ఇంగ్లీష్ థ్రిల్లర్ సీరీస్: The Kind Worth Killing – Peter Swanson

రాసినవారు: నారాయణ శర్మ G V.


(నారాయణ శర్మ గారు “ఇంగ్లీష్ థ్రిల్లర్ నవలలకు తెలుగు రివ్యూలు” అనే సీరీస్ ని ఫేస్బుక్ లో తమ వాల్ పై నిర్వహిస్తున్నారు. వాటిని పుస్తకం.నెట్ లో కూడా ప్రచురించేందుకు అనుమతించిన వారికి మా ధన్యవాదాలు.

ఈ సీరీస్‍లోని వ్యాసాలన్నీ ఈ లింక్ లో కనిపిస్తాయి. – పుస్తకం.నెట్)

*****

(‘చంపేసేందుకు తగినవారు’ – పీటర్ స్వాన్సన్)

మర్డర్ మిస్టరీలను, సస్పెన్సుతో కుర్చీ అంచున కూర్చోబెట్టే కథల్ని యిష్టపడేవాళ్లకి చాలా మందికి నచ్చే కథ ఇది. పీటర్ స్వాన్సన్ రచనల్లో కథానుగుణంగా హింస, శృంగారం ఉంటాయి. కనుక ఇది పెద్దలకే.

***

సముద్రం ఒడ్డున టెడ్ పెద్ద ఇల్లొకటి కట్టిస్తుంటాడు. టెడ్ భార్య మిరాండా అక్కడే ఉండి ఆ పనిని మానేజ్ చేస్తుంటుంది. టెడ్‍ది నగరంలో కంపెనీలు అమ్మటం, కొనటం పని.

ఇల్లు కట్టే కాంట్రాక్టరు బ్రాడ్‌తో మిరాండా అనైతిక సంబంధం పెట్టుకుంటుంది. వాళ్ళిద్దర్నీ అలా చూసినప్పటినుండీ టెడ్ మనసు రగిలిపోతూ ఉంటుంది: ‘ఆమెకు తాను విడాకులు ఇవ్వచ్చు- కానీ తన ఆస్తిలో సగం ఆమెకు ఇవ్వాల్సివస్తుంది- “దానికంటే ఎలాగో ఒకలాగా ఆమెను చంపేయటమే నయం..”‘

ఆ సమయంలోనే టెడ్ కు ఎయిర్ పోర్టులో ఒకమ్మాయి లిల్లీ కనిపిస్తుంది. వాళ్లిద్దరూ కలిసి ఓ ఐదారు గంటలు విమాన ప్రయాణం కూడా చేస్తారు. ఆ కొద్దిసేపట్లోనే అతను తన కష్టాలు-సుఖాలు అన్నీ చెప్పుకుంటాడు ఆమెకు. ‘ఎట్లాగూ మళ్లీ కలవం’ అనే ఊహతో అతను ఆ తన భార్యని ‘చంపెయ్యాలని ఉంది’ అని కూడా చెప్పేస్తాడు.

***

ఈ లిల్లీ మామూలు అమ్మాయి కాదు- చిన్నప్పుడు తనని బలవంతం చెయ్యబోయిన వాడిని ఒకడిని ఉపాయంతో అంతం చేసేసి, ఎవరికీ చెప్పకుండా దిలాసాగా ఉన్న చాకులాంటి చిన్నది. టెడ్ ని ఆమె మర్డర్ చేయమని ప్రోత్సహిస్తుంది. “దానికోసం నేను 

ఉపాయం చెబుతాను. నేను చెప్పినట్లు చేస్తే ఇట్లా భూమికి బరువైన వాళ్లు, వాళ్ళంతట వాళ్లే పోయినట్లు పోతారు- బయటివారికి ఎవ్వరికీ ఏమీ తెలీకుండా అంతా చేయచ్చు నువ్వే” అని తన ఆలోచనలు కొన్ని చెబుతుంది. ముందు ఆ కొత్త ఇంటి దగ్గరి వాతావరణం, బ్రాడ్ అలవాట్లూ అన్నీ గమనించి చెప్పమంటుంది. 

టెడ్ ఆ సమాచార సేకరణ చేసాక, అనుకున్న ప్రకారం లిల్లీని వాళ్ల ఊళ్లో కలిసి ఆ వివరాలు అందజేస్తాడు. ఇద్దరూ కలిసి చేతికి మట్టి అంటకుండా పని జరిగేట్లు ఒక పథకం ఫైనలైజ్ చేస్తారు. 

***

అయితే మిరాండా కూడా మామూలు చిన్నది కాదు. ఆమెకు కావలసింది అసలు బ్రాడ్ కాడు- ఆమె టార్గెట్ భర్త ప్రాణాలు! బ్రాడ్ బలంగా, మొద్దుగా, మొరటుగా ఉంటాడు. అతన్ని ప్రేరేపించి టెడ్ ని చంపించాలని, అట్లా ఆస్తి మొత్తాన్నీ సొంతం చేసుకోవాలని ఆమె ఆలోచన!

***

టెడ్ తన పథకాన్ని అమలు చేసే ముందే మిరాండా పథకం అమల్లోకి వచ్చేస్తుంది. బ్రాడ్ వెళ్లి టెడ్ ని చంపేస్తాడు. 

***

లిల్లీకి ఒకదానికీ అసలు సంగతి తెలుసు. ‘మిరాండాని, బ్రాడ్ ని ఇక తనే నేరుగా శిక్షించాలి- వాళ్లు the kind worth killing’ అని ఆమె డిసైడ్ అయిపోతుంది. ఆమెకు మిరాండాకు ఉన్న పూర్వ పరిచయం కూడా మనకు అప్పటికి అర్థం అవుతుంది: ‘అందరూ అందరే, ఎవరూ మాములువాళ్లు కారు’ అని తెలుస్తుంది. కొంచెం చాలా భయం కూడా వేస్తుంది.

***

లిల్లీ పథకం ఏంటి, అది ఎలా వర్కయింది, ఈ క్రమంలో పోలీసులు ఏం చేసారు? చివరికి ఏమైంది, అందరూ దొరికారా, ఎట్లా దొరికారు?- ఇవి పుస్తకం చదివి తెలుసుకోవాల్సిందే.

***

సమాజంలో పలు దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి దుర్మార్గం వల్లా ఎందరో కొందరు వ్యక్తుల మనసులు ప్రభావితం అవుతుంటాయి. అట్లా దుర్మార్గాలు నేరప్రవృత్తికి కారకాలు అవుతాయి; నేరప్రవృత్తి తిరిగి దుర్మార్గాన్ని పోషిస్తుంది. అట్లాంటి భయంకర వలయాన్ని ఒకదాన్ని ఈ నవల చదువరుల ముందు ఆవిష్కరిస్తుంది. 

‘ఇట్లాంటి విషవలయాలను ఛేదించటం చాలా ముఖ్యం’ అని మనకు సులభంగానే అర్థం అవుతుంది- కానీ ఎలా చేయాలో మటుకు తెలీదు. బహుశ: వ్యక్తులు ఎవరికి వాళ్లు ఆత్మ విమర్శ చేసుకొని జాగ్రత్తగా ఉండటమే కావాలి కావచ్చు. 

You Might Also Like

Leave a Reply