‘ఒంటరి’గా మనగలవా మనిషీ!

వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి
************

ఒంటరి నవల చదివాక కలిగిన ఆలోచనలు ఒక నాలుగు ముక్కలు.

శీర్షిక

మిగతా ప్రపంచమంతా నా ఉపయోగార్థం సృష్టించబడింది అనేది నేటి మనిషి మదం. ఇంట్లో కుర్చీలు, మంచాలు, గిన్నెలు తన వాడుకకు ఉన్నట్టే ప్రపంచంలోని మిగతా జంతువులు, పక్షులు, మొక్కలు, చెట్లు అన్నీ తన కోసం ఉన్నాయనే మూర్ఖత్వంలో మనిషి అడవులు నరికి వ్యవసాయపు భూమి విస్తీర్ణం పెంచేశాడు. కొండలు పగలగొట్టి, చేతగాని చోట్ల డైనమైట్లు పెట్టి పగలగొట్టి తన సౌకర్యానికి రోడ్లు వేసుకున్నాడు. సహజమైనవీ, రాజులు తవ్వించినవీ చెరువులన్నిటినీ పూడ్పించి ఊర్లు కట్టుకున్నాడు. ఆ చెట్లను, ఆ చెరువులను, ఆ కొండలను ఇళ్ళుగా చేసుకొని జీవించిన జంతువులు, పక్షులు, కీటకాలు అన్నిటినీ తనకు తెలిసి కొంత, తెలియకుండా కొంత తరిమేస్తున్నాడు. అడవులు మాయమై తగినంత చోటు లేక, చెట్లు నీళ్ళూ మాయమై తిండి లేక ఎన్నో జంతువులు, పక్షులు, కీటకాలు కూడా మాయమై పోతుంటే…

అన్నీ ఒక్కొక్కటిగా భూమిని వదిలేస్తుంటే దాన్నంతటినీ తానే తానై ఆక్రమిస్తున్న మనుష్యజాతి రాన్రానూ ఒంటరిదైపోతోందా? పూర్తిగా ఒంటరిదై మనగలదా? మనజాలదు.

కానీ మనిషికి అది తెలీడం లేదు. ఇప్పటికే మానసికంగా ఒంటరైపోయాడు. ఇప్పుడు మిగతా ప్రకృతితో బంధం తెంచుకొని, అది తనకు సౌకర్యానికి మాత్రం కావాలికానీ, బంధనం కాకూడదని ఆలోచిస్తున్నాడు కాబట్టి మానసికంగా ఒంటరైపోయాడు. అదే ఈ రచయిత ఆవేదన. అందుకే “ఈ నవలకు ఒంటరి అనే శీర్షిక సరిగ్గా సరిపోయింది.”

ఈ నవల అంతా ‘మనిషి జాతి మిగతా కోట్ల జీవజాతులలో ఒకటి. అంతే కానీ ఒకే ఒక్కటి కాదు’ అని నిరూపిస్తూ సాగుతుంది. అది తెలుసుకోక మనిషి ఇప్పటికే మానసికంగా ఒంటరి అయిపోయాడని చెప్పడానికే ఒంటరి అనే శీర్షిక.

వస్తువు

రైతుజీవితం అంటే పొలం దున్ని విత్తనాలు చల్లి నీళ్ళు పెట్టి కావలి ఉండి పంట కోసుకునే ఒకని జీవితం కాదు. రైతుజీవితం అంటే రైతుగతజీవనమని. రైతుతనమని. పంట మీద వాలి మేసే పక్షులను, జంతువులను తరిమినా వాటితో పాటు తనకూ నాలుగు గింజలు మిగలాలనే , వాటి లాగే జీవనపోరాటమే. వాటి మీద ఆధిపత్యం కాదు. నీవెందుకు బ్రతకాలి? నేనెందుకు బ్రతకాలి? అలాగే అరికెలూ బ్రతకాలి. కుందేలూ బ్రతకాలి, తోడేలూ బ్రతకాలి, గబ్బిలమూ బ్రతకాలి, ఏళ్ళనాటి చెట్టు కూడా బ్రతకాలి. మనిషి మెదడు నిర్మాణము, శరీరనిర్మాణము ఇంకొంచెం సౌకర్యంగా ఉన్నాయి కాబట్టి మిగతావాటికి చేతనైతే సాయం చేయాలి. అంతే కానీ మిగతావి ఉంటే ఎంత, పోతే ఎంత మనం బ్రతకాలి అనుకున్నప్పుడే మానసికారోగ్యం దెబ్బతిన్నట్టే. ఇక వాటి ప్రాముఖ్యత సిటీలైఫ్ లో కొద్దికొద్దిగా పోయాక శారీరక ఆరోగ్యమూ దెబ్బతింటోంది. అప్పుడైనా ఆలోచిస్తాడా మనిషి? అప్పుడైనా సౌకర్యాలకోసం ఎగబడి, అవసరాలు తీర్చే వాటిని ఎక్కడ వదిలేశామో గుర్తిస్తాడా? కథావస్తువుగా తీసుకున్న ఈ అంశం, ఆలోచన ఎప్పటికీ ప్రయోజనకరమైనది, సృష్టికంతా.

శిల్పం

అటువంటి రైతుగత జీవనాన్ని ఇందులో అద్దం పట్టి చూపించారు. ఇంకెవరో అన్నట్టు ఇది డాక్యుమెంటరీలా నాకు అనిపించలేదు. నవల అంటే వ్యక్తికి జీవితంతో/ ఇతరులతో/ సమాజంతో మొదలయ్యే/అంతమయ్యే సంఘర్షణాక్రమం/సంబద్ధతాక్రమం గురించీ, ఆ ప్రక్రియలోని మౌలికసూత్రాలను నిర్వచించడం/ఖండించడం అయితే అదేపని ఈ నవలలో వ్యక్తికి ప్రకృతితోనూ, వ్యక్తిప్రకృతి(తనస్వభావం)తోనూ జరిగింది. ఈ విషయం ఎప్పుడు అర్థమౌతుందంటే మనకందరికీ అలవాటైన ఆ మానసిక ఒంటరితనాన్ని వదిలించుకున్నప్పుడే జరుగుతుంది. కుటుంబం అంటే మనిషి-తన బంధుత్వాలు మాత్రమే కాదు, సమాజం అంటే మనిషి – సాటి మనుషులు మాత్రమే కాదు. వేలకోట్ల జంతువులు, పక్షులు, చెట్లతో కలిసి ఉన్న విస్తృతకుటుంబంలో, విస్తృత సమాజంలో మనిషికి ఆ ఇతరప్రాణికోటి సభ్యులతో ఉన్న అనుబంధాన్ని, పోతున్న అనుబంధాన్ని, మనిషికి ఆ ఇతర ప్రాణికోటిసభ్యుల మధ్య సంఘర్షణ గురించి, ఒకరిమీద ఒకరి ఆధిపత్యాన్ని, ఓటమిగెలుపులను అన్నిటినీ చిత్రించింది, తన లోపలి స్వభావం యొక్క బలం/బలహీనత దీన్నంతటినీ ఎలా ప్రభావితం చేస్తున్నాయో చూపించింది. నాకు తెలిసిన పరిమిత జ్ఞానంలో నవలా ప్రక్రియకు చెందిన శిల్పలక్షణాలు చక్కగా అమిరాయి.

ముగింపు
ఇందులో ముగింపు ఇదీ అని రచయిత చెప్పలేదు. ఓపెన్ ఎండ్ స్టైల్ . ఎందుకంటే కొత్తగా తెలుస్తున్నా, నాటి మూలాల ఆలోచనలకు ఇది ఆరంభం. అంతం కాదు. తర్వాత ఏమి జరుగుతుంది అని ఇదమిత్థంగా చెప్పలేము. తెలుసుకున్న మంచి విషయాలన్నిటినీ మనము ఆచరణలో పెట్టగలమా లేదా అన్నది కాలగతిలో తెలుస్తుంది. అందులో కథాపాత్రల మీద మాత్రమే కాదు పాఠకులు, మొత్తం మానవసమాజం అంతటిమీదా సరైన నిర్ణయాలు తీసుకునే బాధ్యత ఉంది. ఎందుకంటే ఇక్కడ కనిపిస్తున్నది కల్పన కాదు. యథార్థజీవనగతి నుంచి గ్రహించి చిత్రించిన దృశ్యం.

నవలలోని ముఖ్యమైన అంశాలు

తను ఆకలి, నిద్ర వంటి సహజమైన లక్షణాలనుంచి దూరం జరిగిన వైనాన్ని కథాపాత్ర గుర్తించడం. ఇది కొందరికి సిల్లీగా, ప్రాధాన్యత లేనిదిగా అనిపించవచ్చు. కానీ ఇది ముఖ్యమైనది. ఇది ఎంత పెద్ద సమస్యగా తయారైందో ఆకలిటానిక్కులు, నిద్రమాత్రల కోట్ల రూపాయల స్థాయి వ్యాపారాలవల్ల మనం గమనించవచ్చు. కష్టపడకుండా ప్రతీదీ జరగాలనే మన ఆలోచన, దురాశ మనకు సహజంగా ఇవన్నీ కలగని స్థితికి తీసుకువచ్చింది. దీన్ని సరిదిద్దుకోవడం ఇక జరిగే పనిగా తోచడం లేదు. కానీ ఈ ఆకలి లేని వర్గానికే వందల రకాల ముఖ్యాహారాలు, చిరుతిండ్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ టైమ్ పాస్ ఆహారవ్యాపారమూ అదే స్థాయిలో జరుగుతోంది.

మనిషికీ మనిషికీ మధ్య సహజమైన రీతిలో బంధం ఏర్పడి చివరికి అది స్త్రీ పురుష సహజంగా మారడాన్ని ఎక్కడా ఏ అతిశయోక్తులూ లేకుండా చూపించబడింది. ఇది ఈ కథకు సాధ్యపడినట్టు ప్రతికథకూ సాధ్యమో కాదో గానీ చిన్న బలహీనతను గ్లోరిఫై చేస్తూ చూపించే చాలా రచనలను చూసి చూసి ఇది రిలీఫ్ గా అనిపించింది.

ఇక జంతువులు, చెట్లు, కార్తెలు ఎన్ని రకాలుంటాయో ఈ రచయిత సాధికారికంగా ప్రతి రచనలోనూ పరిచయం చేయగలరు. భాగవతంలో చెట్ల వర్ణన తర్వాత అన్ని పేర్లు, వివరాలు నేనీ రచయిత రచనల్లోనే చదివాను. స్వంతంగా ప్రకృతిలోని వీటిన్నటితో రచయితకున్న అనుబంధం పాఠకులకు కూడా తెలుస్తుంది. నాలుగ్గోడల మధ్య కూర్చుని నాలా మీలా పుస్తకాలు చదివి తెలుసుకున్న జ్ఞానం కాదు కాబట్టి వీటన్నిటిని గురించి చదువుతుంటే విసుగు రాకుండా ఆసక్తి కలిగించేలా ఈ వివరాలుంటాయి.

చినుకుల సవ్వడి, ఒక్కవాన చాలు, ఇంకా కొన్ని కవితలు చదివానీ రచయితవి. ప్రతిరచనలోనూ మట్టి, వాన, జీవం, ఆశాదృక్పథాలు అప్యాయంగా పలుకరిస్తాయి. రచనల్లో చేయితిరిగిన ఈ రచయిత చినుకుల సవ్వడిని అత్యంత నేర్పుగా వినిపిస్తూ ఆ ఊళ్ళోకి , ఆ జీవితాల్లోకి మనలను తీసికెళ్ళి వదిలేస్తారు. రచయిత కనబడడం ఉండదు. కానీ ఈ ఒంటరి నవల లో చాలా చోట్ల రచయిత కనిపించినట్లు ఉంటుంది. వ్యాఖ్యానం చేయడం తెలుస్తుంది. ఇది మైనస్ పాయింటే అని ఒప్పుకోవాలి. కానీ ఈ కథలో ఉన్న విషయవస్తువుకు మన నాగరిక ప్రపంచం చాలా దూరం జరిగిపోయింది. కాబట్టి చాలా విషయాలు రచయిత వాచ్యంగా చెప్పవలసి వచ్చింది అనిపించింది. చినుకుల సవ్వడి అనుకోకుండా వచ్చిన అందమైన కలవంటిదైతే, ఒంటరి – ఈ రోజు ఈ కల కనాలి అనుకుని కన్న కల.

ఈ కథలో పాత్రలకు బలాలు, బలహీనతలు ఉన్నాయి. గ్రామం అనగానే అందరూ ఆదర్శవంతమైన వారని, నాగరీకులంతా దుర్మార్గులని చిత్రించే అసహజత లేదు. ఒక స్థిరమైన దృక్పథం ఉన్న పాత్ర గానీ, అందుకు వ్యతిరేకమైన పాత్రగానీ ప్రధానంగా తీసుకొని భిన్నమైన కథలు అల్లబడుతుంటాయి. ఇదీ అలాంటి ఒక కథ. ఈ నవలలోని మిగతా పాత్రలలో మంచి చెడులు, లోపాలు కనిపించకుండా ఏం లేవు. ఒక్క మంచి పాత్రతో పోల్చుకొని అందరూ అలా ఉంటే ఇన్ని వైషమ్యాలు ఉండేవా అనో, ఒక చెడ్డ పాత్రతో పోల్చుకొని అందరూ అలా ఉన్నారేమో బ్రతికేదెలా అనో వ్యాఖ్యానిస్తే తొందరపాటు అవుతుంది.

రచిస్తున్న విషయవస్తువు పైన తగినంత స్వీయ అవగాహనతో, సాధికారికంగా వ్రాయగలుగుతున్న నేటి కొద్దిమంది రచయితల్లో సన్నపురెడ్డి వేంకటరామిరెడ్డి గారొకరు అని నా అనుకోలు.

You Might Also Like

One Comment

  1. లక్ష్మీదేవి

    ఎక్కువ శాతం ఆధునిక మానవులకు హేండ్ బాగ్ తో , మెట్రో ట్రైన్ తో, తారు రోడ్ తో అనుబంధం అర్థమౌతుంది కానీ ప్రకృతితో అనుబంధం అర్థం కావడం కష్టం. 🙂

Leave a Reply