రీసెర్చి – గెరిల్లా బంగోరె

రచయిత: కె.వి.రమణారెడ్డి
టైప్ చేసి పంపినవారు: పవన్ సంతోష్ సూరంపూడి
(బంగోరె (1938-1982) మరణించిన కొద్దికాలానికి దూపాటి బ్రహ్మయ్య, తదితరులైన బంగోరె మిత్రులు ఆయన తొలి పరిశోధనల్లో కొన్నిటిని వ్యాస సంకలనంగా బంగోరె కూని రాగాలు – ఇతర రచనలు అన్న పేరుతో ప్రచురించారు. ఆ పుస్తకం ముందుమాటల్లో ఈ వ్యాసం ప్రచురితమైనది. ఆఖరు పేరా మినహాయించి బంగోరె జీవితం, కృషి గురించి ఉన్న భాగాన్ని ప్రచురిస్తున్నాము. ఈ వ్యాసాన్ని ఇక్కడ ప్రచురించడం కాపీహక్కుల ఉల్లంఘన అయిన పక్షంలో దయచేసి editor@pustakam.net కు ఈమెయిల్ ద్వారా వివరాలు తెలియజేస్తే వ్యాసం తొలగించగలము – పవన్ సంతోష్, పుస్తకం.నెట్.)

*****************

పోరాటకారుడు కాకపోతే మరేమీకాడు బంగోరె. తదితరరంగాలలో దేనిలోనూ సాగని పోరాటాన్ని అక్షరరంగంలో ఎడతెరిపిలేకుండా పది పన్నెండేళ్లపాటు సాగించాడు. నిద్రాణంగానో అల్పసంతృప్తితోనో పడివున్న పరిశోధనా లోకం మీదికి ఉరుములు మారుమ్రోగి మెరుపులు విదిలించే దుందుడుకు వానమబ్బులాగా దూకిపడ్డాడు. గతానుగతికత్వానికి గుండె కంపరం పుట్టించాడు. గ్రంథచౌర్యప్రవృత్తి ముఖంమీది ముసుగు ఊడలాగి, అక్రమంగా ఆర్జించిన కీర్తిధనాన్ని కక్కించాడు. విద్వల్లోకం ఉలికిపడేలా, అకాడెమిక్ పాండిత్యం వెలవెలబోయేలా, పీఠాలూ డాక్టోరేట్లూ ప్రొఫెసర్ గిరీలూ దడుచుకునేలా, అద్భుతమైన ఉపజ్ఞతో అధిమానుషమనిపించే ఉగ్రదీక్షతో సాహసోపేతంగా అజ్ఞాతవిషయాలను, ‘అస్తికల’ రూపంలోనైనా సరే. ఎన్నిటినో సుపరిచితవిషయాలుగా మార్చగలిగాడు. నిజానికి 1970-1980 దశాబ్దం పరిశోధనారంగంలో నిస్సందేహంగా బంగోరెది.

చదివింది కామర్సు ఆనర్స్ కోర్స్ – నెగ్గుకురాలేకపోయింది కామర్సుగా మారిన లోకజీవితంలోనే. చదువుకు సరిపోయే కొలువు రెండేళ్లుమించి చెయ్యలేక కడప కో-ఆపరేటివ్ బాంక్ అధ్యక్షుడి నెదిరించి బైటపడిన నాటినుంచీ హిమాలయ సందర్శనానికంటూ అనుబంధాలనూ రక్తపాశాలను తెగదెంచుకు వెళ్ళిననాటిదాకా, బండి గోపాలరెడ్డిది నిలకడలేని బతుకే. ఆంధ్రా యూనివర్శిటీ విద్యార్థి దశలోనే అతని హృదయం వెలికురికింది. జర్నలిజం తన అభిమాన విషయమనేది సూచనగా లోకానికి తెలిసింది. సాహిత్యంవంటి కళావిషయాలలో గాఢమైన అభినివేశం ఉన్నట్టుగాకూడా, బుచ్చిబాబు, సంజీవదేవ్, కాళోజీ, ఆచంట జానకిరామ్ వంటివారితో తన సాహచర్యం బైటపెట్టింది. నెల్లూరికి తిరిగివచ్చాక ‘జమీన్ రైతు’లో సహాయ సంపాదకుడుగా కుదురుకుని తాను జీతభత్యాలరూపంలో తానినుంచి పొందినదానికంటె ఎన్నోరెట్లు ఆ పత్రికకు ప్రసిద్ధి కలిపించాడు. ఆతర్వాత మదరాసులో అమెరికన్ కాన్సలేట్ లో కొంతకాలం ఉండి మళ్ళీ నెల్లూరికివచ్చి ఈమారు ‘యూత్ కాంగ్రెస్’ పత్రికను సైతం జీవశక్తితో నిగనిగలారించగలిగాడు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీవారి సి. పి. బ్రౌన్ ప్రోజెక్టు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంవారి వేమన ప్రోజెక్టు, ఆంధ్ర యూనివర్సిటీవారి సి. ఆర్. రెడ్డి ప్రోజెక్టు, బంగోరె అనేవాడే లేకుంటే, చవిటిబుర్రల చవిటిపర్రలే అయివుండేవి. పట్టిందల్లా బంగారమే అయిందంటే కారణం, బంగోరె ‘హస్తవాసి’ మాత్రమే.

బండి శంకరరెడ్డి శంకరమ్మల కడుపు చల్లగా మినగల్లు గ్రామంలో మామూలు రైతుకుటుంబంలో పుట్టి, కోవూరులో నెల్లూరులో చదువుకుని, వాల్తేరులో చదువు డిగ్రీ పుచ్చుకున్న బండి గోపాలరెడ్డి కడప వుద్యోగంనాటికి బ. గో. రె. గా పిల్ల పిడుగయ్యాడు చిచ్చర పిడుగైంది బంగోరెగానే, పూర్వజన్మసుకృతం మాటెందుకుగాని, తన సామాజిక పారిసర్యంకూడా ఈపరిణామానికి అనుకూలమైంది కాదు. శ్రుతపాండిత్యమైనా లేదనాలి. మరి ఇంతటి గొప్పవింతగా ఫలించిన విషయపరిజ్ఞాన ఆసక్తి ఆతనికి ఎలా సమకూరిందో ఊహించడంకూడా కష్టమే. రెండుకాళ్ళ పరిశోధనాగారంగా రూపొంది ఒక్కొక అంగ ఒకొక్క అద్భుతమనిపిస్తూ ఔత్సాహిక పరిశోధనాకృషిని సమజ్జ్వలం చెయ్యగలగడం నిజంగానే విస్మయకరం. అయితే ఏది కూడా మిన్నులనుంచి ఊడిపడదు. నేపథ్యంలో అదృశ్యంగా సాగుతూ సుదీర్ఘమైన సన్నాహాలు ఉందంటే, హఠాత్ పరివర్తనతో కళ్ళు మిరుమిట్లుగొలిపే పర్యవసానం ఏవీ కలగదు.

బుచ్చిబాబు నవల ‘చివరకు మిగిలేది’, ఆచంట జానకిరామ్ స్వీయచరిత్ర ‘సాగుతున్న యాత్ర’, ఖలీల్ జీబ్రాన్ రచన ‘ప్రోఫెట్’- వీటితో మొదలైంది బంగోరె సాధన- నాకు తెలిసి ‘జమీన్ రైతు’లో ‘లోకలిస్టు’గా వారం వారం ఒక శీర్షికను నిర్వహించే క్రమంలో మొగ్గ విప్పింది పరిశోధన. అయితే మొదట్లో దానికొక దారీ తెన్నూ వుండేదికాదు. నిర్దిష్టమైన లక్ష్యంగానీ స్పష్టమైన కార్యప్రణాళికగానీ లేదు. బాల్యచాపల్యం లాంటి మనస్థితిలో ఎటుబడితే అటుగా చెంగలిస్తూ, ఎప్పటికప్పుడు ఆకర్షణను ఆసక్తిగా మార్చుకుంటూ, నెల్లూరి ‘మొలగొలుకు’ వరి వంగడం మొదలు హిమాలయ దృశ్యసౌందర్యంవరకు ఎన్నో చిన్న విషయాల గురించి గొప్ప వాస్తవాలను ఆవిష్కరించాలనే దాహంతో కిందమీదౌతూ వచ్చాడు. శ్రీహరికోట మరుగుజ్జులు, దుగరాజపట్నం లైట్ హౌస్ నెల్లూరులో క్రైస్తవుల గోరీలమిట్ట గోప్యాలు, నెల్లూరు సుబేదార్ యూసుఫ్ ఖాన్, నెల్లూరి మొదటి జర్నలిస్టు దంపూరి నర్సయ్య – ఇలా బంగోరె అభిమానవిషయాల తాలూకు రేఖాచిత్రంలో ‘కర్వ్’ క్రమంగా నెల్లూరి పరిమితులు మీరిపోసాగింది. దంపూరి నర్సయ్య పుణ్యమా అని కందుకూరి వీరేశలింగం ముగ్గులోకి నిలిచినట్లుగానే, టైలర్ అనే బ్రిటీష్ పోలీసు అధికారి పర్యటనా గ్రంథ ప్రస్తావనామూలంగా బ్రిటీష్ ప్రభుత్వంమీద ధ్వజమెత్తి జాతీయస్వాతంత్ర్యచరిత్రలో అజ్ఞాతంగానేవున్న ‘వెంకటగిరి వీరుడు’ ప్రత్యక్షమయ్యాడు. ఒంగోలు మునిసుబ్రహ్మణ్యంద్వారా గురజాడ అప్పారావు వచ్చాడు. ఒకటి సుబ్రహ్మణ్యభారతి అసంపూర్తి నవల ‘చంద్రిక కథ’ అనువాదానికి పురిగొలిపితే, మరొకటి ‘మొట్టమొదటి కన్యాశుల్కం’ పునర్ముద్రణకు దారితీసింది. వేమన, బ్రౌన్ విషయాల పరిశోధనకు మళ్ళించిన నార్లవారి గ్రంథాల ప్రస్తావనకుకూడా ఈ శీర్షికే పనికివచ్చింది. అందుచేత ఒకమాట అనవచ్చు! ముందుముందు బంగోరె మార్కు పరిశోధనా విజయపరంపరకు ప్రాతిపదిక ‘లోకలిస్టు’ శీర్షికే.

‘నిత్య నైమిత్తిక వార్తాపరిథి’కి కట్టుబడి కూపస్థమండూకంలా బంగోరె ఎన్నడూ వుండలేదు. తన జీవనోపాధికి జర్నలిజం పనికి వచ్చిందిగాని జీవనోపాధి జర్నలిజానికి ఏనాడూ తాను లోబడిపోలేదు. ఎన్నో చిల్లరవిషయాలతో జీవిత క్రౌర్యంతో రాజీపడి వుండవచ్చుగాని జీవిత క్రౌర్యానికి వెల్లవేసే క్షుద్ర లౌక్యప్రవృత్తికి తన శిరస్సునుగానీ హృదయాన్నిగానీ తాకట్టు పెట్టలేదు. తనతనం బంగోరె మూలధనం. అవి చెక్కుచెదరలేదు. రాజకీయ విషయాల గురించి తన పరిమితులు తనవి. అభిమాన దురభిమానాలకారణంగా తాను ప్రజాపోరాట రాజకీయాన్ని బోధపరుచుకుని సమర్థించవలసినంతగా ఆపని చెయ్యలేదు గాని పాలకవర్గ రాజకీయమైన రాచకీయంతో తెలిసితెలిసీ శ్రుతిగలిపిన సందర్భాలు చాలా తక్కువ. ‘రేడికల్’ అనదగిన భావవైఖరి బంగోరెది. అతని ఫరిశోధనాఫలితాలు కూడా అలాంటివే. తీగతో బాటు డొంకనంతా కదిలించందే తృప్తిపడేఘటం కానందుచేత ఒక సర్వసాధారణమైన అంశం నుంచి పరమ అసాధారణమైన విశేషాన్ని ఆవిష్కరించడానికి నిద్రాహారాలు మాని పరిశ్రమించేవాడు. కావలసిన భోగట్టా రాబట్టేందుకు, సామగ్రిని సేకరించేందుకు, అష్టకష్టాలయినా పడేవాడు. చిన్న పుస్తకం కోసం వందలు పోసేవాడు. బూజూ దుమ్మూ నిండిన గదులలో భూతంలా మసలేవాడు. అవసరమనుకుంటే హస్తలాఘవ విద్యను అనన్యంగా ప్రదర్శించేవాడు. పరిశోధన ఆవేశించిన మనిషి గనుక. అరాకొరా పనులతో బద్ధకంతో అశ్రద్ధతో ఈ రంగంలో పనిచేసే బడుద్ధాయిలను చూచి విసుక్కొనేవాడు. ఔన్సు పరిశ్రమకు టన్ను ప్రతిఫలంపొంది భుజకీర్తులు తగిలించుకున్నవారి గురించి శుద్ధ సంస్కృతం ప్రయోగించేవాడు. ఈ విషయంలో మాత్రం చిన్నంతరం పెద్దంతరం తెలీదు. దూకుడుకి మారుపేరుగా బంగోరె తన చేతినీ నాలునూ బాగా పదునెక్కించుకున్నాడు. రెండు కొనలనుంచీ మండసాగిన కొవ్వొత్తిలా తన ఆరోగ్యాన్ని శక్తినీ అమితంగా ఖర్చు చేసుకున్నాడు.

ఇచ్చిపోయినదానికంటె మరెంతో ఎక్కువ ఇవ్వగలిగిన విషయసంభారం గుట్టలుగా తనవద్ద పోగుబడివుండికూడా, ప్రభుత్వంలోనేగాక విద్యాసంస్థలలోనూ వేళ్లు దన్నుకొనివున్న అధికారరోగంకారణంగా తీవ్రమైన మనస్తాపానికీ నిర్వేదానికీ గురయ్యాడు. కాబట్టే మననుంచి తప్పుకున్నాడు. ఎవ్వరినీ సెలవడగలేదు. వీడ్కోలు చెప్పలేదు. అగ్నిపర్వతంలా తనలో తనే సెగలు కక్కుకుంటూ ‘దౌర్భాగ్యపు’ ఈ దేశాన్నీ విద్యావిజ్ఞానరంగాల్నీ రోసి, ఖలీల్ జీబ్రాన్ అన్నట్లు ‘మరణ సౌందర్యం’ వెదుక్కుంటూ వెళ్ళిపోయాడు. బంగోరె లేని లోటుని బంగోరె తప్ప మరొకరు తీర్చలేరు.

*********
(గతంలో పుస్తకం.నెట్ లో బంగోరె గురించి వచ్చిన వ్యాసం ఇక్కడ. బంగోరె సంపాదకత్వంలో వెలువడిన “బ్రౌన్ లేఖలు – ఆధునికాంధ్ర సాహిత్య చరిత్ర శకలాలు” గురించి 2010లో వచ్చిన పరిచయం ఇక్కడ.)

You Might Also Like

One Comment

  1. M. Madhusudana rao. Nellore

    Good sir. M. Madhu nellore AP cell 8500768554

Leave a Reply