అసలైన అమ్మ గుఱించి….

Durgaa_Saptasatiఅన్ని ఆస్తిక మతాలూ ప్రపంచానికి తండ్రి ఉన్నాడని చెబుతాయి. తల్లి కూడా తప్పకుండా ఉందని చెప్పే మతం హిందూమతం ఒక్కటే. దీనిక్కారణం హిందువుల సృష్టిసిద్ధాంతం ఇతర మతాల సృష్టిసిద్ధాంతం కంటే కొంచెం వేఱైనది కావడం. హిందూమతం చెప్పేది – దేవుడు ప్రపంచాన్ని సృష్టించాడని కాదు. దేవుడే ప్రపంచంగా మారాడని. అలా మారినప్పుడు ఆ ప్రపంచం స్త్రీరూపాన్ని ధరించింది. ఆవిడ దృశ్యమానమైన ప్రకృతిగా మనకు తల్లి అయింది. అదృశ్యుడైన ఆత్మశక్తి (పురుషోత్తముడు) మనకి తండ్రి అయ్యాడు. అందుచేత అయ్యవారికంటే అమ్మవారే మనకి నిత్య ప్రత్యక్షురాలు.

“…త్వామాశ్రితా హ్యాశ్రయతామ్ ప్రయాన్తి”

తా|| తల్లీ ! నిన్నాశ్రయించినవారు ఇతరులకు సైతమాశ్రయమగుదురు.

“…విశ్వాశ్రయా యే త్వయి భక్తినమ్రాః”

తా|| తల్లీ ! నీ యెదుట భక్తితో తలయొగ్గినవారు విశ్వమునకే ఆశ్రయమివ్వగలవారగుదురు.

శ్రీ జగన్మాతని నేను తొట్టతొలిసారి ప్రత్యక్ష దర్శనం చేసుకున్నది హైదరాబాదులో 2006 వసంత ఋతువులో ! ఇక్కడ సమీక్షితమవుతున్న దేవీమాహాత్మ్యం ఈ విధమైన జగదంబా సాక్షాత్కారానికి దారితీసే ఒక అద్భుతగ్రంథం. దీన్ని బెంగాల్ లో ఎక్కువగా పారాయణ చేసేవారు. బెంగాలీలు అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తారు. దసరా తొమ్మిదిరోజులూ అమ్మవారు కైలాసం నుంచి పుట్టింటికి (బెంగాల్) వస్తారని, ఒక ఆడపిల్లకి చేసినట్లే చీరలూ, సారెలూ పెట్టి వైభవోపేతంగా చూసుకుంటారు. “ఆదిభిక్షువు (పరమశివుడి) తో ఆ కష్టాల కాపురం ఎలా చేస్తున్నావో తల్లీ !” అని విలపిస్తూ పాటలు పాడతారు. మన తెలుగువాళ్ళు కూడా దసరా బాగా జఱుపుతారు గానీ ఆ పండుగతో బెంగాలీలకున్న ఆత్మీయ అనుబంధం మనకి లేదని ఒప్పుకోవాలి.

700 శ్లోకాలు గలది కావడం చేత దేవీమాహాత్మ్యానికే దేవీసప్తశతి అని నామాంతరం. ఇది మార్కండేయ పురాణంలో ఒక భాగం. మార్కండేయ మహర్షి బోధించినట్లు వర్ణించబడింది. ఇది చాలా దశాబ్దాల క్రితం కీ.శే. కందుకూరు మల్లికార్జునం గారి తెలుగు తాత్పర్యాలతో ప్రచురించబడింది. పాఠకుల కోరిక మేఱకు శ్రీరామకృష్ణమఠం వారు ఇటీవల దీన్ని పునర్ముద్రించారు. స్వామి బ్రహ్మానందపురి గారు (రామకృష్ణపరమహంస ప్రథమశిష్యులు మఱియు రామకృష్ణమఠానికి ప్రథమ అధ్యక్షులు) తన శిష్యుడైన స్వామి యతీశ్వరానందపురి గారికి రోజూ ముఖ్యంగా ఈ చండీపాఠాన్ని పారాయణ చెయ్యమని చెప్పారని ప్రముఖ బ్లాగరి శ్రీ ముక్కు రాఘవకిరణ్ గారు తెలియ జేస్తున్నారు. ఇందులో–

౧. శ్రీ చండికా ధ్యానము
౨. అర్గళా స్తోత్రము
౩. కీలక స్తోత్రము
౪. దేవీకవచము
౫. దేవీసప్తశతి
౬. అపరాధ క్షమాపణ స్తోత్రము
౭. దేవీసూక్తము

అనే భాగాలున్నాయి. ఇందులో మహిషాసురవధ, శుంభ, నిశుంభులనే రాక్షసుల్ని దేవి సంహరించిన విధము, దేవతలూ మునులూ దేవికి చేసిన స్తోత్రాలూ ఉన్నాయి. అవి చదివితే అమ్మవారి సంగతేమో కానీ మన మనస్సు మాత్రం చాలా ప్రసన్నమౌతుంది. మచ్చుకు–

శ్లో|| యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

తాత్పర్యము : అన్ని స్థావర జంగమములందును విష్ణుమాయ అని చెప్పబడిన దేవికి మరల మరల నమస్కారము.

శ్లో|| యా దేవీ సర్వభూతేషు చేతనేత్యభిధీయతే |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

తాత్పర్యము : అన్ని స్థావర జంగమములందును చైతన్య (consciousness) స్వరూపమైన తల్లికి మరల మరల నమస్కారము.

శ్లో|| యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||
శ్లో|| యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా | నమస్తస్యై…..||
శ్లో|| యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థితా | నమస్తస్యై…..||
శ్లో|| యా దేవీ సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థితా | నమస్తస్యై…..||
శ్లో|| శ్లో|| యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా | నమస్తస్యై…..||
శ్లో|| యా దేవీ సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థితా | నమస్తస్యై…..||
శ్లో|| యా దేవీ సర్వభూతేషు క్షాన్తిరూపేణ సంస్థితా | నమస్తస్యై…..||
శ్లో|| యా దేవీ సర్వభూతేషు జాతిరూపేణ సంస్థితా | నమస్తస్యై…..||
శ్లో|| యా దేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థితా | నమస్తస్యై…..||
శ్లో|| యా దేవీ సర్వభూతేషు శాన్తిరూపేణ సంస్థితా | నమస్తస్యై…..||
శ్లో|| యా దేవీ సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థితా | నమస్తస్యై…..||
శ్లో|| యా దేవీ సర్వభూతేషు కాన్తిరూపేణ సంస్థితా | నమస్తస్యై…..||
శ్లో|| యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా | నమస్తస్యై…..||
శ్లో|| యా దేవీ సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థితా | నమస్తస్యై…..||
శ్లో|| యా దేవీ సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థితా | నమస్తస్యై…..||
శ్లో|| యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థితా | నమస్తస్యై…..||
శ్లో|| యా దేవీ సర్వభూతేషు తుష్టిరూపేణ సంస్థితా | నమస్తస్యై…..||
శ్లో|| యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా | నమస్తస్యై…..||
శ్లో|| యా దేవీ సర్వభూతేషు భ్రాన్తిరూపేణ సంస్థితా | నమస్తస్యై…..||

అమ్మవారి ఉపాసనలో శాక్తేయుల భావనకీ, జనసామాన్యం యొక్క భావనకీ స్వల్పవ్యత్యాసం ఉంది. అమ్మవారిని జనసామాన్యం శివుని భార్యగానో, విష్ణువు భార్యగానో పూజిస్తారు. శాక్తేయులు ఆ మాట ఒప్పుకోరు. ఆవిడ వారందఱికంటే పై స్థాయి అనీ, ఆవిడ ఎవరికీ భార్య కాదనీ ఆమె అంశలు లక్ష్మీ, పార్వతీ, సరస్వతీ రూపాల్లో త్రిమూర్తుల వద్దకు చేఱాయని, ఆవిడే సృష్టిస్థితిలయ కారకురాలని, బ్రహ్మవిష్ణు మహేశ్వరులు ఆమె చేతుల్లో కీలుబొమ్మలనీ వారు వాదిస్తారు. వారి సాహిత్యమంతా ఆ విధంగా త్రిమూర్తుల్ని నిర్లక్ష్యం చేసే శైలిలో రచించబడింది. దేవీమాహాత్మ్యంలో ఈ ధోరణి అంత తీవ్రంగా కనిపించదు. కానీ దేవీపారమ్యం అదే స్థాయిలో ఉంది.

ఎందుకంటే “ముందు స్త్రీ, ఆ తరువాతే పురుషుడు” అని శాక్తేయ మతస్థుల సిద్ధాంతం. ఆంధ్రదేశంలో ఈ సిద్ధాంతానికి అనుయాయులు మొదట్నుంచి ఎక్కువే. దేవీ ఉపాసకులైన హరికథా పితామహుడు శ్రీ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసుగారు “ఆడుది సత్తా, మగవాడు చెత్త” అని చమత్కరిస్తూండేవారు. ఈ వాదానికి ఒక కారణం ఉంది. తల్లిగర్భంలో పడినప్పుడు ప్రతి శిశువూ ఆడశిశువే. మగవాళ్ళక్కూడా చనుమొనలుండడానికి ఇదో కారణం. కొన్ని వారాల తరువాతే లింగభేదం ఏర్పడుతుంది. అలా ఏర్పడ్డానికి ముందే మగబిడ్డ కావాల్సినవారు పుంసవనం అనే హోమం నిర్వహిస్తారు. ఆ మంత్రప్రభావం చేత గర్భంలోని పిండం స్త్రీత్వంలోంచి పురుషత్వంలోకి మారుతుందని విశ్వాసం.

“….సైషా ప్రసన్నా వరదా నృణామ్ భవతి ముక్తయే”

తా|| ఆమెయే ప్రన్నురాలైనచో వరములును ఇచ్చును. ముక్తిని కూడా ప్రసాదించును.

దేవీసప్తశతి పారాయణ దసరా రోజుల్లో విశేష ఫలితాన్నిస్తుందని చెబుతారు. కానీ అందుకు రెండుగంటల కంటే తక్కువ సమయం పట్టదు.

(దేవీమాహాత్మ్యము (మార్కండేయ పురాణ అంతర్గతము) ; అనువాదము – కీ.శే. కందుకూరు మల్లికార్జునం ; ప్రచురణ – శ్రీ రామకృష్ణమఠము ; పుటలు – 200 ; వెల – రు.30 ; వలయువారు : రామకృష్ణమఠము, మైలాపూరు, మద్రాసు-4)

You Might Also Like

6 Comments

  1. తాడేపల్లి

    అయ్యా ! నేనిక్కడ రాసిందొకటి. మీరు అర్థం చేసుకున్నదొకటి. ప్రపంచానికొక తల్లి ఉంది అంటే దానర్థం – ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళంతా దుర్గలని కాదు. ప్రపంచంలో మగవాళ్ళంతా ఎలాగైతే సదాశివులు కాలేరో ఇది అంతే ! లౌకిక ఉపాధి (శరీర) గతమైన లోపాలూ, వ్యత్యాసాలూ, దృష్టికోణాలూ తప్పనిసరిగా ఉంటాయి. ప్రపంచంలోని ప్రతి ఆడదాన్ని దుర్గాస్వరూపంగా చూసే మహోన్నత ఆధ్యాత్మికస్థితి ఒకటుంది. కానీ అది అందఱికీ రాదు. అది రానంతకాలం సాధారణ ఆడవాళ్ళని సాధారణ ఆడవాళ్ళుగా చూడ్డమే మన యింటికీ, ఒంటికీ చాలా మంచిది. కుటుంబానికి పునాది ఆడది. పునాదులు కదలడం ప్రమాదకరం. నేననుకోవడం – ఆడవాళ్లూ మగవాళ్లూ ఒకటి కాదు. సదృశత్వం (పోలిక) లేనిచోట సమానత్వానికి అవకాశం లేదు. సమానత్వం సదృశుల మధ్యనే సాధ్యం. ఆడవాళ్ళు మగవాళ్ళలా తిరగడం వాళ్ళకీ, వాళ్ళ కుటుంబాలకీ, భవిష్యత్తరాలకీ మంచిది కాదు. వారి కదలికల్ని మన పూర్వీకులు పరిమితం చేయడానికి అదే కారణం. బహుశా ఆ కాలానికి అది సమంజసమైన ఆలోచనే.

  2. Anand

    anni matalla kanna hindu matam amma ante srusti ki mulam ani chebutudi annaru..mari alanti hindu matam women ni house ki matrame enduku parimitam chesaru..manu cheritra ekkadidi…manu cheritra aadadaani vanta intiki parimitam cheyyaleda…

  3. రాఘవ

    బాలసుబ్రహ్మణ్యంగారూ

    అద్భుతం! నేను సరీగ్గా ఏ పుస్తకం గుఱించి ఐతే అనుకుంటున్నానో దాని గుఱించే వ్రాసారండీ మీరు. చాలా చక్కగా సూటిగా ఉంది మీ సమీక్ష.

    దీనికి మఱి ఒక్క మాట జత చెయ్యాలనిపించింది, ఇది బహుశా మీరూ వినే ఉంటారు. స్వామి బ్రహ్మానందపురి గారు (రామకృష్ణపరమహంస ప్రథమశిష్యులు మఱియు రామకృష్ణమఠానికి ప్రథమ అధ్యక్షులు) తన శిష్యుడైన స్వామి యతీశ్వరానందపురి గారికి రోజూ ముఖ్యంగా ఈ చండీపాఠాన్ని పారయణ చెయ్యమని చెప్పారట 🙂

    నమస్సులతో
    రాఘవ

  4. దుర్గేశ్వర

    రూపందేహి …జయందేహి …యశోదేహి…………

  5. suresh babu

    మీ సమీక్ష చాలా బాగుందండీ. బెంగాల్లో దేవీమహాత్మ్యం “చండీ” అనే పేరుతో ప్రసిద్ది.

  6. gabhasthi

    శ్లో|| యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా |
    నమస్తస్యై నజగమెలె తల్లి ని మన బిడ్డ గా భావించడం,ఆ మె ను ఆడరించదమనె భావం మనసును పులకరింప చెస్తుంది.ఆ అద్భుత భావన, భగవంతుని కంటె భక్తుని కి ప్రాముఖ్యత నిచ్చె మహనీయ భక్తియొగం కల మతం లొ పుట్టించి నందుకు ఆ అమ్మ కు సత కొటి వందనాలు అర్పిస్తూ.మస్తస్యై నమస్తస్యై నమో నమః ||.

Leave a Reply