The Power of Habit by Charles Duhigg

 

వ్యాసకర్త: అమిధేపురం సుధీర్

ఈ పుస్తకం టైటిల్ చూడగానే, ఇదో మంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకమేమో అనిపించింది. నేను మార్చుకోవాలి అనుకుంటున్న అలవాట్లు కొన్ని అలాగే వున్నాయి. ఈ పుస్తకం అందుకేమైనా సహాయ పడుతుందమోనని ఆశపడి కొన్నాను.    ప్రొలోగ్ చదవగానే అర్థమయ్యింది, నా అంచనా తప్పని. అయినా ధైర్యం కూడగట్టుకొని మొత్తం చదివాను. చిన్న పుస్తకమే అయినా, పూర్తిగా చదవటానికి సగటు కంటే ఎక్కువ సమయం పట్టింది నాకు. కంటెంట్ అలా వుంది.

ఈ పుస్తకాన్ని ప్రధానంగా మూడు పార్ట్ లుగా విభజించారు. మొదటి పార్ట్ – వ్యక్తిగత అలవాట్లు, రెండవ పార్ట్ – ఆర్గనైజేషన్స్ యొక్క అలవాట్లు, మూడవ పార్ట్ – సంఘాల యొక్క అలవాట్లు.

ప్రతీ పార్ట్ లో, కొన్ని ఉదాహరణలు. అలవాట్లు మార్చుకొని బాగుపడ్డవాళ్ళు, అలవాట్లు మార్చుకోలేక నష్టపోయినవాళ్ళు.

ప్రతీ ఉదాహరణ కు గల కారణాలు. సైంటిఫిక్ గా జరుగుతున్న పరిశోధనలు, వాటి ద్వారా వెలుగులోకి వచ్చిన విషయాలు, ఇలా సాగిపోయింది పుస్తకం అంతా. ఎన్నో రీసేర్చ్ పేపర్స్, అర్టికల్స్ రిఫర్ చేసి వ్రాసారు ఈ పుస్తకం. కేవలం, రిఫరెన్స్ లు వ్రాయడానికే 23 పేజీలు పట్టాయి.

అసలు విషయానికొస్తే, ఒక మనిషిలో లేదా, ఒక సంస్థ లో లేదా ఒక సంఘం లో అలవాట్లు ఎలా ఏర్పడతాయి, వున్న అలవాట్లు ఎలా మారతాయి అన్నది కొన్ని ఉదాహరణలతో   వివరించారు.

అలవాట్లు ఎలా ఏర్పడతాయి అని ఎలుకల మీద చేసిన ప్రయొగం తో మనకి అర్థమయ్యేటట్టు చెప్పారు. తర్వాత నుంచి అదే సూత్రం ఉపయోగిస్తూ ఇంకా చాలా ఉదాహరణాలు చూపెట్టారు.

ఇందులో కొన్ని విషయాలు చాలా ఆశ్చర్యం కలిగించాయి. మొదటి ప్రపంచ యుద్దానికి ముందు, ఉదయాన్నే పళ్ళు తోమే అలవాటు అతి తక్కువ మంది అమెరికన్లకు వుండేది అన్న విషయం. ఒక టూత్ పేస్టు (పెప్సోడెంట్) యొక్క మార్కెటింగ్ ప్రభావం వల్ల రెండవ ప్రపంచ యుద్దం నాటికి, పళ్ళు తోమే  అలవాటు స్తిరపడింది అన్నది అందులో ఒకటి.

21 రోజులు ఏ పనైనా క్రమం తప్పకుండా చేస్తే అది మనకి అలవాటవుతుంది లాంటి విషయాలు ఎక్కడా ఇందులో లేవు. ఒక అలవాటు చేసుకోవడం లేదా వదిలేయడం అనేది, ఒక సూత్రాన్ని ఆధారపడి వుంటుంది. ప్రతీ అలవాటుకి ఒక ప్రారంభం (ట్రిగ్గర్ పాయింట్)  వుంటుంది, తర్వాత ఆ పని మొదలవుతుంది, చివర్లో ఒక ప్రతిఫలం వుంటుంది. ఈ విషయాలేవి పట్టించుకోకుండానే, మనకి తెలీకుండానే మనం ప్రతీ రోజు కొన్ని వందల పనులు అలవాటుగా చేస్తూ వుంటాం.

పొద్దున్నే పళ్ళు తోమడం దగ్గరి నుంచి, రాట్రి దుప్పటి కప్పుకోవడం వరకు అన్నీ ఒక క్రమంలో జరుగుతుంటాయి. అందులో ఏ చిన్న తేడా వచ్చిన మనం వెంటనే పసిగడతాం. అంతలా మనం అలవాట్లతో పెనవేసుకుపోయాం.

అందుకే అలవాట్లని మార్చడం అంత తేలిక కాదు. కానీ ఒక్క సారి ఈ అలవాట్లు ఎలా ఏర్పడతాయి అన్న విషయం మనకి అర్థం అయితే, అలవాట్ల మీద మనం పై చేయి సాధించవచ్చు.   ఇదే విషయాన్ని ఈ పుస్తకం లో వివిధ ఉదాహరణలతో చెప్పారు.

ఒక సంస్థ లో వుండే అలవాట్ల వలన వుండే లాభ నష్టాల గురించి, ర్హోడ్ ఐలాండ్ హాస్పిటల్ మరియు అల్యూమినం కంపెనీ ఆఫ్ అమెరికా ల ఉదాహరణలు బావున్నాయి.

డిసెంబర్ 1, 1955 లో, రోసా పార్క్స్ అనే నల్ల జాతి మహిళ, బస్సు లో లేచి తెల్లవారికి సీట్ ఇవ్వనందుకు, అప్పటి చట్టం ప్రకారం ఆమెని అరెస్ట్ చేసారు. తర్వాత ఆ సంఘటన అమెరికాలో  ‘సివిల్ రైట్స్ ‘ ఉద్యమానికి కారణమైంది. మార్టిన్ లూతర్ కింగ్ అనే ఒక నాయకుడు ఈ సంఘటన తర్వాత వెలుగులోకి వచ్చాడు. అయితే, బస్సు లో సీట్ ఇవ్వనందుకు మొదటి సారి అరెస్ట్ అయ్యింది మాత్రం రోసా పార్క్స్  కాదు. అంతకు ముందే ఇంకొంత మంది ఇదే విషయం పై అరెస్ట్ అయ్యారు. కానీ ఈమె అరెస్ట్ తర్వాతే ఎందుకు అది ఒక ఉద్యమ రూపం తీసుకుంది. దానికి కారణమైన సోషల్ హాబిట్స్ (సంఘం యొక్క అలవాట్లు) ఏంటి అనే విశ్లేషణ బావుంది.

చివరగా, ఈ టెక్నాలజీ యుగంలో, పెరిగిన ఆన్లైన్ వాడకం ద్వారా మన అలవాట్లని ఎలా పసిగట్టి తమకు లాభదాయకంగా మార్చుకుంటున్నారో అన్న విషయాన్ని, ‘ టార్గెట్ ‘ అనే ఈ కామర్స్ సంస్థ చేసిన పని ద్వారా చెప్పారు.

అలవాట్ల మీద సైంటిఫిక్ రీసెర్చ్ ని నిజమైన ఉదాహరణలతో తెలుసుకోవాలంటే, చదవతగ్గ పుస్తకం ఇది.

 

You Might Also Like

Leave a Reply