నిద్రిత నగరం – ఒక స్వాప్నిక లోకం

రాసి పంపిన వారు: భైరవభట్ల కామేశ్వరరావు

(డా. వైదేహి శశిధర్ గారికి ఇటీవలే ప్రచురితమైన కవితాసంపుటి “నిద్రత నగరం” కు ఈఏటి ఇస్మాయిల్ అవార్డ్ ప్రకటించిన సందర్భంగా ఈ పరిచయ వ్యాసం. అవార్డు పొందినందుకు వైదేహి గారికి పుస్తకం.నెట్ బృందం తరపునుండి అభినందనలతో…)

***********************
nidritaఉరకల పరుగుల జీవితంలో, అప్పుడప్పుడూ ఒక్కసారిగా, ఏదో తెలియని అలసట మనసుని ఆవరిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మంచి కవిత్వం మనసుని సేద దీరుస్తుంది. బతుకులోని చిన్నచిన్న ఖాళీలని పూరిస్తుంది. అలాంటి మంచి కవిత్వం డా. వైదేహి శశిధర్ గారి నిద్రిత నగరంలో దొరుకుతుంది. ఇది మనలని స్వప్నలోకంలోకి తీసుకువెళ్ళే కవిత్వం. విశేషం ఏమిటంటే ఆ స్వప్నలోకం ఏదో అభూతకల్పనా లోకం కాదు. మన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచమే.

“ఎవరో చిత్రకారుడు ఆకాశపు కాన్వాస్‌పై
నారింజ పసుపు కెంజాయ ఎరుపు
రంగులను ఓపికగా చిత్రిస్తున్నప్పుడు
ఓ దానిమ్మ బుగ్గల చిన్ని పాప
నల్లని రంగులో కుంచెను ముంచి
కాన్వాస్‌పై విదిలించినట్లు
రంగురంగుల ఆకాశం మీద
చీకటి అక్కడక్కడ పరచుకుంది.”

ప్రతిరోజూ వచ్చే రాత్రే. ఇలా ఎప్పుడైనా మనకి కనిపించిందా? ఇది కవిత్వానికుండే ప్రత్యేక దృష్టి. ఈ చూపుకి సరితూగే పలుకు తోడైతే మన కళ్ళ ఎదుట స్వప్నలోకాలు ఆవిష్కరించ బడతాయి. రోజూ చూసే ప్రపంచమే మనకి కొత్తగా కనిపిస్తుంది. లేకపోతే, రోజంతా త్రాఫిక్ జోరుతో ఉక్కిరిబిక్కిరయ్యే ఉక్కునగరంలో నిద్రితమైన సౌందర్యాన్ని యిలా ఎవరు చూడగలరు?

“అలసిన కన్నులలో స్వాప్నిక చంద్రికల్ని నింపుకున్న విశాఖ
నిద్రని మేలిముసుగులా తన ముఖం మీద కప్పుకుంది.”

మనోజ్ఞమైన ఊహలు. సౌకుమార్యం సౌందర్యం లాలిత్యం పెనవేసుకున్న పదాలు. వెరసి, హృదయాన్ని మెత్తని గులాబీ రేకులు సున్నితంగా తాకిన అనుభూతిని మిగిల్చే కవిత్వం.

“ఏ హరిణనయన చేతి అమృతభాండం లోంచి తొణికిన వెన్నెలో
సముద్రం మీద చెల్లాచెదరైన ముత్యాలసరంలా పరచుకుంది.”

అన్న వాక్యాలు చదివినప్పుడు సముద్రపొడ్డున గడిపిన పున్నమి రాత్రుల జ్ఞాపకాలు అప్రయత్నంగా మనసులో వెన్నెల పరచుకున్నట్టు పరచుకుంటాయి. మాటల రంగులతో వైదేహిగారు గీసే వర్ణవర్ణ పద చిత్రాలు మన మనసుల్లో చెరగని ముద్రలు వేస్తాయి. ఉదాహరణకి ఇది చూడండి:

“ఏటవాలుగా రెక్క విప్పిన నీటికొంగలా
మధ్యాహ్నం ఏటిపై నెమ్మదిగా పరుచుకుంటుంది.
రాత్రివానలో రాలిన స్వప్నాలని నెమరువేస్తూ
ధ్యానముద్రలో మునిగిన యోగుల్లా
పూర్తిగా తడి ఆరని జటాజూటాలతో
చెట్లు ఒంటికాలిపై నిశ్చలంగా నిలబడతాయి.”

అలాగే, “మళ్ళీ తిరిగి వచ్చే వరకూ నీవు నా జడలో చిక్కుకున్న జ్ఞాపకాల జాజిదండవై పరిమళిస్తూ ఉంటావు” అన్నా, “అప్పుడప్పుడూ ఏదో అవ్యక్తమైన భావం పావురాయి రెక్కల చప్పుడై గుండెగోడలపై ప్రతిధ్వనిస్తుంది” అన్నా, ఆ పోలికలు మనలో ఒక అవ్యక్తానుభూతిని రేపుతాయి.

ఆధునిక కవిత్వంలో ముఖ్య లక్షణం ఒకటుంది. మనిషి సామాజికంగాకాని వ్యక్తిగతంగా కాని, తను కోల్పోయిన కోల్పోతున్న లేదా తనకి లభించని విషయాల గురించిన ఆర్తి ఆవేశం అంతర్మధనం లేదా ఆశ, ఈ కవిత్వంలో ప్రధానంగా ప్రతిఫలిస్తుంది. ఈ దృష్టితో పరిశీలిస్తే, వైదేహిగారి కవిత్వంలో ముఖ్యంగా కనిపించేది ప్రకృతికి దగ్గరవ్వాలన్న ఆకాంక్ష. స్వచ్ఛమైన ప్రకృతి అందించే అనుభూతిని తనివితీరా ఆస్వాదించాలన్న తపన. అందుకే వీరి కవిత్వంలో అడుగడుగునా, “నందివర్ధనం పువ్వులా విచ్చుకుని స్వచ్ఛంగా నవ్వే ఉదయాలు”, “మొగలిపొదలలా చురుక్కున గుచ్చుకునే మధ్యాహ్నాలు”, “గుల్మొహర్లా పూచిన సాయంత్రాలు”, “నల్లకలువలా విరిసిన రాత్రులు” మనకి కనిపిస్తాయి. వసంతం, వర్షం, హేమంతం ఇలా అన్ని ఋతువుల సౌందర్యం మనకి దర్శనమిస్తుంది.

ప్రకృతి ఆరాధన తర్వాత, వైదేహిగారి కవిత్వంలో కనిపించే మరో ముఖ్యమైన అంశం – సున్నితమైన మానవ సంబంధాలు.

“ఎవరికి వాళ్ళమే ఓపిగ్గా నిర్మించుకున్న
మన వేరు వేరు ప్రపంచాలు
సరిగ్గా ఎప్పుడు సరిహద్దుల్ని
చెరిపేసుకుని ఒద్దిగ్గా ఒక్కటయ్యాయో”

సాహచర్యానికి ఇచ్చిన యీ నిర్వచనం ఎంత గొప్పదో కదా!

అమ్మ అస్వస్థతకి గురైనప్పుడు, తను చదివిన వైద్య విజ్ఞానం, పొందిన ఆత్మ విశ్వాసం ఇవేవీ కూడా మనశ్శాంతిని ఇవ్వనప్పుడు, దృశ్యాదృశ్యమైన ఆమె బేలతనం, వేల మైళ్ళ దూరాన్ని దాటి, ఆమె తండ్రి హృదయాన్ని చెమ్మగిల్లిన కంఠమై తాకిందట. అప్పుడు,

“అమ్మా,
ఇన్నాళ్ళూ నా బలం నువ్వనుకున్నాను
ఇప్పుడే తెలిసింది
నా బలహీనత కూడా నువ్వేనని”

అని అంటారావిడ.

ఈ సంకలనంలో అన్నిటికన్నా నాకు నచ్చిన కవిత “నేను”.

“నా చుట్టూ గడ్డ కడుతున్న నిశ్శబ్దం చూసి
నాలో నేనే నవ్వుకుంటాను.”

అని మొదలయ్యే యీ కవిత, ఏవో అస్పష్ట భావల గుసగుసలతో, జ్ఞాపకాల రెపరెపలతో సాగి,

“నేను నా ఆలోచనల తుది మొదలుల అన్వేషణలో
అప్రయత్నంగా కాలపు అగాధంలోకి జారిపోతాను.”

అంటూ ముగుస్తుంది. ఈ సంపుటిలో ఉన్న కవితలన్నిటికన్నా కొంత విలక్షణమైన కవిత ఇది. నాలోకి నేను ఎప్పుడైనా తొంగి చూసుకోవాలనుకున్నప్పుడల్లా ఈ కవితని చదువుకోవడం మొదలుపెట్టాను. అందుకే ఇది నాకన్నిటి కన్నా నచ్చిన కవిత.

మొత్తమ్మీద ఈ పుస్తకం చదివిన వెంటనే కలిగిన అనుభూతిని రెండు మాటల్లో చెప్పాలంటే, మళ్ళీ వైదేహిగారి కవిత్వమే అక్కరకి వస్తుంది:

“ఏదో గారడీ లాంటి మైకం కమ్మి
గమ్మత్తైన నవ్వు చెమ్మగిల్లిన కళ్ళలో
వింతగా మెరుస్తుంది”

మరొక్క మాట. ఈ పుస్తకాన్ని ఏకబిగిన ఒకేసారి కాకుండా, అప్పుడప్పుడు, అక్కడక్కడ చదువుకుంటే మరింత బాగుంటుందన్నది నా అనుభవం.

ఇది వైదేహిగారి మొదటి పుస్తకం. వీరి కవిత్వం మున్ముందు మరింత చిక్కబడుతుందని ఆశిస్తున్నాను. ముఖ్యంగా, వీరు చేసే పోలికల్లో మరింత పొదుపు సాధిస్తే, పాఠకులు ఆ జడివానలో ఉక్కిరిబిక్కిరి కాకుండా కవిత్వాన్ని మరింత గాఢంగా అనుభవించే వీలు కలుగుతుంది. అలాగే వారి అభిమాన కవి తిలక్ ప్రభావం చాలానే కనిపిస్తుంది. “జ్ఞాపకాలు” అన్న కవితలో అయితే మరీను! తొలి ప్రయత్నంగా ఇది వైదేహిగారి కవిత్వానికి అందాన్నే ఇస్తోంది. కాని అది మరీ ఎక్కువ కాకుండా జాగ్రత్త పడితే, వారిలోని విలక్షణత మరింతగా మెరుస్తుంది.

వైదేహిగారికి భాష మీద చక్కని అధికారం ఉందనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయినా ఒకటి రెండు చోట్ల “స్వాంతన” లాంటి భాషా దోషాలు, నాలాంటి పరమ చాదస్తులకి పంటి కింద రాళ్ళల్లా తగిలాయి. వీటిని తర్వాతి ముద్రణలలో సవరించాలని నా మనవి.

ప్రతి సంవత్సరం ఉత్తమ కవిత్వానికి గురింపుగా తమ్మినేని యదుకుల భూషణ్ గారి ఆధ్వర్యంలో 2005 సంవత్సరం నుండీ ఇస్మాయిల్‌గారి పేరు మీద పురస్కారాన్ని ఇస్తున్నారు. ఈ ఏడాది ఆ పురస్కారం “నిద్రిత నగరం” కవితా సంపుటికి గాను వైదేహిగారికి లభించడం ఆనందకరమైన విషయం. ఈ సందర్భంగా వారికి నా హృదయపూర్వక అభినందనలు.

పుస్తక వివరాలు:

“నిద్రిత నగరం”
కవయిత్రి: డాక్టర్ వైదేహి శశిధర్
వెల: Rs50, $5


For Copies:

Navodaya Book House, Kachiguda, Hyderabad
Mythri Book House, Jaleel Street, Arundalpet, Vijayawada – 2
Mani Book House, Sunday Market, Nellore

All Branches of Visalandhra & Prajasakti

You Might Also Like

4 Comments

  1. పుస్తకం » Blog Archive » 2010లో చదివిన తెలుగు పుస్తకాలు

    […] నిద్రిత నగరం – వైదేహి శశిధర్: ఆ శీర్షికే సగం పడిపోయాను నేను. నేను పుట్టి పెరిగిందంతా నగరం కావటంతో, నాకు నగరం అంటే ఆప్యాయత ఎక్కువ! ఇహ, బాగా రాత్రయ్యాకో, లేక ఇంకా భానుడు నిద్ర లేవకముందే నగరాన్ని చూడాలంటే నాకు మరింత ఇష్టం. కవిత్వం గురించి చెప్పటానికి నాకు చేత కాదు.  వీణ తీగలను మీటినప్పుడు వెలువడే శబ్దాన్ని విని పులకరించటం మాత్రమే  నాకు చేతనవుతుంది. నాకు ఇంకోటి కూడా బాగా చేతనవుతుంది. ఇలాంటి రచనలు ఎప్పుడు ఎక్కడ చదవాలి అన్న విషయాలు ఎంపిక చేసుకోవడం. కూర్గ్ లో కావేరీ నది ఒడ్డున ఊయల్లో పడుకొని, ఇలాంటి కవిత్వం చదివితే ఉంటుంది చూడండీ… ఆహ! నేను ఎందుకు చెప్పటం.. మీరూ ప్రయత్నించండి. […]

  2. పుస్తకం » Blog Archive » 2009 – పుస్తక నామ సంవత్సరం

    […] శివారెడ్డి ‘ఆమె ఎవరైతే మాత్రం‘ వైదేహీ శశిధర్‌ ‘నిద్రిత నగరం’ నామాడి శ్రీధర్‌ ‘బంధనఛాయ’. […]

  3. వైదేహి శశిధర్

    కామేశ్వర రావు గారూ,
    సంస్కృతాంధ్రాలలో పాండిత్యం,సాహిత్యం లో గొప్ప అభిరుచి,సాధికారిత ఉన్న మీరు నా కవితా సంకలనంపై సహృదయతతో చేసిన సమీక్షకి చాలా సంతోషం.
    మీరు చేసిన సూచనలు పూర్తిగా పాటించదగినవి.ధన్యవాదాలు

    అబినందనలు తెలిపిన పుస్తకం.నెట్ సంపాదక బృందానికి నా కృతజ్ఞతలు.

    సౌమ్యా, నా కవిత నీకు నచ్చినందుకు సంతోషం.
    కృతజ్ఞతలు.
    వైదేహి శశిధర్

  4. సౌమ్య

    “నిశబ్దం నీకూ నాకూ మధ్య” మొదట ఈమాటలో చదివినప్పటి నుండి ఇప్పటిదాకా ఎన్నిసార్లు చదివానో!
    వైదేహి గారికి అభినందనలు.

Leave a Reply to పుస్తకం » Blog Archive » 2010లో చదివిన తెలుగు పుస్తకాలు Cancel