తంతు – ఎస్.ఎల్. భైరప్ప

వ్యాసకర్త: నీలారంభం కళ్యాణి
(ఇది ఫేస్బుక్ పోస్టు. పుస్తకం.నెట్ లో ప్రచురించడానికి అనుమతించినందుకు కళ్యాణి గారికి ధన్యవాదాలు)

*********

ఈ పుస్తకాన్ని మొదటి సారి రైల్లో ప్రయాణం చేస్తూ చదివా. నిజానికి ఆనాటి నా మనఃస్థితిలో చదవాల్సిన పుస్తకం కాదు .ఆమధ్య ఈ పుస్తకం గురించి బలరాంగారు ప్రస్తావించారు. సరి మళ్లీ పుస్తకం వెతికి చేతిలోకి తీసుకున్నా. కొంత చదివేసరికి తంతు మనం తెలుగులో వాడే అర్థం కాదని తెలిసి కన్నడ నిఘంటువులో వెతికా. అప్పుడు కథావస్తువు విస్తృతి అర్థమయింది .

తొమ్మిది వందల చిల్లర పేజీల పుస్తకం ఐదు రోజుల్లో చదివి ముగించా. తంతు అంటే సంబంధం, లింక్ . 1975 ముందు మనదేశంలో పరిస్థితులు, చాలా పెద్ద కాన్వాస్ మీద చిత్రించారు. సామాజిక ,ఆర్థిక ,రాజకీయ, సాంస్కృతిక, విద్యా రంగాలతో బాటు పత్రికా రంగానికి కూడా ఈ కాన్వాస్ పైన ప్రముఖ పాత్ర ఇచ్చారు భైరప్ప .ఇవేవీ కూడా విడివిడిగా ఉండవనీ, ఒకదానిని మరొకటి ప్రభావితం చేస్తూనే ఉంటుందని అర్థం చేయిస్తారు రచయిత .

ఈ నవలలో హీరోలు, విలన్లు లేరు. Protagonist -Antogonist లు కూడా లేరు. కానీ సత్యం-అసత్యం, వీటి మధ్య గ్రే ఏరియాలో తల దాచుకున్న బలహీన మనస్కులు ఉన్నారు. కొన్ని పాత్రలు సుడిగుండంలో చిక్కుకున్న ఆకులా కొంత కాలం గతి తప్పినా, సుడిగుండం నుండి బయట పడగలిగిన శక్తి కలిగినవారు కూడా వున్నారు.

కథ మొదలయ్యేది బసవపురం అనే గ్రామంలో. హొయ్సళ కాలంనాటి గుడిలోని సరస్వతి విగ్రహం దొంగతనం అయిందన్న వార్త ఒక పేరున్న వార్తాపత్రిక బెంగళూరు శాఖ ఎడిటర్ రవీంద్ర పరిశీలనకు రావడంతో మొదలవుతుంది. అది రవీంద్ర తాతగారి ఊరు, పరిచయమైన గుడి కావడంతో విషయ సేకరణ కోసం బసవపురం వెళ్లి గుడి పూజారి రామభట్టుగార్ని కలుస్తాడు. అప్పుడే పల్లెల్లో వాతావరణం ఎంత కలుషితమయింది అని అవగాహన ఔతుంది. ఆ విగ్రహాన్ని దొంగిలించినవారి జాడ దొరకదు. నవల చివర్లో ఎమర్జెన్సీ వంకతో రామభట్టుగార్ని అప్పటికే జైల్లో వున్న రవీంద్ర కలవడం, ఆయనను జైల్లో పెట్టిన కారణం, విగ్రహం దొంగతనం వెనుక వున్న హస్తం అక్కడి ఎమ్మెల్యే అని తెలియడంతో నవల సమాప్తం అవుతుంది.

ఈమధ్యలో గాంధేయవాదులు పల్లెల్లో పిల్లలకోసం నడిపే వివేకానంద బడి, దానిలో దారి తప్పుతున్న రవీంద్ర తన కొడుకు అనూప్ ను ఆ బడిలో చేర్చడం, అక్కడున్నంత కాలం ఆదర్శ విద్యార్థిగా మెలిగిన అనూప్ ఆ చోటు వదలగానే తన సహజ తత్వానికి మారడం జరుగుతుంది. రవీంద్ర ఆ బడి గురించి తన వార్తాపత్రికలో మంచిగా రాసేసరికి దేశం నలుమూలల నుండి తమ పిల్లలు దారి తప్పకూడదనే ఆకాంక్షతో తల్లిదండ్రులు పిల్లల్ని అక్కడ చేరుస్తారు. కానీ క్రమేణా పిల్లలకు సౌకర్యాలు కావాలి, ఇంగ్లీషు మీడియం కావాలి లాంటి కోరికల వల్ల బడి తన సహజ లక్షణాలు కోల్పోయి బడిని స్థాపించిన బ్రహ్మచారులు వైతొలగాల్సి వస్తుంది.

రవీంద్ర భార్య కాంతి భర్త తన కొడుకును అలాంటి బడిలో చేర్చాడనే కోపం, పుట్టింట్లో తన ఘనత, విలువ నిలుపుకునే క్రమంలో భర్త సహకరించడంలేదనే ఉక్రోషంతో డిల్లీలో ఉండిపోతుంది. సెక్రటేరియట్ లో పని చేస్తున్న స్నేహితురాలి సహకారంతో గార్మెంట్ ఎక్సపోర్ట్ బిజినెస్ ని మొదలు పెడుతుంది. దానిలో దొరికే లాభం, విజయం ఆమె ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. అదేసమయంలో భర్త తన ఆర్థికపరమైన విజయాన్ని మెచ్చుకోవాలనే ఆమె కోరిక తీరదు. వారి మధ్య అంతరం పెరుగుతుంది. విలాసవంతమైన జీవితం, కొత్త ఆకర్షణలు వ్యాపారం కోసం నైతిక విలువల విషయంలో రాజీ పడేలా చేస్తుంది. తన అస్తిత్వం మిస్ కాంతి అని పిలిపించుకోవడంలో వుందని నమ్మిన కాంతి, రవీంద్రను అన్నగా భావించే హొన్నత్తిని తనతో సంబంధం పెట్టుకునేలా చేస్తుంది. ఓ ఏడాది వరకూ సాగిన సంబంధం అతనిలోని తప్పనే భావనను జయించలేకపోతుంది. ఎంత డబ్బు, హోదా వున్న కాంతి మళ్ళీ మళ్ళీ ఆత్మీయతను వేరే వేరే పురుషులలోవెతుక్కుంటుంది ,అది మరీచిక అని తెలిసినా.

హొన్నత్తి ఎంబీఏ చేసి మంచి ఉద్యోగం చేస్తున్నవాడు సంగీతం మీద ప్రేమతో ఉద్యోగం వదిలేసి సితార్ వాదన నేర్చుకునే ప్రయాణంలో సాధనకోసం వివేకానంద విద్యాలయం సమీపంలో వున్న జోగీగుడ్డ పైకి చేరతాడు. కొన్నేళ్ళకు కబ్జాదారుల కన్నుపడి విద్యాలయంలో ఆశ్రయం తీసుకోవాల్సివస్తుంది. అదీ తాత్కాలికమే. బెంగళూరులో రవీంద్ర ఇంట కాంతి వదిలేసిన సితార్ పైన సాధన చేసుకున్నా నిలకడ ఉండదు. ఆఖరికి తల్లిదండ్రులపై గాలి మళ్ళి డిల్లీ చేరుకుని గురువును వెతుక్కుంటాడు. అక్కడ కాంతి వ్యామోహపు వలలో చిక్కుకుని మనశ్శాంతి కోల్పోయి, పూర్తిగా సంగీతం పట్ల విరక్తి చెంది సమాజసేవలో నిమగ్నుడవుతాడు. ఈ కార్యక్రమంలో అతనికి తోడుగా నిలిచేది వివేకానంద విద్యాలయంనుండి బయటకు వచ్చిన బ్రహ్మచారులు..

నిజాన్ని నిక్కచ్చిగా బయటపెట్టే జర్నలిస్టులకు కాలం కాదది. రవీంద్ర కూడా main stream నుండి బయటపడి తనలాంటి ఇంకో జర్నలిస్ట్ తో కలిసి నిజాల్ని బయటపెట్టే పత్రికను నడుపుతూండగా ఏదో పనిమీద బెంగళూరు వచ్చి వున్న సందర్భంలో ఇందిరాగాంధీ పైన చరిత్రాత్మకమైన కోర్టు తీర్పు వస్తుంది. ఎమర్జెన్సీని ఇంకా ప్రకటించకముందే జైళ్ళు అరెస్టయిన అమాయకులతో కిక్కిరిసిపోతాయి. అమాయకుల్లో అమాయకుడైన పూజారి రామభట్టు జైల్లో అన్నంనీరు గొంతులోకి దిగక మరణించడంతో నవల సమాప్తం ఔతుంది.

909 పేజీల నవల ఓ చిన్న పరిచయం చేయడమే నా ఉద్దేశ్యం. పాఠకులను కన్ఫ్యూజ్ చేసివుంటే క్షమించాలి. రెండు కారణాలు ఈ పుస్తకాన్ని పరిచయం చేయడానికి.

మొదటిది, ఈ నవలలో భైరప్పగారు మన సమాజం నేర ప్రవృత్తికి ఎలా sensitivity ని కోల్పోయిందో చూబెడతారు. సమాజంలో కరప్షన్ అన్నది చాలా సాధారణమైన విషయం అయినప్పుడు లంచాలు ఇవ్వడం తీసుకోవడం తప్పు అనే భావన పోతుంది. లైసెన్సులు అమ్మడంలో ప్రభుత్వోద్యుగులకు తప్పు కనపడదు, కొనడం అంతకన్నా తప్పు కాదు అనిపిస్తుంది.

రెండవ కారణం ,చదవాలనే ఆసక్తి ఉన్నవారికి ఇది ఇంగ్లీషులో Tantu -The Loom of Life అనే పేరుతో అమెజాన్ లో లభ్యం అని చెప్పగలను కనుక. ఎమర్జెన్సీని అనుభవించని యువత Corruption universal phenomenon ఎలా అయిందో తెలుసుకోగలుగుతారు. అంటే అవినీతి గురించి ఎవరినైనా తప్పు పట్టేటప్పుడు మనందరం ఆ వ్యవస్థలో భాగం అని గుర్తించాలి. వ్యవస్థ మారడం సులభం అవునో కాదో వేరేమాట, మనం మారాలి, మార్చాలి. అది ఒకటే మార్గం.

You Might Also Like

Leave a Reply