These Hills Called Home: Temsula Ao

ది మదర్స్ ఆఫ్ మణిపూర్ పుస్తకం చదువుతున్నప్పుడు చాలా విషయాలు చూచాయిగా తెలిసాయి – నిరంతరం మిలిటరి పర్యవేక్షణలో ఉండడం, పది-పదకొండేళ్ళ పిల్లల్ని భావి ఉద్యమకారులంటూ ఇళ్ళనుండి మాయం చేయటం, అండర్-గ్రౌండ్ వారికి సహాయం చేస్తున్నారన్న అనుమానం కలిగినా ఊర్లకి ఊర్లని తగలబెట్టి, అక్కడ నివసిస్తున్న వారందరిని ఇంకో తాత్కాలిక శిబిరంలోకి పంపేయడం, మిలిటరి సంరక్షణ పేరిట ఎవరినైనా ఎక్కడైనా కాల్చిపారేయడం, దేశమాతను కాపాడుతున్నవారికి రాత్రైయ్యేసరికి ఆడపిల్లలు కావాల్సిరావడం, వారిని కాదనే అవకాశం లేకపోవడం లాంటివెన్నో తెలిసాయి. కానీ, అసలు ఆ తల్లుల గురించి, వారి చేసిన సాహసం గురించి చదువుతుంటేనే తలతిరిగిపోయింది. ఇక, అక్కడ మామూలు మనుషుల రోజూవారి జీవితాలను ఊహించుకునే శక్తి నాకు లేకపోయింది.

ఆ లోటును తెమ్సులా ఆవ్ రాసిన ఈ పుస్తకం తీర్చింది. నాన్-ఫిక్షన్ చేసే విహంగ వీక్షణంలో కనుమరుగైపోయే జీవితాలను ఫిక్షన్ మాత్రమే పట్టుకోగలదన్న నా నమ్మకం మరోసారి నిజమనిపించింది ఈ రెండు పుస్తకాల ద్వారా. మణిపుర్‍కి చెందిన మనోరమను ఇండియన్ ఆర్మీ రేప్ చేసి దారుణ హత్య చేయడాన్ని నిరసిస్తూ మదర్స్ ఆఫ్ మణిపూర్ నగ్ననిరసన చేసిన వైనాన్ని, ఎదురుకున్న అడ్డంకులని, వారి నేపథ్యాన్ని చెప్పే ప్రయత్నంలో రచయిత (రాసింది మహిళ. నేను జెండర్ న్యూట్రల్ పదం వాడదల్చుకున్నాను) ఎంత ప్రయత్నించినా కొంతవరకూ మాత్రమే అఫ్స్పా ద్వారా చిన్నాభిన్నమవుతున్నవారి జీవితాలను చూపించగలిగారు. అదే, అచ్చంగా కథలంటూ, యుద్ధభూమి నుంచి కథలంటూ ఉన్న ఈ పుస్తకం నాగాలాండ్‌కు సంబంధించిన జీవనాన్ని తెలిపేదే అయినా, మణిపూర్‍లో జరుగుతున్నవాటిని అర్థంచేసుకోవడానికి సహాయపడింది. ఈశాన్య రాష్ట్రాలంటూ మనం ఆ ఏడు-ఎనిమిది రాష్ట్రాలను ఒకే గాటిన కట్టినా, ఒక్కొక్కొరికి బోలెండ వ్యత్యాసం భాషలోనూ, మతంలోనూ, ఆహారంలోనూ, ఆహార్యంలోనూ. అయినా కూడా, ఈ రెండు పుస్తకాలు నాకు కాంప్లిమెంటరీగా అనిపించాయి. ఎందుకలా అనిపించిందో చెప్పే ప్రయత్నం చేస్తాను.

మనోరమకి న్యాయం జరగాలని ఆ పదకొండు మంది తల్లులు అంత సాహసానికి ఒడిగట్టినా కొంతమేరకే అనుకున్నది సాధించారు. AFSPA కొన్ని జిల్లాలనుండి మాత్రమే తొలగించింది ప్రభుత్వం. అసలు రేప్ చేసి హత్య చేసినవారిపై ఎలాంటి చర్యలు తీసుకోనేలేదు. అందుకనే తల్లులందరూ తమ తమ ఇంటర్వ్యూలలో న్యాయం జరగలేదని వాపోయారు. ఈ కథల పుస్తకంలో ఒక కథ ఉంటుంది. అందులో ఒక ఊరిలో ఊర్లో వాళ్ళంతా కలిసి చందాలు వేసుకొని కొత్త చర్చి కట్టుకుంటారు. ఆ చర్చిని ప్రారంభిస్తున్న రోజున పెద్ద పండుగలా చేసుకుంటారు. చర్చిలో పాటలు పాడుతుంటుంది ఒక అమ్మాయి. అంతలో ఆర్మీ అక్కడ చేరుకుంటుంది. కొందర్ని అరెస్టు చేయడానికి చూస్తుంది. అంత గందరగోళంలోనూ ఈ అమ్మాయి పాట పాడడం ఆపదు, అదీ ఒక రకం నిరసనే! అందుకని ఆర్మీకి సంబంధించిన ఒక యువ ఆఫీసరు ఆమె బరబర పక్క భవనంలోకి ఈడ్చుకొని పోయి రేప్ చేస్తాడు, చేయిస్తాడు. ఆమెను వెతుక్కుంటూ వచ్చిన ఆమె తల్లిని వరుసబెట్టి అత్యాచారం చేస్తారు. ఇది తెల్సుకున్న కొందరు ఊరివాళ్ళు వాళ్ళని కాపాడ్డానికి వస్తారు. వారందరిని కూడా కలిపి, సాక్ష్యాలేవీ మిగలకూడదన్న పతంతో, ఆ భవనాన్ని మొత్తం కాల్చి పారేస్తారు. అలజడి కొంత సద్దుమణిగాక విషయం ఊరందరికి తెలుస్తుంది. కాలిన ఆ శవాలకి దహనసంస్కారాలు చేయాలి. కానీ ఆచారం ప్రకారం ఇలా చనిపోయినవారికి శ్మసానంలో చోటు లేదంటారు. తర్జనభర్జనలు అవుతాయి. మొత్తానికి శ్మశానికి బయటే వారందరికి పాతిపెడతారు.

అదీ కథ! కథ కాబట్టి, మరి ఇంత దురాగతం చేసిన ఆ ఆర్మీ జవాన్లు, ఆఫీసరు ఏమయ్యారు అన్న ప్రశ్న పుట్టచ్చు? నరేటివ్ ప్రశ్న అది. ఆ ఆఫీసర్ కొన్నాళ్ళకి మెంటల్ ఇష్యూస్ వచ్చి, ఉద్యోగం పోయి… ఇలా చెప్పారు. నిజంగా అలా జరిగే అవకాశాలు ఉన్నా మనకి తెల్సే అవకాశం లేదు. హింస రెండువైపులా పదునున్న కత్తి. ఆ కత్తిని పట్టుకున్నాక దాని తీవ్రత నుండి తప్పించుకోవటం కష్టం.

ఇదే నేపథ్యంతో ఇంకో కథ ఉంటుంది – ఒక ఆర్మీ ఆఫీసర్‌ది, ఆమె భార్యది. వారింట్లోకి అనుకోకుండా చేరుకున్న ఒక వెర్రిబాగులవాడిది. ఆ కథ కూడా స్పష్టం చేసేది ఇదే. హింసాయుత ప్రదేశాల్లో హింసను ప్రేరేపించి, వ్యాపింపచేసే మనుషులు కూడా ప్రశాంతంగా ఉండలేరు. డబ్బున్నా, బలగం ఉన్నా, అధికారం ఉన్నా, చేసేది అకృత్యాలే అయినప్పుడు అది ఏదో రకంగా దొలిజేస్తుందనే నిజాన్ని చెప్పే కథ ఇది. ఎవరికి ఏమీ కాని, ఎవరిని ఏమీ అనలేని వెర్రిబాగులవాడే చివరకి హతమైనా, చేసిన ప్రతి హత్యతోనూ హంతకుడూ చనిపోతాడని చెప్పే కథ.

యుద్ధం అంటే రెండు వైరి వర్గాలు, వారివారి బలం, బలగాలు, బలహీనతలు, యుద్ధ వ్యూహాలు. ఇవే మనకి నాన్-ఫిక్షన్ చెప్పేది. ఫిక్షన్‌లో మాత్రమే రెండు ఏనుగులు పోటీ పడుతున్నప్పుడు ఎక్కువగా నలిగిపోయే గడ్డిపోచల గురించి చెప్పేది. అవ్వడానికి ఏ కథకు ఆ కథే అయినా, ఒకదాని నుండి ఇంకోదానికి ఏదో సన్నని దారం కలుపుతూనే ఉంది ఈ సంకలనంలో. అర్మీ ఆఫీసర్ల జీవితాలు, అండర్ గ్రౌండ్ వారి జీవితాలు, వారిని కాపాడుకోవాలని విశ్వప్రయత్నం చేసేవారి కుటుంబసభ్యులు, ఇంకా తెలిసి తెలియని వయసులో ఉండగానే పిల్లల్ని ఎత్తుకుపోయి వారిని అండర్ గ్రౌండ్ వాళ్లు ట్రెయినింగ్ ఇవ్వడం, పది-పదకొండేళ్ళకే ఉన్న పరిస్థితుల్లోనుంచి బయటపడడానికి విధ్యంసాన్ని సృష్టించిన స్కూలు పిల్లల కథ, ఇళ్ళు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్ట కాల్చుకోడానికి నిప్పు తీసుకున్న ఇంకొక్కడిలా అండర్ గ్రౌండ్‌కి, ఆర్మీకి వనరులు సమకూర్చడమనే బిజినెస్‌లో ఇరుక్కున్న ఒకడి కథ. ఇలా నాగాలాండ్‌లో గత అరవై-డబ్భై ఏళ్ళగా గడుస్తున్న జీవితాలని చిన్ని చిన్ని కథల్లో పట్టుకొని తెచ్చారు ఈ కథా రచయిత.

ఇందులో నాకు చాలా నచ్చిన రెండు కథలు యుద్ధ నేపథ్యం లేనివి. అందులో ఒకటి, ఒక అమ్మాయికి కుండలు చేయడమంటే మహాసరదా, అది వారి కులవృత్తే అయినా దాంట్లో శ్రమ ఎక్కువ, డబ్బు తక్కువ అని వాళ్ళమ్మ నేర్పదు. బట్టలు నేయడం నేర్చుకోమంటుంది, అది ఈ పిల్లకి ఇష్టం ఉండదు. ఎలా అయితే మొత్తానికి అనుకున్నది సాధిస్తుంది, పోరుపెట్టి పంతం నెరవేర్చుకుంటుంది. కోరుకున్నది జరిగినా, ఊహించనది ఏదో అవుతుంది. ఏంటది? జానపద కథల బాణీలో సాగే కథ మొత్తంగా మనల్ని ఆ కొండప్రాంతాల్లోకి తీసుకుపోతుంది. అక్కడ జీవితాలను, ఆచారవ్యవహారాలను పరిచయం చేస్తుంది. ఒక తరం నుండి ఇంకో తరానికి వారసత్వంగా వచ్చే విద్యల్లో, కథల్లో ఎంతటి గొప్ప విషయాలు దాగుంటాయో చెప్పే కథ. భలే గొప్ప కథ!

ఇంకో చిట్టి కథ కూడా నాకు చాలా నచ్చింది. ఇందులో ఊరికి కొంతదూరంలో ఉన్న కాన్వెంటులో చదువుకుంటున్న అన్నచెల్లెల్లు సెలవలకని ఇంటికి వస్తారు. సెలవలు అయ్యాక బడికి తిరిగిపోవాలి. అంటే కొండలు దిగాలి, ఎక్కాలి, ఏర్లు దాటాలి, రోడెక్కాలి, బసెక్కాలి – ఆ ప్రయాణాన్నంతా కళ్ళకి కట్టినట్టు వర్ణిస్తారు. ఇంత ప్రయాణం చేసి ఏ అర్థరాత్రో బడికి చేరుకుంటే అక్కడ హాస్టల్‌లో మనిషితో జరిగిన ఒక చిన్న సంఘటన ఇంత ప్రయాణపు బడలికకన్నా ఎక్కువ నీరసింపజేస్తుంది. ప్రకృతికి మనిషికి అదే తేడానా అనిపించేలా చేస్తుంది.

ఇందులో ఉన్న కథలన్నీ అపురూపమైనవి. అరుదైనవి. వాటిని ఇంత జాగ్రత్తగా ఒడిసిపట్టుకొని మనకి అందించిన కథారచయితను ఎంత అభినందించినా తక్కువే!

ఏ అస్సామ్‌కో, నాగాలాండ్‌కో ట్రిప్పు వేద్దామన్న ప్రస్తావన వచ్చినప్పుడుల్లా నా స్నేహితుల్లో వినిపించే జోక్ – “ఆ వెళ్దాం! వెళ్దాం! అక్కడికైతే రిటర్న్ టికెట్స్ అవసరం లేదు!” ఆ మాటలో నిజం లేకపోలేదు, అదే నిజం కాకపోయినా. కానీ ఈ పుస్తకం చదువుతున్నంత సేపు నేను అక్కడే ఉన్నట్టు అనిపించింది. అక్కడి బువ్వ తిన్నట్టు, అక్కడి నీరు తాగినట్టు, అక్కడ భయంభయంగా దాక్కున్నట్టు, అక్కడ దిక్కుతోచక ఏడ్చినట్టు, అక్కడే చావు తప్పి కన్నులొట్ట పోయాక ముసిముసిగా నవ్వుకున్నట్టు అనిపించేలా చేశాయి ఈ కథలు!

సాహిత్యంపై ఆసక్తి ఉన్నవారందరూ తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఇది!

Book Details:

These Hills Called Home: Stories from a Warzone

Temsula Ao

Zubaan Publishers

Pages: 147

You Might Also Like

Leave a Reply