దిద్దుకోవాల్సిన చారిత్రిక తప్పిదాలు

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ 

మమ్ము పీనుగులను చేసి

ఆడుకునే శత్రువులు ఇద్దరే ఇద్దరు

ఒకరు కరువు రక్కసి

మరొకరు రాజకీయ భూతం

                                  – రఘుబాబు

రాయలసీమ సంక్షుభిత సమాజాన్ని సాహిత్యానికి అనువర్తింపజేస్తూ సృజనాత్మక రచయిత బండి నారాయణస్వామి రచించిన వ్యాసాల్ని పర్‌స్పెక్టివ్స్‌ ప్రచురించ డానికి సంకల్పించినపుడు పై కవిత్వ పంక్తులే పదేపదే గుర్తుకు వచ్చాయి. అన్ని వెనకబడ్డ ప్రాంతాలలానే రాయలసీమది కూడా రక్తసిక్త చరిత్రే. అయితే కనికరం లేని ప్రకృతి చిన్నచూపుకీ, స్వార్థ రాజకీయాల క్షుద్రక్రీడకూ, భూస్వామ్య సాయుధ ముఠాకక్షలకూ  బలయిన ప్రాంతం రాయలసీమ. విలీనాల్లో-విభజనల్లో పెద్ద మనుషుల ఒప్పందాలుఅమలు కాకపోడానికో విఫలం కావడానికో కాలదోషం పట్టడానికో దశాబ్దాలుగా సీమనేల నిత్యానల వేదికయ్యింది. కలిసిపోవడంలోనూ విడిపోవడంలోనూ రాయలసీమ తన్ను తాను కోల్పోవడంలో ఆధిపత్య ప్రాంతీయుల పాత్ర యెంత వుందో  స్వీయ విద్రోహాల ప్రమేయం కూడా అంతే వుంది. చాలా సందర్భాల్లో పెద్దమనుషుల ఒప్పందాలు ఆచరణకు నోచుకోక పోడానికి కారణం వాటిని చేసుకొన్నవాళ్లు పెద్ద మనుషులు కాకపోవడం. లేదా వారిని తర్వాతి తరం పెద్దమనుషులుగా గుర్తించి గౌరవించకపోవడం. అంతేకాదు; అసమానుల మధ్య జరిగే అసమంజసమైన వొప్పందాల పై పునరాలోచనలోంచి వాటిని తిరస్కరించే అవకాశం కూడా వుంది. బలవంతపు వొడంబడికల్లో అభివృద్ధికి ఆమడదూరంలో వుండిపోయిన సీమ ప్రత్యేకతలని అధ్యయనం చేయకుండా అక్కడి సాహిత్య సాంస్కృతిక విలక్షణతని నిర్దిష్టంగా అంచనా వేయలేం అనే అవగాహన నుంచి పుట్టిన వ్యాసాలివి.  

భాషాప్రయుక్త రాష్ట్రాల యేర్పాటే ఘోర తప్పిదం. ఆ అశాస్త్రీయ విధానం వల్ల, రాజకీయ నాయకుల హ్రస్వదృష్టి వల్ల రాయలసీమ సాంస్కృతిక కేంద్రమైన బళ్లారినీ, ఖనిజ సంపదకి నిలయమైన కోలారునూ, మేరకావల తల్లినుడిని కాపాడుకోడానికి తల్లడిల్లే హోసూరు, క్రిష్ణగిరి వంటి ప్రాంతాలనూ కోల్పోయింది. ఆ ప్రాంతాలన్నీ  రాయల సీమలో కలిసి వుంటే ఆరేడు జిల్లాలతో రాజకీయంగా అసెంబ్లీలో సంఖ్యాపరంగానూ ఆర్థికంగానూ బలంగా వుండేది. నీలం సంజీవరెడ్డి దగ్గర్నుంచి చంద్రబాబునాయుడు (యివ్వాళ జగన్మోహన్‌ రెడ్డిని కూడా కలుపు కొని) వరకూ జాతీయ, ప్రాంతీయ పార్టీలు యేవైనా సీమ ప్రాంతం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం యెక్కిన వాళ్ల లెక్క తక్కువేం కాదు. అయినా చేసిన తప్పులు దిద్దుకుందాం అన్న స్పృహ తక్కువ. ఒక్క వానకోసం యెదురుచూసే చాతక పక్షుల్లా పాలకులు మారిన ప్రతిసారీ ప్రజలు గొంతు తడిపే వారికోసం నిరీక్షిస్తూనే వున్నారు.   

మోసపోయిన ప్రతి సందర్భంలోనూ సీమ ప్రజానీకం తనను తాను వ్యక్తపరచు కోడానికి చేసిన ప్రయత్నాలు అనేకం. రాయలసీమ విమోచన సమితి, రాయల సీమ ప్రజాసమితి, రాయలసీమ పరిరక్షణ సమితి, రాయలసీమ అభివృద్ధి సమితి, రాయలసీమ విద్యావంతుల వేదిక, రాయలసీమ ఐక్య కార్యాచరణ సమితి, యివాళ్టి రాయలసీమ మహాసభ- యిలా అనేక సంస్థలు సీమ అభివృద్ధి కోసమో విముక్తి కోసమో ఆయా కాలాల్లో చేపట్టిన రాజకీయ పోరాటాలు యెత్తుగడలు ప్రజాజీవితంపై చూపిన ప్రభావాన్ని సూక్ష్మంగా అంచనా కట్టి, వాటి బలాల్ని బలహీ నతల్ని నిర్మమంగా విమర్శకు పెడ్తూ, గెలుపు వోటముల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటూ  భవిష్యత్తులో నిర్మించుకోవాల్సిన వుద్యమ రూపాల్ని నిర్ధారించు కోవాల్సిన సంక్లిష్ట సంధి దశ యిది.     

ఆంధ్ర మహాసభవేదికలపై సీమ ప్రజల న్యాయసమ్మతమైన హక్కుల కోసం  గొంతెత్తిన పప్పూరు రామాచార్యుల కాలం నుంచి యెందరో వ్యక్తులు, యెన్నో సంస్థలు వివక్షల గురించి హెచ్చరిస్తూ ప్రాంతీయ స్పృహతో న్యాయబద్ధమైన హక్కుల కోసం డిమాండ్‌ చేస్తూనే వున్నప్పటికీ ఆధిపత్య ప్రాంతాల వారి దోపిడీ ఆగలేదు. పై పెచ్చు అందుకు అనుకూలంగా స్థానిక నాయకుల నుంచే వాళ్లు కొందరు తైనాతీల్నీ దళారుల్నీ తయారుచేసుకున్నారు. నీటిగుర్రాలతో పోటీ పడుతూ పరుగెట్టే టాటా సుమోలు ఆడీ కార్లు వొకవైపు, వరస కరువులతో వలసలతో ఆకలి చావులు మరోవైపు. సీమ ఆర్థిక ముఖచిత్రంపై ఆలోచనా పరుల విశ్లేషణలు పట్టించుకొనే ప్రత్యామ్నాయ రాజకీయాలు బలం పుంజు కోకుండా ఫ్యాక్షన్‌ హింసని పాలకులే పెంచి పోషించారు. రియల్‌ ఎస్టేట్‌ దందా, గనుల మాఫియా, సారా వ్యాపారం, ముఠా తగాదాల్లో బలిసిన బూర్జువా రాజ కీయాలకు వ్యతిరేకంగా ప్రజా సమీకరణ జరగాల్సినంత జరగలేదు. ఉత్పత్తి పునాదుల్లోకి, ఆర్థిక మూలాల్లోకి వెళ్లి నిర్మించడానికి పూనుకొన్న విప్లవోద్యమ పార్టీల ఆచరణకూ కొనసాగింపు లేకుండాపోయింది. రాష్ట్రోద్యమంలోకి ఆశా వహంగా చూసే ప్రగతిశీల రచయితలూ మేధావులూ యీ గతాగతాల పట్ల విమర్శనాత్మక అవగాహన కలిగి వుండాల్సిన అనివార్య సందర్భంలోంచి చూసినప్పుడే నారాయణస్వామి వ్యాసాల ప్రాసంగికతని అర్థం చేసుకోగలం. 

సమకాలీన రాయలసీమ సమాజం నడుస్తున్న తీరుపై బండి నారాయణస్వామి చేసిన రాజకీయ వ్యాఖ్యానాలివి. సీమ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే దార్శనికుడిగా స్వామి యీ వ్యాసాల్లో దర్శనమిస్తాడు. మొత్తం వ్యాసాల్ని రాయల సీమ సమాజం, సాహిత్యం అని రెండు భాగాలుగా విడగొట్టుకోవడం వల్ల  స్వీయ అస్తిత్వం కోసం పెనగులాడే సీమ సమాజం గురించి ఆలోచించే పదవ తరగతి పిలగాడి దగ్గర్నుంచి రాజకీయ సామాజిక సాహిత్య రంగాల్లో పనిచేసే లక్షలాది మంది బుద్ధిజీవుల మెదళ్లలో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తుందీ గ్రంథం.

కృష్ణా-పెన్నార్‌, నాగార్జునసాగర్‌, తుంగభద్ర, శ్రీశౖలం, పులిచింతల, హంద్రీనీవా, గాలేరు, సుంకేసుల, గుండ్రేవుల, ఆర్డీయస్‌ పోలవరం, పట్టిసీమ- కట్టిన కట్టని ప్రాజెక్టులేవీ సీమ దాహార్తిని తీర్చలేకపోయిన విద్రోహ సందర్భంలో 4 జిల్లాలకూ  400 టీఎంసీల నీళ్లు లభించాలంటే ప్రత్యేక రాష్ట్రం తప్ప మరేమీ ప్రత్యామ్నాయం లేదన్న గ్రహింపు దాదాపు అన్ని వ్యాసాలలోనూ వ్యక్తమౌతుంది. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం రాజకీయోద్యమాన్ని నిర్మించిన తెలంగాణ స్పూÛర్తిని అందిపుచ్చుకొని రాయలసీమ నడవాల్సిన దారుల గురించి, చేరుకోవాల్సిన గమ్యాల గురించి చేసిన విశ్లేషణలు స్వామి సామాజిక రాజకీయ అధ్యయనానికీ నిబద్ధతకీ నిదర్శనాలు. సాహిత్యంలో దళిత బహుజన దృక్పథాన్ని బలంగా ఆవిష్కరించిన స్వామి దానికి రాయలసీమ రాష్ట్రవాదాన్ని జోడించడంతో ఆయనలోని వుద్విగ్న సాహిత్యకారుడూ సామాజిక తాత్త్వికుడూ వొకే తలంలోకి వచ్చినట్లైంది.

సీమ జీవితమే సీమ సాహిత్యం అయినప్పటికీ ఆ జీవితం అలా ఎందుకు వుంది అని తెలుసుకోడానికి చేసిన ప్రయాణంలోంచి యీ పుస్తకం వెలికి వస్తుంది. సీమ కథ, నవల తెలుగు సాహిత్యచరిత్రలో భాషా విషయికంగా వస్తుపరంగా తమదైన నిర్దిష్టతతో సాధికారికంగా నిలవడానికి కారణమైన సామాజిక స్థితిగతుల గురించిన లోతైన అధ్యయనం యీ గ్రంథంలో గోచరిస్తుంది. రాయలసీమ నిర్దిష్టతలోంచి బహుజన దళిత ముస్లిం జీవితాన్నీ సాహిత్యాన్నీ అంచనా వేయా లని స్వామి చేసిన ప్రతిపాదన విలువైనది. ఆ దృష్టి నుంచి రాసిన వ్యాసాల్ని ప్రత్యేకంగా అధ్యయనం చేసినప్పుడు కొత్త కోణాలెన్నో వెలికివస్తాయి. అదేవిధంగా ఆంధ్రరాష్ట్ర ఆవిర్భావంలో యేర్పడ్డ సరిహద్దు గీతలకు ఆవల స్వీయ అస్తిత్వం కోసం పెనుగులాడుతున్న తెలుగు భాషా సమూహాల నుండి వచ్చిన సాహిత్యాన్ని యెత్తిపట్టడం, రాయలసీమ రాష్ట్ర ఆకాంక్ష రాజకీయ రూపం తీసుకోవాల్సిన కొత్త సందర్భంలో వచ్చిన కథల్ని విశ్లేషించడం, సీమ ఉత్పత్తి కులాల మాండలికం గురించి, అనంతపురం మాండలికంలోని ప్రత్యేకతల గురించి భాషా వివేచన చేయడం… యివన్నీ రాయలసీమ సాహిత్యవిమర్శలోని ఖాళీలను పూర్తి చేయడానికి వుద్దేశించినవే అని గమనించాలి.

రాయలసీమ ప్రాథమ్యం నీళ్లు అని గుర్తిస్తూనే  నీళ్ల కోసం సీమ జిల్లాల మధ్య చోటు చేసుకునే అంతర్గత వైరుధ్యాల గురించి సైతం స్వామి తన వ్యాసాల్లో ప్రస్తావిస్తాడు. అయితే బహుజన తాత్త్వికత ప్రాంతీయవాదం – రెండు అస్తిత్వాల్ని జమిలిగా నడపడంతో సామాజిక రాయలసీమ నినాదానికి సైద్ధాంతిక పునాది నేర్పరుస్తూ గోడచేర్పు నివ్వడానికి చేసిన ప్రయత్నం వ్యాసాలంతటా పరచుకుని కనిపిస్తుంది. 

సీమ సాహిత్యంలో కరువు గురించో ఫ్యాక్షనిజం గురించో వేడికోళ్లకీ మొత్తుకోళ్లకీ  కాలం చెల్లింది. ఇప్పుడు స్వయంపాలన కోసం నినదించే గొంతులూ గుండెలూ వొకటవు తున్నాయి. ఆ నినాదాన్ని స్వామి యీ వ్యాసాల్లో పట్టుకున్నాడు. కేంద్రీ కృతమైన పారిశ్రామిక అభివృద్ధి వంటి విషయాల గురించి, పాలకులు చేపడు తోన్న కొత్త ఆర్థిక విధానాల వల్ల ఉత్పత్తి సంబంధాల్లో వసున్న మార్పుల గురించి- సంపద చలనం గురించి, గ్రామాల్లో వస్తున్న సాంస్కృతిక పరిణామాల గురించి, రాజకీయాల్లో కుల సమీకరణల గురించి సృజనాత్మక సాహిత్యంలో విస్తృతంగా మాట్లాడిన స్వామి వాటి భిన్న పార్శ్వాలని యీ వ్యాసాలకు కొనసాగింపుగా రాయా లని ఆశించడం తప్పు కాదేమో! నిజానికి సీమ నేల పొరల్లో అజ్ఞాతంగా వున్న ఎన్నిటినో తవ్వి తీయాల్సిన పని చాలా వుంది. ఈ కొత్త రాజకీయ సందర్భంలో  ఆ పని జరిగినప్పుడే గతంలో చేసిన చారిత్రిక తప్పిదాలని దిద్దుకోగలం. 

ఈ గ్రంథ ప్రచురణకు అనుమతిచ్చిన రచయితకూ, ముందుమాట రాసిన పాణికీ, అక్షరాల్నీ పేజీలనూ కవర్‌ పేజీనీ అందంగా రూపొందించిన అక్షర సీతగారికీ, పుస్తక రూపకల్పనలో సహకరించిన హరీష్‌ కువ్వాకులకీ, తక్కిన మిత్రులందరికీ కృతజ్ఞతలు.

జవాబులు దొరికే వరకూ ప్రశ్నలు మొలుస్తూనే వుంటాయి. ప్రశ్నించడమే నేరమైన సందర్భంలో ఆ నేరాన్ని చేసేవాళ్లకు వత్తాసుగా నిలబడాలనే ధ్యేయంతోబాధితుల గొంతుకు తమ వంతుగా గుండె చప్పుడును చేర్చాలనే వుద్దేశంతో స్వామి రాసిన రాయలసీమ : సమాజం, సాహిత్యంపుస్తకాన్ని ప ర్‌ స్పె క్టి వ్స్‌ మీకు అందిస్తోంది. ఎప్పటిలానే ఆదరిస్తారని నమ్ముతూ…

ఎ.కె. ప్రభాకర్‌

టీం ప ర్‌ స్పె క్టి వ్స్‌

హైదరాబాద్‌,  2 జూలై 201

You Might Also Like

Leave a Reply