కవిత్వం; కోట్లాది పాదాల వెంట ప్రయాణం

వ్యాసకర్త: ఎ. కె. ప్రభాకర్
కవిత్వం; కోట్లాది పాదాల వెంట ప్రయాణం
యం.కె.సుగంబాబు వచన కవిత్వ సంపుటి ‘నీలమొక్కటి చాలు’ కి ముందుమాట
**************

లోపల్లోపల ఎప్పటికప్పుడు
గుండె గోడల్ని శుభ్రం చేసుకోవడం
సరికొత్తగా స్పందించడం
ఆకుపచ్చని ఊహలు జోడించడం
పదాన్ని జరీ తలపాగలా ధరించడం …

యే కవికైనా ఉండాల్సిన సహజ గుణాలివి. ఈ సహజ గుణాల్ని పుణికి పుచ్చుకోవడం వల్లనే సుగంబాబు కవిగా యెప్పటికప్పుడు సరికొత్తగా స్పందిస్తూనే వున్నారు. కవిత్వంలో తనదైన శైలితో వైవిధ్యంతో నిరంతరం కొనసాగుతూనే వున్నారు. ఆ యా కాలాల్లో కొత్త తరాలతో కలిసి నడుస్తూనే వున్నారు. ఈ నడకని నిర్దిష్టంగా నిర్దుష్టంగా కొలవాలంటే యిప్పటి సాంకేతిక భాషలో యే fitness tracker device పనికి రాదు.
తొలినాళ్ళలో కవిగా ఆయన పైగంబరుడు. కొత్త శతాబ్దంలో లఘు కవితకి ‘రెక్కలు’ తొడిగి సాహిత్యాకాశంలోకి యెగరేసిన జీవన తాత్త్వికుడు. స్వేచ్ఛాభావుకుడు. సమూహాల్లో కంజీర వాయిస్తున్న ధిక్కార స్వరాల్ని ఆవాహన చేసుకున్నవాడు.
యాభై యేళ్ళకి పైగా అలసట యెరుగక – కవిత్వం చిటికెన వేలు విడువక నడిస్తోన్న నిత్య ప్రయాణికుడు ఆయన. రెక్కలు ప్రక్రియకి సొబగులద్దే పనిలో సుగంబాబు వచన కవిత్వానికి దూరమయ్యారు కానీ వెనకపడలేదు అనడానికి – తార్కాణం పదిహేను సంవత్సరాల తర్వాత ఆయన వెలువరిస్తోన్న ‘నీలమొక్కటి చాలు

ఎవరి బాధైనా తన బాధగా మార్చుకొని… కొలిమిలో పడిన ఇనప చువ్వలా ఇట్టే ఎరుపెక్కడం – తెరపి లేని సమ్మెట దెబ్బలకు పరిపరి విధాలా పదునెక్కడం – పోరాటం కావడం … సందేహం లేదు యివే , తోటి కవుల్లో ఆయన్ని తాజాగా వుంచుతున్నాయ్ – యెత్తుగా నిలబెడుతున్నాయ్.

కవిత్వం వొక విధంగా కన్ఫెషన్ అంటారు. కానీ సుగంబాబుగారి విషయంలో యిదంతా వొక స్వయం మూల్యాంకనం . నడిచిన దారినీ నడకనీ వొకసారి ఆగి వెనక్కి చూసుకొని పునస్సమీక్షించుకోవడం. అప్పటి అద్దంలో యిప్పటి తన ముఖం తాను చూసుకోవడం. తన వెనక వస్తున్న వాళ్ళకి దారిచ్చి వారి పురోగమనాన్ని చూసి తల పంకించి తృప్తి పడటం. అయితే వొక్కోసారి సహచరుల నడకలో వేగానికీ చాతుర్యానికీ విస్తుపోవడం , వెంట నడిచే వాడి కాళ్ళకి పందెం కోడిలా కత్తులు చూసి అప్రమత్తం కావటం కూడా వుంది.

అంతేకాదు; సాధారణంగా అధిరోహించాల్సిన శిఖరాలు అధిరోహించలేక పోయాననే వొక మానేద , వోటమి పాలయ్యాననే వొక దిగులు, అపజయాలు ఇనుపగోడలవుతుంటే పుట్టిన వొక పరివేదన, కాలాన్ని వెనక్కి తీసుకురాలేని నిస్సహాయత మనుషులందరిలో కనిపిస్తాయి. కానీ సుగంబాబులో వాటిని అధిగమించి జయించడానికి కావాల్సిన తెగువా చొరవా స్థైర్యం పుష్కలంగా వున్నాయి. అదే సమయంలో పొందినదే చాలు అనే కన్సొలేషన్, దానితోనే తెరచుకొనే కొత్త కొత్త దారుల్లో ఆశలు పేనుకుంటూ అంచులవెంట బతుకుతూ ముందుకు నడవాలనే సంయమనంతో కూడినపట్టుదల , అన్నిటికీ మించి జీవన సాఫల్యంలోంచి పొందిన సొలేస్ … సుగంబాబు లోపల్లోపల జరిగే ప్రక్షాళన ప్రక్రియలో భాగం. ఇదంతా ఆయన జీవితం – అదే ఆయన కవిత్వం.

దారి సంక్లిష్టమే. వైరుధ్యభరితమే. అయినా బంధాలు తెంచుకునేది లేదు. ఆనందాల్ని వొదులుకునేది లేదు. దారంతా స్వప్నాల తోటగా మొలిపిస్తూ నడవడం మానేది లేదు. ఈ క్రమంలో కలిసి వచ్చే యెన్నో దగ్గరితనాల్నీ, వద్దనుకున్నా చోటుచేసుకొనే కొన్ని దూరాల్నీ సమభావంతో చూస్తూ అందర్నీ కలుపుకు పోవడమే జీవితం అన్న తాత్విక స్పృహ యీ కవితల అంతస్సూత్రం. వైరుధ్యాల్ని జీవితానుభవాలిచ్చిన యెరుకతో పరిష్కరించుకొని సంబంధాల్ని పారదర్శకంగా సరళీకరించుకొని మానవీయంగా మసలుకోవాలనే తపనే వాటి పరమార్థం.

నీలమొక్కటి చాలు’ సంపుటిలో యాంకరింగ్ పాయింట్ అదే. భార్యా భర్తలు మిత్రులు సహచరులు యెవరైనా ఆధునిక ప్రపంచంలో అనేక కారణాల వల్ల మనుషుల మధ్య ‘పెంపుడు పిల్లిలా ఒదిగిన దూరాల్ని’ ఒక చేదు వాస్తవంగా గుర్తిస్తూనే ఆ దూరాల్ని అధిగమించడానికి పూనికతో ప్రయత్నించాలని కవి సున్నితంగా హెచ్చరిస్తున్నాడు. ఆ క్రమంలోనే శివుడు దేవుడు ఓల్గా కిరణ్ కమలాకాంత్ లాంటి వారి స్నేహాన్నీ, హనుమంతరావు మురళీధర్ లాంటివారి సాహచర్యాన్నీ యితరేతర జ్ఞాపకాల్నీ అనుబంధాల్నీ కలబోసుసుకొని నెమరువేసుకుంటున్నాడు. అటువంటి స్నేహ బాంధవ్యాల కలబోతలోంచి వచ్చిందే – యుద్ధభూమిలో నెత్తురోడుతున్న పచ్చిగాయాల సైనికుడు శివారెడ్డి మీద రాసిన పోయం. కళ్ళు తిరిగే ఖడ్గ చాలనం అతని కవిత్వం అంటూ ఆప్త మిత్రుణ్ణి గుండెకు హత్తుకున్నాడు. ఒక కవి మరో కవి నేస్తానికి యింతకంటే యివ్వగలిగిందేం వుంటుంది?

సుగంబాబు ఆకాంక్షించే సంబంధాలు కేవలం వ్యక్తిగతం కావు. సామాజికాలు కూడా. అందుకే అన్నం పెట్టే రైతన్న కావొచ్చు బట్టనిచ్చే నేతన్న కావొచ్చు స్వేద జాలం చిందించి సమస్త వస్తు సంపదనీ సృజించే కష్టజీవి మరెవరైనా కావొచ్చు ‘ఇచ్చిన వారికి తిరిగి ఇవ్వాలన్న ఆలోచనకు పాదు కట్టడం’ ద్వారా మానవ సంబంధాలని నిలుపుకొని కాపాడుకోగలమని ప్రబోధిస్తున్నాడు. ఎంత గొప్ప సహభావం. ఎంత మంచి జీవన దృక్పథం. నిజానికి ఈ సంపుటి తాత్త్వికంగా ‘రెక్కలు’ కి కొనసాగింపే.

మనుషులమధ్య రోజురోజుకూ పెరిగిపోతున్న అనేక దూరాలు. అవి ఆర్థికాలు సామాజికాలు … లేదా తమకు తెలీకుండానే పెంచుకునే యీర్ష్యాసూయలు మరేవన్నా కావచ్చు. మనుషులకీ మనుగడకీ మధ్య విస్తరించే ఎడారిలాంటి దూరాలు తొలగి పోడానికి దగ్గరితనాల్ని పెంచుకోవడమే మార్గమని కవి ఆదేశం. అందుకే –

ఏరు నదిలో
నది సంద్రంలో
సంద్రం ఆకాశంలో కలిసిపోయినట్టు
కలిసిపోవడమే
నాలోంచి
నువ్వో,
నీలోంచి
మరొకరో…
కలబోసుకోవడమేగా!
కావాల్సింది …

అంటాడు. మనుషులు సంపాదించుకోవాల్సింది మిగుల్చుకోవాల్సింది వొకరికొకరు యెదురైనప్పుడు ఆప్యాయమైన ఆత్మీయమైన వొక పలకరింపే కదా అని ప్రశ్నిస్తాడు. శ్వాసలో శ్వాసను కలుపుతూ ఆలింగనం చేసుకొనే మానవీయ స్పర్శని కోరుకుంటాడు. అయితే ఆ కలయికని కేవలం భౌతిక తలంలో ఆపకుండా –

పుట్టుక జీవితాన్ని
జీవితం కాలాన్ని
కాలం మృత్యువును కలిపేసినట్టు
కలిసిపోవటమే ..!

అని తాత్త్విక తలంలోకి తీసుకు వెళ్ళడంలోనే కవి విశిష్టత తెలుస్తుంది. ఇది సుగంబాబుకే ప్రత్యేకమైన ముద్ర. ఈ ముద్రని ఆయన వొడిదుడుకుల జీవితంలో కాలం యెన్ని విధాలుగా మారినా కాపాడుకుంటూనే వస్తున్నాడు. అదే కవిత్వంలో ప్రతిఫలిస్తుంది.

ఈ సంపుటిలోని కవితలన్నీ యిటీవలి కాలంలో రాసినవే. పెద్దనోట్ల రద్దు రాజకీయాల గురించి పునాదుల్లో నల్లడబ్బు కాంక్రీటు వేసి కడుతున్న నగరాల గురించి, సినిమా వాళ్ళ డ్రగ్స్ బాగోతానికి ఆకస్మికంగా యిచ్చిన క్లైమాక్స్ గురించి, పాలకుల పంచలో పందిరి గుంజకి పెంపుడు జంతువుల్లా కట్టివేయబడ్డ మహా మహా కవులగురించి కవితలు అందుకే చాల సహజంగానే చోటుచేసుకొన్నాయి. సమకాలీన సామాజిక రాజకీయ అంశాల్ని చెప్పేటప్పుడు సుగంబాబు వ్యంగ్యాన్ని ఆశ్రయించడం గమనించండి. అది చురుకైనదే కాదు; లోతైనది కూడా.

అధికారం రాజకీయం గడపలో
కాళ్ళు నరికేసినట్టు
బొచ్చెలు పట్టి, బారులు కట్టి
సంక్షేమ పథకాలంటూ
చేతగాని వాళ్లైపోతే …. కవిమాత్రం ఏం చేస్తాడు?

కవి యేం చేస్తాడు అని శివారెడ్డి అడిగిన ప్రశ్నకి జవాబిది. కవుల అన్నిరకాల దిగజారుడుతనానికీ అధిక్షేప ప్రతీక. ఆత్మాభిమానం కల కవిగా సుగంబాబు తానెక్కడ నిలబడాలో నిశ్చయించుకున్నాడని యీ పంక్తుల ద్వారా తెలుస్తుంది. అయితే దానికి కట్టుబడి వుండటం అంత సులువేం కాదు. రాజ్యం కృష్ణ బిలం. దాని ఆకర్షణ శక్తికి లోబడకుండా వుండటమే కవి విజయం.

ఈ సంపుటిలోని కవిత్వ శైలి గురించి రెండు మాటలు : రూప పరంగా క్లుప్తత ఈ కవితలకు మూల ధాతువు. అది రెక్కలు నుంచి వచ్చినదే. సాంద్రత మరో గుణం. వానా కాలపు వాగుల ప్రవాహోద్ధృతి ఈ కవితల్లో కనిపించదు. శరత్కాలపు నదిలా ప్రశాంత గంభీరంగా వుంటుంది. అలా మంచి కవిత్వానికి అవసరమైన గాఢతని సైతం చూడగలం. వస్తువుని కిందనుంచి పైకి పైనుంచి కిందకి వొకటికి పదిసార్లు సరిచూసుకొన్నతర్వాతే కవిత్వంలోకి తర్జుమా చేసే జాగరూకరత ప్రతి సందర్భంలోనూ కనిపిస్తుంది. క్రాఫ్టింగ్ కి ప్రాధాన్యం యిస్తూ కవితని చిత్రిక పట్టడం బలమూ బలహీనత కూడా. అందుకే సుగంబాబు గారు చేస్తున్న యీ ప్రయాణం అంత హాయినిచ్చేది కాదు అనడం. జీవితమైనా కవిత్వమైనా గుంటల్లో గతుకుల్లో కచ్చాదారిలో తనను తాను నిలబెట్టుకోవడమే. నిలబెట్టిన ఖడ్గం మొనపై ఒంటికాలిపై నిలబడి చేసే విన్యాసమే.

నా ప్రయాణం ఎంతో వుంది
ప్రతి మలుపులోనూ కొత్తదనం,
ఊపిరికి అందని ఉత్కంఠ,
ఆహ్వానించాల్సిన వసంతాలు అనేకం –
కొత్త భాష , కొత్త వ్యక్తీకరణ
నాదైన నడక సంతరించుకోవాలి !
నేను ప్రవాహాన్ని,
నా దారిన నన్ను ప్రవహించనీయండి.

ఇదీ ‘సూర్యునికి కిరణాల కిరీటం చెక్కేందుకు’ పట్టణాల్లో నగరాల్లో ప్రపంచవ్యాప్తంగా నడుస్తోన్న కోట్లాది పాదాల వెంట కవిగా సుగంబాబు చేస్తున్న ప్రయాణం. ఆయన కవితా ప్రవాహంలో తడుస్తూ మనం కూడా కలిసి నడుద్దాం … పక్కపక్కనే నడుస్తూ మాట్లడుకొంటేనే బాగుంటుంది అన్న కవి వాక్కు నిజం చేద్దాం … రండి. ఎందుకంటే –

అతను మాట్లాడేది
అతనొక్కడి మాటలు కాదు!

You Might Also Like

Leave a Reply