నా 2017 పుస్తక పఠనం

మరో ఏడాది ముగుస్తోంది. ఈ ఏడాదిలో చదివిన పుస్తకాల గురించి రెండు ముక్కలు చెప్పుకోవడానికి ఈ టపా. ముఖ్యమైన సంగతులేమిటంటే:
* ఈ ఏడాది ఎక్కువ పుస్తకాలు చదవలేదు కానీ, ఉన్నంతలో కొందరు రచయితలు బాగా ఆలోచింపజేశారు.
* ఇదివరలో బాగా నచ్చిన ఒకరిద్దరు నవలాకారుల తాజా నవలలు బాగా నిరాశకు కూడా గురిచేశాయి.
* అలాగే, ఈ ఏడది రిపీట్ మోడ్ లో కొన్ని గత మూడు నాలుగేళ్ళలో చదివినవి మళ్ళీ చదివాను (అన్నీ అద్భుతాలని కావు – కాలక్షేపానికి, అంతే).
* ఒక రెండేళ్ళ బట్టి పెద్దగా తెలుగు పుస్తకాలు చదవలేదు కానీ, ఈ ఏడాది కొంచెం పర్వాలేదు.

ఇక ఏం పుస్తకాలన్న వివరాల్లోకి వెళ్తే:
(పుస్తకం గురించి నేను పరిచయం రాసి ఉంటే దాని లంకె ఆ పుస్తకం పేరుకి జోడించాను)

కథలు
* చిన్న కథలు – విశ్వనాథ సత్యనారాయణ – కొన్ని కథలు అర్థం కాలేదు కానీ, అర్థమైనవి మట్టుకు ఆకట్టుకున్నాయి. కొత్తగా అనిపించాయి, ఏ డెబ్భై ఏళ్ళ క్రితానివో అయినా కూడా.
* పొత్తూరి విజయలక్ష్మి హాస్య కథలు
* స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది సినిమా తియ్యండి! – పొత్తూరి విజయలక్ష్మి
– కొన్ని కథలకి, కథల్లోని సన్నివేశాలకీ బాగా నవ్వొచ్చింది కానీ కొన్ని మట్టుకు బలవంతంగా నవ్వించాలని నానాయాతనా పడుతున్నట్లు అనిపించాయి. కానీ, కాలక్షేపానికి మట్టుకు బాగున్నాయి.

* The Grown Up – Gillian Flynn – ఈ రచయిత్రి రాసిన మూడు నవలలు గత మూడు-నాలుగేళ్ళలో చదివి నచ్చి ఉండడం చేత ఇది చదివాను. కానీ, పెద్దగా ఆకట్టుకోలేదు.

* The defenders and three others – Philip K. Dick
* Collected short stories of Philip K.Dick, Volume 4
బ్లేడ్ రన్నర్ సినిమాకి వెళ్ళినపుడు కొన్ని సన్నివేశాల గురించి కుతూహలంతో చదువుతూంటే పాత బ్లేడ్రన్నర్ ఈ రచయిత కథ ఆధారంగా తీశారని తెలిసింది. అలా ఆయన కథలు చదవడం మొదలుపెట్టాను. రెండో పుస్తకంలో అన్నీ ఇంకా చదవలేదు కానీ – కథలైతే కొత్తగా, వింతగా, భయానకంగా – ఇలా రకరకాలుగా ఉన్నాయి. కొన్ని సైన్సు ఫిక్షన్, కొన్ని dystopian future వంటి కథాంశాలు (కొన్నింట్లో రెండూ!). ఈయన నవల ఆధారంగానే తీసిన The Man in the High Castle టీవీ సీరీస్ కూడా చూస్తున్నానీమధ్య. అందువల్ల వచ్చే ఏడాది ఈయన కథలు, ఇతర రచనలూ చదివే అవకాశం ఎక్కువే.

* Take us to your chief and other stories – Drew Hayden Taylor – ఒకరోజు అనుకోకుండా లైబ్రరీలో న్యూ-అరైవల్స్ సెక్షన్ ద్వారా పరిచయం అయిన పుస్తకం. తరువాత ఈ రచయిత రాసినవి మూడు నాలుగు ఇతర పుస్తకాలు కూడా చదివి, రచయితని ట్విట్టర్ లో వెంబడించి, మళ్ళీ ఆయన గురించి అడిగిన వారికీ, అడగని వారికీ చెప్పి – ఇలా నడిచింది నాకు. కథల గురించి ఇదివరలో పుస్తకం.నెట్లో పరిచయం చేశాను.

* Gold: The final science fiction collection – Isaac Asimov
అసిమోవ్ రచనల చివరి సంకలనం – కథలు, ఆయన రాయడం గురించి, సైన్స్-ఫిక్షన్ రాయడం గురించీ రాసిన వ్యాసాలు ఉన్నాయి. కథలు కొన్ని నాకు చాలా నచ్చాయి, చాలా ఆలోచింపజేశాయి. వ్యాసాలైతే చెప్పక్కర్లేదు. ఏదో మూడు-నాలుగు పేజీలకి మించకపోయినా బోలెడు సమాచారం ఉంది. క్లుప్తంగా విషయమంతా చెప్పడంలో ఈయన పరమ నైపుణ్యం కలవాడు. ఈ పుస్తకం ఏడాది పొడుగుతా చదువూనే ఉన్నాను – కథలూ, వ్యాసాలూ కూడా. దాదాపు ప్రతి కథా ఓ రెండుసార్లైనా కనీసం చదివి ఉంటాను. వివరంగా రాయాలనుకుని ఇప్పటిదాకా రాయలేదు. వచ్చే ఏడాదికి రాస్తానేమో.

* Stories of your life and others – Ted Chiang
“అరైవల్” సినిమా రావడానికి రెండు మూడు నెలల ముందు మా కొలీగ్ ఒకాయన ఈయన గురించి చెప్పాడు -ఆ కథ ఈయన రాసినదే అని. తర్వాతెప్పుడో చాలా నెలలకి నేను ఈయన కథల సంకలనం మొదలుపెట్టాను. అసిమోవ్ క్లుప్తంగా చెప్పడం లో నిపుణుడంటే ఈయన ఆయనకి ఆవలి ధృవం. ఒక్కో కథా ముప్ఫై పేజీలకి తగ్గకుండా ఉంటుంది. కానీ, అన్నీ నాకు సంబంధించినంతవరకూ కొత్త కథాంశాలు, ఒకదానికొకటి సంబంధం లేకుండా విభిన్నంగా ఉన్న అంశాలు. నిడివి పెద్దదంటే అనవసర వర్ణనల వల్ల కాదు – ఆ కథాంశాలు అంత వివరంగా రాయవలసినవి కనుక! ఒకట్రెండు కథలు మళ్ళీ చదివాను కానీ, ఈయన రచనలు ఆస్వాదించాలంటే చాలా ఖాళీ సమయం కావాలి.

మొత్తానికైతే ఈ ఏడాదిలో చదివిన నలుగురు సై-ఫై రచయితలు నాలుగు రకాల కథలు రాశారు. అన్నీ బాగున్నాయి.

నవలలు
* Miss Peregrine’s Home for Peculiar Children (Miss Peregrine’s Peculiar Children, #1) – Ransom Riggs
* Hollow City (Miss Peregrine’s Peculiar Children, #2) – Ransom Riggs
– ఈ రచయిత రాసిన నవలా త్రయం గత రెండేళ్ళలో కొంత పేరు తెచ్చుకుంది. మా పబ్లిక్ లైబ్రరీలో దాదాపుగా మొత్తం కాలం ఎప్పుడు చూసినా పుస్తకాలు అరువు తీసుకోడానికి ఉండేవి కావు. ఈ బిల్డప్ చూసి చివరికి అరువుకి దొరగ్గానే తెచ్చేసుకున్నాను. కానీ, చాలా సాధారణంగా ఉన్నాయి. తీనేజీ కుర్రాడిగా Christopher Paolini రాసిన Eragon ఈ పుస్తకాల కంటే ఎన్నోరెట్లు నయం. బాగా పేరొందిన ఇతర ఫాంటసీ నవలల నుండి అక్కడోటీ ఇక్కడోటీ ఎత్తుకొచ్చి ఫొటోల సాయంతో కుట్టినట్లు ఉన్నాయి రెండు పార్టులూ. దెబ్బకి మూడో పార్టు చదవలేదు.

* Hitman Anders and the meaning of it allx – Jonas Jonasson
ఈ రచయిత గతంలో రాసిన రెండు absurdగా అనిపించే కథాంశాలతో వచ్చిన నవలలు నాకు చాలా నచ్చాయి. అందువల్ల దీని గురించి తెలియగానే లైబ్రరీలో అరువు తీసుకున్నాను. అయితే, చూడబోతే ఒకే కథని పది పేర్లతో, ఇరవై మంది నటులతో మళ్ళీ మళ్ళీ తీసే గౌతం మీనన్ లాగా ఇతగాడు సన్నివేశాలూ అవీ మార్చినా కూడా అదే పద్ధతిలో సాగే కథలతో జీవితాన్ని గడిపేలా ఉన్నాడనిపించింది. బోరు కొట్టింది absurdity కూడా.

* The girl on the train – Paula Hawkins
ఇది కూడా పైన Ransom Riggs పుస్తకాల్లాగే చాలారోజులు లైబ్రరీలో అద్దెకి దొరక్కుండా ఊరించిన పుస్తకం. పెద్ద గొప్పగా అనిపించలేదు నాకు.

* Version Control – Dexter Palmer
విభిన్నమైన కథాంశంతో సాగిన సైన్సు ఫిక్షన్ నవల. సెల్ఫ్-డ్రైవింగ్ కార్లు, ఆన్లైన్ పర్సనాలిటీ మాడళ్ళు, టైం ట్రావెల్ చేసే మెషీన్ (దాన్ని అలా అనరు లెండి కథలో!), ఇలా రక రకాల అంశాలు కథలో ఉన్నాయి. కొంచెం క్లిష్టంగా ఉంది – కాలక్షేపానికి చదవలేం – దృష్టి పెట్టి చదవాలి. కానీ మంచి సృజనాత్మకత.

* Mr. Penumbra’s 24-Hour Bookstore – Robin Sloan
సాహిత్యాన్వేషకుల కథే అయినా నవలలో గూగుల్ డిజిటల్ బుక్స్ ప్రాజెక్టు, విజువలైజేషన్ సాఫ్ట్వేర్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజీలపై చర్చ – ఇవన్నీ వస్తాయి, సమకాలీన techie లని ఆకట్టుకునే విధంగా. అయితే, ఇలా మొదటి సగంలో రేకెత్తించిన ఆంచనాలను ఈ నవల రెండో సగంలో అందుకోలేకపోయిందని నాకు అనిపించింది.

గ్రాఫిక్ కథలు/నవలలు
* The Impostor’s Daughter: A True Memoir
గ్రాఫిక్ ఆత్మకథ. రచయిత్రి తన తండ్రి గురించి, ఆయన వెనుక ఉన్న మిస్టరీ గురించి చెబుతూ రాసిన కథ. మిస్టరీ తాలూకా అసలు విషయం ఇప్పటిదాకా తెలియకపోవడం నాకు పెద్ద సస్పెన్స్ ఇందులో. కథలో బొమ్మల కన్నా, రచయిత్రి మాటలకన్నా ఈ నిజజీవితపు మిస్టరీనే నన్ను చాలా రోజులు వెంటాడింది.

నాటకాలు
* The Bootlegger blues – a play: Drew Hayden Taylor
నేటివ్ అమెరికన్/కెనేడియన్ పాత్రలతో నాటకం. పూర్తిగా ఆ నేటివిటీ తో సాగింది. నాక్కొన్ని సాంస్కృతికాంశాలు అర్థం కాలేదు కానీ, ఆసక్తికరంగా అనిపించింది.

ఆత్మకథలు, జీవితచరిత్రలు
* ఇదీ నా గొడవ – కాళోజీ
నాకు చాలా నచ్చింది. ముఖ్యంగా “నా యిజం” కవితనైతే నాకొచ్చినంత ఆంగ్లానువాదం చేసుకుని రెండు భాషల్లోనూ నా ఆఫీసు గదిలో అతికించి పెట్టుకున్నా.

* బతుకుబాటలో కొండగుర్తులు – భద్రిరాజు కృష్ణమూర్తి
ఈ పుస్తకం కూడా అసంపూర్ణమే అయినా చాలా విషయాలు తెలిశాయి. కృష్ణమూర్తి గారి రచనలు కొన్నైనా చదవాలనిపించింది.

* ఇదండీ నా కథ – ఎ.జి.కృష్ణమూర్తి
ఈ కృష్ణమూర్తిగారి రచనలు ఇదివరలో పత్రికల్లో చూశాను కానీ, పుస్తకం చదవడం ఇదే మొదటిసారి. వ్యాపారపరంగా అన్ని విజయాలు పొందినప్పటికీ, పుస్తకం మట్టుకు ఎవరో మన పక్కింటి రిటైరైన మధ్యతరగతి పెద్దాయన వచ్చి అనుభవాలు చెబుతున్నట్లు చాలా మామూలు భాషలో, ఆడంభరాలూ, భేషజాలూ లేకుండా రాశారు.

* నా ఎఱుక – ఆధిభట్ల నారాయణదాసు
భాష కష్టంగా ఉంది కానీ, పుస్తకం మట్టుకు నచ్చింది.

* కాశీయాత్ర – చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి
ఇంకొంచెం వివరంగా రాసి ఉంటే బాగుండనిపించింది. ఈ రెండు పుస్తకాలకూ కొంచెం వ్యాఖ్యానం జతచేసి సంపాదకత్వం వహించినది మోదుగుల రవికృష్ణ గారు. చదివినప్పుడు వారిని సంప్రదించి పుస్తకం.నెట్ కోసం ఇంటర్వ్యూ ఇవ్వమని అడిగాను కానీ, కుదర్లేదు. ఈ ఏడాది ప్రయత్నించాలి.

* When breathe becomes air – Paul Kalanithi
ఈ పుస్తకం కూడా చాలారోజులు లైబ్రరీలో అరువుకి దొరకలేదు. ఈమధ్యనే దొరికింది. అంత హైప్ తరువాత చదివినందుకేమో – అంత విపరీతంగా నచ్చలేదు. “How can you not like it?” అంటారా? Randy Pausch రాసిన “The Last Lecture” చదివారా?

* Ants Among Elephants: An Untouchable Family and the Making of Modern India – Sujata Gidla – నేను ఊహించిన స్థాయిలో లేకపోయినా, చివరి దాకా చదివించిన పుస్తకం.

* Little Heathens: Hard Times and High Spirits on an Iowa Farm During the Great Depression – Mildred Armstrong Kalish – ముప్పైల నాటి అయోవా పల్లెటూరిలో, Great Depression తరువాతి రోజుల్లో ఒక పెద్ద వ్యవసాయ కుటుంబం వారి జీవన శైలిని గురించిన పుస్తకం. ఇప్పట్లా కాకుండా అన్నీ వాళ్ళే సొంతంగా తయారు చేస్కోవాల్సి వచ్చేది కనుక కుటుంబంలోని అందరికీ ఏదో ఒక పని ఉండేది. వీటి గురించి పరమ వివరంగా రాసింది పెద్దావిడ. మా తాత రెండో ప్రపంచ యుద్ధం కాలంలో మద్రాసులో వాళ్ళ చిన్నతనం గురించి మనం విన్నామా లేదా పట్టించుకోకుండా చెప్పుకుపోతూ ఉంటాడు ఒక్కోసారి. అలాగే ఉందీ పుస్తకం. కానీ, మధ్యలో అనేకం ఆసక్తికరమైన సంగతులు ఉన్నాయి – అప్పటి ఆంగ్లా idioms కొన్ని ఇప్పటివాళ్ళు, ఇప్పుడు అరవై ఏళ్ళ వాళ్ళు కూడా తెలియవన్నారు నేను వాకబు చేస్తే. ఇలాంటి వాటి గురించి, అప్పటి వంటకాలు, పండుగలు – ఇలా చాలా సంగతులున్నాయి. కాంటెక్స్ట్ లేకపోతే బోరు కొడుతుంది కానీ, ఇలాంటివి ఆసక్తి ఉంటే బోలేదు విషయాలు తెలుస్తాయి. అయోవా పేరు చూసి మాత్రమే కొన్నాను పుస్తకాన్ని. వేరే ఏ కారణం లేదు. అప్పట్నుంచి మా తాత చెప్పే ఆత్మకథ రికార్డు చేయమని మా అమ్మని పోరు పెట్టడం మొదలుపెట్టాను.

* The Autobiography of Alice B. Toklas – Gertrude Stein
ఈ పుస్తకం ఒక ప్రయోగం అనే చెప్పాలి. Gertrude Stein సహచరి Alice B.Toklas తన ఆత్మకథ రాసుకున్నట్లు సాగుతుంది పుస్తకమంతా. Gertrude Stein ప్రాస్తావన పేజి పేజీకీ ఉన్నా కూడా ఆమె రెండో మనిషి అన్నట్లే ఉంటుంది. కాని, పుస్తకాన్ని Gertrude Stein ఆలిస్ దృక్కోణంలో ఊహిస్తూ రాసింది. బాగా వెరైటీ పుస్తకం. Midnight in Paris సినిమాని రెండుమూడుసార్లు చూశాక ఆ మోజులో ఈ పుస్తకాన్ని, ఈ వెరైటీ ఊపులో Stein రచన Tender Buttons ని కొన్నాను. చివరిది మాత్రం ప్రస్తుతానికి మింగుడు పడలేదు.

వ్యాసాలు వగైరా
* వావిళ్ళ వారి వాఙ్మయసేవ – బులుసు వేంకటరమణయ్య
-పుస్తకం ఆలోచన గొప్పది కానీ, వావిళ్ళ ప్రచురణల జాబితా రాసినట్లు ఉంది. అందునా చదువరులంతా ఇదివరకే వీళ్ళ చరిత్ర అంతా తెలిసిన వాళ్ళు అని అనుకున్నారల్లే ఉంది.

* Funny You Don’t Look Like One: Observations of a Blue-Eyed Ojibway (Funny You Don’t Look Like One #1)
* Further Adventures of Blue Eyed Ojibway (Funny You Don’t Look Like One #2)
-Drew Hayden Taylor
ఈ రచయిత సైన్స్ ఫిక్షన్ కథలు చదివాక ఈ వ్యాస సంకలనాలు మొదలుపెట్టాను. రెండింటిలోనూ తెల్లవారిపై పదునైన ఎత్తిపొడుపు, వ్యంగ్యాస్త్రాలు కోకొల్లలు. ఈయన రచనలు చదివాకే నాకు భారతదేశంలో దళితులు, ఆదివాసీల సమస్య ఏమిటన్నది కొంచెం అర్థం అయినట్లు అనిపించింది. ఇదివరలో పరుష పదాలతో అనవసరంగా ఇతర కులాలలో పుట్టీనవాళ్ళని దూషించే దళిత మేధావుల వ్యాసాలు, పోస్టులు చూసి చిరాగ్గా అనిపించేది. ఈయన రచనలు చదివాక కొంచెం ఆ ఆగ్రహం అర్థమైంది – ఎవరైనా కాస్త తార్కికంగా రాసే కొందరి రచనలు (ఫేస్బుక్ పోస్టులు కాదు), సీరియస్ గా చదవాలి అనుకుంటూన్నాను. ఈ రచయితవి ఇంకా వ్యాస సంకలనాలు ఉన్నాయి కానీ, నాకు బొత్తిగా అమెరికా-కెనడా సాంస్కృతిక నేపథ్యం లేకపోవడం వల్ల చాలా వ్యాసాల్లో indirect cues అర్థం కావడంలేదని ఆపేశాను.

* In Search of Shiva: A Study of Folk Religious Practices in Pakistan – Haroon Khalid
-పేరులో చెప్పినట్లు పాకిస్తాన్ లో హిందూ మతానికి దగ్గరగా ఉన్న తెగలు, వాళ్ళ దేవుళ్ళూ, గుళ్ళూ, ఆచారాలు వగైరాల గురించి ఒక జర్నలిస్టు చేసిన ప్రయానాల వివరాలు. ఆసక్తికరంగా అనిపించింది కానీ, పెద్దగా ప్రభావితం చెయ్యలేదు.

* The Wonder that is Sanskrit – Sampadanand Mishra, Vijay Poddar
Sanskrit తాలూకా coolness గురించి నేటి యువతకి చెప్పడానికి రాసినట్లు అనిపించింది. కానీ, ఆట్టే ఆకట్టుకోలేదు. ఎక్కువ వివరణల్లేకుండా ఉన్నట్లుండి ఓ పద్యమో ఏదో తీసుకొచ్చి “ఇందులోని సొగసు చూశారా?” అనేసి, వెంటనే ఇంకో రకం దాన్లోకి వెళ్ళిపోడం – ఇలా ఉండింది. కనుక coolness గురించి ఇప్పటి తరానికి చెప్పడానికి సరిపోదేమో అనిపించింది.

సాంకేతికం
* Our Final Invention: Artificial Intelligence and the End of the Human Era – James Barrat
ఏం నచ్చలేదు నాకైతే. విపరీతమైన ఖంగారూ, భయం అందరికీ పంచడానికి కంకనం కట్టుకున్నట్లు ఉంది. ఇదివరలో Weapons of Math Destruction చదివినప్పుడు అది కొన్ని చోట్ల మరీ pessimistic గా ఉందన్నాను పోయినేడాది. కానీ, అందులో సరైన కారణాలతో వాదన ఉంది. ఇందులో pure panic అనిపించింది.

* Deep Thinking: Where Machine Intelligence Ends and Human Creativity Begins – Gary Kasparov
కాస్పరోవ్ కృత్రిమ మేధ గురించి, కంప్యూటర్ చెస్ గురించి చాలా వివరంగా విశ్లేషించాడు. నాకు చాలా నచ్చింది.

* The Bestseller Code: Anatomy of a Blockbuster Novel – Jodie Archer, Matthew Jockers
Topic Models అన్నవి ఏవన్నా పెద్ద డాక్యుమెంట్ల సేకరణలో themes/topics ఏంటి అన్నది Statistical methods సహాయంతో కనిపెట్టే ఒక రకం సాంకేతిక పద్ధతి. ఈ పుస్తకం ఆ పద్ధతి ఉపయోగించి వందలకొద్దీ నవలలని పరిశీలించి “బెస్ట్ సెల్లర్స్” మధ్య తరుచుగా కనబడే థీంస్ ఎలాంటివి? ఎన్ని ప్రధానాంశాలు ఉంటే బెస్ట్ సెల్లర్ అవుతుంది? ఇలాంటి ప్రశ్నలని అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తుంది. సాధారణంగా సాహిత్య విశ్లేషకులు చేసే పనిని కంప్యూటర్ ప్రోగ్రాం చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయన్న విశ్లేషణ. ఎందుకోగానీ వీళ్ళ వివరణలు అంతగా ఆకట్టుకోలేదు నన్ను. Topic modeling వెనుక ఉన్న అసలు ప్రొసీజర్ తెలియడం వల్ల కావొచ్చు – వీళ్ళు ఎంతో గొప్పగా చెబుతున్న conclusions అన్నీ నాకు సందేహాస్పదంగా అనిపించాయి.

ఇవి కాకుండా కొన్ని యద్దనపూడి సులోచనారాణి, బలభద్రపాత్రుని రమణి గార్ల రచనలు చదివాను కానీ ఏదో డెబ్భైల నాటి సెంటిమెంటు సినిమాలు చూస్తున్నట్లు అనిపించాయి అన్నీ – ఏదీ పెద్దగా ఆకట్టుకోలేదు. వృత్తిపరంగా చదివిన వాటిల్లో general reading గా లిస్టు చేయదగ్గవి లేవు ఈఏడాది. ప్రస్తుతానికి పోతన భాగవతం చదవడం మొదలుపెట్టాను కొన్ని రోజుల క్రితం. కనుక కొనసాగిస్తే బహుశా 2018 కి అదే పెద్ద చదువు కింద లెక్క!

You Might Also Like

One Comment

  1. ఫణీంద్ర పురాణపండ

    సగటున పది రోజులకు ఓ పుస్తకం….. __//\\__ .

    నేనేవో చిన్నా చితకా పుస్తకాలూ, పాత పుస్తకాల రివిజన్లూ తప్పితే, కొత్తగా చదివింది Origin (Dan Brown) ఒక్కటే.

    ఈ యేడాది మీ పఠనాభిరుచి ఐదు రోజులకు ఒక పుస్తకంగా సాగాలని, మీరు వాటన్నిటినీ మాకు పరిచయం చేయాలనీ కోరిక.

Leave a Reply