Gangs of Bangalore (నా దాదాగిరి రోజులు 1974 – 86)

వ్యాసకర్త: అమిధేపురం సుధీర్

Gangs of Bangalore (నా దాదాగిరి రోజులు 1974 – 86)  – అగ్ని శ్రీధర్ (అనువాదం – సృజన్)

బెంగుళూరు అంటే ముందునుంచీ నాకు ఒక ప్రత్యేక అభిమానం. నా ఉద్యోగ జీవితంలో భాగంగా కొన్నేళ్ళు నేను అక్కడ వుండడం వల్ల కావచ్చు, ఆ నగరం లో నాకు ఎన్నో మంచి జ్ఞాపకాలు వుండడం వల్ల కావచ్చు. నా వరకూ నాకు బెంగళూరు సెకండ్ హోం లాంటిది. 

పగలు చూసే బెంగుళూరు కి రాత్రి చూసే బెంగుళూరు కి చాలా తేడా వుంటుందన్న విషయం నాకు అక్కడికెళ్ళిన  కొంతకాలానికే అర్థం అయ్యింది. ఒకసారి రాత్రి ఒంటరిగా నడుస్తున్న నన్ను కొట్టి నా మొబైల్ ఎత్తుకుపోయారు. మరో రెండుసార్లు ఆటోవాళ్ళతో   అర్థరాత్రి దెబ్బలాడే పరిస్తితి తృటిలో తప్పింది.  ఇలాంటి చెడు సంఘటనలు కూడా నాకు కొన్ని మంచి విషయాలు నేర్పించాయి. అక్కడి లోకల్ ఫ్రెండ్ తో ఒకసారి బ్రిగేడ్ రోడ్ లోని ఒక పబ్ కి వెళ్ళినప్పుడు ఒక లావుపాటి వ్యక్తి ని చూపించి అతనే అక్కడి లోకల్ రౌడీ అన్నాడు. నాకు నమ్మకం కలగలేదు. హైదరాబాద్ లో పుట్టి బుద్దెరిగాక ఎన్నడూ ఒక్క రౌడీని కూడా చూడని నాకు బెంగళూరు లో ఒకతన్ని చూపించి ఇతనే రౌడీ అంటే ఆశ్చర్యంగానే వుంటుంది. కానీ తర్వాత అర్థమయ్యిందేమిటంటే అతను నిజమే చెప్పాడని. ఇప్పటికీ కొద్దో గొప్పో అక్కడ ఇంకా అలాంటి వాళ్ళు ఉన్నారు.

ఇంతకుముందే Bhais of Bengaluru అనే పుస్తకం, మొన్ననే అగ్ని శ్రీధర్ గారి మరో చిన్న పుస్తకం ‘తెగింపు ‘ చదవడం వల్ల,  ఈ పుస్తకం గురించి తెలిసింది. ఆర్డర్ చేసి, పుస్తకం చేతిలోకి రాగానే ఏక బిగిన చదివాను.

1974 నుంచి 1986 వరకూ, అండర్ వరల్డ్ తో ఈ రచయిత కున్న పరిచయాలు, అతని అనుభవాలే ఈ పుస్తకం. ఇంత మంచి శైలి, సాహిత్యం మీద మొదటి నుంచి ఆసక్తి వున్న అతను  ఒక క్రిమినల్ గా మారి, అలాంటి పనులు ఎలా చేసాడో అనిపించింది.

ఈ పుస్తకం గురించి ఒక కథ లాగా విశ్లేషించడం కష్టం. ఇది ఒక్క కథ కాదు, ఎంతోమంది వ్యక్తులు, వారి గురించిన ఎన్నో కథలు ఇందులో వున్నాయి. Dongri to Dubai, Mafia queens of Mumbai లాంటి క్రైం పుస్తకాలు చదివేవాళ్ళకి ఈ పుస్తకం తప్పకుండా నచ్చుతుంది. మొదట కన్నడ లో విడుదలై, తర్వాత ఆంగ్లం లోకి అనువదింపబడి, తర్వాత తెలుగులోకి వచ్చింది. ఇది మొదటి భాగం మాత్రమే, దీని తర్వాత Dadagiriya Dinagalu – Vol 2 1986 To 1991 , ఇంకా Dadagiriya Dinagalu – Vol 3 1991 To 2000 అని ఇంకో రెండు పుస్తకాలు కూడా కన్నడలో వచ్చాయి. తెలుగులోకి ఇంకా అనువాదం అయినట్టు లేవు.  ఇతను రచయితే కాకుండా, నటుడు, దర్శకుడు కూడా. ఇతని పుస్తకాలు ఆధారంగా చేసుకొని కొన్ని సినీమాలు కూడా వచ్చాయి.  ఇతని మిగతా పుస్తకాలు కూడా త్వరగా తెలుగులోకి అనువదింపబడాలని కోరుకుంటున్నాను.

You Might Also Like

Leave a Reply