ఫిల్టర్ లెస్ కాఫీ: Jan 2019లో చదివిన పుస్తకాలు

వ్యాసకర్త: అరిపిరాల సత్యప్రసాద్ 

ఇన్ ద మూడ్ ఫర్ లవ్: సంపాదకులు: అపర్ణ తోట, వెంకట్ సిద్దారెడ్డి

సంవత్సరం మొదలయ్యేసరికి నేను చదువుతూ వున్న పుస్తకం ఇన్ మూడ్ ఫర్ లవ్. డిసెంబర్లో పుస్తకం విడుదల చేసినా బుక్ ఫెయిర్, నా పుస్తకం తీసుకురావడంలో పూర్తిగా చదవటం కుదర్లేదు. పుస్తకంలో నేను కూడా భాగస్వామినే కాబట్టి కొన్ని కథలు ముందే చదివే అవకాశం వచ్చింది. అయినా వాటన్నింటినీ ఒకే వరుసలో చదవడం ఒక మంచి అనుభవం అని వరుసగా చదివాను. పుస్తకం తెచ్చి మంచిపని చేశాం అనిపించింది. అన్నీ కథలు బాగున్నాయ్. కొన్ని మరీ బాగున్నాయ్.

బాగున్నాయ్ అంటే? కథ వస్తువు కుదరాలి. అందుకు తగ్గ వాక్యాలు పడాలి. అనుభూతి మిగలాలి. ఇంతే నా కొలతలు. అన్నీ కథల్లో ఇవన్నీ వున్నాయని కాదు. కొన్ని అద్భుతం అనిపించాయి. కొన్ని మంచి కథలు అవబోతూ ఆగిపోయాయి. కొన్ని రాయడం కుదరక అటూ ఇటూ అయ్యాయి. అనుభూతి ఒకోసారి దట్టంగా అలుముకుంటే, కొన్ని కథల్లో అందుతూ అందుతూ మిస్ అయిపోయింది.

కాశీసత్యవేణి“, రిషినిద్రగన్నేరు“, ఉషమోహౠతువు“, మిథునరామినాగు బాగానచ్చినవి. నా కథ కూడా లిస్ట్ లో వెయ్యచ్చు. ఇంకొంచెం సరళం చేసి వుంటే బాగుండేదేమో అనిపించి లిస్ట్లో పెట్టట్లేదు. మహిగన్స్ ఎండ్ మాన్సూన్స్ లిస్ట్లో అన్నింటికన్నా పైన వుంటుంది. కథ రాయడానికి వాడు పడ్డ శ్రమ నాకు తెలుసు. కథ చదివినా తెలుస్తుంది. అయితే కథ నచ్చడానికి అది కాదు కారణం. ఒక రచయితగా నేను ఎప్పటికైనా ఇంత కష్టపడి, ఇంత అథెంటిగ్గా కథ రాయగలనా ఒక ఎడోరేషన్ కలిగింది.

మా పుస్తకం అనే మొహమాటం/స్వార్థం లేకుండా చెప్తున్నాచదవాల్సిన పుస్తకం, పర్సనల్ లైబ్రరీలో వుంచుకోవాల్సిన పుస్తకం.

 

కొత్త కథ 2018: సంపాదకులు – కుప్పిలి పద్మ, వెంకట్ సిద్దారెడ్డి

నా కథ కూడా వుండాల్సి వుండి ఏవో కారణాల వల్ల మిస్ అయిన పుస్తకం. దొరక్క చదవలేదు. ఇప్పుడు కుదిరింది. ఇరవై నాలుగు కథల పండగ. నింపాదిగా ఒక్కో కథ అనుభవిస్తూ చదివాను. కరుణపుష్పలత నవ్విందిఎంత బాగా రాశాడో. మాండలికాన్ని ఇంత సులభంగా చదవడం చాలా అరుదు. చైతన్య పింగళిబ్లూ వేల్సబ్జక్ట్ బోల్డ్. ఇంకా కావాలనిపించింది. రిషినక్షత్రాలు లేని నేల” – అసలు ఇలాంటి సెటప్ ఎలా కుదిరింది? ఇంత మంచి సెటప్ వచ్చిన తరువాత ఇంత మంచి కథ రాక ఏమౌతుంది? అయితే రచయిత టోన్ విషయంలో కన్సిస్టెన్సీ లేకపోవడం చిన్న మరక. కాశీట్రెండింగ్మంచి కథ. ఇంకా డెప్త్ వుంది సబ్జెక్ట్లో దిగితే. మహీ మళ్లీ అబ్బురపరిచాడునారింజ రంగు సిరామరకలురాసి. వీడి కథలన్నీ పుస్తకంగా వచ్చినప్పుడు మిస్టిక్/మ్యాజిక్ రియలిజం/ సర్రీయలిజం కథకి రిఫరెన్స్ బుక్ అవుతుంది (ఇప్పటిదాకా రమణజీవినో, కఠంనేని నో రెఫర్ చేస్తుంటా). మల్లిఇరానీ కేఫ్ఇంతకు ముందే చదివాను, మళ్ళీ చదివాను, మళ్ళీ వాడి పుస్తకంలో చదువుతా. అప్పుడు చెప్తా. అన్వర్కొన్ని బతుకులు ఇంతేభలే ఎత్తుగడ. చివరిదాకా గుప్పిట మూసి వుంచినా చివర్లో తెరిస్తే అది ఖాళీగా వుండటం నిరాశ పరిచింది. రెహానా, భూతం ముత్యాలు, అనిల్ అట్లూరి, పసునూరి రవీందర్ కథలు ఎక్కడో చదివిన న్యూస్ ఐటం కి కథా రూపాల్లా అనిపించాయి. అపర్ణ కథ వాట్సప్ ఫర్వాడ్ కథ లాంటిది (ముఖ్యంగా ముగింపు). మణి వడ్లామానినేను  ఎక్స్పెక్ట్ చెయ్యని కథ. బహుశా నేను ఆమె కథలు ఎక్కువగా చదవకపోవటం వల్ల కావచ్చు. భలే రాశారే అనిపించింది. రాజి రెడ్డి నన్ను చంపేశాడుగంగరాజం బిడ్డరాసి. అసలు ఇంత సొగసుగా వాక్యాన్ని రాయగలనా అని ఒకటే కుళ్లుకున్నా. ఇలాంటి భాష నా దగ్గరలేదే అని ఒకరోజంతా ఇంకో కథ జోలికి పోకుండా వున్నా. వెంకట్జ్వాలా గీతం” (ఈసారి తెలుగు టైటిల్ పెట్టావేం రాజా?) ఇలాంటి కథ నువ్వు రాయగలవనిరిసరక్షన్అప్పేడే తెలిసిపోయింది కదా? మళ్ళీ ఎందుకు రాశావ్? అనుకున్నా. మామూలుగా కథంతా ఏదో ఒక కొత్త ఫిలాసఫీకల్ థాట్ ఇచ్చే భగవంతం చివరి వాక్యంలో మాత్రమే పని చేశాడునాగరికతలో. అప్పుడది భగవంతం కథ ఎలాగౌతుంది? చాలా కాలం తరువాత అర్థం చేసుకోడానికి కష్టపడిన కథ సురేష్ “8త్ డయమెన్షన్” (ఇది కాప్లిమెంటే, కామెంట్ కాదు).

కొత్త కథ సిరీస్లో ఇది రెండోది. కొత్త కథ అని టైటిల్ పెట్టినందుకేమో వస్తు శిల్పాలలో కొత్తదనం ఎనభై శాతం వుంటోంది. అందుకోసమైనా నేను దీన్ని నా లైబ్రరీలో వుంచుకుంటాను. తెలుగు కథని పరిశీలిస్తున్న, ప్రాక్టీస్ చేస్తున్న వాళ్లు చదవాల్సిన కథలు వున్నాయి కాబట్టి చదవమనే రికమెండ్ చేస్తున్నా.

 

ఇరానీ కేఫ్ – వి. మల్లికార్జున్

తమ్ముడూ, నువ్వు వాక్యం పట్టుకున్నావు. వాక్యం నిన్ను పట్టుకుంది. నువ్వు రాయగలవు. రాయడం అనివార్యమైన ఉద్యోగం కూడా వుంది కాబట్టి, ఇంకా పదునెక్కుతావు. ఇది నీ మొదటి పుస్తకం కాబట్టి ఏదో గమ్యం చేరేందుకు వేసిన మొదటి అడుగులా చూస్తున్నా. కొత్తదారి కనిపెడతావన్న నమ్మకం కలుగుతోంది. ఏదో కొత్త గమ్యానికి కూడా తీసుకెళ్తావు.

చాలా వరకు కథలు “నేను, నా ప్రేమ” కథలు. అయినా బోర్ కొట్టకుండా, తనదైన శైలిలో రాసుకుంటూ వెళ్లాడు. “పాప్ కార్న్” కథ అలాగే మొదలైనా ముగింపు చదివిన తరువాత ఈ రచయిత స్పృహ వున్నవాడని గుర్తిస్తాం. పుస్తకంలో చివరి కథ “అర్బనూరు” దగ్గరకి వచ్చేసరికి ఒక కొత్త రచయిత పరిణామక్రమం కనపడుతోంది. అయితే ముందు ముందు “నేను, నా” కథల నుంచి బయటికొచ్చి రాస్తాడా లేకపోతే అందులో కొత్త సొగసుల్ని అందిస్తాడా  అనేది చూడాలి. అందుకే ఇతని రెండో పుస్తకం వచ్చేదాకా మొదటి పుస్తకం నా లైబ్రరీలో వుంచుకుంటా.

 

చిన్న పరిశ్రమలు – పెద్ద కథలు: డా. సోమరాజు సుశీల  

ఎందుకు ఈ నెల్లో ఈ పుస్తకం చదివాను? పెద్ద కారణం ఏం లేదు. చాలా కాలంగా వుంది చదవాలి చదవాలి అనుకుంటూ ఏళ్లు గడిపేశా. అనుకోకుండా అందుకున్నా.

ఎస్.ఎమ్.ఈ అనే చిన్న పరిశ్రమల గురించి (ఉద్యోగ రీత్యా) నాకు అవగాహన వుంది. చిన్న పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నట్లు బాకాలు వూదుకునే ప్రభుత్వాలు, బ్యాంకులు వాస్తవానికి చేసే అన్యాయాలు బహిరంగపరచాల్సిన అవసరం ఈ పుస్తకం నెరవేరుస్తుంది.

ఇంత సీరియస్ సబ్జెక్టా అని వెనకడు వెయ్యకండి. సుశీల గారి శైలి ఎంత ఆద్భుతంగా వుంటుందంటే, ఇంత డ్రై సబ్జెక్ట్ కథలు కూడా ముళ్లపూడి వెంకటరమణని చదివినంత సులభంగా చదివేయచ్చు. ఏదో ఫ్యామీలీ కామెడీ డ్రామా చెప్పినట్లుగా ఈ కథల్ని చెప్పారు. పైగా సొగసైన మాట విరుపులు, సామెతలు నడకని సులభతరం చేస్తాయి. బ్యాంక్ మేనజర్ ఆవిడ అత్త కొత్త కోడళ్లలా మాట్లాడుకున్నార్ట. ఇంత చిన్న వాక్యంలో ఎంత అర్థం అయిపోతుందో! ఇలా రాయడం నేర్చుకోవాలి. నేనూ, ఇంకా ఇప్పుడు రాస్తున్నవాళ్లు.

కాకపోతే అన్ని కథల్లో విషయం ఒకటే. చిన్న పరిశ్రమ, సర్కారు సీతకన్ను, బ్యాంకుల రుణ బాధలు. ఇవి కాకుండా ఇవే పరిశ్రమలలో వుండే ఇతర సమస్యలు (మార్కెటింగ్, కాంపెటీషన్, పీపుల్ మేనేజ్మెంట్ వంటివి) అక్కడక్కడ ప్రస్తావించారు కానీ, అవే ఒక కథా వస్తువుగా రాసే అవకాశం వుంది. ముందు ముందు ఏమైనా చేస్తారేమో చూడాలి

వస్తువు కోసం కాకపోయినా, శైలిని అధ్యయనం చెయ్యడం కోసం ఈ పుస్తకాన్ని ముళ్లపూడి పక్కనే వున్న పొత్తురి విజయలక్ష్మి గారి పక్కనే పెట్టుకుంటా!

You Might Also Like

Leave a Reply