సమ్మాన్యుడు

వ్యాసకర్త: కె.ఎస్.ఎం.ఫణీంద్ర
*************

“సమ్మాన్యుడు” సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి నాన్నగారు డా. సి.వి.యోగి గారిపై ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు రాసిన వ్యాసాల సంకలనం. ఈ పుస్తక రచనకి పూనుకుని, పుస్తకంలో ఎక్కువ వ్యాసాలు రాసినది , సిరివెన్నెల గారి తమ్ముడు శ్రీ చేంబోలు శ్రీరామశాస్త్రి. శ్రీరామశాస్త్రి గారు పుస్తకానికి నాందిలో ఈ పుస్తకాన్ని రాయడానికి మొదటి కారణం – “యోగిగారి వ్యక్తిత్వం వలన ప్రభావితం అయిన మా అన్న సిరివెన్నెల గారు ఆయన సూచించిన ఏకసూత్ర జీవన విధానాన్ని అనుసరిస్తూ అత్యున్నతమైన స్థాయికి చేరి, సమాజానికి మార్గదర్శకుడిగా మారిన దృగ్విషయం!” అని పేర్కొన్నారు.  నాకూ ఈ పుస్తకంపై ఆసక్తి కలగడానికి కారణం సిరివెన్నెల గారే! సిరివెన్నెల గారు స్వయంగా “మా నాన్న మహా మేధావి!” అని చెప్పడం నాకు తెలుసు. చాలా ఏళ్ళ క్రితం ఒకసారి సిరివెన్నెల గారిని హైదరాబాదులో కలిసినప్పుడు ఎవరో ఒక కుర్రాడు ఈ పుస్తకాన్ని చదివి, చాలా స్పందించి, ఒక వ్యాసం రాసి సిరివెన్నెలకి చూపించాడు. ఆ వ్యాసాన్ని నేనూ కొంత చదివాను. అప్పుడే యోగి గారి గురించి తెలుసుకోవాలనీ, ఈ పుస్తకం చదవాలనీ అనుకున్నాను. కానీ కుదరలేదు. ఈ మధ్య (2017 జూలై లో) సిరివెన్నెల గారు బే యేరియాకి రావడం, నేను ఆయన్ని కలవడం, ఆయన్ని ఈ పుస్తకం గురించి అడగడం, ఆయన “ఈ పుస్తకం నువ్వు తప్పకుండా చదవాలి!” అని స్వహస్తాలతో నా పేరు రాసి సంతకం చేసిన కాపీని ఇచ్చి ఆశీర్వదించడం జరిగాయి. అలా ఇన్నాళ్ళకి ఈ పుస్తకం చదవడం జరిగింది.

“జీవితాన్ని ప్రశాంతంగా, తృప్తిగా ఎలా గడపాలి అనే విద్యను నాకు ఇచ్చింది మా నాన్నగారు!” అని శ్రీరామశాస్త్రి గారు ఈ పుస్తకపు నాందీ వ్యాసంలో పేర్కొనడం నాకు నచ్చింది.  ఎందుకంటే జీవితంలో సక్సెస్ పొందడమంటే ఏవో ఘనకార్యాలు సాధించాలనే లేదు, మనకి నచ్చినట్టు మనస్ఫూర్తిగా జీవించడమూ సక్సెసే అవుతుంది!  సామాన్యుడిగా జీవితాన్ని గడిపిన ఈ సమ్మాన్యుడి జీవితం నుంచి మనం స్ఫూర్తి పొందాల్సిన విషయమిది అనిపించింది. తరువాత ఈ పుస్తకంలో యోగి గారి జీవన విధానాన్ని గొప్పగా ఆవిష్కరించిన వ్యాసం “మా నాన్నగారు” పేరుతో సిరివెన్నెల గారు రాసినది. వ్యాసం మొదట్లోనే ““మా నాన్నగారు” ఇది నా పంచాక్షరి, “నా తండ్రి శ్రీ యోగిగారు”, ఇది నా అష్టాక్షరి ” అంటూ తన తండ్రిగారిపైన భక్తిని సిరివెన్నెల గారు చాటుకున్నారు. తరువాత తాను ఇన్నాళ్ళూ ఇలాంటి పుస్తకం ఎందుకు వెయ్యలేదో వివరించారు. యోగిగారు నలభై యేళ్ళకే అకస్మాత్తుగా కాలం చేశారు. ఆయన గడిపిన అతి సాధారణ జీవితం వలన, లోకం తలత్రిప్పి చూసేంతగా ఏమీ సాధించకపోవడం వలన, ఆయన తెలివితేటలు గురించి అందరికీ తెలిసినా, ఆయన కుటుంబసభ్యులలోని చాలా మందికే ఆయన గొప్పతనం తెలీదు.  యోగి గారిలోని ప్రతిభాభాస్కరుడు ఉదయించకముందే అస్తమించాడన్నది అతి కొద్దిమందికే తెలిసిన రహస్యం! వీరు తమ హృదయాల్లో ఆ సత్యాన్ని చిరుదివ్వెగా కలకాలం వెలిగేటట్టు దాచుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా ఒక పుస్తకం వేసి, సిరివెన్నెల గారు పొందిన గుర్తింపు ద్వారా వారి నాన్నగారి త్రైవిక్రమ స్వరూపాన్ని చెప్పడం ఏమిటి? ఆయన ముందు సిరివెన్నెల గారు ఒక పసికూన అంతే! పైగా ఈ పుస్తకాన్ని చదివిన వారు “సిరివెన్నెల తండ్రి గారిపై భక్తి చూపించారు. కానీ మరీ ఇంత శ్రుతి మించిన కీర్తనా?” అనుకునే అవకాశమూ ఉంది! కానీ ఇన్నాళ్ళకి సిరివెన్నెల గారి ఆలోచనాధోరణి కొత్త మలుపు తిరిగింది, ఆయన తమ్ముడు శ్రీ రామశాస్త్రి వలన!

ఈ మలుపు తిరిగిన కారణం నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. శ్రీ రామశాస్త్రి గారు సిరివెన్నెల గారితో అన్న మాటలివి – “నువ్వుగాని, నేనుగాని, మన జీవన సంవిధానం గాని, నాన్న అనే ఒక నిజానికి నీడలాంటివి. నీ ప్రతిపాటా, ప్రతి అక్షరమూ, నాన్న మాటల ప్రతిధ్వనులే కదా! … అనేక గీతాల్లో మనిషితనం గురించి నువ్వు ప్రస్తావించిన విధానం గాని నీ కలంకారీతనానికి గుర్తు కాదు కదా! ఆ తండ్రికి కొడుకువి కాగలగటం వల్లనే కదా!… ఒక అతి సామాన్యుడైన సగటు మనిషి, తన మామూలుతనం నుంచి దూరంగా జరగకుండానే ఒక మహనీయుడిగా ఎలా జీవించవచ్చో నాన్నను చూసి మనం తెలుసుకున్నాం. ఆ తెలుసుకున్నదే ఓ నలుగురితో పంచుకుంటే ఏం లాభం అనేదానికన్నా నష్టమూ, కష్టమూ ఏం లేదు కదా! … మనం నాన్న గురించి ఏమనుకుంటున్నాం అని ప్రకాశంగా పలకడం వల్ల ఇతురులెవరికో ఏదో ఒరగబెట్టిన వాళ్లం కాకపోయినా, మన పిల్లలకీ, తద్ద్వారా వాళ్ళ పిల్లలకీ, ఒకానొక అవశ్యానుసరణీయమైన పారంపర్యాన్ని అందించి, కొంతైనా పితౄణం చెల్లించుకున్న వాళ్ళం అవుతాం కదా!”. ఈ మాటల్లో నేను తెలుసుకున్నది సిరివెన్నెల గారి గీతాలలో కనిపించే మనిషితనం కానీ, జీవన సంవిధానం కానీ ఆయనకి వారి తండ్రి గారి నుంచి వచ్చిన ఆస్తులు. ఈ విధంగా చూస్తే వారి తండ్రి గారు యోగి గారిని మనం సిరివెన్నెల పాటల్లో చూసేసినట్టే, సిరివెన్నెల గారు ఆయన్ని నిత్యం సంస్మరించుకుంటూ రుణం తీర్చేసుకున్నట్టే!

యోగిగారు సంస్కృతం మొదలు సకల భారతీయ భాషల్లోనే కాక, ఆంగ్లమూ, అరబిక్, ఫారసీ, ఉర్దూ లాంటి అనేక భాషల్లో (సుమారు 13 భాషలు) కూడా ఉద్దండ పాండిత్యాన్ని కలిగిన వారు. సిరివెన్నెల గారికి సంస్కృతం, గణితమూ, భారతీయ ఆంగ్ల సాహిత్యాల్లో అభినివేశమూ వారి తండ్రి గారి నుంచి వచ్చినవే! గణితం, ఫిజిక్సు, ఎకనామిక్స్ వంటి సమస్త విజ్ఞాన శాఖల్లోనూ యోగిగారు విశేష శేముషీ దురంధరులు. వేదాలూ, వేదాంగాలూ, వేదాంతము మొదలైన విద్యల్లో అసాధారణ సాధికారత కలవారు. హోమియోపతీ వైద్యంలో పట్టా తీసుకుని చాలా గొప్ప వైద్యునిగా పేరు తెచ్చుకున్నారు. వాదన పటిమతో, తర్కంతో ఎందరో పండితమ్మన్యులను ఓడించేవారట! భారతీయత అన్నా, భారతీయ సనాతన ధర్మం అన్నా ఆయనకు ప్రాణం. ఎంతటివారైనా భారతీయత పట్ల తిరస్కార భావాన్ని ప్రకటిస్తే సహించలేకపోయేవారట! ఆయతే ఆయన ఛాందసుడు కాదు – “నాన్నా! పంచములు పేరుతో సొంత కుటుంబంలోని కొంతమంది అయినవారిపట్ల మనం చూపించే అమానుషత్వమైన వివక్ష ధర్మానికి గ్లాని. మనుస్మృతి గానీ మరెంత మహత్తరమైన విషయంగానీ, అటువంటి ప్రతిపాదనలు చేస్తే ప్రశ్నించక పోవటం ఖచ్చితంగా పాపమే అవుతుంది!”  అని సిరివెన్నెలకి ఉపదేశించిన తథాగతుడు!

సిరివెన్నెల గారు పదకొండేళ్ళ ప్రాయంలో సినిమాల ప్రభావంతో అమ్మని అతి మాధుర్యంగా ఊహించుకుని, ఒకసారి అమ్మగారు మందలిస్తే ఉక్రోషంతో చేసిన ఒక తుంటరిపనివల్ల ఆసుపత్రిలో రెండు రోజులపాటు చావుబ్రతుకుల్లో ఉన్నారట. ఆ గండం గట్టెక్కిన తరువాత యోగి గారు ఆయనతో అన్న మాటలు సిరివెన్నెల గారికి అమ్మను గురించి తెలియజెప్పి ఆయన తరువాత రాసిన చాలా అమ్మ పాటలకి ప్రేరణ కలిగించాయి – “నాన్నా! అమ్మంటే కథల్లోనూ, పుస్తకాల్లోనూ రాసున్నట్లు, నీ ఊహల్లో ఊహించుకున్నట్లు నాటకీయంగా ఉండదురా! మామూలు మనిషిలాగే ఉంటుంది. అమ్మతనం కనిపించేది, వినిపించేదీ కాదు నాన్నా! అనిపించేది!  రెండు రోజులుగా మీ అమ్మ ఒక్క చుక్క నీరైనా తాగకుండా ఎలా విలవిల్లాడుతోందో ఇప్పుడూ నువ్వు చూడలేవు. ఇంటికి వెళ్ళాక కూడా “చాల్లే చేసిన వెధవపని…” అని తప్ప మరోలా మాట్లాడని విధానంలో కూడా గ్రహించలేవు!”. ఈ మాటలు మనకీ పనికివచ్చేవే. అమ్మ గురించనే కాదు, చాలా విషయాల్లో మనకి ఉన్న ఊహలు, ఆలోచనలు వలన వాస్తవాలని చూడలేకపోవడం జరిగేదే!

సిరివెన్నెల వ్యక్తిత్వాన్ని మలచడంలో యోగిగారి పాత్ర ఎంతో ఉంది. ఏదైనా ఒక అంశాన్ని గురించి పరిపూర్ణమైన, స్పష్టమైన అవగాహన కలిగించుకునే అవిశ్రాంత ప్రయత్నమే తత్త్వచింతన అని నిర్వచిస్తే యోగి గారు అనుపమానమైన తాత్త్వికులు. తనలా ఉండడమే కాక సిరివెన్నెల గారిని కూడా ఈ దిశలో ఆలోచించడానికి ప్రోత్సహించేవారు. ఒకసారి తన డైరీ నాన్న చదివారని సిరివెన్నెల గారికి కోపం వచ్చి – “ఇతరుల వైయక్తిక జీవితంలోకి తొంగి చూడాలనుకోవడం కుసంస్కారం కాదా?” అన్నప్పుడు, “ఇతరులెవ్వరూ చదవకూడని, తెలుసుకోకూడని రహస్యమైన రాతలు, చేతలు జీవితంలో ఎందుకు ఉండాలి?” అని ఆయన తిరిగి ప్రశ్నించి “ప్రైవసీ”, “సీక్రెసీ” కి తేడాని బోధించారుట. ఇలా వాదనలో సిరివెన్నెలని ఓడించి సిగ్గుతో చితికిపోయేలా చేసిన సందర్భాలు ఎన్నో, నేర్పినది ఎంతో. ఈ విషయాన్నే సిరివెన్నెల గారు – “నాకు తండ్రితనపు ఆవేదనా హోమగుండం సాక్షిగా, ఆయన వాత్సల్యపు యజ్ఞోపవీత ధారణ, ఆయన ధార్మిక జీవన సంవిధానపు బ్రహ్మోపదేశం జరిగాయి.” అని రాసుకున్నారు.

మిగతా వ్యాసాల్లో యోగి గారి గురించి ఇతర సంగతులు చాలా తెలుసుకోవచ్చు. అవన్నీ ఆయన పాండిత్యాన్ని, వ్యక్తిత్వాన్ని, జీవనవిధానాన్ని చూపేవే. ఆయనకి క్రైస్తవం, ఇస్లామ్ గురించి మంచి అవగాహన ఉండేదట, ఆ మతం వాళ్ళే ఆయన దగ్గర తెలుసుకునేంత! పేదల పట్ల, కష్టాలలో ఉన్న వారి పట్ల గొప్ప సానుభూతి ఉన్న వ్యక్తి.  అర్థిక స్థోమత లేకపోయినా ఆదుకోవడానికి వెనుకాడే వారు కారు. ఆయన హాస్యప్రియులు, వుడ్ హౌస్ నవలలన్నింటినీ చదివారు! సంభాషణల్లోనూ హాస్యం తొణికిసలాడేదట. ఇలా యోగిగారి జీవితంలోని చిన్న చిన్న సంఘటనల ద్వారా ఆయన వ్యక్తిత్వాన్ని మనం తెలుసుకుంటాం. ఆయన మనకి అందని మహామనీషిలా కాక మన మధ్య తిరిగే మామూలు మనిషిలానే కనిపిస్తారు. అలా కనిపిస్తూనే స్పందింపజేస్తారు. అదే ఈ పుస్తకంలో విశేషం!

పుస్తకం హార్డ్ బౌండ్ లో చక్కగా ముద్రించబడింది. పుస్తకంలో సద్గురు శివానందమూర్తి గారి ముందుమాటతో పాటూ ఆయన ఇంగ్లీష్ కొటేషన్లు కుదురిన చోటల్లా ఉంచారు. ఈ పుస్తకం గొప్ప పుస్తకం కాకపోవచ్చు కానీ మన మధ్యనే సామాన్యుడిలా తిరిగిన ఓ గొప్ప మనిషికి అద్దం పట్టే పుస్తకం.  పైగా ఒక తండ్రి మనసుని తెలిపే పుస్తకం. సిరివెన్నెల గారూ తన వ్యాసంలో ఇదే పేర్కొన్నారు – “ఒక తండ్రి పిల్లలని ఎలా పెంచాలో, సంస్కారాన్ని ఎలా నేర్పాలో  నాన్న నుంచి నేర్చుకోవచ్చు. అందుకే ఈ పుస్తకాన్ని నేను తండ్రుల కోసం ఉద్దేశించి రాశాను.  జగజ్జేత అనిపించుకోవటం కన్నా, తమ సంతానం దృష్టిలో “అచ్చమైన అయ్య” అనిపించుకోగలగటం ధన్యత”! అవును! ఇందుకోసమైనా ఈ పుస్తకాన్ని తప్పక చదవాలి!

You Might Also Like

One Comment

  1. Varaprasad.k

    ఒక స్థాయికి చేరిన వారు తమ తల్లదండ్రులకు ఈ రకమైన విలువలు కల్పించటం అభినందనీయం.

Leave a Reply