిపించి ఉండవచ్చు. నిజంగా వీటి మధ్య సంబంధం ఉందా లేదా అన్నది పక్కన పెడితే, వ్యక్తిగత దృక్కోణాల సంగతి చెప్తున్నా – నాకలా అనిపించింది. అంతే.

మొదటి పుస్తకం : ఐఐఎం-అహ్మదాబాద్ పూర్వ విద్యార్థుల్లో వ్యాపారవేత్తలుగా పేరు తెచ్చుకున్న వారి గురించి.
రెండో పుస్తకం : పేరుకి తగ్గట్లే, సాధారణంగా కోట్ల కొద్దీ జనాభా లో మరుగున పడిపోయి, వినబడని సామాన్యుడి కథలు – ఇక్కట్లు-జీవితం.

మొదటి పుస్తకంలో అందరూ నడిచిన దారి నాకొద్దని కొత్త దారులు వెదికి, అలా మార్గదర్శకులైన వారి కథలు స్పూర్తి ని కలిగించాయి. రెండో పుస్తకంలో పరిస్థితులకి ఎదురీది, ఒడిదుడుకలను అధిగమించిన సామాన్యుల కథలు.

stayhungry“stay hungry, stay foolish” లో ఉన్న కథలన్నీ దాదాపు – ఉలిపికట్టె కథలే. ఒక్కో కథలోనూ ప్రోగ్రెస్ ని అంచెలంచెలుగా చూపించిన విధానం చాలా బాగుంది. అలాగే, ప్రతి కథ చివరా ఆ మనిషి young enterpreneurs కి ఇచ్చే సలహాలు, సూచనలు – అంతా పద్ధతిగా అమర్చబడ్డ కథలు ఇవి. అలాగే, ఎంపిక చేసుకున్న ఇరవై ఐదు మందీ కూడా రకరకాల నేపథ్యాల వారు, భిన్న తరాల వారు. వారు మొదలుపెట్టిన పనులు కూడా రకరకాలు. ఎక్కడి మేక్ మై ట్రిప్, ఎక్కడి ఆర్కిడ్స్ ఫార్మా, ఎక్కడి ఏకలవ్య ఫౌండేషన్, ఎక్కడి బేసిక్స్ (basix)? ఏమన్నా సంబంధం ఉందా? ఉంది. తాము చేద్దామనుకున్న దాని పై నమ్మకం, passion. పుస్తకాన్ని మూడు భాగాలుగా విభజించారు – “The believers” (People who knew entrepreneurship was the Chosen Path), “The oppurtunists” (These entrepreneurs did not plan to take this path but when opportunity knocked they seized it.) and “The Alternate vision” (Social Enterpreneurship) – అని. దీని వల్ల పుస్తకాన్ని మరింత బాగా అందించగల్గారు అని నాకు అనిపించింది.

Unheardvoices“unheard voices” చదువుతున్నప్పుడు ఒక్కోచోట విపరీతమైన ఫ్రస్ట్రేషన్ కలిగింది. ఎందుకిలా సిగ్గులేకుండా ప్రవర్తిస్తారు మనుషులు? అని. ముఖ్యంగా, సినిమాటిక్ గా ప్రతి చోటా విలన్లతో పోలీసులు కుమ్మక్కౌతున్నప్పుడు. అయితే, ఒక పక్క ఈ చిరాకు, కోపం, నిస్సహాయత చుట్టుముడుతూ ఉన్నా కూడా, ఇక్కడ బాధితులు స్పందించిన తీరు – స్పూర్తిదాయకం. సమస్య వ్యక్తిలో కాదు, వ్యవస్థలో – కానీ, వ్యవస్థ అంటే ఎవరు? వ్యక్తులే కదా? ఈ పుస్తకం చదువుతున్నప్పుడే హర్ష్ మండర్ గురించి మరింతగా తెలుసుకున్నాను. ఇంతకు ముందు, పత్రికల్లో అప్పుడప్పుడు కనబడే వ్యాసాలు తప్ప ఈ మనిషి ఎవరో నాకు తెలీదు. అలాగే, మన చుట్టూ ఉన్న ప్రపంచం లోనే మనకు తెలీని ప్రపంచాన్ని గురించి, దాని లో కూడా ఊపిరి పీల్చే, రక్త మాంసాలున్న మనలాంటి వారే ఉన్న సంగతి ని అప్పుడప్పుడు గుర్తు చేసి, సంఘం పట్ల మనిషన్నాక కొన్ని బాధ్యతలు ఉంటాయని చెప్పే ఇలాంటి పుస్తకాలు చదవడం తప్పనిసరి అనిపిస్తుంది. అలాగే, క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎదురొడ్డి నిలిచి, ఒక్కోసారి గెలిచే వారి కథలు – స్పూర్తిదాయకమే కదా…

రెండు ఎందుకు ఒకేలా అనిపించాయి? రెండూ మనుషుల గురించి కనుక. రెండూ మనుషులలోని పోరాట పటిమ ని చూపాయి కనుక. రెండింటిలోనూ స్పూర్తిని రగిలించే హీరోలు ఉన్నారు కనుక. రెండూ నాకు జీవితాన్ని better light లో చూడడానికి ఉపకరించాయి కనుక. రెండింటిలోనూ ఒక విధంగా – మనిషే నిజమైన హీరో (మానవుడే మహనీయుడు అనమాట) అని మళ్ళీ నిరూపితమైంది కనుక. Random గా ఒక్కో కథా చదువుతూ వచ్చాను రెండింటిని చదివినప్పుడూనూ. అందువల్ల నిజంగా రెండు పుస్తకాల్లోని అన్నీ కథల్నీచదివేశానా? అంటే చెప్పలేను. చాలా మటుకు పూర్తి చేశాను అని మాత్రమే చెప్పగలను. అయితే, రెండూ తప్పక చదవవలసిన పుస్తకాలు. ఎందుకంటే, ఇవి నిజం హీరోల కథలు కనుక.

పుస్తకాల వివరాలు:
Stay Hungry, Stay foolish – by Rashmi Bansal (Flipkart లంకె ఇక్కడ.)
Unheard Voices – by Harsh Mander (Flipkart లంకె ఇక్కడ).

You Might Also Like

3 Comments

  1. శ్రీనిక

    పరిచయం చాల బాగుంది.మీరిచ్చిన లింకులు ఉపయు్క్తంగా ఉన్నాయి.

  2. కొత్తపాళీ

    ఈ రెండు పుస్తకాలకీ మీరిచ్చిన వ్యక్తిగత పరిచయం చాలా బావుంది. పుస్తకాలు చదవాలనిపించేలా ఆకర్షితున్నది.

  3. uday

    I read Ur feeling about two books….Real Ur correct….where is our ideas going on….why we are changing day by day… why we are not like today….changing changing ….we want to change our thoughts & ideas…Denikosam Manam Emm cheyyali aneedi …. I will tell U later….

Leave a Reply