సామాజిక సంచారి అడుగులు మరికొన్ని

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్
(మే 19 న వస్తున్న “తొవ్వ ముచ్చట్లు – 4” పుస్తకానికి ముందుమాట)
***************

తొవ్వ ముచ్చట్లు నాలుగో భాగాన్ని అనతి కాలంలోనే మీ ముందుకు తెస్తున్నందుకు చాలా సంతోషంగా వుంది. మునుపటి మూడు సంపుటులకంటే యీ సంపుటి ప్రత్యేకమైంది. తెలంగాణా రాష్ట్రం యేర్పడ్డాకా తొలి పన్నెండు మాసాల్లో చెప్పిన ముచ్చట్లివి. సుదీర్ఘ కాలపు తొలి మలి వుద్యమాల తర్వాత సాధించుకున్న సొంత పాలనలో తమ కలలు సాకారమవుతాయనీ కడగండ్లు తొలగిపోతాయనీ వలస పీడనలో కోల్పోయిన హక్కులు పునరుద్ధరణ అయి నిజమైన సంక్షేమరాజ్యం వస్తుందనీ రాజ్యహింసకు యే స్థాయిలోనూ తావుండదనీ ప్రజలు ఆశతో యెదురు చూసిన కాలం అది. భౌగోళిక తెలంగాణ సామాజిక తెలంగాణగానో ప్రజా తెలంగాణగానో రూపొందుతుందని మేధావులూ వుద్యమంలో సమస్త శక్తుల్నీ పణంగా పెట్టి పోరాడిన విద్యార్థులూ విద్యావంతులూ ప్రజాసంఘాలూ బలంగా నమ్మిన కాలం. కాలిక స్పృహతో ప్రజల పక్షంగా నిలబడి పాలకుల దురాగతాల్ని ఖండించే తొవ్వ ముచ్చట్ల రచయిత తమ సొంత పాలన గురించి యెటువంటి వైఖరి తీసుకుంటారా అని చాలామందిమి ఆసక్తిగానే యెదురుచూశాం.

ఆశించిన విధంగానే జయధీర్ తిరుమలరావు ప్రజా దృక్పథంలో మార్పేం రాలేదు ; సరికదా అది మరింత దృఢపడింది. అది సహజంగానే జరిగిన జీవరసాయన చర్య. పౌరసమాజంలో వొక బాధ్యతాయుతమైన బుద్ధిజీవిగా, ప్రజా పక్షం వహించే ప్రగతిశీల పరిశోధకుడిగా, రచయితగా కొత్త ప్రభుత్వానికి ఆయన సాదరంగా సుహృద్భావంతో నిర్మాణాత్మకమైన దిశానిర్దేశం చేయడానికి ప్రయత్నించారు. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య ప్రేమానురానురాగాలు సాహిత్య బాంధవ్యాలు కొనసాగాలని ఆశించారు. సహోదరభావనకి విఘాతం కల్గకూడదని ఆకాంక్షించారు. స్వీయ అస్తిత్వాల్ని, వివిధతని కాపాడుకుంటూనే వుమ్మడి సంస్కృతినీ వుమ్మడి భాషా మూలాల్నీ కాపాడుకోవాలని వుద్బోధించారు. వైషమ్యాలకూ విద్వేషాలకు తావులేని సాంస్కృతిక సమైక్యతని కోరుకున్నారు. తెలుగువారు రెండు రాష్ట్రాలుగా అభివృద్ధి పథంలో పయనించాలనీ అందుకు అనుగుణమైన విధానాలు విడివిడిగానైనా రూపొందించుకోవాలనీ సూచించారు. ఇలాంటి సందర్భాల్లో ఆయన గొంతు మార్దవంగా పలకడం గమనిస్తాం. కానీ పాలకుల అభివృద్ధి వ్యూహాలు విధాన నిర్ణయాలు మానవీయంగా వుండాలని భావించారు. పాలకపక్షం ప్రతిపక్షం ఆలోచనల్లో ఆచరణలో యెక్కడ తప్పున్నా యెత్తి చూపడానికి యెన్నడూ సందేహించలేదు. ప్రజావ్యతిరేక విధానాల పట్ల అసహనాన్నీ ధర్మాగ్రహాన్నీ దాచుకోలేదు.

ముఖ్యంగా పోలవరం కింద ముంపుకి గురయ్యే యేడు మండలాల్ని ఆంధ్రప్రదేశ్ లో కలపాలన్నకేంద్ర నిర్ణయాన్ని తిరుమల రావు నిర్ద్వంద్వంగా వ్యతిరేకించారు. వందలాది గ్రామాల లక్షలాది ఎకరాల ముంపు సరే అక్కడి ఆదివాసీ జీవన విధ్వంసం మాటేంటి అని రెండు రాష్ట్రాల అధినేతల్ని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాలూ కూడబలుక్కున్నట్లు కుట్ర చేసి ఆదివాసీ జీవితాలతో చెలగాటమాడొద్దని హెచ్చరించారు. మానవావరణ వినాశానుకూలంగా గీసే సరిహద్దురేఖలు నేరం అని తేల్చిచెప్పారు. దేశమంతటా అభివృద్ధికి తొలి బలి ఆదివాసీయే కావడాన్ని గర్హించారు. పోలవరానికి వ్యతిరేకంగా అక్షరాలతో పాదయాత్ర చేశారు. ఆ సందర్భంలో జరిగిన అన్వేషణలో కోయల చరిత్రకి ఆకరాలైన పగిడెలూ పటాలూ దొరికినందుకు వొకవైపు యెంతో సంతోషించారు కానీ ఆ జాతి జనుల మొత్తం సాంస్కృతిక వారసత్వం యీ క్రూర అభివృద్ధిలో మాయమైపోతున్నందుకు తీవ్ర వేదన వెలిబుచ్చారు. జలయజ్ఞాల్లో జరిగే జన హవనాన్ని ఖండించారు. పోలవరం ముంపుపై ‘అక్షర ప్రతిఘటన’ పోలవరం వ్యతిరేక సాహిత్య స్పందన, క్షేత్ర పర్యటన నివేదిక (2014)ని పుస్తకరూపంలో ప్రకటించారు.
మలిదశ వుద్యమంలో వొక పోరాట రూపమైన బతుకమ్మ రాష్ట్ర సాధన దరిమిలా టాంక్ బండ్ యెక్కి దొరల సమక్షంలో కార్పోరేట్ స్థాయి మెగా యీవెంట్ గా, జీవ పరిమళం లేని ‘ప్లాస్టిక్’ గా మారిన వైనాన్ని తప్పుబట్టారు. గోల్కొండ ఖిల్లా మీద పంద్రాగస్టుకి జెండా యెగరవేయడంలో దాగివున్న భూస్వామ్య భావజాల అవశేషాల్ని బహిరంగపరిచారు.

అరవై యేళ్ళ కింద స్వయంగా ప్రభుత్వంలో వుండికూడా అప్పటి ప్రభుత్వ విధానాల్ని విమర్శిస్తూ కాళోజీ ప్రచురించిన కరపత్రాన్ని సమకాలీన పరిస్థితులకు అన్వయించడానికి వెనకాడలేదు. అలాగే విశ్వవిద్యాలయాల వైఫల్యాలకు కారణమౌతోన్న పాలకుల దృష్టి రాహిత్యాన్ని దుయ్యబట్టారు. పాలకుల విధానాలే కాదు పౌరసమాజంలో ప్రజల పట్టని తనం కూడా సామాజిక సాంస్కృతిక పర్యావరణ అనర్థాలకు కారణమౌతుందని జయధీర్ చాలా సందర్భాల్లో బలంగా చెప్పారు. తరాల చరిత్రని గుండె సందుకల్లో భద్రపరచుకున్న సజీవ ఆర్కైవ్స్ కేశవపట్నం వైష్ణవ మఠం గురువుల సంచార సంప్రదాయం ఆగిపోయిననందుకు , జానపద చారిత్రిక వీరుల కథా గేయాల్ని తంత్రులపై పలికిన కిన్నెర వాద్యం మూగపోతున్నందుకు, ప్రజా కళారూపంగా దోపిడిదారుల గుండెల్లో డైనమేట్లు పేల్చిన బుర్రకథ కనుమరుగు అవుతున్నందుకు, గుంజాల గోండి/ కోయతూర్ లిపివ్యాప్తికి కొందరు ఆదివాసీలే అడ్డుపడుతున్నందుకు ఆవేదనతో వెలిబుచ్చిన ఆలోచనలు యీ రచనల్లో మనని ప్రశ్నిస్తాయి.

వ్యక్తుల జీవన రేఖల్ని చిత్రించే సందర్భాల్లో సైతం తనదైన దృష్టికోణం నుంచి ఆయన పక్కకి తప్పుకోలేదు. వ్యక్తుల్ని సమాజం నుంచి సామాజిక నిబద్ధతల నుంచే విడదీసి చూడటం ఆయనకు చేతకాదు. అందుకే కారా మాష్టారి కథానిలయం గురించి, ఛాయారాజ్ స్మారక గ్రంథాలయం గురించి ప్రస్తావించినప్పుడు ప్రభుత్వం యింటింటికీ వసూలుచేసే గ్రంథాలయాల సెస్సు యేమౌతుందని సూటిగా ప్రశ్నిస్తారు. గ్రంథాలయం లేని దేశం బీడునేల అని నిర్ధారిస్తారు. మిత్ర, కానూరి వంటి సాంస్కృతికోద్యమ కవుల కళాకారుల సాహిత్య కళా ప్రస్థానం గురించి మాట్లాడినప్పుడు విప్లవోద్యమాల్లో నిబద్ధత నిమగ్నతల గురించి లోతుగా చర్చిస్తూనే వుద్యమాలు బలహీనపడటానికి కారణమైన అంతర్గత వైరుధ్యాల్ని అన్వేషిస్తారు. చేరా, యం టి ఖాన్, దాశరథి రంగాచార్య వంటి వ్యక్తులు మరణించినప్పుడు రాసిన స్మృతి రచనల్లో సైతం తిరుమలరావు ఆబ్జెక్టివిటీని వదిలిపెట్టలేదు. వారి బలాల్ని బలహీనతల్నీ నిర్మమంగా యెత్తిచూపారు.

సహజంగానే యీ సారి తొవ్వ అడవి బిడ్డల గుండె లోతుల్లోకే పరచుకుంది. ఆదివాసీ కళలూ సంగీత వాద్యాలూ నృత్యాలూ భాషా విజ్ఞానం పరాయీకరణకి గురౌతున్న క్రమంలో వాటిని కాపాడుకోవాల్సిన అవసరాన్ని పదేపదే గుర్తుచేస్తున్నారు. ఒక వైపు అభివృద్ధి పేర్న అడవి నుంచి ఆదివాసీని తొలగించి వారి నేలనీ దానికింద ఖనిజ సంపదనీ కార్పోరేట్ సంస్థలకు కట్టబెట్టే దళారీ విధానాలు అమలు చేస్తూ దాన్ని వ్యతిరేకించేవాళ్ళని అణచివేస్తూనే మరోవైపు వనవాసీ కళ్యాణం గురించి మాట్లాడే కుటిల చాణక్యాన్ని తునుమాడుతున్నారు.
***

‘తొవ్వ ముచ్చట్లు’ చదివిన ప్రతిసారీ పర్యటన ప్రయాణం యాత్ర సంచారం యీ పదాలు – వాటి అర్థచ్ఛాయల గురించి కొత్త ఆలోచనలు మొదలౌతాయి. ఇటీవల యాత్రా రచనల గురించి తెలుగులో కొత్త అన్వేషణ మొదలైంది. కేంద్ర సాహిత్య అకాడమీ వంటి సంస్థల నిర్వహణలో సదస్సులు కూడా జరిగాయి. ఏనుగుల వీరాస్వామయ్య కాశీ యాత్రా చరిత్ర దగ్గర్నుంచి జయతి లోహితాక్షన్ అడవి నుంచి అడవిలోకి వరకు కాలినడకన సైకిళ్ళుమోటారు సైకిళ్ళు స్కూటర్లు విమానాల మీద నదీ తీరాల వెంట పర్వత సానువుల్లో సిల్కు రూట్లలో పల్లె పుంతల్లో అడవి అంచుల్లో చేసిన ప్రయాణాల గురించి రాసిన యాత్రా సాహిత్యంలో ప్రతిఫలించిన భౌగోళిక ప్రాకృతిక ప్రాదేశిక సాంస్కృతిక సామాజిక అంశాలెన్నో వెలుగులోకి వచ్చాయి. మనవడినో మనవరాలినో చూసుకోడానికి (baby sitting కోసం) అమెరికానో ఆస్ట్రేలియానో వెళ్ళి వచ్చినవారి సరదా పర్యటనలు, గుళ్ళూ గోపురాలు చుట్టివచ్చిన తీర్థయాత్రలు, సహచరులతో చేసిన ప్రేమయాత్రలు సైతం యాత్రా సాహిత్యంలో చోటు సంపాదించుకున్నాయి కానీ జయధీర్ ‘ తొవ్వ ముచ్చట్లు’ గురించిన ప్రస్తావన యెక్కడా కనిపించలేదు. యాత్రా రచనల్లో తొవ్వ ముచ్చట్లకు స్థానం దొరక్క పోవడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తాయి.

ఒకటి: తెలుగులో యిటువంటి విలక్షణ రచనా ప్రక్రియ యింతకుముందు లేదు. ఈ తొవ్వ నలుగురూ నడిచింది కాదు. ఈ ముచ్చట్లు సరదా కబుర్లు అంతకన్నా కావు. ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించి ఆ పరవశంలో వర్ణించిన విహార యాత్రా విశేషాలు కావు. పుణ్యక్షేత్ర మాహాత్మ్యాన్ని భక్తితో కీర్తించే కథనాలు కావు. ప్రభుత్వాలో ప్రైవేటు సంస్థలో అభివృద్ధి చేసిన పర్యాటక కేంద్రాల వ్యాపారాన్ని పెంచే ప్రోమో ప్రకటనలు కావు. అన్నిటికీ మించి రచయిత తొలిసారిగా తవ్వి తీసిన అంశాలను అధ్యయనం చేయడానికి అవసరమైన పరికరాలుసాహిత్యకారుల వద్ద, పరిశోధకుల వద్ద లేవు. అందుకే గుర్తింపు సమస్య.

రెండు: వీటి లోతుల్ని వ్యాఖ్యానిచాలంటే భారతీయ సమాజంలో పాతుకుపోయిన నిచ్చెనమెట్ల కుల వాస్తవికతని గుర్తించి వాటి మూలాల్ని అర్థం చేసుకొనే సైద్ధాంతిక జ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి. సమాజంలోని భిన్న సమూహాల్లో సంభవించే మార్పుల్నీ చలనాన్నీ స్తబ్దతనీ పసిగట్ట గలగాలి. వాటిని విమర్శకు పెడుతూ గతితార్కికంగా రచయిత లేవనెత్తిన అనేకానేక ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నాలు చేయాలి. ఆ ప్రయత్నం సాహసంతో కూడినది. చాలా సార్లు అది పాలకుల కన్నెర్రకు కారణం కూడా కావచ్చు. అందుకు భద్రజీవులు సిద్ధంగా లేరు.
‘తొవ్వముచ్చట్లు’ పరిశోధన రంగంలో అకడమిక్ మూసల్ని బద్దలుకొట్టడం వల్ల విశ్వవిద్యాలయాల ఆధిపత్య పీఠాలు కూడా వీటిని దూరంగా ఉంచాయి. ప్రగతిశీల శిబిరాల్లో చోటుచేసుకుంటున్న వొంటెత్తుపోకడల రాజకీయాల్ని సైతం విమర్శనాత్మకంగా చూడటం వల్ల వారూ వ్యూహాత్మక మౌనాన్ని పాటించారు. అయినా జయధీర్ యెన్నడూ కాలికి కట్టిన బలపం విడువలేదు. కలం కింద పెట్టలేదు. విసుక్కోలేదు. విశ్రాంతి తీసుకోలేదు. సంయమనాన్ని వదులుకోలేదు. సున్నితత్వాన్ని కోల్పోలేదు.

ఆయన బతుకే వొక నిరంతర సంచారం. గత వర్తమానాల మధ్య యెడతెగని ప్రయాణం. దేశీయ సాంస్కృతిక మూలాల్లోకి అలుపెరుగని అన్వేషణ. విస్థాపనకీ విధ్వంసానికీ గురై కూలిపోతున్న ఆదివాసీల ఆవాసాల్లోకి, చీకటి బతుకుల్లోకి యేకకాలంలో చేసిన సునిశిత గవేషణ.
జయధీర్ సంచారాన్ని దుర్గమ మార్గాల్లో వెనకటికి రాహుల్ సాంకృత్యాయన్ పండితుడు చేసిన సంచారంతో పోల్చవచ్చు. ఇటీవలి కాలంలో యే యాత్రికుడూ / పర్యాటకుడూ తొక్కని తొవ్వ యిది. ఏ పండితుడూ చర్చించని శాస్త్రం యిది. ఏ సామాజికవేత్తా తొంగి చూడని మారుమూల ప్రాంతాల జీవిత శకలాలు యివి. ఏ రాజకీయ నీతిజ్ఞుడూ ప్రశ్నించని ప్రశ్నలివి. నిత్య అధ్యయన తత్పరుడూ నిరంతర అన్వేషి క్రియాశీలీ అయిన వొక సామాజిక సంచారి చెప్పిన నుడుగులివి. వేసిన అడుగులివి.

ఆ అడుగుల సవ్వడిలో ఆధునికత / అత్యాధునికత తెచ్చిపెట్టిన సంక్షోభంలో సతమతమౌతోన్న సమాజం గుండె చప్పుళ్ళు వినవచ్చు. పాలకుల అభివృద్ధి క్రీనీడలో జీవితం అతలాకుతలమైన ప్రజల నాడీ స్పందనలు పట్టుకోవచ్చు. కుల వర్గ ప్రాంత జెండర్ ఆధిపత్యాల కింద నలిగిన అభాగ్యుల ఆర్తనాదాలు రికార్డు చేయొచ్చు.

ఆయన ప్రతి సంచారంలోనూ చరిత్ర పొరల్లో దాగిన సాంస్కృతిక రహస్యాన్ని వెలికి తీయడమో, కాలగతిలో మూగవోయిన వొక సంగీత వాద్యాన్ని పలికించడమో, మరుగునపడ్డ వొక తాళపత్ర గ్రంథం దుమ్ము దులపడమో, జీవిక కరువైన వొక జానపద/ గిరిజన కళాకారుడికి గుర్తింపునిచ్చి గౌరవప్రదమైన బతుకుతెరువు చూపడమో అనివార్యంగా జరుగుతుంది. ఆయన నడకలో కాళ్ళకి కళ్ళుంటాయి. చేతులకు చెవులుంటాయి.

సాంస్కృతిక విధ్వంసం గురించి ఆగ్రహం వెలిబుచ్చడం దగ్గర జయధీర్ ఆగిపోలేదు. పర్యావరణ విధ్వంసానికి స్వయంగా కారణమౌతూ పర్యావరణ చట్టాల్ని పెట్టుబడిదారుల భూకబ్జాదారుల రియల్టర్ల పాదాక్రాంతం చేస్తున్న పాలకుల నిర్ణయాల్ని తూర్పారపడుతున్నారు. ఇసుక మాఫియాలతో చేతుల్ని కలిపి జీవనదుల్ని యెండగడ్తూ, క్వారీల కోసం కొండల్ని మాయం చేస్తూ చెరువుల్ని కాపాడతామనే ద్వంద్వనీతి మిషన్ ల లోగుట్టు విప్పిచెబుతున్నారు. అందువల్ల యీ రచనలు చాలా సందర్భాల్లో పాలకులకు తప్పనిసరిగా యిబ్బంది కలిగించాయి. పాలకుల పంచన చేరి అవార్డులు అందుకోవచ్చనీ సన్మానాలు జరుపుకోవచ్చనీ రోజుకో పబ్బం గడుపుకోవచ్చని కొత్త రాగాలు యెత్తుకున్న కవి కోకిలల స్వరాల్లోని అపశ్రుతుల్ని కూడా తిరుమలరావు అందరికన్నా ముందుగానే గుర్తించి హెచ్చరించారు. ఆ క్రమంలో కొందరు అవకాశవాదులు భయస్తులు ఆయనకు దూరమయ్యారు. అందుకు ఆయన సంతోషిస్తున్నారు ; కానీ గమనం ఆగలేదు. పైగా మరింత రాటు దేలుతున్నారు. అది మరో అధ్యాయం.
***
నాలుగు సంపుటాల్లో మొత్తం రెండువందలకు పైగా (209) ముచ్చట్లు మీకు చేరాయి. మరో వందకు పైగా అచ్చుకోసం యెదురుచూస్తున్నాయి. వారం వారం ‘తొవ్వముచ్చట్లు’ శీర్షికని ప్రచురించిన అప్పటి ఆంధ్రభూమి (దిన) సంపాదకులకు, ఇవి పుస్తకరూపం ధరించడానికి తోడ్పడిన చొల్లేటి రాజారెడ్డి నీరజలకు ప్రత్యేక కృతజ్ఞతలు.కొత్తగా వీరి యింట్లో చేరిన చిన్నారి శ్రీనిక అరుషికి అభినందనలు.

తీవ్ర అనారోగ్యం కారణంగా యీ ప్రయాణాల్లో నేను లేను. అడవి కడుపులో అక్షరాల పాదయాత్రలో వుండాల్సిన సందర్భంలో ఆసుపత్రి పాలయ్యాను. పడకమీద వున్న నన్ను మందలించడానికి వచ్చిన గుంజాల గోండి లిపి భాషా యోధులతో, గోండి మిత్రులతో చేయి కలిపి ‘రాం రాం’ చెప్పలేని బలహీనమైన పరిస్థితి. కానీ యీ అక్షరాల్లో వాళ్ళందర్నీ వొకటికి రెండుసార్లు చూడగలిగాను. ముఖాముఖి మాట్లాడగలిగాను. గుండెకు హత్తుకోగలిగాను. వారి ఆలోచనలతో మమేకం కాగలిగాను. వారితో కరచాలనం చేయగలిగాను. కలిసి నడవగలిగాను.

అందుకు యీ ముచ్చట్లకు సలాం …
త్వరలో అయిదో భాగంతో మీ ముందుకు వస్తామని హామీతో …
అంత దనుక రైతు దిడ్డిబోయిన బుచ్చయ్య, గోండి ఆదివాసీ కుమరం విఠలరావు నేర్పిన బతుకు పాఠాలు నేమరువేసుకుందాం.

14 ఏప్రిల్ 2019, ఎ. కె. ప్రభాకర్
హైదరాబాద్. సంపాదకుడు

You Might Also Like

Leave a Reply