తెలుగు సాహిత్య విమర్శలో ఖాళీలు

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్
(యాకూబ్ ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ పుస్తకానికి ముందుమాట)
హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ లో కవి యాకూబ్ పరిశోధన గ్రంథం ‘ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ’ ఆవిష్కరణ సభ జనవరి 23న జరుగుతోంది. దానికి రాసిన ముందుమాట ఇది. దీనిలో కొంత భాగం 15 జనవరి 2017 నాడు నవతెలంగాణ(దర్వాజ) లో ప్రచురితమైంది. దాని పూర్తి పాఠం ఇది.

***************
‘కవి గానివాడు విమర్శకుడౌతాడు’- యిదొక నానుడి. అయితే కవులే విమర్శకులు కావల్సిన పరిస్థితి తెలుగునేలకే ప్రత్యేకం. కవిత్వం–విమర్శ పరస్పర విరుద్ధాంశాలు కానప్పటికీ వొకటి వుద్వేగ ప్రధానం, మరొకటి బౌద్ధిక వ్యాపారం. రెండిటి మధ్య సమతౌల్యాన్ని పాటించి సామరస్య పూర్వక సమన్వయం సాధించడం, దానికి ప్రణాళికాబద్ధమైన పరిశోధనని జోడించడం తెలిసీ రోట్లో తలదూర్చడమే. అయినా సాహసించడం నిరంకుశ కవులకు వొక క్రీడ. ఆ క్రీడలో గెలుపుని సొంతం చేసుకొన్నవాళ్ళలో కవి యాకూబ్ వొకడు.

నిన్నటి చేరా, ఇవాల్టి అఫ్సర్ ప్రసేన్ సీతారాం వంశీ కృష్ణ … ఖమ్మం నేలకే రెండంచుల కత్తుల్ని సృజించే ప్రత్యేకమైన గుణముందేమో! ఆ నేల నుంచే మరో బలమైన చేర్పు – యాకూబ్. ప్రవహించే జ్ఞాపకాన్నీ రారా సాహిత్య పరిశోధననీ యేకకాలంలో సవ్యసాచిగా తవ్విపోసి అందించిన యాకూబ్ కవిగా పరిశోధకుడిగా జోడు గుర్రాల – స్వారీని కాదు – సవారీని అలవోకగా – అతి జాగరూకతతో నిర్వహిస్తున్నాడనడానికి ఆధునిక సాహిత్య విమర్శలోని వాదాలనీ ధోరణుల్నీ సమగ్రంగా గుదిగుచ్చి అందించిన యీ గ్రంథమే సాక్ష్యం.

తెలుగులో ఆధునిక సాహిత్య విమర్శ సాగిన తీరు తెన్నుల్నీ దాని లోతు పాతుల్నీ యెప్పటికప్పుడు ప్రచలితమైన కొత్త కొత్త వాదాల్నీ ధోరణుల్నీ మొత్తం దాని ప్రస్థానాన్ని విమర్శకుల లోటుపాట్లతో సహా తెలుసుకోడానికి యాకూబ్ పరిశోధన వొక గైడ్ బుక్ లాగా రెడీ రికనీర్ లాగా తోడ్పడుతుంది అనడంలో యెలాంటి సందేహం లేదు.

నా వరకు నాకు యీ పరిశోధన ఆత్మ శోధనకి వుపయోగపడింది. సంస్కృత అలంకార శాస్త్రం చదువుకోవడం దగ్గర సాహిత్య విద్యార్థిగా ప్రారంభమైన నాకు మార్క్సిజం మనస్తత్వ శాస్త్రం మొదలైన సామాజిక – వైజ్ఞానిక శాస్త్రాల వెలుగులో ఆధునిక సాహిత్య విమర్శలోని భిన్న ధోరణులు పరిచయమయ్యాకే సాంప్రదాయిక ఆలంకారిక శాస్త్రంలోని పరిమితులు తెలిశాయి. భరతుడి దగ్గర్నుంచి జగన్నాథుడి వరకూ సంస్కృతాలంకారికులు అలంకారాలు రీతి వృత్తి గుణ-దోష విచారాలు వక్రోక్తి వైచిత్ర్యాలు గురించి చేసిన చర్చంతా రూపానికీ శైలీ శాస్త్రానికి సంబంధించినదే. నిర్వచించిన లక్షణాలకు శ్లోకాల్ని శ్లోకాల్లో భాగాల్ని పదాల్ని పదాంశాల్ని లక్ష్యాలుగా యెత్తిపట్టడం మీదే వాళ్ళు యెక్కువగా దృష్టి సారించారు తప్పితే కావ్యాన్ని వొక యూనిట్ గా చూసింది లేదు. ఒక కవి గురించో రచయిత గురించో సమగ్రంగా విచారించిదీ లేదు.

ఉపమా కాళిదాసస్య, భారవేరర్థగౌరవం
దండిన: పదలాలిత్యం, మాఘే సన్తి త్రయో గుణా:
– వంటి నిర్ధారణలు విమర్శ సూక్తులుగానే మిగిలిపోయాయి.

ఆనంద వర్ధనుడు మాత్రం కావ్యాత్మ గురించిన ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం చేసి ‘భారతంలో అంగిరసం శాంతం’ వంటి ప్రస్తావనలు తెచ్చాడు. మొత్తం కావ్యం అందజేసే యెరుక గురించి మాట్లాడటానికి తలుపులు తెరిచాడు. ప్రాచీన ఆలంకారిక శాస్త్ర వివేచనలో ఆనంద వర్ధనుడొక మలుపు. కానీ అభినవ గుప్తుడు ‘రసో వై స:’ అని రసాన్నీ రసస్ఫూర్తినీ రసాస్వదననీ సాహిత్యేతర ఆలోచనాధార అయిన ఆత్మవాదంతో ముడిపెట్టడంతో ధ్వనికారుడి నూత్న ఆవిష్కరణకి ఆ తర్వాత కొనసాగింపు లేకుండా పోయింది. పాశ్చాత్య విమర్శ ధోరణులు తెలుగు వారికి పరిచయమయ్యాకే ఆ లోటు తీరింది.

కట్టమంచి కవిత్వ తత్త్వ విచారం కావ్యాన్ని అంచనా కట్టడానికి కొత్త సాహిత్య ప్రమాణాల్ని ప్రతిపాదించిన తర్వాత ఆధునిక విమర్శ కొత్త పుంతలు తొక్కినా శ్రీశ్రీ తదితర అభ్యుదయ వాదులు ప్రస్తావించిన కన్యాశుల్కంలో రస చర్చ, నాయక వివాదం దగ్గర్నుంచి ముదిగంటి సుజాతా రెడ్డి యిటీవల కాలంలో నవలల్లో రసం గురించి చేసిన ప్రతిపాదనల వరకూ సంప్రదాయ విమర్శ పోకడలు మనల్ని వొదిలి పెట్టలేదు. మరో వైపు మార్కిస్టు తత్త్వ శాస్త్రం వెలుగులో త్రిపురనేని మధుసూదన రావు, కె కె రంగనాథాచార్యులు, స్త్రీవాద దృక్పథంతో జయప్రభ, కాత్యాయినీ విద్మహే, శిలాలోలిత వంటివారు ప్రాచీన సాహిత్యాన్ని పునర్మూల్యాంకనం చేయడం కూడా గమనిస్తాం. నిరంతర చలనశీలమైన సమాజంలో ఆధునికత యెప్పటికప్పుడు సాపేక్షమే. అందువల్ల ఆధునికతని నిర్వచించడం, ఆధునిక విమర్శకి ప్రారంభ దినాల్ని నిర్ధారించడం చాలా కష్టమైన పని. ఆధునికత కేవలం కాలవాచి కాదు. అదొక జీవన విధానం; ఆలోచనా విధానం. మరింత లోతుగా ఆలోచిస్తే అదొక సామాజిక తాత్త్వికత. దాన్ని సాహిత్యానికీ సాహిత్య విమర్శకీ అన్వయించడంలో సాంకేతిక సామాజిక రాజకీయ ఆర్థిక శాస్త్రాల ప్రమేయం చాలా వుంటుంది. భారతీయ సమాజం మొత్తం పూర్తిగా ఆధునికతలోకి ప్రయాణం చేసిందా లేదా అన్న విషయమే ప్రశ్నార్థకం కాగా సాహిత్య విమర్శలో యీలోపు ఆధునికానంతర వాదం కూడా తయారయింది. అఫ్సర్ తిరుపతిరావు దామూ లాంటి వాళ్ళు అత్యాధునికత గురించి సైద్ధాంతిక చర్చలు చేసారు.

మార్క్సిస్టు సాహిత్య విమర్శలోని పరిమితుల్ని గుర్తిస్తూ అస్తిత్వంలోకి వచ్చిన స్త్రీ దళిత ప్రాంతీయ మైనార్టీ మొదలైన నిర్దిష్టతా వాదాలన్నిటినీ ఆధునికానంతర వాదం తనలో యిముడ్చుకొంది. నిజానికి అదొక వాదం కాదు. గత శతాబ్ది కాలంగా సాహిత్యంలో సాంప్రదాయికంగా స్థిరపడ్డ అన్ని వాదాలనూ – మార్క్సిజంతో సహా – తిరస్కరించడమే ఆధునికానంతరవాదం లోని మౌలిక సూత్రం. సాహిత్యంలో నిర్దిష్టతనీ బహుళత్వాన్నీ విభిన్నతనీ వినిర్మాణాన్నీ వైయక్తిక స్వేచ్ఛనీ అది వున్నతీకరించింది. చాలా సందర్భాల్లో మార్కిస్టు విమర్శ పరిమితుల్ని యెత్తిచూపడమే లక్ష్యంగా పని చేసింది. అందువల్ల పీడితుల్ని వొక తాటిమీదకి రానివ్వకుండా సామ్రాజ్యవాదులు పన్నిన కుట్రగా దాన్ని పరిగణించడం కూడా వుంది. నిర్దిష్టతలోంచీ మరింత నిర్దిష్టతలోకీ శకలీకరణ వైపు అత్యాధునికతా వాదం ప్రయాణం చేసినప్పటికీ సాహిత్యం లో సబాల్ట్రన్ స్టడీ కి దారులు వేసి ఆధిపత్యాల కింద అణగారిన జాతుల ప్రాంతాల ఆత్మగౌరవ ప్రకటనలకీ నూతన వ్యక్తీకరణరీతులకీ అంతకు ముందు యెక్కడా యెన్నడూ వినిపించని స్వరాలకీ ప్రాతినిధ్యం కలగడానికి దోహదం చేసింది.

మార్కిస్టు సాహిత్య విమర్శ వస్తునిష్టమైంది. రూపానికి ప్రాధాన్యం యివ్వక పోవడమే కాదు రూపవాదాన్ని నిరసించింది. సామాజిక దృక్పథాలతో ప్రమేయం లేని కేవల అనుభూతి వాదాన్నీ వ్యక్తివాదాన్నీ అది యెండగట్టింది. వెల్చేరు నారాయణ రావు కవితా విప్లవాల స్వరూపం గానీ, వాడ్రేవు చినవీరభద్రుడి నూరేళ్ళ తెలుగు కథ సంకలనం గానీ రూపాన్ని భూమికగా చేసుకొని రూపొందినవే. సాహిత్యం ప్రజలకు దగ్గర కావడానికి దారులు వెతికే మార్గంలోనే మోహన్ ప్రసాద్ దళిత కవులు పాటని ఆశ్రయించాలని చేసిన ప్రతిపాదన కూడా రూపాన్ని దృష్టిలో పెట్టుకొని చేసిందే. ఆధునిక సాహిత్య విమర్శ మొత్తం వస్తు రూప వాదాల మధ్యే వూగులాడింది. అయితే ఆ వూగులాటకి ఆ యా కాలాల్లో చోటుచేసుకొన్న సామాజిక చలనాలు కారణమయ్యాయి. వాటి ప్రభావం సృజనాత్మక సాహిత్యం మీద యే మేరకు పడింది అన్నది ప్రత్యేకంగా పరిశీలనార్హం.

తెలుగులో ఆధునిక సాహిత్య విమర్శకుల్లో నూటికి తొంభై తొమ్మిది మంది మార్క్సిస్టు విమర్శ లోనే పుట్టినప్పటికీ అస్తిత్వోద్యమాల నేపథ్యంలో చాలామంది దానికి దూరమయ్యారు. అయితే మార్క్సిస్టు సాహిత్య విమర్శ తప్ప తక్కిన వాదాల్ని ఆశ్రయించుకొన్న విమర్శ ధోరణులు కొన్ని విశ్లేషణలూ వివరణలూ చర్చలూ వాద వివాదాల వరకే పరిమితమయ్యాయి తప్పితే లోతైన తాత్త్వికతని ప్రతిపాదించలేకపోయాయి. వివాదాలు కొన్ని సందర్భాల్లో వ్యక్తిగతంగా కూడా పరిణమించాయి. దళితవాదంలో శివసాగర్ వంటివారు నిర్దేశించిన దళిత సౌందర్య శాస్త్రానికీ స్త్రీవాద విమర్శలో ఓల్గా వంటివారు వ్యక్తి గతమంతా రాజకీయమే అని ప్రస్తావించిన జెండర్ చైతన్యానికీ కొనసాగింపు లేకుండా పోయింది. ఆ మేరకు ఆ యా ధోరణుల్లో విమర్శకులు కొత్త విమర్శ పరికరాలను కూడా సమకూర్చుకోలేకపోయారన్నది చేదు వాస్తవం. అరా కొరా సమకూడినా విమర్శకు రొట్ట కొట్టుడు పరిభాష యేర్పడిందే తప్ప పదాలు భావనలుగా భావనలు సిద్ధాంతాలుగా పరిణమించిన దాఖలాలు తక్కువ. అందుకే కొత్త వాదాల్తో ధోరణుల్తో సృజనాత్మక సాహిత్యం వచ్చినంత విరివిగానూ బలంగానూ దానికి సైద్ధాంతిక తాత్త్విక భూమికనేర్పరచగల విమర్శ రాలేదని ఆవేదన తరచుగా వ్యక్తమౌతోంది.

పత్రికల్లో విమర్శకు చోటు కుదించుకుపోయింది. సంచలనానికి వున్న ప్రాథమ్యం సైద్ధాంతిక ప్రతిపాదనలకి లేకుండా పోయింది. సాహిత్య పేజీలు  పెరిగాయన్న మురిపెమే గానీ అవి ఆశ్రితులకు మాత్రమే కల్పవృక్షాలయ్యాయి. ఆధునికత తెచ్చిన మార్పుల్ని అధ్యయనం చేయడానికీ అది మనిషి వైయక్తిక సామాజిక జీవితాలపై చూపే ప్రభావాల్ని అంచనా కట్టడానికీ అవసరమైన నిర్దిష్టమైన నిర్దుష్టమైన పరికరాల్ని మన విమర్శకులు నిర్మించుకోలేకపోతున్నారు. అయితే సాంప్రదాయిక విమర్శ సూత్రాలనే తిరిగి తిరిగి వల్లిస్తున్నారు లేదా అరువు తెచ్చుకొన్న పరిభాషనే గుడ్డిగా అన్వయించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదంతా కడుపు చించుకుంటే కాళ్ళమీద పడే వ్యవహారంగా తయారైంది.

ఆధునిక సాహిత్య విమర్శలో కనిపించే యీ ఖాళీలను తన పరిశోధన గ్రంధంలో యాకూబ్ చాలా స్పష్టంగా గుర్తించాడు. అంతే కాదు; అందుకు కారణాలను సైతం విశ్లేషించాడు. తెలుగు విమర్శకులు వాచాకాల్ని పరిశీలించేటప్పుడు రచయితని విపరీతంగా పొగడటానికో తిట్టడానికో పరిమితం కావడం వల్ల వాచకం లోతుల్లోకి పోలేకపోతున్న వైనాన్ని యాకూబ్ పరిశోధకుడిగానే కాదు సృజనాత్మక రచయితగా సైతం బలంగా ప్రశ్నించాడు. ఒక విధంగా ‘మోత’ బరువు విమర్శని తిరస్కరించాడు. విమర్శ రచయిత కేంద్రకంగా గాక వాచక కేంద్రకంగా జరగవలసిన అవసరాన్ని గురించి హెచ్చరించాడు. చాలావరకు ఆధునిక విమర్శలోని వాదాలు ధోరణులూ రూప పరామర్శకే పరిమితమయ్యాయనీ, మార్క్సిస్టు – ఆధునికానంతర వాద విమర్శలు మాత్రమే వాటిలోని సైద్ధాంతిక బలం కారణంగా అప్పటి వరకూ వున్న అన్ని విలువల్నీ బోనులో నిలబెట్టి ప్రశ్నించ గలిగాయనీ వాచక సారాంశాన్ని ప్రాధమ్యంగా పరిగణించిన దృక్పథాలు మాత్రమే సాహిత్య విమర్శలో యివాల్టికీ ప్రాసంగికంగా వున్నాయనీ నిర్ధారించాడు.

‘విమర్శ అనేది నిర్దిష్టత (Concrete) నుండి అమూర్తత (Abstract) వైపు తీసుకువెళ్ళే సాధనం. ఈ అమూర్తత వివిధ దశల్లో ఉంటుంది. ఈ పధ్ధతి ద్వారా నిర్దిష్ట విషయాన్ని మరింతగా అర్థం చేసుకొనే ప్రయత్నం జరుగుతుంది. విమర్శనా పద్ధతుల్లో ఒకటి రెండు ఆ అమూర్తతా దశకు చేరుకున్నా మిగతావి అసంపూర్ణంగానే విరమించినట్లు అనిపిస్తుంది. తెలుగు సాహిత్యంలో ఇది మరీ స్పష్టంగా కనిపిస్తుంది. విమర్శ ధోరణులు రూపం వరకే పరిమితమవుతున్నాయి. సమాజంలో ఇతర రంగాలతో సాహిత్యానికున్న సంబంధాన్ని గుర్తించడానికి నిరాకరిస్తున్నాయి. దీనికి కారణం ‘స్వయం ప్రతిపత్తి’ భావన అని సిద్ధాంత కర్తలు గుర్తించారు. ఒక్క మార్క్సిస్టు ధోరణి ఈ పరిస్థితిని అధిగమించింది. అందువల్లనే ఏదో ఒక స్థాయిలో సమాజ కేంద్రితమైన ఈ విమర్శకు సాహిత్యంలోనూ , విమర్శలోనూ కొనసాగింపు ఉంటూనే ఉంది.’

ఇటువంటి నిర్ధారణలకు రావడానికి యాకూబ్ యెన్నో వుపపత్తుల్ని చూపాడు. విశ్వవిద్యాలయాల లోపలా బయటా జరిగిన పరిశోధనల్నీ , యెప్పటికప్పుడు పత్రికల్లో వచ్చిన వ్యాసాల్నీ సమీక్షల్నీ చర్చల్నీ వాద వివాదాల్నీ స్పందన ప్రతిస్పందనల్నీ, రచనలకు ముందు – వెనక మాటల్నీ , విమర్శ సంకలనాల్లో పరిశోధన పత్రాల్లో ప్రస్తావించిన అంశాల్నీ సిద్ధాంత గ్రంథం పొడవునా క్రోడీకరించాడు. తనకు దొరికిన యే ఆకరాన్నీ అతను వదులుకోలేదు. సేకరించిన సమాచారాన్ని తన ప్రతిపాదనలకి అన్వయించుకోవడంలో తడబాటు పడలేదు. అందువల్ల అతని పరిశీలన పదునెక్కింది. నిర్ధారణలు నిజాలుగా మిగిలాయి. పరిశోధన ప్రామాణికమైంది. ఈ క్రమంలో ఆధునిక విమర్శ ముందు ముందు నడవ వలసిన దారుల్ని సైతం అతను సూచించాడు. సమీక్షలే విమర్శగా చెలామణి అవుతున్న దుస్థితి పట్ల ఆగ్రహం ప్రకటించాడు. అయితే ఆ పని యెంతో సంయమనంతోనూ తెలివిడితోనూ చేశాడు. తన యెరుకకి నిర్దుష్టమైన మెథడాలజీని జోడించడంలో యెక్కడా యేమరుపాటుకి గురికాలేదు.

అందుకే యీ పరిశోధన ప్రణాళికాబద్ధంగా రూపొందింది. పాశ్చాత్య దేశాల్లో , భారతీయ భాషల్లో ఆధునిక విమర్శ ధోరణుల్ని పరిచయం చేస్తూ అవి తెలుగులో ప్రవేశించిన సామాజిక సందర్భాల్ని ప్రస్తావించి వాటి పుట్టు పూర్వోత్తరాల్నీ పోయిన పోకడల్నీ పొందిన వికాసాన్నీ చెబుతూనే ఆ యా సందర్భాల్లో విమర్శకులు – వీరేశలింగం, కట్టమంచి దగ్గర్నుంచీ జీవీ కృష్ణారావు, శ్రీశ్రీ, కొకు, ఆరుద్ర, రాంభొట్ల, కేవీఆర్, రారా, టియమ్మెస్, ఆర్వీయార్, జేసీ, వెల్చేరు, సి వి సుబ్బారావు, కేకేఆర్, బాలగోపాల్, సంజీవమ్మ, వల్లంపాటి, కాత్యాయినీ విద్మహే. పాపినేని, రాచపాళెం, ఎన్ వేణుగోపాల్, సూర్యసాగర్, ఆర్ యస్ సుదర్శనం, మందేశ్వరరావు, జీవీ సుబ్రహ్మణ్యం, ఓల్గా, జయప్రభ, వసంత, లలిత, కాత్యాయినీ, మృణాళినీ, శిలాలోలిత, బి యస్ రాములు, ఉ సా, కత్తి పద్మారావు, కలేకూరి, లక్ష్మీ నరసయ్య, … ఖాదర్, షమీ ఉల్లా, ఖాజా, స్కైబాబా, కరీముల్లా, … సురేంద్ర రాజు, అఫ్సర్, తిరుపతి రావు, …. సుజాతా రెడ్డి, సిధారెడ్డి, కె శ్రీనివాస్, ప్రతాపరెడ్డి, సంగిశెట్టి, గుడిపాటి… వరకూ ఆధునిక విమర్శ మలుపుల్లో యేదో ఒక మేరకు తమదైన ముద్రని వేయగల్గిన ప్రతి వొక్కరి వరివస్యనీ రాగ ద్వేషాలకి అతీతంగా నిష్పక్షపాతంగా అంచనా కడతాడు. పరిశోధకుడు పాటించాల్సిన తాటస్థ్యాన్ని ప్రతి పదంలోనూ అతను గుర్తుంచుకొన్నాడు. దాన్నొక పూనికతో నిర్వహించడం వల్ల మొహమాటాలకు తావు లేకుండా స్వీయ ప్రతిపాదనలు అనేకంగా చేయడానికి అతనికి ఆస్కారం లభించింది.

‘తెలుగు మార్క్సిస్టు సాహిత్య విమర్శలో ఎక్కువ సందర్భాల్లో polemics యొక్క ఆధిపత్యం కనిపిస్తుంది’

‘నవ్య సంప్రదాయ వాదం పేరుతో ఉన్న ఈ ధోరణి క్రియాశీల సామాజిక పరిణామ వాదం పునాదులై లేచిన అభ్యుదయ, విప్లవ కవిత్వోద్యమాలకు
ప్రతిక్రియగా వచ్చినదే కానీ , దీనికి ఒక ప్రత్యేకమైన అస్తిత్వం లేదు.’

‘ఒక బలమైన సైద్ధాంతిక దృక్పథం లేకపోవడం వల్ల స్త్రీ వాదులు వాళ్ళ సాహిత్యం మీద జరిగిన దాడిని కవితల రూపంలో తప్ప సిద్ధాంతపరంగా ప్రారంభంలో ఎదుర్కోలేకపోయారు.’ … ‘స్త్రీవాద సాహిత్యాన్ని విశ్లేషించేందుకు తొలినాళ్ళలో మార్క్సిస్టు సాహిత్య సిద్ధాంతాన్నే పరికరంగా వాడుకోవడంవల్ల కూడా స్త్రీవాద విమర్శనా ధోరణి అంతగా మెరుగుపడలేదేమోనని అనిపిస్తుంది. చాలామట్టుకు స్త్రీవాద సిద్ధాంతంపైన , కవిత్వ పరిభాషపైన , వస్తు సముదాయంపైన జరిగిన వాద ప్రతివాదాలు ఎక్కువగా చోటు చేసుకోవడంవల్ల కూడా విమర్శ ఒక ధోరణిగా రూపొందలేక పోయిందేమోనని అనుకోవాల్సివస్తుంది. మొత్తంగా స్త్రీవాదానికి సరిపోయే రీతిలో సాహిత్య విమర్శ రాలేదు.’

‘ముస్లిం కవిత్వం తెలుగు కవిత్వంలో ప్రవేశపెట్టిన కొత్త రచనా రీతులను, శైలీ శిల్పాలను గుర్తించి వివరించే ప్రయత్నం జరిగినప్పటికీ. ఇంకా విస్తృతంగా జరగాల్సే వుంది…. ఇంకా బాల్య దశలోనే మైనారిటీ సాహిత్య విమర్శ ఉందని చెప్పవచ్చు.’

‘తెలంగాణ గేయకవిత్వం విస్తృతమైనంతగా గేయ కవిత్వ విమర్శ విస్తృతం కాలేదు’

‘విప్లవ సాహిత్యోద్యమం కొత్తగా ముందుకు వచ్చిన సమస్యల గురించిన అవగాహన రాహిత్యం వల్ల బలహీనపడింది. విప్లవ సాహిత్యంలో ఆర్ధిక , సామాజిక అంశాల గురించిన అంశాలే తప్ప కులం, మతం, జెండర్, వృత్తి లాంటి అంశాలు; సామాజిక జీవితంలో రాజ్యం నిర్వర్తిస్తున్న రాజ్యం పాత్రను విశ్లేషించలేకపోయారు. సాహిత్య వస్తు విస్తృతి వైపు దృష్టి మరల్చలేకపోయారు. వస్తు రూపాల్లో వస్తు ఆధిక్యతనే ప్రధానమని భావించారు. ప్రత్యక్ష రాజకీయ సాహిత్యమే సాహిత్యమని నమ్మారు. ఆ సందర్భంగా మార్క్సిస్టుల పాత్ర నిర్వహణ ఆ యా పరిధి పరిమితులలో సాగి, అవసరంగా ముందుకొస్తున్న విషయాలను విస్మరించడం వల్ల సాహిత్యానికి దూరమవుతూ వచ్చారు.’

పరిశోధన గ్రంథంలో యిటువంటి పరిశీలనలు అనేకంగా వున్నాయి. కొన్ని పరిశీలనలు నిర్ధారణలుగా కూడా కనిపిస్తాయి. ఆ యా సందర్భాల్లో యాకూబ్ చేసిన నిర్ధారణలతో, వ్యాఖ్యానాలతో, అభిప్రాయాలతో యెవరైనా విభేదించవచ్చు, అతని సిద్ధాంతాన్ని పూర్వపక్షం కూడా చెయ్యొచ్చు. కానీ పరిశోధకుడిగా యాకూబ్ లోని ఆబ్జెక్టీవిటీని మాత్రం మెచ్చుకోకుండా వుండలేం.

నిర్మమత్వ బుద్ధితో యాకూబ్ చేసిన ముక్కుసూటి ఆవిష్కరణల్లో వొకటి రెండు సందర్భాల్లో తప్ప – కాఠిన్యాన్నో వుద్వేగాన్నో గమనించం. యాకూబ్ వ్యక్తిత్వంలోని మార్దవతే కవిత్వంలోకీ అక్కణ్నుంచీ పరిశోధనలోకీ ప్రవహించింది. తనకెంతో యిష్టుడైన చేరా భాషాశాస్త్రాన్ని కవిత్వ పరామర్శకి అన్వయిస్తూ చేసిన విమర్శనా పద్ధతుల్ని బేరీజు వేసిన సందర్భం యాకూబ్ పరిశోధక వ్యక్తిత్వానికి నికషోపలం. అలాగే జి లక్ష్మీ నరసయ్య దళిత సాహిత్య తాత్త్విక దృక్పథ వివేచన చేస్తూ అంబేడ్కరిజం వెలుగులో బుద్ధిజం జోడింపుతో దేశీయ మార్క్సిజం రూపొందాలని ప్రతిపాదించినపుడు యెటువంటి మొహమాటం లేకుండా మతాతీతమైన లౌకిక ప్రజాస్వామ్య భావన అవసరాన్ని యాకూబ్ నొక్కి చెప్పాడు. బుద్ధిజంలోని అష్టాంగమార్గాల విశిష్టత అతనికి తెలీని విషయం కాదు. కేవల విశ్వాసంగా అమలయ్యే మతంతోనే అతని పేచీ. పరిశోధకుడికి తనదైన దృక్పథం వొకటి వుంటుంది. అది పరిశోధన పొడవునా అంతస్సూత్రంగా కనిపిస్తుంది అనుకొన్నప్పుడు – కవిగా యాకూబ్ సూఫీ వాది. అదే సమ దృష్టి అతని పరిశోధనలో కూడా ప్రతిఫలించింది అని చెప్పడం తప్పు కాదు.

ఆధునిక సాహిత్య విమర్శ తొంభైశాతం కవిత్వం చుట్టూనే తిరిగింది. అదికూడా వచన కవిత్వం కేంద్రంగానే సాగింది. తక్కిన ప్రక్రియల విషయంలో విమర్శకులకు అభినివేశం తక్కువ. కథ గురించి వొక మోస్తరుగా, నవల గురించి నామమాత్రంగానైనా విమర్శ వుంది గానీ నాటక విమర్శ మరీ నల్లపూసే. ఆ లోటుని యీ పరిశోధన కూడా తీర్చలేకపోయింది. మనో వైజ్ఞానిక వాద విమర్శ ప్రధానంగా నవల మీదగానే సాగడం, తెలంగాణ ప్రాంతీయవాద విమర్శలో అధికశాతం కథాసాహిత్యం పైనే జరగడం గమనించాల్సిన అంశాలు. ఆ ప్రత్యేకతలు యాకూబ్ దృష్టి నుంచి తప్పుకుపోలేదు.

తెలుగు సాహిత్య విమర్శలో పాఠక ప్రతిక్రియ, అభిరుచి ధోరణుల కోసం యాకూబ్ యీ పరిశోధనలో వొక అధ్యాయమే కేటాయించాడు. అందులో అతను ప్రస్తావించిన అంశాలు నిత్య నూతనమైనవి. అవి యెంత ప్రాచీనాలో అంత ఆధునికమైనవి. అందువల్ల ప్రత్యేకంగా పరిశీలించాల్సినవి. నిజానికి యీ పరిశోధనలోని ప్రతి అధ్యాయం పైనా ప్రత్యేక పరిశోధన జరపొచ్చు. ఎంతో విస్తృతమైన పరిధి వున్న పరిశోధనాంశాల్ని వొక చోట గుది గుచ్చడమే చాలా కష్టమైన పని. ఆ పనినెంతో నిబద్ధతతో చేశాడు యాకూబ్. పరిశోధన సాగిన తీరు మూల్యాంకనం ఫలితాంశాలు చూశాకా వొకటిన్నర దశాబ్దానికి పైగా చేసిన అతని కృషి వమ్ముకాలేదని నాకు గొప్ప నమ్మకం కలిగింది.

‘తెలుగులో సాహిత్యంతో పాటు విమర్శ ఎదగలేదు. ఎదుగుతూ వచ్చిన కవిత్వాన్ని తూచే రాళ్ళు తెలుగు విమర్శకుల దగ్గర లేకుండా పోయాయి. మిగతా ప్రపంచంలో కవిత్వంతో పాటు ఎదుగుతూ వచ్చిన విమర్శనా స్థానాలని తెలుగు విమర్శకులు పట్టించుకోలేదు. దాని వలన తెలుగు కవిత్వానికి, విమర్శకి మధ్య పెద్ద అగాధం ఏర్పడింది. సాహిత్య సమీక్ష, appreciation తెలుగులో ఇంకా విమర్శలుగానే చలామణి అవుతున్నాయి. విమర్శ రాస్తున్న వాళ్ళలో చాలామంది కవులు కావటం వల్ల, విమర్శలో కవిత్వం రాసినప్పుడు విషయ స్పష్టత తగ్గి, చెప్పే విషయాన్ని గందరగోళం చేయటం జరుగుతుంది. ఆధునిక సాహిత్య విమర్శలో కొట్టొచ్చినట్లు కనపడే మరో లక్షణం ఒక స్పష్టమైన ధోరణి అంటూ ఏర్పదకపోవడం. పరస్పర విరుద్ధమైన అనేక ధోరణులు, సాహిత్య సిద్ధాంతాలు, అధ్యయన సిద్ధాంతాలు కలగాపులగంగా ప్రతి విమర్శకుడినీ ప్రభావితం చేసాయి. అసలు విమర్శనా ధోరణులను వర్గీకరించే ప్రయత్నం కూడా సీరియస్ గా ఎవరూ చేపట్టలేదు.’

ఇవీ అంతిమంగా యాకూబ్ ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ గురించి స్థూలంగా మనముందుకు తెచ్చిన ప్రధానమైన అంశాలు. వీటికి సమాధానం చెప్పే దిశగా సాహిత్యకారుల్ని సమ్యగాలోచనకీ సత్వరాచరణకీ పురిగొల్పడమే పరిశోధకుడిగా యాకూబ్ ఆశించిన మౌలిక లక్ష్యం. ఆధునిక సాహిత్య విమర్శలోని ఖాళీల గురించి చర్చించక తప్పని వొక అనివార్యతని యీ పరిశోధన కలిగిస్తుంది. సృజనాత్మక రచయితలకీ విమర్శకులకీ పాఠకులకీ మరీ ముఖ్యంగా భావి పరిశోధకులకీ వొక చోదక శక్తిగా వుపయోగపడే మంచి పరిశోధనని అందించినందుకు నా సూఫీ కవి పరిశోధక మిత్రుడు యాకూబ్ కి మన: పూర్వక అభినందనలు.

ఎ.కె.ప్రభాకర్
హైదరాబాద్,
ఫిబ్రవరి 12, 2015

You Might Also Like

Leave a Reply