తొవ్వ ముచ్చట్లు – 2

వ్యాసకర్త: Halley
*************

ఈ పరిచయం జయధీర్ తిరుమలరావు గారి “తొవ్వ ముచ్చట్లు” (రెండవ భాగం) గురించి. నేను “తొవ్వ ముచ్చట్లు” అభిమానిని. కొన్ని కథనాలు చదివినప్పుడు అరెరే మన కాలంలో కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయా? ఇది అద్భుతమైన ప్రగతి యుగం కదా, మరి ఈ ప్రొఫెసర్ ఏంటి ఇలాంటి విషయాల గురించి రాస్తున్నారు? కొంపతీసి కాల్పనిక సాహిత్యమా ఏమిటి ఇది! అని అనిపిస్తుంది.

గుంటూరు శేషేంద్ర శర్మ గారి వాక్యం ఒకటి పదే పదే గుర్తొస్తూ ఉంటుంది నాకు “తొవ్వ ముచ్చట్లు” చదివిన ప్రతీసారీ, అంతరించి పోతున్న కళా సాంస్కృతిక సంపదలను గురించి చదివిన ప్రతీ సారీ – “మనం చరిత్రలో ఏ అధ్యాయంలో ప్రవేశించామంటే చావు నెదుర్కొనటం కంటే బ్రతుకు నెదుర్కోవటం పెద్ద సమస్య అయింది – అంతకంటే భయంకరమైన సమస్య అంతా బాగుందని అందరమూ కలిసి పాడాలి.” అన్న వాక్యం. తొవ్వ ముచ్చట్లు లోని ప్రతీ కథనం శేషేంద్ర గారి మాటలు అక్షర సత్యాలని అనిపించేలా ఉంటాయి.

ఆంగ్ల మీడియాలో ఈ కథలు అసలు కనపడవు. తెలుగు టీవీ పత్రికలలో అడపా దడపా కనపడతాయి ఇటువంటి కథనాలు. ఈ తొవ్వ ముచ్చట్లు అన్న శీర్షిక ఎన్నో నెలలు కొనసాగించిన ఆంధ్రభూమి దినపత్రికను మెచ్చుకోవాలి అన్నిటికంటే ముందు.

ఈ రోజు దినపత్రిక తిరగేయగానే ముందుగా నాకు కనపడ్డది విశాఖపట్నంలో ఒక ఎమ్యెల్యే మరో మాజీ ఎమ్యెల్యే మావోయిస్టుల చేతులలో హతం అన్న వార్త. దాని వెనుక అక్రమ మైనింగ్ క్వారీలకు సంబంధించిన కారణాలు ఉండి ఉండచ్చును అని మరి కొన్ని కథనాలు చదివాను అదే పత్రికలో. చప్పున నాకు తొవ్వ ముచ్చట్లు లోని – “ధార్మిక దేశంలో అణుధార్మికతా?“ అన్న వ్యాసం గుర్తొచ్చింది. రచయిత మరి కొందరు సహచరులతో కలిసి నల్లగొండ జిల్లా పెద్ద ఆడిశేర్లపల్లి మండలంలో యురేనియం తవ్వకాలకు సంబంధించి చేసిన పోరాటం గురించిన కథనం ఇది. ఇది మాత్రమే కాక తొవ్వ ముచ్చట్లు లో బయ్యారం గురించి రాసిన “అంతరించే అసలు సంపద” అన్న వ్యాసం గుర్తొచ్చింది నాకు. బయ్యారం పేరు చెప్పగానే సాధారణంగా అందరికీ ఇనుప ఖనిజం, బ్రదర్ అనిల్, రక్షణ స్టీల్స్, జీ.ఓ.64, రక రకాల రాజకీయ వాదనలు గుర్తొస్తాయి అని, తనకు మాత్రం బయ్యారం పెద్ద గుట్టనానుకుని ఉన్న కోయల ఇలవేలుపు, ప్రకృతి పరిరక్షకురాలు అయిన ముసలవ్వ దేవత గుర్తొస్తుంది అని అంటారు రచయిత . తవ్వకం జరగవలసిందే, ఉక్కు ఫ్యాక్టరీ రావలసిందే ఆంటే ఏ షరతులతో ఎవరి కోసం? అన్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని అంటారు రచయిత. స్థానిక ప్రాంతీయ ప్రజల ఆకాంక్ష అవసరాల కోసం, జీవితాల మెరుగు కోసం తవ్వకాలు జరగాలి అని అంటారు తిరుమల రావు గారు. జాతీయ అవసరాల పేరుతో స్థానికులకు అన్యాయం జరిగి, విదేశీ స్వదేశీ పెట్టుబడిదారుల జేబులు నింపే దృశ్యమే కనిపిస్తుంది అంటారు ఆయన. ఖనిజ సంపద కన్నా – తరతరాల నిక్షిప్త సాంస్కృతిక సంపద ఎనలేనిది అని అంటారు తిరుమల రావు గారు. ఇటువంటి వాక్యం రాయాలంటే సాంప్రదాయ సంస్కృతుల పట్ల ఎంతో నిబద్ధత ఉంటే కానీ రాయలేరు ఎవరైనా! కంటికి కనిపించని ఖనిజ సంపద మన సంస్కృతి!

ఇటువంటివి చదివినప్పుడు పోరాటాలు జరిపే వారిని ప్రగతి నిరోధకులు గానో, ఇప్పటి కాలపు భాషలో అర్బన్ నక్సల్స్ గానో, మరొకటనో అనేసి ఒక అభిప్రాయానికి రావటం సులువు. మన కాలములో జరిగే ఎన్నో ఉద్యమాల వెనుకా, కలహాల వెనుకా, వనరుల పెంపకానికి సంబంధించిన సమస్యలే ఉంటాయి సాధారణంగా. ఇటువంటివి చదివినప్పుడల్లా నాకైతే గాంధీ మహాత్ముని వాక్యం గుర్తొస్తుంది.

God forbid that India should ever take to industrialism after the manner of the West. If an entire nation of 300 millions took to similar economic exploitation, it would strip of the world bare like locusts. Unless the capitalists of India help to avert that tragedy by becoming trustees of the welfare of the masses, and by devoting their talents not to amassing wealth for themselves but to the service of the masses in an altruistic spirit, they will end either by destroying the masses or being destroyed by them.

(భారత దేశం కనుక పాశ్చాత్య దేశాల పారిశ్రామిక అభివృద్ధి నమూనాని అనుసరించిందంటే ఈ దేశాన్నిక ఆ దేవుడే కాపాడాలి. ముప్పై కోట్ల జనాభా గల ఈ దేశం పాశ్చాత్య దేశాల వలె ఆర్థిక దోపిడీకి పూనుకుంటే మన దేశం పరిస్థితి కుక్కలు చింపిన విస్తరి లాగా అవుతుంది. స్వదేశీ క్యాపిటలిస్టులు ఈ ఘోరకలిని అరికట్టాలి అంటే వారు తమ స్వార్థం కోసం సంపదలను కూడబెట్టుకోవటం కంటే సామాన్య ప్రజల శ్రేయస్సు కోసం తాపత్రయ పడే నిస్వార్థ ధర్మకర్తలుగా మారాలి. లేదంటే ఈ వ్యాపారస్తుల చేతిలో ప్రజానీకం అంతం కావటమో లేదా ప్రజాగ్రహానికి క్యాపిటలిస్టులు కాలి బూడిద అవటమో జరగటం తథ్యం.)

బ్రిటిషు వలస పాలకుల ఐశ్వర్యం భారత దేశం వంటి ఎన్నో కాలనీలను కొల్లగొట్టి వారి సంస్కృతులను నాశనం చేసి ఆ ప్రజలను బానిసలు చేయటం ద్వారా వచ్చిన ఐశ్వర్యం. నాకూ మార్క్సుకి పెద్దగా పడదు కానీ ఆయన భాషలో అయితే శ్రమ దోపిడీ అనాలి దీనిని. సంస్కృతులని నాశనం చేయడంలో మెగా పారిశ్రామీకరణకి పట్టం కట్టటంలో ఇరవయ్యో శతాబ్దపు కమ్యూనిస్టు దేశాలకి క్యాపిటలిస్టు దేశాలకి పెద్ద తేడా లేదు నా ఉద్దేశంలో. నేను చదివిన మేరకు నెహ్రు అభివృద్ధి నమూనాకి మార్క్సు అభివృద్ధి నమూనాకి ఆట్టే తేడా ఏమీ లేదు. గాంధీ మాటల్లో చెప్పాలంటే:

“Pandit Nehru wants industrialization, because he thinks that, if it is socialized, it would be free from the evils of capitalism. My own view is that the evils are inherent in industrialism, and no amount of socialization can eradicate them”
(నెహ్రూకి పారిశ్రామీకరణ కావాలి. పరిశ్రమలను సామాజీకరిస్తే అప్పుడు అటువంటి పారిశ్రామీకరణకి పెట్టుబడిదారీ వ్యవస్థలోని విషమవిపత్తుల నుంచి విముక్తి లభించినట్టే అనుకుంటాడు నెహ్రూ. అయితే నా ఉద్దేశంలో ఈ లోపాలు పారిశ్రామీకరణలో స్వతహా ఉన్న లోపాలు. ఎంత సామాజీకరించినా కూడా ఆ లోపాలను సమూలంగా నిర్మూలించలేము) .

ఇక మనకందరికీ ఆదర్శమైన అమెరికా పునాదులు నేటివ్ అమెరికన్ జాతుల వినాశనం మీదనే కదా జరిగింది! ఇప్పుడు అటువంటి అభివృద్ధే మన స్వతంత్ర భారతం కోరుకుంటే, మన దేశంలో మనమే కాలనీలు సృష్టించుకొని మన వనరులను, మనుషులను, సంస్కృతులను మనమే నాశనం చేసుకోవాలి. మెగా అభివృద్ధి పథకాలలో ఇప్పుడు జరిగేది ఇదే. నేను ఈ పరిచయం రాస్తున్న ఈ క్షణంలో కూడా గంగా నది పవిత్రతను గురించి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న స్వామి సానంద్ గారు చేస్తున్న పోరాటం కూడా ఇటువంటిదే. ఆయన పూర్వాశ్రమంలో ఐఐటీ ప్రొఫెస్సర్.

తొవ్వ ముచ్చట్లు చదువుతున్న ప్రతీ సారి ఈ భస్మాసుర అభివృద్ధి గురించిన ప్రశ్నలే వస్తాయి నాకు. ముఖ్యంగా విచక్షణ కోల్పోయి చేసే స్మృతుల హననానికి సాంస్కృతిక మారణహోమానికి సంబందించిన ప్రశ్నలు. అభివృద్ధి చెందుతున్న అభినవ భారతానికి సంబంధించిన ఇటువంటి కథనాల సంకలనమే ఈ తొవ్వ ముచ్చట్లు!

ఎల్లప్ప : గురూజీ గురువు” అని ఆదిలాబాదులో కళాశ్రమం నడిపిన రవీంద్ర శర్మ గారి గురించి వారి గురుతుల్యులు ఐన ఎల్లప్ప గారి గురించిన వ్యాసం ఇది. నేను ఆదిలాబాదు ప్రాంతంలో నా “ఐఐఐటి హైదరాబాదు” సహవాసాల మూలాన తెల్సుకున్న రవీందర్ శర్మ గారి ఆశ్రమానికి ఒకటి రెండు సార్లు వెళ్ళటం జరిగింది. శర్మగారిని కలవలేకపోయినా ఆ ఆశ్రమంలో ఏదో తెలియని శక్తి ఉన్నట్టుగా అనిపిస్తుంది వెళ్ళినప్రతి సారి. భారతీయ సంప్రదాయాలన్నీ పూర్తిగా తుడిచి పెట్టుకు పోకుండా బహుశా ఈ ఆశ్రమం బతికించేస్తుంది ఏమో అనిపిస్తోంది. సనాతన భారతీయ సంప్రదాయం అంటే గాయత్రీ మంత్రాలు సంధ్యావందనాలు మాత్రమే కాదు (జయధీర్ గారి భాషలో శిష్టాచారాలు!); కుమ్మరి, కమ్మరి, కంసాలి, మేదరి వారి వంటి ఎందరో కళాకారులు చేతి పనిముట్ల వారి జీవన విధానాలు కూడానూ అని అనిపిస్తుంది ఆదిలాబాదు కళాశ్రమం గురించి తలుచుకున్న ప్రతీసారీ. భారతీయ సమాజపు వైవిధ్యాన్ని సంక్లిష్టతను కళాశ్రమంలో చూపినట్టుగా చూపగల చోట్లు పెద్దగా లేవు నేడు దేశంలో. రవీందర్ శర్మ గారి లాగా సంప్రదాయాన్ని దర్శించగల దార్శనికులు కూడా లేరు ఈ కాలంలో నా ఉద్దేశంలో. అటువంటి శర్మ గారి గురుతుల్యులు ఎల్లప్ప గురించిన కథనం అంటే నా మనసుకు హత్తుకోకుండా ఎలా ఉంటుంది. ఎల్లప్ప అంతిమ సంస్కారం గురించిన ప్రస్తావన ఉన్నది ఈ వ్యాసంలో. ఎల్లప్ప నకాషి చిత్రకారుల కుంటుంబానికి చెందిన వాడు. ఆయన చనిపోయినప్పుడు మేదరవాడు వెదురు బొంగులూ తడిక తెచ్చాడట. కుమ్మరాయన కుండ తెచ్చాడట, మాదిగాయన నులక డప్పులతో వచ్చాడట, అవుసలాయన పంచరత్నాలు తెచ్చాడట, బుక్కాయన బుక్క గులాలు తెచ్చాడట (చూడు). సబ్బండ వర్ణాల వారు ఒక్కక్క దినుసు తెచ్చి అంతిమ క్రియల్లో పాల్గొన్నారట. ఈ అంతిమ క్రియల్లోని మానవీయ స్పందన ప్రభావం గురూజీ రవీందర్ శర్మ గారిపై ఎలా ఉండింది అని తిరుమలరావుగారు కొన్ని విషయాలు పేర్కొన్నారు ఈ వ్యాసంలో. ఇటువంటి కథనాలు తొవ్వ ముచ్చట్లు లో మాత్రమే కనపడతాయి నాకు. ఇది కేవలం అణచివేసేవారు (exploiter) అణచివేయబడ్డ (exploited) వారి గురించిన థీసిస్ కాదు. ఇది ఆ వ్యవస్థలోని మనుషుల మధ్య మానవతా బాంధవ్యం గురించి. వ్యవస్థలను నాశనం చేస్తాము సరి మరి బాంధవ్యం మాటేమిటి? నెల జీతమిస్తేనో కిరాయికో బాంధవ్యం దొరకదు కదా! ఆన్లైన్ ఆర్డర్ చేయలేము కూడానూ ! ఒక కేజీ బాంధవ్యం కొంటే ఇంకొక కేజీ బాంధవ్యం ఫ్రీ అన్న ఆఫర్ ఇచ్చే మేధావులు ఇంకా రాలేదు. క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా లేదు! ఏ సమాజంలోనైనా మంచి చెడులు ఉంటాయి. మన సంప్రదాయ సమాజంలో చెడుని చూసినంతగా మంచిని చూడకపోవడం ఎందువల్ల జరిగిందో అర్థం కాదు అని రాశారు రచయిత ఈ వ్యాసంలో గురూజీతో తన సంభాషణని గురించి ప్రస్తావిస్తూ.

“కళ -సంక్షేమం – రాజ్యం” అని దళిత కళారూపాలలో అట్టడుగు వర్గానికి చెందిన పటం కథకి ప్రసిద్ధి చెందిన నష్కల్ గ్రామం కథ ఒకటి ఉంది ఈ పుస్తకంలో. నష్కల్ లోని డక్కలి వారు వరంగల్ కరీంనగర్ లోని మాదిగ వారికి జాంబ పురాణం పటం కథ చెప్తారట. వీరి సంక్షేమం కోసం తన ఎమ్మెల్సీ నిధుల నుంచి పది లక్షలు ఇచ్చారట చుక్కా రామయ్య గారు. చాలా ఆనందం వేసింది ఆ వాక్యం చదివినప్పుడు. మొన్నామధ్యన ఈ తొవ్వ ముచ్చట్లు మూడవ భాగం పుస్తకం రిలీజు వేడుకలో రామయ్య గారిని కలవటం జరిగింది. మనస్ఫూర్తిగా నమస్కరించాను. అంతకు మించి నాబోటి వాళ్ళు ఇంకేం చేయగలరు. అయితే ఈ వ్యాసం అంతా ఒక ఎత్తు ఈ వ్యాసం ముగింపు మరొక ఎత్తు! “సారూ! అంతా బాగానే ఉంది. మా జీవిక నడిచేది “పటం” ఉంటేనే. పదిహేనేళ్ల కిందట మీరు వేయించి ఇచ్చిన పటాలు చిరిగిపోతున్నాయి. ఓ రెండు పటాలు చేయించి ఇయ్యరా” అని అడిగాడట డక్కలి కులానికి చెందిన గోపాల్. వసతులు కల్పిస్తాం. ఇళ్ళు కట్టిస్తాం. వాటికి నిధులుంటాయి. కానీ వారి ఆత్మగౌరవ చిహ్నం అయిన పటం వేయించటం ఎలా? అని ప్రశ్నిస్తారు తిరుమల రావు గారు! పటాలు వేసే చిత్రకారులు కూలీలుగా మారిపోయారు. కొందరు దర్జీలు అయ్యారు. మరి పటాలు ఎలా? అని ప్రశ్నిస్తారు తిరుమలరావు గారు. పటం పోయిందంటే ప్రదర్శన ఆగిపోయినట్టే. ప్రాచీన పట కథ అంతరించి పోవడమే అని అంటారు రచయిత. తొవ్వ ముచ్చట్లు పుస్తకం ఆత్మ ఘోష అంతా ఈ వాక్యాలలో ఉంది! ఇలాంటి అట్టడుగు వర్గాల ఆత్మ గౌరవ చిహ్నాలు భారత జాతికి చెందిన విలువైన సాంస్కృతిక సంపద మన కళ్ళ ముందే కనుమరుగవటం దారుణం! ఈ నష్టాన్ని కనీసం గుర్తించలేకపోవటం నా తరం దౌర్భాగ్యం. ఐ.పీ.యల్ వేలాలలో ఎవరు ఎంతకి అమ్ముడుపోయారో చర్చించుకుంటాం కానీ, ఇటువంటి వాటి గురించి చర్చించుకోము మేము మిత్రులం కలుసుకున్నప్పుడు! ఇక విశ్వవిద్యాలయాలలోని ప్రధాన స్రవంతిలో ఈ గొంతుకలు వినబడడం అసాధ్యం. మనవి చదువులేనా అని అనిపిస్తుంది ఇటువంటి కథనాలు చదివితే. మన సంస్కృతి విలువ మనకే తెలియనప్పుడు ఎంత చదువుకుంటే ఏమి! ఆధునికత అనే మత్తుమందుని మోతాదుకు మించి మింగి మన స్మృతులని మనమే పనిగట్టుకొని మరీ మర్చిపోతున్నాము!

“కళాకారులు-ఆత్మగౌరవ స్వరం” అన్న వ్యాసం జానపద కళాకారుల గురించి. వేల ఏళ్లుగా మనగలిగిన ఈ కళలు ఇవ్వాళే ఎందుకు ఆరిపోతున్నాయి? వాటిని పట్టించుకోకపోవడం ఎందుకు జరుగుతోంది? అని ప్రశ్నిస్తారు ఈ వ్యాస్యంలో రచయిత. భూస్వామ్య సమాజంలోనైనా ఈ కళలకు కొంత ఆదరణ ఉండేది. ఈ కళాకారుల జీవనోపాధికి ప్రణాళికాబద్ధమైన వ్యవస్థలను ఏర్పాటు చేశారు. వారి కళాహక్కులను గౌరవించారు. ఆధునిక కాలంలో ఈ వ్యవస్థ దెబ్బతినింది, ఆ కళాకారుల హక్కులు కాలరాయబడ్డాయి అని అంటారు రచయిత.

“ఒక ఉగాది కలయిక” అన్న వ్యాసం ఆదిలాబాదు కళాశ్రమము గురించిన మరొక కథనం. “విద్యావేత్తలు ఆగిన చోట” అన్నది ఖమ్మం జిల్లా చింతూరు మండలం రామన్న పాలెంలో కోయ పాఠశాల నడుపుతున్న యాదయ్య గురించి. ఆయన ప్రస్థానంలో ఎం.వీ ఫౌండేషన్ రెడ్డీస్ ఫౌండేషన్ ఎలా సహాయపడ్డాయో రాశారు. నాలుగు వేల పైగా కోయ విద్యార్థులు చదువుకుంటున్నారట ఆ యాదయ్యగారి పాఠశాలలో. వీరి చదువు కూడా కోయ వారి నేపథ్యానికి అనుగుణంగా తయారు చేసిన కొత్త సిలబస్ అట. చాలా సంతోషమేసింది యాదయ్య గారి కృషిని గురించి చదువుతుంటే. ఇటువంటి కథలు ప్రధాన స్రవంతిలోకి వినిపించటం తిరుమలరావు గారివంటి వారికే సాధ్యం!

చిలుకూరు బాలాజీ గుడికి, దేవాదాయ శాఖకి మధ్యన జరిగిన వివాదం గురించిన ప్రస్తావన ఉంది “తిరుగుబాటు పాఠం” అన్న వ్యాసంలో. చిలుకూరు దేవాలయాన్ని దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకోడానికి చేసిన ప్రయత్నం, దానికి ప్రతిగా ఆలయ అర్చకులు చేసిన ప్రజా పోరాటం గురించిన వ్యాసం ఇది. (చూడు: 2008 నాటి వార్త)

ఇటువంటి ముచ్చట్లు ఎన్నో మరెన్నో. పుస్తకం లభించు చోటు.

You Might Also Like

Leave a Reply