పుస్తకం
All about booksపుస్తకాలు

November 21, 2017

నిర్వాసితుల వ్యథ – “పొద్దు ములిగిపోయింది”

More articles by »
Written by: అతిథి
Tags: ,

వ్యాసకర్త: కొల్లూరి సోమశంకర్
****************

అభివృద్ధి పేరిట జరుగుతున్న మాయ వల్ల ఊర్లకి ఊర్లు అదృశ్యమవడం ఇటీవలి కాలపు పోకడ. భారీ ప్రాజెక్టుల వల్ల ఎన్నో గ్రామాలు ముంపుకు గురయి, తమ ఉనికిని కోల్పోతున్న ఉదంతాలు అనేకం. ఊరే ఉనికిని కోల్పోయినప్పుడు మరి మనిషి మాటేమిటి? ఊరే లేని వాడవుతాడు… సొంత నేలకి దూరమవుతాడు… నిర్వాసితుడవుతాడు.

కొందరి మేలు కోసం ఎందరో త్యాగాలు చేయాల్సి రావడం మనదేశంలోని ఓ కర్కశమైన వైచిత్రి. పలు ప్రయోజనాలు కల్పిస్తామని భ్రమింపజేసి, అరాకొరా పరిహారాలు విదిలించి నిర్వాసితుల అడ్డు తొలగించుకుని తమ పనులు చక్కబెట్టుకునే అధికారులు..

పరిహారం అందని బాధితులది ఓ గోడు అయితే, కాస్తో కూస్తో డబ్బు చేతికంది దాన్ని వృథా చేసుకుని, వేరే ఏ పనీ చేయలేక, ఇతర ఉపాధి లేక పస్తులుండేవారిది మరో వ్యథ. ఈజీ మనీకి అలవాటు పడిన యువత నిర్వీర్యమై ఏ పని చేతకాక, భవిష్యత్తుని చేతులారా పాడు చేసుకుంటుంటే నిస్సహాయంగా మిగిలిపోతున్న పెద్దలది మరో వేదన!

ముంపు/విస్థాపన రైతులను, రైతు కూలీలను జీవచ్ఛవాలుగా మారుస్తున్న వైనాన్ని ఎనిమిది మంది రచయితలు తమ కథల ద్వారా చెబుతారు. ముంపు ఇతివృత్తంపై వ్రాసిన కథలు కాబట్టి కథల్లో కాస్త రిపిటీషన్ కనిపిస్తుంది. కాని సమస్యని వేర్వేరు కోణాల నుంచి చెప్పడం వల్ల ఒకే అంశాన్ని పదే పదే చెబుతున్న భావనని బాగా తగ్గించగలిగారు రచయితలు.

ఈ పుస్తకంలోని కథలను పరిచయం చేసుకుందాం.

ప్రాజెక్టుల వల్ల భూమి కోల్పోయి జీవనోపాధి కోసం, పరిహారంగా వచ్చే డబ్బుతో ట్రక్కర్ కొనాలనుకుంటాడు వరాల్నాయుడు. రవాణా సౌకర్యం లేని వివిధ గ్రామాల మధ్య ట్రక్కర్ నడిపి పొట్ట పోసుకోవాలనుకుంటాడు. కాని ఓ దొరగారు బస్సు కొని ఆ రూట్‌లో నడపబోతున్నాడనీ, తన సమీప బంధువు కూడా దొరతో చేతులు కలిపాడని తెలుసుకుంటాడు. గడ్డిపోచగా ఉంటుందనుకున్న ఆ ఒక్క ఆధారమూ పోయేసరికి నిస్సహాయతతో గుండె చెరువవుతుంది (“ముంపు” కథ, గంటేడ గౌరునాయుడు).

ముంపు గురించి వినడం ఎలా ఉన్నా నది ఉప్పెనై ఊరిని ముంచేస్తుంటే ఎలా ఉంటుందో రచయిత చిత్రిస్తారు. పరిహారం కోసం ఒకే కుటుంబాన్ని రెండు కుటుంబాలుగా రాయించుకోడంలో విజయవంతమైనా, సింహాచలం తండ్రి అప్పలస్వామినాయుడిని పోగొట్టుకోడం విషాదం. ‘అల్పజీవిని చుట్టేసి మింగడానికి సిద్ధంగా ఉన్న కొండచిలువలా ఉంది నాగావళి’ అనడంలోనే తెలుస్తుంది ముంపు తీవ్రత ఎంతుందో (“వరదగోస” కథ, చందనపల్లి గోపాలరావు).

రైతులకీ, పోలీసులకి మధ్య జరిగే ఘర్షణ గురించి చదివితే గగుర్పాటు కలుగుతుంది. అప్పులిచ్చే ఫైనాన్సు పాపారావ్ లాంటి వాళ్ళు సమాజంలో ఎంత మందో? మనుగడ కోసం పోరాటం తప్పనప్పుడు, ఓ రైతు దాన్ని సమర్థించిన తీరు ఉద్వేగాన్ని కలిగిస్తుంది. ‘ఇప్పుడు దెబ్బలాడితే రేపటికి దారి దొరుకుతాది’ అంటాడు సింహాచలం. ఈ ఒక్క వాక్యం చాలు కథనీ, కథా శీర్షికని జస్టిఫై చేయడానికి (“రేపటి ఉదయం కోసం”, చింతా అప్పల్నాయుడు).

శివభాగవతం కళాకారుడు పోలయ్య వృత్తి రీత్యా కమ్మరి. కులవృత్తులు నశించిపోయాయనీ, కళని నమ్ముకుంటే కడుపు నిండదని తెలిసిన పోలయ్య మోసపోయిన వైనం గుండె బరువెక్కిస్తుంది (“చీకటి” కథ, పల్ల రోహిణికుమార్).

ముంపు, పరిహారాలు – ఉమ్మడి బ్రతుకులు సాగించే ఒకే ఊరి ప్రజలని రెండు వైరి వర్గాలుగా ఎలా మార్చాయో తెలుసుకోడం విషాదం (“మాయ” కథ, గంటేడ గౌరునాయుడు).

కళ్ళ ముందు కనబడేదంతా నిజమైన అభివృద్ధి కాదని తెలిసిన ఓ ఉపాధ్యాయుడు జనాభా లెక్కల కోసం ఓ ఊరికి వెడితే అక్కడ ఎదురైన అనుభవాలు అతని గుండె బరువెక్కిస్తాయి. ‘మన బతుకులు గురించి అడిగితే ఎవులయైనా ఏటి సెప్పగలము సెప్మీ’ అని వాపోయే జనాలు! తమ గురించి చెప్పుకోడానికి ఏమీ లేకపోవడం వల్లా, ఓ యువకుడి వ్యసనాల వల్ల ఓ పెళ్ళి సంబంధం తప్పిపోయిన వైనం ఎన్నో ప్రశ్నలని రేకిత్తిస్తుంది (“జనగణన” కథ, చందనపల్లి గోపాలరావు).

వర్షం ఓ రైతుకి ఎంత హర్షం కల్గిస్తుందో… నేల తడిస్తే… రైతు కళ్ళలోనూ చెమ్మ! ముంపు వల్ల పరిహారంగా వచ్చిన కాస్త డబ్బునీ వడ్డీలకి అప్పులిచ్చి నష్టపోయిన ఆ రైతు దుఃఖం తీర్చలేనిది. బస్టాండ్‌లో కూలీగా మారిన ఆ రైతును కాలం మౌనంగా గమనిస్తుంది (“ముంపు బతుకులు” కథ, తేజోమూర్తుల ప్రకాశరావు)

ఇంటి దగ్గర కోడలితో మాటలు పడే కన్నా, పనికెళ్ళి అక్కడ మేస్త్రీ చేత తిట్లు తినడం నయం అనుకుంటాడు అప్పలస్వామి. భూములు పోయాక కురిసే వర్షం రైతుకి ఎంత చిరాకు కలిగిస్తుందో అప్పలస్వామితో పాటు పాఠకులకీ అనుభవమవుతుంది. డబ్బు గురించిన ఆలోచనల్లో రోడ్డు మీద అటూ ఇటూ నడుస్తూ, ఓ కారు కింద పడినప్పుడు చచ్చిపోయాడేమోనని అందరూ భయపడతారు. “నిజానికి నేనెప్పుడో చనిపోయాను గదా… సెవానికి సావేటి?” అనుకుంటాడు అప్పలస్వామి (“నేనెప్పుడో” కథ, చందనపల్లి గోపాలరావు).

అభివృద్ధి పేరిట జరిగే విధ్వంసం కనబడని దెబ్బలు ఎలా కొడుతుందో కదా. సొంత ఊరిలో చక్కని హోటల్ నడుపుకునే కుటుంబం బ్యారేజి పుణ్యమా అని అన్నీ పోగొట్టుకుని స్వస్థలాన్ని ఊరు కాని ఊరులో, ఉపాధి కోసం టిఫిన్ బండి పెట్టుకుంటుంది. అక్కడా ఎన్నెన్నో అవమానాలు భరిస్తూ… కాసిన్ని మంచిరోజుల కోసం ఎదురుచూపులు… చివరికి అన్యాయాన్ని ప్రశ్నించాలనే ఆలోచన కలిగి అందుకు సిద్ధమవుతాడు ఆ కుటుంబంలోని వ్యక్తి (“కవుకుదెబ్బలు” కథ, పాలకొల్లు రామలింగస్వామి).

నిర్వాసితులను నిత్యనిర్వాసితులుగా మార్చే పరిస్థితులను తెలుసుకోవడం మనసుకి కష్టంగా ఉంటుంది. గవర్నమెంటు రికార్డుల ప్రకారం మనుషులేని ఊర్లకి పరిహారం అందుతుంది. రికార్డుల్లో ఉన్న ఊర్లో జనాలు ఉండరు. మనుషులన్న ఊరు గవర్నమెంటు రికార్డులో ఉండదు. వాళ్ళకి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఉండవు. ప్రభుత్వం దృష్టిలో వాళ్ళసలు లేనే లేరు. అలాంటివాళ్ళు… రేపేం చెయ్యాలో తెలుసుకుంటారు (“నిత్యనిర్వాసితులు” కథ, మల్లిపురం జగదీశ్).

చెట్టంత మనిషి పిడికిలంత పిచుకై ఉనికి నశించిన తమ ఊరికి వెళ్ళి తనివితీరా చూసుకుంటాడు. ‘పాత ఊరిని ప్రోజెక్టు మింగేస్తే, కొత్త ఊరుని పట్నమ్మింగేసింది’ అనుకుంటాడు. నీటిలో మునిగిన ఇంటిని చూసుకోడానికి ‘మిట్టగిడిసి’లా మారిపోతాడు. చివరికి సొంత ఊరి మట్టిలో కలిసిపోవాలని నీటిలోంచి బయటకొచ్చి మట్టిలో మట్టిగా మట్టిబెడ్డగా మారిపోతాడా రైతు (“ఇదొక పిట్ట చెప్పిన కథ” కథ, గంటేడ గౌరునాయుడు).

ఊరు మునిగిపోతోందన్న ఒక దుఃఖం, అప్పటి దాకా తనతోనే ఉన్న మిత్రుడు దూరమవుతున్నాడన్న బాధ సోములిని కుదిపేస్తుంది. గుండెలోని ఆ అలజడి సోముల్ని ఎటు నడిపింది? నాగావళి మింగింది అతన్నేనా? మనసు భారమవుతుంది చదువరులకు (“అలజడి” కథ, పక్కి రవీంద్రనాధ్).

నదిని దానం చేసి అలల మీద ఆశ వదులుకుని చెట్టుకొక పిట్టగా ఎగిరిపోయిన మిత్రులలో రచయిత అయిన మొదటి మిత్రుడు చిత్రకారుడైన మరో మిత్రుడి గురించి చెపుతాడు. రచయితగా తనని తన భార్య ఏనాడు గౌరవించకపోయినా, చిత్రకారుడైన తన భర్తలోని కళని గుర్తించి గౌరవించిన మిత్రుడి భార్య సంస్కారాన్ని చెబుతాడు. జలయజ్ఞం నేపథ్యాన్ని ఒకే ఒక వాక్యంలో చెప్పిన తీరు బావుంది (“పొద్దు ములిగిపోయింది” కథ, గంటేడ గౌరునాయుడు).

ముంపుకు గురై, సొంత ఊరిని విడిచిపెట్టాల్సి వచ్చిన ఆ మనుషులు ఎంత బలహీనమవుతారో చెప్పిన కథలివి అంటారు పెనుగొండ లక్ష్మీనారాయణ తన ముందుమాటలో. కాదనలేని వాస్తవం అది.

స్నేహ కళా సాహితి, పార్వతీపురం వారు తమ రజతోత్సవం సందర్భంగా, గంటేడ గౌరునాయుడు సంపాదకత్వంలో మార్చి 2017లో ప్రచురించిన ఈ పుస్తకంలో 13 కథలున్నాయి. 142 పేజీల ఈ పుస్తకం వెల రూ. 75/- అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలోనూ లభిస్తుంది.About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

తంగేడు పూల బతుకమ్మలు

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ (కొన్నాళ్ళ క్రితం భూమిక ప్రియాంక అనే యిద్దరు 12/13 సంవత్సరాల బం...
by అతిథి
1

 
 

వచన గానం – చింతకింది మల్లయ్య ముచ్చట కథలు

వ్యాసకర్త: సిద్ధార్థ (సమీక్షకుడు ప్రముఖ కవి) *********** To write is to make oneself the echo of what cannot cease speaking- and since it cannot, in orde...
by అతిథి
0

 
 

వెండివెన్నెల: మళ్లీ మళ్లీ నిర్మించిన సినిమాల ముచ్చట్లు

వ్యాసకర్త: కాదంబరి ************* వెండి తెరకు శీతల వెన్నెల భాష్యాలు వెలయించిన పుస్తకం ‘వెండ...
by అతిథి
0

 

 

Ramayana stories in South India – An Anthology: Paula Richman

కథ ఎవరిది? రామునిదా? దారి పోయే దానయ్యదా? అని కాదు. అది కథ వింటే, చదివితే తెలిసిపోతుంది. ...
by Purnima
1

 
 

Unforbidden Pleasures – Adam Phillips

వ్యాసకర్త: Nagini Kandala ************* ఆ మధ్య ఇంతియాజ్ అలీ సినిమా ‘తమాషా’ అని ఒకటొచ్చింది. ఎంత త్వర...
by అతిథి
0

 
 

We Are What We Pretend To Be – Kurt Vonnegut

వ్యాసకర్త: Naagini Kandala ********************** ఒక ప్రక్కన వేరే పుస్తకాలు చదువుతున్నా,’మరి నేను రాసిన కథల...
by అతిథి
0