The World of Homosexuals :: Shakuntala Devi

కొందరు విశిష్ట వ్యక్తులు చేసిన అసాధారణ పనులు, అయితే వాళ్ళు పోయినప్పుడో, లేకపోతే వాళ్ళ మీద సినిమాలు వచ్చినప్పుడో జరిగే చర్చల్లో బయటపడుతుంటాయి. విద్యా బాలన్ నటించిన సినిమా “శకుంతలా దేవి” ప్రమోషన్లు వచ్చేవరకూ నాకు ఆవిడ “ది వల్డ్ ఆఫ్ హొమోసెక్సువల్స్” అన్న పుస్తకం రాశారని తెలీదు. ఆ పుస్తక ప్రస్తావన రాగానే ఆవిడ (మాజీ) భర్త హొమోసెక్సువల్ కాబట్టి ఆవిడ ఈ పుస్తకాన్ని రాయడానికి పూనుకున్నారన్న ఉచిత సమాచారం కూడా వెంటనే అందుతుంది. అదే ఒక మగవాడు ఈ పుస్తకాన్ని రాసుంటే, ఎందుకు రాశాడంటూ వ్యక్తిగత కారణాలు చూబిస్తారా అన్న ప్రశ్నను లేవదీయను. సమాధానాలు తెలిసిన ప్రశ్నలను మళ్ళీ మళ్ళీ వేసుకోవడంలో అర్థం లేదు. 

అయితే మనకు ఖచ్చితంగా తెలిసిన విషయాలు గురించే మాట్లాడుకుందాం. 

  1. ఇది “హ్యుమన్ కంప్యూటర్”గా పేరుపొందిన శకుంతలా దేవి రాసిన పుస్తకం. హోమోసెక్యువల్స్ (స్వలింగ సంపర్కుల) గురించి.
  2. తొలి ప్రచురణ 1976లో. 
  3. ఢిల్లీకి చెందిన వికాస్ పబ్లిషింగ్ హౌస్ శాఖ “బెల్ బుక్క్స్” దీన్ని ప్రచురించారు, 1978లో. 

 

“ఎందుకు రాశావు?” అన్న ప్రశ్నని తప్పించుకోవడం అసాధ్యమని ముందే ఊహించినట్టున్నారు, అందుకే ముందుమాటలో స్వలింగ సంపర్కులని అర్థం చేసుకోవడం కోసం, వారిని మనలో ఒకరిగా ఆమోదించడం కోసం ఒక సామాన్యురాలు సామాన్యులకోసం రాసిన పుస్తకం ఇదని చెప్పారు. ఒక భారతీయ మహిళ డబ్భైవ దశకంలోనే ఈ అంశాన్ని ఎంచుకోవడమే కాకుండా, దాన్ని వీలైనంతగా పరిశోధన చేసి అందరి ముందుకూ తేవడం ఆశ్చర్యమే! అది అచ్చవ్వడం ఓ రకంగా అద్భుతమే! 

పుస్తకానికి “స్వలింగసంపర్కుల ప్రపంచం” అని పేరు పెట్టారే గానీ “ప్రపంచంలో స్వలింగసంపర్కులు” అని పేరు పెట్టినా సరిగ్గా సరిపోయేది. ఎందుకంటే ఏకకాలంలో “వాళ్ళ” ఆంతరంగిక, సామాజిక ప్రపంచాలని మనకి పరిచయం చేయడమే కాకుండా మనమున్న “నార్మల్” ప్రపంచంలోని అవతవకలనూ నిష్పాక్షికంగా బట్టబయలు చేయడానికి ఏ మాత్రం వెనుకాడదు, ఈ పుస్తకం. వివక్షకు గురైన ఒక వర్గంపైన ఎనలేని సానుభూతి చూబించచ్చు గానీ వారినీ, వారి విధివిధానాలనీ అర్థం చేసుకునే క్రమంలో చెలామణి అవుతున్న పద్ధతులని, అలవాటుపడిపోయిన పరిస్థితులను తీక్షణంగా విమర్శించడమంటే ధైర్యంతో కూడుకున్న పని. 

అసలు ఓ రకంగా, ఇలాంటి అనేక వర్గాలవారిని సమాజం ఆమోదించకపోవడానికి ముఖ్య కారణం: వారిని ఆమోదించడం వల్ల ప్రస్తుతం సమాజపు కట్టుబాట్లన్నీ తుడిచిపెట్టుకుపోతాయి.  లేదా వాటిలోని డొల్లతనం బయటపడుతుంది ఉదాహరణకి: కుటుంబ వ్యవస్థ అంటే తమ సామాజిక వర్గంలో ఉన్నవారినే ఒక వయసు దాటేలోపు పెళ్ళి చేసుకొని, పిల్లల్ని కని, వారికి మళ్ళీ అదే సామాజిక వర్గంలో పెళ్ళి చేసి వాళ్ళకి పిల్లలు పుట్టి… ఇదో వరుస. ఇందులో మళ్ళీ ఆడమగకి కొన్ని ప్రత్యేకమైన పాత్రలుంటాయి. ఆడవాళ్ళు ఇంటిని చూసుకోవాలని, పిల్లలని సాకాలనీ ఒక నిబంధన. మగవాళ్ళు డబ్బు సంపాదించి వాళ్ళని పోషించాలనీ ఉంటుంది. అందుకే, మగ-మగ గానీ, ఆడ-ఆడ గానీ పెళ్ళి చేసుకుంటే ఈ కృత్రిమైన బాధ్యతల విభజన అసమంజసంగా ఉంటుంది. భాష కరువైపోతుంది. ఎవరు భార్య, ఎవరు భర్త? అన్న ప్రశ్న దగ్గరే ఆగిపోతుంది ఈ సంభాషణ. ఇవ్వన్నీ ఎందుకని, అసలు ఇలాంటివారు ఉండనే ఉండరనీ, ఉన్నా కూడా అది పాపఫలితమో, శాపఫలితమోనని తేల్చేసి, ఎక్కడోగానీ అలాంటి వారుండరని, చూసి కూడా చూడకుండా తనని తాను మభ్యపెట్టుకుంటుంది సమాజం. 

అందుకే వీరిని అర్థం చేసుకోడానికి శరీర శాస్త్రం లేక మానసిక శాస్త్రం మాత్రమే అర్థం చేసుకుంటే సరిపోదు. సమాజికపరంగా, ఆర్థికపరంగా, న్యాయపరంగా అన్ని విధాలగానూ అర్థం చేసుకోవాలి. శకుంతల వీటిన్నింటినీ నూటభై పేజీలు దాటని పుస్తకంలో ఇమడ్చగలిగారు. బెంగళూరులో ఒక “గే” వ్యక్తితో మాటామంతీతో ప్రారంభమవుతుంది ఈ పుస్తకం. ఎవరికి తెలీకుండా అతడు తన రహస్య జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. త్వరలో పెళ్ళి చేసుకోబోతుంటాడు. కట్నం వస్తే అది తన చెల్లుళ్ళ పెళ్ళికి పనికొస్తుందని చెపుతాడు. అతడి మాటల ద్వారా చర్చించడానికి ఆస్కారం ఉన్నవాటిని తరువాతి చాప్టర్లలో వివరంగా పరిశీలిస్తారు. 

హోమోసెక్సువాలిటి అంటే ఏమిటి? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆ మనుషుల శారీరక, మానసిక అవస్థ ఎలా ఉంటుంది? వారు సెక్స్ ని ఎలా చేస్తారు? అన్నవాటి మీద సమగ్రంగా, వీలైనంత వరకూ తన అభిప్రాయాలను జొప్పించకుండా వివరించారు. 

దీనిమీద జనాలకున్న దురభిప్రాయాలు, అపోహలు కొన్ని – ఇది కొందరికి అంటుకునే జబ్బు, లేదా కొందరు కావాలని ఇలా చేస్తారు/ఎన్నుకుంటారు లేదా ఏదో సమస్య ఉండడం వల్ల ఇలా వ్యవహరిస్తారు వగైరాలు. ఆ అపోహలని దూరం చేయడానికి చారిత్రకపరంగా, మతపరంగా ఈ అంశాన్ని ఎలా చూశారు అన్నవి వివరంగా రాసుకొచ్చారు. ఆ తర్వాత “న్యాయవ్యవస్థ” దీన్ని ఎలా చూసిందో, చట్టమున్నా ఎవరూ ఈ నేరం కింద శిక్షించబడకుండా ఉంటే అది వారిపైన ఎలాంటి ప్రభావం కనబరుస్తుందో, చట్టాలను కొట్టివేసినా దైనందిక జీవితంలో వివక్షను ఎలా పొగొట్టలేవో చదివితే అర్థమవుతుంది. ఇది భారతీయులకోసం రాసిన పుస్తకమే అయినా, సమగ్రమైన పరిశోధన లేకనో ఏమో, ప్రతి చాప్టర్ భారతదేశం నుండి మొదలైనా పైపైన మాత్రమే తచ్చాడి (అంటే మన గుళ్ళ మీద ఫలానా బొమ్మలున్నాయి, లేదా మన పురాణాల్లో కొన్ని కథలున్నాయి వగైరా), అమెరికా-యూరపుల ప్రస్తావన రాగానే విషయం లోతుగా మారుతుంది. తన మేధ ద్వారా ప్రపంచాన్ని చుట్టారు కాబట్టి ఆవిడకు రిసోర్సెస్ దొరకడం పెద్ద పని అయ్యుండకపోవచ్చు… అయినా ఇది ఇంటర్నెట్టు లేనికాలంలో వచ్చిన పుస్తకమని మనం గుర్తుంచుకుంటే దీని ప్రాముఖ్యత ఇంకా బాగా తెలుస్తుంది. పుస్తకం ఆసాంతం చదివితే ఎంత పరిశోధన చేశారో అర్థమవుతుంది. అంటే అంతగా అవగాహన లేని ఈ అంశం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మాత్రమే చర్చించి వదిలేయవచ్చు, కానీ ఈవిడ జైళ్ళల్లో స్వలింగసంపర్కులు, దీన్ని ఆసరాగా చేసుకొని డబ్బు సంపాదించుకోవడం లాంటి విషయాలనూ కూలంకషంగా చెప్పుకొచ్చారు. అంటే, “హొమోసెక్సువాలిటి”కి అప్పటివరకూ ఉన్న పార్శ్వాలన్నింటిని దాదాపుగా పుస్తకంలో చేర్చారు. “గే లిబరేషన్” గురించి చెప్తూ దీన్ని ఒక ఆశావహ దృక్పథంతో ముగించారు.

ఇందులో నాకు విశేషమనిపించిన విషయమేమిటంటే రచయిత వీలైనంత వరకూ “లెస్బియన్” (ఆ పదం ఎలా పుట్టిందో చరిత్ర కూడా ఉందిందులో) సమానంగా చెప్పుకురావడం, వారికి “గే”లతో పోలిస్తే ఉండే కష్టనష్టాలను విడమరచి చెప్పడం. ఇదెందుకు ముఖ్యమంటే, పితృస్వామ్య సమాజంలో మగవారిది పైచేయి. ఆడవాళ్ళు ఎప్పుడూ వివక్షకు గురవుతారు. అంటే, లెస్బియన్లు రెట్టింపు వివక్షకు (double discrimination) గురవుతారన్నమాట. “గే”లకి వచ్చినంత గుర్తింపు, లేక వారికున్నంత తెగింపు, వెసులుబాటు లెస్బియన్లకి ఉండే అవకాశాలు తక్కువ! వారిపై చేసిన పరిశోధనలు తక్కువై ఉండచ్చు, లేదా లెస్బియన్లగా ప్రకటించుకున్న ప్రముఖులు తక్కువై ఉండచ్చు. ఇలాంటి అవరోధాలున్నా వీలైన ప్రతి చోట వాళ్ళ గురించి చెప్పడానికి ప్రయత్నించడం నాకు చాలా నచ్చింది. మచ్చుకి ఈ పేరా చూడండి: 

 

Lesbians are the ultimate insult to the sexist male and the world he has built around his weaknesses. Why? Because they ignore him. Heterosexual women are still caught up in reacting to him. The women is trained to repress what the man is trained to express. He believes in male supremacy and heterosexual chauvinism. But the lesbians ignore him. Because they ignore him, because they are the ultimate insult, they pay and pay heavily. They are fired from jobs, expelled from schools, banished from their homes and even beaten. And lesbians who hide and escape the hostility suffer equal oppression through psychic damage caused by their fear and guilt. Lesbianism is the one issue that deals with women responding positively to other women as total human beings worthy of total commitment. It is one area where no male can tread. 

 

ఈ పుస్తకంలో ఉన్న ఇంటర్వ్యూలన్నీ అపురూపం. దాచుకోవాల్సినవి. ఎందుకంటే, అవి మన సమాజంలోని లోపాలను ఎత్తిచూపుతాయి. వాటికి అలవాటుపడిపోయో, లేక ఎదురుతిరగలేకో మనం ఆమోదించేసి ఉంటాం కాబట్టి ఇవి చదువుతుంటే మనం ఆలోచించని కోణాలు కనిపిస్తాయి. పురుషాధిక్యతను సవాలు విసిరే క్రమంలో మహిళల ఒంటరి పోరాటం ఎంతవరకూ సబబు? ఫెమినిజం ఈ వర్గాల వారిని ఎలా చూసింది? లాంటి కొత్త ప్రశ్నలు పుట్టుకొచ్చాయి. గీసిన గీతకి అవతల వారినుంచి వేరుగా చూసినా, గీతకి ఇవతలే స్త్రీలను ఉంచినా వివక్ష ఆగలేదు. వివిక్షలను తూకం వేసి, ఒకరికన్నా ఇంకొకరిది ఎక్కువ పీడ అని బారేజి వేయలేం గానీ, ఈ మొత్తంలో నష్టపడుతుందెవరు, లాభపడుతుందెవరు అన్న ప్రశ్న నాకుందిప్పుడు. 

ఈ ఇంటర్వ్యూలని చేసే క్రమంలో ఆవిడలో ఉన్న అపోహలు, అనుమానాలు బయటపడతాయి. She wasn’t acing these as pro. She wasn’t the subject matter expert, for sure. She was treading unsure waters, definitely. ఇంత శ్రమకోర్చి ఈ అంశంపై ఇంత సమగ్రంగా రాస్తే, ఆవిడ మీద తీసిన సినిమాలో కేవలం తన భర్తను అవమానపరచడానికే ఈ పుస్తకం ఉన్నట్టు చిత్రించడం అమానుషం. రాయడానికి ఆవిడ ఉన్న కారణాలు ఏవైనా కానీ తనకున్న పరిమితుల్లోనే ఇంతటి సహానుభూతితో రాయడమనేది మామూలు విషయం కాదు. అయితే దీని గురించి అసలు అవగాహనలేకపోవడమో, లేదా భయాలో, పిచ్చి ఊహలో ఉన్న ఆ కాలంలో. భారతదేశంలో. 

ఇప్పటికీ, రాబోయే కాలానికీ ఇదో విస్శరించలేని పుస్తకం. An indispensable book. This isn’t about homosexuals. This is about all of us, with no exclusions whatsoever. 

You Might Also Like

Leave a Reply