The tenth rasa – An anthology of Indian nonsense

tenthrasa సంవత్సరం బట్టీ బోరు కొట్టినప్పుడల్లా ఏదో ఓ పేజీ తీసి, కాసేపు నవ్వుకుని, పెట్టేస్తూ, ఎన్నిసార్లు చేసినా, ఇంకా బోరు కొట్టలేదు, పుస్తకమూ పూర్తి కాలేదు. అలా అని, పుస్తకం గురించి చెప్పకుండా ఇన్నాళ్ళు ఆగడం కూడా ఏమీ బాలేదు నాకు. ఎందుకంటే, ఇన్ని రోజుల్లో ఎప్పుడు దీన్ని తీసినా, మూసాక చాలాసేపు దాని గురించి ఆలోచిస్తూనే ఉన్నా. అదీగాక, నాలో నాకు తెలీని కళాపోషణని బయటపెట్టిన పుస్తకం కనుక ఇదంటే నాకెంతో ఇష్టం. విషయానికొచ్చేస్తున్నా, పుస్తకం పేరు – ది టెంత్ రసా. (The Tenth Rasa – An anthology of Indian nonsense).

“నాన్సెన్స్!” అనడానికి, “నాన్సెన్స్ ఫిక్షన్” కూ ఎంత సంబంధం ఉందో నాకు తెలీదు కానీ, ఆ పదాన్ని కొట్టిపడేసినట్లు ఈ సాహిత్యాన్ని కొట్టిపడేయలేము అని నా అభిప్రాయం. నాన్సెన్స్ ఫిక్షన్ అంటే పిల్లల సాహిత్యమే అని చాలామంది అభిప్రాయం. కానీ, ఈ పుస్తకం చదివాక, ఆ తరువాత కొంత కొంతగా నాన్సెన్స్ ని ఎక్స్‍ప్లోర్ చేయడం మొదలుపెట్టాక, ఇది పిల్లల సాహిత్యానికే పరిమితం కాదు అని అర్థమైంది. ఇంతకీ, ఈ పుస్తకం ఇలా వివిధ భారతీయ భాషల్లో ఉన్న నాన్సెన్స్ సంప్రదాయాన్ని గురించి అన్వేషించి, వాటి ప్రతినిధులుగా కొన్ని కవితలు/కథలు/వ్యాసాలు ఎన్నుకుని వాటిని ఆంగ్లంలోకి అనువాదం చేసి విడుదల చేసిన సంకలనం. ఇందులో హిందీ, బెంగాలీ, అసామీ, ఒరియా, తమిళ్, మరాఠీ,మలయాళం,భోజ్పురి, గుజరాతి, ఉర్దూ,కన్నడ, తెలుగు, thado-kuki,హర్యనవీ,పంజాబీ,మిజో మరియు ఇంగ్లీషు భాషల నుండి తీసిన కవితలు,కథలు,వ్యాసాలు ఉన్నాయి. వీటినన్నింటినీ ఎంపిక చేయడమే ఓ పెద్ద ప్రహసనం. మళ్ళీ ఆంగ్లానువాదాలు కూడానూ.

మామూలు ప్రక్రియలను అనువదించడం కంటే nonsense fiction ను, అందునా, కవిత్వాన్ని అనువదించడం చాలా కష్టంతో కూడుకున్న పని. తెలుగులో నాన్సెన్స్ ఫిక్షన్ ను ఏమంటారో నాకు తెలీదు. అయితే, తెనాలి రామకృష్ణుడి – “మేక తోకకు మేక తోక…” ను దీని కిందకు చేర్చవచ్చు. ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది. నాన్సెన్స్ ను అనువదించడం కష్టమని ఎందుకన్నానో. ప్రధానంగా ఈ సంకలనం కూర్పరుల కష్టాన్ని చూస్తే తెలుస్తుంది వాళ్ళకి దీనిపై ఎంతటి అభిమానం ఉందో.

చదువరిగా నేను పూర్తిగా ఎంజాయ్ చేసాను ఈ పుస్తకాన్ని. ఒక భాషది అని కాదు. అన్ని భాషలలోని నాన్సెన్స్ నూ చాలా ఆస్వాదిస్తూ చదివాను. అయితే, నా ఏడుపల్లా ఏమిటీ అంటే, మిజో లాంటి భాషల నుండి కూడా నాన్సెన్స్ పట్టుకురాగలిగిన వారు, తెలుగు భాషవి ఎందుకు కేవలం మూడంటే మూడే చేర్చారు? అన్నది. తెలుగులో ఈ సంప్రదాయం లేదా ? (లేకుంటే అది పెద్ద బాధే!) ఉండి వీళ్ళకి తగల్లేదా? నాకు నాన్సెన్స్ పరిచయమైంది బెంగాలీ ద్వారా. సుకుమార్ రాయ్, ఉపేంద్రకిశోర్ రాయ్ చౌదరి ల కథలు, కవితల ద్వారా. ఈ పుస్తకంలో విరివిగా పదులు, ఇరవైలు, ముప్పైల సంఖ్యలో ఉన్న బెంగాలీ, మరాఠి నాన్సెన్స్ కవిత్వం చూశాక ఆయా భాషల్లో ఈ సంప్రదాయం బలంగా ఉందని తెలిసింది. మిగితా భాషల్లో కూడా- ప్రధానంగా ఒరియా వంటి భాషల్లో సుమారు ఎంట్రీలు ఉన్నాయి. హిందీ, ఇంగ్లీషుల సంగతి చెప్పనక్కర్లేదు. తమిళ, మలయాళ భాషలవి కూడా బానే ఉన్నాయి. మరి తెలుగుకేమొచ్చింది? అక్కడ ఉన్న వాటిలో ఒకటి తెనాలి రామకృష్ణుడిది, ఒకటి శ్రీశ్రీది. మధ్యలో ఏమైనట్లూ? తర్వాతేమైనట్లూ?

ఈ తరహా సాహిత్యాన్ని మీరు ఎంజాయ్ చేయగలము అనుకుంటే, దీన్ని మించిన పాఠ్య గ్రంథం లేదు. వద్దొద్దు. పాఠ్య గ్రంథమంటే మళ్ళీ సీరియస్సనుకుంటారు. ఇది కేవలం రసికజనమనోరంజనానికే సుమా!

తప్పక చదవవలసిన పుస్తకం. హాయిగా నవ్వుకోడానికి మంచి మార్గం. పూర్తి వైల్డ్ ఇమాజినేషన్. రచయితలకు కొన్నిసార్లే వందనాలు. అసలు వీటిని అనువదించగలిగి ఆంగ్లంలో అందించారే, ఆ అనువాదకులకు కోటి వందనాలు.

జై బోలో నాన్సెన్స్ ఫిక్షన్ కో!

పుస్తకం వివరాలు:
The tenth rasa (An anthology of Indian nonsense)
Edited by: Michael Heyman, with Sumanyu Satpathy and Anushka Ravishankar.
Penguin, 2007
Rs 295/-
వీరి తాలూకా బ్లాగు: ఇక్కడ.


ప్రస్తుతం కంపైల్ అవుతున్న anthology of world nonsense తాలూకా బ్లాగు: ఇక్కడ.

You Might Also Like

Leave a Reply