చదవకూడని, చదవలేని, చదవని పుస్తకాల గాథ

[ట్రిగర్ వార్నింగ్: ఈ వ్యాసంలో డిప్రషన్, ఆంగ్జైటీల గురించి ఉంది. కొందరికి ఇది చదవడం కష్టమవ్వచ్చు. మీ జాగ్రత్తలు మీరు తీసుకుంటారని ఆశిస్తున్నాను. 

ఇట్లాంటి ఓ వ్యాసం పుస్తకం.నెట్‍లో అయితే రాలేదు. తెలుగులో వచ్చాయేమో తెలీదు. నన్ను, నా రచనా వ్యాసంగాన్ని చర్చించే అవకాశాలు బోలెడన్ని ఉన్నాయి, ఇంకా వస్తాయి. అందుకని, వీలైతే మీకు చేతనైతే ఈ ఒక్క వ్యాసాన్ని కాస్త సహృదయతతో, సహానుభూతితో చదవమని మనవి.

ఇది కేవలం నా అనుభవం మాత్రమే. మానసిక ఆరోగ్య సమస్యలని గానీ, వాటి వైద్యాన్ని గానీ జనరలైజ్ చేసే ఉద్దేశ్యం నాకు లేదు.

మానసిక ఆరోగ్య సమస్యలు లీనియారిటీ (linearity)కి లొంగవు. ఏది దేన్ని ప్రభావం చేస్తుందో తెలీని సంక్లిష్టత. పుస్తక పఠనానికి, నా ఆరోగ్యానికి మధ్య సంబంధం నెమరువేసుకోవడమే ఇక్కడ ఉద్దేశ్యం కాబట్టి ఆ అంశానికి చెందని విషయాలేవీ ఇక్కడ ప్రస్తావించలేదని గమనించగలరు. ]

I profusely apologize for the crappy UI experience at the moment. If you find it annoying to read here, see if this helps.

“ఎప్పుడో ఒకప్పుడు, నేను వయసులో ఉన్నప్పుడు 
ఎక్కడో ఒక కవిత చదివినట్లు గురుతు. అప్పుడు 
భావం తెలియలేదు; కానీ క్రమేణ గ్రహించాను; 
తరంగాల తాడనలా అర్థోద్ధతి సహించాను.”

– బైరాగి

2011లో మొదటిసారి ఈ కవిత చదివాను. చదివీ చదవగానే “తరంగాల తాడనలా” తగిలింది. ఒళ్ళు జలదరించింది. ప్రాణం లేచి వచ్చింది. ఒక ’స్ఫురణ’ కలిగింది. క్షణకాలం మాత్రమే! 

*************

“2011లో మీకు అనుభవమైన దాన్నే డిప్రషన్ అంటారు. అది కూడా మోడరేట్ టు సివియర్. ఏ సహాయం లేకుండా మీరు దాంట్లోంచి ఎలా బయటపడ్డారో మేం ఊహించలేకపోతున్నాం.”

నాలుగైదు వారాంతాలు నిమ్‍హాన్స్ చుట్టూ చక్కర్లు కొట్టి, వాళ్ళకి అనువుగా నా జీవితంలోని ఘట్టాలని గ్రాఫుల్లో కూర్చినా, బొత్తిగా డ్రామా లేని నా జీవితాన్ని నా ఆసక్తి కోసం బొమ్మల కథగా మార్చినా తిప్పి తిప్పి చెప్పిందే చెప్పి చెప్పి విసుగొచ్చింది అప్పటికే. నాలుగైదు వారాల క్రితం మొదటిసారి పరామర్శల్లో, “మీకేం సమస్య లేదు. మళ్ళీ రానవసరం లేదు,” అని చెప్పి పంపించేయబోయిన వారు ఇప్పుడెందుకు ఇలా నాకెందుకో లేబుల్ తగిలిస్తున్నారో అర్థంచేసుకోడానికి ఇంకో మూడు నెలలు పట్టింది. 

ఆ మూడునెలల్లో పుస్తకాలు చదువుతాననీ, ఫలానా రచయితలంటే ఇష్టమనీ మాటమాటల్లో రాకుండా ఎలా ఉంటుంది? కానీ అచ్చంగా వాటి గురించే మాట్లాడుకున్న గుర్తు లేదు. ఇంజక్షన్ ఇచ్చే ముందు ధ్యాస మార్చడానికి “మీకేం హాబీస్ ఉన్నాయి? ఏ సినిమాలు చూస్తుంటారు?” అని అడుగుతారు కదా. సెషన్‍లో నేను మరీ మాట్లాడలేకపోయే పరిస్థితిల్లో “హల్కా-ఫుల్కా” ప్రస్తావన కోసమే అనుకున్నాను. 

“మీరు కొన్నాళ్ళు పుస్తకాలు చదవడం మానేస్తే మంచిది. ముఖ్యంగా ఫిక్షన్. మీరు బా చదువుతారని చెప్పారే, యూరోపియన్ రచయితలు, వాళ్ళవి.”

వివరాల్లోకి వెళ్ళలేను కానీ, ఓ రకంగా చూస్తే బ్లడ్ షుగర్ లెవల్స్ ఎక్కువ ఉన్నవాళ్ళకి తీపి పదార్థాలు తినద్దు అని చెప్పడం లాంటిదే ఇది కూడా. అయితే ఆ షుగర్ లెవల్స్ నిర్ధారించే పరీక్షల గురించి పేచీలుండవు. రిపోర్ట్ (ఎప్పుడో గాని) అబద్ధం చెప్పదు. మానసికారోగ్య విషయంలో అలాంటి కొలమానాలు ఉండవు. లాజిక్ ఉంటుంది గానీ, ఏది దేనితో ముడిపడిందో చూచాయిగా అయినా చెప్పగలిగే ER diagrams (Entity-Relationships in Databases) గీయడం కష్టం. అనుమానాలకి, అసంబద్ధాలకి తావుంటుంది కనుక థెరపీ రూమ్‍లని కోర్టు రూమ్‍లుగా మార్చి నాలాంటివారు “మీరసలు నా కేస్‍ సరిగ్గా చదవలేకపోతున్నారం”టూ బల్లగుద్ది వాదిస్తారన్న మాట. 

******

నాకేమీ చిన్నప్పటి నుంచీ పుస్తకాలతో అనుబంధం లేదు. స్కూల్, కాలేజి పుస్తకాలు కాకుండా నేను బ్లాగ్ మొదలెట్టకముందు చదివిన పుస్తకాలు జాబితా మొత్తం ఇంతే: 

ఈనాడు, ది హిందు, స్పోర్ట్స్ స్టార్, కాపిటీషన్ సక్సెస్ రివ్యూ (సి.ఎస్.ఆర్) లాంటి పత్రికలూ, స్వామి వివేకానంద పుస్తకాలు ఓ నాలుగైదు, స్కూల్‍లో ప్రైజ్‍గా వచ్చిన శ్రీశ్రీ మహాప్రస్థానం, కాలేజిలో చదివిన ఎరిక్ సీగల్ “లవ్ స్టోరీ”, అయన్ రాండ్ “ఫౌంటేన్ హెడ్” , “అట్లాస్ ష్రగ్గడ్”, మహాత్మా గాంధీ “మై ఎక్సపరిమెంట్ విత్ ట్రూత్”. అంటే, వేళ్ళమీద లెక్కపెట్టగలిగేటన్ని పుస్తకాలు మాత్రమే! 

“ఇంకా పనివ్వు, పనివ్వూ” అని నా మానేజర్‍ని పోరుబెడుతుంటే “పోయి, కొత్త హాబీ ఒకటి మొదలెట్టి, అదేంటో చెప్పు” అని పురమాయించిన పని వల్ల బ్లాగ్ మొదలెట్టాను. బ్లాగ్స్ లేక బ్లాగర్లే నా తొలి బుక్ రికమెండేషన్ ఇంజన్స్. తెలుగు బ్లాగర్లు మన పుస్తకాలు పరిచయం చేస్తే, జాబర్‍వాక్మిడిల్‍స్టేజ్ లాంటి బ్లాగులు విశ్వసాహిత్యానికి తలుపులు తెరిచాయి. నేనే నేరుగా పుస్తకాల షాపుకి వెళ్ళి మంచి పుస్తకాలు ఎంచుకునే టాలెంట్ నాకు లేదని అర్థమై బ్లాగ్ పోస్టులు చదువుకుని అవే కొనుకున్నాను. అప్పుడప్పుడే flipkart.com మొదలవుతున్న రోజులు కాబట్టి బయట(యూరప్, యూ.ఎస్)నుంచి రావాల్సిన పుస్తకాలకీ ఒక దారి దొరికింది. వాడూ తెప్పించలేని పుస్తకాలుంటే యూ.ఎస్ నుంచి వచ్చే స్నేహితులకి పని పడేది. 

అలా అన్నీ కల్సి వచ్చి నేను ఒక ఏడాదిలో యాభై, అరవై పుస్తకాలు చదివిన రోజులున్నాయి. “ఏం చదువుతున్నారీ మధ్య?” అన్నది మామూలు పలకరింపు అయిపోయింది జనాలకి నన్ను చూడగానే.  బాగనిపించేది. ముఖ్యంగా చిన్నప్పటినుంచీ ఇళ్ళల్లో చాలా పుస్తకాలుండి, పుస్తకాలతోటే పెరిగిన స్నేహితుల మధ్య కూడా “I belong here!” అనిపించేంత ఆత్మవిశ్వాసం అయితే నాలో ఎప్పుడూ ఉంది. చదవడం కూడా అలాంటి సాహిత్యమే చదివాను. మొదలెట్టిన తొలినాళ్ళల్లో పరమ సందడిగా ఉండడం గమనించి ఒక ఫ్రెండ్ అనేవారు, “పుస్తకం.నెట్‍కి బాలారిష్టాలు లేవు” అని. నా పుస్తకం పఠనానికి కూడా లేవు. నేను మొదలెట్టడమే కాల్వినో, సరమగోతో మొదలెట్టాను. 

చదివినవాటి గురించి అంతే బాగా (చక్కగా అని మీరు అనుకోకపోయినా, ఎక్కువగా) రాశాను కూడా! అవి ఇంకేం పని చేసినా చేయకున్నా, సాహిత్యంలోని hierarchiesని ఛాలెంజ్ చేశాయి. తెలుగు మీదే సరిగ్గా పట్టులేని మనిషి ప్రపంచ సాహిత్యాన్ని చదివి, మళ్ళీ తెలుగులో వ్యక్తీకరించడం వాటి విశేషం. నా chatty toneతో వాటిని పల్చగా చేసేశానన్న విమర్శ ఉంది, కానీ అవి చేరాల్సినవారికి చేరాయి. మా ఇంటికొచ్చింది Barthes అయినా, శ్రీనాథుడు అయినా నేను చార్మినార్‍లో ఆ గల్లీల్లోనే తిప్పుతాను కదా! ఆ ఇరానీ సమోసాలు, ఆ ఛాయ్ తాగిస్తా కదా! “హౌ, కిరాక్ రైటర్, పోర్చుగల్ సె ఆయె కహ్తె, పంక్చువేషన్-ఇచ్ నక్కో బోల్తె… బాబాబాహ్… జబర్దస్త్ రైటింగ్ ” అనే మాట్లాడుకుంటాం మా ఊర్లో అయితే!  నేను రాసిన పరిచయ వ్యాసాలు అలాంటివే. 

గేమింగ్‍లో లెవల్స్ ఉంటాయిగా, నా జీవితానికి బాగా అన్వయించుకోవచ్చు. పుస్తకాలు చదివి వాటిని గురించి రాస్తూ, పుస్తకం.నెట్‍లో అప్పుడప్పుడూ ఉడతా సాయం చేస్తూ నెట్టుకొస్తున్నానని మెచ్చి లెవల్ అప్ అయింది. ఉద్యోగం మానేసి, ఆస్తులు అమ్ముకుని విదేశీ కోర్సులు చేయాలనే ఆలోచన బలపడుతుండగా MOOCలు వచ్చాయి. సాహిత్య కోర్సులు “సరదా”కి చేద్దామనుకున్నా గానీ టెక్నికల్ కన్నా ఎక్కువ సీరియస్‍గా చేశాను. గ్రేడింగ్ కోసం వాళ్ళ నియమనిబంధనల ప్రకారం పేపర్లు రాసి మంచి ఫీడ్‍బాక్ అందుకున్నాను. గుడ్‍రీడ్స్.కామ్‍లో అంతర్జాతీయ సమూహం (ఆ కోర్సుల్లో కల్సినవాళ్ళం)  ఏర్పర్చుకుని సాహిత్యాన్ని “అధ్యయనం” చేసేవాళ్ళం. నా ఈ ప్రతిభాపాఠవాలకి మురిసి ముక్కలై “గ్రహాంతరవాసులతో రీడింగ్ క్లబ్” అని విశ్వం లెవల్-అప్ చేసేస్తుందేమోనని అనిపిస్తున్న తరుణంలో గేమ్ క్రాష్ అయ్యింది.  

అప్పటికో ఏడెనిమిదేళ్ళ బట్టీ చదువుతున్నా కాబట్టి పుస్తకాలు చదవడం ఆపేయమంటే కొన్ని withdrawal symptoms ఉండడం సహజం. కానీ చదవచ్చు/చదవకూడదు మధ్యలో ఇరుక్కుపోయింది సాహిత్యమైతే కాదు. పుస్తకాల ద్వారా ఏర్పడిన స్నేహాలూ, అనుబంధాలు. వాటి తాలుకూ జ్ఞాపకాలు. 

“కితాబేఁ మాంగనే, గిరానే, ఉఠానేకె బహానె రిష్తే బన్‍తె థె – ఉన్కా క్యా హోగా” (పుస్తకాలు అడగడం, కిందపడేయడం, పడేసినవి ఎత్తడం లాంటి వంకలతో బంధాలు ఏర్పడేవి – వాటి సంగతేంగాను?) అని గుల్జార్‍ ఓ కవితలో బెంగ పెట్టేసుకుంటారు.

 “ఈ పుస్తకం గురించి తెలుగులో చదువుతాననుకోలేదు. నా ఫేవరెట్ ఇది” అని కామెంట్‍గా పరిచయం మొదలవ్వడానికి, 

“మీకీ పుస్తకం తెల్సా? ఆ రైటర్ ఐడియా ఉన్నారా?” అంటూ పలకరింపులు అయ్యాక వచ్చే ఖాళీలను పూరించడానికి,

“అప్పుడే చదివేశావా, మొన్నేగా అనుకున్నాం” అని ఆశ్చర్యంలో చిటికెడు చనువు కలపడానికి, 

“నీకసలు నచ్చనే లేదు అని పక్కకు పడేశావ్ చూడు… ఆ పుస్తకంలో ఇదే, ఇప్పుడు నువ్వు అడుగుతున్నదే ఉంటుంది తెల్సా!” అని నిష్టూరాలు ఆడడానికి, 

ఛాట్‍లో మాటలకి తావివ్వని పోట్లాట పొగమంచులో ఆ ఒక్కరికీ మాత్రమే  నీ-నా-మధ్య-జరుగుతున్న-దాని  “స్టేటస్ అప్‍డేట్” ఇదని ఓ రచయత మాటల్లో చెప్పడానికి,

“బిజీ అన్నావ్‍గా, ఈ ఆర్టికల్ చూశావో లేదో అని, వచ్చి వారమైపోతుంది” అంటూ మళ్ళీ మంచుని కరిగించడానికి, 

“ఫోన్ చేశాను, కాపీ ఉందంట. వీకెండ్ వెళ్ళి కొంటాను… మరి అడ్రస్ ఎలా?” అని యంత్రాలను దాటి పుస్తకం రూపేణ చేతుల్లోకి చేరడానికి… 

కవితల, కథల కళ్ళగప్పి చప్పుడు చేయకుండా బంధాలు ఏర్పడవా ఏంటి?

 “కితాబోఁ కె లింక్ పర్ లైక్, షేర్, కామెంట్ కర్తె కర్వాతె జొ దిల్ వెబ్ 2.0 మైఁ ఉలజ్‍జాతా హై – ఉస్కో కైసె సమ్‍జాయె” (పుస్తకాల లింకుల మీద లైక్, షేర్, కామెంట్ చేస్తూ చేయిస్తూ వెబ్ 2.0లో ఇరుక్కుపోయింది మనసు – దానికెలా నచ్చజెప్పాలి?) అని గుల్జార్‍ సాబ్‍ని సలహా అడిగేదెవరు? 

సలహాలు మాత్రం బలంగానే వినిపించాయి: ప్రేమలూ, పాశాలూ మనమున్నంత వరకే. మనమే లేకపోతే వాటి ఉనికే లేదు. బంధాలని కాపాడుకోవాలంటే నిన్ను నువ్వు కాపాడుకోవాలి. కథలు మన మీద ఎలా పనిచేస్తాయో మనకేం తెలుస్తుంది? మనం విన్న కథ చివరకి కంచికి పోతే, మనం ఇంటికి పోతాం. మనల్ని చదువుతున్న కథ ఆఖరున ఏమవుతుంది? మన కంచి ఏది? దాని ఇల్లేది? 

Cut out the poetry there. బతికుంటే బలుసాకు తినచ్చు అన్నది సారాంశాం.

బైరాగితో ఓ సౌకర్యం ఉంటుంది. మనసు అరల్లో అదిమిపెట్టేసుకుంటే బయట ఎక్కువ వినిపించడు కనుక గబుక్కున ఎక్కడో ఎదురుపడి awkward moments క్రియేట్ చేయడు. “I love you as one loves certain obscure things, secretly, between the shadow and the soul.” అని పాబ్లో నెరుడా చెప్పిన విధంగా ప్రేమించడానికి పరమ అనుకూలమైన కవి. (I don’t know why I wear him like a tattoo that one can’t miss.) గుల్జార్ అందుకు పూర్తిగా విరుద్ధం. ప్రతీ చోటా ఆయనే. పుస్తకాలతో పాటు సినిమా పాటలకీ రెండు మూడేళ్ళు దూరంగా ఉండిపోయాను. Wislawa Szymborska రేపగలిగే గాయాల్ని ఆత్రేయ ఎలా చూస్తూ ఊరుకుంటాడు?   

పుస్తకాలని అటకెక్కించలేదు. ఎదురుగానే ఉంచాను. కథలు మన మీద ఎలా పనిజేస్తాయో తెలీనప్పుడు కవిత్వం ఏం చేస్తుందో ఎవరికి తెల్సు? అసలు అక్షరం ఏం చేస్తుందో ఎవరికి తెల్సు? 

అదే! జరుగుతున్నది అదే! చిన్నప్పుడు అందరూ అందుకే చెప్పేవారు, “అన్నం దిగబెట్టకూ! దిగబెట్టేస్తే పెద్దయ్యాక మెతుకు దొరకదూ!” అని. ఇప్పుడు జరుగుతున్నదీ అదే! నాకు అర్హత ఉందా, లేదా, నాకేమైనా వచ్చా లేదా, అసలు రాయడానికి నేనెవర్ని అని ఆలోచించకుండా విచ్చలవిడిగా, ఇబ్బడి ముబ్బడిగా రాసేశాను. ఎక్కడంటే అక్కడ! అందుకే ఇక నాకు అక్షరం దక్కదు. నేను బతికే ఉంటాను, కానీ బలుసాకూ దొరకదు. అదే నాకు పడే శిక్ష!

మనకి మనం మన గురించి చెప్పుకునే కథలే మన మానసిక ఆరోగ్యాన్ని సూచిస్తాయని అంటుంటారు. వాళ్ళిచ్చే ట్రేనింగ్‍తో ఈ పిచ్చి ఊహలని తుంచేశాక మాత్రం, ఒక రకమైన numbness ఆవహించింది. అంటే, వాక్యం కళ్ళముందు కనిపిస్తుంది. నేను చదువుతాను. అర్థమవుతుంది. కానీ ఏం అనిపించదు. బొత్తిగా ఏం అనిపించదు. అది పుస్తకమే కానవసరం లేదు. ఏదైనా! ఫ్రెండ్ text message అయినా, ఆఫీసు ఈమెయిల్ అయినా, ఏదైనా ఏ భావమూ కలిగించదు. అప్పట్లో ఎవరి మెయిల్ కన్నా రిప్లై ఇవ్వాలంటే పీక మీద కత్తి పెట్టినట్టుండేది. రిమోట్ టీమ్స్ లో వాళ్ళకి కూడా పక్కనే ఉన్న ఫీలింగ్ తెప్పించేలా మెయిల్/చాట్ చేస్తానని పేరున్న నాకు ఈ blankness, it was a black hole! ఆ సమయంలో పుస్తకం.నెట్ పనులేవీ నేను చూసుకోలేకపోయాను. నాకు బాలేదు, కొన్నాళ్ళు చేయను అన్న క్లారిటి అయినా ఇవ్వలేదు. మెయిల్స్ చూస్తా, బదులివ్వను. బదులిస్తే, ఫాలో-అప్ చేయను. ఏదో పని నేను చూసుకుంటా అని మొదలెడతా కానీ చూసుకోను. సౌమ్య ఒక్కత్తే చేసుకుంది అన్ని పనులూ ఆ సమయంలో.

******

ఈ గేమ్‍లో ఇంక నాకు లెవల్ జీరో కూడా అధిగమించడం అవ్వదు అని అర్థమైన విశ్వం, మరి జాలి పడిందో ఏమో, కేరళ మ్యూరల్స్ నేర్చుకునే అవకాశం కలిగించింది. తెల్ల కాగితం మీద నల్ల అక్షరాలు మాత్రమే తెల్సిన కళ్ళకి గీతలూ, రంగులూ కొత్తగా అనిపించాయి. అవి గీస్తున్నప్పుడు పుస్తకం పట్టుకున్నంత దగ్గర్లోనే పెట్టుకుని చేస్తుంటాను కాబట్టి అంతలేసి సేపు అక్షరాలు కాని గీతలు, కంటినిండా పరుచుకునే రంగులు మనసునూ కుదుటపరుస్తాయని డాక్టర్లూ ప్రోత్సహించారు. ఔషధం దొరికింది. గుణం కనిపించింది. 

పుస్తకాలు మళ్ళీ మెల్లిమెల్లిగా వచ్చాయి గానీ, బొమ్మలతో నిండినవే. “Kerala Murals” by Dr. M. Nambirajan, “Chola Murals” by P.S. Sriraman, “South Indian Paintings” by C.Sivamurthi  నేర్చుకుంటున్న కళ గురించి అవగాహన పెంచినవి. 

Brainpickings.org పుణ్యమా అని తెల్సి, గుండెకి హత్తుకుని కూర్చున్న పుస్తకాలు: 

  1. Heart in the bottle by Oliver Jeffers
  2. Michael Rosen’s Sad Book
  3. Thin slice of Anxiety 

అప్పుడు తెలీలేదు గానీ ఆ సమయంలో నా జీవితంలో ఏ మాత్రం కవిత్వమైనా మిగిలిదంటే అది Grant Snider పుణ్యమే! అవును, ఆయన కార్టూనిస్ట్. బొమ్మలే గీస్తాడు. లోకం సంగతి నాకు తెలీదుగానీ నాకు మాత్రం కవిత్వమే చెప్తాడు. 

ఇలా 2015-17 వరకూ నా పుస్తక పఠనాన్ని డిప్రషన్‍ అనే కాకి ఎత్తుకుపోయింది. అది కాకే, కావాలంటే మాక్స్ పార్టర్‍ని అడగండి – Grief is the thing with feathers, కానీ చదవకండి. అప్పుడప్పుడే తేరుకుంటుండగా చదివాను ఈ పుస్తకం, నన్ను మళ్ళీ అగాధాల్లోకి విసిరికొట్టింది. కథని బాగా మేక్ ఓవర్ చేస్తాడు గానీ, అందులో ఉన్నది అచ్చమైన శోకమూ, కవిత్వమూ మాత్రమే! చదవకండి. 

2018-19ని ఆఫీసులో చాకిరి ఎత్తుకుపోయింది. అరబ్బు-ఒంటె కథ తెల్సు కదా, చలిగా ఉందని టెంట్‍లో దయతలచి కాస్తంత జాగా ఇస్తే అది మొత్తం ఆక్రమించుకుని వాణ్ణి బయటకు గెంటేస్తుంది? అదే ఈ ఆఫీసు కథ. బండకేసి బాదింది. “అంటే, నేను బాదలేనా? నాకు తెలీవా ఏ బండలకేసి బాదాలో” అని అంతలో అసలు-ఉందా-లేదా-అనిపించే నా పర్సనల్ లైఫూ peer pressureకి గురై నన్ను చితగ్గొట్టింది. శరీరం, మనసూ రెండూ మొరాయించి జీవితంలోకి anxiety  ప్రవేశించింది. డిప్రషన్ అంటే బండరాయి కింద కదల్లేక మూలుగుతూ నలుగుతూ పడున్నట్టు (dysfunctional). Anxiety does different things to body and mind.(hyper-functional) మళ్ళీ హెల్ప్ తీసుకోవాల్సి వచ్చింది.  “మంటోని అనువదిస్తున్నాను. పార్టిషన్ లిటరేచర్ మాత్రమే ఎక్కువగా చదువుతున్నాను,” అని అడక్కముందే చెప్పేశాను. 

ఈసారి మాత్రం చదవడం మానేయమని అడగలేదు. ఎక్కువ ప్రభావం పడకుండా ఎలా చదువుకోవాలో మాత్రమే చెప్పారు. విచిత్రంగా, “A man’s search for meaning” వాళ్ళే రికమెండ్ చేశారు. ఆ సంగతి తెల్సి, నా పరిస్థితి తెల్సున్న స్నేహితులు కంగారు పడ్డారు. అయినా చదివి చూశాను. ఆ పరిస్థితుల్లో మాత్రమే చదవగలిగిన పుస్తకం అది. లేదంటే హొలోకాస్ట్ ని నేను భరించలేను. కోర్సులు జాయిన్ అయి మానేశాను. పుస్తకాలు కొని పక్కకు పెట్టేశాను. బెర్లిన్‍లో మ్యూజియమ్స్ అన్నీ తిరిగినప్పుడు బయటకేం తన్నుకురాలేదు కానీ మనసుకి కూడా కవుకుదెబ్బలు తగులుతాయి! 

Guy Winch రాసిన Emotional First Aid కూడా నాకు ఆ సమయంలోనే తారసపడింది. అలాగే, నేను ఆటా కాన్ఫరెన్స్ 2019లో (అవును, అంతటి భయంకర పరిస్థితుల్లో నేను పరమ వెరైటీగా పబ్లిక్ స్పీకింగ్, అది కూడా నా బ్రోకెన్ తెలుగులో, ప్రయత్నించానన్న మాట.) మానసిక ఆరోగ్యం నేపథ్యంగా నేను రాస్తున్న కథల గురించి నేను చేసిన ప్రసంగాన్ని (?) బ్లాగులో పెట్టి, ఫేస్‍బుక్ లో షేర్ చేస్తే… ఉఫ్… పాయింట్ కొచ్చాం… లలిత గారు Gabor Mateని పరిచయం చేశారు. వీడియోలు విన్నాను. When Body says No చదువుతున్నాను. పుస్తకం లెక్కల్లో పూర్తిచేయలేదు గానీ లోపల బాగానే ఇంప్రింట్ అయ్యాయి ఆయన పాయింట్స్.  

వీటన్నింటి మధ్యలో భారతీయ సాహిత్యం కొంచెం చదివాను. కె.ఆర్ మీరా (మలయాళం), చంద్రశేఖర్ కంబారా, వసుధేంద్ర, వివేక్ శాన్‍భాగ్, జయంత్ కాయ్కిణి (కన్నడ), పూమణి (తమిళం), రాహీ మాసూమ్ రజా, చుగ్తాయ్, కృషన్ సోబ్తీ (హింది/ఉర్దూ), కొన్ని బయోగ్రఫీలు చదివాను. యూరోపియన్ ఫిక్షన్, భారతీయ సాహిత్యం నా (అంటే పాఠకురాలిగానే కాదు, ఒక వ్యక్తిగా) మీద వేసిన వేర్వేరు ముద్రల గురించి రాస్తే ఇంకో వ్యాసం అవుతుంది. 

And of course, Manto! “మంటో మీద పనిజేస్తున్నా ప్రస్తుతం” అని నేను అందరితో చెప్తుంటాను. నిజానికి ఆయన నా మీద పనిజేస్తున్నాడు. I’m his work-in-progress! 

********** 

2019లో “అసలు బతకడమెందుకు?” అన్నదానితో పోరాడి ఏదోలా బతికి బట్టకడితే 2020 level-impossible ప్రవేశపెడుతూ “బతకుతామా?” అన్న గుబులుని పట్టుకొచ్చి, నన్ను మళ్ళీ 2011లో దిగబెట్టింది. అందరూ చనిపోతుంటే నేనేం చేయలేక చూస్తూ ఉండిపోతానన్న ఆలోచన నాకు నరకం. వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చి ఆఫీసుకి-ఇంటికి, లంచ్‍కి-డిన్నర్‍కి, zoomకి – doomకి తేడా లేకుండా చేసేయడంతో పుస్తకాలు చదువుకోవడం మళ్ళీ గాడి తప్పబోయింది కానీ మళ్ళీ కొందరు, కొన్ని కల్సొచ్చి పట్టీలపైకి తీసుకొచ్చాను. 

నాలుగేళ్ళ తర్వాత తృప్తిగా చదువుకున్నాను. బైరాగి మళ్ళీ బయటకొచ్చాడు. మొన్న గుల్జార్ టాక్ షో చూసి మనసు నిండిపోయింది. ఎస్పీబి పోయి మళ్ళీ దగ్గరయ్యారు. నేను మ్యూట్ చేసిన సినీ కవులందర్నీ పట్టుకొచ్చారు. మధ్యలో చాలానే పుస్తకాలు కొన్నా యూరోపియన్ రచయితలవి కానీ ఏం చదవలేదు. ఎన్నో ఏళ్ళకి మళ్ళీ Sigzimund Krzhizhanvovsky కొత్త పుస్తకం “Unwitting Street” చదివాను, చదవగలిగాను. తెల్సిన అక్షరాలు ఎటూ గూటికి చేరాయి, కొత్తవీ గూడుకట్టుకుంటున్నాయి. 

ఆ పుస్తకాల కబుర్లు ముందు రాయబోయే వ్యాసాల్లో పంచుకుంటాను. వాటికి ముందు ఇదంతా  చెప్పడం అనివార్యమనిపించింది. If I had to tell it again – Gayatri Prabhu, A book of light – Jerry Pinto, it’s all in your head, m – Manjiri Indurkar లాంటి పుస్తకాలు భారతీయ మధ్యతరగతి కుటుంబాల నేపథ్యంలో ఇలాంటి కథనాలను ఎలా వ్యక్తీకరించాలి అన్న సంగతిపై అవగాహన కలిగించాయి. వ్యక్తీకరించాల్సిన అవసరాన్ని తెలియజెప్పాయి. మానసిక ఆరోగ్యం గురించి కథలు ఎన్ని రాసినా నా కథ చెప్పనిదే వాటికి అర్థం లేదనిపించింది. అందుకే, ఈ వ్యాసం ఒక్కరికైనా తోడవుతుంది అన్న ఆశతో రాశాను. 

“లోకం చూశాను నేను, శోకం చూశాను నేను 
లోకంలోన శోకంలోన, నాకం కూడా చూడకపోలేను నేను”

– బైరాగి 

You Might Also Like

10 Comments

  1. సాయి పద్మ

    పూర్ణిమా..
    ఇది చదవడం నాకు ఎంత నచ్చిందో చెప్పలేను.. ఎందుకంటే ఇది ఇప్పుడే కాదు ఎప్పటికీ ఎవరికైనా చాలా అవసరమైన విషయం… కథలే కాదు అక్షరాలు కూడా మనల్ని ఏం చేస్తాయి? ఎలా కదిలిస్తాయి, నడిపిస్తాయి ?
    ఏవి వదిలేలా చేస్తాయి? ఏమి పట్టుకుని వదలను అంటాయి?
    ఒక వాక్యమో, కథలోని నిశ్శబ్దం,లేదా వాతావరణంలోని స్తబ్దత ఇలాంటి విషయాల్ని మనం ఎలా రిలేట్ చేసుకుంటాం అదేవిధంగా ఎలా డిలీట్ చేసుకుంటాం అన్నది కూడా చాలా ముఖ్యమైన మెంటల్ హెల్త్ విషయం..!!
    మీరు చదివిన పుస్తకాల నేను చదవలేదు.. చాలా వరకు.. ఒకప్పుడు చదవాలి ఎప్పటికి చదువుతాను అనే దిగులు అనిపించేది.. కానీ, ఏ ఎజెండా లేకుండా పనిచేస్తూ పోతున్న మిమ్మల్ని సౌమ్యని చూస్తూ ఉంటే.. మీరు నేర్చుకున్నదంతా గొప్ప సుఖంగా నేర్పుతున్న అంత హాయిగా ఉంటుంది..
    నేను చాలా వరకు మెంటల్ హెల్త్ విషయాలు disability వల్ల నేర్చుకున్నాను.. కొన్ని ఖాళీలు కనిపిస్తాయి కొన్ని కనిపించవు.. కనపడని ఖాళీ ఇంకా ఇబ్బంది పెడుతుంది
    .
    ఇదంతా మనల్ని మనం నింపుకోవడమే అయినప్పటికీ.. మీరు కోట్ చేసిన బైరాగి వాక్యం లా.. మనుషులతో వాదాలతో, వేదాంతాల తో నింపలేని ఖాళీలను కొంత సంగీతం, కాస్త సాహిత్యం, మరికొన్ని రంగులతో.. రేఖ మయంగా నింపుతున్నారు.. చాలా హేపీ..!!

    నాలో ఖాళీలను, మనుషులు చేసిన గాయాలను, కలపలేమేమో అనుకున్నంత దూరాలను ..కొన్ని సరిగమలు, మరికొన్ని అక్షరాలు.. చుక్కల ముగ్గులు పెట్టినంత చులాగ్గా ఎలా నింపానో .. నింపుకుంటున్నానో కూడా రాయలబ్బా.. రాస్తా త్వరలో.. !!
    ~~సాయి పద్మ

  2. Purnima

    మమత గారు: నేను ఈ వ్యాసాన్ని చాలా ఆలోచించి, పద్ధతిగా, ఒక distance & controlతో రాశాననుకున్నా గానీ, మీ వ్యాఖ్య చూశాక అర్థమైంది అటలాంటిది ఏం జరగలేదని. 🙂 నేను ఎంతసేపూ సరమగో, కాల్వినో చేతివేళ్ళు పట్టుకుని అక్కడక్కడే తిరిగా. కాఫ్కానిగానీ, బెకెట్‍ పేరుగానీ ఎత్తలేకపోయానంటేనే నేనింకా ఏ కోశాన objectiveగా లేనన్న మాట.

    కాఫ్కా గురించి మీరన్నది ఇంతకు ముందోసారి ఒకరు అన్నారు. ఎక్కడికో చోట కొట్టుకుపోతేనే నయమేమో, బెకెట్‍ అక్కడ్నుంచి కదల్నివ్వడు, ఎటూ పోనివ్వడు. He’s a torture!

    స్నేహ గారు: All we can do is hope. మీలా సహృదయతతో అర్థంచేసుకునేవారు ఉన్నారని తెలిస్తే కొందరైనా ముందుకు రావచ్చు. మాట్లాడచ్చు. Let’s hope so.

    కృష్ణారావు గారు: మీరు అన్ని తక్కువ పదాలలో ఒక snapshot తీసి పెట్టారుగా అసలు, మానసిక ఆరోగ్యం గురించి. చాలా మాట్లాడచ్చు ఈ ఒక్క వ్యాఖ్య గురించి.

    “అంటే ముందుగా రోగి తనకున్న రుగ్మతను అంగీకరించగలగాలి.” – అవును.

    “People in therapy often go to therapy to deal with the people in their lives who won’t go to therapy.” – ఇది నాకు చాలా ఆసరా ఇచ్చిన కొటేషన్. కాలో, చేయో విరిగి ఒకరితో సపర్యలు చేయించుకోవాలంటే ఎవరూ ఇష్టపడరు. కానీ అదే మానసికపరమైన సమస్యలుంటే మాత్రం వాటి వల్ల ఇతరులకి కలుగుతున్న ఇబ్బందులు, అనవసరంగా బంధాలపై పడుతున్న ఒత్తిడిని మాత్రం విస్మరిస్తారు. మీరన్నట్టు ఎత్తి ఆసుపత్రిలో పడేయలేం. అట్లా పడేయాల్సినంతటి దారుణమైన పరిస్థితులు వచ్చినా ఆ కేర్‍టేకర్ పడాల్సిన మాటలు అన్నీ ఇన్నీ కావు. I don’t know, it all seems so hopeless at times.

  3. మద్ధిపాటి కృష్ణారావు

    అభివృద్ధి చెందాయనుకుంటున్న సమాజాల్లో కూడా మానసిక ఆరోగ్యం, భౌతిక శారీరక ఆరోగ్యంలానే కుంటుపడే అవకాశం ఉందని గుర్తించడం తక్కువే. రోగానికి సంబంధించిన అవగాహనాలోపం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బ తిన్నవారిని ఇంచుమించు వారి వ్యక్తిగత తప్పిదంగానే పరిగణించడం సర్వసాధారణం. దీనివల్ల ఆ రోగగ్రస్తులు ఆత్మన్యూనతకు లోనై మరింత అనారోగ్యానికి గురవడం మరింత విషాదం. అసలే అవగాహన తక్కువగా ఉన్న మానసిక ఆరోగ్యం గురించి మన పక్కనున్న వారు తెలియక చేసే ప్రవర్తనను తప్పు పట్టడం కూడా కష్టమే. ఐతే కాలక్రమేణా మానసిక ఆరోగ్యాన్ని గురించిన శాస్త్రవిజ్ఞానం పెరుగుతోంది. మరీ కళ్ళూ చెవులూ మూసుక్కూర్చుంటే తప్ప, కాస్తో కూస్తో చదువుకున్న వారికి మానసిక ఆరోగ్యానికి సంబంధించిన అవగాహన లభ్యమౌతూనే ఉంది. అది గుర్తించినవారు కూడా మానసిక రోగిని సానుభూతితో చూడగలరేమోగానీ, సహాయం అందించడానికి మాత్రం రోగి సహకారం లేనిదే అసాధ్యం. ఇది కాలో చెయ్యో విరిగితే ఎత్తుకెళ్ళి వైద్యశాలలో పడెయ్యడం కాదు. అంటే ముందుగా రోగి తనకున్న రుగ్మతను అంగీకరించగలగాలి. ఆ తర్వాతే ఎలాంటి పరిష్కారమైనా. మానసిక రోగికి అవగాహన ఉన్నా సమాజం దృష్టిలో ఆ రోగానికి ఉన్న చిన్నచూపు వల్ల ముందుకు రాలేకపోవచ్చు. అసలే సరైన వైద్య అవకాశం లేని రోగానికి ఎన్ని అడ్డంకులో. వీటన్నిటినీ అధిగమించి, మీకున్న సమస్యను గుర్తించి, నలుగురితో పంచుకుని అవగాహన పెంచగలిగిన మీ స్ఫూర్తికి ధన్యవాదాలు!

    ‘మానవుడికి కావల్సింది మతాలు, దేవుళ్ళు, మొక్కుబళ్ళు, రాజకీయాలు కావు. మానవుడికి కావలసింది దయ – కొంచెం, కాస్త ఐన చాలు’ -బుచ్చిబాబు (చివరకు మిగిలేది)

  4. Sneha

    పూర్ణిమ గారు,

    Thank you for writing this. Every one has emotional issues. కానీ వాటి గురించి మాట్లాడేవాళ్ళు తక్కువ. మీరు ఇలా మాట్లాడడం వివరంగా చర్చించడం వల్ల ఇలాంటి చర్చలు ఎక్కువ జరిగే అవకాశం వస్తే చాలా బాగుంటుంది.
    Thank you once again for sharing this with all of us.

  5. Aruna Pappu

    అయ్యా శ్యామలరావు గారు, మీకు బైరాగి కవిత్వ పంక్తులు అర్ధం అయ్యాయా?

  6. మమత కొడిదెల

    వ్యాసం చాలా బాగుంది. గుక్కతిప్పుకోనివ్వకుండా చదివించింది. “తెల్సిన అక్షరాలు ఎటూ గూటికి చేరాయి, కొత్తవీ గూడుకట్టుకుంటున్నాయి.” made me smile.

    మానసికంగా తల్లకిందులు చేసే సందర్భాలూ, కారణాలూ ఎన్నో. నాకైతే కాఫ్కాని చదవాలంటే భయం, ఎక్కడికి కొట్టుకుపోతానో మళ్లెప్పుడు బయటకి రాగలనో అని. Thank you for this write up. I hope more of us will start talking/writing openly about mental health. Looking forward to the next article.

  7. పుస్తకం.నెట్

    అందరికీ ఓ విజ్ఞప్తి:

    “వీలైతే, మీకు చేతనైతే ఈ ఒక్క వ్యాసాన్ని కాస్త సహృదయతతో, సహానుభూతితో చదవమని మనవి.” అని ఈ వ్యాసం మొదటిలోనే చెప్పడానికి ఓ కారణముందని గమనించగలరు.

    మీకు వీలుకాకపోతే, చేతకాకపోతే మేం మిమ్మల్ని తప్పుబట్టం. మాకు వీలవుతుంది, చేతనవుతుంది కాబట్టి మిమ్మల్ని అర్థంచేసుకుంటాం. కాకపోతే ఈ విషయమై మీ కామెంట్స్ మాత్రం అప్రూవ్ చేయలేం. మరొకరు ఇలాంటి వ్యాసం ఒకటి రాయాలంటే వెనుకాడేలా చేసే ఏ వ్యాఖ్యలకి చోటు ఇవ్వబోము. థాంక్యూ!

    -పుస్తకం.నెట్

  8. Purnima

    శ్యామల రావుగారు,

    ఈ వ్యాసాన్ని ఇలా అనుకోవచ్చు:

    ఒకరు బండెడు పుస్తకాలు మోసుకొస్తూ రోడ్డు దాటుతుంటే ఆక్సిడెంట్ అయి, కళ్ళకి గాయమై కొన్నాళ్ళు చదవలేకపోయారు. మళ్లీ మెల్లిమెల్లిగా చదవడం ఏయే పుస్తకాలతో మొదలెట్టారన్నది చెప్పారు.

    ఇలా అనుకుంటే, వాళ్ళు మోసుకొస్తున్న పుస్తకాలు “ఆక్సిడెంట్ పుస్తకాలు” అని అనలేం కదండీ! ఆ పుస్తకాల పేర్లు, రచయిత పేర్లు మనం పలకగలగడం, పలకలేకపోవడం అన్న సంగతి ఓ మనిషి పడ్డ వేదనని పక్కకు పెట్టి మరీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉందంటారా? కంటికి కనిపించనంత మాత్రన, శరీరానికి కలగనంత మాత్రాన వేదన చులకనైపోతుందా?

    “మీరు ఫుడ్ బాగా తిని డయబెటిక్స్ తెచ్చుకున్నారో, డయబెటిక్-ఫ్రెండ్లీ ఫుడ్ తిని తిని దెబ్బతిన్నారో తెలీడం లేదు” అని మీరు ఎవరి మొహం మీదే అనబోరని ఆశిస్తున్నాను.

    పూర్ణిమ

  9. Sowmya

    శ్యామలరావు గారికి:

    ఇది నాకు సంబంధం లేని విషయమే అయినా, మీ వ్యాఖ్యని చూసి జవాబు రాయాలనిపించింది.

    మామూలుగా ఉన్న ఓ వ్యాసం, కథ వంటివి చదివితే, వ్యాఖ్య దానిలోని విషయం గురించో ఆ వ్యాసం/కథ/కవిత ఎలా రాశారనో, దానిలోని ఎమోషన్ ఎలాంటిదనో.. ఇలాంటివి రాస్తారు.ఇపుడు ఇక్కడ మానసిక వ్యాధుల ప్రస్తావన ఉంది కనుక, వాటికి సంబంధించిన వివరాలను తెలుసుకోవడమో, వాళ్ళ అనుభవం తెలుసుకోడమో, ఆ పుస్తకాల గురించి అడగడం, ఇలాంటివి. మీ వ్యాఖ్య కొంచెం పాఠకులుగా మనకి అనవసరమైన విషయం గురించి ఉన్నట్లు అనిపించింది. ఇంకోళ్ళ వ్యక్తిగత సమస్య గురించి వెటకారం కూడా ధ్వనించింది. వ్యాస రచయిత సంగతి అటు పెడితే నాకు చాలా అభ్యంతరకరంగా, మోటుగా అనిపించింది అలా అడగడం. ఒక పబ్లిక్ ఫోరం లో మనం అంతా ఒకరి పట్ల ఒకరు దీనికంటే మర్యాదగా, దీనికంటే సహానుభూతితో వ్యవహరించవచ్చు అనిపించింది. మీకు చెప్పేంత దాన్ని కాకపోయినా, ఈ నాలుగు ముక్కలూ చెబుతున్నాను. సహృదయతతో స్వీకరిస్తారని అనుకుంటున్నాను.

    ఇక రచయితల పేర్లు పలకడం – చదివే ప్రతి వారికీ అన్ని పదాలూ, అందునా విదేశీ రచయితలవి, పలకడం రావాలని లేదు. తెలుసుకోవాలి అనుకుంటే గూగుల్ చేస్తే తెలుసుకోవచ్చండి. ఇది వ్యాసానికి సంబంధం లేని అంశం లా నాకు అనిపించింది.

  10. తాడిగడప శ్యామల రావు

    మీరు పుస్తకాలు ఎక్కువగా చదవటం కారణంగా జబ్బుపడ్డారో, జబ్బుపుస్తకాలు చదివి దెబ్బతిన్నారో అన్నది తెలియటంలేదు. అదలా ఉంచితే, మీరు ఉదాహరించిన కొందరు రచయితలు పేర్లను పలకటం నావల్ల కావటంలేదు

Leave a Reply