ఒందు బది కడలు: వివేక్ శానభాగ్

“ఈ కథ జరిగేది ఉత్తర కన్నడ జిల్లాలో. కరావళికి చెందిన ఈ జిల్లాలో అనేక నదులు ప్రహవించి సముద్రానికి చేరుతాయి. నది సముద్రాన్ని చేరే చోటు దూరంనుంచి శాంతంగా, మనోహరంగా కనిపించినా, ఆ నదీముఖం మధ్యకి వెళ్ళి చూసినప్పుడు నది సాగరాన్ని చేరుతున్న కోలాహం కనిపిస్తుంది. అంతటి పరిణామాలతోటే పోరాడుతుంటాయి ఇక్కడి జీవితాలు.”

నవల ముందుమాటలో భాగంగా రచయిత ఈ వాక్యాలని రాశారు. వెనుక అట్టమీద ప్రత్యేకించి ఈ మాటల్ని వేశారు. “ఒందు బది కడలు” అంటే “ఒక పక్క సముద్రం”. కరావళి అంటే భారతదేశానికి పశ్చిమాన ఉన్న కోస్తా ప్రాంతం. అక్కడి వారి జీవితాలని అక్కడి నదులతో పోల్చి, అవి దూరం నుంచి శాంతావతారంలో కనిపిస్తున్నా (అంటే, అప్పటికే అక్కడో పుట్టి, కొండలూ రాళ్ళ మీద నుంచి దూకి, ఎన్నో మైళ్ళు ప్రయాణంలో ఉన్నంత దూకుడు, జోరు ఇక లేకపోయినా) దగ్గరగా వెళ్ళి చూస్తే సముద్రంలో కలిసే ముందు కూడా వాటిల్లో ఎంతో కోలాహలం కనిపిస్తుందని, అక్కడివారి జీవితాలూ అలాంటివేననీ రచయితే ముందుగా చెప్పడంతో, చదవడం పూర్తవ్వగానే ఆ ఉపమానానికి పఠనానుభవం ఎంత దగ్గరగా వచ్చిందనేది తరచిచూసుకోడం సహజం. పల్లెల్లో, అందునా చుట్టూ నీరుండి రాకపోకలు కొంచెం కష్టమైన ప్రాంతాల్లో, ఉత్తరాలు రాసుకోవడం తప్ప మరే టెక్నాలజి లేని సమయాల్లో, జీవితాలు ఎంత సాఫీగా, హాయిగా, ఆరాముగా గడిచిపోయుంటాయనే అపోహ మనలో ఉంటుంది కనుక, ఇలాంటి నవలలు పూర్తిచేయగానే ఆ జీవితాల్లో ఉండే సంక్లిష్టతలు, అయోమయాలు అబ్బురపరుస్తాయి. అందరూ అందరికి తెల్సిన ఊళ్ళల్లో, ప్రతి ఒక్కరి జీవితం వేరొకరితో ముడిపడక తప్పని సమాజంలో, ఏ కాలానికి ఆ కాలం తెచ్చే మార్పులతో, వాటితో సతమతమయ్యే మనుషులతో ఈ నవల నిండుగా పారుతుంది. రచయితన్న కోలాహలమూ సుబ్బరంగా, శృతులే కాక అపశృతులతో, సహా వినిపిస్తుంది. 

అయితే ఆ పోలికని అక్కడితో ఆపేయకుండా ఇంకాస్త ముందుకి సాగదీసి, నదులూ-జీవితాలు దగ్గర ఆగక సముద్రాన్ని మృత్యువు తర్వాతి అనంతంతో పోల్చుకున్నాక నాకీ నవల ఇంకా గొప్పగా అనిపించింది. “ఒందు బది కడలు” అంటే ఓ పక్క సముద్రమని కాక, ఒక పక్క అనంతమైన చీకటి, మనకి అంతుచిక్కని లోకమనుకుంటే, జీవితమనే ప్రతీ నదీ అందులో కల్సి కనుమరుగైపోవాల్సిందేనని అనుకుంటే  (“మట్టిలో కల్సిపోవడం”, “పంచభూతాల్లో కల్సిపోవడం” లాంటి పదబంధాలు మనకెటూ ఉన్నాయి) అప్పుడు బతుకు ఈ అనంతంలో కల్సిపోయే పక్రియయైన మరణం,  నదీసంగమమంత పవిత్రమైనదీ, మనోహరమైనదీ అన్న కొత్త కోణం కనిపించింది. అప్పుడు మృత్యువంటే వియోగం కాదు, వదిలిపెట్టిపోవడం కాదు, అది సంయోగం – కల్సిపోవడం అన్న కొత్త అర్థం స్ఫురించింది. హైస్కూలులో మాప్స్ మీద నీలిరంగుతో నదుల పేర్లు, బ్రౌన్ రంగుతో పర్వతాల పేర్లు రాసేవాళ్ళం కదా? అలా మన జీవితాలనీ ఒక “మాప్” (map) గీసి చూసుకుంటే మన పరుగులు కూడా మృత్యువు లోయ వైపుకే అనిపించేలా చేసింది ఈ నవల. 

నవలంటే కథో లేదూ కొన్ని కథల సమాహారమో. ఆ కథలు కొందరి బతుకుల గురించి. వాళ్ళెదురుకున్న కష్టనష్టాలు, ఒడిదుడుకుల గురించి. ఈ నవలా అంతే! ఎవరి కథ నడుస్తుందీ ఇప్పుడు ఈ పేజీల్లో? అని ఏ పేజీలో ప్రశ్నించుకున్నా (కథలో ఇంకా) బతికున్నవాళ్ళ పేరే సమాధానంగా వస్తుంది. కానీ, నవల మొత్తం మృత్యువు పరుచుకుని ఉంటుంది. అంతర్లీనంగా, నిశ్శబ్దంగా, నీడలా. సముద్రం ఇంకా కనిపించకున్నా సముద్రానికి బాగా దగ్గరకొచ్చామని తెలియజెప్పేలా ఒకలాంటి వాసనతో కూడిన గాలి, ఒకలాంటి చెమట పడతాయే… అలా నవలంతా మృత్యువు ఆవరించుకుని ఉంటుంది. కథ మొదలవ్వడమే విధవలైన అత్తాకోడళ్ళతో మొదలవుతుంది. మొదటి నాలుగైదు పేజీల్లోనే కూర్చున్నవాడు కూర్చున్నట్టే అనాయాసంగా చనిపోయిన ఒక యువకుని చనిపోయిన వర్ణన ఉంటుంది. కథ ముందుకెళ్తున్న కొద్దీ రకరకాల చావులు – ఆకస్మిక మరణం, ప్రమాదంలో చనిపోవడం, ఆత్మహత్య వగైరా వగైరా. 

ఆ చావుల గురుత్వాకర్షణను (gravity)ని తప్పించుకుంటూ, తప్పించుకోలేకో బతుకుతున్న వారి కథలే ఈ నవలతంతా! నిలకడగానో, దూకుడుగానో అందరూ ఆ అగాధంలో కలవడానికి పెట్టే పరుగులే! ఇందులో ఉన్న వాక్యాన్నే paraphrase చేయాలంటే, “వాక్యాల మధ్య, శబ్దాల మధ్య, దీర్ఘ మౌనాల మధ్య, నిట్టూర్పుల మధ్య అతను చెప్పకుండా ఉన్నదాంట్లో…” మృత్యువునే నేను ఊహించుకున్నాను.  

*****

ఇది నలుగురు అక్కచెల్లెళ్ళ కుటుంబ కథ. వారికో తమ్ముడు. వాళ్ళ జీవితాలు, పెళ్ళిళ్ళు, పిల్లలు వాళ్ళ పెళ్ళిళ్ళే నవలలో ముఖ్య ధార. అది కాకుండా కలిసి విడిపోయే పిల్లకాలువల్లాంటి జీవితాలు మరికొన్ని. వీళ్ళందరినీ ఏదో రకంగా కలిపే దారం పురందర అనే పాత్ర. అతడికో పదిహేనళ్ళప్పటి వయసునుంచి కథ మొదలై అతడి చదువు, ఉద్యోగం, పెళ్ళి చుట్టూనే నవల తిరుగుతూ ఉన్నట్టు అనిపించినా ఆ పదిహేను ఇరవై ఏళ్ళ కాలక్రమంలో ఆ కుటుంబాల్లోనూ, ఊరిలోనూ వచ్చే మార్పులు పట్టుకుంటుందీ నవల. 

ఖచ్చితంగా ఫలానా సంవత్సరాల్లో జరుగుతున్న కథ అని ఎక్కడా ఉండదు కానీ అందాజుగా మనకి అర్థమవుతుంది. చదువు మీద శ్రద్ధ పెరుగుతున్న కాలం, ఆడపిల్లలు కూడా మెట్రిక్ వరకూ చదువుకుంటుంటారు. అబ్బాయిల మీద ఉద్యోగం తెచ్చుకుని స్థిరపడాలి అనే ఒత్తిడి పడుతుంది. పెళ్ళి విషయంలో పెద్దల ప్రణాళికలే చెలామణిలో ఉన్న “జీవితాంతం కాపురం చేయాల్సింది నువ్వు, అందుకని నువ్వు ’ఊ’ అంటేనే మాట ముందుకెళ్ళేది!” అని కనీసం అబ్బాయిలని అడగడం మొదలెట్టిన రోజులు. “విధవలు మళ్ళీ పెళ్ళి చేసుకోవడం కొత్తేం కాదు. ఎంతమంది ఎదురైనా చేసుకుని తీరుతాను” అని ప్రతినలు పూనే అవేశాలకి అవకాశమిచ్చే రోజులు. ప్రతీ కాలమూ సంధి కాలమే అనుకుంటా! 

రెండొందల పేజీలకి మించని ఈ కథనంలో రచయిత ఎన్ని రకాల వైవిధ్యాలని చూపించారో లెక్కేసుకుంటూ పోతే చాంతాండంత జాబితా అవుతుంది. డబ్బున్నవాళ్ళు-లేనివాళ్ళు, ఆదరించినవాళ్ళు-ఆదరించబడ్డవాళ్ళు, బిడ్డలున్నవాళ్ళు-లేనివాళ్ళు, భర్తలు ఉన్నవాళ్ళు – విడిచివేయబడ్డవాళ్ళు- చనిపోయినవాళ్ళు, అర్థాయుష్షు వాళ్ళు – ముసలితనం చూసినవాళ్ళు, ఇళ్ళు దాటలేనివాళ్ళు-ఇంటినుంచి పారిపోయినవాళ్ళు, నోరేసుకుని మీదపడేవాళ్ళు -నోట్లో వేలుపెట్టినా కొరకలేనివాళ్ళు, ముక్కుసూటిగా పోయేవాళ్ళు – మాటలతో మతలబులు చేసేవాళ్ళు – ఎన్ని వైరుద్ధ్యాలు, వైవిధ్యాలో పాత్రలలో, వారి చేష్టలలో. 

నవలని క్రాఫ్ట్ చేయడం కూడా అలానే చేశారు. పైకి కథ మామూలుగా, సాఫీగా సాగుతున్నట్టే అనిపిస్తుంది. కథ ఎక్కడా ఆపలేనంత వేగంగా నడుస్తూనే ఉంటుంది. కానీ ఆగి చూస్తే, దగ్గరగా చెవి పెట్టి ఆలకిస్తే ఇంకెన్నెన్నో స్ఫురిస్తాయి, అర్థమవుతాయి. కథనంలో ఉన్న జటిలత్వం అర్థమవడం మొదలవుతుంది. ఈ నవల అన్ని భారతీయ భాషల్లోకీ ఎందుకు అనువాదమవ్వాలి అంటూ గాయత్రి ప్రభు రాసిన ఒక వ్యాసంలో (లింక్ ఇక్కడ) ఈ నవల social realismకి modernismకి మధ్యన ఉంటుందని రాశారు. నాకూ అలానే అనిపించింది. పైన నేను ప్రస్తావించిన వైరుద్ధ్యాలన్నీ గమనించుకోడానికి కూడా ఈ శైలే కారణం. ఒక చోట ఇద్దరి స్నేహితుల మోనోలాగ్స్ ఉంటాయి. ఒకడు ఇంటినుంచి పారిపోయి ఊరూరా నాటకాలేసుకుంటూ, ఆడవాళ్లతో సంబంధాలు పెట్టుకుని తిరిగినవాడు. ఇంకొకడు అసలు ఎటూ పోకుండా, నచ్చినచ్చకున్నా చుట్టూ ఉన్నవాళ్ళు చెప్పేదే చేసేవాడు. అప్పటివరకూ third person narrationలో కొనసాగుతున్న నవల ఇలా మోనోలాగ్‍లా మారడం ఆశ్చర్యమనిపించింది. అప్పుడోసారి ఆగి మళ్ళీ ఆలోచించుకుంటే అర్థమైంది రచయిత క్రాఫ్ట్ కనిపిస్తున్నంత సరళంగా లేదని, వేర్వేరు తాళ్ళని ఆయన చాలా దగ్గరగా అల్లుతున్నారని. 

*****

ఇది, నా లెక్క ప్రకారం, స్త్రీ నవలే! మరి స్త్రీ నవలలంటే ముఖ్యపాత్ర స్త్రీ అయ్యుండి, ఆమె కష్టనష్టాలు, ఇష్టాయిష్టాల చుట్టూనే కథ నడవాలన్న నిర్వచనముందేమో నాకు తెలీదు కానీ, స్త్రీ జీవితాలని దగ్గరగా అర్థం చేసుకునే అవకాశం కల్పించే ఏ రచననైనా స్త్రీ నవలే అని అనుకుంటే మాత్రం నాకీ నవల అలాంటిదే! ఈ మధ్యకాలంలో నేనేం చదువుతున్నా (నవలే అవ్వచ్చు లేదా ఎవరిదైనా ఆత్మకథే అవ్వచ్చు) స్త్రీ పాత్రలకి ఎంత జాగా (space) ఇచ్చారు, ఇచ్చిన జాగాలో వాళ్ళకెంత ఆస్కారం (scope) ఇచ్చారు అని పెద్ద శ్రమ పెట్టకుండానే నా బుర్ర లెక్కలేసుకుంటూ పోతుంది. ఆ లెక్కల్లో ఈ నవలకి ఎక్కువ అంకెలే పడ్డాయి. 

నేను చదివిన భారతీయ సాహిత్యంలో కె.ఆర్.మీరా రాసిన “హాంగ్‍వుమెన్”కి ప్రత్యేక స్థానముంది – దాంట్లో ఆనాదిగా కనిపించని, వినిపించని భారతీయ మహిళల చరిత్ర సింహావలోకనంగా ఉంటుంది. కృష్ణా సోబ్తీ రాసిన “మిత్రో మర్జాని”లో కూడా ముగ్గురు వేర్వేరు వ్యక్తిత్వాలు గల కోడళ్ళని, వాళ్ళ మధ్య బంధాలని చూపిస్తారు. అయితే విశేషంగా ఒక స్త్రీపాత్రనే కథకి కేంద్ర బిందువు చేయకుండానే ఈ నవల ఆ ప్రాంతపు, ఆ కాలపు ఆడవాళ్ల జీవనవిధానాలని, ఆలోచనల్ని నాకు దగ్గర చేసింది. 

భర్త చనిపోయి మళ్ళీ బొట్టు పెట్టుకోని స్త్రీ, భర్త చనిపోయినా అప్పుడప్పుడూ చాటుగా బొట్టు పెట్టుకునే స్త్రీ, భర్త ఉన్నాడో, పోయాడో తెలీకపోయినా బొట్టు పెట్టుకునే ఉండే స్త్రీ – అందరూ ఉన్నారు ఇందులో. భర్త లేకపోవడం ఒక వ్యక్తిగతమైన లోటు. అలాంటప్పుడు బొట్టుపెట్టుకోకపోవడం ఒక సాంఘిక ఆచారం. ఇవి కళ్ళకి కనిపించేవి. కానీ ఈ లోటులే, ఆచారాలే ఆ ఆడవాళ్ళ వ్యక్తిత్వాలని కనిపించకుండా, గుర్తుపట్టలేకుండా ఎలా మార్చేస్తాయో, నోరేసుకుని మీదపడే గయ్యాళితనం కూడా ఒక defensive mechanism అవ్వచ్చునని గుర్తుచేసిందీ నవల. 

ఒకడు బాంక్ ఉద్యోగంలో టెంపరరీగా చేరి అది పర్మనెంటు అవ్వాలని తాపత్రయపడుతుంటే ఒక సీనియర్ సలహా ఇస్తాడు: “ఊరికే కష్టపడి పనిజేయడం కాదు. చెవులు తెరుచుకుని ఉండాలి. ఆఫీసులో ఏం జరుగుతుందో తెల్సుకోవాలి. అన్ని విషయాలు అందరి దగ్గరా వినాలి, కానీ వినిపించినవ్వన్నీ మనసులో పెట్టుకోకూడదు.” అచ్చంగా అదే పనిని, ఒక పెళ్ళి సంబంధం విషయంలో గోదక్క (నలుగురు అక్కచెల్లెళ్ళలో ఒకరైన గోదావరి) చేస్తుంది, ఇంకా నేర్పరితనంతో. తన చెల్లి కూతురుకి కాకుండా, తను పెంచుతున్న మరో అక్క కూతురికి ఆ సంబంధం కుదిరేలా చేస్తుంది. అందుకని ఆమెని అందరూ నానామాటలూ అంటారు. ఆ సీనియర్ చెప్పినట్టు ఆమె ఏం పట్టించుకోదు వేటినీ!  పనికావడం ముఖ్యం. 

ఇంకో చోట ఒకడు విధవరాలైన ఒకామెని పెళ్ళి చేసుకుని ఆమెని ఉద్ధరించాలని తెగ ఉవ్విళ్ళూరతాడు. సమాజమంతా ఆమె చుట్టూ ఓ కోట కట్టిందనీ, అయినా దాన్ని కూల్చి ఆమెకో కొత్త లోకాన్ని చూపిస్తాననీ తెగ ఊగిపోతాడు. ఆమెని ఒప్పించి దొంగచాటున పెళ్ళి చేసుకున్నాక తెల్సిందేమంటే అడుగడుగునా ఆమె అత్తగారే వాళ్ళ ప్రణయానికి, పెళ్ళికి దారి సుగమం చేసి పెట్టిందని. 

అలానే, అప్పటి వరకూ, పెళ్ళీడుకొచ్చిన పిల్ల, తెల్సిన సంబంధం కుదర్చటానికి నానాయాతనా పడుతున్నాడు తండ్రి అన్నంత వరకే పాత్ర ఉన్న అమ్మాయి, ఆ సంబంధం ఎటూ తప్పి, వేరే చోట పెళ్ళి అవ్వగానే ఒక హోటల్ నడిపే సామర్థ్యం ప్రదర్శిస్తుంది. అలా అని, అన్ని ఆడపాత్రలూ ఇలా ఉన్నాయని కాదు. ఏం మాట్లాడకుండా, దేనికీ పోట్లాడకుండా అంతా దేవుని మీదే భారమని వదిలేసే పాత్రలూ ఉన్నాయి. అదే వైవిధ్యం. ఆస్కారం ఉన్నంతలో ఈ ఆడవాళ్ళు ఒక ఊరునుంచి ఇంకో ఊరికి ఒంటరిగా ప్రయాణిస్తారు, పెళ్ళిళ్లకి హాజరవుతూ తమ స్వంత అజెండాలు పూర్తిచేసుకుంటారు, తమకి కావాల్సింది చాకచక్యంతో కుదుర్చుకుంటారు, అవసరముంటే గట్టిగా మాట్లాడతారు, అనవసరమనుకుంటే ఏ మాత్రం విషయాన్ని బయటకు పొక్కనివ్వరు – such rich and diversified representation of Indian rural women in all their innocence and cunningness! 

*****

ఈ నవల తెలుగు అనువాదం త్వరలో రాబోతుందని విన్నాను. కన్నడ వచ్చినవారికైతే ఇందులో కొంకణి భాష ప్రభావం స్పష్టంగా తెలుస్తుందనుకుంటాను. నేను మాత్రం కొన్ని హిందుస్తానీ పదాలు (ఉదా: మహనెత్తు) కనిపించినప్పుడు మరాఠి ప్రభావమని అనుకున్నాను. ఆంగ్లంలో ఇంకా అనువాదం రాలేదు. వస్తే ఈ భాషా పరమైనవి దాంట్లో పట్టుకోవడం కష్టం. శ్రద్ధగా చేస్తే తెలుగులో మాత్రం చాలా వరకూ ఆ లేయర్స్ ని పట్టుకురావచ్చు. నేను ఇప్పటి వరకూ తెలుగు కాక హిందుస్తానీలోనే చదివాను కాబట్టి కొన్ని జాతీయాలు/ ప్రయోగాలు/ తిట్లు తెలుగుకి కొంచెం దూరంలో ఉన్నట్టు అనిపించేవి. కానీ ఇది చదువుతుంటే మాత్రం కొన్ని తెలుగులో వినిపించాయి, ముఖ్యంగా డైలాగులు. తెలుగుకి అంత దగ్గరైన భాష నేనంతకు ముందెప్పుడూ చదవలేదు కాబట్టి మరీ థ్రిల్‍గా అనిపించింది. 

నేను పూర్తి చేసిన రెండో కన్నడ నవల ఇది. (భీమాయణ మలయాళ అనువాదం). తేజో తుంగభద్రకీ దీనికి, అసలు సంబంధమే లేని కథలే అయినా, రెంటిలోనూ నదులూ, సముద్రాలు వాటి చూట్టూనే బతికేవాళ్ళ గురించి కాబట్టి నాకు దగ్గరగా అనిపించాయి. పైగా కథనంలో పైపైకి ఒక అలుపులేకుండా చదివించే గుణం రెంటిలోనూ ఉన్నా ఆ పొరను తీసేస్తే మాత్రం తెరుచుకునే భావాల సంక్లిష్టిత, ఎంతటి విభిన్నమైన అంశాలనీ/విషయాలనీ కలుపుకుంటూ పోతున్నారనేది  గమనించుకుంటే మాత్రం భలే ఆశ్చర్యం వేస్తుంది. పైగా రెండూ ఇప్పటి కాలానికి సంబంధించిన కథలు కావు. ఇప్పటికాలానికి సంబంధించిన “ఘాచర్ ఘోచర్”ని రచయిత క్రాఫ్ట్ పరంగా చాలా వేరుగా ట్రీట్ చేశారు. కన్నడ రచయితలు ఇలాంటి రచనలు చేసి సైలెంటుగా మాస్టర్‍క్లాసులు ఇస్తున్నారనిపిస్తుంది నాకు. వాటిని ఎంత బా ఆకళింపు చేసుకోగలిగే నాలాంటివాళ్ళకి అంత మహదానందం!

ఒందు బది కడలు (కన్నడ నవల)
వివేక్ శానభాగ్
అక్షర ప్రకాశన
వెల: 200 

You Might Also Like

Leave a Reply