వైవిధ్యభరిత కథలు – ‘కొత్త కథ 2019’

వ్యాసకర్త: కొల్లూరి సోమశంకర్

మహమ్మద్ ఖదీర్ బాబు, కె. సురేష్‌ల ఆధ్వర్యంలో రైటర్స్ మీట్ పబ్లికేషన్స్ తరఫున 2017 నుంచి ‘కొత్త కథ’ పేరిట కథా సంకలానాలు వెలువరిస్తున్నారు. ‘కొత్త కథ 2019’లో 22 మంది కథకుల కథలున్నాయి. ఈ కథకుల జాబితాలో వర్ధమాన రచయితలతో పాటు లబ్దప్రతిష్ఠులైన రచయితలు ఉన్నారు. ఈ పుస్తకంలోని కథలను సంక్షిప్తంగా పరిచయం చేస్తాను.

***

మనవరాలిని బడికి తీసుకువెడుతున్న తాతయ్య అనుకోకుండా పాప చేయి వదలడం, అదే సమయంలో మరో వైపు నుంచి బస్సు వచ్చి ఆ పాపని ఢీకొట్టడం… పాప చనిపోవడం జరుగుతుంది. కొడుకు తన తండ్రితో మాట్లాడడం మానేస్తారు. ఆయనని అపరాధభావన పిప్పి చేస్తూంటూంది… ఇంట్లో ఉన్న నలుగురే అయినా మాటలు తక్కువ. కాని కోడలే ముందుగా మనోవ్యథ నుంచి తేరుకుంటుంది. తన మావగారు గిల్టీనెస్ నుంచి బయటపడాలంటే భర్త ఆయనని క్షమించాలని నచ్చజెబుతుంది. కొడుకు ఆఫీసుకు వెళుతూ ‘వెళ్ళొస్తాను’ అని పైకే అనడం… వాళ్ళ మధ్య ఘనీభవించిన మౌనాన్ని బద్దలుకొట్టేందుకు తొలిమాట అవుతుంది అనంతరం కథలో. రచన అరుణ పప్పు.

ఓ సినిమాలో హత్య చేసి జైలుకొచ్చిన ఓ పిల్లిగడ్డం మనిషిని హింసించడాన్ని ప్రతీకగా చూపుతూ… వైవాహిక బంధంలో మానసిక హింసని ఎదుర్కుంటున్న మహిళ గురించి చెబుతుందీ కథ. ‘గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్’ అంటూ పురుషాహంకారంతో భర్త ఇంట్లోంచి పొమ్మంటే – బయటకొచ్చేస్తుంది అదితి. ‘ఎక్కడికి పోతావే’ అంటూ తూలనాడితే ‘ఎక్కడికైనా పోతాను’ అంటూ ఆ వ్యథ నుంచి శాశ్వతంగా తప్పించుకుంటుంది అదితి ‘గుడ్‌మార్నింగ్ అదితి కథలో. రచన అపర్ణ తోట.

కార్పోరేట్ ఉద్యోగాలు మనుషుల్ని ఎలా పిప్పిచేస్తున్నాయో, ఉద్యోగుల వ్యక్తిగత జీవితాలలోకి యాజమాన్యం ఎంతలా చొచ్చుకువస్తుందో చెప్పేందుకు ‘టై’ని ప్రతీకగా చూపిస్తూ – సంసార జీవితంలోకి సైతం చొరబడి ఆసక్తిని పోగొట్టి వ్యక్తిని నిర్వీర్యం చేస్తోందని చెబుతుంది – ‘డబుల్నాట్ కథ. ‘టై’ వల్ల పెద్దగా మేలుచేయని ప్రయోజనాలు ఎన్ని పొందినా… ఆ టైయ్యే తన జీవితాన్ని నాశనం చేస్తోందని గ్రహిస్తాడతను. విప్పి పడేద్దామన్నా ఊడి రాదది… దాన్ని వదిలించుకునే ప్రయత్నంలో అతను గెలిచాడో లేదో పాఠకుల ఊహకే వదిలేస్తారు రచయిత. రచన అరిపిరాల సత్యప్రసాద్.

ఉద్యమాల ద్వారా రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఉద్యమకారులు తాము పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో తమకు మేలు జరుగుతుందని భావిస్తారు. కాని అలా జరగదు. పాలకులు మారినా… తమ బ్రతుకులు మారలేదని ఉద్యమకారులు గ్రహిస్తారు. ఒకప్పుడు అలవోకగా పాటలు సృజించిన ఇస్తారి అనే కళాకారుడిని తన విజయాల మీద పాటలు రాయమంటాడు స్థానిక రాజకీయ నాయకుడు. కళాకారుల బృందానికి బిర్యానీతో దావత్ చేసినా… ఇస్తారి మనసులోండి పాట బయటకి రాదు. చివరికి ఆ రాజకీయ నాయకుడు ఇస్తారిని అవమానించి పంపేస్తాడు. అదే సమయంలో చిన్ననాటి స్నేహితుడి బలవన్మరణం వల్ల కలిగిన వేదన ఇస్తారి గొంతులోంచి పాటగా ప్రాణం పోసుకుంటుంది ‘వేకువ చూపిన పాట‘ కథలో. రచన చందు తులసి.

చెరువులో నీటి లభ్యతని బట్టి, ఆ నీళ్ళు ఊర్లోని పొలాలకు ఎన్ని రోజులకు సరిపోతుందో చెప్పగలిగే సామర్థ్యం ఉన్న అతని పేరు చిన్నబ్బ అయినా… ఊరందరికి అతను నీరుగట్టోడే. అలాంటిది చెరువులు ఎండిపోయి, బోరు బావులు వచ్చి పంటలు తగ్గాకా, అతని అవసరం తీరిపోతుంది జనాలకి. తప్పనిసరి పరిస్థితిలో నగరానికి కొడుకు దగ్గరికి వస్తాడు. కొడుకు ఒక పెద్ద కులం అమ్మాయిని ప్రేమిస్తాడు, ఆమెని పెళ్ళి చేసుకోడానికి తండ్రిని ఒప్పిస్తాడు. కొన్ని రోజులు బాగానే ఉన్నా, కోడలికి తన పొడ గిట్టడం లేదని అతనికి అర్థమవుతుంది. చెరువులలో నీరు ఆవిరైపోతున్నట్టే మనుషుల మధ్య బంధాలు కనుమరుగువుతున్నాయని గ్రహిస్తాడు. కొడుకుని కోడలిని పిలిచి తాను చెప్పదలచుకున్న నాలుగు మాటలు చెప్పి, తేమ ఉన్న తావుని వెతుక్కుంటూ వెళ్లిపోతాడు ‘నీరుగట్టోడు‘ కథలో. రచన ఝాన్సీ పాపుదేశి.

ఓ అపార్టుమెంటులో వాచ్‌మన్‌గా ఉన్న వ్యక్తి హఠాత్తుగా మరణిస్తే… కొత్త వాచ్‌మన్‌ని ఏర్పాటు చేసుకుని – అతని భార్యా పిల్లల్ని వేరే చోటకి వెళ్ళిపొమ్మంటారు కమిటీవాళ్ళు. అప్పటిదాక వాచ్‌మన్ భర్తే అయినా… అందరి ఇళ్ళలోనూ అవసరమైన పనులు చేసేదే మాత్రం అతని భార్య ఝాన్సీయే. భార్యాభర్తాలిద్దరూ ఏదో ఒక పనులు చేసి అదనపు ఆదాయం సంపాదించుకుని, ఉన్నంతలో బాగా బ్రతకడానికి ప్రయత్నిస్తారు. భర్త మరణంతో అన్నీ తారుమారవుతాయి. ఆమె తాను వాచ్‌వుమన్‌గా ఉంటానన్నా… కమిటీ వాళ్ళు ఒప్పుకోరు. కొత్త వాచ్‌మన్ వచ్చే లోపు గది ఖాళీ చేయాల్సిందే అని ఒత్తిడి చేస్తారు. ఎంతగా ప్రయత్నించినా ఎవరూ ఆమెకి సాయం చేయడానికి ముందుకురారు. చివరికి, కొన్ని వస్తువులు ఆ గదిలోనే ఉంచడానికి కొత్త వాచ్‌మన్‌ని ఒప్పించి, మెట్రో స్టేషన్ పిల్లర్ల మధ్య ఒక గదిలా వున్న స్థలంలో కర్టెన్ వేసుకుని తాత్కాలిక నివాసంగా చేసుకుంటుంది. ‘జీవితాన్ని సుళ్ళు తిరగనివ్వను, నదిలా పారిస్తా’ అని విశ్వాసం వక్తం చేస్తుంది ఝాన్సీ ‘వే టు మెట్రో‘ కథలో. రచన కుప్పిలి పద్మ.

అమెరికాలో మానసిక వైద్యురాలిగా ఫెలోషిప్ కోర్సులో చేరబోతున్న ప్రియ అనే యువతికి, గీత అనే తెలుగమ్మాయి అక్కడ పేషంట్‌గా తారసపడుతుంది. గీత అంత చిన్న వయసుకే అమెరికా ఎలా రాగలిగిందో, అమెరికాకి వచ్చాక ఆమెకెదురైన ఇబ్బందులేమిటో, ఆమె ఎందుకలా పిచ్చిగా ప్రవర్తిస్తోందో అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తుంది ప్రియ. అమెరికా చట్టాలని బాగా అర్థం చేసుకున్న గీత, తన కాళ్ళ మీద తాను నిలబడుతుంది. ప్రియ కోర్స్ అయిపోయే సమయానికి తాను జీవితంలో నిలదొక్కుకున్నట్టు తెలియజేస్తుంది. చేదు జ్ఞాపకాలను ఆకులుగా రాల్చి కొత్త ఆకులుగా ఆశలను తొడుక్కోవాలని చెబుతుంది మేపిల్ ఆకులు‘ కథ. రచన కూనపరాజు కుమార్.

బయటకి చెప్పుకోలేని బాధని, తమాయించుకోలేని వ్యథని తప్పించుకునేందుకు ఆమె ఎంచుకున్న మార్గం సంశయాలను కలిగిస్తుంది, ఏది రైటో ఏది రాంగో నిర్ణయించుకోమంటుంది మనసు. కాని మనసు మాట వినదు, మస్తిష్కం, మనసుల మధ్య యుద్ధం మొదలవుతుంది. తప్పు చేసిన దానిలా అత్తగారి ముందు తల దించుకోవాల్సి వస్తుంది. అత్తగారు తీసుకున్న నిర్ణయమేమిటో ‘స్పర్శ‘ కథ చెబుతుంది. రచన కొట్టం రామకృష్ణారెడ్డి.

జీవితంపై విరక్తి చెందిన పూర్ణి అనే యువతి చనిపోవాలనుకుంటుంది. బలవన్మరణానికి పాల్పడానికి రైలు పట్టాల మీదకి వెళ్తుంటే ఒక అపరిచితుడు పలకరించి, రైలు ఆలస్యంగా వస్తోంది అని చెబుతాడు. ఈ మధ్యే పుట్టిన, తాను ఇంకా చూడని తన కొడుకు గురించి, వాడి బాల్య చేష్టల గురించి చెబుతాడు. మెల్లిగా తన చిన్నతనం గుర్తుకొస్తుందామెకి. జీవితంపై ఆశ చిగురిస్తుందామెకి ‘ఆగు‘ కథలో. రచన కడలి సత్యనారాయణ.

కేవలం రెండెకరాల పొలం రెండు తరాల మనుషుల జీవితాన్ని చెబుతుంది, పంటని అమ్ముకునేందుకు వాళ్ళ తండ్లాటని వ్యక్తం చేస్తుంది. పంటలు పండక అప్పుల పాలయి, బతుకు భారమైన నర్సిమ్మ – తను చేసిన అప్పుల వివరాలన్నీ కాగితంపై రాసి, వీలైతే వాటిని తీర్చమని కొడుకుకి రాసి – పురుగుల మందు తాగి చనిపోతాడు. ‘ఇయ్యాల రైతు సేతుల్లో ఏముందని… సావు తప్ప’ అంటుంది చేను చెప్పని కత. రచన మధుసూదన్‌రావు రామదుర్గం.

మత దురభిమానాన్ని ఆసరాగా చేసుకుని అధికారం చలాయించాలనుకునే వ్యక్తి, అన్యమతస్థులైన చిన్న మనుషులని హింసించిన వైనం – కొందరి దుందుడుకు చర్యల వల్ల ప్రస్తుతం మతపరంగా సమాజంలో ఏర్పడుతున్న వైషమ్యాలకు అద్దం పడుతుంది మత్తయి 5:11‘ కథలో. రచన మెర్సీ మార్గరెట్.

బస్సులలో మహిళా కండక్టర్లు ఎదుర్కునే ఇబ్బందులను ప్రస్తావిస్తుంది ‘శీలానగర్ రెండో మలుపు‘ కథ. జీవనభృతికై కండక్టరుగా పనిచేసే మహిళలంటే అందరికీ చులకనే.  వేదకుమారి అనే కండక్టర్‌కి ఇబ్బందులు ఎక్కువగా ఉండే విశాఖపట్టణం – గాజువాక రూట్‌లో డ్యూటీ పడుతుంది. మగ అధికారులు, మగ ప్రయాణీకులు వేధిస్తూనే ఉంటారు. తర్వాతి స్టాపులో ఎక్కబోయే పేసింజరెవరో ముందే చెప్పలేనట్టు, తన జీవితంలోకి ఓ తోడు వస్తాడో రాడో చెప్పలేనని అనుకుంటుందామె. అనుకోకుండా పరిచయమైన ప్రయాణీకుడొకరు ఆశలు రేకిత్తించి, అంతలోనే అడియాశలు చేస్తాడు. తన ఉద్యోగాన్ని అనుమానించిన అతన్ని వద్దనుకుని సాగిపోతుంది వేద. రచన మిథున ప్రభ.

బాల్యంలో చైల్డ్ అబ్యూస్‌కి గురయిన ఓ యువతిని ప్రియుడు తాకినా – ఆ పాత రోత జ్ఞప్తికి వచ్చి మనసు వికలం అవుతుంది. ఎప్పుడైనా చల్లగాలి మెడని తాకితే, వాడు గుర్తొస్తాడు అని ప్రియుడు గురించి అనుకుంటుందామె, వాడొక్కడే గుర్తొస్తే ఎంత బాగుటుంది అనుకుంటుంది అస్పష్టపు గాలి‘ కథలో. రచన వి. మల్లికార్జున్.

ఎంతకాలం పనిచేసినా పర్మనెంటు కాని ఉద్యోగంలో అతి తక్కువ జీతానికి పనిచేసే రమణ – సొంత రాష్ట్రం ఏర్పడితే తనలాంటి వాళ్ళ ఉద్యోగాలు పర్మనెంటు అవుతాయి, జీవితాలు మెరుగుపడతాయి అనే ఆశలో ఉద్యమంలో పాల్గొంటాడు… సొంత రాష్ట్రంలో తమ ప్రభుత్వం వస్తే తనకి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందని అనుకుంటూ, అన్ని రకాల పనులు చేసుకుంటూ జీవనం గడుపుతూంటాడు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుంది… కానీ రమణ ఆశలు నెరవేరవు. కుటుంబ సభ్యులే నానా మాటలు అనడంతో వేసారిపోయి బలవంతంగా చచ్చిపోతాడు. తన సర్వీసుని పరిగణనలోకి తీసుకుని కొడుకుకి ఉద్యోగంలోకి తీసుకోవాలని కోరుకుంటాడు తీపి చావు కథలో. రచన పెద్దింటి అశోక్ కుమార్.

తన కొలీగ్‍నీ, తన భార్యని పోల్చుకునే ఓ వ్యక్తి ఓ సారి ఆ కొలీగ్ ఇంటికి వెళతాడు. అయితే గుమ్మం దగ్గర షూ విప్పకుండానే లోపలికి వెళ్తాడు. ఆమె మాత్రమే లోపల ఉన్నప్పుడు బయట మగవాడి షూ ఉండడం అనుమానాలకి దారితీస్తుందని అతని భావన. ఆమె ఇంట్లో గోడకి తగిలించి ఉన్న ఫ్రేమ్ లోని ఫోటోలు అతన్ని ఆకర్షిస్తాయి. మసగ్గా కనిపించే ఆ ఫోటోలలానే అతని ఆలోచనలు అస్పష్టంగా సాగుతాయి ‘ఫ్యామిలి ఫోటో‘ కథలో. రచన పూడూరి రాజిరెడ్డి.

పురుషాధిక్య సమాజంలో మహిళలు ఎదుర్కునే ఇబ్బందులు, అవమానాలు, హేళనలను ‘ఆమె’ పాత్ర ద్వారా చెప్పి, ఆమె తిరుగుబాటుని చెప్పిన కథ ‘థనియావర్తనం‘. రచన రిషి శ్రీనివాస్.

సాగినంత కాలం ‘నీకింత ఓపిక ఎక్కడిదీ’ అని బాస్‍లూ, భర్త అడిగేవారే… మొహమాటానికి ప్లాస్టిక్ నవ్వు జోడించి నిస్సారంగా ఉన్న జీవితాన్ని అద్భుతంగా గడుపుతున్నట్టు నటిస్తుందామె ‘ముఖం కథలో. రచన రిషిత గాలంకి.

మునుపెన్నడూ సాధించని లక్ష్యాలని చేరుకోవాలని కోరుకునేవాళ్ళు ఇంతవరకూ ఎవరూ నడవని మార్గంలో ప్రయాణించడానికి సాహసించాలి అని చెప్పిన ‘చలిచీమల కవాతు‘ కథ – క్యాంపస్ రాజకీయాల గురించి, ఉద్యమాలను ఎవరెలా తప్పుదోవ పట్టిస్తారో చెబుతుంది. రచన ఉణుదుర్తి సుధాకర్.

జీవించి ఉన్నప్పుడు స్వేచ్ఛగా, తన జీవితానికి తానే కర్తగా స్వతంత్రురాలిగా భావించాననుకున్న ఓ రచయిత్రి మతం మారి మరణిస్తే, జనాలు ఆమె గురించి ఏమనుకున్నారు, ఆమె శవాన్ని ఎలా వ్యాఖ్యానించారో ‘పూవై పుట్టి‘ కథ చెబుతుంది. రచన వనజ తాతినేని.

మన కళ్ళ ముందే ఉంటూ మనకంటే ఎంతో ఎత్తుగా నిలబడి ఉన్న పర్వతాల బరువు తెలుసుకుందామనుకున్న వ్యక్తి కథ ఒజామా – షిమాసు‘. తనతో పాటు చదివే ఓ మిత్రుడు తన భుజాల మీద మోస్తున్న కొండను చూసినప్పుడు ఆ కొండ బరువెంతో ఊహించగలుగుతాడు నెరేటర్. రచన వెంకట్ శిద్దారెడ్డి.

ఇవి కాక ఆరత్తు గారి తమిళ అనువాద కథలు (తెలుగు- అవినేని భాస్కర్), వసుధేంద్ర గారి కన్నడ కథ అనువాదం (తెలుగు – రంగనాథ రామచంద్రరావు) ఉన్నాయి.

ఆసక్తిగా చదివించే వైవిధ్యభరిత కథలివి.

***

కొత్త కథ 2019 (కథా సంకలనం)

సంపాదకులు: కె. సురేష్, మహమ్మద్ ఖదీర్‌బాబు

ప్రచురణ: రైటర్స్ మీట్ పబ్లికేషన్స్

పుటలు: 248, వెల: 149/-

ప్రతులకు: 

నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్.

ఇతర ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు 

 

You Might Also Like

One Comment

  1. Lokesh

    Nice introduction.

Leave a Reply