గడ్డి పూలు – గుండె సందుక

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్
**************
పూల మనసుల్లోకి …
శాంతి ప్రబోధ కథా సంపుటి “గడ్డి పూలు – గుండె సందుక (బాల్యం చెప్పిన కథలు)” కు ముందుమాట

‘కథ అంటే ఏమిటి తాతీ?
ఏమీ లేదు తల్లీ

నేను నా గురించి
నువ్వు నీ గురించి
చెప్పుకుంటే ఒక కథ

నేను నీ గురించి
నువ్వు నా గురించి
చెప్పుకుంటే ఇంకో కథ

మరొకరి గురించి
నేనో నువ్వో
చెప్పుకుంటే మరో కథ

ప్రపంచంలో
నేను నువ్వు మరొకరేనా
చూసినవి చూడనివి
రకరకాలుగా
చెప్పుకుంటూ పొతే
ఎన్ని తరగని కథలో’

కథ పుట్టువు గురించి కవి ముకుంద రామారావు కవిత (జూన్ 2017), రచయిత్రి శాంతి ప్రబోధ రాసిన ‘గడ్డి పువ్వు – గుండె సందుక’ కథలు దాదాపు వొకే కాలంలో చదవడం యాదృచ్చికమే. కానీ పై కవిత రచయితగా శాంతి ప్రబోధనీ ఆమె కథల్నీ అర్థం చేసుకోడానికి వొక దారి పరిచింది. కథలు యెవరు రాస్తారు యెవరి గురించి దేని గురించి రాస్తారో స్పష్టమైంది. కథ చెప్పడానికి /రాయడానికి సంబంధించిన కొన్ని పొరలు తెరచి చూసినట్టైంది. కానీ కథలు యెలా రాస్తారు యెందుకు రాస్తారు అన్నవి మరింత ప్రధానమైన ప్రశ్నలు. ఒకటి కథ చదువుతున్నప్పుడు కలిగేది మరొకటి చదివేకా కూడా మిగిలేది. కథా శిల్పానికీ దృక్పథానికీ సంబంధించిన యీ రెండు ప్రశ్నలకి సమాధానాలు వెతికే దారిలో నలిగిన ఆలోచనల్లోంచి నాలుగు మాటలు (యివి చదవకుండా నేరుగా కథల్లోకి వెళ్ళినా నష్టం లేదు – నిజానికి అదే మంచిదేమో!)

తప్పటడుగుల బాల్యం చెప్పిన కథల గురించి శాంతి ప్రబోధ తొలిసారిగా నాతో ప్రస్తావించినప్పుడు పచ్చనాకుసాక్షిగా నామిని చెప్పిన సినబ్బ కథల్లానో ఖదీర్ బాబు దర్గామిట్ట కథల్లానో కాకుంటే సోమరాజు సుశీల ఇల్లేరమ్మ కథల్లానో వొక నోస్టాల్జియా నుంచీ రాసినవి అనుకున్నా. అవన్నీఆ యా రచయితల స్వీయ బాల్య జ్ఞాపకాలు. సొంత కథలు. వాళ్ళ చెరిగిన / చెరగని బాల్యపు పద చిహ్నాలు. కానీ యీ కథల్లో బాల్యం రచయిత్రిది కాదు. ఎందరో బాధితుల బాల్యం. బాధ కూడా తన బాధ కాదు. ప్రపంచపు బాధ. ఆమె దాన్ని సొంతం చేసుకొని అనుభవించి రక్త గతం చేసుకొని సాహిత్య రూపమిచ్చి పదుగురితో పంచుకుంటున్నారు. బాల్యం గురించి యెందరు యెంత రాసినా చెప్పినా తరగదు-పంచిన కొద్దీ యేదో మిగిలే వుంటుంది. అయితే అందరి బాల్యాలూ అన్ని బాల్యాలూ వొకలాంటివి కావు అన్న స్పృహతో రాసిన కథలివి. అసమ సమాజంలో పాతుకుపోయిన పాతకాలపు కౌటుంబిక విలువలు కొత్తగా చొచ్చుకువచ్చే సంస్కృతి చదివే చదువులు పరిసరాలు వ్యక్తుల స్వార్థం క్షుద్ర రాజకీయాల ప్రమేయం… యిటువంటి అనేకాంశాలు బాల్యాన్నీ దాని రూపాన్నీ నిర్దేశిస్తాయి. దాని దారిని శాసిస్తాయి.

అందుకే బాల్యం కొందరికి మధురం యెందరికో చేదు విషం. అది కొందరికి వరం మరెందరికో శాపం. కారణం : గర్భస్థ శిశువే యిక్కడ మృత్యువు బారిన పడుతుంది. పుడుతూనో పుట్టకముందో ఎయిడ్స్ రోగానికి గురౌతుంది. మొగ్గగానే మాడిపోతుంది. అంబాడే వయస్సులోనే బాల్యం యిక్కడ అంగడి సరుకవుతుంది. అక్షరాలు దిద్దాల్సిన పసి చేతులు పనిముట్లవుతాయి. ఒక చోట యాసిడ్ తో పాయిఖానాలు కడుగుతాయి. మరోచోట తంబాకుతో బీడీలు చుడతాయి. ఇంకోచోట కనిపించని కార్పోరేట్ భూతం కోరలు తోముతాయి. పల్లెల్లో బాల్యం పశువుల్ని కాస్తూ పేడ పోగేస్తూ పరిగె యేరుతూ పిల్లల్ని పెంచుతూ గిడసబారిపోతే నగరాల్లో బాల్యం ఆకలితో రోడ్డు పక్కన దీనంగా అడుక్కు తింటుంది. తల్లిదండ్రుల ప్రేమకి దూరమై బుక్కెడు బువ్వకోసం నేరాలకు పాల్పడుతుంది. దిక్కులేని అనాథ అవుతుంది. రకరకాల మాఫియాలకి కారుచవగ్గా చిక్కిపోతుంది. పలువిధాల దోపిడీకి గురౌతూ తట్టలు మోస్తుంది. బిల్డింగులు కడుతుంది. చెత్త యేరుకుంటుంది. డ్రైనేజీలు శుభ్రం చేసుంది. అదే బాల్యం ఆడపిల్లలదయితే అత్యాచారాలకు బలౌతుంది. రాత్రికి రాత్రి బలవంతంగా విలాస పురుషుల చేతులు మారుతుంది. అడుగడుగునా ‘నిప్పుల నడక’వుతుంది. భయద విషాదమౌతుంది. పువ్వులా సహజంగా విరియాల్సిన పసితనం యిలా విషం గానూ శాపంగానూ మారడానికి కారణమయ్యే పరిస్థితుల గురించి ఆలోచించడం వాటిని నడిపే సామాజిక రాజకీయ శక్తుల గురించి విశ్లేషించడం వాటినుంచి బయట పడటానికి దారులు అన్వేషించడం … యీ క్రమంలో కల్గిన వొక అలజడిలోంచి వొక ఆవేదనలోంచి వొక అశాంతిలోంచి పుట్టినవే శాంతి ప్రబోధ కథలు. నిజానికి యివి తప్పటడుగుల బాల్యం కాలి బొటన వేలికి తాకిన పోట్రవుతు దెబ్బలు. రక్తమోడుతున్న రసి కారుతోన్న లోతైన మానని ఆ గాయాలకి మందు పూసి కట్టుకట్టే మానవీయ స్పందనలో భాగంగా వెలువడ్డ యథార్థ కథనాలు.

***
వల్లూరిపల్లి శాంతి ప్రబోధ పేరు చెప్పగానే ఆమె రాసిన ‘జోగిని’ నవల వెంటనే స్ఫురిస్తుంది. జోగిని దురాచారం లోతుల్లోకి భిన్న సంస్కృతుల వైరుధ్యాల్లోకి వెళ్లి విశ్లేషించిన ఆ నవల వార్తలో సీరియల్ గా వచ్చినప్పుడు, ప్రజాశక్తి పుస్తకరూపంలోకి తెచ్చినప్పుడు(2004) పాఠకుల నుంచి మంచి స్పందన వచ్చింది. దరిమిలా యెన్నో ప్రశంసలు పురస్కారాలు పొందింది. ఒక సామాజిక సమస్య కేంద్రంగా దళిత స్త్రీల జీవితాలపై అమలయ్యే తీవ్రమైన హింసను ఆమె ఆ నవల్లో గొప్ప ఆర్తితో చిత్రించింది. అదే క్రమంలో ఛిద్రమౌతోన్న బాల్యాన్ని నేపథ్యం చేసుకొని రాసిన వాస్తవ సంఘటనలకి కథా రూపం యిచ్చి యిప్పుడు ‘గడ్డి పువ్వు – గుండె సందుక’ గా మనముందు వుంచుతున్నారు.

శాంతి ప్రబోధ చదివింది జర్నలిజం. కానీ సామాజిక సేవా రంగాన్ని తన కార్య క్షేత్రంగా యెన్నుకొని లవణం హేమలతా లవణం నిర్వహణలో నడిచిన సంస్కార్ సంస్థ ద్వారా దాదాపు 20 సంవత్సరాలు జోగిని దురాచారానికి వ్యతిరేకంగా పని చేశారు. అందులో భాగంగా జోగిని స్త్రీలకు వుపాధి పునరావాసాలు కల్పించడానికి పూనుకొన్నారు.(జోగిని నవలలో ఆ కాలంలో తన అనుభవ పరిధిలోకి వచ్చిన అంశాలనే నమోదు చేశారు). అక్కడ నుంచే బాలల హక్కుల పట్ల అవగాహన యేర్పరచుకొన్నారు. తల్లి దండ్రులకు దూరమై ప్రేమ రాహిత్యంలో తల్లడిల్లే భిన్న సామాజిక వర్గ – కుల నేపథ్యాలకు చెందిన బాలల దుస్థితి చూసి చలించారు. వారి ఆలనా పాలనా చూస్తూ సమాజంలో వాళ్ళుఆత్మ గౌరవంతో యెదగడానికి ఆలంబనగా నిలబడే క్రమంలో తాను కన్న విన్న దృగ్విషయాలనే కథలుగా మలిచారు.

సామాజిక కార్య క్షేత్రంలో ఆమె యెదుర్కొన్న సమస్యలు – వాటిలోని సంక్లిష్టతలు – పరిష్కారాల కోసం పడిన తండ్లాటా, సుదూరంగానైనా యెక్కడా కనిపించని ఆశ, కమ్ముకున్ననిరాశలోంచీ పుట్టిన ఆవేదన, దాన్నుంచి వెలికి రావడానికి చేసే సంఘర్షణ యీ కథల్లో ధ్వనిస్తాయి. ఆమెకు ఆ ప్రయాణంలో తారసపడిన వ్యక్తులే సజీవ పాత్రలై మనముందు సాక్షాత్కరిస్తారు. తమను అమానవీయమైన అంచుల్లోకి నెట్టిన సామాజిక దురన్యాయాన్ని బేలగా చూస్తుంటారు. నిస్సహాయ స్థితిలో ఆసరా కోసం యెదురు చూస్తారు. తమ బతుకులు దుర్భరం కావడానికి కారణమైన మానవ దౌష్ట్యానికి అంతం లేదా అని ప్రశ్నిస్తారు. కొన్నిసార్లు గల్లా పట్టుకుని నిలదీస్తారు. అందుకే యీ కథల్లో యెక్కడా కవులూ రచయితలూ వర్ణించిన గత శైశవ రాగమాలికల ప్రతిధ్వనులు వినిపించవు. పీడకల లాంటి వర్తమాన సామాజిక బీభత్సమే దర్శనమిస్తుంది. అందులో ‘వేయి పడగల విషనాగు కోరల’ కాటుకి బలైన బడుగు ప్రాణులూ చీడ పురుగు సోకి విరియక ముందే వాడి రాలిపోతున్న పూలమొగ్గలూ కనిపిస్తాయి. ‘చేయని తప్పుకి శిక్ష మోస్తున్న’ బాల క్రీస్తుల లేలేత గుండె మూలుగులు ధ్వనిస్తాయి. అంతులేని యీ విషాద రూపకంలో సాటి మనుషులుగా మన పాత్ర యెంత అని ప్రశ్నించుకొనేలా చేయడం, పౌర సమాజపు స్పందనా రాహిత్యాన్ని నిష్క్రియాపరత్వాన్ని వేలెత్తి చూపడం, వ్యక్తిపరంగా వ్యవస్థ పరంగా మార్పు కోరుకునే ఆలోచనలకు పురిగొల్పడం… యిదీ రచయితగా శాంతి ప్రబోధ స్వీకరించిన యెజెండా. స్వయంగా నిర్దేశించుకొన్న సాహిత్యాచరణ ప్రణాళిక . అదే యీ కథల అంతిమ ప్రయోజనం.

అయితే అందుకు రచయిత సిద్ధాంతాలు యేకరువు పెట్టలేదు. తన భావజాలాన్ని పాఠకులపై రుద్దలేదు. ఎక్కడో వొకటి రెండు సందర్భాల్లో తప్ప వుపన్యాస ధోరణిని ఆశ్రయించలేదు; స్వీయ వ్యాఖ్యానాలు జోడించలేదు. కఠోర జీవన వాస్తవికతని యథాతథంగా ఆవిష్కరించడమే ఆమె యెంచుకొన్న కథన విధానం. అలా అన్జెప్పి శాంతి ప్రబోధ తనదైన ప్రాపంచిక దృక్పథం కథల్లో వ్యక్తం చేయలేదని కాదు. బాలల సమస్యలు కేవలం ఎన్జీవోల ద్వారా పరిష్కారమయ్యేవి కావనే యెరుక ఆమెకు వుంది. ఎన్జీవోల పరిమితులు కూడా ఆమెకు తెలుసు. కొన్ని చోట్ల ఎన్జీవోలే బాల్యాన్ని పణ్య వస్తువు చేస్తున్నాయన్న స్పృహ కూడా ఆమెకు వుంది. కానీ వుదాసీనతకి లోనుకాకూడదన్న ఆశయ బలమే ఆమెను ముందుకు నడిపిస్తుంది. వ్యవస్థలో సమూలమైన మార్పు వచ్చేవరకూ చేతులు ముడుచుకు కూర్చోకుండా ఆదుకోడానికి చేతులు చాచగలిన మేరకు చాచి తక్షణ ఆచరణకు పూనుకోవడమే ఆమె యెంచుకొన్న మార్గం. ఆ దారిలో చేసే ఆమె ప్రయాణం కథల్లో అంతర్లీనంగా కనిపిస్తూనే వుంటుంది.

ఈ కథలన్నీ సూటిగా వుంటాయి. డాంబిక శైలి యెక్కడా కనిపించదు. శిల్ప ప్రయోగాల జోలికి పోలేదు (స్వీకరించిన వస్తువు యెటువంటి ప్రయోగాల్లోనూ వొదగదనే స్పృహ ఆమెకి వుంది). నిరాడంబరంగా సాదా సీదాగా వుండటం వల్ల కథలు సహజంగా మొదలై అంతే సహజంగా ముగుస్తాయి. అందుకే కృత్రిమ పరిష్కారాల ముగింపుల్లేవు. రచయిత కథల్లో ప్రస్తావించిన సమస్యలు యేవీ కూడా ఆమె వూహా జనితాలు కావు. సమాజంలో మనం నిత్యం చూస్తున్నవే. కానీ ఆమె వాటిని గుర్తించింది. వాటిని భిన్నకోణాల్లోంచి విశ్లేషిస్తుంది. తీగల్లా కాళ్ళకు చుట్టుకొని సమాజ ప్రగతికి ప్రతి క్షణం అడ్డుపడుతున్న వాటిని తొలగించుకోవాల్సిన అవసరాన్ని గ్రహించి తన హృదయాన్ని మనతో పంచుకుంటుంది. కాకుంటే దారి పక్క గడ్డిపూల్లా నిర్లక్ష్యానికి గురైన బాలల దుస్థితికి కారకులెవ్వరని మాత్రం బలంగా నిలదీసి ప్రశ్నిస్తుంది.

‘పసివాడని ఈ కుసుమాలు కర్కశ మృగాల చేతిలో చిక్కి మనసు , శరీరం మానని గాయాలయి , పచ్చిపుండులా సలుపుతా వుంటే … బిచ్చగాళ్ళుగానో వేశ్యలగానో బానిసలగానో దుర్భరంగా బతుకుతున్నారంటే అందుకు బాధ్యులెవరు?’ ( నిప్పుల నడకలోంచి …. కల్యాణి ) అన్న మాధురి గొంతు రచయిత్రిదే.

హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియా చేతుల్లో పడి కల్యాణి లాంటి ఆడపిల్లలు పాలుకారే పసి వయస్సులోనే అంగడి సరుకులుగా మారుతున్న స్థితినీ కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులే పిల్లల్ని ఆ నరకకూపాల్లోకి నెట్టే అమానవీయతనీ చూసి కంటనీరు పెట్టుకొని లాభంలేదనీ యీ నిప్పుల గుండాల్ని నిర్మూలించాలనీ సూచిస్తుంది.
పాపం పుణ్యం ప్రపంచమార్గం కష్టం సౌఖ్యం శ్లేషార్థాలు యేమీ యెరుగని పసికూనల నిష్కల్మష హృదయాల్ని కలుషితం చేసి సంతోష సమయాల్ని మాయం చేస్తున్న శక్తుల పట్ల అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని సైతం ఆమె అడుగడుగునా గుర్తుచేస్తుంది. అందాన్ని చర్మం రంగుతో ముడివెట్టి నిర్వచించే పెద్దల ఆలోచనలూ ఫెయిర్ నెస్ క్రీముల యాడ్ లూ పిల్లల మనసులపై చూపే ప్రభావాన్ని బలంగా చెప్పిన ‘ఈ కర్రె తమ్ముడు నాకొద్దు’ వంటి కథలు రచయిత్రి అంతరంగాన్ని ఆవిష్కరించడంతో ఆగిపోక ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రచారమౌతోన్న అటువంటి భావజాలాన్ని అడ్డుకోవాల్సిన అవసరాన్నితెలియజెబుతాయి.

ప్రపంచీకరణ ప్రభావంలో మనది కాని సంస్కృతిలోకి పసిపిల్లల్ని నడిపిస్తున్న సామాజిక వాతావరణానికి కారణమయ్యే అదృశ్య శక్తుల్నీ బాహ్యాభ్యంతర రాజకీయాల్నీ శాంతి ప్రబోధ స్పష్టంగా తరచి చూస్తుంది. ఇంటా బయటా పిల్లలు యెదుర్కొంటున్న అనేక వైరుధ్యాలవల్ల జనించే కన్ఫ్యూజన్ తో శారీరిక మానసిక రుగ్మతలకు గురై వర్చ్యుయల్ ప్రపంచానికి దగ్గరయి చుట్టూ వున్న మనుష్యులకు దూరం కావడం గురించి వాపోతుంది (హైటెక్ క్రీడల నీడల్లో… ). స్కూళ్ళ పక్కనే గేమింగ్ సెంటర్స్ హుక్కా బార్లు జూద గృహాలు వైన్ షాపులు డ్రగ్ దందాలు నిర్వహించే వాళ్ళమీదా వాళ్లకి కొమ్ముకాస్తున్న వ్యవస్థలపై ఆగ్రహం ప్రకటిస్తుంది. అయితే యెందుకో ఆమె స్వరంలో యెక్కడా కాఠిన్యాన్ని చూడం. చాలా సున్నితంగా పెంచుకోవాల్సిన సంస్కారాల గురించి పంచుకోవాల్సిన ఆనందాల గురించి శాంతంగా నచ్చచెప్పే ధోరణినే గమనిస్తాం. క్రోధాన్ని వేదన ఆవేశాన్ని ఆలోచన అసహనాన్ని సంయమనం విసుగుని వివేచన కసిని దయ డామినేట్ చేస్తాయి. అది రచయితగా ఆమె వ్యక్తిత్వంలోని పార్శ్వమని బాగా దగ్గరగా చూసినవాళ్ళు చెప్పగలుగుతారు. అందుకే కథల్లో వాదోపవాదాలు వుండవు. తీవ్ర ధ్వనులు వినిపించవు. పదునైన పలుకులు కనిపించవు. వాగ్యుద్ధాలు వుండవు. కానీ సారంలో అభివ్యక్తి బలంగానూ స్థిరంగానూ చురుగ్గానూ వుంటుంది. తప్పటడుగుల బాల్యం , మానవత్వపు చిగుళ్ళు , హైటెక్ క్రీడల నీడల్లో … కథలు అందుకు మంచి వుదాహరణలు.

‘తప్పటడుగుల బాల్యం’ కథ చదువుతుంటే వొళ్ళు గగుర్పొడుస్తుంది. స్వతంత్ర వ్యక్తిత్వంతో తోటివారి పట్ల దయతో పనులు విషయంలో యెంతో బాధ్యతతో ప్రవర్తించే చంద్ర లాంటి పిల్లల్ని తప్పటడుగులు వేయించే స్వార్థ శక్తుల నుంచి కాపాడుకోవడం యెలా అన్న ముగింపు వూపిరాడనివ్వదు. అనేక వుద్వేగాల్ని నియంత్రించుకొంటూ కార్య కారణ సంబంధాల గురించి లోతుగా ఆలోచింపజేసే యీ కథ నిర్మాణంలో రచయిత్రి చూపిన నేర్పు ప్రశంసనీయం. ఆ నేర్పు వల్లే కల్పనకి తావులేని చంద్ర గణేష్ మణి సతీష్ సరోజ్ వంటి భిన్న నేపథ్యాలకి బాలల నిలువెత్తు రూపాల్ని గుర్తుండేలా చిత్రించగల్గింది. అతి పిన్న వయస్సులోనే వాళ్ళ వ్యక్తిత్వాలు అలా రూపొందడానికి కారణమయ్యే వ్యవస్థలపైకి పాఠకుల దృష్టి మళ్లేలా చేసింది.

బాలల హక్కులగురించి మాట్లాడేటప్పుడు ఆ హక్కుల్ని హరించే వ్యక్తులగురించి వ్యవస్థల గురించి మాట్లాడేటప్పుడు శాంతి ప్రబోధ చూపు తీక్ష్ణంగా వుంటుంది. పైకి సాదా సీదాగా కనిపించే అంశాల్ని ప్రస్తావిస్తూనే వాటి సామాజిక రాజకీయ మూలాల్లోకి తవ్వుకుంటూ వెళ్ళడం చూస్తాం. ఆ క్రమంలో సమాజాన్ని సెన్సిటైజ్ చేయడానికి సాహిత్యం మంచి సాధనంగా వుపయోగ పడుతుందనే స్పృహతో రాసిన కథ ‘లంచ్ టైం’. స్వచ్ఛ భారతంలో పాఠశాలల్లో సరైన వసతుల్లేక మరుగుదొడ్లు లేక వున్నా నీళ్ళు లేక యెదిగే ఆడపిల్లల ప్రత్యేక అవసరాల పట్ల శ్రద్ధ చూపేవాళ్ళు లేక చెప్పుకోలేని యిబ్బందులకు గురయ్యే టీనేజ్ బాలికల ‘లంచ్ టైం’ సంభాషణ తల్లిదండ్రులకూ వుపాధ్యాయులకూ పాలకులకూ మొత్తం సమాజానికే కనువిప్పు కలిగిస్తుంది. ఒక సమస్యకున్న అనేక కోణాల్ని పిల్లల మాటల్లోనే చర్చించడం యీ కథలో టెక్నిక్. సింగిల్ పాయింట్ కథే అయినప్పటికీ సమస్య పొరల లోతుల్లోకీ దాని బాహ్యావరణంలోకీ యేకకాలంలో విస్తృతంగా దృష్టి సారించడంవల్ల వస్త్వైక్యత దెబ్బ తినలేదు.

కుటుంబాలకు కుటుంబాలు వూళ్లకు వూళ్ళు తాగుడు వ్యసనానికి బానిసలై పిల్లల జీవితాల్ని నాశనం చేస్తుంటే పాలకులే అందుకు దోహదం చేస్తుంటే కడుపు తరుక్కుపోయే దు:ఖంతో రాసిన రెండు కథలు ఆకాశ నేత్రం , ఓ సారూ … మా గోస వినుకో సారూ …

‘ఆకాశ నేత్రం’ వొక ఆర్త గీతం. కుటుంబాల్ని విచ్చిన్నం చేయడానికి మద్యం యే విధంగా కారణమౌతుందో తెలియజేస్తుంది. గుండెలు పిండేలా చెప్పిన యీ కథలో వొక సందర్భంలో సారాతో ముడివడ్డ వోట్ల రాజకీయాల ప్రస్తావన వస్తుంది. కానీ ‘ఓ సారూ … మా గోస వినుకో సారూ …’ మాత్రం పూర్తిగా పొలిటికల్ స్టోరీ. ప్రభుత్వాల మద్య విధానంపై యెటువంటి సంకోచం లేకుండా సూటిగా నేరుగా యెక్కుపెట్టిన అస్త్రం. గీత కార్మికులకు వుపాధి కల్పిస్తున్నామనే నెపంతో చెట్ల కల్లుని తాగమని ప్రోత్సహిస్తున్న అశాస్త్రీయ వైఖరిని పిల్లలే యెండగడతారీ కథలో. కల్తీ చేయకుండా రోజుకు లక్షల గేలన్ల కల్లు వుత్పత్తి చేయడానికి అన్ని చెట్లు యెక్కడున్నాయని అడుగుతూ ‘మా ఊర్లను బొందలగడ్డలు గాకుంట’ మా తల్లి దండ్రుల్ని తాగుడు వ్యసనం నుంచి తప్పించి మా బతుకులు కాపాడమని యేలికకు విన్నవించుకుంటారు. పిల్లల ముఖత: వెలువడ్డ యీ మౌలికమైన ప్రశ్నకి సమాధానం యివ్వకుండా తప్పించుకోవడం యిక యెంతో కాలం సాధ్యం కాదనే తీవ్రమైన హెచ్చరిక యీ కథలో విన్నపం వెనక దాగి వుంది.

చాలా పాజిటీవ్ అంశం యేమంటే యీ కథల్లో రచయిత యెక్కడా బాలల పట్ల సానుభూతిని కోరడం లేదు; సహానుభూతిని ఆశిస్తున్నారు. అయితే అది తెచ్చిపెట్టుకున్నది కాకూడదనీ సహజానుభూతిగా వుండాలనీ బలంగా విశ్వసిస్తున్నారు. సమస్యల పట్ల బాధితుల పట్ల సంవేదన శీలంగా వుండడమే రచయితగా శాంతిప్రబోధ జీవలక్షణం అని కథలు చదువుతోన్నంతసేపూ అనిపిస్తుంది. దాన్నే ఆమె తన పాత్రలకి ఆపాదించింది. పిల్లల హృదయాల్లో ప్రేమ దయ సమత్వ భావన వంటి మానవీయ గుణాలు విలువలు విత్తాలి అంటే ముందు వాళ్ళ పెంపకంలో వ్యక్తిత్వ వికాసంలో కీలక పాత్ర పోషించే తల్లిదండ్రులు వుపాధ్యాయులు స్వయంగా వాటిని పెంపొందించుకోవాలని మానవత్వపు చిగుళ్ళు , గడ్డి పువ్వు- గుండె సందుక కథల్లో స్పష్టం చేసింది.
***

తన కార్య క్షేత్రాన్ని కథాక్షేత్రంతో జోడించే పనిలో శాంతి ప్రబోధ యెక్కడా వొక సంస్కర్త పాత్రని పోషించలేదు; కొండ పైకి యెక్కి బోధించడానికి పూనుకోలేదు; యెదుటి వాళ్ళని వుద్ధరిస్తున్నామని ఆధిపత్యాన్ని ప్రదర్శించలేదు. అందుకే కథల్లో బాలలకు ఆసరాగా నిల్చిన పాత్రలు సహజ సిద్ధమైన ప్రేమతో ప్రవర్తిస్తాయి. బాధ్యతతో వ్యవహరిస్తాయి. నిబ్బరంగా వుంటాయి. పిల్లల యెదుగుదలకు అన్ని విధాలా దోహదం చేస్తాయి. తమ ఆచరణ ద్వారా సరైన దారి చూపుతాయి. ఆదర్శంగా నిలుస్తాయి. బాలల బంగారు భవిష్యత్తు కోసం స్వప్నిస్తాయి. ఆ యా సందర్భాల్లో మనకు తేలీకుండానే –

‘మీ హాసంతో వెలుగులు తీరును
వచ్చేనాళ్ల విభా ప్రభాతములు’
అన్న శ్రీ శ్రీ శైశవగీతం గుర్తుకు వస్తుంది. గుండె నిండా ఆశ కంటి నిండా తడి మెదుల్తాయి.

పిల్లల్నీ వారి అమాయకమైన బాల్యాన్నీ నిండు మనస్సుతో ప్రేమించే వాళ్ళే గదా యింత అందమైన కవితలైనా కథలైనా రాయగలరు. అయితే పిల్లల ముందు చేతులు కట్టుకొని నిలబడి వాళ్ళ ఆకాంక్షల్ని వారినుంచే తెలుసుకొని వాటిని తన కలంలోకి – ఆచరణలోకి వొంపుకోవడం శాంతి ప్రబోధ ప్రత్యేకత.
బాల్యం కావొచ్చు జీవిత శకలం మరేదైనా కావొచ్చు స్వీయ అనుభవాల్ని కథీకరించం సులభమే. ఆ పరిధి నుంచి బయటపడి చుట్టూ వున్న సమాజంలోని వైరుధ్యాల్నీసంక్లిష్టతనీ చలనాన్నీ అర్థం చేసుకొని విస్తృతమై నడిచే క్రమంలోనే ప్రతిభా సంపన్నులైన రచయితల చేతిలో గొప్ప కథలు రూపొందుతాయి. అయితే నడక అంత సాఫీగా సుఖంగా హాయిగా జరిగేదేం కాదు. రాళ్ళూ ముళ్ళూ గతుకులూ గొప్పులూ గుంతలూ తప్పవు. ఆ మార్గంలో స్వచ్ఛదంగా యిష్టంగా దీమాగా పయనిస్తోన్న రచయిత శాంతి ప్రబోధ.

గడ్డిపూల పరిమళాన్ని గుండె సందుకలో నింపుకొని బాల్యం యెవరికీ తప్పిపోగూడదని గొప్ప ఆర్తితో తపనతో యీ కథలు అందిస్తోన్న రచయిత్రిని మనసారా అభినందిస్తూ … ఆమె కలం నుంచి మరిన్ని మంచి కథలు ఆశిస్తూ …

హైదరాబాద్, ఎ కె ప్రభాకర్
జూలై 18, 2017.

You Might Also Like

3 Comments

  1. Chandranaga Srinivasa Rao Desu

    శాంతి ప్రబోధ గారి ప్రత్యేకతల్ని అద్భుతంగా వివరించారు……..ప్రభాకర్ గారికి అభినందనలు!!!!

  2. Mukundaramarao

    అద్భుతంగా ఉంది ..రచయిత శాంతి ప్రబోధ గారికి, ప్రభాకర్ గారికి అభినందనలు ..

    ముకుంద రామారావు
    హైదరాబాదు

    1. శాంతి ప్రబోధ

      Thank you Sir

Leave a Reply