‘క్రీడాకథ’ పుస్తక పరిచయం

వ్యాసకర్త: కొల్లూరి సోమశంకర్
***************

సంచిక వెబ్ పత్రిక, సాహితి ప్రచురణలు ప్రచురించిన రెండవ పుస్తకం క్రీడాకథ‘. పుస్తకం శీర్షిక సూచించినట్లుగానే, ఇది ఆటలు ప్రధాన ఇతివృత్తంగా నడిచిన కథల సంకలనం. 1935 నుంచి 2019 వరకు వచ్చిన కథలలో నుండి ఎంపిక చేసిన 23 కథలు ఈ సంకలనంలో ఉన్నాయి. ఈ కథలను సంపాదకులు నాంది, ప్రస్తావన, క్రీడాస్ఫూర్తి, క్రీడా మానసికం, క్రీడా వినోదం, క్రీడా ఉన్మాదం, క్రీడనేరం అనే విభాగాలలో వర్గీకరించారు.

***

పిల్లలు దేనితోనైనా ఆడుకోగలరని, ఆ ఆటలోనే తమ తెలివిని ప్రదర్శిస్తూ, ఉత్సాహాన్ని పొందగలరని భూపాల్ రచించిన అదీ ఆటేకథ చెబుతుంది. ఆటలంటే కేవలం పిల్లల సొంతమనీ, పెద్దలు ఆటలాడడమేంటనే అభిప్రాయం ఏర్పర్చుకున్న ఓ భార్య భర్తతో కలిసి పుట్టింటికి వస్తుంది. ఆ ఊరి చెరువు వద్ద కొందరు పిల్లలు చెడుగుడు చెండాటఆడుతుంటారు. అత్తగారి ఊరికొచ్చిన అల్లుడు వాళ్ళతో కలిసిపోయి తనూ ఆడతాడు. మళ్ళీ ఏడాది వచ్చినప్పుడు ఆ పిల్లలు ఉండరూ, ఆటలు ఉండవు. కవికొండల వేంకటరావు వ్రాసిన ఈ కథ గ్రామీణ క్రీడలెలా నిరాదరించబడి, మాయమవుతున్నాయో రేఖామాత్రంగా ప్రస్తావిస్తుంది.

ఆటపట్టుకథలో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ మీట్‍లో కురుకుంట కాలేజ్ టీమ్ అన్ని విభాగాలలోనూ పోటీపడుతూ, గెలుస్తుండడం కథ చెప్పే క్రీడాకారిణికి నచ్చదు. పైగా తన తల్లి కూడా వాళ్ళనే సపోర్ట్ చేయడం ఆమెకు చిరాకు కలిగిస్తుంది. ఆటల్లో వాళ్ళెంతా నైపుణ్యాలను ప్రదర్శించినా, కేవలం నల్లగా, పొట్టిగా ఉన్నారన్న మిషతో వాళ్ళని అసహ్యించుకుంటుంది. నల్లజాతి వారిని క్రీడలలో ప్రోత్సహించి వారి ద్వారా పతకాలు సాధిస్తున్న కొన్ని దేశాలను ప్రస్తావించి, వాళ్ళలాగే భారతదేశంలోను దళితులను ప్రోత్సహించి ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ పోటీలకు పంపితే మనకూ చాలా పతకాలు వస్తాయని తల్లి అంటుంది. వర్ణవివక్షని పాటించేవారిలో క్రీడాస్ఫూర్తి ఉండదని ఈ కథలో రచయిత్రి చిలుకూరి దీవెన సూచిస్తారు.

చైనీస్ మార్షల్ ఆర్ట్స్ తాయ్ చీగురించి హార్ధిక వ్రాసిన కథ తాయ్ చీ మాస్టర్‘. మేధావులు స్వార్థపరులవడమంటే, కంచే చేను మెయ్యటమనీ; స్ట్రెయిట్ ఫార్వార్డ్‍గా ఉండడమే సింపుల్ లైఫ్ అని నమ్మే వ్యక్తి రెనాల్డ్స్. తన నైపుణ్యంతో స్ట్రీట్ ఫైటర్ లాంటి వ్యక్తిని ఓడించి, ‘తాయ్ చీపట్ల ప్రజలలో ఆసక్తిని కలిగించి, చాలామంది దానిని నేర్చుకునేలా చేస్తాడాయన. ఈ యుద్ధకళ అభ్యసించినవారికి శాంతి, సంతోషం, సంతృప్తి లభిస్తాయని ఈ కథ చెబుతుంది.

నిజమైన క్రీడాకారుడు ఆటల్లో ఒక్కసారైనా ఖచ్చితంగా ఓడిపోతాడు, కానీ జీవితంలో మాత్రం ఓడిపోడు అని చెబుతుంది అయాచితం స్పందన రాసిన ఆమె గెలిచిందికథ. పరువు మర్యాదల పేరిట తండ్రి తన క్రీడాజీవితానికి ముగింపు పలికినా, పల్లవి మాత్రం తన కూతుర్ని జాతీయ స్థాయి బాడ్మింటిన్ క్రీడాకారిణిగా విజయపథంలో నడుపుతుంది.

స్నేహితుడు టికెట్లు తీసుకొచ్చి, బలవంతం చేయడంతో హింసని ప్రోత్సహించే రెజ్లింగ్ పోటీలకు వెళ్తారు శాంతాదేవి, ఆవిడ భర్త కుస్తీల వినోదంకథలో. ఆటగాళ్ళు ఒకరినొకరు తీవ్రంగా గాయపరుచుకునే ఈ క్రీడని వాళ్ళు ఆస్వాదించలేకపోతారు. ఈ ఆటలు ప్రేక్షకులలోని విజ్ఞానం, సంస్కారం, చారిత్రకజ్ఞానాన్ని నిద్రపుచ్చేలా చేసి తాత్కాలికంగా ఉన్మాద స్థితికి తీసుకువెళ్తాయని రచయిత ఎన్నార్ చందూర్ అంటారు.

దామా గోవిందరావు కథ ‘నా ఒలంపిక్ కల’ అత్యంత వ్యంగ్యాత్మకమైనది. ఆటగాళ్ళకు ఆంధ్రలో ప్రోత్సాహం లేకపోవడానికి కారణాలేమిటో 1935 నాటి ఈ కథలో చెప్పినవి, ఇప్పటికీ వర్తిస్తాయనుకోవచ్చు.

జీవితం కష్టంగా ఉన్నా, ఏ బాధలేనట్టు ప్రవర్తించే మావయ్యఅనే ఓ వ్యక్తి గురించి చాగంటి తులసి మాంజా దారంకథలో చెబుతారు. గాలిపటాలు, వాటి మధ్య పోటీలు, ఒకదాన్నొకటి తెంపుకోడం గురించి ఈ కథలో చెప్తారు రచయిత్రి. ఇంట్లో బియ్యానికి డబ్బు లేకపోతే, అప్పు చేసిన తెచ్చిన డబ్బులతో మావయ్యగాలిపటం కొనడం ఆయన భార్యకి నచ్చదు. డబ్బు వృథా చేసేరంటుంది. అంతటి ఆనందాన్నిచ్చిన ఆట దండగ ఎందుకయ్యిందో అనుకుంటాడు కథ చెప్పే వ్యక్తి.

తన కొడుకుని హాకీ, క్రికెట్, టెన్నిస్‌లలో ఏదో ఒక ఆటలో ప్రవీణుడిని చెయ్యాలనుకుంటాడో తండ్రి. ఇంతలో కొడుకే తనకి హాకీ స్టిక్ కొనమని అడుగుతాడు. హాకీ ఆడడానికి ఎన్నెన్నో ఆటంకాలొస్తాయి, చివరికా హాకీ స్టిక్ అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. చివరికి కొడుకు క్రికెట్‌ బాగా ఆడుతున్నాడని తెలుసుకున్న తండ్రి, క్రికెట్ బ్యాట్ కొనిస్తాడు. కానీ కొడుకు దాంతో హాకీ ఆడతాడు. ‘అబ్బాయి హాకీ ఆడాడుఅనే ఈ కథని వసుంధర రాశారు.

పల్లెటూరి నుంచి మేనల్లుడి ఇంటికి పట్నం వస్తాడో వ్యక్తి. ఆ సమయంలో మేనల్లుడు టీవీలో వెయిట్‍లిఫ్టింగ్ పోటీలు చూస్తుంటాడు. బరువులెత్తే పోటీలో గెల్చినవారికి పతకాలివ్వడం చూసిన మామ ఆ వివరాలు అడుగుతాడు. విజేతలకి పతకాలతో బోలెడు డబ్బు బహుమతిగా ఇస్తారని తెలుసుకున్న ఆయన, తమ పల్లెటూళ్ళలోని సేద్యగాళ్ళు ఇంతకంటే ఎక్కువ బరువులు సులువుగా ఎత్తి, బండ్లలోకి విసిరేస్తారని అంటాడు, అలాంటివారికి కూడా బహుమతులిస్తే దేశ గౌరవంపెరుగుతుంది కదా అని అడుగుతాడు. రాప్తాడు గోపాలకృష్ణ వ్రాసిన చిన్న కథ ఇది.

ఆదాయం లేక, సరైన తిండి లేక ఇబ్బంది పడే కుటుంబానికి చెందిన యువకుడు మామూలు సమయంలో నిరాశానిస్పృహలతో ఉన్నా కేరమ్స్ ఆటలోకి దిగితే మాత్రం ఏ చీకుచింతా లేనట్టు ఆటలో లీనమై ప్రపంచాన్ని మరిచిపోతాడు. సమస్యలపై నుంచి దృష్టి మళ్ళించి, క్రీడలు, కొంతసేపైనా జీవితం పట్ల ఉత్సాహం కలిగిస్తాయని పూసపాటి కృష్ణంరాజు రాసిన కేరమ్‌బోర్డుకథ చెబుతుంది.

అనేక శ్రమలకోర్చి, అథ్లెట్‌గా రాణించి, దేశానికి ఎన్నో పతకాలను తీసుకొచ్చిన సుందరం అనే క్రీడాకారుడి గురించి రాచపూటి రమేష్ రాసిన సాహసక్రీడకథ చెబుతుంది. బాల్యంలో స్పోర్ట్స్ స్కూల్‌ నుంచి ఉద్యోగంలో చేరేవరకు క్రీడారంగంలో ఉండే రాజకీయాలన్నీ సుందరానికి ఎదురవుతాయి. కీలకమైన పోటీలలో పాల్గొనేందుకు అవకాశాలే రావు. అవకాశం కల్పించిన ప్రతీసారీ రాణించి ఏదో ఒక పతకం సాధించిన సుందరానికి పెద్దగా ప్రోత్సాహకాలేవీ రావు. వరుసగాయాలతో, ప్రాక్చర్లతో ఆటకి దూరం కావాల్సి వస్తుంది. కోచ్‌గా మారి యువకులకి శిక్షణనిస్తుంటాడు. వారికి అవసరమయ్యే పోషకాహారం కోసం, వాళ్ళని పోటీలకు పంపడం కోసం అప్పులు చేస్తాడు, ఆర్థికంగా ఇబ్బందులకు లోనవుతాడు. ఆ సమయంలో రాష్ట్రప్రభుత్వం క్రీడారత్న అనే పురస్కారాన్ని ప్రకటిస్తుంది. ఆ అవార్డుకి నామినేట్ అయిన ఐదుగురిలో సుందరం కూడా ఒకడు. కానీ అతనికా అవార్డు రాదు. “మనలాంటి కష్టజీవులకు సామాన్యుల ప్రశంసలే అవార్డులు, వేరేవి ప్రత్యేకంగా ఇవ్వనక్కర్లేదుఅంటాడు సుందరం.

వుమెన్ టెన్నిస్ చూడడానికి జనాలు వేలాదిగా వస్తారంటూ మొదలవుతుంది జంపన పెద్దిరాజు రాసిన ఫౌల్ ఫౌల్కథ. క్రీడాకారిణిగా తనపై చూపించే గౌరవం, ఆదరణలో కొంతైనా మైదానాన్ని సిద్ధం చేసే మహిళా కార్మికులపై చూపితే బాగుండేదని వాపోతుంది టానియా ఈ కథలో. సకాలంలో వైద్యం అందక తిరుపతి అనే కార్మికురాలు చనిపోతుంది. ఆమె మరణంతో టానియా కలతచెంది ఫైనల్స్‌లో ఏకాగ్రత కోల్పోయి వరుస తప్పిదాలు చేస్తుంది. అంపైర్ ఫౌల్ అని అరుస్తాడు. ఇంతలో బంతి టానియా నుదురికి తగులుతుంది. అంతే ఒక్కసారి అందరూ ఆమెను చుట్టుముట్టి ఫేకల్టీ క్లబ్‌లోకి తీసుకెళ్తారు. డాక్టరు మందులని సిరంజిని సిద్ధం చేసుకుంటాడు. తనకేం కాలేదన్నా వినరు. పేద శ్రామికులను పట్టించుకోకుండా, తనలాంటి పాపులర్ వ్యక్తుల మెహర్బానీ కోసం ఆరాటపడడం నిజమైన ఫౌల్ అని బాధపడుతుంది టానియా.

ఏ క్రీడలోనైనా రాణించి నిలకడ విజయాలు సాధించాలంటే అణకువ, నమ్రత అవసరం. టెన్నిస్‌లో విశేష ప్రతిభ ఉన్న అభి కోపాన్ని అణచుకోలేక మ్యాచ్‌లలో రాకెట్లు విరగ్గొడుతూ ఉంటాడు. ఈ నెగటివ్ ఆటిట్యూడ్ వల్ల అతన్ని ఆటనుంచి బహిష్కరిస్తారు. మరో పొరపాటు కారణంగా, డోపింగ్‌లో చిక్కుకుని ఆటకి దూరమవుతాడు. అయితే మలివై అనే పిల్లాడికి ఆట నేర్పడానికి ఒప్పుకుంటాడు. కాని అభి స్వభావం వల్ల ఆ శిక్షణ ఎక్కువకాలం కొనసాగదు. కొన్నాళ్ళ తర్వాత కరేబియన్ దీవులలో టెన్నిస్ రాకెట్ల తయారు చేసే ఫ్యాక్టరీని చూసివచ్చాకా, అభి ప్రవర్తనలో ఆశ్చర్యకరమైన మార్పు వస్తుంది. ఆటలో రాణించడం ప్రారంభవుతుంది, మునుపటిలా రాకెట్లు విరగ్గొట్టడం మానేస్తాడు. అభిలో ఈ పరివర్తనకి కారణం ఏమిటో తెలుసుకోవాలంటే సాయి బ్రహ్మానందం గొర్తి రాసిన లవ్ ఆల్కథ చదవాలి.

పేదవాడైనా, టెన్నిస్ బాగా ఆడగల గిరిని చూసి ఆకర్షితురాలవుతుంది ధనవంతుల కుటుంబానికి చెందిన కమల. తండ్రి అభీష్టానికి వ్యతిరేకంగా గిరిని పెళ్ళాడి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. మొదట్లో ఇద్దరూ సరదాగా ఉంటూ కలసి టెన్నిస్ ఆడుకుంటారు. అయితే రాను రాను గిరికి టెన్నిస్ పట్ల వ్యామోహం అధికమై ఇంటిని, భార్యని నిర్లక్ష్యం చేయడం మొదలుపెడతాడు. తానేదో గొప్ప ఆటగాడినని, తాను గట్టిగా ప్రయత్నిస్తే డేవిస్ కప్ కైనా ఆడగలనని అనుకుంటాడు గిరి. కానీ అతని ఆట అంతంత మాత్రమేనని అతని మిత్రుడయిన కథకుడికి తెలుసు. కొన్నేళ్ళ తర్వాత మిత్రులిద్దరూ కలుసుకున్నప్పుడు ఉద్యోగం మానేసి ఆట మీద దృష్టి పెట్టానని గిరి చెబుతాడు. కుటుంబమెలా గడుస్తుందని కథకుడు అడిగితే, కమల వాళ్ళ నాన్న కలిసిపోయారని, ఆయన డబ్బుతో వ్యాపారం చేయనున్నానని చెబుతాడు గిరి. కమల కరుడు గట్టిన ద్వేషాన్ని సైతం మర్చిపోయి తండ్రి పంచన ఎందుకు చేరిందో తెలుసుకోవాలంటే సి. రామచంద్రరావు వ్రాసిన టెన్నిస్ టోర్నమెంట్కథ చదవాల్సిందే.

యర్రంశెట్టి శాయి వ్రాసిన అవుట్కథలో ఉద్యోగం వచ్చిన శోభనాచలం అనే క్రికెట్ బాగా ఆడే యువకుడు రెండేళ్ళ తర్వాత సెలవు పెట్టి సొంతూరికి వస్తాడు. తన మిత్రులందరినీ కలిసి వాళ్ళతో కులాసాగా కాలం గడపాలనుకుంటాడు. కానీ చేదు వాస్తవాలు అతని ఉత్సాహంపై నీళ్ళు జల్లుతాయి. ఒకప్పుడు తనన్నా, తన ఆటన్న విపరీతమయిన ఇష్టం చూపించిన యువతికి ఇప్పుడు మరో యువకుడి ఆట నచ్చుతోంది. అతడే లోకంగా తిరుగుతుంది. మిత్రులు కూడా ఆటలని వదిలేసి జీవితం గడుపుకోడానికి రకరకాల పనుల్లో పడిపోతారు. ఒకప్పుడు తనని అభిమానించిన వారెవ్వరూ ఇప్పుడు తనని పట్టించుకోకపోవడం చలానికి బాధ కలిగిస్తుంది. ఆట వదిలేసి ఉద్యోగం/జీవనోపాధి బాధ్యతలలో పడిపోయిన తనలాంటి వాళ్ళు అవుటయిపోయిన ఆటగాళ్ళు. అందరూ ఆడుతున్నవారిని చూస్తారు గానీ, అవుటైపోయినవాళ్ళని కాదు కదా! అని చలం గ్రహిస్తాడు.

యండమూరి వీరేంద్రనాథ్ రాసిన టాస్కథలో ప్రకాష్ భారత క్రికెట్ జట్టులో ఓపెనర్‍గా ఎంపికవుతాడు. వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌లో అవకాశం వస్తుంది. కాని తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌లోనూ బౌలింగ్‌లోనూ విఫలమవుతాడు. అతని ప్రేయసి శైలజ అతన్ని నిందించి నిరుత్సాహపరుస్తుంది. కాని రెండో ఇన్నింగ్స్‌లో సమయోచింతంగా బ్యాటింగ్ చేసి మ్యాచ్ డ్రా అయ్యేలా చేస్తాడు ప్రకాష్. శైలజ ఉత్సాహంగా దగ్గరకొచ్చి మెచ్చుకోబోతుంది. కాని అతను తనకి ఓటమిలో అండగా ఉండే ప్రేయసి కావాలనీ, విజయంలో భాగం పంచుకునే వ్యక్తి కాదని ఆ అమ్మాయిని పంపించేస్తాడు.

క్రికెట్‌ని తీవ్రంగా ద్వేషించే, క్రికెట్ అంటేనే పిల్లలకు వాతలేసే, క్రికెట్ వస్తే చాలు ఠకాలున టీవీ కట్టేసే శివకామేశ్వరమ్మ హఠాత్తుగా క్రికెట్ ఆటకి వీరాభిమానిగా ఎలా మారిందో తెలుసుకోవాలంటే కె.కె. రఘునందన వ్రాసిన క్రికెట్క్రికెట్కథ చదవాలి.

క్రికెట్ మైదానంలో బాల్ తగిలి చనిపోయిన కనకయ్యది ప్రమాదమా లేక హత్యా అని తెలుసుకోడానికి ప్రయత్నించిన డిటెక్టివ్ శరత్‌ కనకయ్య అద్భుతమైన ఆటగాడనీ, ప్రజల నీరాజనాలు అందుకున్న ఆటగాడనీ, కానీ జట్టులో ఒంటరి అని గ్రహిస్తాడు. అదే సమయంలో ఆ ఆటలో ఉండే రాజకీయాలు, కుట్రలు తెలుస్తాయి. కొందరు కలిసి కుట్ర చేసి, ప్రమాదంలా అనిపించేలా ఓ క్రికెటర్‌ని చంపించిన వైనాన్ని కస్తూరి మురళీకృష్ణ రాసిన మర్డర్ కాని మర్డర్కథ చెబుతుంది.

క్రికెట్ మ్యాచ్‌లలో పందేలు కట్టి, తాకట్టు పెట్టి తీసుకున్న అప్పు నగదుని కూడా పోగొట్టుకున్న అప్పిగాడి గురించి పి.బాల రాసిన పందెంకథలో చదవచ్చు. డబ్బు పోగొట్టుకుని, పోలీసులు పట్టుకుపోయి స్టేషన్‌లో ఉంచి, బెదిరించి వదిలేశాక, పశ్చాత్తాపపడతాడు. ఇక పందేల జోలికి పోకూడనుకుంటాడు.

చదరంగం ఆటలో ఆనందగజపతి రాజుగారితో సమానంగా ఆడి, ఓడించి వారి అహాన్ని దెబ్బతీసిన కూరెళ్ళ శాస్త్రులగారికి రాజుగారు విశ్రాంతి మంజూరు చేసిన వైనం యామిజాల పద్మనాభస్వామి వ్రాసిన తోసిరాజుకథలో తెలుస్తుంది.

చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోయి పెదనాన్న సంరక్షణలో పెరిగిన మూర్తి ఎదిగాకా, పెదనాన్ననూ కోల్పోతాడు. తన మానసిక ఒంటరితనాన్ని జయించేందుకు చదరంగాన్నే ఆలంబనగా చేసుకుంటాడు. సరైన ఉద్యోగం లేని రోజుల్లో చదరంగంతోనే కాలం గడుపుతాడు. ఆడటానికి ఎవరూ లేనప్పుడు తానొక్కడే రెండు వైపులా ఆడేవాడు. కొన్నాళ్ళకి మెడికల్ రిప్రజెంటేటివ్‌గా ఉద్యోగం సంపాదించుకుని, చదరంగం అంటే పిచ్చెక్కిపోయే స్థాయికి చేరుకుంటాడు. పెళ్ళయినా చదరంగం అంటే భార్యనూ మరిచిపోతాడు. చివరికి భార్యభర్తలమధ్య అభిప్రాయభేదాలొచ్చి విడిపోతారు. అయినా చెస్ అంటే మక్కువ తగ్గదు మూర్తికి. ఆటైనా వ్యసనంగా మారితే జీవితంలో ఆటుపోట్లు తప్పవని చెబుతుంది శ్యామల వ్రాసిన చదరంగంకథ.

ఇండియన్ ఛెస్ మాస్టర్స్పోటీలలో తన ప్రత్యర్థి అయిన వినోద్‌‌ని గెలవలేకపోతుంటాడు నాయర్. పోటీలలోని ఒక నిబంధనని ఆధారం చేసుకొని వినోద్‌ని అడ్దు తొలగించుకుంటే, ఆ ఏడాది తనే ఛాంపియన్ అవుతాడని గ్రహిస్తాడు నాయర్. తన తెలివితేటలతో, వినోద్‌ని చంపేసి ఏమీ తెలియనట్టుగా తనను విజేతగా ప్రకటించడం కోసం ఎదురుచూస్తూంటాడు. అయితే చనిపోయినది కూడా ఛెస్ ఆటగాడే కావడంతో చనిపోతూ కూడా తెలివిగా వ్యవహరించి నాయర్ నేరం నిరూపించబడేలా చేస్తాడు వినోద్. ఆసక్తికరంగా సాగుతుంది మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన చదరంగంలో హత్యకథ.

***

మా పరిమిత పరిధిలో మా దృష్టికి వచ్చిన కథలలోంచి ఎంచుకున్న కథలివి. ఇంకా మా దృష్టికి రాని చక్కని కథలు అనేకం ఉండవచ్చు. కాబట్టి తెలుగులో ఇవే క్రీడాకథలు అన్న అపోహ మాకు ఏమాత్రం లేదు. కానీ మా దృష్టికి వచ్చిన కథలలోంచి నిష్పాక్షికంగా, నిర్మొహమాటంగా, నిజాయితీగా కథలను ఎంపిక చేశాం. ఈ సంకలనంలోని కథలు విభిన్నము, విశిష్టము అయినవన్న విషయంలో ఎలాంటి సందేహము లేదుఅన్నారు ఈ సంకలనానికి సంపాదకులుగా వ్యవహరించిన కస్తూరి మురళీకృష్ణ, కోడీహళ్ళి మురళీమోహన్‌లు తమ ముందుమాట క్రీడా కథల సంకలనం గురించిలో.

*********

క్రీడాకథ (కథా సంకలనం)

ప్రచురణ: సంచిక సాహితి

పుటలు: 176

వెల: 100/-

ప్రతులకు: సాహితి ప్రచురణలు, #33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి. ఆర్. రోడ్, చుట్టుగుంట, విజయవాడ – 520 004. ఫోన్: 0866-2436643

You Might Also Like

One Comment

  1. Rachaputi Ramesh

    క్రీడా కథ పై సోమశంకర్ గారు రాసిన సమీక్ష పుస్తకానికి అన్ని విధాలుగా న్యాయం చేసేదిగా వుంది. సరళమైన భాషలో అన్ని కథల పరిచయాన్ని క్లుప్తంగా అందంగా చేశారు శంకర్ గారు. వారికి నా హృదయ పూర్వక అభినందనలు .

Leave a Reply