తంగేడు పూల బతుకమ్మలు

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్

(కొన్నాళ్ళ క్రితం భూమిక ప్రియాంక అనే యిద్దరు 12/13 సంవత్సరాల బంజారా ట్రైబ్ కి చెందిన బడి పిల్లలు ఇంటి నుంచి హాస్టలుకి వెళ్ళే దారిలోనో, మరెక్కడో అదృశ్యమై కొండ గుట్టల్లో శవాలై కనిపించారు. వాళ్ళ అకాలమరణం మీద వచ్చిన కవిత్వాన్ని డా.రాజారాం సంకలనం చేస్తే తెలంగాణా బంజారా రచయితల సంఘం ప్రచురించింది. డిసెంబర్ 3, 2017 ఆదివారం నాడు వరంగల్లులో ఆ పుస్తకం ఆవిష్కరణ జరుగుతోంది. ఈ పుస్తకానికి ఎ.కె.ప్రభాకర్ గారు రాసిన ముందుమాట ఈ క్రింది వ్యాసం. వ్యాసాన్ని పుస్తకం.నెట్ కోసం పంపినందుకు ప్రభాకర్ గారికి ధన్యవాదాలు.)
**********

ఇప్పుడు భూమ్యాకాశాల చిరునామా మారింది. అది స్వచ్ఛ భారతంలో బంగారు తెలంగాణాలో కమ్మాల కుంట తండానో మూడుచెక్కలపల్లి ఆశ్రమ పాఠశాలో కావొచ్చు. నింగికి నేలకు బహుదూరం. తండా నుంచి పల్లెకి చదువుల దూరం కొలవలేనిది. దారిపొడవునా యెన్ని పాకుడు మెట్లు – యెన్ని కాలనాగుల కాట్లు – యెన్ని మానవ హైనాలు తోడేళ్ళు – యెన్ని రక్త సిక్తమైన బొటనవేళ్ళు! ఒకప్పుడు ‘తండంటే దట్టమైన ప్రేమ పొదల గుంపు కాకి ప్రేమల జాడ, తండంటే తంగేడు పూల నవ్వు. రంగు రంగుల దెయ్యం వీథి మూల బార్లా కాళ్ళు చాపిన సీసా భూతాల స్మశానం అరచేతి మాయ తెర తండాలో తలదూర్చాకా రాజ్యం టంకశాలలో కురిసే పైసల వర్షానికి ఆమె.. సరుకే! అంగాంగం అలకరించి అంగట్లో ఊరించే దిగుమతి సంస్కృతి లైంగిక వస్తువే!’ నీలి చిత్రాల రాక్షస క్రీడాంగణమే.

అందుకే యిప్పుడు తండాలు, సంక్షేమ హాస్టళ్ళూ ఆడపిల్లల అంగళ్ళయ్యాయి. భూమ్మీద బంతిపూల్లాంటి భూమికలు, ఆకాశాన చంద్రవంకల్లాంటి ప్రియాంకలు పుడుతూనే యాడి వొడిలో పసికందులుగానే అమ్ముడుపోతారు. లేత పజ్జొన్న పాల వయస్సులోనే పట్టణాల్లో పనిపిల్లలవుతారు. మరింత ప్రాయం రాగానే తండా నుంచో హాస్టల్ నుంచో మాయమై నగరాల మార్కెట్లో అమ్మకపు సరుకవుతారు. లేదా కడుపులో పెరిగే పిండాలతో యే దూలానికో చెట్టుకోమ్మకో నిర్జీవంగా వేలాడతారు. లేత బుగ్గన చుక్కపెట్టి పెళ్లి చేస్తే మూడు పదులు దాటకుండానే వితంతువులవుతారు. ఆ ఆడకూతుళ్ళ గర్భసంచులు సరోగసీ కేంద్రాలకు అద్దెకొంపలవుతాయి.

ఇప్పుడు యిక్కడ యీ నేల మీద తండా పువ్వులు మొగ్గలుగానే రాలిపోతాయి. చదువుకుంటే భూమి నుంచి ఆకాశానికి యెగరొచ్చని ఆశపడ్డ స్వేచ్చావిహంగాల రెక్కలు ముక్కలై విరిగిపడతాయి. స్కూలు యూనీఫాంలే వూపిరి తీస్తాయి. పుస్తకాల్లో దాచుకున్న నెమలీకల్లాంటి కలలు తెల్లవారకుండానే ఛిద్రమౌతాయి. బడి బాట నరకపు తొవ్వని తెలీని చిన్నారులు , హాస్టలు ప్రాంగణం యమకూపమని యెరుగని మట్టి బిడ్డలు , చదువు ఖరీదు మానమనీ ప్రాణమనీ తెలీని పసికూనలు , తరగతి గదులు గురివింద నీతుల నిలయాలని వూహించలేని అమాయికలు నాగరిక సమాజానికి నెత్తుటి ప్రశ్నలు మిగిల్చి పోతారు. మహా అయితే నాలుగు రోజులు కాషాయ ఖద్దరు రాజకీయ నక్కల నోళ్ళలో నలిగి శీలానికి కొత్త భాష్యాలకు , నిర్వచనాలకు కారణమౌతారు. ఖాకీల కట్టుకథలకు వినూత్న వస్తు శిల్పాలౌతారు. దృశ్య శ్రవ్య మాధ్యమాల్లో సమస్యని తప్పు దారి పట్టించే పానల్ డిబేట్లవుతారు. అంతిమంగా బాధితులే యేదో రూపంలో నేరస్తులౌతారు. చట్ట సభల సాక్షిగా తమాషా చూస్తూ ‘హంతకుల్ని తన రెక్కల్లో పొదవుకొని కాపాడే రాజ్యం’ కులాసాగా విలాసంగా నవ్వుకుంటుంది. అందుకే యేళ్ళు గడిచినా అయేషా తల్లి షంషాద్ బేగంకి న్యాయం జరగదు. ప్రియాంక భూమికల లంబాడీ తల్లులు కమ్లీ యాకమ్మల గర్భశోకం తీరదు. కుక్కలు చీరిన తలలు మొండేల సాక్ష్యం చట్టానికి చాలదు.

కానీ ఖాదరుపేట గుట్ట మాట్లాడిన కుళ్ళిన శరీరాంగాల భాషని కుక్కలు అర్థం చేసుకొన్నాయి. సర్కారీ పోలీసుల కన్నా ఊర కుక్కలే నయం అని జనం మొత్తుకున్నారు. ఎంతైనా ‘కుక్కలు కుక్కలే నాయకులు నాయకులే’ (అన్వర్). పోలీసులు పోలీసులే. చుండూరు దళితుల్ని యెవరూ చంపలేదనీ వాళ్ళని వాళ్ళే నరుక్కొని గోనె సంచుల్లో మూటలు కట్టుకొని తుంగ భద్రలోకి నెట్టివేసుకున్నారని న్యాయమూర్తులు అభిప్రాయపడినట్టే భూమిక ప్రియాంకలు కూడా తమని తాము ముక్కలు చేసుకొని గుట్టమీద కుక్కలకి ఆహారంగా పొలి చల్లుకున్నారని రక్షకులు తీర్పునిస్తున్నారు.

ఎవరెన్ని చెప్పినా భూమిక ప్రియాంకల మరణానికి కారకులెవరు అని వాళ్ళ తల్లిదండ్రుల యింకా ప్రశ్నిస్తూనే వున్నారు. తండా దాటని వారి పీల గొంతులకు సామాజిక కవులు గళాల బలం అందిస్తున్నారు. ‘రాజకీయాలు – అధికార కేంద్రాలు – పురుషాధిపత్యాలకు బలైన ఆ చిన్నారుల స్మృతిలో…’ తెలంగాణ రచయితల వేదిక వరంగల్లు శాఖ ‘పోస్టర్ కవిత’ (18.10.2016) ప్రకటించింది.

యిప్పటికీ వచ్చిపోయే తీజ్ పండక్కి గుల్లలో అంకురించిన గోధుమ మొలకలు తలలెత్తి నేర వ్యవస్థకి చావు యెప్పుడని సామూహికంగా నిలదీస్తున్నాయి. ఆ గడ్డిపరకల ప్రశ్నల్నే కవులు తమ గొంతు గోడల మీద లిఖించుకొని నివాళిగా నినదిస్తున్నారు. గాయపడ్డ సమ్మక్క మాయమై చిలుకల గుట్టయి నిలిచినట్టు పదహారు ముక్కలైన చెల్లి బెల్లి లలిత బావిలో బతుకమ్మై తేలినట్టు (పిట్ట సాంబయ్య) బొడ్డెమ్మల్లాంటి బంజారా బిడ్డల్ని గుండె నిండా యాది చేసుకుంటున్నారు.

‘క్రయ విక్రయాల వ్యవస్థలో శరీరాల్ని అంగడి సరుకు’గా (రాహి) మార్చిన పితృస్వామ్య దౌష్ట్యాన్ని కవి గాయకులు ఛీకొడుతున్నారు. పాల బుగ్గల బాల్యం నీలి కామానికీ వ్యవస్థీకృత హింసకీ బలవుతున్న ఆధునిక సామాజిక వైపరీత్యాన్ని పోస్ట్ మార్టం (చింతం ప్రవీణ్) చేస్తున్నారు. ‘సామాన్యుల కడుపు మంట నేతల చలి మంట’ లౌతున్న వైనాన్ని నిరసిస్తున్నారు(సంధ్య). కంచే చేను మేసే చందాన్ని అభిశంసిస్తున్నారు (శోభారాణి). చండీ యాగాల వేల యజ్ఞ గుండాల్ని బలహీనుల రక్తంతో మండించే రాచరికపు సంస్కృతిని కన్నీటి ప్రశ్నల కొడవళ్ళతో (నవీన్ నాయక్, రాజారాం) శతధా ఖండిస్తున్నారు. నేరమే అధికారమైన సందర్భాన్ని అసహ్యించుకుంటున్నారు (అంబటి శ్రీధర్ రజు). ఉద్యమాల వెలితిని తీర్చే వెలుగురేఖల కోసం యెదిరి చూస్తున్నారు (బూరం అభినవ్). రోదితులకు స్తన్యమిచ్చి మళ్ళీ వస్తానని వెళ్ళిన దండకారణ్యాన్ని పునరావాహన చేసుకుంటున్నారు (వడ్డెబోయిన శ్రీనివాస్). ‘భూమి ప్రియమైన ఒడి నూతన మానవ శిశువు రూపొందే భూమిక అవుతుంద’ని (వరవరరావు) భూమ్యాకాశాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు.

పెండతట్ట చేతబట్టుకొని వెళ్ళి హత్యాచారానికి గురైన నక్కా ఆండాళ్ళమ్మ విషాదగాథ గ్రామీణ స్త్రీల గొంతులో బతుకమ్మ పాటయింది. ఇవ్వాళ యీ తండా తంగేడు పూల బతుకమ్మలకి దొరబిడ్డ కనుసన్నల్లో నడిచే బంగారు బతుకమ్మల సరసన చోటు లభిస్తుందో లేదో తెలీదు గానీ బంగారు తల్లుల యాది , ‘తీజ్ ల రోదన’ కవుల బృందగానంలో సేవాలాల్ పదమై యీ కవితల సంపుటి రూపంలో మన ముందుకు వచ్చి గుండె సలుపుతోంది. ప్రతి స్త్రీ భద్రకాళి కావాలనీ ‘కాలంబు రాగానే …’ కాటేసి తీరాలనీ హెచ్చరిస్తున్న ఆగ్రహ- ఆక్రందన స్వరాల్ని, కాలం చెక్కిలి పై ఘనీభవించిన కన్నీటి బిందువుల్ని వొకచోట చేర్చినందుకు నా బంజారా మౌఖిక కథనాల మిత్రుడు రాజారాం నిబద్ధతని అభినందిస్తూ …

చిన్నారి తల్లులు
సన్నజాజి పూల వల్లులు
భూమిక , పియాంకలకు అశ్రు నివాళితో …

You Might Also Like

One Comment

  1. Anil అట్లూరి

    చాలా ఆగ్రహంతోను, ఆవేశంతోను, ఆవేదనతో కూడిన Prabhakar Ak ముందు మాట ఇది!

Leave a Reply