కోయ తాత్వికతను పట్టిచ్చే కథల ”చప్పుడు”

వ్యాసకర్త: మల్లిపురం జగదీశ్

**********

చప్పుడు కథలకి ముందు ఆ రచయిత్రి పద్దం అనసూయ గురించి ముందు మట్లాడుకుందాం!

ఆమెను చూడగానే గతంలో ఈవిడిని ఎక్కడో చూసామే అని అనిపిస్తుంది. ఎంత గింజుకున్నా గుర్తు రాదు. అన్నా! అని పలకరిస్తూ పక్కకొచ్చి మాట్లాడినంతసేపూ ముఖం మీంచి నవ్వు పోదే! ఆమె కదలికల్లో ’అమ్మా! ఓ పాట పాడవూ?’ అని ఎప్పుడు అడుగుతామా పాడుదునా అన్నట్టుంటుంది. ఆ మాట అనుకుంటామో లేదో ఇలా ఓ రాగమెత్తుకుంటుంది. ’మా వూరు గురించి ఒక వూసు అడగవ” అని ఎదురుచూస్తున్నట్టుంటుంది. గొంతులో అడవిని ఆవిష్కరిస్తుంది. అప్పుడు మనకు తెలుస్తుంది కదా ఆమె గాయని అని. కాదు సహజ సుందర గాయని అని. కాదు కాదు మనల్ని ముడివేసే ఒక మంత్రగత్తె అని.

ఇవన్నీ ఆమె భౌతిక లక్షణాలు కాదు. అడవి నేర్పిన అత్యంత సహజ సుందర ఆనవాళ్ళు. ఆమె అడవి లోంచి వచ్చింది కబట్టి ఈ సహజత్వం ఆమెలో ప్రస్ఫుటంగా దర్శనమిస్తాయి. ఆమె పలుకులో పరిమళం మనల్ని ఒక పట్టాన వదలదు.

ఈ సహజత్వం… పరిమళం… సొగసూ ఆమెలోని అడవితనానివి. ఈమె రాసిన కథలనిండా ఈ అడవితనం అక్షరం అక్షరం లోనూ మనకు కనిపిస్తుంది.

రచనలు రచయిత్రిని ఇట్టే పట్టిస్తాయి అని అంటారు కదా! అలాగే ఆమెలోని సహజత్వం, మాటలోని స్వచ్చత, మాయమైపోతున్న సంస్కృతి పట్ల ఆమె పడుతున్న మధనం మనకు ఈ ”చప్పుడు” కథల్లో కనిపిస్తాయి. తెలుగు సాహిత్య చరిత్రలో ఇంత దాకా వచ్చిన సాహిత్యం సంపూర్ణమేనా? అన్న ప్రశ్నకు సమాధానం కాదనే చెప్పాలి. అందులోనూ ఆదివాసీ జీవితం… దాని సాహిత్య సృజనా అని పరిశీలించుకుంటే ఇంకా అది పురిటి నొప్పుల దశలోనే వుందని చెప్పక తప్పదు.

ఈ చప్పుడు కథలన్నీ కోయ జీవితాన్ని ఆవిష్కరించినవే. అందులోనూ మృత్యువు నేపథ్యంలోనివి. మృత్యువు నేపథ్యంలోనే సాగిన ఈ కథలు చదువుతుంటే కోయ జీవితం అడవి నుంచి దూరమై ఆధునిక పోకడలకు బలైపోయిన అస్థిత్వాన్ని కోల్పోతున్న సందర్భాన్ని మనకు గుర్తుకు తెస్తాయి. ఈ నాలుగు కథల్నీ చదివాక మనకు అనిపిస్తుంది… తన సంస్కృతి, ఆచారాలు, పధ్ధతులు కనుమరుగైపోతున్న తీరుకు రచయిత్రి ఎంత ఘర్షణ పడుతుందో కదా అని. రాసిన ఈ నాలుగు కథల్లో కోయల ఆత్మ మనకు దర్శనమిస్తుంది. అందులోనూ స్త్రీహృదయం తో చెప్పిన కథలు ఇవి. కథ చెప్పే తీరు మన చెటికెన వేలు పట్టుకుని తనతో అడవి దారిలో నడిపిస్తున్నట్టుంటుంది. అది స్త్రీకి మాత్రమే సాధ్యం. మనల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని చుక్కల్ని చూపిస్తూనో… పాట పాడుతూనో బువ్వ తినిపించడం పూర్తి చేసేస్తుందే అమ్మ! అలా కథని పూర్తి చేస్తుందీమె. తొలి కథ “కాకమ్మ”ని తీసుకుందాం. కాకమ్మ మంచి గాయని. ఆమె పాడుతుంటే నెమలి గడపలోకొచ్చి ఆడుతుందట. ఆమెతో జాంగిరిపట్టి కోయ స్త్రీలు వీధిలో ఆడుతుంటే వెన్నెల వెల వెల బోతుందట. భూమి పండుగ చేసుకుంటుందట. ముసలామె, పాతకాలపు మనిషి. ఆధునిక పోకడలను అస్సలు జీర్ణించుకోలేని మనిషి. తన సంతానాన్ని ఎంతగా ప్రేమించిందో పోడు భూమినీ అంతగా ప్రేమించిన మనిషి. ”నువ్ సచ్చినా నీ జీవి మంచె మీద్ కూసోని పిట్టల్ని తోల్తది” అని వూరోళ్ళనిపించేంతగా పోడు భూమిని ప్రేమించిన మనిషి. తన కూతురు సూదరోణ్ణి పెళ్ళి చేసుకుంటానంటే మౌనంగా భరిస్తుంది. కొడుకు అయినా కులాచారం ప్రకారం పెళ్ళి చేసుకోలేదని మదనపడి తన చావైనా ఇష్టంగా జరగాలని ముందుగానే ఊహించి మరణానంతం వాడే చీరల్ని ముందుగానే కొనిపించుకుని ప్రశాంతంగా తనువు చాలించిన కోయ సంప్రదాయ స్త్రీ.

కొడుకు పెళ్ళికోసం పందిని కొని సాకుతుంది. వూరందరికీ బత్తెం పంచాలని ఆమె కోరికని కొడుకు ’పెళ్ళికి పందిని కొయ్యడమేంది గలీజుగా!” అని అన్నపుడు మారిపోతున్న కోయ సంప్రదాయాల పట్ల ఏమీ చెయ్యలేని నిస్సహాయత మనకు ఆమెలో స్పష్టంగా కనిపిస్తుంది. అన్నీ మారిపోతున్నాయని బాధ పడుతుంది. తన ప్రమేయం లేకుండనే అన్నీ జరిగిపోతున్నాయని మదనపడుతుంది. కోయ పెద్దలైన పోయి, పూజారి, యాపారి వూససలే వుండదు. వాళ్ళ స్థానంలో కొత్త పూజారి వచ్చి మంత్రాలు చదివి పెళ్ళి జరిపిస్తాడు. ఈ మార్పుల్ని కాకమ్మ జీర్ణించుకోలేదు. తన మరణమైనా కోయ సంప్రదాయం ప్రకారం జరిగి ప్రశాంతంగా తనువు చాలించుకోవాలనుకుంటుంది.

ఈ కథ చెబుతున్నపుడు నరేటర్ ఒక పాత్రగా మనకు కనిపిస్తుంది. కాకమ్మ తనకు బొడ్డుకోసి ఈ నేల మీదకు తెచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకుని చనిపోయినపుడు కట్టే చీరల్ని ముందే కొనిపించుకుని పెట్టెలో దాచుకుంటుంది. ఆ పెట్టిలో చిల్లర పైసల మూటా,పాతకాలం నాటి బంగారు నణెం, ఒక ఉట్టి, చేట, కొడవలి, చిప్ప, గరిగె ముంత, కుండ లాంటి సరంజామా అంతా సిద్ధం చేసుకునే తీరు మనకి వణుకు పుట్టిస్తుంది. ఈ కథ చదివాక ఈజిప్టు మమ్మీల నిర్మాణంలో ట్రెజరర్స్ ని భద్రపరిచిన దృశ్యం మనకు ఆవిష్కృతమౌతుంది.

రెండో కథ ”చప్పుడు”. పోతప్ప భార్య సుంకులు చనిపోతుంది. ఆమె ఆత్మ కు శాంతి కలగాలంటే కోయ సంప్రదాయం ప్రకారం డోలోళ్ళను పిలిపించాలి. ”పూర్బం” చెప్పించాలి. పోతప్ప గూడెం వదిలి పాల్వంచ టౌనులో నివశిస్తూ వుంటాడు. అసలు ”పూర్బం” చెప్పడానికి డోలోళ్ళు పాల్వంచకు వస్తారా…రారా? టౌనులో కోయ సంప్రదాయ ’పూర్బం’ సాధ్యమా? సాధ్యం కాకపోతే సుంకులు ఆత్మ శాంతిస్తుందా లేదా? పూర్భం నిర్వహించడానికి నగర నివాసులు అందించిన సహకారం ఎలాంటిది? మరణ సందర్భాల్లో కూడా నాగరీకులు అమానవీయంగా స్పందించిన తీరు ఈ కథలో చర్చనీయాంశం.

చనిపోయిన సుంకులు జ్నాపకాల్నీ…ఆమెతో తమకున్న అనుబంధాల్నీ నెమరివేసుకోవడం… జాతి చరిత్రనంతటినీ మననం చేసుకోవడం… ఆనముంతతో ఆమెను ఆవాహన చేసుకోవడం పూర్బం లక్ష్యం. అది నెరవేరిందా లేదా అనేది కథ. ఇందులో అర్ధ రాత్రి డోలోళ్ళు పాటలు పాడుతుంటే ఇరుగు పొరుగు వాళ్ళు అభ్యంతరం చెప్పడమే కాకుండా అది జరగకుండా అడ్డుకుంటారు కూడా. ఈ నేపధ్యంలో ”ఆకాశంలో చుక్కల పట్టి మంచం తలకిందులవుతోందా?” అని కథ ముగిస్తుంది. తల కిందులవుతోంది ఆకాశంలో చుక్కల పట్టి మంచమేనా? పాఠకుడి మదిలో ఒక కదలిక ప్రారంభమవుతుంది.

”ముసిలి” కథలో ముసిలి తునికాకులు తెంపడానికి అడవిలోకి అందరితో వెళ్లి దారి తప్పి దాహంతో నీళ్ళు అందక ప్రాణాలొదులుతుంది ఒంటరిగా. ఆమె ఆచూకిని ఆమె ప్రేమగా పెంచుకున్న కుక్కే చూపిస్తుంది గ్రామస్తులకి. ఆమె కార్యం రోజు ఆ కుక్క కూడా ప్రాణాలొదులుతుంది. ఇది స్థూలంగా కథ.

ఇందులో ముసిలి తునికాకులు తెంపడానికి వెళ్ళినప్పుడు నీళ్ళు దొరక్క పడే ఇబ్బందుల్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. అదే సమయంలో కుక్క, ముసిలి మధ్య వుండే బంధాన్ని చక్కగా వివరిస్తుంది. వూరంతా కలిసి ఆమెకు కర్మ కాండలు జరిపించడం…ఒక సామూహికతను మనకు అర్ధం చేయిస్తుంది ఈ సంఘటన ద్వారా. ఆనముంత చుట్టూ కుక్క తిరుగుతూ వుంటే ”ఈ కుక్క ముంతలో దూరేట్టుంది” అని అనుకుంటూ అందరూ దాన్ని దూరంగా తరుముతుంటారు గానీ అసలు విషయం కథ చివర్లో తెలుస్తుంది.

ఈ కథల్లో కథా సమయాల్ని చక్కగా వివరిస్తుంది… రచయిత్రి.

”పచ్చిపొద్దువేళ… ”

”చుక్కల పట్టి మంచం తిరిగబడే వేళ… ”

”దామెరాకు పొద్దు మోహరించే సమయానికి…ముగ్గురు డోలోళ్ళు గుంపులోకి ప్రవేశించారు”

”ఇంట్లో ఆడవాళ్ళు డోళ్ళకు పశుపు కుంకుమ రాసి వాళ్ళను లోపలికి పంపేరు… గాంధారి వేలైంది.”

”మధ్య సిత్రం వేళకి తీతు గుంపుకు చేరుకున్నారు.”

”మొలకల పల్లి పోయిండు సేవడి వేళకి వస్తడు ”

”బొమ్మెత్తు వేళ. దట్టంగా మంచు….”

లాంటి వాక్యాలు పాఠకుడిని మోహంలోకి దించేస్తాయి.

చివరి కథ ”మూగబోయిన శబ్దం” పెద్దయ్య కొడుకు మరణిస్తాడు. కార్యం చేయడానికి…పూర్బం చదివి… కర్మకాండలు చెయ్యాలనుకుంటాడు. కానీ చిన్నాన్న అవేవీ కాకుండా వాక్యం చదివి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతాడు. అదేమిటీ డోలోళ్ళు రారా? పూర్బం పాడి వినిపించరా?? అని అడిగితే… ”నేను మతం మారిపోయాను” అని మెడలో శిలువని తడుముతూ చెప్తాడు.

ఈ కథలో ఆదివాసీ గూడేల్లోకి క్రిష్టియన్ మతం ప్రవేశించి ఎంత ప్రభావితం చేసిందో చూస్తాం. మతమే లేని కోయ జాతిలోకి మతం వేరు పురుగులా ప్రవేశించిందన్నమాట! అంటూ వ్యాఖ్యానిస్తుంది రచయిత్రి. కోయలకో చరిత్ర వుందని ఇంత దాకా బయటి ప్రపంచానికి తెలువదు. అది తెలిసిన కాలానికి వాళ్ళు కోయల దగ్గరకు రాలేకపోవడం… కోయ చరిత్ర కూడా చివరి శ్వాస లో వుందనిపిస్తుంది.. రేపు దానికి కూడా జోలెపట్టాలేమో! అని రచయిత్రి కోయ జీవితాల దైన్యతను వ్యక్తం చేస్తుంది.

ఈ కథల్లో ఘర్షణ ప్రధానంగా కనిపిస్తుంది. రాయకుండా వుండలేనితనం స్పష్టమౌతుంది. నాగరిక సమాజంలో కోయ సంప్రదాయాల మనుగడ కోసం కొట్లాట కనిపిస్తుంది.

ఈ కథలతో రచయిత్రి పద్దం అనసూయ తొలి ఆదివాసీ రచయిత్రిగా వెలుగులోకొచ్చారు. సాహిత్య చరిత్రలో ఒక సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆమెకు అభినందనలు తెలుపుతూనే కొన్ని సూచనలు చెయ్యదలచు కున్నాను. ఆమె రాతను దగ్గరగా గమనిస్తుంటే నాకేమనిపించందంటే… కథ రాయడానికి ఆమెలో ఏమూలో ఏవేవో భయాలున్నట్టు కనిపిస్తున్నది. శైలీ… శిల్పం…వంటి కథానిర్మాణ పద్ధతుల గురించి ఏవో మొహమాటాలున్నట్టు రాతలో అర్ధమవుతున్నది. శైలీ…శిల్పం లాంటి కొలబద్దలు కొలిచే వాళ్ళకి. అడవి గురించి… ఆదివాసీ గురించి రాసే వాళ్ళకి కాదు. ఆకు కదిలితే కథ. పొద్దు పొడిస్తే కవిత్వం. ఆ కదలికల్ని… పొద్దు పొడుపుల్ని బట్టి కొలమానల్ని మార్చుకోవాలంతే. ఈమె రాయాల్సిన కథలు చాలా వున్నాయి. చావు గురించి చప్పుడెలా చేసిందో… పుట్టుక గురించీ… పండుగ గురించి… కోయల ప్రతి కదలికల గురించి రాయాల్సి వుంది. ఆదివాసీల మీద రాజ్యం ప్రకటిస్తున్న అప్రకటిత యుద్ధాన్ని అక్షరాల రూపంలో రికార్డు చేయాల్సే వుంది.అందుకే ఒకే ఒక్క మాట ఆమె కోసం… కొలమానాల భయం వీడి, రాత వేగం పెంచాలని.

తొలి మహిళా కోయ కలానికి సలాం చేస్తూ… ఆదివాసీల తరపున జొంజోర్! జొంజోర్!!

You Might Also Like

2 Comments

  1. రేసు.ఆదినారాయణ మూర్తి

    ఆదీవాసీ సంస్కృతిలో మేకమైన ప్రతీఆదీసీ ఈమతాలుమారడం సంస్కృతిమటుమాయంకావడంపై గుండెలోతుల్లో ఆవేదనచెందుతూ మనసు మదనపడుతూనేఉన్నా ఏంచేయలోతెలియనిపరిస్థితి.ఆర్యబ్రాహ్మణులేమోతమమెజారిటీకోసంహిందువులలోకలిపేసారు.క్రైస్తవులేమో రోగాలుపేరుతోమార్చేసుకుంటున్నారు.అమాయక ఆదీవాసీలనుప్రతీదోపిడీకిసులువుగాబలైపోతున్నరు.దీనికిఅంతూపొంతూఉందోలేదోఎటూతేల్చుకోలేకపోతున్నం….

  2. Anil అట్లూరి

    మంచి పరిచయం జగదీశ్.
    ఈ శనివారం అంటే 13 ఆగస్ట్ సాయంత్రం 7 గం (IST) వేదిక తన కధ చప్పుడుని జాలం లో పరిచయం – చర్చ నిర్వహిస్తోంది. ఆసక్తి ఉన్నవారు వివరాలకోసం
    ఇక్కడ చూడవచ్చు.

Leave a Reply