ప్రసవమయ్యేకా నర్సు పని…. : అఫ్జల్ గంజ్ లైబ్రరీలో

రాసి పంపిన వారు: నరేష్ నందం
***************************
ఈమధ్య ఓరోజు ఎప్పట్నుంచో వెళ్లాలనుకుంటున్న సెంట్రల్ లైబ్రరీకు అనుకోకుండా వెళ్లాను. కోఠీలో చలం పుస్తకాలు కొనుక్కుని,ఇ.సి.ఐ.ఎల్. బస్ కోసం అఫ్జల్‌గంజ్ వెళ్లాం, నేనూ నా మిత్రుడు. అప్పటికే సాయంత్రం నాలుగైంది. రూంకి వచ్చి మాత్రం చేసేదేం ఉందంటూ పక్కనే ఉన్న సెంట్రల్ లైబ్రరీలోకి వెళ్లాం.

దాదాపు 120 సంవత్సరాల చరిత్ర ఉన్న ఒకప్పటి “ఖుతుబ్ ఖానా అసఫియా” గత కాలపు వైభోగాన్నంతా నెమరువేసుకుంటూ కూర్చున్నట్లుంది.

మెట్లెక్కి పైకి వెళ్లాక ఎడమ వైపున ఉన్న ద్వారంగుండా లోపలికి ప్రవేశించాం. మా దగ్గర అప్పటికే ఉన్న పుస్తకాలను అక్కడి సెక్యూరిటీకి అప్పగించి టోకెన్ తీసుకున్నాం. లోపలకు అడుగుపెట్టగానే రిజిస్టరులో సంతకం చేసి ఎదురుగా కనిపించిన ఉద్యోగిని పలకరించాం “తెలుగు పుస్తకాల సెక్షను ఎక్కడండీ?” అని. “అక్కడినుంచీ కుడి వైపు ఉంది చూడండి” అని చెప్పారాయన. తెలుగు పుస్తకాల సెక్షనులో చూస్తే తెలిసింది ఎప్పటివో ఆ పుస్తకాలు. చాలా పాతవీ, ఎప్పుడూ వినటమే కానీ చూడనివీ.. వాటితో పాటూ కొత్త పుస్తకాలూ.. వర్గీకరించి ఉన్నాయి. అన్నిపుస్తకాలనూ తరచి చూశాం కాసేపు. ఇంతలో ఎన్. తారక రామారావు గారి పుస్తకం ఒకటి కనిపించింది. రంగస్ధలం పై నటన గురించి. ఎన్‌టీఆర్ ఎప్పుడు రాశారో ఆ పుస్తకం అనుకున్నాను. అంకితం చూస్తే “రామ సీత” గారికి అని ఉంది. అప్పుడే అర్ధం అయింది ఆ తారక రామారావు గారు వేరొకరని. మా మితృడికి ఆ పుస్తకం ఇచ్చాను. ఎన్‌టిఆర్ రాశారు అని. కాసేపటికి అర్ధమయింది తనకి కూడా.

బాపు రమణీయం సిరీస్‌లో ఒక పుస్తకం, కిర్గిస్తాన్ రచయిత చింగీజ్ ఐత్‌మాతోవ్ రాసిన “జమీల్యా” తీసుకుని చదవటం మొదలు పెట్టాను. జమీల్యా 94పేజీల పుస్తకం. చదవటానికి సుమారు రెండు గంటలు పట్టింది. ఈలోపు టీ అమ్మే అతను వచ్చారు. ఒక టీ తాగి పుస్తకం చదివే లోపే మా మితృడు గోల మొదలుపెట్టాడు, వెళ్దామా అని. జమీల్యా పూర్తిగా చదివి లేచాను.

వచ్చేముందు ఆ లైబ్రేరియన్‌ను ఇంటర్వ్యూ చేద్దామా అని అడిగాను మిత్రుడిని. చేద్దాం అనుకున్నాక లైబ్రేరియన్ ఉన్న గదిలోకి వెళ్లాం.

ఆ గదిలో టేబుళ్ల మీద వరుసలుగా పుస్తకాలు. ఆ పుస్తకాల కుప్పల వెనుక అసిస్టెంట్ లైబ్రేరియన్ శ్రీ. కోదాటి యశోధర్ గారు, మరో ఉద్యోగినితో కలిసి ఆ పుస్తకాలకు వరుస క్రమంలో నెంబర్లు ఇస్తున్నారు. మేము పలకరించాం. “లైబ్రేరియన్‌ని కలవాలి సర్” అన్నాం. “ఏం కావాలో చెప్పండి” అన్నారాయన. “ఈ లైబ్రరీ గురించి కొంచెం ఇంఫర్మేషను కావాలి” అన్నాం. “అంటే ఏం కావాలి?” ఓపికగా అడిగారు మళ్లీ. “ఈ లైబ్రరీలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి.. సభ్యులెంత మందీ ఇలాంటి వివరాలు..” అన్నాను. “మన రిజిస్టరులో చూస్తే తెలుస్తుంది సార్” అని ఆ మేడం అన్నారు. “కూర్చోండి” అని కుర్చీ చూపించి “ఎందుకు?” అన్నారు. మేము లైబ్రరీకి వచ్చిన క్రమమంతా చెప్పాం. పనిలో పనిగా పేరు మళ్లీ చెప్పి నా బిజినెస్ కార్డు ఇచ్చాను. “ఇక్కడ కాదు నా రూంలో మాట్లాడదాం పదండి” అని, పని ఆమెకు అప్పగించి తన ఆఫీసురూంలోకి తీసుకెళ్లారు.

“మీరు అడిగిన పుస్తకాల ఇంఫర్మేషను అదిగో” అంటూ టేబులు మీద ఉన్న చిన్న బోర్డు చూపించారు. అందులో లైబ్రరీలో ఉన్న పుస్తకాల సంఖ్య, ఆయా భాషల ప్రకారం వరుసగా ఉన్నాయి. మొత్తం 4,75,497. రాసుకోడానికి పేపరు వెతుక్కుంటుంటే ఆయనే ఇచ్చారు. “నేను చెప్తాను, మీరు రాసుకోక పోతే మర్చిపోతారు.” అన్నారాయన.

మేము: సుమారు ఐదు లక్షల పుస్తకాలున్నాయి కదా మీ దగ్గర.. ఇక్కడికి వచ్చే వాళ్లు ఎక్కువగా ఏ పుస్తకాలు చదువుతారు సర్?
యశోధర్: ఎక్కువగా క్లాసు పుస్తకాలేనండీ..

మేము: క్లాసు పుస్తకాలంటే ఏ క్లాసులవుంటాయి?
యశోధర్: డిగ్రీ, లా, ఇంజనీరింగ్, మెడిసిన్ ఇంకా కాంపిటీటివ్ ఎగ్జాంస్ పుస్తకాలు ఉన్నాయి.

మేము: క్లాస్ బుక్స్ అంటే సిలబస్ మారుతూంటుంది కదా..
యశోధర్: అవును.. కొత్త బుక్స్ ఎప్పటికప్పుడు తెప్పిస్తుంటాం..

మేము: మీకు కావాల్సిన బుక్స్ ఎలా తెప్పిస్తారు?
యశోధర్: మాకు బుక్స్ ప్రధానంగా.. ఫండ్‌తో కొనటం, ఎవరైనా గిఫ్ట్‌గా ఇవ్వటం, రిజిస్ట్రార్ ఆఫ్ పబ్లికేషన్స్ పంపేవి, కోల్‌కతాలొని రాజా రామ్మోహన్ రాయ్ ఫౌండేషన్ ద్వారా వస్తాయి. రీడర్స్ ఏవైనా బూక్స్ అడిగితే.. అవసరాన్ని బట్టీ.. దగ్గర ఉన్న ఫండ్‌ను బట్టీ తెప్పిస్తుంటాము.

మేము: మీరు పుస్తకాలకు ప్రాధాన్యత ఎలా ఇస్తారు?
యశోధర్: రీడర్స్ అడిగిన వాటిని లిస్ట్ చేసి మేము రిజిస్ట్రార్ ఆఫ్ పబ్లికేషన్స్ కి పంపిస్తాము. వాళ్లు ఉన్న ఫండ్‌ని బట్టి పుస్తకాలు కొంటారు.

మేము:
అంటే మరి మీరేమీ స్వంతంగా కొనరా?
యశోధర్: లేదు. పుస్తకాలు కొనటానికి మాకు పర్మిషన్ లేదు. ఏ పుస్తకాలు కొనాలన్నా మేము ఆఫీసుకు రిక్వెస్ట్ పంపిస్తే వాళ్లు కొనాల్సిందే. దీనితో ఎవరైనా ఏదైనా అర్జెంటు అవసరం అంటే ఏదైనా ఎగ్జాంకో ప్రిపేరవాలంటే మాత్రం ఆ టైముకి ఇవ్వలేకపోతున్నాం.

మేము: సిలబస్ మారినప్పుడు కొత్త పుస్తకాలు వస్తాయి కదా.. మరి పాత వాటిని ఏంచేస్తారు?
యశోధర్: అవికూడా ఉంచుతాం. ప్లేస్ సరిపోక పోతే మరో సెక్షనులో పెడతాం. అలా మా స్టాఫ్‌రూంలో కూడా పెట్టిన పుస్తకాలున్నాయి.

మాటలు మెంబర్‌షిప్ మీదకు వెళ్లాయి.

మేము: లైబ్రరీలో సభ్యత్వమెంత?
యశోధర్: సంవత్సరానికి నూటయాభై.

మేము: ఎంత మంది ఉంటారు మెంబర్స్?
యశోధర్: సుమారు యాభై వేల మంది..

మేము: రెన్యువల్స్ ఎంత మంది చేయించుకుంటారు?
యశోధర్: ఇది మాత్రం తక్కువగానే ఉంటుంది. వెయ్యి మంది చేయించుకుంటారేమో.

మేము: ఎందుకని అంత తక్కువ మంది?
యశోధర్: ముందు మెంబర్‌షిప్ తీసుకుంటారు. తర్వాత మర్చిపోతారు కొంతమంది. కొంత మందికి రావటానికి టైం ఉండదు. ఇంకొంత మంది వేరే చోటికి వెళ్లిపోవటమో లేక పోతే ఆసక్తి లేకపోవడమో.. ఇలా వేర్వేరు కారణాలుంటాయి.

మేము: మరి పుస్తకాలు ఇష్యూకి ఎలా ఇస్తారు?
యశోధర్: ఇష్యూకిచ్చే పుస్తకాలన్నీ నూటయాభై రూపాయలలోపే ఉంటాయి.

మేము: మరి అంత కన్నా ఎక్కువ కాస్ట్ ఉన్నవైతే.. డిపాజిట్ ఏమన్నా కట్టించుకుంటారా?
యశోధర్: ఎక్కువ కాస్ట్ ఉన్నవి ఇప్పుడే కొత్తగా వచ్చాయి. ఇంకా వాటి గురించి ఏమీ నిర్ణయించలేదు. ఎక్కువగా అవి ఇక్కడే రెఫరెన్సుకే ఉంటాయి. ఇంటికి ఇవ్వము.

మేము: మరి ఎవరైనా పుస్తకాలు తిరిగి ఇవ్వక పోతే?
యశోధర్: ముందు ఉత్తరాలు రాస్తాం, రెండొందల ఉత్తరాలు రాస్తే మొన్న నలుగురు తిరిగి ఇచ్చి వెళ్లారు. ఆ ఖర్చు కూడా భరించటానికి ఫండ్స్ ఉండావు. ఆఫీసు వాళ్ల పర్మిషనుతో మెంబర్‌షిప్ నుంచి తగ్గించుకుంటాం.

మేము:
మరి రిఫరెన్సు పుస్తకాలని ఎలా విభజిస్తారు?
యశోధర్: ఎక్కువ మందికి అవసరమయ్యే పుస్తకాలు, అరుదుగా దొరికేవి, ఇంపార్టెంటువీ రిఫరెన్సు పుస్తకాలుగా ఉంచుతాము.

మేము: రోజుకి ఎంత మంది వస్తారు లైబ్రరీకి?
యశోధర్: ఇది సరిగా చెప్పలేను. అసలైతే వచ్చిన వారంతా రిజిస్టరులో సంతకం చెయ్యాలి. కాని చాలా మంది చేయకుండానే వెళ్లి పోతారు. వాళ్లందరినీ వెంట పడి ఆడగలేము కదా సంతకం చేయమని? మొత్తం మీద 200-500 మంది వస్తారు.

మేము: లైబ్రరీ టైమింగ్స్ ఏంటి?
యశోధర్: మామూలు రోజుల్లో ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఉంటుంది. టెక్స్ట్ బుక్స్ సెక్షన్ మాత్రం రాత్రి పన్నెండు వరకూ ఉంటుంది. గురువారం శలవు.

టాపిక్ యశోధర్ గారి మీదకి మార్చాం. ఆయన అనుభవాలు తెలుసుకుందామనుకున్నాం.

మేము: మీరు ఎన్ని సంవత్సరాలుగా లైబ్రరీ డిపార్టుమెంటులో ఉన్నారు?
యశోధర్: 33సంవత్సరాలైంది. ఇంక రెండేళ్ల సర్వీసుంది.

మేము: ఇన్ని సంవత్సరాలుగా లైబ్రరీలో ఉన్నారు. మీ కెరీర్ ప్రారంభం నాటికీ, ఇప్పటికీ తేడా ఏం కనిపిస్తుంది?
యశోధర్: అప్పట్లో ఆడవాళ్లు ఎక్కువగా వచ్చేవారు. పుస్తకాలు తీసుకెళ్లేవారు. ఇప్పుడు వాళ్లూ బిజీగా మారారు. అప్పుడూ ఇప్పుడూ స్టూడెంట్సే ఎక్కువగా వస్తున్నారు. అదీకాక అప్పట్లో పర్సనల్ కాంటాక్ట్స్ ఉండేవి.

మేము: మరి మీకు అలా కాంటాక్ట్ లో ఉన్న వాళ్లెవరైనా ఉన్నారా?
యశోధర్: ఎందుకు లేరు? ఉన్నారు. కొంత మందైతే, నేను ఏ షిఫ్టులో ఉన్నానో కనుక్కుని మరీ అదే సమయంలో వస్తారు.

మేము: రీడర్స్ సరే.. లైబ్రరీ స్టాఫ్ సంగతేంటి?
యశోధర్: మా నాన్న గారు, కోదాటి నారాయణ రావు గారు, స్వాతంత్ర్యోద్యమంలో, గ్రంధాలయోద్యమంలో పనిచేశారు. నేను లైబ్రరీ డిపార్టుమెంటులో పనిచేస్తానని చెప్పినప్పుడు ఆయన చెప్పింది ఒకటే. “ఎవరైనా ఏదైనా పుస్తకం కావాలంటే, నువ్వు దాన్ని గురించి వాళ్లకి చెప్పేటట్లుండాలి, అందుకు ఆ పుస్తకాన్ని చదవాలి”, అని. నేను అలాగే చదివేవాడిని. ఇప్పుడు పనిచేసేవాళ్లకి అంత ఓపిక, తీరిక లేవు.

మేము: ఎంత మంది ఉన్నారు స్టాఫ్ ఇక్కడ?
యశోధర్: మొత్తం నూట ముప్ఫై మంది రెండు షిఫ్టులలో పని చేస్తారు. ఒక్కో షిఫ్టులో కనీసం అరవై మంది ఉంటారు.

మేము: ఇక్కడ ఇంటర్‌నెట్ కూడా ఉన్నట్లుంది?
యశోధర్: ఉంది. ఏడెనిమిది సిస్టంస్ ఉన్నాయి. గంటకి పది రూపాయలు చార్జి చేస్తారు.

మేము: ఈ లైబ్రరీ గురించి చెప్పండి.
యశోధర్: ఈ లైబ్రరీలో నిజాం కాలం నాటి పుస్తకాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ ఎవరైనా ఏదైనా కోర్టు కేసులుంటే వాటి గెజిట్స్ కావాలంటే ఇక్కడికి రావాల్సిందే. మాజీ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ కూడా ఈ లైబ్రరీ మెంబరు ఒకప్పుడు. ఇప్పటికీ ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, మాజీ ప్రెస్ కాడమీ చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వర రావు లాంటి వాళ్లు వస్తూనే ఉంటారు. ఎంతో మంది అప్పట్లో వచ్చేవాళ్లు ఉర్దూ, పార్సీ పుస్తకాలు చదువుకోటానికి వచ్చేవాళ్లు. ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది.

మేము: మరి ఇంత చరిత్ర ఉండీ, ఇన్ని పుస్తకాలుండీ ఎందుకు మీరు ప్రచారం చేయట్లేదు?
యశోధర్: ప్రచారం చేయటానికి నిధులు ఉండాలి కదండీ? ప్రభుత్వం ఇచ్చే నిధులు పుస్తకాలకే సరిపోతాయి, ఇక ప్రచారానికెక్కడా? పైగా మాకు ఖర్చు చేయటానికి పర్మిషన్ కూడా లేదు కదా..

మేము: మరి ఈ లైబ్రరీ గురించి మిగిలిన వాళ్లకి ఎలా తెలుస్తుంది?
యశోధర్: ప్రతి సంవత్సరం “గ్రంధాలయ వారోత్సవాలు” జరుపుతాం. ఆ సమయంలో కొన్ని స్కూళ్ల నుంచి పిల్లలు వస్తారు. అప్పుడే పుస్తకాల గురించి ఆలోచిస్తారు ఎవరైనా.

మేము: ఇంత చరిత్ర ఉన్న ఈ లైబ్రరీకి రావలసినంత ప్రచారం, ప్రాముఖ్యత రాలేదేమోనని అనిపిస్తుంది.
యశోధర్: ఈ లైబ్రరీని సినిమాలలో హైకోర్టు లా చాలా సార్లు చూపించారు. ఇక్కడ పుస్తకాలని చాలామంది రీసెర్చుకోసం వాడుకున్నారు. ఆ సినిమా వాళ్లు కానీ, ఈ పుస్తకాలు చదివి డాక్టరేట్లు తెచ్చుకున్న వాళ్లు కానీ ఒక్కరైనా ఈ లైబ్రరీ గురించి కానీ కృతఙతా పూర్వకంగా ఒక్క సారైనా ఎవరికైనా చెప్పారా? ఈ లైబ్రరీ పరిస్దితి “ప్రసవమయ్యేకా నర్సు పనిలా ఉంది” అవసరం తీరిన తర్వాత ఆ నర్సుతో పని ఉండనట్లే.. ఈ లైబ్రరీతో కూడా అవసరం తీరిపోతుంది. మళ్లీ ఎప్పుడో ఏ పుస్తకం రాసేటప్పుడో.. రీసెర్చికో అవసరమైనప్పుడు వస్తారు.

మేము: మీ బాధ అర్ధం చేసుకోదగినదేనండీ.. కానీ మన ప్రయత్నం కూడా చేయాలి కదా.. ఈ లైబ్రరీ గురించి నాకు నా ఫ్రెండు చెప్తేనే తెలిసింది. మేమిప్పుడు వస్తూన్నట్లే.. కొత్త వాళ్లు కూడా వస్తారు. కాకపోతే దీని గురించి జనంలో ఎక్కువ మందికి తెలిసేలా చేయాలి.
యశోధర్: అది ఒక్కరు చేస్తే చాలదండీ. అందరూ మనది అనుకొని చేయాలి.

మేము: అలాగే చేస్తారని అనుకుందామండీ. ఇక ఉంటాం.
యశోధర్: మంచిది.

ఈ లైబ్రరీ గురించి మరికొంత:

ఒకప్పుడు “అసఫియా లైబ్రరీ”గా పిలిచే ఈ సెంట్రల్ లైబ్రరీని నవాబ్ “ఇమాద్-ఉల్-ముల్క్” 1891లో నిర్మించారు.

మార్చి 31, 2009 నాటికి, ఈలైబ్రరీలో ఉన్న పుస్తకాలు:
తెలుగు – 155159
ఇంగ్లీషు – 152220
హిందీ – 49120
కన్నడ – 15134
అరబిక్, పార్శీ, ఉర్దూ – 84218
సంస్కృతం – 683
తమిళం – 1304

మొత్తం పుస్తకాలు – 475497.

చిరునామా:
స్టేట్ సెంట్రల్ లైబ్రరీ,
అఫ్జల్‌గంజ్,
హైదరాబాద్ – 500002.
Tel:+(91)-(40) – 24615621, 24600107

You Might Also Like

20 Comments

  1. srinivas bollapally goud

    B SRINIVAS GOUD
    mee prayatnam santoshinchadaginadi chaala vibaraalu telisinavi thanksfull to naresh garu

  2. aninath

    చాలా మంచి విషయాలు చెప్పారు. లైబ్రరీ అంటే ఎంతోప్ ఇష్టం నాకు. గత 36 సంవత్సరాల నుంచి సెంట్రల్ లైబ్రరీ లో మెంబెర్ ని చాలా సమయం పుస్తకాలు చదవటం లోనే గదుపుతాను. ఇప్పుడు కంపూటర్లు నెట్ లు వచ్చాక ఇన్ఫర్మేషన్ computer లోనే దొరుకుతోంది అందుకే పుస్తకాలు చదివే వారు తగ్గిపోయారు

  3. venki

    Thank’s for providing information,i had prepare Group-2 Exams,i don’t no about libraries in Hyd,Thank’s for providing info

  4. నరేష్ నందం

    ఈ లైబ్రరీ గురించి ఎంత చెప్పినా తక్కువే. వీలైతే ఒకసారి వెళ్ళిరండి. ఆ కలెక్షన్ చూస్తే మళ్లీ మీరే వెళతారు.

    1. premchand

      it is true , but now days few students have no time to read the other books ,they ready only text books that before the examination, I am also requesting all students at least visit our state center library alright

  5. satyan

    hyder bad antatilokee naku nacchina bhavanam adokkatae. thanks. gurtuchaesinanduku.

  6. Srinivas Vuruputuri

    ఇస్మాయిల్ గారి కవితలను (చెట్టు నా ఆదర్శం, మృత్యు వృక్షం, రాత్రి కురిసిన రహస్యపు వాన – మూడింటినీ కలిపి ప్రచురించిన సంపుటం) ఈ లైబ్రరీలో చదివాను నేను.

    అరుణ్ శౌరీ రాసిన Hinduism – Essense and Consequences అనే పుస్తకం నాకిక్కడ దొరికింది (ఇప్పుడు ప్రచురణలో లేదు)

    హడావుడిగా అఫ్జల్‌గంజ్ మీదుగా వెళుతునప్పుడు –
    కాస్త తీరిక చేసుకొని లైబ్రరీకి రావాలనుకుంటూ…. ఉన్నాను, కొన్ని ఏళ్ళుగా 🙁

  7. Srinivas Nagulapalli

    చాలా మంచి పరిచయం. ఈ లైబ్రరీ గురించి ఇట్లా అభిప్రాయం రాస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఎత్తైన భవనం, ప్రశాంత వాతావరణం ఆహ్లాదంగా ఉండేది. Competitive exam magazines, Science,
    encyclopedia లాంటివి బాగా ఉండేవి. ఇంజినీరింగ్, మెడిసిన్ సంబంధించిన పుస్తకాలు కింది ఫ్లోరులో ఉండేవి.
    Largest and oldest library in Hyderabad కి ఒక వెబ్సైటు లేదు, నాకు తెలిసి. ఉందంటే ఎంతో సంతోషం. గత స్మృతులను గుర్తుకు తెచ్చినందుకు చాలా కృతజ్ఞతలు.
    ======
    విధేయుడు
    _శ్రీనివాస్

  8. amar

    entho mandiki books spoorthi kavalani asisthunnanu

  9. amala

    chala chakkaga me libraryni parichayam chesaru

  10. నరేష్ నందం

    ప్రస్తుతం గ్రంధాలయ వారోత్సవాలు(Nov 14- Nov 20) జరుగుతున్నాయి.
    మీకు కుదిరితే ఒక్కసారి మీదగ్గరలోని గ్రంధాలయాలను సందర్శించండి.
    వాటి సమస్యలను అధిగమించేందుకు మీకు చేతనైన సాయం చేసేందుకు ప్రయత్నించండి.

    మీ అభిప్రాయాలను పంచుకున్నందుకు ధన్యుడిని.
    త్వరలో మరో ముఖాముఖితో మీ ముందుకు వస్తాను.
    శెలవు.

  11. kvrn

    చాల చక్కగ ఈ లైబ్రరీని పరిచయం చేసారు.ఇంటెర్వ్వ్యూ విధానం లో చాల వివరాలు తెలిసాయి.
    తెలుగు సామెతలో నర్సు కు బదులు ‘మంత్రసాని ‘ పదం వడతారు.
    అన్ని లైబ్రరిలది ఒకటే సమస్య – కొత్త పుస్తకాలకి ఫండ్సు చాలవు.మెంబెర్షిప్ వలన అదాయం అతి స్వల్పము

  12. హెచ్చార్కె

    ప‍బ్లిక్‍ పనులలో వున్న వాళ్లను కలిసి, వారి పనులు తెలుసుకుని, అందులో మంచి సంగతులను ఇల‍ పదుగురికి చెప్పడం చాల వుపయోగకరం. వాళ్లు మరింత బాగా పని చేయడానికి అది నైతిక ప్రోత్సాహకం అవుతుంది. ప్రభుత్వ గ్రంథాలయాలు, పాఠశాలలు, వైద్యశాలల వంటి వాటిని వూర్నే విమర్శించడం, వాటిలో ఏ మంచి లేదన్నట్లు వూదరగొట్టడం వల్ల ‘మనం నిజంగా పని చేసినా ఎవరూ మెచ్చుకునేది లేదు, అలాంటప్పుడు ఎందుకు పని చేయడం’ అనే వుదాసీనతకు అక్కడి వాళ్లు లోనవుతుంటారు. కింది నుంచి న్యాయమైన ఒత్తిడి తెస్తూనే, వాళ్లలో మంచిని ప్రోత్సహిస్తే పరిస్థితులు ఇప్పటి కంటే మెరుగ్గా వుంటాయి. (పాఠశాలల విషయంలో ఎంవిఎఫ్‍ ఫౌండేషన్‍ వాల్లు దీన్నొక సూత్రంగా వాళ్ల శిక్షణ కార్యక్రమాలలో చేర్చడం, పనుల్లో దాన్ని పాటించే ప్రయత్నం చేయడం నేను గమనించాను. దాని వల్ల వూళ్లలో దొరికిన మంచి ఫలితాలనూ గమనించాను)
    ఇటీవల లైబ్రరీల వంటి పబ్లిక్‍ (ప్రభుత్వ) సంస్థలలో, అక్కడికి వెళ్లిన వారిని సాదరంగా పలకరించడం, తమ పని మేరకు సహకరించడం మునుపటి కన్న చాల మెరుగ్గా కనిపిస్తోంది. నిరుడు నేనేదో పని మీద అఫ్జల్‍గంజ్‍ లైబ్రరీకి వెళ్లి అక్కడి వుద్యోగులు సహకరించే విధం చూసి చాల ముచ్చట పడ్డాను.

  13. సంతోష్‌

    ఇలాంటివి మన నగరంలో ఎన్నో ఉన్నాయి.. వాటిని వెతికి పట్టుకునే ప్రయత్నం చేయండి. కనీసం ఇలాగైనా నాటి పురాతన వైభవానికి తగిన ప్రచారం చేసిన వారవుతారు. మీ ప్రయత్నం ఎంతోమందికి స్ఫూర్తి కావాలని ఆశిస్తున్నాను.

  14. సంతోష్ తిప్పరాజు

    మంచి సమాచారం ఇచ్చారు. ఓపిగ్గా మీరు, మీ మిత్రుడు చేసిన ఈ ప్రయత్నం ఎంతో లాభం చేకూర్చేలా ఉంది. ఏయే భాషలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో… సవివరంగా ఇచ్చారు. చాలా బాగుంది.

    సంతోష్.తిప్పరాజు‌- హెచ్‌ఎంటీవీ ఏఎస్‌రావునగర్‌, హైదరాబాద్‌

  15. యడవల్లి వేంకట సత్యనారాయణ శర్మ

    టి.వి.లు వచ్చాక చదివే అలవాటును పోగొట్టుకున్నాం,

    ఫోన్లొచ్చాక రాసే అలవాటును పోగొట్టుకున్నాం…,

    -యడవల్లి వేంకట సత్యనారాయణ శర్మ

  16. మోహన

    ఈ మధ్య అర్జంటు పని మీద ప్రైవేటు బస్సులో రెండు సార్లు హైదరబాదు వెళ్ళినప్పుడు దారిలో ఈ లైబ్రరీ ని చూసాను. మామూలుగానే లైబ్రరీ అంటే ఇష్టం కాబట్టి అనుకుంటా, రెప్పార్ప కుండా ఆ భవనాన్ని కనిపించేంత వరకు చూస్తూనే ఉన్నాను. “……గత కాలపు వైభోగాన్నంతా నెమరువేసుకుంటూ కూర్చున్నట్లుంది. ” అని మీరు చెప్పింది ఎంతో సత్యం. బాగా వయసు మళ్ళిన తాతగారో, ముత్తాత గారో అరుగు మీద పడక కుర్చీలో గంభీరంగా కూర్చున్నట్టుగా…. వాళ్ళని కదిపితే అనుభవాల దొంతరలు ఎలా వొలుకుతాయో అలా అనిపించింది నాకు అఫ్జల్ గంజ్ లైబ్రరీని చూసినపుడు.

    నేను హైదరాబాదు చుట్టపుచూపు గానే చూడ్డం. కాబట్టి ఈ లైబ్రరీని సందర్శించే వీలు, అదృష్టం ఇప్పటి దాకా కలగలేదు. మీరు ఇన్ని వివరాలతో, విషయాలతో ఇక్కడ ఒక చిన్న ప్రోమో చూపించారు. అభినందనలు, ధన్యవాదాలు 🙂 ఈ సారి హైదరాబాద్ వెళ్తే తప్పకుండా ఒక్క సారైనా కనీసం చుసి రావాలనుంది. చూడాలి.

    ఇంతకీ వాళ్ళకి కావాల్సిన పుస్తకాలేమిటో తెలుసుకునే వీలు? వాళ్ళకి ఉత్తరం రాయడమేనా?? మీకు తెలిస్తే వివరం చెప్పండి.

  17. afsar

    నరేష్ గారు:

    చాలా మంచి పని చేసారు. ఈ లైబ్రరి విలువ మన వాళ్ళు పెద్దగా గుర్తించినట్టు లేదు గాని, అమెరికాలొనూ, యూరప్ లోనూ పరిశోధనలు చేస్తున్న చాలా మంది ఈ లైబ్రరి గురించి చాలా చెప్పారు.

    ఆశ్చర్యం ఏమంటే, తెలంగాణ గురించి తెల్లారు లేచి గొంతు చించుకునే వాళ్ళెవరూ ఇలాంటి లైబ్రరీలను ఎలా కాపాడుకోవాలో ఆలోచించడం లేదు.

    తెలంగాణాలో ఇలాంటి చరిత్రాత్మకమయిన లైబ్రరీలనేకం వున్నాయి. కోదాటి నారాయణ రావు లాంటి పెద్దలు లైబ్రరీ వుద్యమంలో పని చేశారు. ఇప్పటి తెలంగణ వుద్యమకర్తలకి అలాంటి సంస్కారా స్ఫూర్తి వుంటే, చదువుని వాళ్ళ వుద్యమమలో భాగం చేసి, లైబ్రరీల రక్షణకి నడుం కట్టాలి.

    నరేష్ గారి ఈ చిన్న వ్యాసం ఆ బాధ్యతని గుర్తు చేస్తోంది.

    అఫ్సర్

  18. surendar

    pusthaka priyulaki manchi vivaralu andhincharu, dhanyavadamulu

  19. వెంకటరమణ

    మంచి వివరాలు అందించారు. మీ ప్రయత్నం అభినందనీయం. నేను ఈ లైబ్రరీ లో సభ్యత్వం తీసుకున్నాను. నెలకొకసారి పుస్తకాలు తెచ్చుకుంటాను.

Leave a Reply to నరేష్ నందం Cancel