సమాజాన్ని మినియేచర్ రూపంలో చూపిన ‘రైలు కథలు’

వ్యాసకర్త: కొల్లూరి సోమశంకర్

సాధారణంగా మనకి కొన్ని ఇష్టాలుంటాయి. చాలా యిష్టాలను దేనికి దానికే ఆస్వాదిస్తాం. కానీ రెండు ఇష్టాలని కలిపి ఒకేసారి ఆస్వాదించడం బావుంటుంది. మనలో చాలామందికి ప్రయాణాలు చేయడం… అందులోనూ రైల్లో ప్రయాణించడం ఇష్టం. అలాగే చాలామందికి ఉండే మరో అభిరుచి పుస్తక పఠనం… అందులోనూ కథలంటే మరీ ఇష్టం. ఈ రెండిటినీ మేళవిస్తూ, రైల్లో పుస్తకాలు చదువుకునేవాళ్ళెందరినీ మనం చూస్తూంటాం. ప్రయాణమైనా… కథలైనా… కొత్త వ్యక్తులను కలుసుకోవడం… కొత్త విషయాలను తెలుసుకోవడం… పాతవాటిని పరిశీలించుకోడం… మనల్ని మనం మరింత బలోపేతం చేసుకోవడమే!

చాలామంది రైళ్ళలో ప్రయాణాలు చేస్తూ, ప్రకృతి అందాలకు పరవశిస్తూ, తోటి ప్రయాణీకులని పరిసరాలని గమనిస్తూ, కొందరితో మాట్లాడుతూ, అభిప్రాయాలు పంచుకుంటూ సమయం గడుపుతారు. కొన్ని ప్రయాణ పరిచయాలు గమ్యం చేరగానే స్మృతిపథంలోంచి చెరిగిపోతాయి, కొన్ని మాత్రం కలకాలం నిలిచి ఉంటాయి. పరిచయం స్నేహంగా మారుతుంది, పరిచితులు మిత్రులవుతారు, సన్నిహితులవుతారు.

కొందరి కొన్ని ప్రయాణాలు కథలవుతాయి, నవలలవుతాయి. తాము పత్యక్షంగా తోటివారితో పంచుకోలేని అనుభవాలను, అనుభూతులను అక్షర రూపంలో పాఠకులకు చేరుస్తారు. అలాంటి కథలు చదివిన పాఠకులు ప్రయాణీకులవుతారు, అభౌతిక యాత్ర చేస్తారు. మనోవేగంతో ఆయా రైళ్ళలో తామూ సంచరిస్తారు. ఆయా కథల్లోని పాత్రలతో తమని తాము ఐడెంటిఫై చేసుకుంటారు. ఇలా ప్రయాణ నేపథ్యంలో సాగే కథలని ఒకే చోట చదవడం ఓ చక్కని అనుభవం. రైలు కథలు పుస్తకం చదవడం అదే అనుభూతిని కలిగిస్తుంది.

ఈ పుస్తకంలోని అన్ని కథల కేంద్ర బిందువు రైలే. పుస్తకంలోని 39 కథల్లో 17 కథలను రైల్వేలలో పనిచేసేవారు/రైల్వేలతో సంబంధం ఉన్నవారు రాశారు. రైళ్ళ గురించి కథల సంకలనంలో – ఆయా కథలలో రచయితలు సృష్టించిన పాత్రలతో పాటు రైలు కూడా ఒక విడదీయరాని భాగమవడం అనివార్యం. చాలా కథలు రైలు చెబుతున్నట్టే ఉంటాయి. సమాజమంతా మినియేచర్ రూపంలో రైల్లో కనబడుతుంది. మనుషుల మౌలిక లక్షణాలు… మంచివి, చెడ్డవీ… పాత్రల స్వభావోచితంగా మనకు కనబడతాయి. అందువల్ల ఈ కథలు చదువుతుంటే ప్రపంచాన్ని చూస్తున్నట్టే ఉంటుంది. అపోహలు, ఆత్మీయతలు, అనుబంధాలు, స్నేహాలు, కుట్రలు, దుర్మార్గాలు, కుళ్ళు, బాధలు, ఆనందాలు, బాధ్యతలు, బరువులు, అవినీతి, మానవత్వం… ఇలా మనుషులలోని అన్ని షేడ్స్ ఈ కథలలో కనిపిస్తాయి.

ఈ కథలను రెండు కోణాల నుంచి చూడవచ్చు. ఒకటి రైల్వే సిబ్బంది కోణం నుంచి, రెండు – ప్రయాణీకులు, మామూలు మనుషుల దృక్పథం నుంచి. రైలెక్కి కూర్చుని ఒక ఊరునుండి మరో ఊరు వెళ్ళడం ప్రయాణీకుల పాత్ర అయితే, రైళ్ళు ఆశించిన సమయానికి, ఏ అవాంతరాలు లేకుండా క్షేమంగా గమ్యం చేరేలా చూడడం రైల్వే సిబ్బంది బాధ్యత. మనకి ప్రయాణీకుల సమస్యలు  తెల్సినంతగా సిబ్బంది ఇబ్బందులు తెలియవు… నిజజీవితంలో మనం ప్రయాణీకులమై స్వయంగా సమస్యలని గ్రహించి ఉండచ్చు… కానీ మనం రైల్వే సిబ్బంది కాలేము… వారి దృష్టికోణం నుంచి మనం చూడలేం. కానీ ఈ పుస్తకంలోని కొన్ని కథలు చదివితే రైల్వే సిబ్బంది శ్రమ, త్యాగం, కర్తవ్య పరాయణత అర్థమవుతాయి. ఒక్కోసారి వారు పడిన కష్టాన్ని గ్రహించలేక యజమాన్యం వారిపై చర్యలకీ దిగుతుంది. అయినా తమ విధిని సక్రమంగా నిర్వర్తించామన్న తృప్తితో ఉంటారు వారు.

***

కనిపించినప్పుడు నవ్వే మనిషికి కష్టాలు ఉండవనుకోడం పొరపాటని ఒక లోకోపైలట్… అంటే రైలు డ్రైవర్ కథని ఆర్ద్రంగా చెబుతారు శివప్రసాద్ ఆకెళ్ళ. ప్రతీరోజూ కొన్ని వందలమందిని సురక్షితంగా గమ్యాలకు చేర్చే డ్రైవర్ల కుటుంబంలో విషాదం సంభవించినప్పుడు మరో రైల్వే ఉద్యోగి ఆదుకుంటాడు. బదులుగా ఆ లోకో పైలట్ కృతజ్ఞతలు చెబితే… “ట్రాక్ మీద, కాషన్ ఆర్డర్స్ మీద, సిగ్నల్స్ మీద దృష్టిపెట్టి గమ్యస్థానానికి సురక్షితంగా చేర్చేవాళ్ళు మీరు… యింతమందికి సాయం చేస్తున్న మీకు యిలాంటి చిన్న సాయం చేయడం నా అదృష్టం….” అని మనస్ఫూర్తిగా అంటాడతను. కళ్ళు చెమరించే కథ దొరకునా ఇటువంటి సేవ“.

రైలు ప్రమాదాలు సంభవించినప్పుడు… వెంటనే రైల్వే ఉద్యోగులు ఎలా అప్రమత్తమై సహాయచర్యలు చేపడతారో, తిండి నిద్రలు లేక శ్రమిస్తారో… కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది పొత్తూరి విజయలక్ష్మి గారి కథ నాణేనికి మరో వైపు. ఏదైనా అవాంతరం వచ్చినప్పుడు పరుగులు పెట్టి అహోరాత్రాలు పనిచేయడం రైల్వే సిబ్బందికి అలవాటేనంటారు రచయిత్రి. ప్రమాదం జరిగిన చోట… ఆ వాతావరణంలో… అందరూ వీళ్ళని దోషులుగా చూస్తారు. గాయపడినవారు, మీ వల్లనే మాకీ కష్టాలు అని నిందిస్తారు. అయినా వీళ్ళు ఏమీ అనుకోరు. వాళ్ళ బాధతో పోలిస్తే యిది ఎంత?” అంటారు సిబ్బంది గురించి.

రైళ్ళు సురక్షితంగా ప్రయాణించడంలో ట్రాక్ నిర్వహణని చూసే గ్యాంగ్‌మెన్‌లది కీలకమైన బాధ్యత. బహుమానంఅనే కథలో – ఒక చోట ట్రాక్ బాగా దెబ్బతిని ఉండడం గమనించిన రహమతుల్లా అనే గ్యాంగ్‌మాన్ ప్రమాదం నివారించడానికి ఎంత కృషి చేశాడో, ఎంత చొరవ చూపి తక్షణ చర్యలు తీసుకునేలా చేశాడో రచయిత స్వరలాసిక వివరిస్తారు. ప్రమాదాన్ని నివారించినప్పుడు పురస్కారమిప్పిస్తామని చెప్పిన అధికారులు మర్నాడు షోకాజ్ నోటీస్ పంపడం అధికార వ్యవస్థలోని వైచిత్రికి ఉదాహరణ.

ఉద్యోగ బాధ్యతలలో పడి కుటుంబ జీవితాన్ని విచ్ఛిన్నం చేసుకున్న గూడ్స్ బండి గార్డు కథ విజిల్ కోడ్ చదివితే మనసు మొద్దుబారిపోతుంది. గూడ్సు బండి రెండుగా విడిపోయి డ్రైవర్‍తో ఉన్న భాగం ముందుకు వెళ్ళిపోవడం, గార్డు ఉన్న భాగం అడవిలో నిలిచిపోవడం…  గార్డు ఉద్యోగ బాధ్యతలకి, పని వేళలకి పొంతన కుదుర్చుకోలేక అతని భార్య అతన్ని వదిలేసి వెళ్ళిపోవడం… పాఠకుల్ని హతాశుల్ని చేస్తాయి. పాఠకుల మనసుల్ని తాకుతుంది ఓలేటి శ్రీనివాస భాను వ్రాసిన ఈ కథ.

రైల్వే అధికారిలా నటించి అమాయకులని మోసం చేయాలని చూసిన ఓ అగంతకుడిని అసలైన టీటీఈ వెతికిపట్టుకుని – అతడు ఏ మహిళనైతే మోసం చేశాడో, అదే మహిళ పాదాలపై పడేలా చేస్తాడు. “గీ సెకింగు మాస్టరు గావట్టి సువద్ది సువద్దేంది.. అవద్దం అవద్దమైంది. ఏరే ఏరే సెకింగ్ మాస్టరైతే సువద్ది అవద్దంగనే మిగిలిపొయ్యి ఉండేటిది..” అనుకుంటుందామె నల్ల భూమయ్య గారి కథ దొరలో. “గీ సెకిన్ మాస్టరు మట్టుకు గట్ల గాదు, బండి అన్ని డబ్బల్ని గూడ ఈకొసనుండి ఆకొసకు, ఆకొస నుంచి ఈకొసకు ఎన్నన్నిసార్లు సెక్కర్లు గొట్టెటోడు! టికెట్ లేకుంట పయినం జేసెటోలు గూడ తగ్గిండ్రు, బయిపడ్డరు.” అని ఓ టీటీఈ గురించి ప్రయాణీకులు అనుకుంటున్నారంటే అతను తన కర్తవ్యాన్ని అత్యంత శ్రద్ధతో నిర్వహించినట్టేనని ఈ కథ చెబుతుంది.

టీటీఈ ఉద్యోగ నిర్వహణలోని కష్టాలను చెబుతుంది టికెట్ ప్లీజ్ కథ. ప్రతీదాన్ని విమర్శించి చులకనగా చేసే మేధావుల కన్నా, పౌరులుగా తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించే నిరక్షరాశ్యులే నిజమైన మేధావులని అంటారు రచయిత్రి అనంతలక్ష్మి.

మరణం అంచుల్లో ప్రయాణం కథలో అభిప్రాయాభేదాలున్న ఇద్దరు డ్రైవర్ల మధ్య గొడవ జరుగుతుంది, ఒక డ్రైవరు చనిపోతాడు. ఆ చనిపోయినతను దయ్యమై తనని ఏడిపిస్తున్నాడని రెండో డ్రైవరు ఎప్పుడూ భావోద్వేగాలకి లోనవుతుంటాడు. అతడి పరిస్థితి తెలిసి, అతనికి డ్రైవర్ డ్యూటీ వేయరు. కొత్తగా వచ్చిన ఓ ఆఫీసర్ వల్ల అతనూ మళ్ళీ డ్రైవర్‌గా డ్యూటీ చేయాల్సివస్తుంది. చనిపోయిన ఆ డ్రైవర్ దెయ్యం కనబడి ఇతన్ని భయపెడుతుంది. సిగ్నల్స్ తప్పుగా కనబడేట్టు చేస్తుంది. మరో రైలుకి ఎదురుగా తీసుకెళ్ళి, యాక్సిడెంట్‍కి కారణమయ్యేలా అనిపించినా, చివరి నిమిషంలో బ్రేక్ వేసి డ్రైవర్ల ప్రాణాలు, ప్రయాణీకుల ప్రాణాలు కాపాడుతుంది. తాను చనిపోయినా, వ్యక్తిగత పగలకు పోయి, ప్రయాణీకులు ప్రాణాలను బలిపెట్టలేదని అంటారు రచయిత కస్తూరి మురళీకృష్ణ.

మహాభారతంలో కర్ణుడి చావుకి కారణాలెన్నో ఉన్నట్టు, నేటి భారతంలో పాసింజర్ రైళ్ళు ఆలస్యంగా నడవడానికి అన్ని కారణాలున్నాయి. ఏదో ఒక కారణంలో చైను లాగి రైలుని నిలిపేసేవారు కొందరు; రైలు ఎక్కే ముందు తమ కూపేలో వేరే ఎవరో కూర్చున్నారని గొడవ చేసి టీటీఈని, గార్డుని నిలదీసే జనాలు; తమ సరుకులు లోడ్ చేయిండడానికి రాజకీయ నాయకుల సిఫార్సుతో సమయం మించిపోతున్నా రైలుని ఆపి ఉంచడం వల్ల… రైళ్ళు సకాలంలో గమ్యానికి చేరుకోవని చెబుతారు యర్రంశెట్టి శాయి గార్డు గోపాలం కథలో. హాస్యం, వ్యంగ్యం రంగరించిన ఈ కథ నేటి కొన్ని వాస్తవాలకి అద్దం పడుతుంది.

విధులు, వ్యక్తిగత సమస్యల మధ్య నలిగిన రైల్వే ఉద్యోగుల కథ మహేంద్ర మధురాంతకం వ్రాసిన ఇంధనం. మన జీవితాలలో అవినీతి ఎంతలా భాగమైపోయిందో, మనం ఎలా సమర్థించుకుంటామో ఈ కథ చెబుతుంది.

***

రైలు ప్రయాణం మనకి నేర్పే ముఖ్యమైన అంశం – సర్దుకుపోవడం.

రద్దీ బోగీలలో, బీదాబిక్కీ, మధ్య, ఎగువ తరగతుల ప్రజలంతా ఒకేచోట చేరినప్పుడు, ఎవరి గమ్యాలకు వాళ్ళు చేరుకోవాలనే ఆత్రుతలో ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించాలని చూడడం, కొందరు తాము మాత్రమే సౌకర్యంగా ఉండాలనుకోవడం… మరికొందరు సాటివారి పట్ల సానుభూతి చూపడం… రైలు ప్రయాణంలో సర్వసాధారణం.

ప్రయాణీకుల మనస్తత్వాన్ని అద్భుతంగా వివరిస్తారు మధురాంతకం రాజారాం గారు “శ్రీపాదరేణువు” కథలో.  టిక్కెట్లు దొరికేదాకా దొరకదేమోనన్న అనుమానం, అది దొరికిన తర్వాత రైలు సకాలంలో రాదేమోనన్న సందేహం. రైలుగూడా వచ్చిందిపో, కూర్చోడానికి తావుంటుందో ఉండదోనన్న ఆందోళన, తావు గూడా దొరికిందనుకుందాం. ఇతరులెవ్వరూ పెట్టెలోకి ఎక్కగూడదన్న స్వార్థం. మళ్ళీ ఇందులోనూ ఒక తమాషా, నువ్వు వాయలపాడు దాకా వెళ్ళాలనుకో, రైలంతవరకూ సురక్షితంగా వెళ్లే చాలుననుకుంటావు. ఆ తరువాత అది వెళ్ళినా, వెళ్ళకపోయినా మరేమై పోయినా నీకు దిగులుండదు…”. ప్రయాణీకులుగా మన మనస్తత్వాలు పెద్దగా మారినట్టేం అనిపించదు.

కొందరి సమక్షంలో ఉన్నంతసేపూ వారి భౌతిక రూపాన్ని చూసో, మాటతీరును బట్టో అపార్థం చేసుకుంటూనే ఉంటాం. కాస్తో కూస్తో రోత కూడా కలుగుతుంది. కాని వాళ్ళ అసలు స్వభావం అర్థమైనప్పుడు, వాళ్ళని తలచుకున్నప్పుడు మనసు తడిబారుతుంది. ఇదే వాస్తవాన్ని అతని చిరునామా కథలో కె.కె. రఘునందన చెప్తారు.

స్లీపర్ క్లాసు బోగీలో ప్రయాణాన్ని అత్యంత సహజంగా వర్ణించారు బలభద్రపాత్రుని రమణి ఛుక్ ఛుక్ రైలు కథలో.  కిటికీ దగ్గర కూర్చుని మనని దాటి వెళ్లిపోయే టెలిఫోన్ స్తంభాల్ని లెక్క పెట్టడం… కొంగలబారుల్ని చూడడం, వంతెనమీదనుండి వెళుతుంటే గాజుల చేతుల్లోడోలక్ వాయిస్తున్నట్లుండే ఆ ధ్వని ఎంజాయ్ చెయ్యడం, కాఫీనో టీనో తెలీని వేడి వేడి ద్రవాన్ని నోరు కాలిపోతుంటే తాగడం… వేగంగా వెళుతున్న రైల్లో పడిపోకుండా బుట్టలతో, కేన్లతో నడిచే అమ్మేవాళ్ళని చూడడం, ఇవన్నీ ఎంత బాగుంటాయి? బఠానీ… చెనా జోర్ గరమ్ చెనా… ఎంత కాలక్షేపంగా వుంటాయి?” అంటారు రచయిత్రి. కాదనలేము కదా! “మళ్ళీ కలుస్తాం అని అస్సలు నమ్మకం లేకుండా విడిపోవడం… రైలు ప్రయాణాల్లోనే సాధ్యం!” అంటారు. దీన్నీ కాదనలేము.

గుంటూరు నుంచి విజయవాడకి సాగే ఒక గంట రైలు ప్రయాణంలో ఎన్నెన్ని ప్రహసనాలుంటాయో భిక్షగాడి పాట కథలో రమేష్‌బాబు గుమ్మనూరు చెబుతారు. “కళ్ళు రెండూ లేకపోయినా నిమ్మఒప్పులు అమ్ముకొంటూ బ్రతికే సుబ్బారావులూ, చేతుల్లేకపోయినా వేరుశనక్కాయలు అమ్ముకొంటూ పబ్బం గడుపుకొనే పార్వతమ్మలూ, కూలీనాలీ చేసుకొని కాయకష్టం మరచిపోవడానికి నాటుసారా కొట్టి ఈ లోకాన్నే మరచిపోయే ఇస్మాయిల్ సాబ్లూ, ఒక ఊరంటూ లేకుండా దేశాటన చేస్తూ ఎందుకు బ్రతకాలో కూడా తెలియకుండా కాలాన్ని వెళ్ళబోసే లంబాడీ గవరమ్మలూ… ఇలా ఎంతమందో!” కనబడతారా ప్రయాణంలో.  

సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ బిర్యానీ తినాలనుకున్న ప్రయాణీకులిద్దరు బిర్యానీ కొనుక్కుని ప్లాట్‌ఫామ్ మీదకి వచ్చేసరికి రైలు వెళ్ళిపోవడం, వాళ్ళ కుటుంబాలు ఆ రైల్లోనే ఉండిపోవడం – రైల్వే సిబ్బంది సహయంతో మరో స్టేషన్‌లో కుటుంబాలని కలుసుకోడం… కథ సుఖాంతం. సగ్గు రాజయ్య కథ బిర్యానీ కేసు హాయిగా చదివిస్తుంది.

తను చేసే ఉద్యోగాన్నీ, దానికోసం రోజూ చేసే ప్రయాణాన్నీ మోనీష్ ఎందుకు మానుకోలేకపోతున్నాడో ఒక దుర్ఘటన జరిగితేగాని ఎవరికీ అర్థం కాలేదు. అప్ అండ్ డౌన్ రైలు ప్రయాణాలోని అప్స్ అండ్ డౌన్స్ చూపే కథ ముకుంద రామారావు వ్రాసిన ఉద్యోగం ఒక జీవిత ప్రయాణం“.

ఎం. వెంకటేశ్వరరావు వ్రాసిననాన్న ఉద్యోగం అమ్మకిస్తే కథ కారుణ్య నియామకాలలో చూపాల్సిన విచక్షణని వివరిస్తుంది. పొరపాటున రైలెక్కి ఇంటికి దూరమైన పిల్లాడిని తిరిగి ఇంటికి చేర్చిన కథ ఆగిన రైలు హృద్యంగా ఉంటుంది. ఓ రైల్వే కానిస్టేబుల్ సమయస్ఫూర్తితో ఆ పిల్లాడిని వాళ్ళింటికి చేర్చగలుగుతారు.

సాధారణ బోగీలో ప్రయాణించేవారి కష్టాలు ఎలా ఉంటాయో ఓ కాబోయే రైల్వే అధికారిని స్వయంగా అనుభవించేలా చేసి, తనకి అవకాశం వచ్చినప్పుడు, తాను నిర్ణయాలు తీసుకుని అమలుచేయగలిగే స్థితికి వచ్చినప్పుడు ఈ బీదల పాట్లని గుర్తు చేసుకుని, వారికి ప్రయాణం కాస్తయినా సౌకర్యంగా ఉండేట్లు చేయాలని కోరుకుంటాడో తండ్రి – సలీం వ్రాసిన ప్రయాణం కథలో.

పొట్టమ్మ, మృగత్వం, నీకు రెండు నాకు మూడుజుగల్బందీ, తాబేళ్ళు, తను, పొగబండినేస్తం వంటి  ఇంకొన్ని మంచి కథలున్నాయి. వేటికవే ప్రత్యేకం. విభిన్నమైన రైలు కథల్ని ఎంపిక చేసి వాటితో ఓ చక్కని సంకలనం వేసి పాఠకులకి అందివ్వాలన్న సంపాదకుల లక్ష్యం నెరవేరిందనడంలో అతిశయోక్తి లేదు.

ఈ కథలు – నవ్విస్తాయి, కంటతడి పెట్టిస్తాయి, గుండె లోతుల్ని స్పృశిస్తాయి, బండ గుండెల్ని కరిగిస్తాయి, ఒళ్ళంతా పులకింపచేస్తాయి, వ్యవస్థని ప్రశ్నింపజేస్తాయి, ఆత్మావలోకనానికి బాటలు వేస్తాయి, ఆనందభరిత అనుభూతులను కలిగిస్తాయి, ఆలోచనలను రేకెత్తిస్తాయని ముందుమాటలో గౌరవ సంపాదకులు ఎమ్. ఉమాశంకర్ కుమార్ అన్న మాటలు అక్షర సత్యాలు.

కథల గురించే కాకుండా ఈ పుస్తకం కవర్ పేజీకి ఉపయోగించిన చిత్రం గురించి కూడా చెప్పుకోవాలి. రిటైర్డ్ టి.టి.ఈ. బిజయ్ బిశ్వాల్ గీసిన ఈ చిత్రంలో రైలు, స్టేషన్, ప్లాట్‌ఫామ్ పైన ప్రయాణీకులు, చిరు వ్యాపారులు, సాధువు, కూలీలు… కాసేపటి క్రితమే పెద్ద వాన కురిసి ఆగినట్టున్న మేఘావృతమైన ఆకాశం, తడిసిన ప్లాట్‌ఫామ్… ఎంత సహజంగా ఉంటాయంటే, ఏదో రైల్వేస్టేషన్‌లో రైలు ఆగినప్పుడు తీసిన ఫోటోలా అనిపిస్తుంది. నిస్సందేహంగా ఈ ముఖచిత్రం పుస్తకానికి అదనపు ఆకర్షణ!

రైలు కథలు: పేజీలు 280, వెల: 100/-

ప్రతులకు:

  1. సాహితీ ప్రచురణలు, 33-22-2, చంద్ర బిల్డింగ్స్, సి.ఆర్. రోడ్, చుట్టుగుంట, విజయవాడ – 520 004. ఫోన్: 0866-2436643, ఈమెయిల్: sahithi.vja@gmail.com
  2. నవోదయ బుక్ హౌజ్, కాచీగుడా, హైదరాబాద్ 500027. ఫోన్: 9000413413. నవోదయ వారి నుంచి ఈ పుస్తకాన్ని ఆన్‌లైన్‌లో ఇంటికి తెప్పించుకునే వీలు ఉంది. ఈ లింక్ చూడండి.

https://www.telugubooks.in/products/railu-kathalu

You Might Also Like

4 Comments

  1. Anil Kumar Srikanti

    చాల ఆర్డినరీ బుక్….నేను ౧౦ కథలు కూడా చదవలేక పోయాను…ఏ రివ్యూ రాసిన వాళ్ళందరూ ముఖ ప్రీతీ కోసం రాసినవే…అన్ని మూస కథ లే…!!

  2. varaprasad.

    మంచి ప్రయత్నం.చాలా కాలం క్రితమే 7Down godavari express, నవల మల్లాది రాశారు. ఇప్పటికీ మరచి పొలేను.అప్పటి నుంచీ ఎవరైనా రైలు కథలు రాస్తే బావుండును అని అనుకొనే వాన్ని. ఇన్నాళ్ళకు ఓ మంచి ప్రయత్నం చేసినందుకు రచయిత గారికి అభినందనలు.వీలైతే మన ఆంధ్రలో ఎంతో ముఖ్యం ఆయన Howra-chennai,,mail….kakinaada-chennai. Circar Express la గురించి రాయండి. చాలా బావుంటుంది.నేను ఆ రైళ్ల లో ప్రయాణం చేశాను.బలే4 సరదా, సర్రదాగా వుంటుంది.

  3. Anil అట్లూరి

    పుస్తకాన్ని కొని కథలన్నింటిని చదవాలనిపించే ఆసక్తిని రేకిత్తించే పరిచయం.

    1. ravul rajaram

      అంత లేదు..ఈ పుస్తకానికి …సోది..

Leave a Reply