పుస్తక పఠనం – 2018

వ్యాసకర్త: Amidhepuram Sudheer
********************

గత సంవత్సరం, మొత్తం 49 పుస్తకాలు చదివాను.
ఇందులో నవలలు ఉన్నాయి, కథల సంపుటిలు ఉన్నాయి, ట్రావెలాగ్లు ఉన్నాయి, అనువాదాలు ఉన్నాయి.

గత సంవత్సరం నేను చదివిన పుస్తకాలన్నీ ఒకసారి తిరగేస్తే ఆశ్చర్యకరంగా మల్లాది వెంకట కృష్ణమూర్తి గారి పుస్తకాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయన రాసిన నవలలు, కథల పుస్తకాలు కలిపి మొత్తం పదిహేను పుస్తకాలు చదివాను. ఆయన రచనలతో ఉన్న సౌకర్యం ఏమిటంటే అలా అలా ఆహ్లాదంగా చదువుకుంటూ వెళ్లిపోవచ్చు. అందుకే పాత పుస్తకాల షాపులో ఆయన పుస్తకాలు ఏవి కనపడ్డా కొని తేవటం అలవాటు. అందుకే ఆయన పుస్తకాలే ఎక్కువగా చదివాను.

ఇవి కాకుండా చిన్నప్పుడు ఎప్పుడో చదివిన పుస్తకాలు కొన్ని పాత పుస్తకాల షాప్లలో వెతికి వెతికి సంపాదించి మరీ చదవగలిగాను. నిజంగా చాలా ఆనందమేసింది. వాటిలో ముఖ్యమైనవి నండూరి రామ్మోహనరావు గారు రాసిన Huckleberry finn, టామ్సాయర్ మరియు విచిత్ర వ్యక్తి అనే మూడు పుస్తకాలు. ముఖ్యంగా విచిత్ర వ్యక్తి పుస్తకం గురించి ఎంతగా వెతికానో చెప్పలేను. చిట్ట చివరికి దాన్ని సంపాదించగలిగాను. ఈ పుస్తకాలు మళ్లీ చదువుతుంటే చిన్నప్పుడు కలిగిన ఆనందం కంటే ఎక్కువ ఆనందం కలిగింది. ఈ పుస్తకాలు మరో ముద్రణ పొందితే బాగుంటుంది. కనీసం డిజిటల్ రూపంలో అయినా దొరికితే చాలా బాగుంటుంది.

గత సంవత్సరం నా విషయంలో జరిగిన మరొక ఆశ్చర్య, ఆనందకర విషయం ఏమిటంటే: నేను చిన్నప్పుడు ఎప్పుడో ఆంధ్రజ్యోతి వారపత్రికలోనో లేక మరో వారపత్రికలోనో చదివిన ఒక సీరియల్ కథ నాకు జ్ఞాపకం వచ్చింది. కానీ ఆ సీరియల్ పేరు గుర్తు లేదు. ఆ సీరియల్ పుస్తకంగా వచ్చిందా లేదా దాని రచయిత ఎవరు అన్న విషయాలు ఏవీ తెలియవు కానీ ఆ పుస్తకం మళ్ళీ చదవాలి అన్న కోరిక కలిగింది. అలాంటి సమయంలో, చాలా యాదృచ్చికంగా ఈ పుస్తకం గురించి మరో పుస్తకంలో నేను చదివాను. అప్పుడు తెలిసింది నేను వెతుకుతున్న సీరియల్ పేరు ‘ఈ గంటకు 50 నిమిషాలే’. చాలా రోజులు వెతికిన తర్వాత అసలు ఈ పుస్తకం దొరకదు అని అనుకుంటున్న సమయంలో మళ్లీ అనుకోకుండా ఒక ఫ్రెండ్ వల్ల ఈ పుస్తకం దొరికింది. చెప్పనలవి కాని ఆనందం. చిన్నప్పుడు ఈ సీరియల్ ఎందుకు ఆకట్టుకొందంటే ఇది కుంగ్ఫు based కథ. హీరో ఒక అనామకుడు, కొన్ని రోజులు ఒక ముసలి గురువు దగ్గర శిక్షణ పొంది కుంగ్ఫూలో expert అవుతాడు. అది చాలా ఆకట్టుకుంది.

ఇక పోతే గత సంవత్సరపు సర్ప్రైజ్ ప్యాకేజీగా ఒక పుస్తకం నిలిచింది. అది శ్రీ గబ్బిట కృష్ణమోహన్ గారు అనువదించిన ‘సరదాగా మరి కొంత సేపు (పదిన్నొక్క P.G. Woodhouse కథలు)’. ఈ పుస్తకాన్ని అంతకు ముందు సంవత్సరమే కొన్నా, మొన్నటి వరకు దీన్ని చదవలేదు. ఒక్కసారి చదవటం ప్రారంభించిన తర్వాత ఇక ఆపలేదు. శ్రీ గబ్బిట కృష్ణమోహన్గారు ఈ కథల ని అద్భుతంగా తెనుగీకరించారు. పాత్రలకి ఎన్నుకున్న పేర్లు, కథలకి ఎన్నుకున్న ప్రదేశాలు, ప్రతి ఒక్కటి అద్భుతంగా కుదిరాయి. చాలా రోజుల తర్వాత ఒక సునిశితమైన హాస్యాన్ని అందించిన పుస్తకం. ఈ పుస్తకం చదవగానే గబ్బిట కృష్ణమోహన్ గారు అనువదించిన, మరో ఐదు పుస్తకాలు ఆన్లైన్ ద్వారా తెప్పించి చదివాను. ఇది నిజంగా నాకు సర్ప్రైజ్ ప్యాకేజ్. ఆ యుఫోరియాలోనే శ్రీ గబ్బిట కృష్ణమోహన్గారికి ఈమెయిల్ చేస్తే వారు కూడా సంతోషంగా తిరిగి ప్రతిస్పందించారు. ఆ విధంగా మల్లాది వెంకట కృష్ణమూర్తి గారి పుస్తకాల తర్వాత శ్రీ గబ్బిట కృష్ణమోహన్ గారి పుస్తకాలు ఎక్కువగా చదివాను.

ఇంగ్లీష్ పుస్తకాల విషయాని కొస్తే, ‘Rita Hayworth and Shawshank Redemption’ by Stephen King చదివాను. ఈ సినిమాని ఇంతకు ముందే చూసి ఉన్నాను. పుస్తకం చదివిన తర్వాత, సినిమా బాగుందా? పుస్తకం బావుందా? అంటే తేల్చుకోలేకపోయాను. రెండూ అంతలా నచ్చాయి.

అంతకు ముందు సంవత్సరం Yuval Noah Harari వ్రాసిన, ‘Sapiens: A Brief History of Humankind’ చదివి ఉన్నాను కాబట్టి, ఈసారి అతను రాసిన మరో పుస్తకం ‘Homo Deus: A Brief History of Tomorrow’ చదివాను. ఈ పుస్తకాల గురించి రాయాలి అంటే మరో కొత్త టపా రాయాల్సిందే. సింపుల్గా చెప్పాలి అంటే ఈ మధ్య కాలంలో ఇతను వ్రాసిన పుస్తకాలు ప్రభావితం చేసినంతగా వేరే ఏ పుస్తకాలు చేయలేదు. పుస్తకాలు చదివే అలవాటు ఉన్న నా ఫ్రెండ్స్ అందరికీ నేను ఇతని పుస్తకాలు చదవమని రికమండ్ చేస్తున్నాను.

చివరగా గత సంవత్సరం నేను చదివిన పుస్తకాల్లో ‘ది బెస్ట్’ అంటే Yuval Noah Harari వ్రాసిన, ‘21 lessons for the 21st century’. ఈ పుస్తకం రిలీజ్ కోసం ఎదురు చూసి, చూసి, ఆన్లైన్లో ఈ పుస్తకాన్ని pre-order చేసుకొని, రాగానే ఏక బిగిన కూర్చొని చదివిన పుస్తకం ఇది. ఈ పుస్తకం యొక్క ప్రభావం వల్ల ఈ సంవత్సరం మెడిటేషన్ మీద కొంచెం ధ్యాస పెడుతున్నాను.

ఇకపోతే గత సంవత్సరం చదవటంలో నాకు ఎదురైన చెత్త అనుభవం ‘Hit Refresh’ అనే పుస్తకం. క్షమించాలి. ఈ పుస్తకం మంచి పుస్తకమే కానీ నేను చేసిన తప్పు ఈ పుస్తకాన్ని తెలుగులో చదవటం. ఈ పుస్తకాన్ని తెలుగులో చదవాలని ఎందుకు అనిపించిందో తెలియదు కానీ షాప్ లో చూడగానే తెలుగు అనువాదం కొన్నాను. నేను చదివింది తెలుగో, మరో భాషో నాకైతే అర్థం కాలేదు. ఇందులో వాడిన తెలుగు పదాలకు డిక్షనరీలో కూడా అర్థాలు దొరుకుతాయో లేదో? కొన్ని వాక్యాల అనువాదం ఎంత దారుణంగా ఉంది అంటే, ఇంగ్లీష్ని అలాగే గూగుల్ ట్రాన్స్లేట్లో టైప్ చేస్తే ఇంకా మంచి వాక్యం తెలుగులో వచ్చేదేమో అనిపించింది. ఈ విషయం మీద ఈ పుస్తకం యొక్క పబ్లిషర్ ‘Westland Publications Limited’ వారికి ఫేస్బుక్లో మెసేజ్ కూడా పెట్టడం జరిగింది కానీ వారి నుంచి ఏ విధమైన రిప్లై రాలేదు.

అలా గత సంవత్సరం ముగిసింది. గత సంవత్సరం నుంచి నేను పాటిస్తున్న ఒక అలవాటువల్ల నాకు జరిగిన మంచి ఇది. ఫేస్బుక్లో ‘పుస్తకం.నెట్’ పేజి చూడగానే, ఈ పోస్ట్ వ్రాయాలనిపించింది. గత ఏడాది నుంచి నేను చదివిన ప్రతీ పుస్తకాన్ని ఒక చోట నోట్ చేసి పెట్టాను. చదివిన తర్వాత నచ్చిన పుస్తకాలపై చిన్న కామెంట్ వ్రాసిపెట్టుకోవడం అలవాటు చేసుకున్నాను. ఆ అలవాటు వల్ల, మొన్న మీ పోస్ట్ చూడగానే ఆనందం కలిగింది. ఆ అలవాటు ఇప్పుడు ఉపయోగపడుతుంది కదా అని.

ఓపికగా ఇదంతా చదివినందుకు మీకు నా ధన్యవాదాలు.

You Might Also Like

3 Comments

  1. Sudheer

    విజయ్ గారు, మీ సందేశం ఇప్పుడే చూసాను. మీ మొబైల్ నంబర్ కానీ ఈమెయిల్ ఐడీ కానీ పంపండి.

    – సుధీర్

  2. విజయ్

    సుధీర్ గారు నేను కూడా ఈ గంటకు 50 నిమిషాలే చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను. అందులో భాగంగానే ఇదిగో మీ బ్లాగ్ కనిపించింది దయచేసి పుస్తకం ఎక్కడ ఎలా పొందవచ్చో చెప్పండి.

    పుస్తకం
    Pdf
    ఏదైనా సరే

    విజయ్

  3. సౌమ్య

    బాగుందండి. Yuval Noah Harari పుస్తకాలు మూడూ‌ చదివారు కనుక ఆయన రచనల గురించి విడిగా మరొక వ్యాసం రాయగలరా?

Leave a Reply