Neil Postman’s Technopoly: The Surrender of Culture to Technology

వ్యాసకర్త: Halley
************

ఈ పరిచయం నీల్ పోస్ట్మాన్ గారు 1992లో రచించిన Technopoly: The Surrender of Culture to Technology అన్న పుస్తకం గురించి. ఆయన గురించిన వికీ పేజీ ఇక్కడ.

టెక్నాలజీ మన జీవితాలను సంస్కృతులను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో తెలుసుకోగోరే వారు తప్పక చదవవలసిన పుస్తకం ఇది.

ఒక టెక్నాలజీని మన జీవితంలో అంతర్భాగంగా మార్చుకొనే ముందు దాని మంచి చెడులను బేరీజు వేసుకొని అప్పుడే ఆ టెక్నాలజీకి ఆమోద ముద్ర వేయాలని అన్నారు ఆయన పుస్తకం మొదట్లోనే. ప్రియురాలి మైకంలో ఆమెలోని అవలక్షణాలని మర్చిపోయే ప్రేమికుడి లాగా టెక్నాలజీని గుడ్డిగా నమ్మే ఒంటికన్ను రాక్షసుల వల్ల సమాజానికి ఎంతో ప్రమాదమని అంటూ, అదే విధంగా టెక్నాలజీని పూర్తిగా ద్వేషించే ఒంటి కన్ను రాక్షసులూ సమాజానికి మేలేమి చేయరు అని అన్నారు. ప్రతీ టెక్నాలజీలో మంచీ ‘మరియు’ చెడు ఉంటుంది అని అన్నారు (మంచి ‘లేదా’ చెడు కాదు. మంచీ చెడూ రెండూనూ!!)

మనకు తెలియకుండానే టెక్నాలజీ అన్నది మన రోజూవారీ పదాల అర్థాలని మార్చివేస్తుందని అంటూ కొన్ని విషయాలు ప్రస్తావించారు ఆయన . ఏది నిజము ఏది న్యాయము అన్న విషయాన్ని రూఢీ చేసుకోవటం అన్నది మౌఖిక సంస్కృతిలో ఉన్న ప్రజలు ఒక లాగా రాత ప్రధానమైన లిఖిత సంస్కృతులలో ఉన్న ప్రజలు ఇంకొక లాగా చేసుకుంటారని అన్నారు.

అలానే పిల్లలకు మార్కులు గ్రేడులు ఇవ్వటం అన్న సంస్కృతి 1792లో విలియం ఫారిష్ పర్యవేక్షణలో జరిగిందని అంతకు ముందు కాలం వారికి విద్యార్ధులకి మార్కులు గ్రేడులు ఇవ్వటం అన్నది తెలియదని అన్నారు. ఆ కాలం వారికి ఒక వ్యక్తి ఐక్యూ 134 కాబట్టి ఆతను 131 ఉన్న వాడి కంటే బాగా పని చేయాలి అని లేదా క్యాపిటలిజం పై రాసిన ఈ వ్యాసం A గ్రేడు అని మరొకటి C- గ్రేడు అని అన్నటువంటి ఆలోచనలు కొత్తగా అనిపిస్తాయని అన్నారు. అంకెల టెక్నాలజీకి మన ఆలోచనలు దాసోహం ఐపోయినందున మనకు అవి అర్థం అవుతున్నాయి కానీ ఆ పద్దతికి అలవాటు పడని వారికి అది అర్థం కాదు విడ్డూరంగా అనిపించచ్చును కూడా అని అన్నారు.

ఆలా ఒక టెక్నాలజీకి అలవాటు పడిన వారు ఒకే ప్రాపంచిక దృక్పథానికి అలవాటు పడతారని అన్నారు. ప్రఖ్యాత తత్త్వవేత్త Wittgenstein అత్యంత పురాతనమైన “భాష” అనే టెక్నాలజీని గురించి ఇలా అన్నారట, భాష అన్నది ఆలోచనలు వ్యక్తం చేయటానికి కేవలం ఒక వాహనం మాత్రమే కాదు ఆ భాష అన్నది ఆ ఆలోచనారథసారథి కూడానూ అని. అలా ఆయన అనటం వెనుక మర్మం ఇదే అని అన్నారు నీల్ పోస్ట్మాన్ గారు. సుత్తి చేత బట్టిన వాడికి ప్రతీ వస్తువు మేకులానే అనిపిస్తుంది అన్న సామెత గురించి కూడా ఈ విషయంలో గుర్తు చేసుకోవచ్చని అన్నారు. అంతే కాక కంప్యూటర్ చేత బట్టిన వ్యక్తికి ప్రతీదీ డేటా లాగానే అనిపిస్తుందని, గ్రేడ్ షీట్ చేతబట్టిన వాడికి ప్రతిదీ ఒక అంకె లాగానే అనిపిస్తుందని అన్నారు కాదేది గ్రేడింగుకు అనర్హం అన్నట్టు గా. ఉదాహరణకి మీ నాన్నకు తండ్రి పనిలో నూటికి ఎనభై మార్కులే వచ్చాయి మా నాన్నకి వందకి వంద. కాబట్టి మా నాన్న మీ నాన్నకంటే ఇరవై శాతం ఎక్కువ నాన్న అని మీతో ఎవరన్నా అంటే ఎలా ఉంటుంది? అలాగ అనమాట! ఒక రకం టెక్నాలజీకి అలవాటు అయిపోయి అన్నిటిని ఆ రంగుటద్దాలతో చూస్తే అలా ఉంటుంది . ఆయన ఏదో పామరుల స్థాయిలో చెప్పినా ఈ యుగానికి ఎంతో నప్పే మాట ఇది. ఈ మధ్య కాలంలో బాగా పేరు పొందిన యువల్ నోవా హరారి రచిన “సేపియన్స్” “హోమో డ్యూస్“ పుస్తకాలలో కూడా ఈ ప్రస్తావన కలదు. ఈ యుగపు మతంగా “డేటాయిజం”ను అభివర్ణించారు హరారి. ప్రతీ సమస్యని కేవలం టెక్నాలజీ సమస్య గా భావించే కాలంలో ఉన్నాము. ఈ కాలంలో హరారి ని చదివిన వారంతా నీల్ పోస్ట్మాన్ ని కూడా చదవాలి. ఈ మధ్యన కొంత తగ్గింది కాని రెండు సంవత్సరాల కిందట ఏ సమస్య చెప్పినా startup మేధావులు దానికి ఒక యాప్ కనిపెడితే పోలా అని సమాధానం ఇచ్చే వారు. ఆలా ఉంటుంది అనమాట ఈ మైకం.

అయితే ఏ టెక్నాలజీని అయినా దాని కొత్తల్లో మంచి చెడులని బేరీజు వేయటం చాలా కష్టం అని అంటారు పోస్ట్మాన్ గారు. యాంత్రిక గడియారం వాడుక మొట్టమొదట పన్నెండు పదమూడవ శతాబ్దంలో రోజూ చర్చిలో చేయవలసిన ఏడు ప్రార్థనలకు ఉపయోగపడుతుంది అని చర్చి ఫాదర్లు ప్రారంభించారట. అది చర్చి నుంచి వ్యాపారస్తుల వాస్తు వాణిజ్యంలోకి ఫ్యాక్టరీ పరిశ్రమలకు వ్యాపిస్తుంది అని ఆ చర్చి ఫాదర్లు అప్పట్లో ఊహించి ఉండక పోవచ్చును అని అంటారు ఆయన. యాంత్రిక గడియారం లేనిదే క్యాపిటలిజం అన్నది సంభవించేది కాదని అంటారు పోస్ట్మాన్. దైవ ప్రార్థనలు ఖచ్చితమైన సమయంలో చేయటానికని కనిపెట్టిన గడియారం వాడకం చివరకు అంతులేని వస్తు సంపద కూడబెట్టటమే పరమావిధిగా గల క్యాపిటలిజంకు ఉపయోగపడటం అన్నది పెద్ద వింత అని అన్నారు.

అసలు టెక్నాలజీ కనిపెట్టిన మేధావులకు కూడా ఆ టెక్నాలజీ ప్రభావాన్ని అంచనా వేయటం చేతగాదని అంటారు పోస్ట్మాన్. అచ్చు యంత్రం కనిపెట్టిన గూటెన్బెర్గ్ సాంప్రదాయ క్యాథలిక్ అని అంటూ కొన్ని సంవత్సరాల తర్వాత అదే అచ్చు టెక్నాలజీ వలన ప్రతీ ఇంటిలోనూ ఒక బైబిలు రావటం వలన ఎవరి మతగురువు వారే అయ్యి కాథలిక్ చర్చి ప్రాధాన్యత అంతరించి పోతుంది అని గూటెన్బెర్గ్ అంచనా వేసి ఉండే అవకాశం లేదని అంటారు. బైబిలు లో ఏముందో తెలుసుకోటానికి చర్చికి వెళ్లి పొపు లేదా పోపు నియుక్త ఫాదర్ చెప్పింది ఎందుకు వినాలి నా ఇంట్లో నా బైబిలు నేనే చదువుకుంటా నాకు నేనే పోపు అని అనుకోటం ఈ అచ్చు యంత్రం ప్రభావంతో మొదలైన బైబిలు ముద్రణ వలన వచ్చిందని అంటారు పోస్ట్మాన్. ఇది కూడా చాలా గాఢమైన అంశం. ఈ విషయం గురించి తెల్సు కోవాలి అనుకొనే వారు క్రైస్తవంలో లూథర్ ఉద్యమం మొదలైన ఉద్యమాలు తెచ్చిన మార్పు గురించి చదవాలి. “The printing revolution also contributed mightily to the Protestant Reformation that split apart the Catholic Church” అని చదివాను ఒక ఆర్టికల్లో ఒకసారి నేను.

కాబట్టి టెక్నాలజీ అన్న దాని ప్రభావాన్ని తక్కువ అంచనా వేయరాదు. ఇదే విషయం గురించి ఇంకొక ఉదాహరణ ఇస్తూ సంప్రదాయ మౌఖిక విద్యాబోధనా పద్దతిలో గురువు స్థానం మరియు భాద్యత విద్యార్థి విద్య నేర్చుకునే తీరూ ఒక లాగా ఉంటే, అచ్చు పుస్తకం ప్రధానముగా చెప్పే విద్యలో ఒక లాగానూ, టీవీ వంటి మాధ్యమంతో మరొక లాగానూ, కంప్యూటర్ అంతర్జాలం చొచ్చుకు పోయిన ఆధునిక విద్యలో మరొక విధంగా ఈ గురు శిష్య సంబంధం రూపాంతరం చెందుతుందని అన్నారు.

కాబట్టి టెక్నాలజీ ముందు, టెక్నాలజీ తర్వాత ఒక సమాజాన్ని అంచనా వేయాలి అంటే ఇది కేవలం కూడికలు తీసివేతలు అంశం కాదనీ, టెక్నాలజీ అన్నది ఒక కొత్త జీవావరణం (ఏకాలజి) సృష్టిస్తుంది అని అంటారు అయన. అచ్చు యంత్రం తర్వాత వచ్చిన యూరోపు కేవలం “యూరోపు + అచ్చు యంత్రం” కాదు అని అది ఒక సరికొత్త యూరోపు అని అంటారు. టెలివిజన్ తర్వాతి అమెరికా కేవలం “అమెరికా + టెలివిజన్” కాదని అది సమూలంగా మారి పోయిన సరికొత్త అమెరికా అని అంటారు. ప్రతి ఇంటిని, ప్రతి పాఠశాలను, ప్రతి రాజకీయ ప్రచారవ్యూహాన్ని, ప్రతి చర్చిని, ప్రతి పరిశ్రమని, టీవీ ప్రభావితం చేసిందని అంటారు ఆయన. కాబట్టి ఒక కొత్త టెక్నాలజీ ఒక సమాజంలోకి చొచ్చుకొని రాగానే పాత వ్యవస్థలకు కొత్త వ్యవస్థలకు మహా సంగ్రామం జరుగుతుందని అంటారు పోస్ట్మాన్ గారు. ఇలా జరిగే సంగ్రామంలో సంస్కృతులు ఎంతో ఒత్తిడికి లోనవు తాయని అంటారు ఆయన.

కొత్త టెక్నాలజీలు మన ఆలోచనలని మార్చి వేస్తాయని, మనం దేని గురించి ఆలోచిస్తాము అన్న విషయం ఆ టెక్నాలజీ అనంతరం మారిపోతుందని అంటారు ఆయన. అంతే కాక టెక్నాలజీలు మన నిత్యజీవితంలో వాడే రకరకాల చిహ్నాలతో ప్రతీకలతో మన సంబంధాన్ని మర్చి వేస్తాయని అన్నారు. సంఘం సమూహం గురించిన మన భావననే అవి మార్చేస్తాయని అన్నారు. ఇదంతా ఎదో అకడమిక్ అని అనిపించేవారు ఒక్కసారి స్మార్ట్ ఫోన్లో మునిగి పోయి చుట్టూ పక్కన వారిని తల ఎత్తి చూడకుండా లిఫ్టులో గడిపిన క్షణాలు గుర్తు తెచ్చుకోండి. ఇంటర్నెట్ అనంతర యుగంలో సమూహంలో ఒంటరితనాన్ని గురించి వాపోతున్న సంఘటనలను గుర్తుకు తెచ్చుకోండి. టెక్నాలజీ జీవితాన్ని ఎన్ని కోణాల్లో ప్రభావితం చేస్తుందో తెలుస్తుంది.

రికాబులు (stirrups) అన్నవి కనిపెట్టనంతవరకు కదన రంగం వరకు వెళ్ళటానికి సాధనంగా మాత్రమే ఉండేవంట గుర్రాలు. రికాబుల తర్వాత గుర్రంపై ఉండి యుద్ధం చేయటం అన్నది మొదలైంది అని, దానితో యుద్ధ స్వరూపమే మారిపోయింది అని అంటూ, టెక్నాలజీ యుద్ధ జీవావరణాన్ని (War Ecology) ఎలా మార్చిందో చెప్పారు నీల్ పోస్ట్మాన్ గారు. ఇలా విల్లంబుల నుంచి తుపాకీ రైఫిల్ కు మారినప్పుడు కొన్ని సంస్కృతులు పూర్తిగా నామరూపాలు లేకుండా పోయాయని అంటారు ఆయన. ఒక టెక్నాలజీ ఇంకొక టెక్నాజీని భర్తీ చేసే ఈ సంధి కాలంలో ఎంతో విధ్వంసం జరుగుతుంది అని అంటూ మరికొన్ని ఉదాహరణలు పేర్కొన్నారు ఆయన.

ఇలా చెబుతూ నాగరికతలు మూడు రకాలని అంటూ “టూల్ మేకింగ్” సంస్కృతిని గురించి వివరించారు. ఈ సంస్కృతులు టెక్నాలజీని పని ముట్ల తయారీకి సాధనంగా వాడుకొనేవి అని అన్నారు. వీటిలో వారి ప్రధాన జీవన విధానానికి రకరకాల ఆచారాలు సంప్రదాయాలు మతాలూ ఆధ్యాత్మిక పరంపరలు ఉంటాయట. టెక్నాలజీ అన్నది కేవలం పనిముట్ల తయారీకి ఉపయోగ పడే సాధనం గానే ఉంటుందట.

ఇంకా రెండవ రకం నాగరికతను టెక్నోక్రసీ (Technocracy – డెమోక్రసీ లాగా) అని అంటారు ఆయన. ఈ టెక్నోక్రసీలో మునుపటి పనిముట్ల సంస్కృతి వలే కాకుండా టెక్నాలజీ అన్నది రోజు వారి పనికి ఉపయోగ పడే సాధనం లాగా సంప్రదాయ సంస్కృతిలో ఒక భాగం లాగా కాకుండా ఆ ప్రధాన సంస్కృతితోనే ఎదురు పోరాటం చేస్తుందట. టెక్నాలజీ మరియు సంస్కృతి వేరు వేరు కాదు టెక్నాలజీనే సంస్కృతికి మూలం అన్నట్టుగా తయారవుతుంది అనమాట.

పని ముట్ల సంస్కృతి నుంచి టెక్నోక్రసి గా మారిన పశ్చిమ దేశాల సంస్కృతులు మధ్య యూరోపులో పుట్టిన మూడు టెక్నాలజీల వల్ల ఈ మార్పునకు లోనయ్యాయి అని అంటారు ఆయన. మొదట అచ్చు యంత్రాల టెక్నాలజీ మౌఖిక సాంప్రదాయాలలోని జ్ఞానమీమాంసను (ఎపిస్టమోలోజి) ప్రశ్నించాయి అని అన్నారు రచయిత . తర్వాత గడియారం అన్నది కాలం గురించిన ఆలోచనను సమూలంగా మార్చి వేసిందని, అటు తర్వాత టెలిస్కోపు అన్నది జుడాయిజం క్రైస్తవం ప్రధానముగా గల మధ్య యూరోపు సంస్కృతులని ప్రశ్నించింది అంటారు ఆయన. పని ముట్లకి, సంస్కృతికి మధ్యన సంబంధం ఇలా ఈ టెక్నాలజీ ల వల్ల ఎంతో ప్రభావితమైంది అని అంటారు ఆయన. కోపర్నికస్, కెప్లెర్, గలీలియో, డెకార్ట్, న్యూటన్ వంటి వారు పని ముట్ల సంస్కృతికి చెందిన వారు అయినప్పటికీ తమ ఆవిష్కరణల ద్వారా తర్వాత వచ్చే టెక్నోక్రసీ సంస్కృతికి నాంది పలికారని అన్నారు.

ఈ టెక్నోక్రసీ అన్నది ఫ్రాన్సిస్ బేకన్ కాలంతో ప్రారంభం అయింది అని అంటారు పోస్ట్మాన్ గారు. బేకన్ టెక్నోక్రసీ యుగానికి నాంది పలుకుతూ ఒక కొత్త సౌధాన్ని నిర్మించాడని ఆ సౌధం పేరే “అధికారం మరియు అభివృద్ధి “ అని అంటారు ఆయన. ఈ టెక్నోక్రసీ మహా సౌధంలో ఒక గదిలో దేవుడిని ఒక మూలకు విసిరేశారని అని అంటారు ఆయన.

బేకన్ చనిపోయిన ఒక నూట యాభై ఏళ్ళ తర్వాత యూరోపు పూర్తిగా 1780-1800 కాలానికి ఈ టెక్నోక్రసీ యుగానికి మారిందని అంటారు ఆయన. ఈ పని ముట్ల సంస్కృతి నుంచి టెక్నోక్రసీ కి మారే క్రమంలో దేవుడు చనిపోయాడు అనటం కంటే కూడా ఈ టెక్నాక్రసీ లో దేవుడి చుట్టూ నిర్మించిన నాగరికత సంస్కృతి ఆ భావనలకు సిద్ధించిన అధికారం చాలా వరకు తగ్గిందని అంటారు ఆయన.

అయితే పని ముట్ల సంస్కృతి నుంచి టెక్నక్రసీకి జరిగిన ఈ మార్పు ఘోర విపత్తో లేక మహాద్భుతమో ఆలోచించే ముందు అది జరిగింది అని గుర్తించాలి అంటారు ఆయన. వెనుకకు తిరిగి వెళ్లే అవకాశం లేనంతగా జరిగింది అంటారు ఆయన.

1765 లో ఈ టెక్నోక్రసీ లో జేమ్స్ వాట్ కనిపెట్టిన ఆవిరి యంత్రం నుంచి ప్రతి దశాబ్దము ఎదో ఒక కొత్త యంత్రం పుట్టుకొస్తూనే ఉందని అంటారు ఆయన. ఈ యంత్రాలు, వాటి తాలూకా నైపుణ్యాలు, ఆ యంత్ర శక్తి, అప్పటి పశ్చిమ దేశాల ఆధ్యాత్మిక భౌతిక దృక్పథాలని సమూలంగా మార్చేశాయని అంటారు ఆయన. ఈ టెక్నోక్రాసీ తో పాటుగానే 1776లో ఆడమ్ స్మిత్ ఆలోచనలతో ప్రభావితమైన మార్కెట్టు సంస్కృతి మెల్లగా ఊపిరి పోసుకుంది అంటారు ఆయన. అలా 1830లలో టెలిగ్రాఫు, 1860లో టైపు రైటరు, 1876 లో టెలిఫోను, ఇలా వెల్లువలా కొత్త టెక్నాలజీలు పుట్టుకొచ్చాయి టెక్నోక్రసీ యుగంలో అంటారు ఆయన.

పందొమ్మిదవ శతాబ్దపు గొప్ప ఆవిష్కరణ ఏమిటి అంటే- అది ఏదో ఒకటి ఆవిషరించాలి అన్న ఆలోచనే అని అన్నారట ఆల్ఫ్రెడ్ నార్త్ వైట్ హెడ్ – greatest invention of the nineteenth century was the idea of invention itself. ఎలా కనిపెట్టాలి అన్న ప్రశ్న ప్రధానం అయిపోయింది కానీ, ఎందుకు కనిపెట్టాలి అన్న ప్రశ్న ప్రధానం అవలేదు టెక్నోక్రసీలో అంటారు పోస్ట్మాన్. నిజానికి ఎందుకు కనిపెట్టాలి అన్న ప్రశ్న మరుగున పడిపోయింది అని అంటారాయన. ఏదన్నా చేసేయచ్చు అంటే అది తప్పకుండా చేసేయడమే అన్న ఆలోచన పంతొమ్మిదవ శతాబ్దపు టెక్నోక్రసీలో నే పుట్టింది అంటారు ఆయన. దీనితో పాటు objectivity, efficiency, expertise, standardization, measurement, and progress అన్న సిద్ధాంతాల మీద ఎప్పుడు లేనంత నమ్మకం వచ్చిందని అంటారు ఆయన. ఈ సాంకేతికతతో కూడున్న అవధుల్లేని ప్రగతి అన్న భావనకు పూర్ణత్వం సిద్ధించాలి అంటే ప్రజలను ప్రభువు బిడ్డలుగా కంటే, సంఘంలో పౌరులుగా కంటే, వినియోగదారులలాగా చూడటమే సౌకర్యవంతం అయింది అంటారు ఆయన. అంటే ప్రజలను కూడా మార్కెట్టు లాగా లేదా మార్కెట్టుకు ముడి సరుకు లాగా చూడటం అనమాట – “the engine of technological progress worked most efficiently when people are conceived of not as children of God or even as citizens but as consumers—that is to say, as markets”.

అయితే ఇరవయ్యో శతాబ్దపు ప్రారంభంలోనే ఈ కేవల ఆర్థిక మానవుడి ఆధ్యాత్మిక శూన్యత్వం గురించి విలియం బ్లేక్, మత్యు ఆర్నాల్డ్, కార్లైల్, రస్కిన్, విలియం మారిస్, జోలా, బాల్జాక్ వంటి వారెందరో ఎన్నో రచనలు చేసారని అన్నారు రచయిత. ఇటువంటి టెక్నోక్రసీలో జన్మించి ప్రపంచ శక్తిగా అమెరికా ఆవిర్భవించింది అంటారు పోస్ట్మాన్.

హెన్రీ డేవిడ్ థోరు వంటి వారు ఈ టెక్నాలజీ మాయ గురించి హెచ్చరించిన దాఖలాలు లేకపోలేదని అంటూ, అటు వంటి హెచ్చరికలకు రెండు సమాధానాలు వస్తాయని – మొదటిది పాతకాలపు పని ముట్టు సంస్కృతుల సంకెళ్లు తెంచుకొని ముందుకు వెళ్ళాలని అనటం, రెండవది మన సంప్రదాయాలను ఈ టెక్నోక్రసి హతమార్చలేదని అనటం అని అంటారు రచయిత.

ఈ సాంకేతిక జీవనం (technocratic way of life) అన్నదానికి ప్రాంతీయ ఆచారాలు అలవాట్లు, పాపం పుణ్యం అన్న వాటి గురించిన చింతన, కుటుంబాలు- నాన్నమ్మలు అమ్మమ్మలు, వేల యేండ్ల సంప్రదాయాలు- వంటివి పరస్పర విరుద్ధాలు అని అన్నారు పోస్ట్మాన్. అయినప్పటికీ ఈ టెక్నోక్రసీ అన్నది సాంప్రదాయాన్ని పూర్తిగా నిర్మూలించలేక పోయిందని, పంతొమ్మిదవ శతాబ్దపు అమెరికాలో ఈ రెంటిమధ్యనా ఒక అసౌకర్యమైన ఉద్రిక్తత ఉండేదని అంటారు ఆయన. అయితే ఎప్పుడైతే ఈ టెక్నోక్రసీ అన్నది దానికి విరుద్ధమైన భావనలను పూర్తిగా రూపుమాపుతుందో, అప్పుడు అది టెక్నోపోలీ గా రూపాంతరం చెందుతుంది అని అంటారు. అంటే టెక్నాలజీ యొక్క సంపూర్ణ ఆధిపత్యం అనమాట. సాంకేతికత యొక్క సార్వభౌమత్వం అనమాట.

ఆల్డాస్ హాక్స్లీ తన “బ్రేవ్ న్యూ వరల్డ్” లో రాసినట్టు ఈ టెక్నోపోలీ అన్నది ప్రత్యాన్మయాలని ఏ విధంగా రూపు మాపుతుందో చెబుతారు పోస్ట్మాన్. ప్రత్యామ్నాయ ఆలోచనా స్రవంతులను చట్ట విరుద్ధమనో అనైతికమనో ప్రజామోదం లేనిదనో అని టెక్నోపోలి రూపుమాపదని, టెక్నోపోలి ఈ ప్రత్యామ్నాయ ఆలోచనా ధారలను అదృశ్యం చేసి, తద్వారా రోజు వారి జీవితానికి అసంబద్ధంగా చేస్తుందని అంటారు ఆయన. ఇలా అదృశ్యం, అసంబద్ధం చేయటంలో భాగంగా మతము ధర్మము అంటే ఏంటి అన్న భావనను, రాజకీయం అంటే ఏంటి ఉన్న భావనను, చరిత్ర, సత్యం, గోప్యత, మేధస్సు వంటి వాటి గురించి మనకు అంతకు ముందున్న నిర్వచనాలు సమూలంగా ఈ సాంకేతికత మార్చేస్తుంది అని అంటారు ఆయన. ఒక సారి నిర్వచనాలు మారిపోయాక పాత అర్థాలు భావనలు గుర్తించే శక్తి కోల్పోతాం అనమాట. గత స్మృతుల జ్ఞాపకాల వినాశనం జరుగుతుంది అనమాట. టెక్నోపోలి అంటే నిరంకుశ సాంకేతికత నియంతృత్వ సాంకేతికత అంటారాయన. 1992లో తాను ఈ పుస్తకం రాసేటప్పటికి ప్రపంచ పటం మొత్తం మీద టెక్నోపోలి అనబడే నిరంకుశ సాంకేతికతకు పూర్తిగా దాసోహమైన ఏకైక దేశం అమెరికానే అని అంటారు ఆయన. టెక్నోపోలిగా పూర్తిగా రూపాంతరం చెందిన ఏకైక సంస్కృతి అమెరికానే అని అంటారు ఆయన.

1927 లో “ది ఔట్లుక్ ఫర్ అమెరికన్ కల్చర్ “ అని రాసిన వ్యాసంలో ఆల్డస్ హాక్స్లీ కూడా ఇంచు మించు ఇలాంటి అభిప్రాయమే వ్యక్త పరిచారు. అప్పటి అమెరికా భవిష్యత్తు అటు తర్వాత ప్రపంచ భవిష్యత్తు ఒకటే అంటారు హాక్స్లీ. మంచో చెడో, ప్రపంచం అమెరికనైజ్ అవ్వక తప్పదు అంటారు ఆయన. అదే విధంగా పోస్ట్మాన్ కూడా మెల్లగా ప్రపంచ దేశాలన్నీ, జపాన్, ఐరోపాలతో మొదలుకొని, టెక్నోపోలీలు గా మారటానికి ఉవ్విళ్లూరుతున్నాయి అంటారు. అన్ని సాంస్కృతిక విలువలను, ఆలోచనా ధారాలను, పద్దతులను, సాంకేతికత యొక్క సార్వభౌమత్వానికి పాదాక్రాంతం చేయటమే టెక్నోపోలి అని అంటారు ఆయన. ఈ సాంకేతికత యొక్క సార్వభౌమత్వమే ఈ పుస్తకం యొక్క ప్రధాన భూమిక. మిగిలిన పుస్తకం అంతానూ ఇరవయ్యో శతాబ్దపు అమెరికా టెక్నోపోలిగా మారటం గురించి పోస్ట్మాన్ గారి ఆలోచనలూ, గాఢమైన చర్చలు అనమాట.

ఎలాగూ తెలుగు వాళ్ళు అన్నాక రేపో మాపో అందరూ ఆ దేశానికి వలస వెళ్లే వాళ్లే కనుక, ఆ భూతల స్వర్గం చరిత్రను గురించి ఒక అమెరికన్ మేధావి ఆలోచనలు తెల్సుకోగోరే వారు తప్పక చదువ వలసిన పుస్తకం ఇది! నా వ్యంగ్యాన్ని పక్కన పెడితే సాంకేతికత తాలూకా సార్వభౌమత్వం సంస్కృతి పై, నాగరికత పై, ప్రజా జీవనం పై చేసే జులుం గురించి ఆలోచించే వారు కూడా చదవాల్సిన పుస్తకం.

మార్టిన్ లూథర్ కింగ్ “ది మాన్ హూ వాస్ ఎ ఫూల్” అన్న వ్యాసంలో అన్నట్టు “ప్రభువే నా కాపరి” అనే బదులు “సైన్సే నా కాపరి” అని అంటే సమాజం ఏమౌతుంది? అని ఆలోచించేవారు కూడా చదవాల్సిన పుస్తకం.

అమెరికాలోని ఈ టెక్నోపోలీని అందరు ప్రతిఘటించాలి అని అంటారు పోస్ట్మాన్ గారు. సాంకేతికత యొక్క సార్వభౌమత్వంలో మగ్గే బానిసల లాగా కాకుండా ఆ సాంకేతికతను కూడా సహేతుకంగా ప్రశ్నించాలి అని అంటారు ఆయన. ప్రశ్నించు, ప్రశ్నించు అని మొత్తుకునే దేశీ ఉద్యమ కారులు వారి తాత్కాలిక అజెండాల నుంచి బయటకి వచ్చి ఈ పుస్తకంలో ప్రతిపాదించిన విషయం గురించి ఆలోచించాలి. ఎలాగూ ఇందాక చెప్పినట్టు పోను పోను ప్రతి దేశమూ అమెరికానే.. సబ్కా సాథ్ సబ్కా వికాస్ మరి! కాబట్టి అందరూనూ పోస్ట్మాన్ గారు చెప్పిన ఈ కింది వాక్యాలను చదువుకోవలెను. చదివి ఈ టెక్నోపోలీ మైకాన్ని ప్రతిఘటించవలెను.

అమెరికన్ టెక్నోపోలిని (ఇండియన్ టెక్నోపోలి) ప్రశ్నించే ప్రజలు ఇలా ఉండాలట:

“ఎవరన్నా సర్వే రిజల్ట్ చెబితే ఆవేశ పడే ముందు ఆ సర్వేలో ఏ ప్రశ్నలు అడిగారు అవే ప్రశ్నలు ఎందుకు అడిగారు అని ప్రశ్నించాలట”

“మానవ సంబంధాల ప్రధాన లక్ష్యం ఫలోత్పాదక శక్తి (efficiency) పెంచటం కాదు అని చెప్పాలట”.

“అంకెల గారడీ మీద అపారమైన నమ్మకం పెట్టుకోకూడదట .

గణన చేయగేలిగే నైపుణ్యం తీర్పు చెప్పగల విచక్షణ రెండు వేరు వేరు విషయాలు అని గుర్తించాలట. ఖచ్చితత్వానికి, సత్యానికి ఉన్న తేడాని గుర్తించగలగాలట.”

“ఇంగిత జ్ఞానాన్ని సైకాలజీ లేదా మరే ఇతర సోషల్ సైన్సు స్వాధీనం చేసుకుంటే చూస్తూ ఊరుకోకూడదట.”

“అవధుల్లేని అభివృద్ధి అన్న ఆలోచనను ఆదర్శంగా మార్చుకునే ముందు సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించాలట.”

“సమాచారానికి దానిని అవగాహన చేసుకునే సామర్థ్యానికి గల తేడాను గుర్తించాలట.”

“వయసు మళ్ళిన వారిని, లేదా పాతదైన దేనినైనా కూడా వెంటనే వ్యర్థ పదార్థమనో అనవసరమనో అనుకోకూడదట.”

“కుటుంబ విలువలు, కుటుంబ గౌరవం వంటి విషయాలపై దృష్టి పెట్టాలట. ఎప్పుడన్నా ఎవరినన్నా ఓదారుస్తూ ఉంటే వారు నీతో పాటే అదే గదిలో ఉండేటట్టుగా చూసుకోవాలట (వీడియో కాల్సు చాట్టింగులు చెల్లవు మరి!)”

“మతం యొక్క గొప్ప కథనాలను అట్టే పక్కన పారేయక వాటికి కూడా సముచిత స్థానం ఇవ్వాలట. సైన్సు అనేది అన్ని నిజాలను తెలుసుకోవటానికి రుజువు చేయటానికి ఏకైక మార్గం అని అనుకోకూడదట. సైన్సు పరిధిని గుర్తెరగాలని ఆయన అభిప్రాయం. అన్ని సమస్యలు ప్రశ్నలకి సైన్సులోనే సమాధానాలు దొరకవు అని.”

“ఇది పవిత్రం ఇది అపవిత్రం అన్న భావనను కోల్పోకూడదట. ఆధునికతను ఎక్కువ చేసి చూపటానికి సాంప్రదాయాన్ని తక్కువ చేయనక్కర్లేదట.”

“సాంకేతిక ప్రగతిని కొనియాడుతూనే కేవలం ఆ ఒక్క కోణంలో మాత్రమే ప్రగతి సాధ్యమని అనుకోకూడదట. సాంకేతిక విజయం తప్పితే మానవ మేధకు సాధ్యపడే గొప్ప విజయం మరొకటి లేదు అనే భ్రమలో బ్రతక కూడదట”.

“మిగిలిన అన్ని విషయాలలో లాగానే సాంకేతిక ప్రగతి అన్న దాని వెనుక ఉండే సామజిక ఆర్థిక రాజకీయ కోణాలను వాటి తాలూకా అజెండాలను గుర్తించాలనీ, మిగిలిన అన్నిటి లాగానే ఆ టెక్నాలజీ ఉపయోగం వలన జీవితం మెరుగవుతుందో లేదో తెలుసుకొని అంచనా వేసుకోవాలనీ అంటారాయన. మిగిలిన అన్నిటి లాగానే టెక్నాలజీని కూడా పరిశీలించి, సహేతుకంగా విమర్శించి, నియంత్రించాలని అనుకోటంలో తప్పేమి లేదని అంటారు అయన. టెక్నాలజీ అన్న దానికి ఎప్పుడు కూడా ఒక ఆమడ దూరంలో ఉండే దానిని ఆస్వాదించాలి అని, అదెప్పుడు ఒక వింత లాగా అనుకోవాలే కానీ జీవితానికి అది అనివార్యం అని సహజమని అనుకొని దానికి దాసోహం కారాదని అన్నారు”

P.S: పుస్తకం సైజు పరిచయాలు మానుకోవాలి నేను! ఈ విషయంలో సహాయ పడే టెక్నాలజీ ఏదన్నా ఉంటే చెప్పండి!

You Might Also Like

Leave a Reply