అపూర్వ రష్యన్ జానపద కథలు

వ్యాసకర్త: దేవిరెడ్డి రాజేశ్వరి
***************

సరాసరి బాల్యం లోకి తీసుకెళ్లే కథలివి. ఎక్కడా అనువాద కథలని కానీ, వేరే ప్రాంతానికి చెందినవని కానీ, పాత్రల పేర్లు కొత్తగా వింతగా ఉన్నాయనిపించడం కానీ ఉండదు. అసలు సిసలు పసితనపు కథలు, వసివాడని కథలు. లాజిక్ అక్కర్లేని వయసులో కేవలం మాజిక్ మాత్రమే కావాల్సిన బుజ్జి బుజ్జి ఆలోచన లున్న పిల్లలకు అచ్చమైన స్వచ్ఛమైన కథలు. కథలనిండా చిక్కటి అమాయకత్వం దానిండా చక్కటి అందం. మధ్యమధ్యలో మన ఊహలకు రంగులూ, చమ్కీలు అద్దే బొమ్మలు భలేగున్నాయి. ఏ దేశమైనా, అది రష్యా కావచ్చు, ఉక్రేనియా కావచ్చు, ఉజ్బెకిస్తాన్ కావచ్చు… కానీ బాల్యం ఎక్కడైనా బాల్యమే. యూల్యా, గాల్యా, నానా, జూనా,మాషా, అల్యోనుష్క, ఇవానుష్క , ఆర్థర్, ఇవాస్కా, ఇవాన్, గుగుడ్సే, తెర్యోషా వీళ్ళందరూ మన వాళ్లే మరి.

“లెక్కల కుందేలు” ఇది చదువుతుంటే…. మనకూ కూడా చిన్నప్పుడు లెక్కపెట్టటమంటే సరదా. దారినపోయే ప్రతిదాన్ని లెక్కపెట్టేవాళ్ళం. మా ఇంటి పక్కనే కనిపించే అంత దగ్గరలో రైల్వేట్రాక్ ఉండేది. రైలు వచ్చినప్పుడల్లా ఎన్ని భోగీలని లెక్కపెట్టటమే మా పిల్లల పని.

“మాషా-ఎలుగుబంటి” ఇది కథ భలే తమాషా కథ. చిన్నప్పుడు అడవంటే పెద్ద డిస్నీ ల్యాండ్. అడవి అంటే పండ్లు, పక్షులు, కుందేళ్లు , జింకలు, ఏనుగులు ఇలా అన్నీ మనకు ఇష్టమైనవే ఉంటాయనుకునేవాళ్ళం. అంతే కానీ అడవిలో వాటితో పాటూ పులులు, సింహాలు, పాములు లాంటి అపాయాలు ఉంటాయని గుర్తు తెలీని వయసు. అచ్చం అలాంటి కథే ఈ “మాషా- ఎలుగుబంటి” కథ.

“అక్క-తమ్ముడు” కథ కూడా. తల్లిదండ్రులు దూరమైన అల్యోనుష్క, ఇవానుష్క. తమ్ముడిని ప్రాణంగా చూసుకునే అక్కా, కొన్ని కష్టాలు, ఇవానుష్క బుజ్జిమేక లాగా మారిపోవడం, మధ్యలో మంత్రగత్తె ప్రవేశం, చివరగా కథ సుఖాంతం. అల్యోనుష్క పెద్ద జడేసుకుని మన అనుష్క లాగా ఎంతందంగా ఉందో…!

“మూడు ఎలుగుబంట్లు” టాల్ స్టాయ్ రాసిన అద్భుతమైన కథ. దారితప్పిన చిట్టి పాప ఒక ఎలుగుబంట్ల ఇంటికి చేరడం, ఎలుగుబంట్ల ముచ్చటైన పొదరిల్లు, అందులోని గృహోపకరణాలు పిల్లలకి ఎంత నచ్చుతాయో.

“ఇవాన్” ఇది మాక్సిమ్ గోర్కీ కథ. ఇవాన్ మన పరమానందయ్య శిష్యుల కథలోని ఒక శిష్యుడు గానే కనిపిస్తాడు. భలే సరదా కథ.

“చీమ-చందమామ”. చిన్నప్పుడు అందరి పిల్లలలానే ఈ చీమకు ఎలాగైనా చందమామ దగ్గరకు వెళ్లాలని కోరిక. దాన్ని ఎలా నెరవేర్చుకున్నదో , దారిలో ఎంతమంది దీనికి సహాయపడ్డారో, ఎలా ఈ చీమ తెలివితో ప్రవర్తించిందో చెప్పే కథే ఈ “నీల్ ఆమ్ స్ట్రాంగ్ “చీమ కథ. దీని ప్రయాణం పిల్లలకు చాలా ఆసక్తికరంగాను, స్ఫూర్తిదాయకంగాను ఉంటుంది.

“రాళ్లు కొట్టే మనిషి” మనకిపుడున్న ప్రస్తుత జీవితం ఎప్పుడూ సంతృప్తికరంగా ఉండదు… అది రాజైన ,పేదైనా సరే అని చెప్పే కథ. దాదాపు అలాంటి కథే పుష్కిన్ రాసిన “జాలరి-బంగారు చేప కథ”. దీన్లో జాలరి భార్య అంతులేని ఆశలతో ఆ దేశానికే మహారాణి అయినప్పటికీ ఆఖరికి మొదటి పేద స్థితికి రావడం కనిపిస్తుంది. దురాశ కూడదని చెప్పే మంచి సందేశాత్మక కథ.

“బంగారు ఆపిల్ చెట్టు” మరో అద్భుతమైన కథ. ఈ ఒక్క కథలో బోలెడు కథలు కనిపిస్తాయి. గాల్యా కి సవతి తల్లి పెట్టే కష్టాలు, సవతి సోదరి యుల్యా అసూయ, గాల్యా కి దొరికిన వరం, సైనికుడితో పరిణయం, మళ్లీ కష్టాలు… బంగారు ఆపిల్ తినగానే శాప విమోచనం. పిల్లలకు చాలా ఆసక్తికరమైన కథ.

“తెల్ల పావురం” – కథ లో గాయమైన ఒక పావురానికి సపర్యలు చేసిన నానా అనే అమ్మాయికి పావురం కృతజ్ఞతతో ఒక పుచ్చ విత్తనం ఇవ్వడం. పుచ్చ విత్తనం మొలకెత్తి పుచ్చకాయలు కాయడం, వాటిలోని విత్తనాలు పట్టు గౌనులా ఒకటి, బంగారు అద్దం లా ఒకటి, శాలువా లా మరొకటి మారటం, నానా ని చూసి అసూయపడ్డ జూనా అనే అమ్మాయి కి జరిగిన శాస్తి … ఇలా పిల్లలతో అచ్చిక బుచ్చిక లాడే కథ ఇది.

“సముద్రతీరం లో పిల్లవాడు” – మాక్సిం గోర్కీ మరో కథ ఇది. ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయిన ఇవాస్కా ఎలా తెలివిగా తప్పించుకుకున్నాడో అనేదే ఈ కథ. సముద్రంలోని సముద్రపు రొయ్యలతో, నక్షత్ర చేపలతో కబుర్లు, సీతాకోకచిలుకల్లాంటి ఎగిరే రంగురంగుల చేపలు అవి చేసే శబ్దాలు, పాడే పాటలు, వాటి వర్ణనలు, మధ్యలో వాటి మనస్తత్వం అంచనా వేస్కుని ప్రవర్తించే తెలివైన ఇవాస్కా తిరిగి ఇంటికి చేరడంలో సాయపడ్డ పెద్దచేప, కానీ చేపకి కృతజ్ఞతలు చెప్పడం మాత్రం మర్చిపోడు మన ఇవాస్కా.

“వింత టోపీ”- గొర్రెలు కాచుకునే కుటుంబంలోని గుగుడ్సే అనే పిల్లాడు తన తోటి వారి పట్ల తన ఊరి పట్ల ఎంత దయగా వ్యవహరించాడో తెలియచేసే కథ. గుగుడ్సే కి వాళ్ళ నాన్న ఒక టోపి తయారు చేసిస్తాడు. వాళ్ళ నాన్న కు బదులుగా గొర్రెల కు దాణా వేయటం నీళ్లు పట్టటం శుభ్రం చేయటం వలన టోపి కి వింత శక్తి వస్తుంది. చలి నుండి ఎంత మందినైనా కాచే శక్తి ఆ టోపీకి ఉంటుంది. గొర్రెలను బాగా చూస్కోవటం వలన ఆ శక్తి వచ్చిందని గమనించిన గుగుడ్సే తన గ్రామములో ని అన్ని గొర్రెలను చూసుకోవడం ద్వారా చలికాలం లో ఆ వింత టోపీ గ్రామాన్ని మొత్తం చలి నుండి కాపాడే గొడుగులా మార్చి వారికి వెచ్చదనాన్ని ఇవ్వడం కథ. పిల్లలకు ఉండే నిష్కల్మషత్వం ఈ కథ లో సుస్పష్టమవుతుంది.

“చెక్కబొమ్మ పిల్లవాడు” – పిల్లల్లేని వృద్ధ దంపతులు ఒక చెక్కబొమ్మని తయారు చేసుకుని దాన్నే తమ బిడ్డగా భావించి దానికి తెర్యోషా అని పేరు పెట్టుకుంటారు. ఒక రోజు చెక్క బొమ్మకి ప్రాణం వచ్చి తెర్యోషా వారికి పిల్లల్లేని లోటు తీరుస్తాడు. చేపలు పడుతున్న తెర్యోషాని ఒక మంత్రగత్తె బంధించటం, ఆ మంత్రగత్తె కి పనిముట్లు చేసిచ్చే వడ్రంగి, తెలివైన తెర్యోషా మంత్రగత్తెని బురిడీ కొట్టించి ఒక కొంగ సాయంతో తప్పించుకొని ఇల్లు చేరడంతో కథ ముగుస్తుంది.

“కొసక్ వీరుడి కథ” – ఈ కథ లో పిల్లలకు నచ్చే మలుపులు చాలా ఉంటాయి. “తెలివైన అన్నదమ్ములు” కథ లో ఆ అన్నదమ్ముల ముందుచూపు, తెలివితేటలు, వారి ఆలోచనలు కొంత విజ్ఞానదాయకంగా ఉంటూ ఎంతో ఆకట్టుకుంటుంది.

“నిప్పుపక్షి” – ఈ కథ చిత్రమైన కథ. తమ తోట లోని బంగారు ఆపిల్ ని రోజూ మాయం చేస్తున్న నిప్పుపక్షి కోసం రాకుమారుడు ఇవాన్ చేసే అన్వేషణ. ఒక తోడేలు సాయపడటం, దారిలో తారసపడే ప్రమాదాలు… ఇలా విచిత్రాలమయం ఈ కథ.

“బంగారు చేప” – ఈ ఒక్క కథ ఎన్ని జానపద కథల సమాహారామో. మహా గమ్మతైన కథ. అత్యంత ఆసక్తికరమయిన కథా కథనం. ఈ కథ చదువుతుంటే సహస్ర శిరచ్చేద అపూర్వ చింతామణి కథలు గుర్తొచ్చాయి. మరి ఏ కథల ప్రేరణ ఏ కథలదో..!

“చందమామ రొట్టె” – మొత్తం కథలన్నింటిలో పిల్లల్ని కేరింతలు కొట్టించే కథ ఈ చందమామ రొట్టె కథ. తమాషాగా పాటలు పాడుకుంటూ అన్ని ఆపదలనుంచి తప్పించుకుంటూ చక్రం లాగే వెళ్ళే ఒక అందమైన గుండ్రటి రొట్టె చివరకు ఒక గుంటనక్క బారిన పడటంతో కథ అయిపోతుంది.

“బుజ్జిసూర్యుడు” – ఈ కథలో ఆర్ధర్ అనే చిన్నపిల్లాడి చిన్నారి పొన్నారి ఆలోచనలు, అతడి అమాయకత్వం, కరుణ, సహాయపడేతత్వం నుంచి మనమెంతో నేర్చుకోవచ్చు.

మా చిన్నప్పుడు పుస్తకం చేతికిచ్చి బొమ్మలు చూసుకుంటుండు అని చెప్పేవారు. అలా బొమ్మలు చూస్తూ చూస్తూ పుస్తకం చదవటం అలవాటు అయిపోయింది. ఈ కథా సంకలనం లో కూడా ఆకర్షణీయమైన బొమ్మలు ఈ కథలు చదవటానికి కారణమవుతాయి అనటం లో ఏ సందేహం లేదు.

రాత్రంటే చీకటి, బూచాడనే కాకుండా చందమామని, చుక్కల్ని, వెన్నెలలని చూపించాయి ఈ కథలు. వెండి చేపపిల్లలు, బంగారు చేపలు, రాజ హంసలు బంగారు ఆపిల్ పళ్ళు ఇలా వినటానికి ఎంత బావున్నాయో. అన్నీ “చెవు”లూరించేవే. ఈ కథల్లో కనిపించే విలన్లు కూడా ఒక రకంగా హీరోలే. క్రూరత్వం కూడా సుకుమారంగా.., కాస్త గంభీరంగా ఉండటం మనం గమనించవచ్చు. ఒక్కో చోట కఠినంగా కనిపించినా బెంగనే తప్ప భయాన్ని కల్గించని మంచి విలన్లు అన్నీ. కథలన్నీ వినోదాత్మకంగా ఉంటూనే కొన్నిచోట్ల విజ్ఞానాన్ని, సహాయపడే తత్వాన్ని పెంపొందించేట్టుగా ఉన్నాయి. కథల అనువాదం లో రచయిత తీసుకున్న స్వేచ్ఛ అభినందనీయం. స్థానికతకు, కథల మూలాలకు భంగం రానీయకుండా అనువాదం చేసిన రచయిత కృషి అంత సామాన్యమయినదిగా అనిపించదు. ఇంత చక్కని కథలు, మరింత అందమయిన కథనంతో, మంచి ఫాంట్ లో మనకు అందించిన రచయిత అనిల్ బత్తుల గారికి శుభాకామనలు. మరిన్ని రచనలు ఇతని నుంచి రావాలని స్వాగతిస్తూ…

ధన్యవాదాలతో
దేవిరెడ్డి రాజేశ్వరి.

You Might Also Like

Leave a Reply