నా 2018 పుస్తక పఠనం

గత ఏడాది ఉద్యోగం, దేశం మారినందువల్ల ఆఫీసుకీ ఇంటికీ దూరం పెరిగి, కొంత పుస్తక పఠనం పెరిగింది అనిపించింది. ఇక్కడా దగ్గర్లోనే ఓ పబ్లిక్ లైబ్రరీ ఉండడం వల్ల కొత్త దేశం తాలూకా రచనలనే కాక, ఇతరత్రా కూడా కొత్త రచయితల గురించి తెలిసింది. అయితే తెలుగు పుస్తకాలు మట్టుకు దాదాపు అసలు చదవలేదనే చెప్పాలి. ఈ ఏడాది అది మారుతుందని ఆశిస్తున్నాను. గత ఏడాది చదివిన పుస్తకాల గురించి ఈ‌ టపా.

నవలలు
Saraswathi’s Intelligence – Vamsee Juluri: ఈ ఏడాది చదివిన ఉత్తమమైన పుస్తకాల్లో ఒకటి. రామాయణ కాలం నాటి వానర జాతి పాత్రలు ప్రధానంగా రాసిన నవల. ఒక ట్రైలజీలో భాగం. మిగితా భాగాలింకా వచ్చినట్లు లేవు. బాగా ఆసక్తికరంగా ఉంది.

Caged Eagles – Eric Walters: రెండో‌ ప్రపంచ యుద్ధ కాలంలో కెనడాలోని జపనీస్ వాళ్ళ కుటుంబాల నేపథ్యంలో అల్లిన యంగ్ అడల్ట్ నవల. నన్ను చాలా ఆకట్టుకుంది. దీని గురించి నేను గతంలో రాసిన పరిచయం ఇక్కడ.

Cat’s Cradle – Kurt Vonnegut: బాగా ఆసక్తికరంగా అనిపించింది. అక్కడక్కడా కొంచెం అంతరార్థం ఏమిటో అర్థం కాలేదు కానీ, మంచి వ్యంగ్యం.

A Wrinkle in Time – Madeleine L’Engle: ఇటీవల కాలంలో సినిమాగా వచ్చిన యాభై ఏళ్ళ నాటి నవల. పిల్లల కోసం రాసినదే అయినా బానే ఉంది. అయితే, తక్కిన వాటితో పోలిస్తే అంత నచ్చలేదు.

కవిత్వం
She walks in beauty – Caroline Kennedy: జాన్ ఎఫ్.కెనడీ కూతురు ఈమె. అలా అని ఆమె ఎక్కడా పరిచయం చేసుకోలేదు, నాకు తర్వాత తెలిసింది. పుస్తకం ఆమె జీవితంలో వివిధ సందర్భాల్లో కదిలించిన కవిత్వం యొక్క సంకలనం. దానికి ఆవిడ అందమైన వ్యాఖ్యానం తోడై, కవిత్వమంటే పారిపోయే నన్ను కూడా చదివించింది. ఈ స్పూర్తితో ఒకటీ అరా కవిత్వం చదవడం ప్రయత్నించాను కానీ ఎక్కలేదు. ఈ పుస్తకం గురించి నేను రాసిన పరిచయం ఇక్కడ.

కథలు

Mohana Swamy – Vasudhendra: కొత్తగా అనిపించిన కథలు. చాలామటుకు బెంగళూరు పరిసర ప్రాంతాలలోని ఒక గే యువకుడు, అతని స్నేహాలు, సంబంధాల చుట్టూ తిరిగిన కథలు. అతని ప్రవర్తన కొన్ని చోట్ల creepy గా అనిపించింది. అతనికి consent అన్న పదానికి అర్థమైనా తెలుసా? అనిపించిన సందర్భాలు ఉన్నాయి కథలు చదువుతున్నప్పుడు. మగవాడు కనుక ఇలా రాసి బట్ట కట్టాడు. ఒక లెస్బియన్ ఆవిడ రాస్తే ఏమయ్యేది? అనీ అనిపించింది. కానీ, ఆపకుండా చదివించిన కథలు. ఆలోచింపజేసిన కథలు ఇలాంటి కథలు రావడం అరుదు కనుక నాకు పరిచయం ఉన్న గే/లెస్బియన్ స్నేహితులు అందరికీ చెప్పి చదివించాను.

On the nature of human romantic interaction – Karl Iagnemma: కొంచెం కొత్తగా ఉన్న కథలు. గనుల్లో పని చేసే ఓ సిద్ధాంతకర్త, గణిత శాస్త్రజ్ఞుల ప్రేమకథ, ఒక phrenologist, ఇలా ఇదివరలో చదవని తరహా పాత్రలతో, కొత్తగా తోచిన వచనంతో నేను బాగా ఎంజాయ్ చేసాను చాలా మటుకు. అయితే, మళ్ళీ మళ్ళీ చదివే ఆసక్తి మట్టుకు లేదు. రచయిత రొబోటిక్స్ రంగం లో‌ శాస్త్రవేత్త, స్వయం చాలిత వాహనాలను నిర్మించే కంపెనీ న్యూటానమీ స్థాపకుల్లో ఒకడు.

The collected stories of Philip K. Dick: – ఈయన కథలు అంతకు ముందు ఏడాది లో కొన్ని చదివి, ఆసక్తికరంగా అనిపించి ఇది చదివాను. కొన్ని కథలు బాగున్నాయి. అన్ని కథల్లోనూ ఏదో ఒక రకమైన weirdness ఉంది. క్లిష్టత కూడా ఉంది.

War Dances by Sherman Alexie
The Lone Ranger and Tronto fist fight to Heaven by Sherman Alexie

– ఇతను అమెరికాకు చెందిన నేటివ్ రచయిత. కథలూ వారి ప్రస్తుత జీవిత పరిస్థితులను స్పృశించేవే. వచనం, వ్యంగ్యం, హాస్యం బాగున్నాయి. కథలన్నీ బాగున్నాయనలేను కానీ, మంచి పుస్తకాలే రెండూ!

గ్రాఫిక్ కథలు, నవలలు, జీవిత చరిత్రలు వగైరా
Sabrina – Nick Drnaso: మాన్ బుకర్ ప్రైజుకి నామినేట్ అయిన తొలి గ్రాఫిక్ నవల. కథంతా ఒకావిడ తప్పిపోవడం, ఆవిడ కుటుంబ సభ్యులపై దాని ప్రభావం, మీడియా ఆ సంఘటన గురించి స్పందించడం – వీటి చుట్టూ‌ తిరుగుతుంది. సాధారణంగా నేను చదివిన గ్రాఫిక్ పుస్తకాలతో పోలిస్తే ఇది చాలా texty గా ఉంది. అంత విపరీతంగా నచ్చలేదు కానీ, అదొక ప్రయోగం. ఒకసారి చదివేందుకు బాగుంది.

Feynmann – Jim Ottaviani: Richard Feynmann జీవిత చరిత్రని గ్రాఫిక్ నవలగా చేశారు. గొప్పగా ఉంది. ఆయనే ఆయన గురించి రాసుకుని, గీసుకున్నట్లు ఉంది!! కొన్ని చోట్ల ఆ ఫిజిక్సు వివరాలు సరిగా అర్థం కాలేదు కానీ, అది వదిలేస్తే, అద్భుతమైన ప్రయత్నం.

నాటకాలు
The Men in White – Anosh Irani: ఇక్కడ లోకల్ మీడియాలో ఒక్కటే ఊదరగొట్టారు ఆహా, ఓహో అని. అందుకని చదివాను కానీ, ఇలా పూర్తిగా ఇతర ethnic నేపథ్యాలు ఉన్న నాటకాలు రావడం బహుశా ఇక్కడ అరుదేమో – నాటకం మాత్రం సాధారణంగా ఉంది. సంభాషణలూ అంతే.

ఆత్మకథలు, జీవిత చరిత్రలు

ఈ ఏడాది నలుగురు క్రీడాకారుల ఆత్మకథలు చదివాను (మూడు క్రికెట్, ఒకటి టెన్నిస్).
281 and Beyond – VVS Laxman: ఇందులో లక్ష్మణ్ నేపథ్యం, ఆలోచనా విధానం గురించి చదువుతూంటే బాగా కనెక్ట్ అయాను (మిగితా వాళ్ళ నేపథ్యాలు కొంచెం హై-లెవెల్లో అనిపించాయి లెండి నాకు!). అయితే, ఒక్కోచోట మరీ విపరీతమైన వర్ణన ఉండింది ఆట గురించి. మొత్తానికి మంచి పుస్తకమనే చెప్పాలి.

A century is not enough – Saurav Ganguly: గంగూలీ కథలో వ్యక్తిగతాల గురించి ఎక్కువ లేదు కానీ, ఆటగాడిగా అనుభవాలు, నాయకత్వం గురించి, ప్రొఫెషనల్ ఆటగాడి ఆలోచనల గురించి చాలా బాగా రాశాడనిపించింది.

Imperfect – Sanjay Manjrekar: గంగూలీ, లక్ష్మణ్ సరే గానీ, అసలు మంజ్రేకర్ ఆత్మకథ చదవాలని ఎలా అనిపించింది? అని కొంతమంది అడిగారు నన్ను. కొంతకాలం క్రితం శారద ఉగ్ర ఈఎస్పీఎన్ క్రిక్ ఇంఫో వెబ్సైటులో రాసిన “All Indian cricketers should write books like this” అన్న వ్యాసం నన్ను ఈ పుస్తకాన్ని చదివించింది. లక్ష్మణ్ పుస్తకం చదువుతున్నప్పుడు మొదట్లో ఈ మూడింట్లోకి ఇది బెస్ట్ అనిపించింది కానీ, చివరికి వచ్చేసరికి మంజ్రేకర్ ది బెస్ట్ అనిపించింది. తన గురించి తానే అంత విమర్శించుకున్న ఆత్మకథలు, అలాగే నిజాయితీ గలవి అరుదే.

Open – Andre Agassi: చాలా నచ్చిన పుస్తకం. ఇది కూడా చాలా నిజాయితీతో రాసినట్లు అనిపించింది. ఈ పుస్తకం గురించి నేను గతంలో రాసిన వ్యాసం ఇక్కడ.

10 Faces of a Crazy Mind – Shivarama Karanth: చాలా ఏళ్ళుగా వెదుకుతూంటే మొత్తానికి ఈ ఏడాది చదవగలిగాను. కారంత్ రచనా ప్రపంచంలాగే ఆయన జీవితం కూడా విభిన్నమైనది. ఈ పుస్తకం గురించి నేను రాసిన పరిచయం ఇక్కడ.

The Life and Times of a Thunderbolt Kid – Bill Bryson: ఈయన గత పుస్తకాలు చదివి పెంచుకున్న అభిమానం వల్లా, ఆయన చిన్నతనం అంతా నేను మొన్న మొన్నటి వరకూ నివసించిన ప్రాంతంలో జరిగినందువల్లా చదివాను. అక్కడక్కడా బోరు కొట్టింది కానీ, ఓ యాభై ఏళ్ళ నాటి డె మొయిన్ నగరం, అప్పటి పరిస్థితుల గురించి చదవడం ఆసక్తికరంగా అనిపించింది.

When Breath Becomes Air – Paul Kalanithi: ఆమధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన పుస్తకం. డాక్టరైన రచయిత క్యాంసర్ బారిన పడి, చివరి రోజుల్లో తన అనుభవాలు, ఆలోచనలూ పంచుకుంటూ రాసినది. ఎందుకో గానీ, అతని వచనం నచ్చినంతగా పుస్తకంలోని వస్తువు ఆకట్టుకోలేదు. ఎప్పుడో పదేళ్ళ క్రితం చదివిన Randy Pausch పుస్తకం “The Last lecture” పదే పదే గుర్తొచ్చి దానితో పోల్చుకుని నిరాశ పడ్డాను.

The Woman who smashed the codes – Jason Fagone: ప్రపంచ యుద్ధ కాలం నాటి ప్రముఖ crytographer Elizabeth Friedman జీవిత కథ. ఆమె, ఆవిడ భర్తా ఇద్దరూ అప్పటి ప్రముఖ code breakers. ఎన్నో పుస్తకాలు కూడా రాశారు. ఇద్దరూ సమఉజ్జీలే. అయితే భర్త పేరు తెలిసినంతగా ఈవిడ పేరు తెలియదు బయట ప్రపంచానికి. ఈ పుస్తకం ఆవిడ కథ. గొప్ప స్పూర్తివంతమైన కథ. అయితే, రచయిత ఒక్కోచోట నాటకీయతకు ఇచ్చిన ప్రాధాన్యం విషయానికి ఇవ్వకపోడం వల్ల పేజీలకి పేజీలు సా…గు….తూ ఉంటాయి. అయినా తప్పక చదవాల్సిన పుస్తకం!

The Autobiography of a Winnebago Indian – Paul Radin: ఒక నేటివ్ అమెరికన్ తెగ కి చెందిన వ్యక్తి ఆత్మకథ. ఆయన చెబుతూంటే రికార్డు చేసి తరువాత ఈ రచయిత తన వ్యాఖ్యానం జోడించి వేసిన పుస్తకం. 19వ శతాబ్దపు చివర్లో పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో వాళ్ళ జీవితాలు మారడం, క్రైస్తవం, వాళ్ళ ఆచారాలు కలిపిన ఒక మతం ఏర్పడ్డం, వాళ్ళ జీవన విధానం, సంప్రదాయాలు – అంతా వేరే ఒక ప్రపంచం. రచయిత వ్యాఖ్యానం లేకుంటే కొంచెం కష్టమయ్యేది కానీ, పుస్తకం రచయితగా ఈయన పేరు ఉండి, అసలు మనిషి పేరు ఉండకపోవడం విడ్డూరమే నాకు.

నా పొగరు మిమ్మల్ని గాయపరచిందా, అయితే సంతోషం – ఎం. ఎఫ్. గోపీనాథ్: ఈ పుస్తకం ఖమ్మంలోని “స్పందన హాస్పిటల్” నిర్వాహకులు, ప్రముఖ కార్డియాలజిస్టు అయిన డాక్టర్ ఎం.ఎఫ్.గోపీనాథ్ గారి ఆత్మకథ. ఒక చిన్న పల్లెటూరిలో (ఆయన “పచ్చి పల్లెటూరు” అని వర్ణించారు), ఒక పెద్ద, పేద దళిత కుటుంబంలో పుట్టి తాను కార్డియాలజిస్టుగా స్థిరపడేవరకు జీవిత విశేషాలను ఇందులో రాశారు. బాగుంది. ఈ పుస్తకం గురించి ఒక పరిచయం ఇక్కడ.

My father Balaiah – Y.B. Satyanarayana: ఈ పుస్తకం ఒక దళిత కుటుంబం తమ కులవృత్తిని, పూర్వీకుల గ్రామాన్ని వదిలిపెట్టి, ఉద్యోగాలు, చదువుల బాట పట్టి క్రమంగా జీవన విధానాన్ని మార్చుకున్న వైనాన్ని గ్రంథస్తం చేసింది. రచయిత మూడు-నాలుగు తరాల తమ కుటుంబ కథని తన తండ్రి ప్రధాన పాత్రగా చెప్పారు. ఈ పుస్తకం గురించి నేను రాసిన పరిచయం ఇక్కడ.

The Absolutely True Diary of a Part-Time Indian – Sherman Alexie: ఇది పూర్తిగా ఆత్మకథా? ఆత్మకథాత్మక నవలా? అన్న విషయంలో నా సందేహాలు నాకున్నాయి కానీ, అలెక్సీ గారి ప్రత్యేకమైన శైలిలో ఆయన చిన్నతనం గురించీ, ఒక నేటివ్ అమెరికన్ రిజర్వేషంలో జీవితం గురించీ రాసుకున్నారు. బాగుంది.

Everything Happens for a Reason and Other Lies I’ve Loved – Kate Bowler: బిల్ గేట్స్ సమ్మర్ రీడ్స్ లో రికమెండ్ చేసిన పుస్తకం. ముప్పైలలో ఉన్న క్రిస్టియన్ మతాన్ని అధ్యయనం చేసే ప్రొఫెసర్ కేట్ బౌలర్ కి స్టేజ్ ౪ క్యాన్సర్ అని తెలిశాక ఆమె అనుభవాలు, ఆలోచనల సంకలనం ఈ పుస్తకం. ఈ పుస్తకం గురించి గతంలో రాసిన పరిచయం ఇక్కడ.

వ్యాసాలు, చరిత్ర వగైరా
తెలుగులో కొత్త మాటలు – వేమూరి వెంకటేశ్వరరావు: శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి వల్ల కొత్త కొత్త అంశాలకి పదాలు ఆంగ్లంలో చేరాయి. ఇలాగే తెలుగు కూడా వాడాలంటే వీటికంతా తెలుగు పదాలు కనిపెట్టాల్సిన అవసరం వస్తుంది. ఈ పుస్తకంలో రావు గారు ఇలా పదాలు కనిపెట్టడం గురించి ఆయన అనుభవాలు, సూచనలూ అందించారు. ఈ పుస్తకం గురించి గతంలో రాసిన పరిచయం ఇక్కడ.

The Promise of Canada – Charlotte Gray: కెనడా ఏర్పడి 150 ఏళ్ళైన సందర్భంగా 2017లో వచ్చిన పుస్తకం ఇది. కెనడా చరిత్రలో వివిధ అంశాలలో ముఖ్యులు అనదగ్గ కొందరిని ఎంచుకుని, వాళ్ళ జీవితాలని పరిచయం చేయడం ద్వారా ఆ దేశాన్ని పరిచయం చేసిన పుస్తకం. నా పరిచయం ఇక్కడ.

So, You Want to Be Canadian: All About the Most Fascinating People in the World and the Magical Place They Call Home – Kerry Colburn: కెనడా దేశపు ప్రత్యేక సంప్రదాయాల గురించి, భాషా విశేషాల గురించి, ఇతర అంశాల గురించి చిన్న చిన్న వ్యాసాలు – బొమ్మల రూపంలో వేసిన చిన్న సరదా పుస్తకం.

A Number of Things: Stories of Canada Told Through Fifty Objects – Jane Urquhart: కెనడా దేశ చరిత్రను తల్చుకుంటూ, ఓ యాభై దైనందిన జీవితంలో కనబడే వస్తువులని తీసుకుని (ఉదా: ఒక టోపీ, ఒక బుట్ట, ఇలా అనమాట) చరిత్రలో ప్రముఖంగా నిలిచిన అలాంటి వస్తువులను (ఉదా: ఒక ప్రముఖుడి తుపాకీ, ఒక జాతి వారు వాడే సంచీ ఇలా) గురించి చెబుతూ, దేశాన్ని పరిచయం చేయడం. నాకు ఈ ఐడియా నచ్చింది. stories of Telugu told in 50 objects టైపు ఎవరన్నా రాస్తే చూడాలని ఉంది.

The Idol Thief – S. Vijay Kumar: భారతదేశం నుండి పురాతన విగ్రహాలు స్మగుల్ చేసి పాశ్చాత్య దేశాల్లో మ్యూజియంలకి అమ్మే ఓ వ్యాపారస్తుడిని పట్టుకున్న వైనం వివరించిన పుస్తకం. రచయిత పోలీసు, ఆర్టు రెండు రంగాలకీ బైటివాడైనా చేసిన పరిశోధనలు గొప్పవి. నా పరిచయం ఇక్కడ.

Further Adventures of a Blue-eyed Ojibwe – Drew Hayden Taylor: రచయిత వివిధ సందర్భాల్లో రాసిన వ్యాసాల సంకలనం. ప్రధానంగా కెనడాకు చెందిన ఆదివాసీల గురించి, ఆ జాతి మనిషిగా ఆయన అనుభవాల గురించి. కొన్ని వ్యాసాలకి నాకు సందర్భం అదీ అర్థం కాలేదు, కానీ బానే ఉన్నాయి చదివేందుకు.

Trail of tears – the rise and fall of the Cherokhee Nation by John Ehle: ఇది అమెరికా లోని ఆదివాసీల చరిత్రలో ఒక ముఖ్య ఘట్టం గురించి. బాగా బలంగా తాకింది.

City of Victory – Ratnakar Sadasyula: విజయనగర సామ్రాజ్యపు చరిత్ర. స్కూలు పాఠాల్లో, సినిమాల్లో చూసింది తప్ప నాకు వేరే ఏం తెలియదు కనుక పుస్తకమంతా కొత్త కొత్త కథలు తెలిశాయి.

Made in America – Bill Bryson: అమెరికన్ ఇంగ్లీషు చరిత్ర. సగం దాకా చాలా అసక్తికరంగా అనిపించింది గానీ, ఆ తరువాత మరీ వివరంగా అనిపించి బోరు కొట్టేసింది లాస్టుకి.

I’d rather be reading – Guinevere de la Mare : పుస్తకాలకి సంబంధించిన బోలెడు బొమ్మలతో‌, అక్కడక్కడా చిన్న చిన్న వ్యాసాలతో కూడిన చిన్న పుస్తకం ఇది. ఆర్టు వర్క్ చాలా బాగుంది.

సాంకేతికం

Indian theories of meaning – K. Kunjunni Raja: ఇది కొద్ది కొద్దిగా చదువుతూ వస్తున్నాను గత ఒకటిన్నరేళ్ళుగా. భారతీయ భాషావేత్తల పరిశోధనల గురించి లోతుగా చర్చించారు. అంతా నాకర్థమైంది అనను కానీ, కొన్ని అప్పటి ఆలోచనలు నేటి పరిశోధనలతో పోల్చుకుని ఆశ్చర్యపడ్డాను. భవిష్యత్తులో కూడా రిఫరెంసు గా పనికి రావొచ్చు.

Data Jujitsu – D.J. Patil
Building Data Science Teams – D.J.Patil
Data Driven – D.J. Patil

– మూడూ చిన్న చిన్న పుస్తకాలు. టెక్నాలజీ రంగంలో Data Science సమూహాల నిర్వహణ గురించి. ఉద్యోగరిత్యా వచ్చిన కొత్త బాధ్యతల వల్ల చదివాను. ఉపయోగకరమైన పుస్తకాలు.

Grokking Deep Learning – Andrew Trask
గత పదేళ్ళలో ఈ అంశం మీద పుస్తకాలు, పరిశోధనా వ్యాసాలు, ట్యుటోరియళ్ళు, బ్లాగు పోస్టులు రకరకాలవి అనేకం చదివాను గాని, అవన్నీ పరిశోధకుల కోసం రాసినట్లు అనిపించాయి. ఇదొక్క పుస్తకమే ఇప్పటిదాకా ఇంజనీర్ల కోసం రాసినట్లు అనిపించింది నాకు.

చదవలేక చేతులెత్తేసినవి
Full metal indigiqueer: poems – Joshua Whitehead: ఇది కూడా లోకల్ పత్రికల్లో ఊదరగొట్టారు. నాకైతే ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. ఏదో విభిన్నమైన ప్రయత్నమనడంలో సందేహం లేదు గానీ, నాకు మట్టుకు అర్థం కాలేదంతే.

You Might Also Like

3 Comments

  1. shiva

    thanks madam సౌమ్య

  2. S. Narayanaswamy

    You certainly win the prize for variety ☺️

    1. సౌమ్య

      haha, thanks!

Leave a Reply