2020లో నా పుస్తక పఠనం: అక్షరాలే దవా, దువా

ఏ ఊరిలోనైనా మనకి నీళ్ళు, నిద్రా ఎంతకాలం రాసిపెట్టి ఉంటే అంత కాలం మనం అక్కడుంటామనేది నేను చిన్నతనంలో బాగా విన్న నానుడి. నీళ్ళ రుణం, నిద్ర రుణం అని ఉంటాయని. అట్లాగే ఏ భాషలోనైనా మనకి పుస్తకాలు రాసిపెట్టి (pun unintended) ఉంటే ఆ భాష అక్షరాలు మనల్ని చేరతాయన్న సంగతి నాకు 2020లోనే అనుభవమైంది. ఆ అనుభవాన్నే ఇక్కడ పంచుకోబోతున్నాను. మొదలెట్టే ముందో మాట –

జాబితాలనేవి ఒక సౌకర్యం. బోలెడన్ని వివరాల మధ్య అవసరమైన సమాచారాన్ని ఏరుకోవాల్సిన అవసరం లేకుండా ఒక చిట్టా ఉంటే తేలికవుతుందని. అది పుస్తకం.నెట్‍లో “గడిచిన ఏడాదిలో మీరేం చదివారు?” అన్న శీర్షిక అయినా, లేదూ “ఈ ఏడాదిలో ఎన్ని పుస్తకాలు చదవాలనుకుంటున్నారు?” అని గుడ్‍రీడ్స్ వాళ్ళు అడిగినా – ఉద్దేశ్యం ఒక్కటే! చదివినవాటిని ఒక చోట చేర్చమని. మరెవ్వరికైనా దాంట్లో ఆసక్తికరమైనవి కనిపిస్తాయని. కానీ, దాన్నీ మనమొక ఎలుకల పందెంగా (rat-race)లా మార్చుకుంటూ పోతున్నాం. “మీరిన్ని చదివేశారా?” అన్న అబ్బురం చాలా త్వరగా “నేనేం చదవలేకపోతున్నానే” అనే నిరాశ వైపుకి వెళ్ళిపోతుందని గమనించుకోవడం లేదు. మనమేమైనా బడికి ఏడాది పాటు సెలవులు ఇచ్చేసిన పిల్లకాయలమా? ఏ చీకూచింతా లేకుండా, ఏ బాదరాబందీ లేకుండా పుస్తకాలే ముందేసుకుని కూర్చోడానికి? When did adulting become so ridiculously easy that a book a week is treated as a norm?

పుస్తకాలే కనుమరుగైపోతున్నాయన్న వాదన వినిపిస్తున్న కాలంలో అనుకున్నని పుస్తకాలు చదవలేకపోయామని బెంగ ముచ్చటగా ఉంటుంది గానీ, మనకున్న పరిస్థితులను, పరిమితులను బేఖాతరు చేస్తూ మరీ మనల్ని నిందించుకునే వైపుకి వెళ్ళడం అనారోగ్యకరం, అనవసరం.  

ఎన్ని చదివామో అన్నే చదివాం. ఎంత చదివామో అంతే చదివాం. ఈ ఏడాది కాకపోతే మరో ఏడాది. అదీ కాకపోతే పై ఏడాది. మనం ఉండాలే గానీ, పుస్తకాలేం పాచిపోవు. Let’s consider being kind to ourselves! 

*****

బెంగళూరుకి మకాం మార్చిననాటి నుంచీ కన్నడం నేర్చుకోవాలనుకుంటూనే ఉన్నాను. అసలు హైదరాబాద్‌లో ఉండగానే ఉర్దూ రాయడం నేర్చుకోవాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎట్టకేలకి ఈ ఏడాదిలో రెంటికీ సమయమొచ్చింది. అన్నీ ఆన్‍లైన్ అయిపోవడం వల్ల కలిగిన లాభాల్లో ఇదొకటి – నేర్పించేవాళ్ళు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా మనకోసం అట్టిపెట్టే గంటా గంటన్నర సమయం చాలానే నేర్పిస్తుందని. 

భాష ఎప్పుడూ ఒక్కళ్ళమే నేర్చుకోలేము. దానికో కమ్యూనిటి కావాలి. నేర్చుకునే స్థలాలు, నేర్చుకున్నది వాడే పరిస్థితులు ఉంటేనే బాగా వంటబడుతుంది. అలా కలిసొచ్చిన వాళ్ళందరికీ థాంక్స్ చెప్పుకోడానికే రాస్తున్న వ్యాసమిది. అందులో నా ఫ్రెండ్ ఆదిత్యకి కాస్త ఎక్కువగా చెప్పుకోవాలి. నేనిక్కడ రాసే ప్రతి అంశం మేం ఆల్రెడీ మాట్లాడుకునే ఉండి ఉంటాం. ఆ సంభాషణలకి “enriching”, “rewarding” అన్న విశేషణాలు కూడా వాడచ్చు, కానీ “deeply nourishing” అన్న విశేషణం మాత్రమే వాటి సారాన్ని పట్టుకోగలదు. మేము తేజో తుంగభద్ర నవల చదివిన అనుభవాలని నా బ్లాగ్‍లో పంచుకున్నాను. అక్కడ రాసినట్టు నేను ఆదిత్య కోసం “థాంక్స్-కోటి” రాయలేను. బుద్ధిగా నేర్చుకుని, మరింత శ్రద్ధగా చదవడమే నేను చెప్పగలిగే థాంక్స్! 

*****

కన్నడం: 

అందరూ చెప్పే మాటే ఇది: తెలుగువాళ్ళకి కన్నడం నేర్చుకోవడం చాలా సులువు, అక్షరాలు బాగా పోలినట్టుంటే  భావవ్యక్తీకరణ కూడా చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి భాష త్వరగానే వచ్చేస్తుందని అంటారు. అది నిజమే, కానీ అది పూర్తి నిజం కాదు. 

కవలలు ఉంటారా, మరీ అచ్చుగుద్దినట్టుండేవాళ్ళు కాదు. పక్కపక్కన ఉంటే ఎవరు ఎవరన్నది తెలుస్తారు, కానీ ఒక్కళ్ళే చూస్తే వెంటనే ఎవరో చెప్పలేం – తెలుగు-కన్నడ అలాంటి కవలలు అనుకుందాం. ఈ కవలల్లో ఒకళ్ళు మనకి బాగా తెలిసినంత మాత్రాన ఇంకొకళ్ళని తెల్సుకోడం తేలికైపోదు. ఎందుకంటే –

వాళ్ళ ఎలా కనిపిస్తారని చెప్పడం తేలిక (కన్నడంలో అక్షరాలు గుర్తు పట్టడం), వాళ్ళ ఆహారపు అలవాట్లు, బట్టలు వగైరా పరిచయమై ఉంటాయి, దాదాపుగా (కన్నడంలో వాడే పదబంధాలు, జాతీయాలు మనకి దగ్గరగా ఉంటాయి) కానీ ప్రతీ మనిషిని ప్రత్యేకంగా నిలబెట్టే గుణాలుంటాయి కదా, చేతులాడించే విధానమే కావచ్చు, ఊతపదాలే కావచ్చు, ఎన్నో idiosyncranicies – కన్నడం వచ్చు అంటే వీటిని గుర్తుపట్టగలగడమే, పట్టుకోగలగడమే! 

“నువ్వెంతగా తెలుగులా అనిపిస్తున్నా నువ్వు తెలుగు కావు. నువ్వు కన్నడమే. నువ్వు ఎంతలా అమ్మలా కనిపిస్తున్నా, అమ్మవి కావు, దొడ్డమ్మవే (పెద్దమ్మ)” అని అనిపించిన క్షణాల్లోనే కన్నడంతో అనుబంధం ఏర్పడుతోందని నా నమ్మకం. అప్పటికే మూడునాలుగు పేజీలు చదివున్నా, కన్నడమని అర్థమవుతున్నా, ఎక్కడ్నుంచో అమాంతంగా తెలుగు వచ్చేస్తుంది. అవి తెలుగక్షరాలు అయిపోతాయి, తెలుగు అర్థాలు స్ఫురిస్తాయి. అప్పుడో క్షణం వెనక్కి తగ్గి, “నో…నో!” అనుకోవాలి. అలా ఎన్ని “కాదు-కాదు”లు పడితే అనుబంధానికి అంత బా పునాదులు పడుతున్నట్టు లెక్క! (అన్ని బంధాలూ “యెస్”తోనే మొదలవ్వవూ, కొన్ని నో-నోలతో బలపడతాయ్, చూశారా?!)

తేజో తుంగభద్ర నవల గురించి రాయాల్సింది చాలా ఉంది. దీని ఇంగ్లీషు అనువాదం వస్తే గానీ ఇదెంత గొప్ప నవలో, మన కాలానికి ఎందుకంత ముఖ్యమో అన్న చర్చలు అవ్వవు. ఆయన ఏకకాలంలో ఎన్ని తాళ్ళని పేనారంటే, ఎక్కడ్నుంచి మొదలెట్టి దేని గురించి చెప్పాలో అర్థం కాదు. కానీ భాష రాని నాచేత, అరవై ఏళ్ళ పాటు భాషకి దూరంగా అమ్మమ్మ చేత అంత లావుపాటి పుస్తకం పూర్తి చేయించడం శైలిలోని సరళత్వం అయితే, మేము ఇద్దరం కాసేపు స్థలకాలాదులు మర్చిపోయి ఆనాటి స్త్రీ జీవితాలను పరామర్శించగలిగామంటే, “ఆడదానిగా ఈ కాలంలో పుట్టడం మన అదృష్టం” అనుకున్నామంటే, that speaks volumes of his grand yet grounded vision! 

ఆ తర్వాత జయంత్ కాయ్కిణి కథలు ఓ రెండు మూడు చదివాం. మళ్ళీ పదం-పదం మౌఖిక అనువాదం చేసుకుంటూ. కాయ్కిణిని చదవడం కష్టం, వాక్యం చాలా తిరకాసుగా ఉంటుంది. పైగా చెప్తున్నదాంట్లో కన్నా చెప్పని దాంట్లో ఎక్కువ కథని దాస్తారాయన. భాష మీద పట్టులేని నాలాంటివాళ్ళకి అది కాస్త కష్టం. అలా నేను అనుకుంటున్నానా, లేక నిజంగానేనా అన్నది పరీక్షించుకోడానికి వివేశ్ శాన్‍భాగ్ “ఒందు బది కడలు” మొదలెట్టాను. సగం వరకూ సాఫీగా సాగింది, కానీ తర్వాత వేరే పుస్తకాల్లో పడి దానికి బ్రేక్ ఇచ్చాను. 

ఇహ, ఎమ్.టి.వాసుదేవన్ నాయర్ మలయాళీ నవలని కన్నడ అనువాదంలో చదవడం ఏదైతే ఉందో… I just outdid myself there! తెల్సొచ్చిన సంగతి మాత్రం అదే – కన్నడం నేర్చుకుంటే మలయాళ సాహిత్యాన్నికి బోలెడంత దగ్గరవ్వచ్చని. [బెంగళూరునుంచి కేరళకి వెళ్ళడం దగ్గరైనట్టు]

భాష అంతగా రానప్పుడు (అంటే వ్యాకరణం ఎలా పనిజేస్తుందోనన్న అనుమానాలు పోకుండా, చాలా వరకూ పదాలు తెలీకుండా) ఇంతటి భారీ సాహిత్యం చదవడం కొంచెం తిక్క పుట్టిస్తుంది ఈ రకంగా: 

  • లెక్కకి పుస్తకం చదవడం పూర్తవుతుంది, కానీ అంతా గ్రహించగలిగానన్న నమ్మకం కుదరదు. తేజో నవలకి సంబంధించిన టాక్స్ అటెండ్ అయ్యాను, కన్నడవాళ్ళు రాసిన రివ్యూలు చదివాను. ప్రతీసారి, “నేను మిస్స్ అయిందేదో చెప్తారు వీళ్ళిప్పుడు” అనే అనిపిస్తుంది. కానీ నాకు తెల్సిందే చెప్తారు వాళ్ళు కూడా! 
  • చదివేశాకే కాదు, చదువుతున్నప్పుడు కూడా ఈ మబ్బు-మబ్బు ఫీలింగ్ ఉంటుంది. ఉదా: మొదటి చాప్టర్‍లో ఎవరో చనిపోతారు, కానీ ఏ నేపథ్యం ఇవ్వలేదనుకుందాం. మామూలుగా అయితే అది నరేటివ్‍లో భాగం, ఎక్కడ చెప్తారో చూద్దామని అనుకుంటాం. కానీ ఇలా భాషరాని యవ్వారంలో, ఈయన ఎక్కడో చెప్పేశాడు, నాకే అర్థం కాలేదు లాంటి అనుమానాలు పీక్కుతింటాయి. 
  • పేజికి ఓ పదిసార్లు డిక్షనరీ తీసి, చూసి, అర్థం చేసుకుని, వాక్యం మళ్ళీ చదివి – వీటన్నింటిలో అసలు కథ ఎక్కడ వరకూ వచ్చిందన్నది కూడా మర్చిపోతుంటాను. ముఖ్యంగా “ఒందు బది కడలు”లో ఎన్ని పాత్రలో, వాళ్ళ పేర్లు, బాంధవ్యాలు గుర్తుపెట్టుకోలేక నోట్స్ రాసుకున్నా!(అయితే, దీనికి నా అలసట కూడా కారణమైయ్యుండచ్చు. నేను దాదాపుగా పది-పన్నెండు గంటలు పని చేసిన స్ట్రెస్ తర్వాత ఇలాంటి అడ్వంచర్లంటే బుర్ర కూడా విసుక్కుంటుంది కదా, పాపం.) 

కొత్త భాషలో సాహిత్యం చదవడమంటే మనకి మనం అనువదించుకోవడమే! అంటే ప్రతీ వాక్యాన్నీ ముక్కలు ముక్కలుగా చేసుకుని పదాలకి అర్థం సరిచూసుకుని, నోట్లో వేసుకుని, కొత్త రుచి కాబట్టి కాస్త శ్రద్ధగా నమిలి మింగడం – ఆపై అరుగుతుందో లేదో అనుమానాలు. వివాహభోజనంలో ఎస్వీర్‍లాగా నోరు తెరిచి అన్నీ ఊదేయడం అలవాటైపోయిన ప్రాణానికి ఈ కొత్తదనమో విపరీతం! ఒక్కత్తినే చదువుకున్నప్పుడూ, ఇద్దరం కల్సి చదివినప్పుడూ కూడా అలసట కొట్టొచ్చినట్టు తెల్సింది. 

ఇంకొక్క మాటతో కన్నడం కబుర్లు ముగిస్తాను. హిమాలయం ట్రెక్క్స్ కండెక్ట్ చేసే ఒకతను నా ఫ్రెండ్. ఆయనకేమో కొండలెక్కేసి, శిఖరాలు చేరుకోవాలని తెగ సంబరం. ఏడాదిలో చాలా నెలలు అదే పనిచేస్తాడు. కానీ ఓ రెండు మూడు నెలలు పాటు మామూలుగా, మనలాంటి వాళ్ళని తీసుకెళ్ళి తిప్పుతాడు. అప్పుడప్పుడూ వాళ్ళల్లో పెట్రాలజి (study of rocks) లేదా floriculture (పూలని అధ్యయనం చేసేవాళ్ళో) వస్తుంటారు. వాళ్ళకి హిమాలయాలంటే ఎత్తైన కొండలు కాదు, మంచు శిఖరాలు కాదు, అందమైన లోయలు కాదు. కేవలం అక్కడ మాత్రమే కనిపించే రాళ్ళు, లేక పూలు. అందరం మెడలు విరిగిపోయేలా వెనక్కి వాల్చి మబ్బులని తాకుతున్న అంతలేసి పర్వతాలని చూస్తుంటే వీళ్ళేమో కింద కూర్చుని మెడలు ఎత్తకుండా మైక్రోస్కోపులు పట్టుకుని చూస్తుంటారు. పిచ్చోళ్ళలా అనిపిస్తుంటారు. నా ఫ్రెండ్‍కి భలే విసుగు వీళ్ళంటే. 

సాహిత్యం చదవడం కూడా “…అంబర చుంబి శిరస్సరజ్ఝరీపటల ముహుర్ముహుర్ లుఠ దభంగ తరంగ మృదంగ…” లాంటి అనుభవమే. అయితే, భాష మనకి ఎంత అలవాటు అయిపోతే, దాన్ని గురించి అంత తక్కువ ఆశ్చర్యం, అబ్బురం. దానివల్లే సాధ్యమవుతున్న సృష్టిని చూసి మురిసిపోతాం గానీ, దాన్నో బీజమే అనుకుంటాం గానీ, అందులోనే, కేవలం అలా బీజంగా ఉండడంలోనే అదో గొప్ప సృష్టి అని గుర్తించం. మేం ఇద్దరం కల్సి చదువుకునేటప్పుడు ఈ రెండు విపరీత అనుభవాల మధ్య ఊగిసలాడాం. అప్పుడే గ్లోబలైజేషన్, అర్బన్ మైగ్రేషన్ అంటాం, అంతలో పాయింట్ ఆఫ్ వ్యూ, నరేటివ్ టెక్నిక్స్ అనుకుంటాం, అంతలోనే ఒకే ఒక్క పదాన్నో, పదబంధాన్నో, ఒక పదం ఇంకో పదాన్ని మారుస్తున్న తీరునో పట్టుకుని ఆశ్చర్యపోతుంటాం. ఒకే భాషలో ఇంకో వేయి పుస్తకాలు చదివినా ఇలాంటి అనుభవం రాదు. 

ఉర్దూ:

అసలు మనసులకి వ్యథలుంటాయంటేనే మనం ఒప్పుకునే పరిస్థితుల్లో లేము. అలాంటప్పుడు భాషలకీ ట్రామాలు(trauma) ఉంటాయంటే మరీ విడ్డూరంగా అనిపించచ్చు. లేదూ, “పచ్చ కామెర్లవాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది” అన్న నానుడి కింద దీన్నీ తోసేయచ్చు. కానీ తక్కిన భారతీయ భాషలు పడుతున్న existential crisis (“తెలుగు చచ్చిపోతుంది”, “చదివేవాళ్ళు లేరు, ఎవరూ మాట్లాడ్డం లేదు” వగైరా వగైరా)తో పోలిస్తే హిందుస్తానీ భాషది దీనమైన గాథ! విభజన నేపథ్యంలో భూమీ, మనుషులు, మమతలు మాత్రమే వేరుకాలేదు ఈ భాష కూడా వేరుపడిపోయింది, హిందీ-ఉర్దూగా. రాజకీయ చక్రాల కింద పడి ముక్కలైపోయింది. హిందీ ఏమో ఇప్పుడు తక్కిన భారతీయ భాషల పాలిట “విలన్” రోల్ చేయాల్సి వస్తుంటే, ఉర్దూ ఏమో ఎవరిదో-ఎక్కడిదో అన్న exotic స్థానం సంతరించి ఏదో మూలన కూర్చుంది. ఉర్దూ పదాలు పడకుండా ఓ “హిందీ” సినిమా పాట అవ్వదు కానీ, ఉర్దూ అనగానే ఒక దూరం. 

భాషలు ఎన్ని ఆటుపోట్లైనా ఎదుర్కొంటాయి. అవి ఎన్నాళ్ళైనా మనగలుగుతాయి. మనం ఆదరించినా ఆదరించకపోయినా. Languages are a life force, they know how to survive even in hostile conditions. పదిహేనవ శతాబ్దపు శ్రీనాథుని తెలుగు మనకి మళ్ళీ ఎవరిదో-ఎక్కడిదో అని మన వంక పెడతాం గానీ పట్టుమని చదివితే ఎంతో సేపు పట్టదు అలవాటు అవ్వడానికి, మనదే-ఇక్కడిదేనని అనిపించుకోడానికి.  మనం చదవం, నేర్చుకోం, మాట్లాడుకోం అని వాటిని ఏ పాతాళంలో దాచిపెట్టినా, మళ్ళీ ఎప్పటికో-ఎవరో వెళ్ళి తెచ్చుకుంటే సుబ్బరంగా బతికే ఉంటాయి. 

ఉర్దూ కూడా అలా మళ్ళీ ఓ సరికొత్త దశలో ఉంది ప్రస్తుతం. ఉర్దూ సాహిత్యమంతా ఇంటర్నెట్‍లో రాజ్యమేలుతుంది. Rekhta.org నుంచి ఆర్జే సమాయా వరకూ అందరూ దీన్ని అందరికీ చేరువ చేస్తున్నారు. మీరుగానీ ఎప్పట్నుంచో ఈ భాష, ఈ భాషలోని కవిత్వం, ఈ భాషలోని సాహిత్యాన్ని చదవాలనుకుంటే, this is the time! 

నేను ప్రస్తుతం నస్తాలిఖ్ (ఉర్దూకి వాడే ఒక రకం స్క్రిప్ట్) నేర్చుకుంటున్నాను. ఒక క్లాస్ ఎనిమిది వారాల పాటు హిందీ వర్ణమాలని ఆధారంగా చేసుకుని నేర్పించారు. అక్షరాలు బాగా వంటబట్టాయి గానీ, మనకి తెల్సిన తక్కిన భాషలకన్నా ఉర్దూ స్క్రిప్ట్ చాలా భిన్నమైనది. అలా అనగానే, అవును, కుడి నుంచి ఎడమకు రాయడం మనకి అలవాటు లేదన్నది వెంటనే తడుతుండి. కానీ అదొక్కట్టే కాదు, అసలు అక్షరాల రూపాలు, పదాల్లో వాటి రూపాంతరాలు వేరుగా ఉంటాయి. అలవాటు కావడానికి సమయం పడుతుంది. కానీ, అక్షరాలు నిల్చినా, నిలవకున్నా, మనం దాంట్లో సాహిత్యం చదవగలిగినా లేకున్నా… ఉర్దూ నేర్చుకోవడం మర్చిపోలేని అనుభవం. పైగా అది మన మెదడుని కూడా ఓ రకంగా re-wire చేస్తుంది. 

ప్రస్తుతం ఇంకో కోర్సు చేస్తున్నాను – మళ్ళీ అవే అక్షరాలు. (అంటే, మొదటిది చేసినా నాకు వస్తాయని నమ్మకం లేక, రెండో కోర్సుకి కూడా డబ్బులు కట్టేసాను) చాలా అంటే చాలా ఓపిగ్గా నేర్చుకోవాలి. మెల్లిమెల్లిగా చేయాలని ప్లాన్. 

 ఓ రోజు క్లాస్ అయ్యాక ఊరికే సరదాకి, మాధురి దీక్షిత్ “ఏక్, దో, తీన్” పాట నేర్చుకుంటున్న అక్షరాల్లో రాద్దామని ప్రయత్నించాను. ఉత్సాహం కొద్దీ ఫేస్‍బుక్‍లో షేర్ చేశా… చేశాక నాలుక్కర్చుకున్నా, వయసు అయిపోతున్నా పిల్లచేష్టలు పోవడం లేదని, “నా కొత్త ఫ్రాక్ చూడూ…” అని అందరికీ చూపించడం దేనికి, చదువుకోవచ్చుగా చప్పుడు చేయకుండా అని. కానీ, ఆ పోస్ట్ కి మర్చిపోలేని స్పందన వచ్చింది. కొందరు అబ్బురపడిపోయి మురిసిపోతే, కొందరు ఉర్దూ కోసం ఏయే కీబోర్డ్స్ వాడచ్చు లాంటివి చెప్పారు. కొందరు నేనేం కోర్సులు చేస్తున్నానో కనుక్కుని జాయిన్ అవుతామన్నారు. వాటి అన్నింటిలోకి మనసు నిండిపోయి, కడుపులో కూడా ప్రేమ నిండిపోయిన స్పందన ఒకటుంది. 

ఏక్, దో, తీన్ పాట – నస్తాలిఖ్ లో. తప్పులుండచ్చు!

మంటో పుస్తకం ఒకటి కావాల్సి వచ్చి దొరక్క ఆ వెతుకులాటలో ఔరంగాబాద్‍కి చెందిన “మిర్జా బుక్ హౌస్” వాళ్ళు నా వాట్సాప్ లోకి వచ్చి చేరారు. వాళ్ళు నా “ఏక్ దో తీన్” స్టేటస్ చూసి, సంబరపడిపోయి, నేనేం అడక్కుండానే చిన్నపిల్లలకి ఉర్దూ నేర్పించడానికి పనికొచ్చే పుస్తకాలు, వర్క్ బుక్‍లు పంపించారు. మళ్ళీ నాకు అప్పుడప్పుడూ మినీ పరీక్షలు పెడుతుంటారు. మొత్తం ఉర్దూలో టైప్ చేసిన మెసేజ్ వస్తే, నేను దాన్ని చదివి, అదేంటో హింగ్లీష్ లో టైపు చేసి, దానికి బదులివ్వాలి. ఎక్కడన్నా అటకాయిస్తే వాళ్ళు సాయం చేస్తారు. “మన్ లగాకె పఢ్‍నా” అని గుర్తుచేస్తుంటారు. 

మిర్జా బుక్ హౌస్, ఔరంగాబాద్ వాళ్ళు పంపిన పుస్తకాలు.

మనుషుల్ని, మనసుల్ని ఇంత దగ్గర చేసేవే భాషలు! వాటికేం మర్మం తెలీదు. మనం ఏం మోసుకెళ్ళమంటే అవే మోసుకెళ్తాయి. మతలబు ఉన్నది మన మనసుల్లో! 

మలయాళం: 

ఇక్కడ వరకూ ఓపిక పడుతూ చదివనవాళ్ళు కూడా “this is it!”అనుకుంటారు ఇంక. సరే, మలయాళంలో పెద్ద చెప్పుకునేది ఏం లేదులే. ఊరికే, ఓ పూట, కుక్కర్ విజిల్ రాకుండా సతాయిస్తుంటే, ఆకలి ధ్యాస మార్చడానికి యూట్యూబ్ తెరిస్తే “మలయాళం  స్వరాక్షరంగళ్” అని ఒక వీడియో కనిపించింది. సరే, తినడానికి ఎటూ టైమ్ ఉంది కదా అని అక్షరాలు రాసి చూశాను. ఉఫ్! నా కేరళ మ్యూరల్స్ ట్రేనింగ్ అంతా పనికొచ్చింది అవి దిద్దడానికి. అచ్చులు మాత్రమే పూర్తి చేశాను. హల్లులకి హలో చెప్పేలోపు ఉర్దూ క్లాసులు మొదలై మళ్ళీ అటేపు వెళ్ళలేదు. 

కన్నడంలో స్క్రిప్టు తేలిక, పైగా ఎంతకాదనుకున్నా కొద్దో గొప్పో భాష చెవుల మీద పడుతూ ఉంటుంది ఈ ఊర్లో. ఉర్దూ అంటే దాదాపుగా వచ్చు, కేవలం స్క్రిప్ట్ నేర్చుకోవాలి. (Did I just say, కేవలం? :O)  మలయాళంలో అన్నీ అంటే అన్నీ నేర్చుకోవాలి. అందుకని అది ఇప్పడయ్యే పని కాదని వదిలేశాను. చూద్దాం. 

చివరిగా, నాకు తోచిన కొన్ని చిట్కాలు:

  1. కొత్త భాషలు నేర్చుకోవడంలో ముఖ్యమైన అవరోధం మన మెంటల్ బ్లాక్స్. (mental blocks) మనం ప్రయత్నించకుండా రాదనుకుంటాము. నేను చాలా ఏళ్ళ క్రితం స్పానిష్ మొదలెట్టి అలానే వదిలేశాను. దానితో కన్నడం రాదు, రాదు అనుకుంటూనే ఉన్నాను. ముందు ఈ “రాదు” ఫీలింగ్ పక్కకు పెట్టేయాలి. 
  2. మనకేం ఎవరూ పరీక్షలు పెట్టి, ఉద్యోగాలు ఇవ్వరు కాబట్టి, నిదానంగా, ఆరాముగా, తీరిగ్గా అక్షరాలు నేర్చుకోవచ్చు. కంగారేం లేదు. ఒకటే అక్షరం ఒక నెల దిద్దుతూ ఉన్నా, ఎవరన్నా కొడతారా ఏం?
  3. “ఇన్ని భాషలు నేర్చుకుంటే వచ్చినవి కూడా పోతాయేమో” అన్న భయం కూడా విన్నాను నేను. That’s rubbish! ఒక భాష నేర్చుకుంటే 3 GB, ఇంకోటి నేర్చుకుంటే 5GB, అప్పుడింక జాగా ఉండదు టైప్ లెక్కలు మన బ్రెయిన్స్ కి పనికిరావు. ఒక భాషకి ఇంకో భాషకి ప్రతీ బుర్రలో తన ప్రత్యేకమైన తరహాలో మాపింగ్స్ చేసుకుంటుంది. Don’t underestimate the power of a common brain! 
  4. పోనీ, మన బ్రెయిన్‍కి అంత సీన్ లేదూ అనే నమ్మినా భాషలు నేర్చుకోవచ్చు. చాలా నేర్పిస్తుందది. ముఖ్యంగా mental models క్రియేట్ చేసుకోవడం, ఒక గుర్తుకి ఒక అర్థాన్ని ఆపాదించే క్రమంలో జరిగే మాపింగ్స్ – it’s fun! (Not just for literature, it helps you in whatever career you’ve). అంటే, ఒక భాష నేర్చుకున్నాక దాంట్లో అనర్గళంగా మాట్లాడాలి, లేదా సాహిత్యం చదవాలి లాంటి ambitious goals అవసరేమీ లేదంటున్నా. ఆసక్తుంటే చాలనంటున్నా. Learn and forget the shapes, what has to retain will retain in you అని నొక్కి వక్కాణిస్తున్నా. 
  5. ఒక భాషలో మాట్లాడాలంటే పదాలు వెంటవెంటనే తట్టాలి, కానీ ఒక మోస్తరు పదాలు తెలిస్తే సరిపోతుంది. (మీరు మరీ స్టేజ్‍లు ఎక్కి, సారీ జూమ్‍లో లాగిన్ అయ్యి ఉపన్యాసాలు ఇవ్వకపోతే ఈ మాత్రం చాలు.) కానీ చదవడమే ముఖ్యోద్దేశ్యం అయినప్పుడు పదాల అర్థాలు వెంటవెంటనే తట్టాలనేం లేదు. “సారీ, నువ్వు అసలు గుర్తే రావడం లేదు, కాస్త పక్కన కూర్చోవా, డిక్షనరీ ఆడ ఏడో ఉంది,” అని అంటే పదాలేం నొచ్చుకోవు. మనల్ని జడ్జ్ చేయవు. కొత్త భాష చదూకోవడంలో ఉన్న వెసులుబాటు అదే. (కన్నడ మాట్లాడ్డం బానే వచ్చి కన్నడ చదవడానికి ప్రయత్నించని వాళ్ళు: మీరేం కోల్పోతున్నారో నేను చెప్పలేను. ఉర్దూ stretch అని ఒప్పుకుంటా కానీ, కన్నడ మనకి పెద్దమ్మ ఇల్లు – వస్తూ పోతుండచ్చు.)

ఈ అక్షరాలు ఎంతకాలం నాలో గూడు కట్టుకుని నిలుస్తాయో నాకు తెలీదు గానీ, ఉన్నంత వరకూ ఎప్పుడూ వినని పాటలే వినిపిస్తున్నాయి. అది చాలు.  

You Might Also Like

2 Comments

  1. Dathathreya

    నేను కొలార్, చిక్బాల్లాపూర్ ప్రాంతం లో జాబ్ చేశాను. నాకు వాళ్ళు మాట్లాడే కన్నడం బాగా అర్థం అవుతుంది. కానీ మంగళూర్ వాల్ల కన్నడం అస్సలు అర్థం అయ్యేది కాదు. మీలాగే కన్నడం లో చదవాలని ప్రయత్నించాను. మన యండమూరి కన్నడ అనువాదాలు ట్రై చేసి వదిలేశాను. కానీ మీ వ్యాసం చదివన తర్వాత మళ్ళీ కన్నడ పుస్తకాలు చదవాలని అనిపిస్తొంది… అలగే తమిళంలో కూడా ( కర్నాటక నుంచి కేరళ కంటె ఇంకాస్త దగ్గర )… Thanks for your చిట్కాలు..

  2. మమత కొడిదెల

    Throughly enjoyed reading this writeup – took some lessons and inspirations. ఈ వ్యాసం మా అమ్మాయికి కూడా చదివి వినిపిస్తాను. And ఇప్పుడే వెళ్లి నా స్పానిష్ పుస్తకాలమీది దుమ్ము దులిపేస్తా.

    I must tell you, కథైనా, వ్యాసమైనా నువ్వు భలే రాస్తావు పూర్ణిమా.. పక్కనే కూర్చుని మాట్లాడుతున్నట్లు.

Leave a Reply