‘గురువారం’గా మారిన ఓ డిటెక్టివ్ కథ

వ్యాసకర్త: భవాని ఫణి
*************
The Man Who Was Thursday – A Nightmare, ఈ పుస్తకాన్ని G.K.Chesterton 1908లో, అంటే తన ఇరవై ఏడేళ్ల వయసప్పుడు రాసారు. ఈయన రచనల్లో కనిపించే, తన వాదనను తనే ఖండించుకునే విధంగా ఉండే తర్కం కారణంగా, ఈయన్ని ప్రిన్స్ ఆఫ్ పారడాక్స్ అంటారు. ఈ రచనతో పాటుగా, ‘ద నెపోలియన్ ఆఫ్ నాటింగ్ హిల్’, ‘ఫాదర్ బ్రౌన్’ కథలు కూడా, చెస్టర్ టన్ రచనల్లో అధిక ప్రాచుర్యాన్ని పొందినవి.

‘మనిషి పేరు గురువారం ఏమిటా!’ అని, నవల పేరు చూడగానే అనిపిస్తుంది గానీ, నిజానికి ఈ రచనలో ఉన్నంత క్లిష్టత, పేరులో లేనే లేదు.

గాబ్రియేల్ సైమ్ ఒక కవి. తీవ్రమైన కట్టుబాట్ల కారణంగా పుట్టుకొచ్చిన తిరుగుబాటు ధోరణులు గల సభ్యులతో నిండి ఉన్న అతని కుటుంబం, తిరుగుబాటు మీదే తిరుగుబాటు చేసే ధోరణిని అతనికి కల్పిస్తుంది. వారంతా కలిసి, ఎల్లప్పుడూ నియమాల్ని అతిక్రమించే ప్రయత్నాల్లో ఉండటం వల్ల, అతనికి మరేదీ కొత్తగా చేసే అవకాశం లేక, వాళ్ళు వదిలెయ్యగా మిగిలిపోయిన, బుద్ధిమంతుడిగా ఉండటమనే విషయంపైనే దృష్టిని కేంద్రీకరిస్తాడు. చట్టాన్ని అతిక్రమించేవారంటే మొదట్నించీ అతనికి అసహ్యమే. చిన్నప్పుడు రోడ్డు మీద వెళ్తుండగా, పేలిన బాంబు కారణంగా రక్తాలోడిన మనుషుల్ని చూసాకా, అతనికి అరాచకవాదులంటే ద్వేషం ఏర్పడుతుంది. కొంతకాలానికి అతనికి ఒక పోలీస్ ద్వారా, అరాచకవాదుల్ని పట్టుకోవడానికి జరిగే ‘తెలివైన డిటెక్టివ్’ల నియామకం గురించి తెలుస్తుంది. చీకటి గదిలో, ముఖం కనిపించకుండా, వెనక్కి తిరిగి కూర్చుని ఉన్న ఓ వ్యక్తి, సైమ్ ని డిటెక్టివ్ గా నియమిస్తాడు. మనసుకు నచ్చిన పని దొరికిన ఉత్సాహంలో, ఉత్తేజితుడై ఉన్న సైమ్ కి, అరాచకవాది అయిన మరో కవి గ్రెగరీ కనిపిస్తాడు. అతన్ని ఏమార్చి, అతని స్థానంలో ఓ పెద్ద అరాచకవాద సంఘపు సభ్యుడిగా చేరతాడు సైమ్. అక్కడ అతని పదవి పేరు ‘గురువారం’. మొత్తం ఏడుగురు సభ్యులుండే ఆ సంఘంలో, ఏడు పదవులకీ ఏడు వారాల పేర్లుంటాయి. ఆ సంఘపు అధ్యక్షుడు ఆదివారం. ఈ సండే, పరమ భయంకరంగా, చూసేవారి మనస్సులో విచిత్రమైన భయాన్ని రేకెత్తించే విధంగా ఉంటాడు. అప్పుడు మొదలవుతుంది ఓ ఆటలాంటి వేట. మెల్లగా సైమ్ కి అర్థమయ్యేదేమిటంటే, అధ్యక్షుడు సండే తప్ప, తమ సంఘంలోని మిగిలిన సభ్యులంతా మారువేషంలో ఉన్న గూఢచారులే. అందరూ అరాచకవాదుల్ని పట్టుకోవడానికి నియమింపబడ్డవాళ్లే. ఇక్కడిదాకా వచ్చాకా, మామూలుగా డిటెక్టివ్ పుస్తకాలు చదివే వాళ్లందరికీ, ఆదివారమే, వీరందరినీ నియమించిన చీకటి గదిలోని భారీవ్యక్తని అర్థమైపోతుంది. కథ అంతటితో ఆగిపోతే, అది అత్యద్భుతమైన శైలిలో చెప్పబడిన, తర్కపరంగా అత్యున్నతమైన విషయాలను చర్చించిన, ఓ మంచి డిటెక్టివ్ నవల అయి ఉండేది. కానీ అసలు కథ అక్కడ కూడా మొదలవుతుంది. ఈ ఆదివారం అనే వ్యక్తి ఎవరు లేక ఏమిటి? ఎందుకు వీరితో ఇటువంటి ఆటలాడాడు? వృధాగా వారికెందుకంత శ్రమనూ, కష్టాన్నీ కలిగించాడు?… అన్నవే ఇప్పుడు ఆ ఆరుగురు డిటెక్టివ్ ల ముందున్న ప్రశ్నలు.

ఈ ప్రశ్నలకి సమాధానం తెలియాలంటే, ఈ నవల రాసిన చెస్టర్ టన్ గురించీ, అతని అప్పటి ఆలోచనా విధానం గురించీ, అతను ఆ పుస్తకం రాసేనాటి, ఐరోపా అమెరికా ఖండపు దేశాల రాజకీయ, సామాజిక పరిస్థితుల గురించీ తెలుసుకోవాలి. పందొమ్మిదవ శతాబ్దపు చివరి కాలంలో, అరాచకవాదులు, పాలక వర్గ ప్రముఖులపై దాడి చేసి వారిని హతమారిస్తే, అందుకు ప్రతిగా పోలీసులు, అరాచకవాదుల్ని వెతికి పట్టుకుని చంపేవారు. ఈ హత్యలు మళ్ళీ మళ్ళీ ఒక సైకిల్ లాగా జరుగుతూనే ఉండేవి. నిజానికి ఆ సమయంలో, అతి పెద్ద అరాచకవాద సంఘమంటూ ఏదీ లేదనీ, ఇది కేవలం, పోలీస్ అధికారులు, రెండు వైపుల నుండీ చేసిన కుట్ర మాత్రమేనన్న వాదన కూడా ఒకటి చెలామణిలో ఉంది. ఆ విషయాన్నే సూచించే విధంగా, ఈ నవలలో, అరాచకవాద సంఘ సభ్యులంతా పోలీసులే కావడాన్నీ, వారిని నియమించింది కూడా అరాచకవాది కాకపోవడాన్నీ గమనించవచ్చు. ఈ పుస్తకం రాసిన పదిహేనేళ్ల తర్వాత కేథలిక్ గా మారిన చెస్టర్ టన్ కు, అప్పట్లో చర్చ్ పై కొద్దిపాటి తిరుగుబాటువాద ధోరణి ఉండేదట.

‘సండే’ నే, తమని గూఢచారులుగా నియమించిన అజ్ఞాత వ్యక్తని, మిగిలిన ఆరుగురూ తెలుసుకున్న అధ్యాయం తర్వాత, ఈ నవలా ప్రక్రియ తీరు, పట్టాలు మారుతుంది. అప్పటివరకూ దొంగా పోలీసుల తరుములాటగా నడుస్తున్నదల్లా, మెల్లగా సండే మానవాతీత శక్తుల తత్వాన్ని తర్కించే పనిలో పడుతుంది. ఆరుగురు డిటెక్టివ్ లూ, సండే గురించి వారి వారి అభిప్రాయాల్ని ఎవరికి వారే విశ్లేషించుకుంటూ మిగిలిన వారికీ చెప్తారు.

అతి పెద్ద ఏనుగులాంటి శరీరాన్ని కలిగి ఉండి కూడా, ఆకాశంలో మిడతలా లాఘవంగా ఎగిరిపోగల, శారీరక శక్తిని మించిన, సండేలోని మ్యాజికల్ లక్షణమేదో, బుల్ అనే డిటెక్టివ్ ని ఆకర్షిస్తుంది. సెక్రటరీ వేషమేసిన డిటెక్టివ్ కి మాత్రం, సండే పెద్ద పర్వతంలా అనిపిస్తాడు. రాట్క్లిఫ్ కి టైగర్ లానూ, గూగల్ కి మధ్యాహ్నపు సూర్యుడిలానూ కనిపిస్తాడు.

వెనక నించి చూస్తే జంతువులా అనిపించిన సండే, ముందుకొచ్చి ముఖం చూసేసరికి దేవుడిలా కనిపించి భయపెట్టాడని సైమ్ చెబుతాడు.

అక్కడే సైమ్ ఓ అద్భుతమైన తర్కాన్ని కూడా వివరిస్తాడు. ‘వెనక నుండి చూస్తున్నప్పుడు, ముందుండే అతని గంభీరమైన ముఖం, కేవలం ముసుగు మాత్రమేనని తెలుస్తూ ఉంది. అదే ముందుకొచ్చి చూస్తే, వెనకనుండి కనిపించే చెడ్డ రూపానికి, ఏదో ఒక తప్పనిసరి కారణం ఉండే ఉంటుందనిపిస్తుంది.’ అంటాడు. పైగా వీళ్లంతా కలిసి సండేని తరుముతున్నప్పుడు, అతని వీపంతా, కళ్లులేని ఒక పెద్ద ముఖంలా అనిపించి, అతను వెనక్కి తిరిగి పరిగెడుతున్నట్టుగా, ఆ పరిగెడుతున్నప్పుడు డాన్స్ చేస్తున్నట్టుగా కూడా అనిపించిందట. కాసేపటికే అతని ముఖం చూసేసరికి, ‘తన పిల్లలతో దోబూచులాటాడుతున్న తండ్రి’లా అనిపించాడట. మనం, మన ఎదురుగా ఉన్న ప్రతీ వస్తువునూ వెనకనుండి చూస్తూ ఉండి ఉండవచ్చనీ, అందుకే అవంత క్రూరంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉండవచ్చనీ కూడా తీర్మానిస్తాడు. ఇలా రాసుకుంటూ పోతే, నవలలోని ప్రతి వాక్యమూ, అందరికీ చదివి వినిపించి, అది ధ్వనించే వింత అర్థాన్ని, అందరితోనూ పంచుకుని చర్చించాలనిపించేంత గొప్పగానే ఉంటాయి. ఈ రకమైన భావ ప్రకటనా రీతిలోని అందమూ, విభిన్నతా కారణంగా, చెస్టర్ టన్ వాక్యాలు, అవి చెప్పే అర్థాన్ని మించిన వెర్రి ఆనందాన్నీ, వింత ఉద్వేగాన్నీ పాఠకులకు కలిగిస్తాయి. చివరికి, సండే, దివ్య శక్తులు కలిగిన వ్యక్తిగానూ, ఈ ఆరుగురు డిటెక్టివ్ లూ అతని సహాయకులుగానూ అనిపించే విధంగా ఒకచోట కొలువుతీరి ఉండగా, అసలైన అరాచకవాది అయిన ఎర్ర జుట్టు గ్రెగరీ వస్తాడు. పాలకవర్గమైన వీరిపై, తనకు గల ద్వేషాన్ని ప్రదర్శిస్తూ, అందుకు గల కారణాలను వివరిస్తాడు. పాలకవర్గం ఎప్పుడూ భద్రమేననీ, వారికి ఇబ్బందులూ, బాధలూ పడాల్సిన అవసరం లేదనీ, స్వర్గానికి చెందిన ఆ ఏడుగురు దేవతలనూ, తానందుకే ద్వేషిస్తున్నాడనీ, శపిస్తున్నాడనీ చెబుతాడు.

అరాచకవాదం, అనవసరమైన ద్వేషం నుండి పుట్టుకొస్తుందనీ, ఇబ్బందో, బాధో కలిగినంత మాత్రాన అన్నింటినీ విధ్వంసం చేయాల్సిన అవసరం లేదనీ, ప్రపంచానికి ఉండే క్రమగతిని నాశనం చేయాల్సిన పనీ లేదనీ, తామే కాదు, చివరికి దేవుడైన తమ అధినేత కూడా ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటూనే ఉంటాడనీ, ఎన్నో బాధల్ని అనుభవిస్తూనే ఉంటాడనీ సూచించే విధంగా, సైమ్ చేసే వాదనతో నవల పూర్తవుతుంది. కానీ నిజానికి, కథనంతా కేవలం పోలీసుల – పోలీసుల మధ్య జరిగే ఒక నాటకంలాంటి ఆటగా సృష్టించడం, మొదట్లోనే ‘సైమ్ తెలివి’ ద్వారా గ్రెగరీని మోసపుచ్చడం, చివర్లో గ్రెగరీని సైతాన్ గా, పోలీస్, పాలక వ్యవస్థలను ద్వేషించి దూషించే వ్యక్తిగా, రంగం మీదికి తీసుకొచ్చినప్పటికీ, అది కేవలం సైమ్ కి, అతని వాదనను వినిపించే అవకాశమివ్వడం కోసం చేయించిన పనిలా అనిపించే భావాన్ని కలిగించడం వెనుక, చెస్టర్ టన్ ఆలోచనలు వేరే ఏమైనా ఉన్నాయేమోనన్నది నా భ్రమ మాత్రమే కావచ్చు.

ఈ రచన మొత్తమంతా, ఒకే ఒరలో ఇమిడి ఉన్న కత్తుల్లాంటి రెండు విభిన్నమైన భావజాలాలను, తన ప్రతీ వాక్యంలోనూ ఇముడ్చుకుని ఉంటుంది.

దీన్నిండా మాటి మాటికీ పునరుక్తమయ్యే కొన్ని పదాలూ, భావనలూ ఉన్నాయి. ఆకాశం, నక్షత్రాలూ, జంతువులూ ముఖ్యంగా సూర్యుడూ… ఇటువంటి కొన్ని ప్రకృతి సంబంధిత అంశాలు, కథతో పాటుగా ఏదో ఒక రూపంలో మనకి ఎదురుపడుతూనే ఉంటాయి. అంతేకాక చెస్టర్ టన్, క్రైస్తవ మతానికి చెందిన అనేక దృష్టాంతాలనూ, చిహ్నాలనూ కూడా ఈ రచనలో ఇమిడ్చాడు. ముఖ్యంగా చివరి అధ్యాయంలో, గ్రెగరీతో వాదన జరుగుతున్నప్పుడు, ఆరుగురు డిటెక్టివ్ లూ ధరించిన దుస్తులు, ‘బుక్ ఆఫ్ జెనెసిస్’లో, దేవుడు, భూమి మొదటి ఆరు రోజుల్నీ సృష్టించినట్టుగా చెప్పినప్పటి ఆరు రకాల అంశాలనూ ప్రతిబింబించే విధంగా ఉంటాయి.

జీవితాన్ని చెస్టర్ టన్ చూసే, నిర్వచించే విధానమే ప్రత్యేకంగా ఉంటుంది. అటువంటి ప్రత్యేకమైన అనుభూతిని పొందాలనుకుంటే, ఆయన రచనల్ని తప్పనిసరిగా చదవాల్సిందే. ముఖ్యంగా ఈ రచన విషయంలో, ‘కథ తెలిసిపోయింది కదా!’ అని నిరాశపడాల్సిన పని లేదు. నిజానికి, కథ తెలుసుకుని చదివితేనే, వాక్యాల మధ్యన దాగి ఉన్న అసలైన సౌందర్యాన్ని సూటిగా అనుభవించగలం.

You Might Also Like

One Comment

  1. varaprasad.k

    బావుంది, చక్కటి కధనం, మంచి పట్టుతో చదివించేలా ఉంది మీ సమీక్ష.మరిన్ని మెలి రచనలు మీ నుండి ఆసిస్తూ.

Leave a Reply