స్త్రీ కథలు 50

వ్యాసకర్త: సంధ్య యల్లాప్రగడ
చిన్న కథలు చదవటానికి బాగుంటాయి… త్వరగా, చకచకా చదివేసి, చదివిన కథలలో నచ్చినవి మననం చేసుకోవటం మంచి అనుభూతి.
అందునా మంచి కథ చదివితే ఆ అనుభూతి రసానుభూతి. మరి మంచి కథలు అన్ని ఒక్క దగ్గర కూడి ఒక పుస్తకం లా వస్తే…. అది మరింత మధురమే కదా!
కథలో – నిర్మించిన వస్తువు, కథా గమనం,కథలోని పాత్రలు, ఔచిత్యం,  సమస్యను వివరించటం, కొన్ని సందర్భాలలో పరిష్కారము సూచించటం  ఇత్యాది లక్షణాలు కథను చదువరులకు గుర్తుండేలా చేస్తాయి! ఇలాంటి కథలు తెలుగు లో చాల వచ్చాయి. వస్తున్నాయి కూడా! మంచి రచయితలూ తెలుగులో కోకొల్లలు. ఎవరి శైలి వారిదిగా భాషను సుసంపన్నం చేశారు, చేస్తున్నారు.

తెలుగు కథలలో స్త్రీ వాద కథలు మొదలయినాక, ‘స్త్రీ వాదులంతా ఒక్కటే’ అన్న నినాదం ఉండేది. తరువాత అందులో దళిత, ముస్లిం వాదాలు ఇత్యాదివి చోటు చేసుకున్నాయి.
ఎన్ని వచ్చినా స్త్రీ సమస్యలు ఉన్నన్ని , కథలు రాలేదనే చెప్పాలి.

స్త్రీ గర్భం లో  పిండ దశ నుంచే ఆమేకు సమస్యలు మొదలైతాయి. జీవితంలో వివిధ దశలలో వివిధ స్థాయిలో ఈ సమస్యలు ఉన్నాయి. ప్రతిభావంతమైన రచయితలూ ఈ సమస్యలను కథా వస్తువుగా కథలను నిర్మించారు.
అలాంటి కథలు మనకు అన్ని ఒక్కటిగా నేటివరకు ఎవ్వరు కూర్చలేదు. నేడు ఆ కొరతా తీరిపోయింది. “స్త్రీ కథలు 50” అన్న పేరుతో మహ్మద్ ఖదీర్ బాబు తెచ్చిన పుస్తకం ఒక అద్బుతం.
ఇవ్వన్నీ బలమైన కథలు.
అగ్ని కణాలలా కణకణ మండుతున్న శక్తి ఘాతాలు. అతి శక్తివంతమైనవి . సూటిగా సమస్యను మాట్లాడిన బాణాలు. స్త్రీ రక్త మాంసాలున్న మనిషిగా చూపించే స్పష్టమైన దర్పణాలు. పురుషులకే కాదు,
సమస్యను తెలియని కొన్ని వర్గపు స్త్రీలకు కూడా కనువిప్పు ఈ కథలు.
స్త్రీ కి ఇన్ని సమస్యలా అని సమాజం నిర్ఘాంతపోయే సత్య దర్శనములు ఈ కథలు.
ఎందరికో కనువిప్పు, కొందరికైనా మనసును కదిలించే సత్య ప్రకాశాలు.
ప్రతిభావంతమైన రచయితల చేతులలో మలచబడిన అద్భుత శిల్పాలు.
సమాజానికి సూటిగా వచ్చి బుల్లెట్ లా తగిలి సమాధానం అడుగుతున్న ప్రశ్నలు ఈ కథలు.
మానవ నాగరికతను నిగ్గు తీసిన యథార్థాలు.
నిర్భయంగా లోపలి లోపాలను ప్రకటించిన నిజాలు.
శ్వాస పిలుస్తున్న ప్రతి జీవి మానవ జాతిలో సగ పాళ్ళకు హక్కుదారన్న డిమాండ్లు.
స్త్రీ లు ఎదుర్కొంటున్న అణిచివేతను, వివక్షతను, బూతద్దంలో చూపిన సంగతులు.
సంస్కృతి, సంప్రదాయం, కులం, మతం బంధాలలో ప్రాణమున్న జీవుల ఆక్రందనలు.
జీవితాలు – స్త్రీ జీవితాలు… చీకటిలో, చరిత్రలో కాలిపోయిన, పొత్తున్న పరమార్థాలు.

ఈ కథలన్నీ ఒక ఎత్తు, ఆ కథలను సేకరించి, వాటిని పరిచయం చేసిన ముందుమాట మరో ఎత్తు. వివిధ కోణాలు ఆవిష్కరించిన 50 కథలు తప్పక చదవలసినదే!

అందులో ఓల్గా గారు రచించిన ‘తోడు’ నాకు బాగా నచ్చిన కథ. నచ్చటానికి కారణం అందులో పరిష్కారం ఆమె సూచించారు. ఏ మార్పు కోరుతూ ఒక కథ మొదలైందో, ఆ మార్పును చూపిస్తూ కథను ముగించటం బాగుంది.

కథలో భార్యను కోల్పోయిన ఒక పెద్దమనిషి తమ పక్క ఫ్లాట్ లో భర్తను కోల్పోయిన స్త్రీ ని చూస్తాడు. ఆమె వైయిలిన్ నేర్చుకుంటూ, పుస్తకం చదువుకుంటూ కనపడుతుంది.

జడ్జిమెంటల్ దృక్పధం కల సమాజపు మాములు సగటు మనిషిగా ఆమె పోకడకు విస్తుపోతాడు.
ఆమె దుఃఖం గురించి అడుగుతాడు.
ఇతను పురుష అహంకారపు గుర్తు. అధిపత్యానికి నెలవు.  భార్య తప్ప ఇతను ఇంట్లో పనులు తాకడు. ఇతని భార్య మరణించిన తరువాత బ్రతకటం చేతకాక అయోమయం లో ఉంటాడు. భర్త పోయిన ఈమెను పెళ్లి చేసుకుందామని అడుగుతాడు. దాని సమాధానం – వివాహం, భర్త మూలంగా కోల్పోయిన ‘స్వేచ్ఛను, జీవితాన్ని’ వెతుకులాటలో ఉన్న ఆమె మళ్ళీ సంకెళ్లు వేసుకోలేనని చెబుతుంది.
పెళ్ళి మూలంగా స్త్రీ కోరుకునేది భద్రత, జీవితంలో నికార్సైన తోడు, బేషరతుగా గౌరవించే సహచరుడు. కానీ మన సమాజంలో పెళ్ళి ద్వారా స్త్రీ లకు లభిస్తున్నది మాత్రం సంకెళ్ళు. వివిధ రూపాలలో సంకెళ్ళు.
అలాంటి సంకెళ్ళను కొందరు తిరస్కరిస్తున్నారు. అది మారుతున్న సమాజానికి గుర్తు.
ఆమె “మిమ్ముల్ని ఎందుకు పెళ్ళి చేసుకోవాలని?” అని అడిగిన ప్రశ్న నేటి స్త్రీల ఆలోచనలో వచ్చిన మార్పు. అది ఆమెకు భర్త పోయాక కలిగింది.
సమాధానంగా ఇతనిలో మార్పు, పనులు నేర్చుకొని, చేసి ఆ స్త్రీ ని మెప్పించటం ద్వారా స్నేహానికి నాందిగా ఆ కథ ను ముగిస్తారు.
ఈ కథలో బూజుకర్రకు చివర ఉండవలసిన చేతికి గాజులు ఉండవలసినదేనా? అన్న ప్రశ్న తో మొదలెట్టి, అక్కర్లేదని ముగిస్తారు. మొగవారికి వివాహంతో ఫలితాలు, రాబడి అధికం. స్త్రీకి శ్రమ తప్ప మరోటి లేదు. కానీ ఫలితాలు సగం సగం ఉండాలని మార్పును చూసిస్తారు.
ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. మనం మన చుట్టూ ఉన్న ప్రజలను జడ్జిమెంటలాగా చూడటం మానివేస్తే, జీవితంలో మరో కోణం అర్థమౌతుంది.

స్త్రీ సమస్యలను కథలుగా చెప్పిన రచయితలు ఆదర్శవంతులు.
వాటిని సేకరించి అందించిన ఖదీర్ బాబుగారు కూడా అంతే ఆదర్శవంతులు. ఆయన తెలుగు కథ లో స్త్రీ సమస్యల గురించి ముచ్చటిస్తూ “ఎంత చైతన్యవంతంగా, సహజంగా, వికాసంగా, తిరుగుబాటుగా, తెలుగు స్త్రీ కథ ఉన్నదోనని గర్వ పడ్డాను” అన్నారు. అలాంటివి అందించి మనకు ఎంతో సాయం చేసిన ఆయనకి నా అభినందనలు.

ఇలాంటి కథలు ఎన్నో రావాలి. అవి మరిన్ని పుస్తకాలుగా రావాలి. తద్వారా కొంతైనా మార్పు రావాలి. పురుషులలో, స్త్రీ లలో మార్పు రావాలి. ఆ మార్పు స్త్రీ – పురుష సమానపు విలువలున్న సమాజం అందివ్వాలని ఆశిస్తున్నాను.

You Might Also Like

Leave a Reply