A village by the sea – Anita Desai

వ్యాసకర్త: సుజాత మణిపాత్రుని. 

బాలల పుస్తకాలు రాసేవాళ్ళు అరటిపండు వొల్చినట్టు కొన్ని ముద్దైన కథలు చెప్తూంటారు.  బాల సాహిత్యంలో కష్టాలూ, కడగళ్ళూ ఉన్నా, ముగింపు పాసిటివ్ గా ఉండేదే మంచి కథ అని నా నమ్మకం.   ఈ రోజుల్లో పిల్లలు ఊహించలేనంత  దారుణాలకూ, దాడులకూ గురవుతున్నారు.  కష్టాలు మనసుల్ని రాటు తేలుస్తాయి. మనుషుల్ని దగ్గరగా కూడా తెస్తాయి, ప్రేమ తో, ఐక్యత తో  కుటుంబం అంతా వాటిని ఎదుర్కోవచ్చు అని ఒక భరోసా ఇవ్వాగలగడమే పెద్ద విషయం. అన్నిటికన్నా బీదరికం ఒక పెద్ద కష్టం. కుటుంబంలో అందరూ కలిసి, ప్రేమాభిమానాలతో ఆ బీదరికాన్నీ, విపరీతమైన నైరాశ్యాన్నీ ఎదుర్కోగలం అనే నమ్మకాన్ని ఒదులుకోలేకపోవడమే ఈ కధ లోని ఆత్మ.

సముద్ర తీరంలో తుళ్ (ముంబాయి కి 17 కిలో మీటర్ల దూరంలో) ఆలీబాగ్ కి దగ్గర్లో ఉన్న ఓ జాలరి పల్లె.  ఇక్కడ 13 ఏళ్ళ లీల, 11 ఏళ్ళ తమ్ముడు హరి, ఇంకో ఇద్దరు చిన్న వయసు చెల్లెళ్ళు బేల, కమల ల కొబ్బరాకుల తో కప్పిన పూరిపాక నుంచీ కథ మొదలవుతుంది.  వాళ్ళ తండ్రి తాగుబోతు, తల్లి అనారోగ్యంతో శుష్కించిన ప్రాణి.  పిల్లలకు వండి వార్చే పెద్ద దిక్కు లీలే.  హరి బాధ్యత తెలిసిన వాడు. తమ భవిష్యత్తు గురించి వయసుకు మించిన బెంగతో, పట్టుదలతో ఉక్కిరిబిక్కిరవుతుండే స్వచ్చమైన బాలుడు. తండ్రి తాగి పొద్దంతా నిద్రపోయి, రాత్రి లేచి, కల్లు పాక కి పోయి, తాగి, ఇరుగు పొరుగు తో గలాటా పెట్టుకుని ఇల్లు చేరి.. నిద్రపోవడమే తప్ప గ్రామంలో మిగిలిన వాళ్ళ లాగా పడవ మీద చేపల వేట కు వెళ్ళడమో, నాలుగు రాళ్ళు సంపాయించడమో పిల్లలు ఎపుడూ చూడనే లేదు.

అది ఒక సముద్ర తీర గ్రామం.  అభివృద్ధి కి దూరంగా, చేపల పడవల మీద జాలరులు సముద్రంలోకి పోయి ఏదో కొంత వేట తెస్తే అవీ, ఊరి నిండా ఉన్న కొబ్బరి చెట్ల నుండీ వచ్చే బొండాల ఆదాయమూ.. పొలాల్లో కొద్దొ గొప్పో పండే ధాన్యమూ తప్ప వేరే బ్రతుకు తెలియని వాళ్ళు.  వాతావరణానికీ, ప్రాణానికీ లంకె. అందరివీ నాటు పడవలే. మర బోట్ ఉన్న బిజూ అనే ఆసామీ స్మగ్లింగ్ చేస్తాడని, సముద్రంలో పెద్ద పెద్ద నౌకల నుండీ పెట్టెలు ఈ తీరానికి తీసుకు వస్తాడనీ అంతా అనుకుంటూంటారు. ఎందుకంటే బిజూ నే కాస్తొ కూస్తో సంపన్నుడు. డాబా ఇల్లు ఉన్న ఆసామీ.

ఊర్లో ఏదో చిన్న బడి తప్ప, పెద్ద సౌకర్యాలేమీ లేవు.  ఆసుపత్రి లేదు. లీల తల్లికి ఏమి జబ్బో తెలీదు.  ఆలీబాగ్ కి ఏ బస్సులోనో బండిమీదో తీసుకెళ్ళాలి.  ఆవిడకి సరైన వసతులలో చికిత్స ఇప్పించగలిగేంత డబ్బూ లేదు వీళ్ళకి. ఒకో పూట తినడానికి తిండి కూడా వుండదు. తండ్రికి ఇవేమీ పట్టవు. అప్పో సొప్పో చేసి తన తాగుడు వరకూ మాత్రమే చూసుకుంటాడు.  భార్యా పిల్లలు అసలు ఎలా ఉంటున్నారో, ఏమి తింటున్నారో కూడా తెలీదు అతనికి.  అతనికి అప్పిచ్చి మునిగిన వాళ్ళు అక్కసుతో పిల్లలు ప్రాణంగా పెంచుకుంటున్న “పింటో” అనే కుక్క పిల్లని చంపేయడంతో వాళ్ళ పరిస్థితులు మరింత దిగజారతాయి. ముఖ్యంగా పిల్లలు మానసికంగా చాలా దెబ్బ తినిపోతారు.

వాళ్ళకున్న కొద్ది పాటి స్థలంలో ఏవో కూర మొక్కలు పాతుకుంటారు. ఒక్కోసారి పిల్లలు తీరం దాకా నడిచెళ్ళి, ఒడ్డున రాళ్ళ కి పట్టిన నత్తల్ని ఏరుకొస్తారు.  హరి చిరిగిపోయిన పాత వల తో సముద్రం ఒడ్డునే ఏవో చేపలు పట్టాలని ప్రయత్నిస్తూంటాడు.  లీల పెరట్లో కాచిన మిరపకాయలతో పిల్లలకు ఏదో కాస్త తినడానికి ఇస్తుంది.  బేల, కమల లు బడికి వెళ్తూంటారు. లీల కి ఆ సౌకర్యం లేదు.  వయసుకు మించిన బాధ్యతలు మోస్తూ హరీ, లీల ఆ సంసారాన్ని లాక్కొస్తున్నారు.

ఇంతలో ఊరిలో ఎరువుల ఫేక్టరీ నిర్మాణానికి ప్రభుత్వ అనుమతి లభిస్తుంది. పల్లెలో ఒక కుదుపు. ఫేక్టరీ వస్తే ఉద్యోగాలు వస్తాయని మభ్యపడుతున్న వారు,  భూములు ప్రభుత్వం లాక్కుంటే నిర్వాసితులమైతే తమ భవిష్యత్తు ఏంటని బాధపడేవారూ, ఈ లోగా పట్నం నుండీ వచ్చిన  పర్యావరణ వేత్తలూ, ఎరువుల కర్మాగారాలు వదిలే విష రసాయనాల వల్ల సముద్రంలో మరణించబోయే చేపల గురించి చెప్పి జాలర్లను అప్రమత్తం చేయడం.. ఇలా కొన్నాళ్ళు తుళ్, ఆ చుట్టు పక్కల గ్రామాల్లోనూ  ఉద్రిక్తత రగులుకుంటుంది.

ఇంట్లో పరిస్థితుల దృష్ట్యా తనకి ఏదో ఒక ఉద్యోగమో, ఆధారమో కావాలని వెతుకుతున్న హరి ని కూడా ఆ సంఘర్షణ తాకుతుంది.   అందరూ బొంబాయి వెళ్ళి ఒక ప్రదర్శన లో పాల్గొని, ప్రభుత్వానికి తమ నిరశన వ్యక్తపరుస్తామని అనుకుంటారు. దానికి తుళ్ నుండీ, మిగతా గ్రామాల నుండీ, పడవల్లో సముద్రమార్గాన బయలు దేరుతారు. హరి పొద్దున్న వాళ్ళతో వెళ్ళి, రాత్రికి వచ్చేద్దామనుకుంటాడు –  హరి ఆలోచన బొంబాయి లో ఏదో ఒక ఉద్యోగం వెతుక్కోవాలని.   లీలా, హరీ ఆ విషయం మాటాడుకున్నప్పుడల్లా, లీల ‘మమ్మల్ని వదిలి అంత దూరం వెళతావా హరీ ?’ అని బెంగ గా అడుగుతూండడం వల్ల హరి ఎటూ తేల్చుకోలేకపోతుంటాడు.

తుళ్ లో ఒక బంగళా వుంటుంది. దాని సొంతదార్లు డిసిల్వాలు బొంబాయిలో వుంటారు. ఎపుడన్నా సెలవులకి తుళ్ కి వస్తూంటారు. వాళ్ళ పిల్లలు సముద్రంలో ఈదుతూ, నీళ్ళలో ఆడుకుంటూ, తోటల్లో తిరుగుతూ, ఎంజాయ్ చేసి, కొన్నాళ్ళ తరవాత బొంబాయి వెళిపోతుంటారు.   ఒక సారి డిసిల్వా హరికి తన ఎడ్రస్ ఇచ్చి, బొంబాయి  వస్తే కలువు నీకు ఏదైనా సాయం చేస్తాను అనడం… హరి బొంబాయి యాత్ర కి ఒక ట్రిగ్గర్.   వాళ్ళు వచ్చినప్పుడల్లా, వాళ్ళకి కావల్సిన సౌకర్యాలు చూడడానికి, పని చెయ్యడానికీ లీల, హరి వెళ్తూంటారు.  అందువల్ల వీళ్ళకి పరిచయం.

హరి మాత్రం ఆందోళన కారులతో బొంబాయి వెళిపోయాక,  ఇంక రాకుండా అక్కడే మరింత చిక్కుల్లో పడిపోతాడు. అతను డిసిల్వా ఇంటికి చేరేసరికీ, వాళ్ళు తుళ్ వచ్చి వుంటారు.  ఇక తిరుగు ప్రయాణమవుదామనే సరికీ, చేతిలో చిల్లి గవ్వ లేదు, రేవులో తమ పడవలు వెళ్ళిపోయాయి. ఆఖర్న మంచి మనసు గల వాచ్ మేన్, ఒక చవకబారు హోటల్ ఓనర్ జోగూ, ఒక వాచీ మెకానిక్ ల ఆదరణతో, పని చేసుకుంటూ, దీపావళి కల్లా కొంత డబ్బు, జీవించడానికి కావలసిన ఆత్మ స్థైర్యం, వాచీ మెకానిక్ పని నేర్చుకోవడం వల్ల చేతిలో జీవనాధారమైన విద్య తో ఇంటికి తిరిగొస్తాడు.   ఆ రోజుల్లో ఇప్పుడున్నంత మొబైల్ కమ్మ్యూనికేషన్ లేదు కాబట్టి, లీల కి తాను బొంబాయిలో ఉన్నట్టు ఎపుడో ఒక్క కార్డు రాయడం తప్ప – ఇంకే సందేశమూ, వార్తా ఉండదు.

ఇక్కడ తుళ్ లో డిసిల్వాలు సెలవులు ముగిసాక వెళ్ళబోతున్నప్పుడు వాళ్ళ తిరుగు ప్రయాణంలో ఆలీబాగ్ లో తమ తల్లిని ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర డ్రాప్ చెయ్యమని అడుగుతుంది లీల. ఈ మాత్రం దానికి మంచివాళ్ళైన డిసిల్వాలు లీల తల్లిని ఆస్పత్రి లో చేర్చి, కొంత డబ్బూ ఇచ్చి, డాక్టర్లతో మాటాడి, ఆవిడకి క్షయ కావడంతో కొన్నాళ్ళు అక్కడే ఉంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు.  ఇక్కడ లీల కోసం ఒక ఉద్యోగం కూడా ఏర్పాటు చేస్తారు. వారి బంగళాకొక పక్షి శాస్త్రవేత్త వచ్చి కొన్నాళ్ళుండబోతుండడం వల్ల, ఆయనకి కావల్సినవన్నీ చూడడం లీల పని. ఈ పని వల్ల లీల కి చేతుల్లో కొంత డబ్బు వస్తుంది. ఆమె నెలకోసారి ఆలీబాగ్ వెళ్ళి ఆస్పత్రిలో తల్లిని కలిసి రాగలుగుతూంది.

ఈలోగా లీల తండ్రి కూడా మంచి వాడయి, తాగుడు మానేసి, ఆలీబాగ్ లో భార్య బాగోగులు చూసుకుంటూ, ఆస్పత్రి దగ్గరే ఉండిపోతాడు. దీపావళి నాటికి హరి ఇంటికి రావడం, తల్లి ట్రీట్మెంట్ ముగిసి ఆరోగ్యవంతురాలై తిరిగి రావడం, లీల చేసిన స్వీట్లూ,  వాళ్ళ జీవితాల్లో, మనసుల్లో ఆశ, భవిష్యత్తు కోసం బెంగ పోయి, ఒక ధైర్యం కలగడం.. నైరాశ్యం మీద ఇంటిల్లపాదీ కొందరు మంచి మనుషుల సాయంతో చేసిన పోరాటం వల్ల చిక్కిన ఆత్మ సంతృప్తి తో  హాయిగా నవ్వడంతో కధ ముగుస్తుంది.

ఈ నవల నిండా, జాలర్ల జీవితాల గురించి, చిక్కటి చేపల వాసనలు, సముద్రపు హోరు, వలలు, వేటలు, తుఫాన్లూ,  బొంబాయి నగరం. ఎందరో పేదలని అక్కున చేర్చుకుని ఆదరించిన నిర్దాక్షిణ్యమైన నగరం గురించీ… అక్కడ కూడా ఉన్న మంచి మనుషుల గురించి.. చదివి ఎంతో ఆనందం కలుగుతుంది.  తుళ్ ఒక సముద్ర తీర గ్రామం కావడం వల్ల జాలరులు సముద్ర తీరంలో ఉన్న బండలకి కొబ్బరికాయలు కొట్టి, పూలు, కుంకుమా సమర్పించి తమ ప్రాణాల కోసం ప్రార్ధించడమనే సాంప్రదాయం వుంటుంది.  కధ ఆ దృశ్యంతో,  మొదట లీల పూజతో మొదలయ్యి, చివరికి ఆరోగ్యం పుంజుకున్న లీల అమ్మ పూజ తో – ఆవిణ్ణి చూసుకుని మురిసిపోయే హరి, లీల ల నవ్వుతో ముగుస్తుంది.

ఇంత కన్నా మంచి బాల సాహిత్యం ఉంటుందా అనిపించింది.   కిరణ్ దేశాయ్ తల్లి అనితా దేశాయ్ చాలా రచనలు చేసినా, పిల్లల కోసం రాసిన పుస్తకాలు ప్రాచుర్యం చెందాయి.    సముద్రం అంటే ఉన్న ఇష్టం వల్ల – చిన్నప్పుడు చదివిన డేవిడ్ కాపర్ ఫీల్డ్  పెగోట్టీ ల ఇంటికి వెళ్ళడం అదీ, Yarmouth  జాలర్ల గ్రామం కూడా గుర్తొచ్చి భలే భలే సంబరంగా అనిపించింది.   సెలవుల్లో పిల్లల చేత చదివించొచ్చు.  1980 లలో రాసిన ఈ పుస్తకాన్ని నేషనల్ బుక్ ట్రస్ట్, నెహ్రూ బాల పుస్తకాలయం “సముద్ర తీర గ్రామం ” అనే పేరుతో   ప్రచురించింది. అనువాదం ఎం.వీ.చలపతి. వెల : రూ.27/- మాత్రమే.

You Might Also Like

Leave a Reply