“సత్యవతి కథలు” – సమాజంలో స్త్రీలు

వ్యాసం రాసినవారు: సంధ్య యల్లాప్రగడ 

స్త్రీ లు చేసే సేవలకు ఎంత గుర్తింపు వుందన్న విషయము ప్రక్కన పెడితే, జాతీయGDP లో కూడా వీరి సేవలు లెక్కకు రావనుకుంటాను. ఒక వ్యక్తి అది పురుషుడు కావొచ్చు, స్త్రీ కావచ్చు సజావుగా ఉద్యోగం, జీవనము జరపాలంటే కూడా వుండి చూసుకునే వారుండాలి. భాగస్వాములిద్దరూ వుద్యోగములో వుంటే వారికి పూర్తి సమయము వెచ్చించే ఒక సహయకుల అవసరము ఎంతైనా వుంటుంది. అప్పుడు ఆ సర్వీసులను జాతీయ ఆదాయాల లెక్కలలో జమచెయ్యటం కుదురుతుంది. కానీ ఇలా లెక్కకు రాకుండా పొయేవి సేవలు సమాజంలో చాలానే వుంటాయి.

ఈ మధ్యలో పి. సత్యవతి గారి కథలు చదువుతూ ఉంటే కలిగిన ఆలోచనా స్రవంతి. అందులో ఒక కథ ఉదాహరిస్తాను. “ఇల్లలకగానే పండుగౌనా!”. కథలో మహిళా తన ఉనికి ని మరచి లేదా కోల్పోయి జీవితాన్ని కుటుంబానికి అంకితం చెయ్యటం అన్నది… ఎలా స్త్రీ లు తమ గురించి మరిచిపోతారో నర్మగర్భంగా వివరిస్తారు రచయిత్రి. చివరకు తనగురించి తాను ఆలోచించుకోవటం అన్న విషయంతో కథ ముగుస్తుంది. ఆ పుస్తకంలో అన్ని కథలు స్త్రీల కష్టనిష్ఠూరాల గురించే అనుకోండి. మృదువుగా చెపుతున్నా, చాలా సీరియస్ విషయము. సంఘంలో పాతుకుపోయిన విషయాలు ఆమె కథలలో కథా వస్తువు.

నేటి మహిళలు ఎంతో మారిపోయారు…జీవిత వేగం మారింది… చాలామంది స్త్రీలు నేడు ఉద్యోగ పర్వంలో మునిగి తేలుతున్నారు. స్త్రీ నేటి కుటుంభ వ్యవస్థలో ఇంటి పని, వంట పనులకు అంకితమైపోవటంతో పాటు, ఉద్యోగాలతో పని మీద పనితో మరింత సతమతమౌతుంది అన్నది నిర్వివాదం! ఇంటిపని, వంటపని, పిల్లల పెంపకం, పోషణ లతో పాటు, ఈ ఉద్యోగమన్నది నిజానికి చాలా అదనపు పని భారం. నేటి మహిళలు అన్నిటిని ఏకకాలం లో సర్దుకుపోతున్నారు. అంటే ఒక స్త్రీ ఇద్దరు వ్యక్తుల పనిని నెత్తిమీద మోస్తున్నది ప్రస్తుత కాలంలో. ఇంట్లో ఆమె భర్త ఎంత సహాయం అందచేస్తారు అన్నది ప్రక్కన పెడితే, ఎంత సహాయం చేసినా ఇద్దరు వ్యక్తుల పని భారం, వత్తిడి ఆమె మీద తగ్గుతున్నదా అన్నది ప్రశ్నార్థకమే! ఇంటిని శుభ్రంగా ఉంచటం కానీ, వంటపని, పిల్లలను సాకటం అన్నవి స్త్రీ యందు ప్రతిపాదించబడిన ప్రథమ, ప్రధానమైన పనులు.అందుకే ఇంట్లో ఏంతో హెక్టిక్ గా ఉన్న రోజులలో, భర్త సహాయం చేసినా, తనది కానిది తాను చేసిన ఎంతో “మంచి మనిషి” అన్న భావన ఆ భర్త గారికి తొంగి చూస్తూనే ఉంటుంది అన్నది కూడా నిజం. చాలా సార్లు వారు ఏదైనా పని చేసినప్పుడు, ఆ పురుషులలో తమది కాని పని చేస్తున్న భావన సరి అయినది కాదంటే, వారికీ అర్థం కాదు. పైగా అలా చెప్పినందుకు మన మీద కోపం కూడా వస్తుంది. ఇక్కడ నా మిత్రుల భర్తలు, తెలిసిన వారి ప్రవర్తన లో నేను అది చాలా సార్లు గమనించాను. ఎవరికి కుదిరిన పని వారు చూసుకుంటన్నామన్నా, సంప్రదాయ ముసుగులో జీవిస్తున్న గుహస్తులకు ఈ సృహ కలుగుతుందా? ఇంటి బాధ్యత ఇద్దరిది అన్నది కేవలం నోటి మాటగాను, కంటి తుడుపు గానే ఉంటుంది కానీ, అది ఇంకా సమాజపు పొరలలో ఇంకలేదన్నది పరమ నిజం. స్త్రీ పురుష సమానత్వం గురించి ఎన్ని మాట్లాడినా, ఈ అసమానత్వమన్నది మనసులోనుంచి తొలగకపోతే, ఎన్ని చేసినా కూడా నీటిమీద రాతలే కదా!

స్త్రీలు చేసే ఎన్నో పనులకు జాతీయ ఆదాయాల లెక్కలకు అందనివి. చాల మంది డొమెస్టిక్ సహాయకులుగా ఉన్నా, వారి ఆదాయం లెక్కలోకి రాదు. అలాగే ఇలా డబల్ జాబ్ లు చేస్తున్న స్త్రీ పని గంటల లెక్క కూడా మన జాతీయ ఆదాయంపు లెక్కలకు అందదు.
నేను బద్రి, రిషికేష్ తిరుగుతున్నప్పుడు గమనించింది అక్కడ స్త్రీ మూర్తుల కష్ట జీవన విధానం. హిమాలయాలలో కొందరు స్త్రీల జీవన విధానము చూస్తే ఇలాంటి ఎన్నో ఆలోచనలు కలుగుతాయి. పూర్తిగా నడుము వంచి కట్టెలు గడ్డి తో పాటు ఎంతో బరువులు మోస్తున్న ఇలాంటి వారి సంపాదనలు జాతీయ లెక్కలలో లేనివేగా. ఇంటో సామాన్యంగా ఉంటూ కూడా వారు చాల అసామాన్యమైన పనులను, అతి తేలికగా చేసుకుపోతూ ఉంటారు. నిలువెత్తు గడ్డి మోపులు భుజాన, నడుముకు వేసుకుని మైళ్ళు, మైళ్ళు నడుచుకు పొయ్యే వృద్ధ మహిళలను నేను గమనించాను. వారు అవి కష్టంగా కాకుండా, అలవోకగా చెయ్యటం మరింత అద్భుతమైన విషయం.

హైదరాబాద్ లో వంటకు సహాయంగా వచ్చిన స్త్రీ మూర్తి కూడా తన ఆదాయం తో వాళ్ళ ఇల్లు నడుపుతున్నా, ఆమె కానీ, ఆమె వంటి వారి ఆదాయం కానీ లెక్కలోకి రాదు. ఉద్యోగం చేస్తూ, ఇంట్లో కూడా కష్టపడుతున్న మహిళల వారి ఆదాయం వివరాలతో జాతీయ ఆదాయం లెక్కలోకి వస్తుంది కానీ, వారి ఇంటిలో వారు పడే శ్రమకు లెక్క ఉండదు. పురుషులు ఎంత సహృదయులైనా, ఇంటి పని, వంట పని ఇద్దరిది అని, ఎవరికీ కుదిరితే వారు పని చూడవలసి ఉంటుందనే భావన రావలసి ఉంది. అప్పుడే ఇద్దరి సమానత్వం గురించి మాట్లాడటానికి ఎంతైనా అవకాశం ఉంది. ఈ అసమానతలు తొలగి పోవటానికి చాల సార్లు పురుషులకు విడమర్చి చెప్పాల్సి ఉంటుంది.

You Might Also Like

Leave a Reply