అరుదైన వ్యక్తుల అద్భుత సంచారాలు

వ్యాసకర్త: కొల్లూరి సోమశంకర్

****************

జయతి, లోహితాక్షన్‌ల గురించి మొదటిసారిగా దాసరి అమరేంద్ర గారి ద్వారా 2017 చివర్లో విన్నాననుకుంటావనాలకు సమీపంగా ఉంటూ ప్రకృతితో మమేకమై బ్రతికే విలక్షణమైన జీవనశైలి కలవాళ్ళని తెలిసి అబ్బురపడ్డాను. వారు చేసే ప్రయాణాల గురించి జయతి గారి ఫేస్‌బుక్ పోస్టులను అనుసరిస్తూ తెలుసుకుంటున్నాను. ఇటీవలి కాలంలో జయతి, లోహి గారితో వ్యక్తిగత పరిచయం కూడా కలిగింది. గత సెప్టెంబరులో సాహిత్య అకాడెమీ కాకినాడలో యాత్రా రచనల సదస్సు నిర్వహించినప్పుడు అందులో ఒక పేపర్ ప్రెజెంట్ చేసే అవకాశం నాకు లభించింది. నా ప్రసంగంలో 2000 సంవత్సరం తరువాత పుస్తక రూపంలో వచ్చిన యాత్రా రచనలను పేర్కొని, పుస్తకరూపంలో రాని జయతి గారి ఫేస్‌బుక్ పోస్టులు, అలాగే వివిధ పత్రికలలో యాత్రా కథనాలు వ్రాస్తున్న ఇతర యాత్రారచయితల రచనలు పుస్తకరూపంలో వెలువడాలని కోరుకున్నాను.

అప్పటికే పుస్తకం ప్రచురించే ప్రయత్నంలో ఉన్నారేమో, సభలో ఉన్న జయతి గారు చిరునవ్వుతో, మౌనంగా ఉండిపోయారు. అక్టోబరు మొదటివారంలో తెలిసింది వారి పుస్తకం సిద్ధమవుతోందని. చాలామందితో పాటు నేను కూడా ఎదురు చూసిన ఆ పుస్తకం అడవి నుండి అడవికిప్రచురితమై, 21 అక్టోబర్ 2018 నాడు పాఠకులకు అందుబాటులోకి వచ్చింది. ఇదీ ఆ పుస్తక పరిచయానికి నా ఉపోద్ఘాతం.

ఏంటీ పుస్తకం అంటే క్లుప్తంగా చెప్పాలంటే గత ఆరేళ్లలో జయతిగారు ఒక్కరూ, కొన్నిచోట్ల లోహితాక్షన్‌గారితోనూ కలిసి ఛత్తీస్‌ఘఢ్ పల్లెల్లోనూ, తూర్పూ పశ్చిమ కనుమల్లోనూ, అరకు నుండి పులికాట్ వరకూ, నర్సీ పట్నం నుంచి ఒడిశాలోని మల్కన్‌గిరి వరకూ, డిబ్రూగఢ్ నుంచి కన్యాకుమారి వరకూ కాలినడకనా, బస్సులోనూ, రైల్లోనూ, సైకిలు మీదా చేసిన యాత్రానుభవాల సంపుటి ఇది.

ఈ అనుభవాల్లో కనిపించే ప్రపంచం చాలా సాధారణమైన ప్రపంచం. చాలా మామూలు మనుషుల దైనందిన జీవితం. కానీ, ఆ దారులు, ఆ ఊళ్ళు, ఆ ఇళ్ళు, ఆ అరుగులు మనల్నొక అతిలోక సౌందర్యసీమలోకి తీసుకుపోతాయిఅంటారు జయతి నడుస్తున్న దారిలో వాడ్రేవు చినవీరభద్రుడుగారు. అక్షరసత్యాలు ఈ మాటలు!

***

అసలెందుకు అడవుల్లోకి వెళ్ళాలి? అడవికి వెళ్ళి ఏం చేస్తారు? పాఠకుల మనసుల్లో తలెత్తే ఈ ప్రశ్నని ఛత్తీస్‌ఘడ్‌లో కేనపారా అనే ఊర్లో పూర్ణ అనే యువతి అడుగుతుంది. పూర్ణకి సమాధానం చెప్పకపోయినా, పాఠకులకి వివరిస్తారు జయతి. తన ఆలోచనలు ఎప్పుడూ అడవి మీద ఉంటాయనీ, అడవి తన్ను పిలుస్తూ ఉన్నట్టుగా ఉంటుందనీ అంటారు. నగరాల్లో తనకు ఊపిరాడదని, నున్నటి దారుల్లో తన అడుగులు తడబడతాయని అంటారు,

తమతో పాటు అడవిలోకి రావడం నీకు ఇబ్బందవుతుందని అక్కడి మహిళల బృందం అంటే, “నేను నడుస్తాను, నాకేమీ కాదుఅంటారు. అక్కడి సర్పంచ్ అడవికి పోవాలని నీకుంటే నిన్నెవరూ ఆపరుఅని అంటే ఇంత చల్లని మాట చెప్పిన ఆయనకి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంటారు. చీకట్లో ఎలుగుబంట్లు సంచరించే చోట పగలు జయతి తిరిగారు!

కుట్రపారా పల్లె అడవిని, ప్రకృతిని అద్భుతంగా వర్ణించారు జయతి. “గుబురు కొమ్మల్లో నుండి బయటికొచ్చి చిటారు కొమ్మల్లో ఉడుతలు ఎండస్నానం చేస్తున్నాయిఅంటారు. సరైన దృక్పథంతో చూడకపోతే, మనుషుల్లో దురభిప్రాయాలు ఎలా ఏర్పడిపోతాయో చెబుతారు. ఓ పెద్దమనిషి ఇక్కడి ప్రజలను బద్దకస్తులుగా, కాలాన్ని వృథా చేసేవారిగా భావిస్తే జయతి గారు వాళ్ళు చేసే పనులని ప్రస్తావించి వాళ్ళు బద్దకస్తులు కాదని చెబుతారు పాఠకులకి. పల్లెపల్లలన్నీ వెదికినా పొట్టలు లేవు, కండ్ల మసకలు లేవు అంటారు.

ఎందుకని ఏ నగరంలోనూ ఉండలేకపోయాను? ఏ ఉద్యోగం లోనూ నిలబడలేకపోయాను? మానవ సమూహాల్లో ఇమడలేకపోయాను? అడవి నా ఊపిరిలోనిదా?” అని ఆత్మశోధన చేసుకుంటారిక్కడ.

***

తూర్పుకనుమలలో తిరుగుతున్నప్పుడు ఒక షేర్ ఆటో జరిగిన సంభాషణని పాఠకులకి అందించి, మానవ జీవన పార్శ్వాలను వెల్లడిస్తారు. విశాఖ నుంచి అనకాపల్లి మీదుగా పూడిమడక వెళ్తూ ఒక చెరుకుతోటలో గిజిగాళ్ళ విన్యాసాలని వివరిస్తూ, ఆ గాలిలో దివ్యత్వం ఉందనీ, అక్కడ విన్నదీ, చూసినదీ తాను వర్ణించలేనని అంటారు.

అనంతపురం జిల్లా వీరాపురం గ్రామంలో పక్షులను చూసి, అక్కడ దొరికిన తెల్లగులాబీ ఈకను పుస్తకంలో భద్రపరుచుకుంటారు. “ఏదోనాడు నేను ఇట్లా దొరికిన ఈకల్ని, రాళ్ళని, గవ్వలని నా వెంట తెచ్చుకోకుండా ఉండాలిఅనుకుంటారు. బహుశా గతకాలపు ఆనందాల్ని మోసుకుంటూ తిరిగితే, వర్తమానపు సంతోషాలనీ, అందాలని ఆస్వాదించలేమేమో!

తాడ్వాయి మండలం దామరవాయి గ్రామానికి కిలోమీటరున్నర దూరంలో ఉన్న సూరగుండయ్య గుట్టల్లో ప్రాచీన ఆదిమానవుల సమాధులను ఫొటోలు తీసే అసైన్‌మెంట్ దొరికితే, లోహిగారితో కలిసి వెళ్తారు, “ఇప్పటి దామరవాయి అడుగున వేల ఏండ్ల క్రితం ఆదిమానవ నివాసాలు ఉండేవా? ఆ మానవులు ఎంత ఎత్తు ఉండేవారు? ఎవరు వీళ్ళు? ఎలా ఉండేవారు? ఏం తినేవారు? ఎక్కడి నుండి వచ్చారు? ఈ అడవి అప్పుడూ ఇట్లా ఉండేదా?ఇలా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. ఓ అన్వేషి జిజ్జాస ఇది.

తిరుమలఅనే అధ్యాయంలో తన సహచరుడు లోహి గురించి చెప్తారు. “మేమిద్దరం ఒకటే ననుకుంటారు చాలామంది. మా యిష్టాయిష్టాలు కలిశాయని అనుకుంటారు. కాదు. తను మనుషుల్ని ప్రేమిస్తారు, మనుషుల మధ్య ఉండడానికి ఇష్టపడతారు. నేను మనుషుల్ని ప్రేమిస్తాను, అడవిలో ఉండటానికి ఇష్టపడతాను. నేను గుంపుల్లో ఇమడలేక, తను అడవిలో కాసేపు నిలవలేక మా ఇద్దరి మనస్సుల మధ్య ఘర్షణ మొదలవుతుంది. ఒకరిదారికి ఒకరు అడ్డు తగులుతున్నటు అప్పుడప్పుడూ అనిపిస్తుందిఅంటారు జయతి. కాని అధ్యాయం చివర్లోకి వచ్చేసరికి ఇక్కడ రైలెక్కి, తిరుమల అంతా తిరిగి, మళ్ళీ రైలెక్కి ఇంటికి చేరుకునేదాకా తన చెయ్యి నా చేతిని పట్టుకునే ఉన్నది. మేమిద్దరం ఒకటి కాదు. మేమిద్దరం ఒక్కటే.” అంటారు. జీవితభాగస్వాముల పట్ల సంపూర్ణ అవగాహన, పరస్పర విశ్వాసం ఉంటే గానీ ఈ మాటలు హృదయంలోంచి బయటకి రావు.

కొండెక్కుతూ మేమిద్దరం తక్కువ మాట్లాడుకున్నాం. తను తనలోకి, నేను నాలోకి, ఒకరిలోకి ఒకరం ఎక్కువ చూసుకున్నాంఅంటారు. బహుశా ఏ నడకకైనా/యాత్రకైనా ప్రయోజనం ఇదేనేమో!

తిరుమలకి వెళ్ళే నడకదారిలో జింకల పార్కు వద్ద జింకలను చూసినప్పుడు చూస్తున్నవి జింకలే, జింకలు కావనిపించాయి. జింకలు అవడానికి, కాకపోడానికి మధ్యన కన్నాలున్న ఇనుపకంచె నిలబెట్టి ఉందిఅంటారు. జంతువులైనా స్వేచ్ఛగా తిరుగాడడానికీ, బందీగా ఉండడానికి ఉన్న తేడాని ఈ వాక్యాలు ఎత్తి చూపుతాయి.

సూర్యాపేట సమీపంలో ఓ అడవిలో వెన్నెల రాత్రిలో కూర్చుని ఉండగా, ఆ వెన్నెల్లో కనబడుతున్న మోదుగ బీడుని అడవి వేసిన నెగడుగా అభివర్ణిస్తారు.

***

నర్సీపట్నం నుంచి మల్కన్‌గిరి బస్సు ప్రయాణం చదువరులను ఆయా ఊర్లతో తిప్పుతుంది. “అడవిలో ప్రవేశించగానే ఏమి జరుగుతుందో, ఏ ముఖం చూసినా తేటగా, అమాయకంగా కనిపిస్తుంటాయిఅంటారు. ప్రకృతి/అడవి యొక్క సహజ స్వభావమేమో మనసులోని కల్మషాలనీ తొలగించడం!

ఈశాన్యరాష్ట్రాలను చూడాలనే తనకెంత కాలం నుంచో ఉన్న కలని నెరవేర్చుకోడానికి విశాఖపట్నం నుంచి డిబ్రూఘర్‌కి న్యూ టిన్సుకియా ఎక్స్‌ప్రెస్‌లోనూ, వచ్చేడప్పుడు డిబ్రూఘర్ నుండి కన్యాకుమారికి వివేక్ ఎక్స్‌ప్రెస్‌లోనూ వెయిట్లిస్ట్ టికెట్లు బుక్ చేసుకుంటారు జయతి, లోహి. న్యూ టిన్సుకియా ఎక్స్‌ప్రెస్‌ 4223 కిలోమీటర్లు ఏడు రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. ఏడు రాష్ట్రాలంటే ఎంతెంతమంది మనుషులుఅనుకుంటారు జయతి. వెళ్ళేడప్పుడు టికెట్ కన్‌ఫార్మ్ అవలేదు. స్టేషన్‌లో ఎదురుగా కనబడిన బోగీలోకి ఎక్కేస్తారిద్దరూ. ఆ బోగీలో జరిగిన ప్రయాణంలో ఎందరినో కలుస్తారు, కొందరితో స్నేహం ఏర్పడుతుంది. న్యాగాలండ్ రాష్ట్రంలోకి ప్రవేశించాకా సాయంత్రపు నీరెండ వేళలో ఓ పల్లెటూరి మీదుగా రైలు పరుగెడుతోంది. చుట్టూ వున్న ప్రకృతి దృశ్యాలను ఫొటోలు తీస్తూ, “ఎన్ని చూపిస్తుంది రైలుఅంటారు. బ్రహ్మపుత్ర నది చుట్టూ తిరుగుతారు. ఎప్పుడూ పోలీసులు అడుగుపెట్టని నాంఫాకేఅనే ఊరిలో తిరుగుతారిద్దరూ.

తిరుగుప్రయాణంలో డిబ్రూఘర్ స్టేషన్‌లో వివేక్ ఎక్స్‌ప్రెస్ కోసం ఎదురుచూస్తూ, ప్లాట్‌ఫామ్ మీద ఉన్న యువకులను పలకరిస్తే, వారు అదే రైలులో పాంట్రీకార్ సిబ్బంది అని తెలుస్తుంది. వారి జీవన విధానాన్ని పాఠకులకి వివరిస్తారు. బోగీ అంతా మూడు రెట్లు మనుషులతో నిండిపోయిందట. అందరిదీ ఒకటే కష్టం. అందరిదీ ఒకటే కథ. ఒకటే సుఖం. కన్యాకుమారి చేరాక, అక్కడ్నించి రామేశ్వరం, ధనుష్కోడి చూసొస్తారు. ఘోస్ట్ టౌన్ అని పేరుపడిన ధనుష్కోడి నుంచి బయల్దేరాకా నన్ను నేను అక్కడ విడిచిపెట్టి బస్సెక్కాను అంటారు జయతి.

***

సైకిళ్లపై అన్నవరం నుంచి చింతపల్లి వెళ్తుండగా, రాత్రి గూడెం అనే ఊర్లో ఓ ఇంట్లో బసచేస్తారు. కోమ్లా అనే ఆ ముసలావిడ జయతిని తన కూతురుగానే భావించి ఆదరిస్తుంది. ఆమె కూతురు ఏడాదికో రెండేళ్ళకో ఒకసారి వస్తుందట. అడవిని కోరుకుని వచ్చాను నేను. అడవి నుండి పట్టణానికి వెళ్ళిపోయిందామె. నేను ఈ అడవిలో పుడితే ఏం చేద్దును?అని తనని తాను ప్రశ్నించుకుంటారు జయతి. Hypothetical ప్రశ్నలకి జవాబులు దొరకడం కష్టం!

ఏధిర గ్రామం నుంచి గోదావరి అవతలి ఒడ్డుకు వెళ్ళి, అక్కడ్నించి మరో ఊరికి వెళ్ళాలన్నది జయతి, లోహిల ఆలోచన. తెలిసిన దారే అయినా కనబడిన వాళ్ళని దారడుగుతారు. “తెలిసినా దారి అడగడం ఒక పద్ధతి. పరిచయాలు ఏర్పడతాయిఅంటారు.

ఆదిలాబాద్ అడవిలో ఎదురుగా వస్తున్న ఓ బైక్ జయతి సైకిల్‌ని దాదాపు గుద్దినంత పని చేస్తుంది. ప్రమాదం తృటిలో తప్పిపోతుంది. ఈ ప్రయాణాల్లో వాళ్ళని భయపెట్టే మనుషులు ఎదురైనట్టే, ధైర్యం చెప్పేవారు కూడా తటస్థపడతారు.

ఆదిలాబాద్ అడవి దాటాక ఓ ఊర్లో యశోద అనే మహిళ ఆ రాత్రి తమ ఇంట ఆశ్రయమిస్తుంది. ఆప్యాయంగా మాట్లాడి, మినప్పప్పుతో కూర చేసి పెడుతుంది. కబుర్లూ చెబుతూ వంట పూర్తి చేస్తుంది యశోద. ‘దినుసులు కాక ఆమె వంటలో ఏం కలిపిందోఅనుకుంటారు జయతి. చుక్కలు గుంపులు గుంపులుగా వచ్చి ఆకాశాన్ని అలముకుంటాయి ఆ రాత్రి అద్భుతంగా గడుస్తుంది వాళ్ళకి. తెల్లారాక, మినప్పప్పు కూరలో ఆమె ఏం కలిపిందో నాకిప్పుడు తెలిసింది అంటారు జయతి. ఈ అధ్యాయం చదవడం పూర్తయ్యేసరికి పాఠకులకీ తెలుస్తుంది.

బోరీగావ్‌లో అక్కడి మనుషుల తీరు భయం కలిగించినా, మదన్ మోహన్ మహారాజ్ ఆతిథ్యం సాంత్వన కలిగిస్తుంది.

కోహిర్ పట్టణం దాటాకా, ఓ చోట ఓ రేకుల షెడ్‌లో విశ్రమిస్తారు జయతి, లోహి. తెల్లారాక తెలుస్తుంది అది ఆ ప్రాంతంలో ప్రసిద్ధులైన సూఫీ సాధువు హజ్రత్ మౌలానా మొయిజుద్దీన్ తుర్కి సమాధి ప్రాంతమని! అక్కడ వీరిద్దరికి ఎదురైన ఓ మార్మిక అనుభవాన్ని చదవలసిసిందే!

పులికాట్ సరస్సు, చుట్టుపక్కల దీవులలో వీరి తిరుగుళ్ళు ఆసక్తికరంగా సాగుతాయి.

***

పశ్చిమ కనుమల్లోని కులమావు వెళ్ళి అక్కడి కొండ మీద నుంచి ప్రకృతి వర్ణిస్తారు జయతి. “నిన్న కురిసిపోయిన మేఘాన్ని చప్పరిస్తూ మళ్ళీ బయటకొచ్చి నిలబడ్డానుఅంటారు ఒకచోట. ఎంత భావుకత్వం నిండివుందీ మాటల్లో! “కొండల్ని ఎక్కడం సులువే. కానీ ఆ కొండల దాకా రావాలంటేనే కష్టం. ఎన్నో దాటాలిఅంటారు. కాదనగలమా?

ఇలా అడవులు, జీవితం, మనుషులు పెనవేసుకుపోయిన రచన ఇది.

రచనలో రచనలు:

ఈ పుస్తకంలో జయతి కొన్ని పుస్తకాలను ప్రస్తావిస్తారు. గోపీనాథ్ మొహంతీ అమృత సంతానంపుస్తకానికి పూర్తిగా ఒక అధ్యాయమే కేటాయించారు. అమృత సంతానం చదవని వారికి ఆ పుస్తకం సారన్నంతా ఎంతో అందంగా జయతిగారు విశదీకరిస్తారు. పుస్తకాన్ని పరిచయం చేస్తూ, “ఇది మనిషి కథ. అడవి కథ. అడవితో మనిషి, మనిషితో అడవి పెనవేసుకున్న కథఅంటారు. జయతిగారి ఈ పుస్తకానికి కూడా అడవే ఇతివృత్తం కావడం విశేషం. అలాగే రాహుల్ సాంకృత్యాయన్ ఓల్గా నుంచి గంగకు పుస్తకాన్ని ప్రస్తావిస్తారు. సూర్యాపేట దగ్గర అడవిలో బస చేసినప్పుడు దుశర్ల సత్యనారాయణ గారి జల సాధన సమరంపుస్తకాన్ని ప్రస్తావిస్తారు. ఇదే అడవిలో వెన్నెల్లో కూర్చున్నప్పుడు బిభూతిభూషణ్ బందోపాధ్యాయ వనవాసిని ప్రస్తావిస్తారు. ఇలాంటి వెన్నెలనే ఆయన వనవాసిలో చెప్పారని అంటారు.

మనుషులు:

కుట్రపారాలో నేహతో కలిసి పొలంలో వరినాట్లు వేసినాఓ ఊర్లో మిరపచేలో మమత అనే మహిళతో కలిసి మిరపకాయలు తెంపినా, ఓ హోటల్లో పనివాళ్ళతో కలిసి కూరగాయలు తరిగినారకరకాల పనులలో స్థానికులకి సాయపడడంలో జయతి ఉద్దేశం వాళ్ల గురించి తెలుసుకోవాలనే.

అలాగే వీళ్ళకి కూడా ఎందరెందరో సాయపడతారు. కొందరు ఆశ్రయం ఇస్తారు, శ్రీను అనే యువకుడు సైకిల్‌ని ఉచితంగా బాగు చేసిపెడతాడు, సైకిళ్లతో సహా గోదావరిని దాటించిన రమణయ్య వీరి కథ విని, డబ్బులు తీసుకోడు. దార్లో సైకిళ్ళతో సహా వీళ్ళని తన ట్రక్‌లో ఎక్కించుకుని, జైనూరు‌లో దింపుతాడో డ్రైవరు.

జయతి గారి అడవి అనుభవాలు చదువుతుంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ఆకులో ఆకునై పూవులో పూవునై, కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై, ఈ యడవి దాగిపోనా ఎటులైనా నిచటనే యాగిపోనా?” అనే పాటని తనువెల్ల నింపుకుని, అడవీ తానే, పాట కూడా తానే అయిపోయారేమనిపిస్తుంది. ఆ పాట మొత్తం యథాతథంగా జయతిగారికి వర్తిస్తుంది.

***

206 పేజీల ఈ పుస్తకం వెల 120/- రూపాయలు.

మట్టి ముద్రణలువారు ప్రచురించిన ఈ పుస్తకం అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలోనూ, ప్రచురణకర్త వద్ద లభిస్తుంది. ప్రచురణకర్త చిరునామా: మట్టి ముద్రణలు, ఆలగడప, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా, తెలంగాణ 508207. ఫోన్: 9848015364

You Might Also Like

2 Comments

  1. anyagaami

    మంచి పరిచయం. ఒకప్పుడు అడవుల్లో ఊళ్లు ఉండేవి. ఇప్పుడది మారటం మూలంగా మనకి కూడా అడవుల్లోకి వెళ్లాలన్న కోరిక ఎక్కువవుతోంది.

  2. Amarendra

    Chakkani parichyam… pustakapu lothulu andukogaligindi… congrats

Leave a Reply