పిల్లల సినిమా కథలు –

వ్యాసకర్త: వారాల ఆనంద్

*********

రండి .. అక్షరాల్లో సినిమాలు చూద్దాం! అంటూ మిత్రుడు అనిల్ బత్తుల తాను రాసిన పిల్లల సినిమాల కథలు పుస్తకం పంపించారు. వివిధ ప్రపంచ భాషల్లోని ఉత్తమ బాలల చిత్రాల్ని పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ పుస్తకం రాసానని తన ముందు మాటలో రాసారు. ఏ  సినిమాకయినా కథే ప్రాణం కనుక ఆయా సినిమాల కథల్ని మాత్రమే చెప్పటానికి ప్రయత్నించానని కూడా చెప్పారు.

అయితే కథ వినడం, చదవడం, చూడడంలోనూ తద్వారా కలిగే ప్రభావంలోనూ చాలా  తేడాలుంటాయి. పిల్లల మనో ఫలకంపై దృశ్యం చూపించే ప్రభావం అమితం. అయినప్పటికీ అనిల్ తను చెప్పిన సినిమా కథల్లో మంచి కథనం వుంది. అవి చదువరుల్ని ఆకట్టుకునేలా వున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రతిష్టలు కలిగిన 25 సినిమాల కథల్ని మంచి బొమ్మలతో, గెట్అప్ తో పుస్తకంగా తీసుకొచ్చిన అనిల్ బత్తుల గారిని మొదట మనసారా అభినందిస్తున్నాను. ఇవ్వాళ పిల్లల గురించి వాళ్ళకోసం ప్రత్యేక సినిమాల గురించి ఆలోచించే వారే దాదాపు కరువయిన స్థితిలో అనిల్ గారు పిల్లల మీద ఎంతో ప్రేమతో బాధ్యతతో ఈ పుస్తక ప్రయత్నం చేసారు. తాను స్వయంగా ఆ కథలు చదివి ఆయా సినిమాలు చూసి తిరిగి ఆ కథల్ని సరళమయిన రీతిలో పరిచయం చేయడంలో అనిల్ బత్తుల తీసుకున్న శ్రమ పుస్తకాన్ని చూస్తే అర్థమవుతుంది.

ఈ పుస్తకం చేరగానే ఆసక్తిగా విషయసూచిక చూసాను.అందులో తాను పరిచయం చేసిన సినిమాల పేర్లు చూడగానే నా మదిలో అనేక జ్ఞాపకాలు ముప్పిరిగొన్నాయి. మూడు నాలుగు దశాబ్దాలుగా ప్రతి ఏటా నవంబర్లో కరీంనగర్ లోనూ ఇతర గ్రామాల్లోనూ నిర్వహించిన “బాలల  చిత్రోత్సవాలూ”, నేను జ్యూరి గానూ ప్రేక్షకుడి గానూ పాల్గొన్న అనేక అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాలూ అన్నీ సినిమా రీలులాగా కళ్ళముందు కదలాడాయి. ఇంకా 1999 లో నేను రాసిన “బాలల  చిత్రాలు” దాని ఆంగ్లానువాదం ‘CHILDREN’S CINEMA’ (Tr.By A.Saiprasad) అప్పటి అనుభవాలూ అన్నీ గుర్తొచ్చాయి.

నిజానికి ‘జీవన రాగంలో మధురమయిన ఆలాపనే బాల్యం’.  ఆ “బాల్యం మనిషికి తండ్రి లాంటిది” అని ఓ మహాకవి అన్నాడు. ఇంకో గజల్ కవి నా యవ్వనంతో సహా సమస్తాన్నీ తీసుకో కానీ నా బాల్యాన్ని, ఆనాటి కాగితప్పడవనీ, ఆనాటి వాననీ  తిరిగి ఇవ్వమన్నాడు. అంత గొప్పదీ మధురమయిందీ బాల్యం. మానవ జీవన వికాసంలో బాల్యం అత్యంత ప్రభావవంతమయిన పాత్రని పోషిస్తుంది. ఆ బాలల మనోవికాసంలో కథ, సంగీతం, చిత్రలేఖనంతో పాటు అన్ని సృజనాత్మక రంగాలూ ప్రముఖ పాత్రని పోషిస్తాయి. అమ్మ పాడే జోల పాట, పంచతంత్ర కథలు, కాశీమజిలీ కథలు జాతక కథలూ పిల్లల మీద ఎంతగా ప్రభావాన్ని చూపుతాయో మనకు తెలుసు. అదేక్రమంలో ఇవ్వాళ సినిమా విశ్వవ్యాప్త మయిన దృశ్యమాధ్యమంగా  పిల్లల మానసిక స్థితిపైన తీవ్రమయినప్రభావాన్ని చూపిస్తున్నది.

తెరపైన బొమ్మలు కదలడం మొదలయిన నాటి నుండీ సినిమా పిల్లల్ని ఏదోరకంగా తనలో ఇముడ్చుకుంటూనే  వుంది. అయితే సినిమా ప్రధానంగా వ్యాపారమయిపోయిన స్థితిలో స్వల్పంగానే అయినా వ్యక్తులుగా కొందరు దర్శకులు, కొన్ని సంస్థలు ప్రత్యేక బాలల సినిమా కోసం ప్రయత్నాలు చేసాయి, చేస్తున్నాయి. వివిధ దేశాల్లో ప్రత్యేక నిర్మాణ సంస్థలూ, చిత్రోత్సవాల నిర్వహణ కొనసాగుతున్నది.  అయితే పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందినవి బాల సినిమాలా, పిల్లలు నటించినవి బాలల సినిమాలా, పిల్లలే రూపొందించినవి పిల్లల సినిమాలా అన్న వాదన కొనసాగుతూనే వుంది. ఇక ఫీచర్ సినిమాలూ, అనిమేషన్, డాక్యుమెంటరీల్లాంటి అనేక రూపాల్లో పిల్లల సినిమాలు వస్తున్నాయి. ప్రపంచ సినిమా రంగంలో పిల్లల సినిమాలు ఓ ప్రత్యేకమయిన అంశం.

అదట్లా వుంచి ప్రస్తుత “పిల్లల సినిమా కథలు” పుస్తక అంశానికి వస్తే అనిల్ బత్తుల ఎంపిక చేసుకుని పరిచయం చేసిన దాదాపు అన్ని సినిమాలూ ప్రపంచవ్యాప్త మన్ననల్ని అందుకున్నవే. తాను పరిచయం చేసిన రెడ్ బెలూన్, చిల్ద్రెన్ ఆఫ్ హెవెన్, ద కార్ట్, ద మిర్రర్, రన్నర్ లాంటి సినిమాలు గొప్ప బాలల సినిమాలు, అత్యంత సున్నితమయిన అంశాల్ని ఇతివృత్తాలుగా తీసుకుని దృశ్య కావ్యాలుగా రూపొందిన సినిమాలవి. ఇరాన్ సినిమాల్లో ముఖ్యంగా విషయం పిల్లలదే అయినా అంతర్లీనంగా దర్శకులు స్పృశించే అంశాలు చాల ప్రధానమయినవి. అత్యంత తీవ్రమయిన వ్యతిరేకమయిన వాతావరణంలో ఆయా దర్శకులు రూపొందించిన సినిమాలు గొప్ప చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆయా సినిమాల కథల్ని అనిల్ మంచి కథనం తో చాలా బాగా చెప్పారు.
 

అయితే సత్యజిత్ రే ‘పథే ర్ పాంచాలి’, విత్తోరియా డెసికా ‘బైసికల్ తీవ్స్’ సినిమాల్ని పిల్లల సినిమాలుగా పరిచయం చేయడం కొంత ఇబ్బందిగానే అనిపించింది. ఎందుకంటే ఆ సినిమాలు హ్యూమన్ డాక్యుమెంట్లు. పిల్లలు పాత్రధారులుగా వున్నారని పిల్లల సినిమాల కోటాలో వేశారేమో కానీ రే పిల్లలకోసం ‘హిరక్ రాజర్ దేశే’, ‘గోపి గైనే బాఘా బైనే’, ‘సోనార్ ఖేల్లా’, ‘పికూస్ డెయిరీ’ లాంటి అనేక సినిమాలు నిర్మించారు.

అయినప్పటికీ అనిల్ బత్తుల వెలువరించిన ‘పిల్లల సినిమాల కథలు’ ఆహ్వానించదగ్గ పుస్తకం. వర్తమాన డిజిటల్ యుగంలో ‘దునియా ముట్టీమే’ అంటున్న స్థితిలో కుప్పలు తెప్పలుగా పిడికిట్లో పడిపోతున్న సినిమాల్లోంచి పిల్లల కోసం వున్న కొన్ని  మంచి సినిమాలని వాటి కథల్ని మన ముందుంచడం ఎంతో ఉపయోగకరమయిన ప్రయత్నం. పిల్లలు ఏ సినిమాలు చూడాలి అన్న ప్రశ్న వచ్చినప్పుడు ఇగో ఈ 25 తప్పకుండా చూపండి అని అనిల్ బత్తుల తెలుగు వారి ముందుకు తెచ్చారు. ఆయన్ని మనసారా అభినందిస్తున్నాను.
(పుస్తకం కోసం నవోదయ బుక్ హవుస్, హైదరాబాద్ లో    సంప్రదించవచ్చు.  
ఆన్లైన్ లో కొనటానికి లంకె ఇక్కడ.)

You Might Also Like

Leave a Reply