దిగితేగానీ లోతు తెలీని వ్యాసంగం

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్

దిగితేగానీ లోతు తెలీని వ్యాసంగం
(సన్నిధానం నరసింహ శర్మ ‘ప్రవాహం’ కి ముందుమాట)

************

తన లోపల ప్రాణహితమైన గౌతమీ ప్రవాహాన్ని మోసుకుంటూ నగర కీకారణ్యంలో హైటెక్ సిటీ యంయంటిసి స్టేషన్ లోనో, విద్యానగర్ బస్ స్టాప్ లోనో దారితప్పి తిరుగుతున్న వొక పసిబాలుణ్ణి చూశారా యెప్పుడైనా? అతణ్ణి తాకి చూడండి. తడితడిగా, బోసిగా, భోళాగా నవ్వుతూ తగుల్తాడు. పెదాలకంటిన తల్లి గోదారి చనుబాల మాధుర్యాన్ని నాలికతో చప్పరిస్తూ వేరే లోకంలో వుంటాడు. గంగాధరుడి జానపదాలని గొంతులో గునాయించుకొంటూ పోగొట్టుకొన్న దేనికోసమో దేవులాడుతూ వుంటాడు. యేదో వొక పుస్తకం చేత ధరించి వుంటాడు. ఆయ్ … మీగ్గానీ కనిపిస్తే తొవ్వ ముచ్చట్లు చెప్పే జయధీర్ తిరుమలరావుకో, పంచమ వేదం పలికే సతీష్ చందర్ కో ఫోన్ చేసి చెప్పండేం. నగరంలో వాళ్ళే ఆ పిలగాని తల్లీ తండ్రీ గురువూ బంధువులు. వాళ్ళే అతని చిరునామా – కేరాఫ్. ఆ బాలుడి పేరు సన్నిధానం నరసింహ శర్మ. ఊరు రాణ్మహేంద్రం. గౌతమీ తీరానికి దూరమైనప్పటికీ … జ్ఞానదాహంతో అక్కడ కురిసిన ప్రతి నీటి చినుకునూ తనలోకి యింకించుకోవడం వల్ల సాహిత్య జీవనాన్ని గుండెలో యిముడ్చుకోవడం వల్ల ప్రవాహ గుణాన్ని కోల్పోలేదు. అందుకే భాగ్యనగరం చేరాకా రాసిన యిక్కడి రాతలు కూడా ‘ప్రవాహం’ అయ్యాయి.

వ్యాసాలూ ఇంటర్వ్యూలూ సమీక్షలూ … మూడు పాయల ప్రవాహం యిది. ఇంటర్వ్యూల్లో శర్మగారి మాట అంతస్శ్రోతస్విని. వ్యాసాలు అనర్గళ గంగా ప్రవాహ సదృశాలు. సమీక్షలు యమునలా వుపనది లాంటివే. ఆ విధంగా యిది త్రివేణీ సంగమం. పరిశోధకుడు, జర్నలిస్టు, గ్రంథాలయ పాలకుడూ, అన్నిటికీ మించి వుత్తమ సాహిత్య ప్రేమికుడు అయిన సన్నిధానంవారి చూపు యెప్పుడూ అరుదైన పొత్తాల వైపే, ఆయన వెతుకులాట అంతా వాటి లోతుల్లోకే. అందుకే అది వ్యాసమైనా, సమీక్షైనా, యింటర్వ్యూ అయినా వాటిలో వొక సమగ్రత, వొక నిండుదనం కనిపిస్తాయి. పద్య, గేయం, వచనకవిత … ప్రక్రియ యేదైనా ఆయనకి కరతలామలకం. ప్రాచీనం, ఆధునికం, యేదైనా సాహిత్యాధ్యయన విస్తృతి ఆయన ప్రతి వ్యాసంలోనూ కనిపిస్తుంది. సంప్రదాయాన్ని ఛేదించుకొని వచ్చిన ఆధునికుడు ఆయన.

ఆధునికుడైనప్పటికీ, ఆయన ఇంటర్నెట్ లో చిక్కుకున్న జర్నలిస్టు పక్షి కాలేదు. సజ్జలు తిని సజ్జలే మళ్ళీ విసర్జించే కాపీ పేస్ట్ విద్య నేర్వలేదు. విస్తృతంగా చదివి, చదివినదాన్ని రక్తగతం చేసుకొన్న మౌలిక పరిశోధకుడూ, జర్నలిస్టూ ఆయనలో దర్శనమిస్తారు. అందుకు ఈ సంపుటిలోని ప్రతివ్యాసమూ దృష్టాంతంగా నిలుస్తుంది. ‘ఒకనాటి కొన్ని తెలుగు పత్రికలూ భాష – సృజనాత్మకత’ అందుకు ప్రథమోదాహరణ.

హరిపురుషోత్తమరావు (హరి) చాలా సందర్భాల్లో పద్యాలకు ప్రతిపదార్థాది రూపంలో సమగ్ర వ్యాఖ్య రాసినట్టు ఆధునిక వచన కవితకి కూడా వొక వ్యాఖ్యాన పధ్ధతి రూపొందిచుకుంటే బావుంటుంది కదా అని తరచూ నాతో ప్రస్తావించేవారు. గడ్డ బిడ్డ (సన్నాఫ్ ది సోయల్) కొత్తపల్లి సత్య శ్రీమన్నారాయణకి నివాళి ఘటిస్తూ వెల్లి బిడ్డ (సన్నాఫ్ ది స్ట్రీం) రాసిన వ్యాసం ఆధునిక కవితకి సమగ్ర వ్యాఖ్యలా సాగుతుంది. ఘనమైన యీ నివాళి గడ్డ కట్టిన గుండెల్ని సైతం కరిగిస్తుంది. అనితరమైన ఆత్మీయతతో శ్రీమన్నారాయణ కవిత్వం మీద చేసిన అపూర్వ విశ్లేషణ అది. కవితల్లోని అర్థాలూ, అంతరార్థాలూ, విశేషార్థాలూ, విప్పిచెబుతూ కొత్త లోతుల్ని తరచి చూసిన సూక్ష్మదర్శిని అది. కవీనాం కవి అని ప్రేమగా పిల్చుకొనే కొత్తపల్లి జీవితం-సాహిత్యం-వ్యక్తిత్వాల గురించి త్రీడైమన్షన్ లో సన్నిధానం గీసిన వన్నెల చిత్రం ఆ వ్యాసం. అందులో నాలుగో డైమన్షన్ శ్రీమన్ మీద సన్నిధానానికి వున్న అవ్యాజ స్నేహం. అది వ్యాసానికి ఆరిపోని గంధం పూసి వీడని పరిమళాన్నిచ్చింది.

‘తల్లి గోదారిపై ఎల్లెడా కవితా ప్రవాహాలు’, ‘కవితా దాహం తీర్చే గోదావరి’ సర్వ సమగ్రమైన పరిశోధనా వ్యాసాలు. ప్రాచీన అర్వాచీన సమకాలీన కవిత్వంలో గోదావరి ప్రవాహ రూపం అఖండంగా యెలా చిత్రితమైందో చెప్పే క్రమంలో శర్మ గారిలోని పరిశోధకుడు విశ్వరూపంతో దర్శనమిస్తాడు. అయితే గోదావరి కవితా ప్రవాహాన్ని నన్నయ దగ్గరో, శ్రీనాథుడి దగ్గరో కాకుండా –
‘కన్నవారీ మీద కలలు వచ్చాయి
పాపిష్టి గోదారి పాయియ్యవమ్మా
దోసకారీ గోదారి దోవియ్యవమ్మా’

-అంటూ జానపదగీతం దగ్గర మొదలు పెట్టడం ఆయనలోని సాహిత్య దార్శనికతకి గొప్ప తార్కారణం. జానపదం అన్ని పథాలకూ తొలి అడుగు అన్న యెరుక అక్కడ కనిపిస్తుంది. విశ్వ విద్యాలయాల్లో పరిశోధక విద్యార్థులకు పాఠ్యాంశంగా పనికొచ్చే రచనలివి.

ఇంటర్వ్యూల్లో శర్మ గారి ప్రశ్నలు తెలియంది తెలుసుకోడానికి అడిగినట్టుండవు. కొన్నిసార్లు అవి చాలా ప్రొవొకింగ్ గా కూడా వుంటాయి. కానీ అమాయకంగా వుంటాయి. వాటిలో వొకరకమైన కనిపించని లౌక్యం వుంటుంది, గడుసుదనం వుంటుంది, చమత్కారం వుంటుంది. అవతలి వ్యక్తి కడుపులో దాగింది తవ్వి తీసే సైలెంట్ ప్రోబింగ్ వొకటి వుంటుంది. ‘దిగంబర కవిత్వోద్యమానికి కర్త కర్మ క్రియ నేనే’ అని నగ్నమునితో వొక చారిత్రిక యేక వాక్యాన్ని ప్రకటింపజేసి, దాన్ని నిఖిలేశ్వర్ ముందు ప్రస్తావించి అదొక సృజనాత్మక ప్రజాస్వామిక వుద్యమమనీ దానికి దిగంబరులారుగురూ కర్త కర్మ క్రియలే అని కుండ బద్దలుకొట్టించిన చతురత ఆయనకే సొంతం. అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా భాషాభివృద్ధి కోసం ఎ బి కె చేసిన కృషి గురించి తెలుసుకుంటూనే సరైన భాషా విధానం లేని పాలకుల వైఖరిని యెత్తి చూపినప్పుడు కూడా దాన్ని గమనించగలం.

ఈ ధోరణి సమీక్షల్లోనూ కనిపిస్తుంది. అందుకే శర్మగారి పుస్తక సమీక్షలు గ్రంథ పరిచయాలుగా మిగిలిపోవు. కాళోజీ భాషా దృక్పథాన్ని వివరిస్తూ జయధీర్ తిరుమలరావు రాసిన యుద్ధకవచం పుస్తకాన్ని సమీక్షిస్తూ శర్మ గారు చెప్పిన మాటల్లోని తీవ్రతని చూడండి: ‘భాషా సాహిత్య సంస్కృతుల విషయంలో పాలక వర్గాలలో మార్పులు, ప్రజల ఆలోచనా విధానాలలో మార్పులు రావడానికి, భౌతిక హింసకి దూరమైన ఒక విధమైన తీవ్రవాదం అవసరమేమో అనిపిస్తుంది’ అంటారు.

అదే సందర్భంలో ప్రజా కవి లక్షణాన్ని నిర్వచిస్తూ చేసిన సూత్రీకరణ చాలా విలువైనది. సాధారణంగా ప్రజాస్వామ్యంలో కవులది ప్రతిపక్ష పాత్ర అంటాం కదా. కానీ పాలకులు కవి గళంలోనూ కలంలోనూ అసమ్మతిని సహించలేరు. చిన్నపాటి నిరసన ప్రకటించినా వారిమీద కత్తిగడతారు. ‘ప్రతిపక్షం అనేది శత్రుపక్షం కాదు. అది యావత్ ప్రజాస్వామ్యానికీ నిర్మాణాత్మక పాత్ర వహించగల రక్షణ కవచం. ప్రజోపయోగ ఆలోచనా మార్గదర్శక వ్యవస్థ. ప్రజాకవి అటువంటి పాత్ర నిర్వహించగలవాడని కవనంలో జీవనంలో నిరూపించి పరిమళించిన కవి కాళోజీ.’ అని చెప్పినప్పుడు సన్నిధానం శర్మలో నికార్సైన సమీక్షకుడు కనిపిస్తాడు. ఆయన సాహిత్య దృక్పథానికి సాక్ష్యంగా నిలుస్తుంది.

వ్యాస రచనకు సన్నిధానం వొక చక్కటి ప్రణాళికని రచించుకుంటారు. ఆయన పాటించే మేథడాలజీ యీ తరం రచయితలకు వొజ్జబంతి. తెలుగు బాస: తొలి అచ్చు ముచ్చట్లు చెప్పినప్పుడు ముందుగా ప్రపంచంలో జరిగిన తొలి అచ్చు ప్రయత్నాల్ని (లాటిన్ భాషలో జాన్ గూటెన్ బర్గ్) ప్రస్తావించి, భారత దేశంలో (జావోది బుస్తామంతి) అచ్చుకు శ్రీకారం చుట్టిన వైనాన్ని పేర్కొంటారు. ఆతర్వాత దక్షిణ దేశంలో తమిళంలో ముద్రాపణ కృషిని తెలియజేసి, చివరికి తెలుగులో బెంజిమన్ షుల్జ్ జర్మనీ లో క్రైస్తవ మత ప్రచారం కోసం చేపట్టిన అచ్చుపనుల్లో యెదుర్కొన్న సాధక బాధకాల్ని వివరిస్తారు. ఆ క్రమంలో క్రైస్తవ మిషనరీలు ప్రపంచ వ్యాప్తంగా అచ్చు రంగంలో చేసిన కృషిని క్రోడీకరిస్తారు. షుల్జ్ ప్రచురించిన నూరు జ్ఞాన వచనాలు (సంవత్సరం 1747) తెలుగులో అచ్చైన తొలి పుస్తకం. యెంతో శ్రమకోర్చి ఆ గ్రంథం ప్రతిని సేకరించి సంపాదక వ్యాఖ్యలు జోడించి యథాతథంగా తెలుగు నేలకు అందించిన అరుదైన పరిశోధకుడు సన్నిధానం వారు. చాలామంది రంధ్రాన్వేషుల మధ్య గ్రంథాన్వేషిగా శర్మగారు గుర్తుండిపోతారు. పుస్తకమన్నా పుస్తకాలయాలన్నా అంత అనంత ప్రేమ ఆయనకు.

‘భాషకు ఆలయాలు పొత్తపు గుడులు’, ‘తెలంగాణ జాతీయ గ్రంథాలయం’ సన్నిధానం శర్మగారి వృత్తికీ ప్రవృత్తికీ దగ్గరగా వుంటాయి. శ్రీకృష్ణ దేవరాయ ఆంద్ర భాషా నిలయం అర్చక శేఖరుడు యం యల్ నరసింహారావుకి గౌతమీ గ్రంథాలయ అర్చక శేఖరుడే అక్షరార్చన నిర్వహించగలడు. విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమమ్.

స్వామినీని ముద్దునరసింహం, కందుకూరి వీరేశలింగం, రఘుపతి వేంకటరత్నం నాయుడు – ముగ్గురు సంస్కర్తల్నీ కలిపి వొకే శిలలో మూర్తి త్రయం చేసి శిల్పంగా మలచినప్పుడూ …
శ్రీశ్రీ పై అభిమానం, అద్దేపల్లి పై ప్రేమ, రెంటినీ జోడు గుర్రాల్లా జాగ్రత్తగా నడుపుతూ, శ్రీశ్రీపై అద్దేపల్లి అంచనాల్ని వుటంకింపులతో సహా క్రోడీకరించి వాటికి తనవైన పరిశీలనలూ వ్యాఖ్యలూ జోడించినప్పుడూ …
జానపద – గిరిజన కళా సాహిత్య వారసత్వ సంపదని కాపాడుకోలేనందువల్లే జాతి సాంస్కృతిక దారిద్ర్యంలో అలమటిస్తుందని వాపోయినప్పుడూ …
జయధీరుని తొవ్వ ముచ్చట్లు విలక్షణమైన ప్రక్రియ అని నిర్ధారించినప్పుడూ …
జూపల్లి ప్రేమచంద్ రచించిన ధిక్కార వాదం దిగంబర కవిత్వం పై విశ్లేషణాత్మక విమర్శ చేసినప్పుడూ …
ఒక రచన గొప్పదనాన్ని తెలుసుకోడానికి సహృదయ పాఠకుడే ప్రమాణం – రచయితకీ పాఠకుడికీ మధ్య పీఠికా కారుల ‘దొంగ ధ్రువ పత్రాలు’ అవసరం లేదని తీర్మానించినప్పుడూ …
ఆయా సందర్భాల్లో సన్నిధానం నరసింహ శర్మ వొక ‘సజీవ వ్యాస పీఠం’ లా గోచరిస్తారు.

‘ఆధునిక కవిత్వంలో మానవత్వపు విలువలు’ చాలా విలువైన రచన. విశ్వశ్రేయ: కావ్యమ్ అన్న నానుడి దగ్గర నుంచీ శ్రీశ్రీ, విశ్వనాథ, జాషువా, తిలక్, శేషేంద్ర, సినారె, సోమసుందర్, సుద్దాల, కాళోజీ, కరుణశ్రీ, బైరాగి, అద్దేపల్లి, వేగుంట, గద్దర్, వంగపండు, ఓల్గా, జయధీర్, కొప్పర్తి … ఆధునిక కవుల రచనల్లోంచీ కవిత్వ పంక్తుల్ని యేరి మానవత్వ విలువల్ని వినమ్రంగా శిరసావహిస్తారు. అయితే అది కేవలం సాహిత్య వ్యాసమే అయితే ఆ విలువకు పరిమితులు ఏర్పడేవేమో?! కానీ …

‘నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో నీ అభిప్రాయాలు ఎటువంటివి? వివిధ మతాల జనాల విషయంలో నీ సహభావనలు, సామరస్య భావాలు ఎటువంటివి? లక్షల కోట్లు అవినీతి చేస్తూ నిస్సిగ్గుగా నాయకుల ఫోజులతో ఉన్న దుష్ట పాలకుల పట్ల నీ అభిప్రాయాలు ఎటువంటివి? శ్రమ – ఉత్పత్తులు – యాజమాన్యాలు – శ్రామికులు వంటి విషయాల్లో నీ అభిప్రాయా లెటువంటివి? కరువులు, ఉత్పాతాలు, భూకంపాలు, అకారణ మానవ హోమాలు, దళితులూ, మైనార్టీలు, మహిళల పట్ల అత్యాచారాలు – ఇటువంటి అనేక సామాజిక సమస్యాంశాలలో నీ స్పందనలు ఎటువంటివి? అని సమాజం వేసే ప్రశ్నలకు జవాబుదారీతనంలోనే అసలైన మానవుడూ సిసలైన కవీ తేలి దృశ్యమానమావుతున్నాడు. రకరకాల ఆధిపత్యాల ధోరణుల్లో నీ భావాలెటువంటివో చెప్పడంలో గొప్ప మానవుడవో సంకుచిత మానవుడవో తేలిపోతుంది. … ఇతరుల కష్టాలకు స్పందించడం, వారికి సహకరించడం, స్వార్థ చింతనలు తగ్గించుకోవడం, ఇతరులపట్ల దయ జాలి, ప్రేమ ఉండడం, ఇతర మానవుల ప్రగతికి అడ్డుపడకపోవడం, ఆధిక్య లక్షణాలను పటాపంచలు చేసుకోవడం – ఇలా ఎన్నో మంచి గుణాల సమాహారం … మానవత్వం’

అని నిర్ధారించడంతో సాహిత్యవ్యాసం కాస్తా సామాజిక పాఠంగా పరిణమించింది. శర్మగారి ఆత్మని మొత్తం ఆయన సాహిత్య మూర్తిమత్వాన్నీ, జీవన ప్రస్థానాన్నీ బలంగా ఆవిష్కరించిన వాక్యాలివి. రచయితల నిబద్ధతని తేల్చి చెప్పడానికి వుపయోగపడే గీటురాయి అనదగ్గ ఈ మాటల ద్వారా రచయితగా సన్నిధానం ఎవరి సన్నిధానంలో – ఎటు నిలబడ్డారో స్పష్టమౌతుంది. కార్యాచరణ ఉద్యమరూపంలో వుంటే గానీ ఫలితాలు రావు అని నమ్మిన వ్యక్తి ఆయన. అందుకే జీవితం వుత్తరార్థంలో సైతం విడువని యీ సాహితీ వ్యాసంగం.

ప్రవాహసదృశమైన వుపన్యాస శైలి యీ వ్యాసాల్లో కనిపిస్తుంది. వాక్యం పాఠకులతో యెదురుగా కూర్చుని మాట్లాడుతున్నట్టు వుంటుంది. వచనంలో గాంభీర్యం కంటే సారళ్యం యెక్కువ. పాండిత్య స్ఫోరకమైన శైలి దారి నుంచి తనకు తానే జర్నలిస్టిక్ స్టైల్ లోకి మళ్ళించుకున్నట్టు గమనిస్తాం. అందుకే ప్రతి వ్యాసం మొదలు పెట్టాకా కడదాకా యేక బిగువున చదివిస్తుంది. ఒక వేసవి వుదయం గోదాట్లో జలకాలడినట్టుంటుంది.

దిగితేగానీ లోతు తెలీని ప్రవాహం యిది. మీరూ దిగండి. తనివితీరా తేటనీటిని దోసిళ్ళతో పట్టి తాగండి. దాహార్తిని తీర్చుకోండి.
కవిత్వమే కాదు వచనం కూడా తీరని దాహమే అని మీరూ నమ్ముతారు.
తన స్నేహ సౌశీల్యంతో నన్ను కట్టి మీ ముందు పడేసిన సన్నిధానం నరసింహ శర్మ గారిని మరోసారి గుండెకు హత్తుకొని అభినందిస్తూ … సెలవ్.

హైదరాబాద్
మే 26, 2018

You Might Also Like

Leave a Reply