మా స్వామి, నా రాముడు – విశ్వనాథ ఆత్మ

(సెప్టెంబర్ 10, విశ్వనాథ సత్యనారాయణ జయంతి సందర్భంగా ఈ వ్యాసం)

రాసి పంపినవారు: భైరవభట్ల కామేశ్వర రావు
**********************************************************************
viswanaathaఎవరో ఒకసారి విశ్వనాథ సత్యనారాయణగారిని, “గురువుగారూ, మీరు మీ ఆత్మకథ వ్రాయాలండీ” అని అడిగారట. దానికి విశ్వనాథ ఇలా జవాబిచ్చారట, “నా ప్రతి రచనలోనూ నా ఆత్మ ఉంది. నా గురించి తెలుసుకోవాలంటే నా రచనలని చదివితే చాలు. మళ్ళీ ప్రత్యేకమైన ఆత్మకథ ఎందుకు?”

నిజమే కదా అనిపిస్తుంది. కానీ వేలాదిగా ఉన్న విశ్వనాథ రచనలని చదవడానికి ఎన్నాళ్ళు కావాలి, ఎన్నేళ్ళు కావాలి! నేను విశ్వనాథ రచనలన్నిటినీ చదవలేదు కాని చదివినంతలో, ఒక రెండు పుస్తకాలలో వారి ఆత్మ సంపూర్ణంగా మనకి కనిపిస్తుందని నాకు అనిపించింది. ఒక ఆత్మ రెండు పుస్తకాలలోనా? ఆ మాటకొస్తే ఆత్మ “ఒకటా”? “నీళ్ళు” అన్న పదానికి ఏకవచనం ఉన్నాదా? అలాగే “ఆత్మ” కూడాను. దానిది పరుచుకొనే గుణం! ప్రతి రచనలోనూ విస్తరించి ఉన్న విశ్వనాథ ఆత్మ స్వరూపం, యీ రెండు పుస్తకాలలోనూ రాశిపోసుకున్నట్టు ఉందని నా భావన. ఇంతకీ ఆ రెండు పుస్తకాలూ ఏవి?

ఒకటి “మాస్వామి”, రెండు “నా రాముడు”. ఈ రెండిటికీ ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, మిగిలిన పుస్తకాలలో మనకి విశ్వనాథ ఒక కవిగానో (అభిమానులకి “మహాకవి”గా), పండితునిగానో, విమర్శకునిగానో కనిపిస్తారు. ఈ రెండు పుస్తకాలలోనూ మనం విశ్వనాథని ఒక మహా భక్తునిగా చూడవచ్చు. అయితే యితనో విచిత్రమైన భక్తుడు. భగవంతుని తెలుసుకోవడానికి మన సంస్కృతిలో రెండు ప్రధాన మార్గాలు కనిపిస్తాయి – ఒకటి భక్తి మార్గం, రెండవది జ్ఞాన మార్గం. భక్తి మార్గం హృదయ సంబంధి అయితే, జ్ఞాన మార్గం బుద్ధి సంబంధి. భక్తులకి జ్ఞానంతో పెద్దగా పనిలేదు. అది పూర్తిగా విశ్వాసమ్మీద ఆధారపడుతుంది. భగవంతునికి ఒక రూపాన్నిచ్చి దాన్ని ఆరాధిస్తాడు భక్తుడు. జ్ఞాన మార్గం ఎక్కువగా తత్త్వ చింతన మీద ఆధారపడుతుంది. ఇందులోనూ విశ్వాసం ఉంటుంది కాని దాని పాత్ర తక్కువ. జ్ఞాన మార్గంలో వెళ్ళేవారు సాధారణంగా దైవం రూపరహితమైన ఒక శక్తిగా ఊహిస్తారు. సరే, వీటి గురించి ఇంతకన్నా యిక్కడ వివరణ అనవసరం. స్థూలంగా చూస్తే భక్తి మార్గంలో వెళ్ళిన వాళ్ళే కవులూ, వాగ్గేయకారులుగా మనకి కనిపిస్తారు. కవిత్వం రావాలంటే ఒక ఆవేశం కావాలి. జ్ఞానులకి ఆవేశం ఎక్కడిది? భక్తులకైతే భగవదారాధనలో పరవశత్వంలో భక్త్యావేశం కలిగే అవకాశం ఉంటుంది. ఒక్క ఆదిశంకరులు మాత్రమే దీనికి అపవాదేమో!

విశ్వనాథవారి విషయానికి వస్తే, అతను భక్తి జ్ఞాన మార్గాలు రెండిటిలోనూ సమానంగా ప్రయాణించినట్టు కనిపిస్తుంది! అందుకే అతను విచిత్రమైన భక్తుడు. ఒకవైపు తాత్త్విక ఆలోచన, మరో వైపు భక్త్యావేశమూ రెండూ అతని రచనల్లో కనిపిస్తాయి. “మా స్వామి”లో అతని భక్తిపాలు ఎక్కువగా కనిపిస్తే, “నా రాముడు”లో అతని తాత్త్విక చింతన మనకి దర్శనమిస్తుంది. శివుడు భక్తికీ, రాముడు ఆధ్యాత్మికతకీ చిహ్నంగా విశ్వనాథ తన ఆత్మలో వాళ్ళిద్దరినీ నిలుపుకున్నారని అనిపిస్తుంది, ఈ రెండు పుస్తకాలూ చదివితే. అందుకే రాముని కావ్యాన్ని రచించి దాన్ని శివునికి అంకితమిచ్చారు.

నీవేమో కనిపించకుండినను గానీ, యైన గంపించి న
ట్లే వేలూహలుగాగ దెచ్చికొని, నీవే కాక లేడే కదా
దైవంబంచును నా కవిత్వము భవత్ పాదద్వయిన్ జేర్చితిన్
రావే దీనికి నే ఫలం బొసగెదో రానిమ్ము విశ్వేశ్వరా!

“మా స్వామి” తన కుల దైవమైన విశ్వేశ్వరునిపై రచించిన శతకం. మామూలుగా భక్తి శతకాలలో భగవంతుని స్తోత్రమో, లేదా వేదాంతమో ఎక్కువగా కనిపిస్తాయి. “మా స్వామి”లో భక్తుడు భగవంతునితో చాలా ఆత్మీయంగా సంభాషిస్తాడు. ఇలాంటి భక్తి వాగ్గేయకారుల సంకీర్తనల్లో ఎక్కువగా చూస్తాం.

స్వాంతంబన్ మృదుశయ్యపై బఱచితిన్ భక్తిప్రథా వస్త్ర మ
త్యంతంబున్ బయి జల్లితిన్ మృదుల భావాఖ్య ప్రసూనాళి నా
యంతర్గేహము బాగు చేసితిని నీకై కంటి దారిన్ బ్రతీ
క్షింతున్ వాసకసజ్జికన్ బలె నుమాచిత్తేశ! విశ్వేశ్వరా!

అంతరంగమనే ఇంటిని శుభ్రం చేసి, మనసనే మృదుశయ్యపై, భక్తి అనే గొప్ప వస్త్రాన్ని పఱచి, ఆ పక్కపై అంతటా మృదు భావాలనే పూలను జల్లి, వాసకసజ్జికలాగా నీ రాక కోసం ఎదురుచూస్తున్నానని స్వామిని పిలుస్తున్నారీ పద్యంలో.

ఇది భక్తి ప్రధానమైన శతకం కాబట్టి, ఇందులో కవిత్వం ఉంది. ఇది ఆత్మాశ్రయ కవిత్వం. విశ్వనాథవారి కష్ట సుఖాలు, ఆలోచనలూ, అనుభూతులూ అన్నీ సహృదయుల హృదయాలకి సూటిగా హత్తుకుంటాయి. ఈ పద్యాలు చదివి నేనెన్ని మార్లు కన్నీళ్ళుపెట్టుకున్నానో లెక్కలేదు!

కులదైవంబనుచున్ దలార నిను మ్రొక్కుల్ మ్రొక్కుకున్నాను, లో
కుల దైవంబువలెన్ ముభావమున నీకున్ జేత మేలయ్య? నీ
తలపై వేలుపుబువ్వ క్రొత్తరగ మొత్తాలూరి ముయ్యేటి చెం
గలువల్ జార్చిన తేనె నా పయిన జిల్కన్ రాదె విశ్వేశ్వరా!

“కుల దైవమని నిన్ను మ్రొక్కుకుంటే, పరాయి దైవంలాగా ముభావం చూపించడం నీకు తగునా? నీ తలపైనున్న జాబిల్లి లేత వెన్నెలలకి గంగా నదిలోనున్న ఎఱ్ఱ కలువలు పరవశించి జార్చిన తేనె, నాపై కొంచెం చిలికించరాదా” అని వేడుకుంటున్నారిక్కడ. ఎంత లలితమైన పదాలు! ఎంతటి మృదువైన భావాలు!

ఈ శతకంలో మొత్తం ఇలాంటి తేట పద్యాలే అనుకుంటే పొరపాటే. క్లిష్టమైన పదాలతో, పదబంధాలతో సమాసభూయిష్టమైన పద్యాలుకూడా ఉన్నాయి. అవి చెపుతున్న భావానికి అనుగుణంగానే ఉంటాయి. భాషా, భావమూ, పద్యమూ అన్నీ ధారగానే సాగుతాయి. అది భక్తి ధార. ఇందులో వేదాంతమూ తత్త్వమూ లేవా అంటే ఉన్నాయి. కాని వాటికి భక్తి మాధుర్యమనే పైపూత ఉంది.

“నా రాముడు” దీనికి పూర్తి వ్యత్యస్తంగా ఉంటుంది. ఇందులో భక్తి లేదా అంటే ఉంది. కానీ తాత్త్విక చింతనదే పై చేయి. ఎంతటి భక్తుడైనా, విశ్వనాథ అద్వైతాన్ని సంపూర్ణంగా నమ్మినవారు. అందుకే రామాయణ కల్పవృక్షాన్ని అద్వైత సిద్ధాంత పరంగా నిర్మించారు. కల్పవృక్షం రస ఫలాలతో, అలంకార సుమాలతో, నానా కల్పనలు శాఖోపశాఖలుగా విస్తరిల్లిన వృక్షమైతే, “నా రాముడు” దానికి ప్రాణభూతమైన మూలకందం. కల్పవృక్షం ఏ తాత్త్విక చింతన ఆధారంగా నిర్మించబడిందో దాని సారమంతా “నా రాముడు”లో ఉంది. ఇందులో కవిత్వం లేదు. ఉన్నదల్లా శుద్ధ వేదాంతం. సంస్కృతంలో ఉన్న శంకరుల అద్వైతాన్ని తెలుగువాళ్ళు అర్థం చేసుకోడానికి పద్యాలుగా వ్రాసి దానికి మళ్ళీ తన వ్యాఖ్యానాన్ని జోడించి మనకి “నా రాముడు”గా అందించారు విశ్వనాథ. బహుశా యిదే విశ్వనాథవారి చివరి రచన అయ్యుండవచ్చు. ఇది విశ్వనాథ పరమపదించిన తర్వాత ముద్రితమైంది.

ఇందులో రాముడు మనకి పది రకాలుగా కనిపిస్తాడు. ఆనందమయుడు, ఆనందమూర్తి, అవతారమూర్తి, బాలరాముడు, కోదండరాముడు, అయోధ్యరాముడు, దశరథరాముడు, జానకీరాముడు, రఘురాముడు, ఆత్మారాముడు.

శుద్ధ బ్రహ్మ స్వరూపుడైన రాముడు ఆనందమయుడు, విష్ణువుగా ఆనందమూర్తి అయి, అవతారమూర్తిగా భౌతిక జగత్తులో జన్మనెత్తి, బాలరామునిగా తాటకవధా అహల్యాశాప విమోచనమూ చేసి, శివధనుస్సు విఱిచి విష్ణుధనుస్సుని చేపట్టి కోదండరాముడై సీతని వివాహమాడి, అయోధ్యారామునిగా అయోధ్యప్రజలందరికీ ప్రీతిపాత్రుడై, తండ్రి ఆజ్ఞని శిరసావహించి దశరథరాముడై అడవులకేగి, జానకీదేవి పంపగా బంగారు లేడి వెంటబడి అటుపైన ఆమె కోసం లంకదాకా పోయి రావణ సంహారం చేసిన జానకీరాముడై, చివరకు తన వంశ గౌరవం ఇనుమడించేలా రాజ్యం చేసి రఘురాముడయిన విధానమంతా ఇందులో చిత్రించబడింది. చివరకి విశ్వనాథ ఆత్మలో ఆత్మారాముడుగా నిలిచిపోయాడా రాముడు.

ఆ యానందమయుండె బ్రహ్మయని యభ్యాసంబుచే నిశ్చితం
బై యేర్పాటుగ వేదపంక్తులను భాష్య ప్రోక్తమై యొప్పగా
నా యానందమయుండు రాముడని వ్యాఖ్యానించె వాల్మీకి నాన్
ఆ యానందములన్ రఘూత్తముడు మూడై యొక్కడైనట్లుగా

శుద్ధ బ్రహ్మము నిర్గుణమై ఆలోచనకి అందని ఒక భావన (concept). అలాంటి బ్రహ్మాన్ని సచ్చిదానందమనే త్రిగుణాల ద్వారా అర్థం చేసుకొనే ప్రయత్నం వేదాలలో జరిగింది. ఇందులో ఆనందం మనిషి అనుభూతికి అందేది. అయితే ఇది మామూలు లౌకికమైన ఆనందం కాదు. బ్రహ్మానందానికి అతి దగ్గరగా వచ్చేది రసానందం. ఇది కవిత్వం వల్ల సిద్ధిస్తుంది. తొలి కావ్యానికి నాయకుడు రాముడు. అతనిలో యీ రసానందం నిండి ఉంది. అందుకే రాముడు ఆనందమయుడు. అందువల్ల తరచి చూస్తే – బ్రహ్మ, ఆనందము, రాముడూ ముగ్గురూ ఒకటే.

ఇదీ విశ్వనాథ వారి చింతన. ఆ ఆనందమయుడిని ఆత్మలో నింపుకొనే ప్రయత్నమే కల్పవృక్ష రచన. రాముని అవతారంలోని ప్రతి అంశలోనూ, ప్రతి చేష్టలోనూ, ప్రతి రూపంలోనూ ఆ పరబ్రహ్మ తత్త్వాన్ని దర్శించారు విశ్వనాథ. అలా దర్శించి దర్శించి, అనుభవించి అనుభవించి చివరకి తనలో ఆత్మారామునిగా నిలుపుకున్నారు.

కల్పవృక్షం చివరలో అరణ్యవాసం పూర్తిచేసి రాముడు తిరిగివస్తున్నాడన్న వార్త హనుమంతుడు భరతునికి వినిపిస్తాడు. అగ్నిప్రవేశం చెయ్యబోతున్న భరతునికి వార్త విన్న ఆనందంలో గొంతులోంచి ఒక వింత ధ్వని వెలువడిందిట! అది ఎలా ఉందో విశ్వనాథ ఊహకి అందలేదు. పద్యంలో నాల్గవ పాదం ఆగిపోయింది. చాలా గంటలు నిద్రాహారాలు మానేసి ఆలోచించారట. చివరకి ఆ రాముడే తనకి చెప్పినట్టుగా అది స్ఫురించిందట. “జైత్ర యాత్రాంచచ్ఛ్రీ మధుసూదనాస్య పవమానా పూర్ణమైనట్టులన్”. ఆ ముందుపాదంలోనే భరతునిది “కంబుకంఠం” అని వర్ణించారు. ఆ పోలికని యిది సంపూర్ణం చేస్తోంది! జైత్రయాత్ర చేస్తూ విష్ణుమూర్తి పూరించిన గాలితో నిండిన శంఖంనుంచి వచ్చిన ధ్వనిలా ఉందట ఆ నాదం. భరతుడు శంఖావతారం కదా మరి! పైగా వాయుపుత్రుడైన హనుమంతుని ద్వారా రాముడు పంపిన వార్త దీనికి కారణం. ఇలాంటి పోలిక ఇంత సంపూర్ణంగా కుదరడం అనేది ఆ రాముడు స్వయంగా చెప్పడం వల్లనే సాధ్యమని విశ్వనాథ ప్రగాఢ నమ్మకం. అప్పుడు మరి విశ్వనాథ అహంకార మేమయినట్లు?!

అంతా వివరించి చివరకి అంటారూ,

ఇది యాత్మారాముని దౌ
సదమల రూపంబు సర్వ సంపత్కంబై
మది నమ్ముము కడు మంచిది
మది నమ్మకు మంతకంటె మంచిది పోనీ!

తన ఆత్మలో తను నమ్మిన రాముడు కొలువై ఉండగా ఇక మనం నమ్మితే ఎంత నమ్మకపోతే ఎంత! నమ్మితే మంచిదే. నమ్మకపోతే పోనీ, మరీ మంచిది!

“మా స్వామి”, “నా రాముడు” ఇప్పుడు అచ్చులో దొరుకుతున్నాయో లేదో నాకు తెలియదు. Digital Libraryలో “మా స్వామి” ఉంది. “నా రాముడు” ఇక్కడ చదవవచ్చు.

You Might Also Like

8 Comments

  1. శ్రీ విశ్వనాథ వారి వ్యక్తిత్వం: శ్రీ గంధం నాగేశ్వరరావు గారితో ఇంటర్వ్యూ | పుస్తకం

    […] విశ్వనాథవారు వచ్చీ రావటంతోటే పద్ధతి ప్రకారం కాళ్ళు కడుక్కోకుండానే సరాసరి వంటింట్లో కి వెళ్లి చూసారు.పొయ్యిలో పిల్లి లేవలేదు. గొప్ప ఖేదానికి గురయ్యారు. అప్పుడు పాదప్రక్షాళనం చేసి,ముఖం కడుక్కుని “మా స్వామి“ అనే శతకం వ్రాయటం మొదలు పెట్టారు. మా స్వామిలోని మొదటి రెండు పద్యాలు రామాయణ కల్పవృక్షానికి నాంది. (మా స్వామి గురించి ఒక చిన్న పరిచయం ఇక్కడ). […]

  2. rathnamsjcc

    మనసు నిలిపి మనసు నిర్మలంగా, నిమ్మళంగా వుండాలని కోరుకుంటాడేగానీ మదిని నిగ్రహించుట మిక్కిలి సాహసవంతమైన పని అని చెబుతాడు! తన సాధనాబలం చేత దాటిన జ్ఞాని మనసునిలిపి నిశ్చల స్థితిని పొంది భగవంతునిపై లగ్నమై ఉంటుంది. మనసు నిలిపి శరణాగతినే కోరుకుంటుంది ఆత్మ జ్ఞానం అనేది ఎంతటి అత్యున్నతి స్థితి సూక్ష్మచైతన్య సాధనల యొక్క అత్యున్నత లక్ష్యం ఆత్మ )సాక్షాత్కారం

  3. mantha Bhanumathi

    విశ్వనాథ వారి రచనల గురించి ఎంత చదివినా తనివి తీరదు.
    వారి రచనలలో కొన్నింటిని ముంబాయి వాస్తవ్యులు లక్ఖావఝుల శర్మగారు ప్రచురిస్తున్నారని విన్నాను. కొన్ని పావని శాస్త్రి గారు అచ్చు వేయించారు. శర్మగారిని అడిగితే వివరాలు తెలుస్తాయి. వారి ఫోన్ నంబర్..098201-85457, 040 27811179/89.

  4. పుస్తకం » Blog Archive » విశ్వనాథ ఆత్మకథ

    […] నిన్న భైరవభట్ల కామేశ్వరరావు గారి సమీక్షా వ్యాసాన్ని ప్రచురించాము. ఇవాళ గొల్లపూడి […]

  5. నరసింహారావు మల్లిన

    ఈ రెండు పుస్తకాలనూ తప్పకుండా కొని చదవాలి.

  6. vsr nanduri

    నేను విశ్వనాధ వచన రచనలు అనేకం చదివి ఆయన అభిమానిని అయ్యాను. పుంభావ సరస్వతిగా ఆయనలోని మేధావి నాకు సుపరిచితమే. కానీ వారిలోని భక్తి కోణాన్ని పరిచయం చేసిన ఈ వ్యాసం చాలా బాగుంది. మనం ఇవాళ ప్రపంచీకరణ వలన వస్తున్న దుష్పరిణామాల గురించి, విలువల పతనం గురించి వాపోతున్నాం. ఆ ఆవేదన విశ్వనాధ ప్రతి రచనలో కనిపిస్తుంది. ప్రాచీన భారతీయవిలువల గురించి, వ్యవస్థ గురించి తెలుసుకోవాలనుకొనేవారు విశ్వనాధ వచన రచనలు చదివి తీరాలి.

  7. బొల్లోజు బాబా

    మంచి పద్యాలను మరింత ఆర్ద్రంగా పరిచయం చేసారు

    విశ్వనాధ గారిని చదవాలని ఎప్పటినుంచో అనుకుంటూంటాను. శైలికన్నా ఆ చిక్కదనం నన్ను భయపెడుతూంది. ఓసారో మిత్రుడు ఇలా చమత్కరించాడు “విశ్వనాధగారిని చదవటం అంటే ఒకేసారి ఓ నాలుగైదు సముద్రాలు మీదపడినంత ఉక్కిరిబిక్కిరి కావల్సి ఉంటుంది” అని.

    బొల్లోజు బాబా

Leave a Reply to vsr nanduri Cancel