Diwali in Muzaffarnagar: Tanuj Solanki

ఇదో కథల సంపుటి. ఢిల్లీకి దగ్గర్లో ఉన్న ముజఫర్‍నగర్‌లో కొన్ని జీవితాలకు సంబంధించిన కథలివి. ఉన్నచోటే ఉండ(లే)క, ఇంకెక్కడికో వెళ్ళి, అటూ కాక, ఇటూ కాక మధ్యలో కొట్టుమిట్టాడుతున్న ఈ తరం కథలు. చదివినంత సేపే కాదు, చదివాక కూడా ఆ పట్టణాన్ని, ఆ మనుషుల స్వభావాన్ని ఇంకా తరచి చూడాలనిపించేలా చేసే కథలివి.

సాహిత్యానికున్న ప్రయోజనాల గురించి ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుంది. సమాజాన్ని ఉద్ధరించాలని, మనుషులకి మార్గదర్శి కావాలని, మంచిని పెంపొందించాలని, నీతులు చెప్పాలని – ఇలా కొందరు అనుకుంటారు. నాలాంటి వాళ్ళు కొందరు సాహిత్యం సమాజానికి అద్దం పట్టాలని కోరుకుంటాము. “హిందూ-ముస్లిమ్‌ల కొట్లాటలో ఇద్దరి దుర్మరణం, పదిమందికి తీవ్ర గాయాలు.” అన్న వార్తలో ఆ ఇద్దరి మరణం వల్ల చెల్లాచెదురైన జీవితాలు ఎలాంటివి? ఆ తీవ్ర గాయాల బారినపడిన వారు ముందు ఎలా ఉండేవారు? తర్వాత ఏమైయ్యారు? అసలు నేషనల్ మీడియా ఊదరగొట్టేసేంతగా అల్లర్లు జరిగాయంటే, ఆ పట్టణంలో పరిస్థితులు ఎలా ఉండేవి? ఎలా మారేవి? వీటిల్లో కొన్నైనా కాల్పనిక సాహిత్యం చెప్పగలగాలి. వార్తల్లోనూ, మున్సిపాలిటి రికార్డుల్లోనూ అంకెలుగా మిగిలిపోయిన వారి గురించి తెలియజేయాలి. వారూ కొద్ది పాటి తేడాలతో మనలాంటి వారేననీ, ఏ క్షణాన అయినా వారి స్థానంలో మనముండే అవకాశముందనే స్పృహ కలిగించాలి. లేకపోతే కథల అవసరమేముంది?

ఢిల్లీలో రేప్ జరిగి, అది దేశాన్ని ఒక ఊపు ఊపితే, సోషల్ మీడియాలో చిట్టి కథల నుండి మాగజైన్లలో విచ్చలివిడిగా వచ్చినలాంటి కథలు కావివి. రోహిత్ వేముల చనిపోగానే కుప్పలుతెప్పలుగా పుట్టుకొచ్చిన కథలూ కావివి – వాటిల్లో కారికేచర్లే కనిపించాయి, మనుషులు కాదు.  ఈ కథల్లో ఆగ్రహం, ఆవేశం లేవు. అన్యాయం, ఆక్రోశం అంటూ అసలూ లేవు. అందరి ధ్యాసను ఆకర్షించిన సెన్సేషన్‌ను కాష్ చేసుకునే ప్రయత్నం లేదిందులో. ఒకడి ట్రాజడిని ఇంకొకడు raw materialగా తీసుకొని,  తన పనితనంతో నేర్పుగా ఆ పచ్చిదనాన్ని  పోగొట్టకముందే కథల్లా బయటపడ్డం లేదిందులో. ఇటీవల జరిగిన ముజఫర్ నగర్ అల్లర్ల ప్రస్తావనే లేదు వీటిల్లో. కేవలం రచయిత ఆ పట్టణంలో చూసిన జీవితం. అందులోని మనుషులు. కాలం తెచ్చిన మార్పులు. మార్పులకు అనుగుణంగా మారలేనివారు, మారినవారు.

తాను చూసిన జీవితానికి అనవసరపు రంగులు పూయకుండా, లేని మలుపులు తిప్పకుండా, ముఖ్యంగా ఏ రకమైన తీర్పులు ఇవ్వకుండా రాసిన కథలు. ఈ కథల్లో ప్రధాన పాత్రలన్నీ మామూలు మధ్యతరగతి మనుషులు. రెంటు, కరెంటూ ఎక్సెట్రా కష్టాలు ఉన్నవాళ్ళే. వార్తల్లో హెడ్‌లైన్లను వారి కష్టాలుగా ఊహించుకొని గొంతు చించుకునే రకాలు కాదు. రియాల్టిని ఒప్పుకొని, దానితో నేరుగా ఢీకొట్టుకోకుండా, పక్కకు తప్పుకుంటూ తిరిగే మనుషులు వీరు. అందుకే, ప్రాణస్నేహితుడు కాకపోయినా, క్లాసులు ఎగ్గొట్టి, బైక్ మీద తిరిగే స్నేహితుడి ఇల్లు ఎక్కడ మలుపు తిరుగితే వస్తుందో తెల్సు కానీ, ఇల్లు తెలీదు. ఆ స్నేహితుడి ఇంటికొచ్చినప్పుడు, మరో మతం వాడు కనుక, తల్లి అభ్యంతరం చెప్తే ఎదురు తిరిగి లెక్చర్లు ఇవ్వడు. వాడిని కొందరు కల్సి చావచితకబాదుతుంటే పారిపోయి వస్తాడే గానీ, ఆసరా ఇవ్వడు. కొన్ని వారాల పాటు అతడి గురించి సమాచారం తెలీక, ఎట్టకేలకు తెగించి ఆ మలుపు తిరిగి ఆ హాస్పిటల్ లో దొంగచాటుగా  వాకబు చేసే ధైర్యం ఉన్నా, అంతకు మించి వివరాలు కనుక్కోలేడు. బహుశా, ఆ పరిస్థితులని దగ్గరగా చూసిన వ్యక్తే ఇంత నిజాయితీగా రాయగలడేమో.

దాదాపుగా అన్ని కథల్లో పాత్రలు ఇంతే!  ప్రధాన పాత్రలన్నీ ఈ తరానివే. మధ్యతరగతి జీవితాలు, చాలీచాలని జీతాలు. అయినా అమ్మానాన్నలు ఉన్నదంతా ధారపోసి చదివించాక, ఉన్న ఊరిలో తగిన అవకాశాలు లేక, దేశవిదేశాల్లో పెద్ద పట్టణాలకి వలస వెళ్ళిపోయి, కొత్త ప్రపంచపు కళకళలో పుట్టిపెరిగిన ఊరుని, ఇంటిని, ఇంట్లోవాళ్లని పూర్తిగా మర్చిపోలేక, మొక్కుబడిగా బాధ్యతలు నిర్వహించే ఇప్పటి తరంవారి కథలు.

“దివాళి ఇన్ ముజఫర్‌నగర్”, “మై ఫ్రెండ్ డానిష్”, “కంపాషినేట్ గ్రౌండ్స్” అనే కథలు అచ్చంగా ముజఫర్ నగర్ కథలు. అక్కడ మాత్రమే సాధ్యమయ్యే కథలు. అక్కడి వాతావరణాన్ని, మనుషుల ఆలోచనా విధానాన్ని, అక్కడి వీధుల్ని క్షుణ్ణంగా పరిచయం చేసేట్టుగా ఉంటాయి. ఈ కథల్లో ముజఫర్ నగర్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది. కథకి, కథనానికి మలుపులు ఆ పట్టణమే నిర్దేసిస్తుంది. ఆ ప్రాంతాన్ని ఎక్కువగా గ్లామరైస్ చేయకుండా, ఎక్కువ సెన్సేషనలైస్ చేయకుండా ఆ వీధుల్లో, ఆ మనుషుల మధ్య మనల్నీ తిప్పుతారు.

“ది సాడ్ అన్‌నోవబిలిటి ఆఫ్ దిలీప్ సింగ్”, “ది మెకానిక్స్ ఆఫ్ సైలెన్స్” కు ఆ పట్టణానికి ఏ మాత్రం సంబంధం లేదు. “బి’స్ ఫస్ట్ సోలో ట్రిప్” అనే కథలో ముజఫర్ నగర్ ఒక బాక్‍గ్రౌండ్‌ అంతే! ఈ కథ చదువుతున్నప్పుడు మాత్రం నాకు జునో డయాజ్ అనే అమెరికన్ రచయిత రాసిన “హౌ టు లూస్ హర్” అనే కథలు గుర్తొచ్చాయి. ఒక భారతీయ యువకుడు తన సెక్సువల్ డిజైర్స్ , వాటి కోసం ప్రయత్నాల గురించి చెప్పుకొస్తే ఎలా ఉంటుందా? అని అనిపించింది జునోని చదువుతున్నప్పుడు. ఇలా ఉంటుందని ఈ కథ చదివాక తెలుస్తుంది. నేను భారతీయ రచయితలను, ముఖ్యంగా ఇప్పుడు రాస్తున్నవారి  రచనలు చదవడం చాలా తక్కువ. అందుకని, వాటిల్లో ఎలాంటి భాషను వాడుతున్నారు, ఎలాంటి సమస్యలను ప్రస్తావిస్తున్నారన్నది నాకు ఎక్కువగా తెలీదు. కానీ, ఈ పుస్తకం చదువుతున్నప్పుడు మాత్రం చాలా రిఫ్రెషింగ్‍గా అనిపించింది.

ఇందులో నాకు అన్నింటికన్నా బా నచ్చిన కథ – ది గుడ్ పీపుల్ (పేరు అంతగా నప్పలేదని నా ఉద్దేశ్యం.) అయితే, ఇందులో కథాంశం, దాన్ని నడిపించిన తీరు చాలా గొప్పగా అనిపించాయి. చైల్డ్ అబ్యూజ్ కథలు కొత్త కాదు. దాన్నో కుటుంబ నేపథ్యంలో పెట్టి, ఆ అబ్యూజ్ వల్ల ఒక మనిషి మాత్రమే కాదు, ఆమె మొత్తం కుటుంబం, ఆఖరికి ఆమెను పెళ్ళి చేసుకున్న భర్త కూడా ఇరవై ఏళ్ళ ముందు జరిగిన సంఘటన ప్రతిచర్యలో ఎలా ఇరుక్కొనిపోయారు చూపే కథ. The shit that happens in the story is so quintessentially Indian middle class shit! అవ్వడానికి చిన్న కథే అయినా, రచయితకి దీనినో నవలలా రాశారన్న భావన కలిగించింది. కథ పెద్దగా ఉంటుంది. పాత్రల స్వభావాలు, వారి మధ్య సంఘటలను ఆవిష్కరించడానికి ఏ తొందరా కనిపించదు. నిదానంగా సమస్య దానంతట అదే జటిలమవుతూ పోతుంది. భారతీయ మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే dysfunctionalని బాగా పట్టుకున్న కథలు ఉన్నాయి ఇందులో

ఈ కథల్లో పాత్రల పేర్లు అవేఅవే వస్తుంటాయి – అక్కడికేదో ఈ నాలుగైదు పేర్లతోనే కథలన్నీ రాయాలన్న నియమం ఉన్నట్టు. అది కొంత అయోమయానికి గురిచేసింది – ముఖ్యంగా ఆపకుండా చదివినందుకు. వేరే కథల సంపుటులు చదువుతున్నప్పుడు ఒక కథకీ, ఇంకో కథకీ కనిపించేంత వ్యత్యాసం – పాత్రల చిత్రీకరణలోనూ, భాషలోనూ, కథనంలోనూ – ఇందులో కనిపించలేదు. ఒకట్రెండు కథలను పక్కకు పెడితే మిగితా అన్నీ ఒకే పెద్ద కథలోని వేర్వేరు పాత్రల కథలను విడివిడిగా చెప్పారనిపించింది. అన్ని కథలనూ ముడివేసే అంశం ముజఫర్ నగర్ అనుకుందామంటే, కొన్నింటిలో దానిని కేవలం ప్రస్తావన వరకే పరిమితం చేశారు.

మొత్తానికైతే చదవదగ్గ పుస్తకం. ప్రస్తుత ఇండియన ఇంగ్లీషు రైటింగ్‌ని శ్రద్ధగా చదవాలని తీర్మానించుకునేలా చేసిన పుస్తకం.

టైటిల్ కథ ఇక్కడ చదువుకోవచ్చు:
http://www.caravanmagazine.in/fiction/muzaffarnagar-diwali-tanuj-solanki

You Might Also Like

Leave a Reply