స్మృతి రేఖలు

సాహిత్య అకాడెమీ పురస్కారం పొందిన విశిష్టమైన భగవతీ చరణ్ వర్మ హిందీ నవల “భూలే బిస్రే చిత్ర” కు తెనుగు అనువాదం ’స్మృతిరేఖలు’ అనే ఈ పుస్తకం. కథాకాలం – 1880 నుంచి 1930 మధ్యన. నాటి భారతదేశం విదేశీదాస్యంలో మగ్గుతోంది. స్వాతంత్ర్యోద్యమం ఊపిరి పోసుకొంటోంది. ఆ రాజకీయ నేపథ్యంలో భారతదేశంలోని మధ్య/ఎగువ తరగతి సాంఘిక జీవనాన్ని, వ్యక్తికి సమాజానికి మధ్య ఘర్ణణను, వ్యక్తిపై సమాజ విలువల ప్రాబల్యాన్ని, సమాజంపై వ్యక్తుల ప్రభావాన్ని అర్థవంతంగా చిత్రించిన నవల ఇది. ఈ నవలలో మూడుతరాల జీవితాన్ని రచయిత చిత్రించాడు. ఆ మూడుతరాలను, తన్మూలంగా కథను క్లుప్తంగా ప్రస్తావించుకుందాం.

********

మొదటి తరం.

జమీందారీ వర్గం (Feudal) ప్రాబల్యం పలుచనై, జమీలు, భూస్వామ్యాలు దాదాపుగా అంతరిస్తున్న కాలం ఇది. ఈ కాలానికి ప్రతినిధి జ్వాలాప్రసాద్. 1880 నాటిది ఈ తరం.

ఫతేపూర్ కు చెందిన కాయస్థకులజుడు మున్షీ శివలాల్ – కోర్టు బయట అర్జీలు వ్రాసిపెట్టే చిరుద్యోగి. ఈతని పూర్వీకుల చరిత్ర ఘనమైనదైనా, ఈయన కాలానికి ఆస్తులన్నీ హరించుకుపోవడంతో చిన్న గుమాస్తాగా ఉద్యోగం చేయవలసి వచ్చింది. శివలాల్ – ఎలాగో ఓ అధికారి ప్రాపకం సంపాదించి తన కొడుకు జ్వాలాప్రసాద్ కు ప్రభుత్వ ఉద్యోగం వేయించుకుంటాడు. దరిమిలా జ్వాలాప్రసాద్ డిప్టీ తహసీల్దారుగా ఘటంపూర్ లో ఉద్యోగానికి చేరతాడు.

ఘటంపూర్ లో ఠాకుర్ బర్‍జోర్‍సింగ్, గజరాజ్ సింగ్ అనే జమీందారీ వంశపు పెద్దలు ఉంటారు. జమీలు పోయినా, వారి భేషజం, దర్పం తగ్గవు. వారిని చూసి సామాన్యప్రజ భయపడుతుంటుంది. ఠాకుర్ బర్ జోర్ సింగ్ – కుమార్తె పెళ్ళి ఘనంగా చేయటానికి తన పొలాన్ని లాలా ప్రభుదయాళ్ అనే వడ్డీవ్యాపారికి కుదువ పెడతాడు. లాలా ప్రభుదయాళ్ – ఏ మాత్రం దయాదాక్షిణ్యాలు లేని కరడు కట్టిన వడ్డీ వ్యాపారి. ఈతడు వడ్డీలపై వడ్డీలు వేసి బర్ జోర్ సింగ్ ఆస్తిని స్వాధీనం చేసుకోవాలనుకుంటాడు. అనుకున్నట్లుగానే లాలా ప్రభుదయాళ్ – బర్‍జోర్ సింగ్, అతని మిత్రుడు గజరాజ్ సింగ్ లకు భయపడకుండా కోర్టు తీర్పు ద్వారా బర్‍జోర్ సింగ్ పొలాన్ని తనఖా వేయించి, ఎవరూ వేలానికి రాకపోతే, తనే ఆ పొలాన్ని స్వాధీనం చేసుకుంటాడు. ఇది సహించలేని బర్‍జోర్ సింగ్ లాలా ప్రభుదయాళ్ ను హత్య చేస్తాడు.

జ్వాలాప్రసాద్ ప్రభుత్వోద్యోగిగా అటు ప్రభుదయాళ్ కుటుంబానికి, బర్ జోర్ సింగ్ కూ కూడా సన్నిహితుడు. ప్రభుదయాళ్ భార్య బైదేయి కి జ్వాలాప్రసాద్ భార్య యమున ఆత్మీయురాలు. బర్‍జోర్ సింగ్ కూడా జ్వాలాప్రసాద్ కు ఆప్తుడే. అయితే ఓ ప్రభుత్వోద్యోగిగా కర్తవ్యనిష్టను పాటించి జ్వాలాప్రసాద్, ఆప్తుడైనప్పటికీ హంతకుడైన ఠాకుర్ బర్‍జోర్ సింగ్ పై వారంట్ వేయించి అరెస్ట్ చేయిద్దామనుకుంటాడు. అది విని పరువు పోతుందేమో అని ఊహించి, దాన్ని భరించలేక ఠాకుర్ బర్‍జోర్ సింగ్ ఆత్మహత్య చేసుకుంటాడు. అతని భార్యాపిల్లలు కట్టుబట్టలు కూడా లేక వీథిని పడతారు. ఇదంతా తనమూలానే జరిగిందన్న భావన జ్వాలాప్రసాద్ ను బాధిస్తుంది. ఠాకుర్ బర్‍జోర్ సింగ్ ను ఆదుకునేందుకు అతడు ప్రభుదయాళ్ భార్య బైదేయితో “లంచం” తీసుకుంటాడు. ఆ లంచం డబ్బును బర్‍జోర్ సింగ్ భార్యకు అందజేసి, తమ పొలం విడిపించుకుందుకు తోడ్పడతాడు. పూర్తి వివరాలు తెలియని కొందరు జ్వాలాప్రసాద్ ను లంచగొండిగా అనుకుంటారు.

అది అలా ఉంటే – జ్వాలా ప్రసాద్ కుటుంబంలో ఒడిదుడుకులు మొదలవుతాయి. మున్షీ శివలాల్ వృద్ధాప్యంలో కొడుకు దగ్గర ఉండాలని ఫతేపూర్ లోని బంగళాను, కొంత భూమిని – తమ్ముడు మున్షీ రాధేలాల్ పరం చేసి కొడుకు జ్వాలాప్రసాద్ వద్దకు చేరతాడు. రాధేలాల్ కు నలుగురు కొడుకులు. అందరూ అసమర్థులు. రాధేలాల్ కూడా ధూర్తుడే. ఈ మహా కుటుంబం తమ జల్సాలకు తగినంత డబ్బు దొరక్కపోవడంతో మెల్లగా ఏవో సాకులు చెప్పి, శివలాల్ ద్వారా జ్వాలాప్రసాద్ పంచన చేరతారు.

జ్వాలా కు ఇంట్లో మనశ్శాంతి కరువౌతుంది. రాధేలాల్ కొడుకులు, ప్రభుత్వోద్యోగి జ్వాలాప్రసాద్ పేరును అడ్డం పెట్టుకుని ఊళ్ళో చిన్న చిన్న అక్రమాలు చేస్తుంటారు. అంతే కాక ఓ జమీని అక్రమంగా ఓ మహమ్మదీయురాలైన విధవ ద్వారా స్వాధీనం చేసుకోవాలని తలపోస్తారు. అయితే పైకి మాత్రం అంతా సవ్యంగా ఉన్నట్టు కల్పిస్తుంటారు. మున్షీ శివలాల్ – కుటుంబ విలువలకు కట్టుబడి, తమ్ముణ్ణి వెనకేసుకు వస్తుంటాడు. జ్వాలాప్రసాద్ కు మెలమెల్లగా సంగతులు అర్థం అవుతాయి. జమీ విషయమై జ్వాలాప్రసాద్ కు, తండ్రితో గొడవవుతుంది. ఆ గొడవలో ఆవేశం పట్టలేని మున్షీ శివలాల్, ఓ మట్టి బిందెను తలపై మోదుకుని మరణిస్తాడు. జ్వాలాప్రసాద్ ఆపై ఆలోచించి, తన బాబాయికి గట్టిగా బుద్ధి చెప్పి ఫతేపూర్ కు పంపించి వేస్తాడు.

********

ఈ మొదటి తరంలో జమీందారీ (Feudal) వర్గానికి ఠాకుర్ బర్‍జోర్ సింగ్, గజరాజ్ సింగ్ ప్రతినిధులైతే, పెట్టుబడిదారీ (Capitalism) వ్యవస్థ కు ప్రభుదయాళ్ ప్రతినిధి. ఈ రెండు వర్గాల మధ్య సంఘర్షణకు లోనైన ప్రజకు జ్వాలాప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కుటుంబవిలువలు అనే సాంప్రదాయానికి మున్షీ శివలాల్ ప్రతినిధి అయితే, అర్థరహితమైన విలువలకంటే శ్రేయస్సు ముఖ్యమనే భావనకు ఛింకీ, జ్వాలాప్రసాద్ ప్రతినిధులు.

********

రెండవతరం.

వడ్డీవ్యాపారి లాలా ప్రభుదయాళ్ కుమారుడు ’సర్’ లక్ష్మీచంద్. లక్ష్మీచంద్ – నూలు, కలప, ఇలా రకరకాల వ్యాపార్లు చేస్తూ, కోట్లు గడించడమే కాక ఆంగ్లేయుల నుంచీ ’సర్’ బిరుదాన్ని పొందియున్నాడు. ఈ లాభాలలో కొంత ధనాన్ని అతడు ఆంగ్లేయుల విలాసాలకు, ధనిక వర్గం వారు చేసే పనులకు విరాళంగానూ ఇస్తూ తన వ్యాపారాలను సజావుగా జరిగేలా చూసుకుంటూ ఉంటాడు.

గంగాప్రసాద్ జ్వాలాప్రసాద్ కుమారుడు. బీయే సెకండ్ క్లాసు పాసయిన గంగాప్రసాద్, తండ్రి పరపతి వలన, నాయకత్వపు లక్షణాల వలన, చురుకుదనం వలన, క్రికెట్ ఆట నైపుణ్యం వలన చదువు పూర్తి చేయగానే అలహాబాదులో డిప్టీ కలెక్టరు ఉద్యోగం సంపాదించాడు. గంగా ప్రసాద్ వ్యక్తివాది. తన దారికి అడ్డు లేనంత వరకూ ఆదర్శాలను పాటిస్తాడు. అలాగే ఈతడిది ప్రాక్టికల్ మనస్తత్వం. తన తోటి ఆంగ్లేయుల ముందు, అధికారుల ముందు వంగి నిలుచోవడం ఇతనికి పడదు. వారిని తన సమాన హోదాతోనే ఇతను గౌరవిస్తాడు. గంగాప్రసాద్ చదువు అంతా బైదేయి చేతుల మీద, లక్ష్మీచంద్ తో బాటు సాగింది.

ప్రస్తుతం డిప్టీ కలెక్టరు గంగాప్రసాద్ లండను యువరాజు కోసం దర్బారు ఏర్పాట్లకై మూడు నెలలు ఢిల్లీ వెళుతున్నాడు. ఆ అవకాశం అందరికీ లభించదు. పని పూర్తయిన తర్వాత గంగాకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. గంగాప్రసాద్ ఢిల్లీ నుంచి తిరిగి వచ్చే సరికి, బైదేయి మరణావస్థలో ఉంటుంది. బైదేయి తన ఆస్తిలో కొంత భాగాన్ని గంగా పేరిట వ్రాయాలని తలపోస్తుంది. ఇందుకు లక్ష్మీచంద్ మండిపడి, తల్లిని దుర్భాషలాడి, అలా జరిగితే గంగా ను, అతని తండ్రి జ్వాలాప్రసాద్ ను చెరలో పెట్టిస్తానని అరుస్తాడు. నిస్సహాయ స్థితిలో బైదేయి మరణిస్తుంది.

గంగాప్రసాద్ మామ జ్ఞానప్రకాష్. అవటానికి మేనమామ అయినా, ఇతడు గంగాకంటే మూడేళ్ళు మాత్రమే పెద్ద. ఇద్దరూ కాలేజీలో సహచరులు. జ్ఞాన ప్రకాష్ లండన్ లో బారిష్టరు చదివి తిరిగి వచ్చాడు. ఇతడు గాంధేయవాది. లండనులో ఉన్నాడు కనుక, తెల్లవాళ్ళ దృష్టిలో భారతీయులు ఎంత చులకనో అతనికి తెలుసు. ఈ దాస్యత్వం కొనసాగితే తన తర్వాతి తరం తనను క్షమించదని అతని నమ్మిక. అందుకై కాంగ్రెసులో చేరి స్వాతంత్ర్య పోరాటం చేయాలని అతని ఆశయం. అతని ప్రోద్బలంపై గంగా ఓ మారు కాంగ్రెస్ సభలో పాల్గొంటాడు.

గంగాప్రసాద్ వ్యక్తివాది. అతడికి తన జీవితానికి పనికి వస్తే అది ఆదర్శమని, లేకపోతే అనవసరమైన తతంగమని, ఆంగ్లేయులు పాలకులుగా కాక, భారతజాతి స్వతంత్రంగా మనలేదని అతని నమ్మిక. అతడికి అస్పృస్యతానివారణ, హిందూ ముస్లిమ్ ఐక్యత వంటి విషయాలపైనా సదభిప్రాయం ఉండదు. అయినా అతను వ్యక్తిగ్తతంగా జ్ఞానప్రకాష్ ను గౌరవిస్తూ ఉంటాడు.

గాంధీజీ పిలుపు మీద దేశంలో ’సహాయ నిరాకరణ ఉద్యమం’ ముమ్మరంగా కొనసాగుతుంటుంది. రెండున్నర లక్షల ఆంగ్లేయులు కోట్లాది భారతీయులను పాలించటానికి కారణం – భారతీయులైన వారే ప్రభుత్వోద్యోగులుగా ఆంగ్లేయుల క్రింద పనిచేస్తూ, తోటి భారతీయులపై ఆజమాయిషీ చేయటమని కాంగ్రెసు వాదుల తీర్మానం. ఆదర్శాలను అందిపుచ్చుకుని దేశంలో యువత తమ ప్రభుత్వ ఉద్యోగాలను వదిలి ఉద్యమంలో చేరాలని పిలుపునిస్తారు కాంగ్రెసు వాదులు.

సహాయనిరాకరణోద్యమానికి మూలద్రవ్యం (Working Capital) ఎలా వస్తోందో కనిపెట్టమని గంగాప్రసాద్ ను అతని పై ఆంగ్ల అధికారి ఆదేశిస్తాడు. అది కనిపెట్టి పై అధికారికి రిపోర్టు చేస్తాడు గంగూ. ఇంతలో ’చౌరీ చౌరా’ అనే ప్రాంతంలో సహాయనిరాకరణోద్యమం గాంధీజీ ఆదర్శాలకు వ్యతిరేకంగా జరిగి, తీవ్రమైన హింసా రూపం దాల్చటంతో – ఆ ఉద్యమాన్ని ఆపివేయాలని పిలుపునిస్తాడు గాంధీజీ. ఉద్యమం నిలిచిపోతుంది.

ఈ నేపథ్యంలో ఆంగ్ల అధికారి హారిసన్ – గంగాప్రసాద్ కు, ఇంకొంతమంది పెద్దలకు ఓ రాత్రి పార్టీ ఇస్తాడు. ఆ పార్టీలో మద్యపానమత్తుడైన ఆంగ్లేయుడు, కొంతమంది వ్యాపారులు గాంధీజీని నానా దుర్భాషలాడుతారు. గంగాప్రసాద్ కు అది నచ్చదు. గాంధీతో సిద్ధాంతరీత్యా విభేదం ఉండవచ్చు గాక, కానీ అతణ్ణి దూషించటం తప్పని వాదిస్తాడు. వాదం గొడవగా మారుతుంది. గంగూ హారిసన్ ను తిట్టిపోస్తాడు. దాంతో ఆ ఆంగ్లేయుడు గంగూ పై కక్షకట్టి ’ఎంత అధికారి’ వైనా భారతీయులు భారతీయులే, ఆంగ్లేయులు ఆంగ్లేయులే అని, ఆ విషయం నిరూపించదల్చుకుంటాడు. తర్వాత రెండు రోజులకు గంగాప్రసాద్ కు అలహాబాదు నుంచీ ఓ చిన్న ఊరికి బదిలీ అవుతున్నట్టు వర్తమానం వస్తుంది. బదిలీకి కారణం – “అలహాబాదుకు సమర్థుడైన ఆంగ్ల అధికారి అవసరం” అని, ట్రాన్స్ ఫర్ అయినప్పటికీ అక్కడా ఎదుగుదలకు సమాన అవకాశాలున్నాయని ఆంగ్లకలెక్టరు గంగాతో చెబుతాడు. ఈ పని హారిసన్ చేయించినట్టు గంగాకు తెలుస్తుంది.

వ్యక్తిస్వేచ్ఛను ఇష్టపడే గంగా తనపై ఓ ఆంగ్ల అధికారి పగ సాధించటాన్ని తట్టుకోలేకపోతాడు. ఉద్యోగానికి రాజీనామా పత్రం తయారు చేసి, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనదలుచుకుంటాడు. అప్పుడు సరిగ్గా ముల్తాన్ అన్న చోట హిందూ ముస్లిమ్ వర్గాల మధ్య ఘర్షణ జరిగి కల్లోలం జరుగుతుంది. ఈ వర్గాల మధ్య చిచ్చు పెట్టించినది ఆంగ్లేయులని అతనికి తెలుస్తుంది. గంగా లోని వ్యక్తివాదమే అతణ్ణి బానిసగా చేస్తుంది. ఏది ఏమైనా బానిసలు బానిసలే., పాలకులు పాలకులే. బానిసత్వం అన్నది తప్పనప్పుడు దాన్ని ఆనందంగా అనుభవించాలి. ఇలా అనుకున్న గంగా రాజీనామా పత్రాన్ని చించి డ్యూటీలో జాయినయిపోతాడు.

********

“అవునోయి. ప్రపంచంలో సామాన్యంగా వర్తించే ప్రమాణాలను ఎదుర్కోవడంలోనే వాస్తవిక జీవితం ఉందనీ, అదే జీవితం లోని పురోగమనమని నీవు వాదిస్తే నేను కాదనను. కాని ఈ తిరుగుబాటు రెండు రకాలుగా ఉంటుంది; ఒకటి విశ్వాసంపైన, మరొకటి అవిశ్వాసం పైన ఆధారపడినది. నీ మార్గం అవిశ్వాసానికి సంబంధించినది. నా మార్గం విశ్వాసానికి సంబంధించింది.”

– జ్ఞానశేఖర్ గంగాప్రసాద్ తో చెప్పినట్టుగా రచయిత కూర్చిన ఈ అద్బుతమైన సంభాషణ అన్ని కాలాలకు వర్తిస్తుంది. వ్యక్తివాదం గొప్పదే. అయితే ఆ వ్యక్తివాదానికి విశ్వాసం, దానికి సంబంధించిన త్యాగం, ఆత్మసమర్పణం వంటి లక్షణాలు ఉండాలి. అప్పుడు అది కన్విక్షన్ కు చెందిన వ్యక్తివాదం అవుతుంది అన్న భావన వ్యక్తం చేస్తాడు రచయిత.

లక్ష్మీచందు – పచ్చి అవకాశవాదానికి, పెట్టుబడివ్యవస్థ యొక్క కరడుగట్టిన రూపానికి ప్రతినిధి.జ్ఞానప్రకాష్ – విశ్వాసపూరితమైన జీవిత పురోగమనానికి, గంగాప్రసాద్ స్పష్టతలేని అవిశ్వాసపూరితమైన ఆలోచనలకు ప్రతినిధులు. తనను దుర్భాషలాడిన లక్ష్మీచందు తోటే గంగాప్రసాద్, కారు కొనిపించుకుంటాడు. అట్లే, ఆంగ్లేయులు భారతీయుల మెదళ్ళకు నూరిపోసిన “దాస్యత్వం” అంటే (ఆంగ్ల)సమాజం యొక్క ప్రభావం వ్యక్తిపై పడటాన్ని గంగాప్రసాద్ పాత్ర విషయంలో చూస్తే, ఆ ప్రభావానికి అతీతమైన విచక్షణ కలిగిన వ్యక్తుల విషయంలో వ్యక్తి ప్రభావం సమాజంపై పడటాన్ని జ్ఞానశేఖర్ పాత్ర నిరూపిస్తుంది.

********

మూడవతరం.

గంగాప్రసాద్ తన రాజీనామా పత్రాన్ని చింపి, బానిసగా కొనసాగటాన్ని జీవనవిధానంగా ఎంచుకున్న పది యేళ్ళకు అతని కొడుకు నవల్ కిషోర్ పెరిగి బీయే ఫస్ట్ క్లాస్ లో ప్యాసయ్యాడు. ఆపై లండన్ లో బారిష్టరు చదవబోతున్నాడు. అది 1929.

గంగాప్రసాద్ కు తీవ్రంగా జబ్బుచేసింది. భువల్ అనే ఊరికి తీసుకెళ్ళి వైద్యం చేయించాలని డాక్టర్ షేర్‍వుడ్ చెప్పాడు. నాన్నకు తోడుండాలని నవల్ బయలుదేరాడు.

రావుబహదూర్ కామతానాథ్ – నవల్ కుటుంబానికి పరిచయస్థుడు. ఆయన కుమార్తె ఉష. నవల్ కిషోర్, ఉష పరస్పరం ప్రేమించుకుంటున్నారు. ఎఱిగిన కుటుంబమే కాబట్టి వారిద్దరికీ త్వరలో పెళ్ళి చేయాలనే కామతానాథ్ అభిమతం. ప్రస్తుతం కామతానాథ్ గారు కుటుంబసభ్యులతో స్విడ్జర్లాండు విహరించబోతున్నారు. ఎలాగూ నవల్ కిషోర్ లండనుకు వెళ్ళాలనుకుంటున్నాడు కాబట్టి, తమతో బాటు నవల్ ను తోడు రమ్మన్నారాయన. అయితే తన తండ్రిని జబ్బు స్థితిలో వదలి రాలేనని ఆయనకు నవల్ నిశ్చయంగా చెప్పేశాడు. ఇందుకు కామతానాథ్ బాగా నొచ్చుకున్నాడు. భువల్ కు వెళితే, గంగా తో బాటు నవల్ కు అంటువ్యాధి సోకుతుందని, “ప్రాక్టికల్” గా ఆలోచించి నిర్ణయం తీసుకోమని, జీవితం నాశనం చేయవద్దని నవల్ కు, నవల్ తాతయ్య జ్వాలాప్రసాద్ కు కూడా ఆయన చెప్పాడు. అయితే – తన తండ్రికంటే “కెరియర్” పెద్దది కాదని, లండన్ లో చదవకపోయినా తను బ్రతకగలనని నవల్ ఆయనతో స్థిరంగా చెప్పేశాడు.

నవల్ ధీరతను చూసి, అతను కుటుంబాన్ని, చెల్లెలు విద్యను చూసుకోగలడని, ఆ అమ్మాయికి పెళ్ళి చేయగలడని విశ్వసించి, నిశ్చింతగా కళ్ళు మూస్తాడు గంగాప్రసాద్.

విద్యకు అదివరకే గంగాప్రసాద్ విందేశ్వరీప్రసాద్ కుమారుడు సిద్ధేశ్వర్‍తో సంబంధం ఖాయం చేసి ఉంటాడు. విందేశ్వరీప్రసాద్ పరమదురాశాపరుడు అయినప్పటికీ, తండ్రికి మాట ఇచ్చినందున, ఆ ఇంటికే ఆ అమ్మాయిని ఇచ్చి, పెళ్ళి చేయాలని నవల్ తపన పడతాడు. కట్నానికి, పెళ్ళి ఖర్చులకు చాలా డబ్బు అవసరమవుతుంది. విద్యకు కూడా ఆ సంబంధం ఇష్టం ఉండదు. అయినా ఆమె పెళ్ళికి ఒప్పుకోక తప్పింది కాదు. అయితే తన బీయే మాత్రం పూర్తి చేసితీరాలని, అందుకు సహాయం చేయాలని ఆమె అన్నతో ఆంక్ష పెడుతుంది. ఎన్నెన్నో కష్టాలు పడిన తర్వాత అనుకున్న కట్నం ఇచ్చిన తర్వాత విద్య పెళ్ళి అవుతుంది. పెళ్ళయిన పిదప విద్య, అన్న సాయంతో వారణాశిలో బీయే పూర్తి చేసి, కాపురానికి వెళుతుంది.

సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు జరుగుతున్న రోజులు. కాంగ్రెసు పార్టీకి కార్యకర్తలు కావాలి. నవల్ తాతయ్య జ్ఞానప్రకాష్ ప్రభావం నవల్ పై పడుతుంది. అతడు ఖద్దరు దుస్తులు ధరించటం మొదలెడతాడు. నవల్ కిషోర్ లో వస్తున్న మార్పులు చూసి కామతానాథ్, జ్వాలాప్రసాద్ ఆశ్చర్యపడుతుంటారు.

ఇలా ఉండగా ఓ రోజు విద్య వాళ్ళింటి నుంచి నవల్ కు “వెంటనే వచ్చి విద్యను తీసుకుపొమ్మని” టెలిగ్రామ్ అందుతుంది. ఖంగారు పడి, నవల్ కిషోర్, జ్ఞానప్రకాష్ విద్య వాళ్ళింటికి వెళతారు. అక్కడ విద్య భర్త, మామయ్యలు కలిసి విద్యను శారీరకంగా, మానసికంగా హింసించి ఉంటారు. ఆ కుత్సితపు ఇంట్లో ఉంటే విద్య దక్కదని, జ్ఞానప్రకాష్, నవల్ – విద్యను తమ ఇంటికి పిలుచుకుని వచ్చేస్తారు. విద్య తీవ్రమైన నిర్వేదంలో మునిగిపోతుంది. విద్య జీవితాన్ని నాశనం చేశామన్న చింతతో నాయనమ్మ యమున కన్నుమూస్తుంది.

ఇర్విన్ ఒడంబడిక విఫలమవుతుంది. గాంధీ నెహ్రూలు – లాహోరు నగరంలో కాంగ్రెసు సభద్వారా అశేష ప్రజానీకానికి పిలుపునిస్తారు. కనీసం ఓ పది మంది యువకులను తన తరపున కూడగట్టి ఆ సభకు తీసుకు వెళ్ళాలని జ్ఞానప్రకాష్ ఆశయం. అందుకు నవల్ ను సాయం అడుగుతాడాయన. తనతో బాటుగా కష్టం మీద ఏడుగురిని కూడగడతాడు నవల్. ఎనిమిదవ వ్యక్తిగా తనపేరు వ్రాసుకొమ్మని ముందుకు వస్తుంది విద్య. మొదట వ్యతిరేకించినా, విద్యకు నిర్వేదం పోవాలంటే ఏదో ఒక మార్గంలో నడవక తప్పదని ఒప్పుకుంటాడు జ్ఞానప్రకాష్. విపరీతమైన చలి రోజులలో లాహోర్ కు మూడవతరగతిలో ప్రయాణించి నవల్, విద్య, తదితరులు సభకు హాజరవుతారు. అక్కడ తమ కుటుంబాలను, వ్యక్తిగత జీవితాలను, సుఖాలను త్యాగం చేసి దేశం యొక్క దాస్య విముక్తి కోసం ముందుకు వచ్చిన అశేషమైన యువతీయువకులను చూసి విద్యలో గొప్ప మార్పు వస్తుంది. తను స్వతంత్రంగా తనకాళ్ళపై తాను నిలబడగలనని ఆమెకు ధైర్యం వస్తుంది.

లాహోర్ సభ గొప్పగా జరుగుతుంది. భవిష్యత్తులో స్వరాజ్యసాధన కోసం దేశప్రజానీకం అంతటికీ ఖచ్చితమైన కార్యాచరణ ఎలా చెయ్యాలన్న స్పష్టత ఇంకా నాయకులలో వచ్చి ఉండదు. అయితే “హింస ద్వారా హింసయే గెలుస్తుంద”ని, అహింస ద్వారానే ఉద్యమించాలని, ఎన్ని బాధలు పెట్టినా బలంగా, అదే సమయంలో అహింసను పాటిస్తూనే యువత ఉద్యమించాలని, అలా చేయడం సాధ్యమేనా? అని గాంధీ, జవహర్లాల్ యువతకు ప్రశ్నను విసురుతారు.

అలహాబాదుకు వచ్చేసిన తర్వాత విద్య ఒక ఉపాధ్యాయినిగా బడిలో చేరుతుంది. విద్య భర్త సిద్దేశ్వర్ ఇంకో అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. విద్య చలించదు. ఇటు – నవల్ చర్యలకు విసిగిన కామతానాథ్ గారు, అతడు తమకు తగడని ఉషకు వేరే సంబంధం చూస్తారు. నవల్ భగ్న హృదయుడవుతాడు.తన జీవిత మార్గం అసత్యమో, సత్యమో, ఏ ఫలితాన్నిస్తుందో, అన్న సందిగ్ధంలో ఉంటాడు నవల్. అయినప్పటికీ జ్ఞానప్రకాష్ ప్రేరణతో విశ్వాసపూరితంగా భావి జీవితాన్ని గడపాలనుకుంటాడు.

ఉప్పు సత్యాగ్రహం ద్వారా దేశమంతా ఆంగ్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉప్పు తయారు చేయాలని పిలుపునిస్తాడు గాంధీ. తనను తోడు ఉండనిమ్మని గాంధీజీని కోరతాడు జ్ఞానప్రకాష్. గాంధీజీ నిరాకరించి, అలహాబాదులోనే ప్రజలను కూడగట్టి ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్ళమని నిర్దేశిస్తాడు. ఆంగ్లప్రభుత్వం సత్యాగ్రహం చేసిన వారందరినీ ఖైదు చేయాలనుకుంటుంది. మొదటి రోజు ఉద్యమంలో జ్ఞానప్రకాష్ ను కాదని నవల్ ముందుకు వెళతాడు. సరిగ్గా సత్యాగ్రహానికి ముందు రోజు – ఉషను కలిసి ఆమె భావిజీవితానికి శుభాశయాలు తెలిపి వస్తాడు నవల్ కిషోర్.

ఆ రోజు – వృద్ధులైన జ్వాలాప్రసాద్, బీఖూ చూస్తూ ఉండగా, నవల్ అశేషమైన యువత నినాదాల మధ్య ఉప్పు సత్యాగ్రహానికి బయలు దేరతాడు. కూడలి వరకూ తోడు వచ్చిన విద్య, నవల్ ను సాగనంపి, తన బడికి వెళ్ళిపోతుంది.

“బీఖూ! ఇదంతా ఏమిటి? ఇలా ఎందుకు జరుగుతూ ఉంది? ఈ రకరకాల చిత్తరువులు వాటంతట అవి ఏర్పడుతున్నాయి. మళ్ళీ వాటంతట అవే మాయమై పోతున్నాయి. దీనివల్ల ప్రయోజనం?”

తరతరాల చిత్తరువులు చూసి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులకు తట్టుకుని నిలబడి ఎంతో అనుభవం సంపాదించిన ఇద్దరు వృద్ధులూ ఏమీ చెయ్యకుండా ఉన్నారు. ఏమీ బదులు చెప్పలేకున్నారు. వాళ్లకు దూరంగా వేలు, లక్షలు, కోట్లకు మించిన ప్రజలు జీవితాన్ని, జీవిత పురోగమనాన్ని గమనించి నవనవోన్మేషంతో నూతనోత్సాహంతో నవ్యజగత్తును నిర్మించాలని వెళుతున్నారు.

********

మూడవతరం – ఇందులో నవల్ కిషోర్ చైతన్యానికి ప్రతీక అని విమర్శకుడు ముందు మాటలో వ్రాశాడు. అయితే నవల్ కిషోర్ – జీవితం పట్ల నిజాయితీ అయిన “Conviction” కు ప్రతీక అనే పాఠకులకు అనిపించే అవకాశం ఉంది. ఓ విధంగా చూస్తే ఈ పాత్ర – జ్వాలాప్రసాద్ యొక్క దక్షతకూ, గంగాప్రసాద్ యొక్క స్వేచ్ఛావాదానికి మధ్య సమతుల్యత లా అగుపిస్తుంది.

మూడవతరంలో ఓ చోట జవహర్లాలు, గాంధీజీ మార్గాల గురించి రచయిత ఓ మాట అంటాడు. “జరిగిపోయినదంతా అసత్తు. జరగవలసినదే సత్యం. పాత సాంప్రదాయం విచ్ఛిన్నత నుంచే కొత్త ఆదర్శాలు రావాలి. సమసమాజ నిర్మాణమే యువత ధ్యేయం” – అని జవహర్లాలు ఆశిస్తే, “ఆర్ష సాంప్రదాయంలో మంచిని స్వీకరించి, భవిష్యత్తుకు అనుగుణంగా ఆదర్శాలను నిర్ణయించుకుని ఆచితూచి ముందుకు పోవాల”న్న భావం గాంధీజీది అట.సహజంగా యువతకు జవహర్లాల్ మార్గమే ఉత్సాహభరితంగా కనిపిస్తుందంటాడు రచయిత.

ఈ తరంలో పైకి కనిపించని ప్రధాన పాత్ర ఉష. విచక్షణ లేని అంధసాంప్రదాయానికి ఆమె ప్రతీక. స్త్రీ ముసుగు వేసుకునే ఉండాలి. భర్త అనేవాడు కుటుంబానికే ప్రధాన్యత ఇవ్వాలి. స్త్రీని సుఖపెట్టాలి. అందుకు డబ్బు సంపాదించాలి. హోదాను నిలుపుకోవాలి. కుటుంబవిలువలు ఇవే అని, కుటుంబం ద్వారానే సంస్కృతి నిలుస్తుందని ఆమె భావాలు. విద్య కు జీవితం నేర్పిన పాఠాలు సరిగ్గా ఈ వాదాలకు వ్యతిరేకంగా ఉంటాయి. ఉష వాదాలు ఎంత నిమ్నంగా ఉన్నాయో అని రచయిత విద్య యొక్క జీవితానుభవాల ద్వారా “చూపుతాడు”. ఇది అపూర్వమైన పాత్ర చిత్రణ.

********

ఏదైనా స్వయంగా అనుభవానికి రానిదే దానియొక్క అంతరార్థమూ, స్వభావమూ పూర్తిగా తెలియవు. స్వాతంత్ర్యం కోసం పోరాడే అవసరం నేడు లేదు కాబట్టి – నేతి తరానికి ఆ పోరాటం దానివెనుక గల ఘర్షణ, దాని సారాంశం తెలియవేమో. వేలమంది యువతీయువకులు ప్రాణాలను, మానాలను, ఆశలను, సుఖాన్ని వదిలి, అసలు స్వరాజ్యం వస్తుందో, రాదో, తమ మార్గం వల్ల భవిష్యత్తుకు ఏమైనా ఒరుగుతుందో, లేక తమ జీవితం వ్యర్థమవుతుందో తెలీక, ఆశనిరాశల మధ్య సందిగ్ధతల మధ్య కొట్టుమిట్టాడుతూ జీవితంలో ప్రయాణించటాన్ని కనీసం ఓ మాత్రంగానైనా ఊహించడం కష్టం. అలాంటి సంఘర్షణను రికార్డు చేసిన పీరియడ్ నవల యిది. తన జాతి యొక్క త్యాగాన్ని, ఆదర్శాలను రికార్డు చేసి తర్వాతి తరానికి అందించటమే సాహిత్యం యొక్క ప్రముఖమైన ఓ ఉద్దేశ్యం అయితే ఆ ఉద్దేశ్యాన్ని ఈ నవల నిలబెట్టిందనుకోవాలి.

’భూలే బిస్రే చిత్ర’ – ’మరిచిపోయిన చిత్తరువులు’ – రచయిత దృష్టిలో స్మృతి జారిన రేఖలివి. పాఠకుడి స్మృతిలో మాత్రం ఈ పాత్రల రూపురేఖలు స్థిరంగా నిలబడిపోతాయి. బహుశా అందుకేనేమో, అనువాదకుడు స్మృతిరేఖలు అన్న పేరు పెట్టాడు.

సాధారణంగా చారిత్రక నవలలలో కొందరు రచయితలు – తమ ఆదర్శాలను, వాదాలను చెప్పటానికి తన తరపున ఒక హీరోను సృష్టిస్తారు. అతడి ద్వారా పాఠకులపై తన భావాలను రుద్దుతాడు/చెబుతారు. మరికొందరు రచయితలు – అవాంతర పాత్రల ద్వారా, కొన్ని సంఘటనలను ప్రవేశపెట్టటం ద్వారా ఆదర్శాలను స్పృశించి, పాఠకుల పరిశీలనకు వదిలిపెడుతుంటారు. ఈ రెంటికీ భిన్నమైన పరిణతిని రచయిత ఈ నవలలో సాధించాడు. ఈ నవల ముందు మాటలో – రచయిత పాత్రయే నవల్ కిషోర్ అని విమర్శకుడంటాడు. కానీ జాగ్రత్తగా గమనిస్తే నవల్ కిషోర్ (రచయితలో దాగిన) ఆదర్శవాది గా కన్పించడు. అలాగని నవల్ (రచనలోని మరో పాత్ర గంగాప్రసాద్ లా) వ్యక్తివాదీ కాడు. నవల్ కిషోర్ – సత్యాసత్య వివేచనలో, ఓ బలీయమైన ఆత్మ ప్రోద్బలంతో నడిచిన వ్యక్తిగానే పాఠకుడికి కనిపిస్తాడు. అందరికీ ఉన్నట్టుగానే నవల్ కిషోర్ కు తన భవిష్యత్తు సఫలమవుతుందా? తన మార్గం సరైనదేనా? ఇలా అనేక సందేహాలు చివరివరకూ వస్తుంటాయి. అయితే అతడు ధృఢంగా, త్యాగబుద్ధితో పదిమందికి మంచి జరిగే మార్గంలో ప్రయాణించటమే తనకు తగినదని, అదే సరళమైన మార్గమని నిశ్చయించుకుంటాడు. రచయిత నవల్ ద్వారా చెప్పింది ఆదర్శం కాదు. ఒక మార్గం మాత్రమే. చివర్లో నవల కూడా సందిగ్ధంగానే ముగుస్తుంది.

వస్తువులో మాత్రమే కాక, శైలిలో కూడా ఈ రచన సరళమైనది. సహజమైన నేల విడిచి సాముచేయని పాత్రలు, సహజమైన జీవితపు ఘట్టాలతో ఈ నవల సాగుతుంది. కథంతా మన ముందు నడుస్తూ ఉన్నట్టుగా ఉంటుంది. సుప్రసిద్ధ హిందీ రచయిత మున్షీ ప్రేమచంద్ శైలి ప్రభావం ఈ నవలారచయిత భగవతీ చరణ్ వర్మ పై స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా – ఓ తరం నుంచి మరొక తరానికి మధ్య వ్యత్యాసాన్ని – ఈ రచయిత అనాయాసంగా చూపిస్తాడు. ఎంతో సూక్ష్మంగా వివేచిస్తే తప్ప ఈ వ్యవహారాన్ని రచయిత ఎలా సాధించాడో తెలుసుకోలేం.

800 పేజీల నవల తెలుగు అనువాదానికి వచ్చే సరికి సగానికి సగం (400 పేజీలకు) కుదించబడింది. ఇది పొరబాటు. ఉన్న నవల యథాతథంగా, రెండు పుస్తకాలుగా వచ్చి ఉంటే బావుండేది. కుదించటం మూలాన అక్కడక్కడా కథ సంవిధానం తెగిపోయినట్టుగా ఉంటుంది. కథలో పాత్రల పేర్లు, తీరూ – ఉత్తరప్రదేశ్ కు చెందినవి. దాంతో తెలుగు పాఠకులకు కొంత అసౌకర్యంగా ఉంటుంది. అలవాటు చేసుకుని చదవవలసిన పరిస్థితి. ఈ నవలలో బ్రాహ్మణపాత్రలు, బ్రాహ్మణ ఆదర్శాలు దాదాపుగా మృగ్యం. (అందుచేత అందరూ చదువుకోవచ్చు. బ్రాహ్మణ భావజాలాన్ని నోరారా తిట్టుకునే అవకాశం లేకపోవడం – కొందరు పాఠకులకు వెలితి గానూ ఉండొచ్చు.) అనువాదం సహజంగా ఉంది. ఎక్కడో మూల రాయలసీమ నుడికారం.

అపురూపమైన ఇలాంటి నవలలను నామమాత్రమైన ఖరీదుతో అందరికీ అందుబాటుగా ఉండేలా అందిస్తున్న నేషనల్ బుక్‍ట్రస్ట్ వారిని ఎంత ప్రశంసించినా తక్కువే.

********
స్మృతిరేఖలు
మూలం: భూలే బిస్రే చిత్ర్
రచన: భగవతీ చరణ్ వర్మ
తెలుగు అనువాదం : ఇలపావులూరి పాండురంగారావు
ప్రచురణ: నేబుట్ర
వెల: 30/-

You Might Also Like

Leave a Reply