చేతన – చింతన

శ్రీ వివిన మూర్తి ‘ప్రవాహం’  కథల సంపుటి విశ్లేషణ

-డా. జంపాల చౌదరి

******

(ప్రముఖ రచయిత శ్రీ వివిన మూర్తి 75వ జన్మదిన సందర్భంగా)

నాకు వివిన మూర్తి గారి కథలు కొంత ఆలశ్యంగా పరిచయమయ్యాయి. నేను 1980 నుంచి 1994 వరకూ తెలుగు దేశానికీ, సాహితీ రంగానికి దూరంగా బతికాను. వివిన మూర్తి గారి  రచనలు ఆ సమయంలో వివిధ పత్రికలలో విస్తృతంగా ప్రచురించబడుతున్నా, వాటిని చదివే అవకాశం నాకు కలగలేదు. 1995 ఇండియా ప్రయాణంలో, కథ-92 సంకలనం చదివినప్పుడు  పయనం పలాయనం కథ నన్ను ఆకట్టుకొంది. ఆగి ఆలోచించేట్టు చేసింది. ఆ ప్రయాణంలోనే వివినమూర్తి గారి ప్రవాహం కథల సంపుటి కొనుక్కున్నాను. అప్పటినుండీ నేను వివిన మూర్తి గారి కథలను ప్రత్యేక అభిమానంతో చదవటం మొదలు పెట్టాను.  

2012లో తిరుపతిలో మధురాంతకం నరేంద్ర గారింట మూర్తి గారితో ఒక సాయంత్రం గడిపే అవకాశం వచ్చింది. సాహిత్యం పట్ల వారి దృష్టి మరింత విశదమయ్యింది. తెలుగులో తొలితరం కథలపై ఆయన చేసిన పరిశోధనలను దిద్దుబాటలు పేర తానా పబ్లికేషన్స్ ప్రచురించటంతో, మా పరిచయం కొద్దిగా పెరిగింది. మూర్తి గారు నాకు నిరంతర శోధకుడిగా, నిశిత పరిశీలకుడిగా అనిపిస్తారు.

ప్రవాహం వివిన మూర్తి గారి మొదటి కథల సంపుటి. రావిశాస్త్రి మరణించిన తర్వాత వచ్చిన మొదటి పుట్టినరోజు సందర్భంగా ఆర్.కె పబ్లికేషన్స్ వారు ఈ పుస్తకాన్ని ప్రచురించారు. అప్పటికే మూర్తి గారు మరో ఋక్కులు వంటి కథలు, కథాప్రహేళిక వంటి ప్రయోగాలు ద్వారా సాహితీరంగానికి చిరపరిచితులు. నవలలు, కథలు వ్రాశారు. వివిధ పత్రికల పోటీలలో ఆరుసార్లు బహుమతులు అందుకున్నారు. కానీ ఒక సంపుటంగా మూర్తి గారి కథలు ప్రచురించబడటం అదే మొదటి సారి.

వివినమూర్తిగారు 1962 నుంచి కథలు వ్రాస్తున్నా, ఆయన వాటిని చాలాకాలంపాటు ప్రచురణకు పంపలేదట. సాహిత్యం ఊహాజీవుల ఊరట మాత్రమే అన్న చిన్న చూపు ఆయనకు ఉండేదట. 1976లో, ఆయన సతీమణి రామలక్ష్మి గారు వారి కథను ప్రచురణకు పంపటంతో ఆయన కథలు అచ్చులో కనిపించటం మొదలు పెట్టాయి. ఐనా ఆయన కథలు ఒక సంకలనంగా రావటానికి ఇంకో 18 ఏళ్లు పట్టింది. దానికి కారణాలను ప్రవాహం పుస్తకానికి విపులంగా వ్రాసిన అయిదున్నర పేజీల ముందు మాట, సవినయ శ్వేతపత్రం, లో ఆయనే స్వయంగా చెప్పారు.

సమాజంలో అసమానతలను తొలగించుకోవటం కోసం  తన కాలంలో, తన సమాజంలో జరుగుతున్న ప్రయత్నాలుగా తాను భావించేవాటిని సమర్థిస్తూ వ్రాయటమే – అందుకు అనుకూల ప్రచార బాధ్యత స్వీకరించటమే – సాహిత్యం యొక్క క్రియాశీలత, సాహిత్య ధర్మం అని భావించిన వివిన మూర్తిగారికి తన ధర్మాన్ని తాను నిర్వహించడం లేదనే కించా భావన ఉండేదట.  ఆయన మాటల్లో… 

వ్రాత నా వ్యక్తిగత అవసరమే అయినా, ప్రచురణ ఒక సామాజిక కార్యకలాపంగా గుర్తించసాగాను. … నా రచన క్రియాశీల శక్తుల అవసరాలు తీర్చగలుగుతుందో లేదో అంచనా వేసుకోలేకపోవటం వల్ల, నేను ఏర్పరచుకున్న ప్రమాణాలకు నా రచన నిలుస్తుందననిపించక పోవటం వల్లా – ఒక రచన ఆయుర్దాయాన్ని పెంచే ప్రయత్నంగా నేను భావించే కథా సంపుటం తీసుకురావటం నా బాధ్యతగా నేను భావించలేదు.

నాకున్న పరిమిత జ్ఞానంతో, సామర్థ్యంతో ఒక సామాన్యుని దృష్టితో నేను చూస్తున్నవి తెలియజేస్తూ వ్రాయటం తగునో లేదో నాకు తెలీదు. … అంగీకృత సాహితీ భావాలలో యీ నా వ్రాతలూ, వదరుబోతుతనమూ ఎక్కడ యిముడుతాయో, అంగీకృత శిల్ప ప్రకృతుల్లో వీటి ఆవిష్కరణ సాధ్యమో కాదో నాకు తెలియదు. నాకు గొప్ప ఆశయాలు లేవు. గొప్ప జ్ఞానం లేదు. గొప్ప శక్తి లేదు. కాని గొప్ప బాధ్యత ఉంది. నా యీ ప్రపంచం నాలో కల్పిస్తున్న ఆనందానుభూతులను ఎంత హాయిగా స్వీకరిస్తున్నానో, యిది కలిగిస్తున్న అలజడి, ఆలోచనలు నా సోదర మానవులతో పంచుకోవటం ద్వారా యీ సుందరప్రపంచంలోని అవాంఛనీయ పరిణమాలను అరికట్టడానికి అవసరమయిన చైతన్యానికి దోహదం చేసిన వాడినవుతాను. ఇది నాకు నేను విధించుకున్న బాధ్యత. ఇదీ నేను ప్రస్తుతం సాహిత్యధర్మంగా భావిస్తున్నది.

14 ఏళ్ళు రాసాక, పత్రికలకు ఎక్కడం ఎంత యాదృచ్ఛికంగా జరిగిందో, 18 ఏళ్ళ ప్రచురణా జీవితం తరువాత యీ కథాసంపుటం రావటం కూడా అంతే యాదృచ్ఛికంగా జరుగుతోంది. ఇప్పుడు యిది నా చేతుల్లో ఉందనుకోవటం వల్ల – నా సాహిత్య ప్రయాణాన్నీ, ఆ ప్రయాణపు గుర్తులుగా భావించే కొన్ని కథలనే మీ ముందు ఉంచుతున్నాను. మానవుని స్వరూపం నేను పూర్తిగా పట్టుకోలేక పోయినా, ఆ స్వరూపాన్ని కళా దర్శనం కావించాల్సిన ఆశతో నేను యిన్నాళ్ళూ చేసుకుంటున్న ప్రయత్నాలను అవగతం చేయాలనే యీ సంపుటానికి అంగీకరించాను.

ఆ ముందు మాటలో వివిన మూర్తి గారు చెప్పినదాని ప్రకారం 1985 ప్రాంతంలో వ్రాసిన సంధి కథ ఆయన సాహితీ ప్రస్థానంలో ఒక ముఖ్యమైన మలుపు. ఆయన మాటల్లోనే –

సంధి అన్న కథ వ్రాసినప్పుడు నేనూ రచయితనేమో అనిపించింది. ఆ కథ అప్పుడు నేననుకునే ‘సాహితీధర్మం’ ప్రకారం ‘ధర్మద్రోహమే’! ఇందులో ప్రధాన పాత్ర మనస్థితిని పాఠకుడి ముందుంచటంతో కథ ముగుస్తుంది. ఆ పాత్ర ఒక నిర్ణయానికి వచ్చినట్టు రాస్తే, అది పరిష్కారం అవుతుంది. ఆ పరిష్కారం అలాంటి ఉత్తేజం ఎందరికో కలిగిస్తే అది అభ్యుదయాంశ అవుతుందని నాకు తెలుసు. అదే సాహిత్య ధర్మమని నేను అప్పటికి అనుకుంటున్నాను. కాని నాకు అందులో వ్యక్తికీ, సమాజానికి మధ్య; వ్యక్తిగత, శారీరక, మానసిక స్థితులకూ, సామాజిక భావ జాల బంధనాలకూ మధ్య నలిగిపోయే ప్రధాన పాత్రలో మానవుని వేదన కనిపించింది. పరిష్కరించుకోలేని వారిపట్ల, పరిష్కారాలు సూచించని రచనల పట్ల నాకున్న చిన్న చూపు సరయినదేనా అన్న అనుమానం కలగసాగింది. ఆ రకంగా కథను వదిలెయ్యటానికి కొంత సాహసం అవసరం అయ్యింది.”

ఇంతకు ముందే చెప్పినట్లు, ఈ మొదటి కథాసంపుటిలో అప్పటివరకూ వివిన మూర్తి గారు వ్రాసిన కథలు అన్నీ లేవు. ఆయన సాహిత్య ప్రయాణాన్నీ, ఆ ప్రయాణపు గుర్తులుగా భావించే కొన్ని కథలనే ఈ సంపుటికి ఎంపిక చేశారట. ఈ ఎంపిక ఆయనే చేసుకొన్నారని అనిపిస్తుంది; ఇతరుల ప్రమేయం కూడా ఉందని ఆయన సూచించలేదు.

ప్రవాహం కథాసంపుటికి సంధి కథను మొదటి కథగా ఎంచుకోవటంలో తన రచనాప్రస్థానంలో ఈ కథ విశేష స్థానాన్ని మరో మారు సూచించారు. ఈ సంపుటంలో 18 కథలు ఉన్నాయి. ఏడు కథలు 1986కు (అంటే సంధి కథకు) ముందువి. పదకొండు కథలు ఆ తరువాతవి. ఆయన రచనాప్రయాణంలో ముందు రాసిన కథలకన్నా, తన దృక్పథంలో మార్పు వచ్చిన తర్వాత కథలకు ఆయన ప్రాముఖ్యత ఇచ్చారని నాకు అనిపించింది. 

మూర్తి గారి సంధి కథ ఒక సంధి దశకు గుర్తింపుగా చెప్పారు కాబట్టి, ఈ సంపుటిలో మిగతా కథలన్నిటికన్నా ముందు సంధి కథను మనం జాగ్రత్తగా పరిశీలించాలి. సంధి కథ 1986 మార్చి జ్యోతి మాసపత్రికలో ప్రచురింపబడింది. ‘మామ్ కథ చదివాక’ అని రచయిత కథ చివర్లో పేర్కొన్నారు. కథలో కూడా ఒక చోట  ఆంగ్ల రచయిత సోమర్సెట్ మామ్ రాసిన కథలలో ‘ఫోర్స్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్’ కథ ప్రస్తావన వస్తుంది. ఆ కథ తన కథ వంటిదే అంటుంది కథానాయిక రాంప్యారీ. అప్పటివరకూ మామ్ కథకూ ఈ కథకూ చాలా పోలికలు ఉంటాయి. ఆ తరువాత రెండుకథలూ వేరు వేరు మార్గాలు పడతాయి. ఇష్టపడి పెళ్ళి చేసుకున్న భర్తకు వివాహం ముందు ఇంకో అమ్మాయితో సంబంధం ఉందని, అతను ఒక బిడ్డకు తండ్రి అని తెలిసిన తర్వాత రాంప్యారీ మనస్థితి, ఆలోచనాక్రమం ఈ కథకు ముఖ్య వస్తువు. కథానాయిక రాంప్యారీ బిమల్‌ని ప్రేమించి పెళ్ళి చేసుకొని నైనిటాల్ నుంచి అతను పనిచేసే – బహుశా విశాఖ జిల్లాలోని – ఒక గిరిజన గ్రామానికి వస్తుంది. కథలో అనేక సంఘటనల వల్ల, రాంప్యారీ స్వతహాగా ఉత్తమసంస్కారం గల స్త్రీ అని, మంచిచెడుల తారతమ్యాలు తెలిసిన మనిషి అని మనకు అర్థం అవుతుంది. ఆమెకు ఎక్కువగా ఆలోచించే గుణం ఉంది. తన ప్రవర్తన, పక్కవాళ్ళ  ప్రవర్తనల గురించీ తప్పొప్పుల గురించి నిరంతరం ఆలోచిస్తుంటుంది. తాను ఒకోసారి తప్పులు చేసినా, తన తప్పులను కప్పిపరచుకోలేని నిజాయితీ ఆమెకు ఉంది. ఒకో సారి ఆమె విలువలకు, సహజాత అవస్థలకూ మధ్య పోరాటాలు తప్పనిసరి. 

మామ్ కథలో హీరోయిన్ భర్తను విడచి వెళ్ళిపోతుంది. మరి మూర్తిగారి రాంప్యారీ ఏం చేస్తుంది? ముందుమాటలో మూర్తిగారు చెప్పుకొన్నట్లుగా, రాంప్యారీ ఏం చేస్తుందో చెప్పకుండానే కథ ముగుస్తుంది.  రాంప్యారీ తన స్నేహితురాలికి వ్రాస్తున్న ఉత్తరంలో, తన ప్రశ్న ‘నేనేం చెయాలి’ దగ్గర మొదలై, ‘నేనేం చెయ్యగలను’, అని రూపాంతరం చెంది, చివరకు ‘నేనేదయినా చెయ్యగలను’ అనే సమాధానంతో ముగిసిందని అంటుంది. ఐతే ఏదైనా అన్న మాటలో కూడా సందిగ్ధత ఉంది. రాంప్యారీ కొన్ని అసాధారణమైన పనులే చేసింది కానీ ఆ పనులు కథను ఒక దిశకు మళ్ళించి పొడిగించాయి కానీ అవి కథకు ముగింపు కాలేకపోయాయి. ఈ కథను ఒక నిర్దిష్టమైన దిశలో ముగించకపోవడాన్ని – తాను అప్పటి వరకూ నమ్మిన (రచనా) ధర్మానికి ద్రోహంగా వర్ణిచారు మూర్తి గారు.

ఐతే దానికి కారణం కూడా మూర్తి గారి కథానాయికే, తన స్నేహితురాలికి రాసిన ఉత్తరంలో చెపుతుంది. “అచ్చులో మనుషులు – జీవితంలో మనుషులకు పరిష్కారాలు ఇస్తారన్న నోషన్ మనకు ఉంటుంది. అది నిజం కాదు. పాత్రలకి ఎదురైన సమస్య – తమ జీవితాల్లో వాస్తవంగా లేనపుడే – వాస్తవమైన మనుషులు ఆ సమస్యను తమ ఊహల్లో ఎదుర్కొని, ఆ పుస్తకంలోని పరిష్కారానికి వస్తారు’ అని ‘ ఆమెకు తోస్తుంది. “కథలనీ పాత్రలనీ సృష్టించేవాళ్ళు ఏ పరిష్కారమైనా చాలా సులువుగా యిచ్చెయ్య వచ్చు. కానీ మనం ఇవ్వగలమా” అని ఆమె ప్రశ్నిస్తుంది. ఆ ప్రశ్న ఆమెది కాదని, అది మూర్తి గారి ప్రశ్న అని మనకు అనిపిస్తుంది. 

తాను వ్రాసిన కథలో తాను సృష్టించిన పాత్రలకు పరిష్కారాలు తాను ఇవ్వగూడదనీ, అది కూడా పాఠకుల సంస్కారానికీ, ఊహకూ, ఆలోచనకూ వదిలేయాలి అని మూర్తి గారు ఈ కథ వ్రాసేటప్పుడు నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం ఆయన అప్పటి వరకూ తనకు తానుగా వేసుకున్న సంకెళ్ళనుంచి విముక్తుణ్ణి చేసింది. తదుపరి కథలకు పునాది అయింది. నిజ జీవితంలో మనుషుల ప్రవర్తనలో ఉండే ద్వైరుధ్యాల్ని, సంక్లిష్టతని స్పష్టంగా చూపించటానికి ఆ తర్వాత ఆయన ఎప్పుడూ సంకోచించినట్లు లేదు. 

మూర్తి గారు ఎంచుకున్న కొత్త మార్గాన్ని ఈ సంపుటిలో ఉన్న ఇంకో కథ, పయనం పలాయనం లో స్పష్టంగా చూడవచ్చు. ఈ సంపుటంలో ఉన్న కథలన్నిటిలోకీ నిడివిలో పెద్ద కథ (రెండవ స్థానం సంధి కథది). 1992 రచన మాసపత్రిక ఉగాది సంచికలో, తర్వాత మరికొన్ని కథాసంకలనాల్లోనూ ప్రచురింపబడింది. ఈ కథలో మనకు ప్రత్యక్షంగా కనిపించేవి నాలుగు పాత్రలు. బెంగుళూరులో నివసిస్తున్న వృద్ధ దంపతులు రంగనాధం, కామేశ్వరి, ఢిల్లీలో నివసిస్తున్న వారి కుమారుడు (పార్థ) సారధి, కోడలు వాణి. కామేశ్వరి జీవితం చివరిదశలో, మంచం పట్టి ఉంది; కొడుకూ కోడలూ తమ దగ్గర ఉండాలన్న కోరిక పెద్దవారికి ఉంది. జీవితపు పరుగుపందెంలో వేగంగా పరుగెత్తడానికి అలవాటు పడ్డ సారధికి ఢిల్లీ వదిలిపెట్టాలి అన్న ఆలోచన లేదు. వాణికి సారధంటే పెద్ద లెక్క లేదని మనకు కథ మొదట్లోనే అర్థమౌతుంది. కామేశ్వరి, రంగనాథాలకు వ్యక్తిత్వంలోనూ, విశ్వాసాలలోనూ పోలికే లేదు. కాని వారిద్దరూ ఒకర్నొకరు ప్రేమిస్తూ జీవించారు. చాలాకాలం క్రితం – పార్థుకు మూడేళ్ళ వయసప్పుడు – జరిగిన ఒక సంఘటన వారి జీవితాన్ని చాలా కల్లోలానికి గురిచేసింది. ఐనా వారి వ్యక్తిత్వాలూ, విశ్వాసాలూ వారిని మరింత చేరువ చేశాయి. కాని పరుగుపందెంలో గెలవడంకోసం సారధి, వాణిలు తీసుకున్న నిర్ణయాలు వారి మధ్య దూరాన్ని పెంచాయి.  స్థూలంగా చూస్తే రెండు జంటల సమస్యలకూ కారణం లైంగిక ప్రవర్తనే. కానీ ఆ ప్రవర్తనల మూలాలు వేరు. ఆ ప్రవర్తనల పర్యవసానాలను పరిష్కరించుకోవటానికి వారు ఎన్నుకున్న మార్గాలు వేరు. ఈ తరాల మధ్య వైరుధ్యం దేనికి సూచన? గతంతో పోలిస్తే వర్తమాన ప్రపంచం బాగుపడుతుందా లేక పతనమవుతుందా అన్న విచికిత్సతో ఈ కథ అంతమౌతుంది. ఇక్కడ కూడా రచయిత ఒక పక్షాన్ని తీసుకోడు. ఈ ప్రశ్నలను పాఠకులకే ఒదిలివేస్తాడు. 

ఈ సంపుటంలో ఈ రెండు కథలూ కాక ఇంకో పదహారు కథలు ఉన్నాయి. 1977-1994 మధ్యలో ప్రచురించబడిన ఈ కథలలో చాలా వైవిధ్యం ఉంది. తన రచనలలో ఉన్న వైవిధ్యాన్నీ, పరిణామక్రమాన్నీ చూపించటం కోసం మూర్తి గారు ఈ కథలను ఎంపిక చేసి ఉండవచ్చు. ఈ వైవిధ్యం కథావస్తువుల్లోనూ, కథనశైలిలోనూ, భాషలోనూ కనిపిస్తుంది. ఈ కథలన్నిటినీ ఒకే రచయిత వ్రాశాడంటే నమ్మటం కష్టమే.  ఈ వైవిధ్యం నాణ్యతపరంగానూ ఉంది. ఈ సంపుటిలో కథలన్నిటినీ విడివిడిగా విపులంగా సమీక్షించటం ప్రస్తుత పరిమితులలో సాధ్యం కాదు  కాని ఈ కథలగురించి కొన్ని విషయాలు క్లుప్తంగా  ప్రస్తావిస్తాను. 

ఈ సంపుటిలో కాలక్రమంలో మొదటి కథ (వడగాడుపు) 1977లో ప్రచురింపబడింది. మొదటి కథలలో నాకు ఇతర ప్రసిద్ధ కథకుల చాయలు, ముఖ్యంగా కాళీపట్నం రామారావు గారి ప్రభావం ఉన్నాయని నాకు అనిపించింది. ఉదాహరణకు వంకరచూపులు కథ (1980) నాకు కారామాస్టారి తీర్పు కథను గుర్తుకు తెచ్చింది. ఈ తొలికథలలో అప్పటికి ప్రాచుర్యంలో ఉన్న అభ్యుదయ విప్లవ సాహిత్యాల మూసలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. ఐతే కలం గడిచినకొద్దీ రచయిత ఈ ప్రభావాలూ, మూసలూ వదిలించుకొని తన స్వంత శైలిని సంతకాన్నీ సమకూర్చుకొంటున్నట్లు తరువాత కథలు సూచిస్తాయి. 

ఈ సంపుటంలో కథా వస్తువులను స్థూలంగా రెండు వర్గాలుగా విభజించవచ్చు. స్త్రీ పురుష సంబంధాలు, కుటుంబసంబంధాల గురించిన కథలు ఒక వర్గం ఐతే, ఆర్థిక అసమానతలు, ఇతర సామాజిక రాజకీయ విషయాల గురించిన కథలు రెండవవర్గానివి. ఈ రెండు వర్గాలకూ చెందని కథలు రెండు ఉన్నాయి. 

ఈ కథలన్నిటిలోనూ విలక్షణమైనది, కన్యానిరీక్షణ అనే హాస్యప్రథానమైన కథ. గ్రామీణ బ్రాహ్మణ కుటుంబ వాతావరణంలో చమత్కార సంభాషణలతోనూ, హాస్య సంఘటనలతోనూ సాగుతుంది. ఈ కథ మూర్తి గారిది అని గుర్తు పట్టడం చాలా కష్టం.

పుస్తకానికి శీర్షికగా ఎంచుకొన్న ప్రవాహం (1990) కథ నాకు నచ్చలేదు. సెంటిమెంటు ప్రధానంగా ఉన్న ఈ కథ చదవటానికి ఆసక్తికరంగానే ఉన్నా, కథావస్తువు బలహీనంగానూ, అసంగతంగానూ అనిపించింది. ఇంకో కథ పేరేదైనా పుస్తకానికి శీర్షికగా పెట్టి ఉండవలసింది. 

సంధి కథ తర్వాత, కథ ముగింపు ఒక (అభ్యుదయ) దిశానిర్దేశం చేయాలి అన్న ధర్మాన్ని తాను విడచిపెట్టానని మూర్తి గారు చెప్పినా, ఆ దిశానిర్దేశం తరువాత కథలు కొన్నిటిలో (ఏటి మధ్యం, చేటపెయ్య వగైరా) కనిపిస్తుంది.  

ఈ సంపుటిలో కథలన్నిటికీ చదివించే గుణం ఉంది. కానీ కొన్ని మాత్రమే ఆలోచింపచేసేవి ఉన్నాయని నాకు అనిపించింది. సంధి, పయనం పలాయనం కథలతో పాటు నాకు గదులు, దుమ్ములు, మంచుబొమ్మ, చేటపెయ్య కథలు నాకు మిగతా కథలకన్నా ఎక్కువగా నచ్చాయి.  

మూర్తిగారి మలితరం రచనలలో పాత్రల అంతరంగాలలోనూ, ప్రవర్తనలలోనూ సంఘర్షణ, సందిగ్ధత కనిపిస్తాయి.  మూర్తి గారి కథలలోనూ, నవలలలోనూ ముఖ్యపాత్రలు మామూలు మనుషులకన్నా ఎక్కువ చైత్యన్యం కలిగిన వారు, చింతనాపరులు, ఆలోచనా జీవులు. ఆలోచించగలగటం హర్షణీయ విషయమే కావచ్చు కానీ, ఆలోచనలు జీవితాలను సుఖమయం చేయవు. భౌతికంగానూ, మానసికంగానూ వ్యధిస్తాయి; మనశ్శాంతిని హరిస్తాయి. అజ్ఞానం వల్ల వచ్చే ఆనందం, స్వార్థం వల్ల కలిగే ఆత్మవంచన, నిర్లక్ష్యం ఆలోచించేవారికి కుదరవు. నిజానికి ఈ పాత్రల సంస్కార స్థాయి గొప్పది; వీరు తమ గురించి మాత్రమే కాక తమ చుట్టూ ఉన్న మనుషుల గురించి, సమాజం గురించి కూడా ఆలోచిస్తుంటారు. ఐతే మనుషుల ఆలోచనలు సరళరేఖల్లో సాగవు; అవి సమస్యల స్వరూపాన్ని సమగ్రంగా పట్టుకోలేవు; ముందుకూ, వెనక్కూ, పక్కకూ జరుగుతూ, తిరుగుతూ ఉంటాయి. ఈ ఆలోచనల వల్ల తీసుకున్న నిర్ణయాలన్నీ మంచి ఫలితాలనే ఇస్తాయనీ లేదు. ఎంత ఆలోచనాజీవులైనా, ఆలోచనలను ఆచరణగా మార్చే క్రమంలో, ఒకోసారి సహజాత ప్రవృత్తి వల్ల ఆ ఆలోచనలను అమలుచేయకపోవటమే కాక, వాటికి విరుద్ధమైన పనులూ చేయవచ్చు. మూర్తి గారి మలితరం కథల్లో ప్రధానంగా కనిపించేది – ఆలోచనలకూ, సహజాత ప్రవృత్తులకూ, పరిస్థితులకూ మధ్య ఉండే ఈ సంఘర్షణే.

ఈ పాత్రల చేతననూ, చింతననూ పాఠకులకు అందజేసే ప్రయత్నంలో మూర్తి గారి కొన్ని పాత్రలు మనము రోజువారీ మాట్లాడుకొనేట్లుగా మాట్లాడవు, ప్రవర్తించవు. సంభాషణలు తార్కిక వాద ప్రతివాదనలు అవుతాయి – ఉదాహరణకు పయనం పలాయనం కథలో భార్యాభర్తల మధ్య సుదీర్ఘమైన, సంక్లిష్టమైన సంభాషణలు ఉంటాయి. ఒకోసారి సూచ్యంగా ఉండవలసినవి వాచ్యం అవుతాయి. సంధి కథలో రాంప్యారీ ఆలోచనాక్రమాన్ని ఆమె తన స్నేహితురాలికి రాసిన ఉత్తరంద్వారా రచయిత మనకు తెలుపుతారు. అక్కడతో ఆగకుండా కొన్ని సంఘటనలలో పాత్రల ప్రవర్తననూ, ఆలోచనలనూ సర్వసాక్షి రచయిత విశ్లేషించి వివరించుతాడు. దీనితో కథలో రచయిత చొరబడినట్లు అవుతుంది; కథ నిడివి పెరుగుతుంది. పాత్రల మనస్థితి, ప్రవర్తనల విశ్లేషణ ఇప్పుడు మూర్తి గారి సంతకం అయ్యింది.  ఇది మూర్తి గారి కథలకు బలం. ఒకోసారి బలహీనత కూడా.

మూర్తి గారి సవినయ శ్వేతపత్రంతో సహా ఈ ప్రవాహం సంపుటిలో కథలన్నీ చదివితే ఈ రచయిత కాలక్షేపానికో, పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడానికో కథలు రాయలేదని, అనేక విషయాల పట్ల తాను పడిన మథనను, తన ఆలోచనలను, అనుభవాలను, అవగాహనను పాఠకులతో పంచుకోవడానికి ఆయన రచనను ఎంచుకొన్నారని అర్థమౌతుంది. ఈ ప్రపంచాన్ని, తన అనుభవాలను అర్థం చేసుకోవటానికి ఆయన ఒక తాత్విక భూమిక ఉన్నదని స్పష్టమౌతుంది.  మార్క్సిజం ఆయనను నడిపించిందని ఆయనే చెప్పుకున్నా, ఆయనకు నమ్మకాలకన్నా, అన్నిటినీ ప్రశ్నిస్తూ, తరచి తరచి చూడటమే ముఖ్యం. ఆయన కథలు తన తెలివిని ప్రదర్శించటానికి వ్రాసినట్టుగా ఉండవు. పంచుకోవాలన్న తపన, నిజాయితీ కనిపిస్తాయి. ఇటువంటి చేతన, చింతన ఉన్న కథలు, కథకులు మనకు అరుదు. అందుకే వివిన మూర్తి గారు సమకాలీన తెలుగు సాహిత్యంలో తనదైన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొన్నారు. ఆ స్థానానికి చేరుకోవటానికి ఆయన చేసిన ప్రయాణాన్ని అర్థం చేసుకోవడానికి ఈ ప్రవాహం మనకు ఉపకరిస్తుంది.

వివిన మూర్తి గారికి 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు.

ప్రవాహం – వివిన మూర్తి కథలు 

ఆర్.కె పబ్లికేషన్స్, 1994

205 పుటలు

You Might Also Like

Leave a Reply