సవరలు – జి.వి.రామమూర్తి

ఈమధ్య “ఫీల్డ్ లింగ్విస్టిక్స్” అన్న కోర్సులో విద్యార్థిగా చేరాక మామూలుగా ఆధునిక నాగరికత అంతగా సోకని ఇతర భాషల వాళ్ళ గురించి, వాళ్ళ భాషల స్వరూపాల గురించి కొంచెం కుతూహలం కలిగింది. ఆ విషయానికి సంబంధించి తెలుగులో ఎవరన్నా ఏవైనా రాశారా? అని ఆలోచిస్తూ ఉండగా గిడుగు రామమూర్తి పంతులు గారి గురించి గుర్తువచ్చింది. సరే, ఆయన సవరల గురించి, వాళ్ళ భాష గురించి చేసిన కృషిలో ఏదన్నా ఇంటర్-లైబ్రరీ లోన్ల పుణ్యమా అని దొరక్కపోతుందా? అని చూస్తూండగా ఆయన మనవడు (ఈయన కూడా గిడుగు వెంకట రామమూర్తి -కనుక జూనియర్ అందాము) రాసిన ఈ పుస్తకం కనబడ్డది. పెద్దాయనతో పాటు ఆయన కొడుకు గిడుగు సీతాపతి గారు కూడా సవరల మధ్య తిరిగి, వాళ్ళ భాష గురించి, జీవన విధానం గురించి శాస్త్రీయంగా పరిశోధనలు చేసి నోట్సులు తయారు చేశారట. ఆర్థిక పరిస్థితుల వల్ల ఉద్గ్రంథాలు వెలువరించలేకపోయినా, ఇలా ఆయన కొడుకు (జూనియర్) ఆ నోట్సుల ఆధారంగా ఈ చిరుపొత్తాన్ని ప్రచురించారట (ప్రభుత్వ ఆర్థిక సాయంతో).

ఈ పుస్తకంలో ప్రధానంగా సవరల జీవన విధానం గురించి, ఆచార వ్యవహారాల గురించీ, సాంస్కృతిక విషయాల గురించి చిన్న చిన్న వ్యాసాలున్నాయి. అనుబంధంగా ఆ భాషలోని అంకెలు, కొన్ని పదాలు, వాక్యాలు; వీటి తరువాత “State of Education among Savaras అని 1894లో Indian Journal of Education అన్న దానిలో పెద్ద గిడుగు రామమూర్తి గారు రాసిన వ్యాసం, దానితాలుకా తెలుగు అనువాదం ఉన్నాయి.

ముందుమాటలో జూనియర్ గారు మాటకి ముందొక అనాగరిక, వెనకొక అనాగరిక అని, ఆ పైన సవరలు పరమ హీనంగా బతుకుతున్నారనీ, ఇలా అదొక రకం దేసోద్ధారక ధోరణిలో రాస్తూంటే “ఏమిట్రా మొదలే ఇలా చిరాకు తెప్పించేలా ఉంది” అనుకున్నాను. కానీ, సీతాపతి గారు రాసిన పరిచయ వ్యాసం నా చిరాకుని పోగొట్టిందని చెప్పాలి. ఆయన వ్యాసంలో సవర సంస్కృతిలోని కొన్ని విశేషాలు (ఉదా: విలువిద్య, ఔషధాల తయారీ, సంగీతం వగైరా) రాశారు. ఇప్పుడిలా “అనాగరికులు” అని వర్ణింపబడుతున్నారు కాని, చూడబోతే ఒక కాలంలో వీరు బాగా sophisticated జాతి అనిపించింది. వీరి భాష లో కొత్త కొత్త పదాలు కనుగొనడం కూడా తెలుగుతో పోలిస్తే సులువని కూడా రాశారు ఆయన.

ఇక తరువాత జూనియర్ గారి వ్యాసాలు మొదలైనాయి. సవరల చరిత్ర – వారి గురించి ప్రాచీన గ్రంథాల్లో ప్రస్తావనలు, వారి నివాస స్థానం, సవర దేశంలో వాతావరణం వంటివి మొదటి మూడు వ్యాసాల్లో రాశారు. గోదావరి నది, పర్లాకిమిడి ఊరు పేరు – ఇలాంటి కొన్ని తెలుగులో వాడే పదాలకి సవర మూలాలు ఉన్నాయని అంటారు రచయిత. ఇవన్నీ ఆసక్తికరంగా, చాలా ఆశ్చర్యకరంగా అనిపించాయి నాకు. ఆహరపుటలవాట్లు, బట్టలు వేసుకునే తీరు, మతవిశ్వాసాలు, జాతిభేదాలు, పరిపాలన విధానం, పెళ్ళిళ్ళు-విడాకులు-వితంతు వివాహాలు, పండుగలూ-పబ్బాలు, మరణానంతర కర్మలు, న్యాయ వ్యవస్థ, నమ్మకాలు – ఇలా అనేక అంశాల గురించి చిన్న చిన్న వ్యాసాలున్నాయి. కొన్ని కొన్ని అంశాల్లో సవరలు అత్యాధునికంగా కనిపించారు నాకు (ఉదా: దేవుడికి ప్రార్థన చేయడం తమ విధే కానీ, ప్రార్థనలతో పనులు కావని, కష్టపడి పని చేయాలని వాళ్ళు అంటారని చదివాను). కొన్ని చోట్ల విపరీతమైన మూఢ నమ్మకాలు కలవారిగా, చాలా regressive గా అనిపించారు. అయితే, ఈ మూఢత్వం వీళ్ళకి ప్రత్యేకం అనలేము. ఇప్పటి “ఆధునిక నాగరికత”లో ఉన్న వారికీ వర్తిస్తుంది.

ఇక సవరల సాహిత్యం గురించి కూడా కొంత వివరమైన చర్చే ఉంది. ప్రకృతితో మమేకమై జీవించడం వల్ల, పరిశరాలను నిశితంగా గమనించడం వల్ల, సవరలు ఆశువుగా రకరకాల వర్ణనలతో కవితలు అల్లుతారట. వీళ్ళకి చాలా కాలం లిపి లేకపోవడం వల్ల వీళ్ళ సాహిత్యం చాలామటుకు ఒకతరం నుండి మరొక తరానికి శ్రుతి సాహిత్యంగా వచ్చినదే. కానీ, ఎప్పటికప్పుడు కొత్త కొత్త కవితలు, పాటలు పుట్టిస్తూ ఉంటారట. సంగీతం గురించి కొంత రాశారు – వాళ్ళ వాయిద్యాలు, వారి పాటల్లో వినబడే స్వరాల గురించి చెప్పారు. ఇక సవరల సంక్షేమానికి అప్పటికి జరుగుతున్న ప్రయత్నాల గురించి చెప్పి వ్యాసాలు ముగించారు.

అక్కడక్కడా కొన్ని ఫొటోలు కూడా ఉన్నాయి కానీ ప్రింటు క్వాలిటీ గొప్పగా లేదు. పుస్తకానికి రెండు అనుబంధాలు ఉన్నాయి – ఒకటి సవర భాషలోని కొన్ని పదాలు, వాక్యాల జాబితా. వీరి సంఖ్యా క్రమం మనతో పోలిస్తే వేరేలా ఉంది. 13–20 దాక సంఖ్యలు 12+1, 12+2 …12+8 పద్ధతిలో సాగాయి. 30 అంటే 20+10 అన్న అర్థం వచ్చే పదాం. నలభై అంటే రెండు ఇరవైలు. యాభై అంటే రెండూ ఇరవైలు + పది. ఇలా. (వీళ్ళది Base-12 number system అని ఇదివరలో చదివాను). చివరగా సవరల్లో విద్యాభివృద్ధి కోసం తీసుకోవలసిన చర్యల గురించి పెద్ద గిడుగు వారు రాసిన వ్యాసం (ఆంగ్లవ్యాసం, తెలుగు అనువాదం రెండూ). గిడుగు గారు ఒక పది పదిహేను సూచనలు చేశారు, ప్రధానంగా సవర భాషలో విద్యాబోధన గురించి – నాకు అవి ఇప్పుడూ 120 ఏళ్ళ తరువాత చదువుతూంటే ఇంక తెలుగు కోసం ఈ సూచనలు పాటించాల్సిన రోజు త్వరలో వస్తుందేమో అని ఖంగారు పుట్టింది.

మొత్తానికి చిన్న పుస్తకమే అయినా, విలువైన పుస్తకం.

పుస్తకం వివరాలు:
సవరలు
జి.వి.రామమూర్తి
దేశీ ప్రచురణ, దేశీ బుక్ డిస్ట్రిబ్యూటర్స్, విజయవాడ
ప్రథమ ముద్రణ – జులై 1972

You Might Also Like

Leave a Reply