చాతకపక్షులు: నిడదవోలు మాలతి

వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి

ఉన్న చోటు నుంచి కొత్త చోట నాటబడిన మొక్క మెల్లమెల్లగా కొత్త గాలికీ, నీటికీ అలవాటుపడుతూ, నెమ్మదిగా నిలదొక్కుకుంటూ,  తన ఉనికిని తరచి చూసుకొనడంలా నాయిక జీవనగమనాన్ని చిత్రించిన నవల చాతకపక్షులు.  ఒక సరళరేఖ లాంటి సాధారణ ఇతివృత్తమే అయినా, నేటికి యాభై అరవై ఏళ్ళ క్రిందటి విషయాలు, అలవాట్లున్న కథ అయినా, సర్వకాలీనమైన చింతనలతో, సంభాషణలతో, మనస్తత్వ చిత్రణతో ఈ కథను పాత కథ అనిపించనీయకుండా చక్కగా సాగే కథన శైలి లో నిడదవోలు మాలతి గారు వ్రాశారు. పాత్ర చిత్రణ కూడ వర్ణన పద్ధతిలో కాకుండా కథాగమనంలో వ్యక్తమయ్యే విధంగా ఉంది. ఈ పద్ధతి ద్వారా పాత్రలు చదువరులకు నేరుగా పరిచయమవుతాయి. మాటకారులు కాకపోయినా  వారిలో వారికి పరిచయాలు, స్నేహితులిచ్చే తోడ్పాటు,సమాజం పెట్టే ఇబ్బందులు, మానసికంగా ఎదగని పాత్రల సహజమైన జీవితాలు, అందులోని ఒడిదుడుకులు అన్నీ కలిపిన అల్లిక ఈ కథనం.

అందులో ముఖ్యంగా ఒక విషయం గురించి ప్రత్యేక ప్రస్తావన అవసరం. 

అదేమిటంటే –

కథలు  వ్రాయడంలో కృత్యాద్యవస్థలు, వాటిల్లోని తప్పొప్పుల గురించిన చిన్న చర్చలు వీటి ద్వారా కొత్త కథకుల పాత్రల వైపు నుంచి సహజంగా చిత్రించారు. 

భిన్నకోణాల్లో సమాజాన్ని ఆవిష్కరించక గోడలు కట్టుకున్న నేటి పోకడల వల్ల సాహిత్యపు పరిధి సంకుచితమవుతున్న స్థితి,

 విమర్శ కు పెట్టవలసిన మెరుగు,

సాహిత్యంలో ఉండవలసిన ధ్వని,

 భిన్న దృక్పథాలను, భిన్న ప్రపంచాలను ఆమోదించగల పరిపక్వత,

వైవిధ్యమైన సాహిత్యప్రపంచాల మీద సరైన అవగాహన 

ఇవన్నీ ఎలా ఉండాలో, ఎందుకు లేవో, దాని వల్ల నష్టమేమిటో 

అనుభవజ్ఞుడైన రచయితతో సంభాషణగా అంతే సహజంగా చిత్రించారు.

రచనలు సమర్థవంతంగా చేయడం చాలామందికి తెలుసు. రచనా ప్రపంచపు లోతులను, విస్తృతిని అర్థం చేసుకోవడం అందరు రచయితలకూ తెలీకపోవచ్చు. ఆసక్తి లేకపోవచ్చు. 

 కాల్పనిక కథలో సమర్థవంతంగా ఈ విషయాలను సహజంగా చర్చకు తీసుకురావడం అన్నది ఈ నవల యొక్క విశిష్టత. ఇది ప్రత్యేకంగా చెప్పుకోదగిన అంశం.

చాతకపక్షులు అన్న శీర్షిక కూడా సంతృప్తికరంగా అమరింది. నవల చివరన తన జీవితాన్ని తరచి చూసుకుని నాయిక చేసిన వ్యాఖ్య నిజమేనని నాయిక జీవితాన్ని నవలంతా పరచిన విధానం కూడా చదువరులకు  స్పష్టం చేస్తుంది. 

ఎంత సన్నిహితంగా ఉన్నా మనుష్యులు ఎదుటివారి దృష్టికోణం నుంచి ఆలోచించలేకపోవడం అనే చిత్రణ కూడా నవలలో బాగుంది. కాకపోతే పాత్రలు మరింత సంయమనంతో ఉన్నాయి గానీ ఇటువంటి సందర్భాలు నిజజీవితాలలో ఘర్షణలను తీసుకొస్తాయి. ముఖ్యపాత్రలు ఉదాత్త రీతిలో మలచబడినవి. ఈ ఉదాత్తత సమాజంలో అరుదు.   

ఇంకా అక్కడక్కడా మెరిసే అవగాహనతో కూడిన వాక్యాలకు, చతుర్లకు నవల చదవడమే మార్గం. 

You Might Also Like

Leave a Reply